పిల్లల ప్రపంచం మాయమైపోతోంది!!
పిల్లల్ని తోటలో పువ్వులుగా అభివర్ణిస్తాడు ప్రముఖ విద్యా సంస్కర్త ఫ్రెడరిక్ ప్రోబెల్. ఆయన పిల్లల కోసం ఎంతో కృషి చేశాడు. వారి కోసం కిండర్ గార్డెన్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. పిల్లల తోట అని దాని అర్థం.పిల్లల ప్రపంచం ఒక తోట అయితే పిల్లలు మొక్కలకు పూచే పువ్వుల లాంటి వారు. వారు ఎంతో సున్నితమైనవారు, వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. నిజానికి దీని ఆధారంగా రూపొందినదే ప్లే స్కూల్ అని కూడా చెప్పవచ్చు.
కానీ ప్రస్తుతం ఎక్కడ ఉంది ఇలాంటి పిల్లల ప్రపంచం. కిండర్ గార్డెన్ లో చెప్పిన ఆడుకోవడం ద్వారా నేర్చుకోవడం అనే పద్ధతిని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఉపయోగిస్తున్నారు. ఎంతసేపు వాళ్ళను పుస్తకాలకు కట్టేసి చదివించినవే చదివించి, వాటిని బట్టి పట్టించి పిల్లల్ని ఒక కృత్రిమ జీవితంలో పెద్దలే నాటుతున్నారు.
ఏది పిల్లల ప్రపంచం??
నిజానికి బాల్యం ఎంతో అందమైనది. ఒక వయసొచ్చాక ఆ బాల్యాన్ని చూసి సంతోషపడి వాటిని చాలా గొప్ప జ్ఞాపకాలుగా చేసుకోవడం కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు రేపటి రోజున తమ బాల్యాన్ని గుర్తుచేసుకుంటే వాళ్లకు కనిపించేది ఏమిటి?? పుస్తకాలు, బట్టి పట్టిన గంటలు, తల్లిదండ్రుల కళ్ళలో కనిపించిన కాఠిన్యం, ఉపాధ్యాయుల ముఖాలలో ఎరుపు, ఇంకా వారి చేతి బెత్తం దెబ్బలు. ఇవేనా??
ఒకప్పుడు పిల్లల ప్రపంచం ఎలా ఉండేది??
బాల్యాన్ని గురించి వర్ణించాలంటే ఆ బాల్యాన్ని రుచిచూసిన వారికే సాధ్యం అని అనిపిస్తుంది. స్వేచ్ఛగా బుల్లి గువ్వలా ఎలాంటి సమస్య లేకుండా ఇల్లంతా దొగ్గాడుతూ మొదలై అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యల దగ్గర కథలు వింటూ, నీళ్లతోనూ, మట్టితోనూ, ప్రకృతికి దగ్గరగా పెరుగుతూ ఓ పచ్చని మొక్కలాగే ఆహ్లాదంగా అనిపిస్తారు.
కానీ ఇప్పుడు!!
మట్టిలో ఆడటం, నీళ్లలో తడవడం, తుళ్లుకుంటూ బయట తిరుగుతూ ఆడటం మొదలైనవన్నీ ఒక అసహ్యపు చర్యగా చూస్తారు. ఇంకా పాఠ్యపుస్తలను మాత్రమే చదవడం నిజమైన జ్ఞానం అనే భ్రమలో ఉన్నారు. బయట ప్రపంచం ఏమీ తెలియకుండా పెంచుతారు. ఇలా బయట ప్రపంచానికి దూరంగా పెంచడం వల్ల పిల్లలకు సంపాదించడం,ఉద్యోగాలు చేయడం తప్ప ఇంకేమీ తెలియకుండా పోతుంది.
అమాయకపు నవ్వులు, అల్లరి చేష్టలు, ఆటలు, పాటలు, ఇంకా చెప్పాలంటే శ్రీశ్రీ తన శైశవ గీతిలో చెప్పినట్టు మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లరా!! అంటూ సంతోషంగా చూసుకోవడానికి ఇప్పటితరానికి బాల్యమనేది మధురంగా ఉందా??
ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవులు, శుభకార్యాలు వంటి వాటికి సొంత ఊళ్లకు వెళ్లడానికి, బంధువులు, స్నేహితులలో కలవడానికి చాలామంది తల్లిదండ్రులు చెప్పుకుంటున్న సమర్థింపు "పిల్లలకు స్కూల్ పోతుంది" అని. వేసవిలో అటు ఇటు పంపకుండా ఎదో ఒక కోర్స్ లోనో, లేదా తదుపరి తరగతులకు స్పెషల్ కోచింగ్ లలో తోసేయడమో ఇలా పిల్లలకు ఎలాంటి సరదాలు, సంతోషాలు అనేవి ఏమీ లేకుండా చిన్నతనం నుండే వాళ్లలో ఇంజినీరింగ్, డాక్టర్, ias, ips అంటూ ఎన్నెన్నో ఆలోచనలు నాటి చివరకు విలువలు లేని జీవితాన్ని వాళ్లకు అప్పగిస్తున్నారు.
విలువలు అంటే పుస్తకాల నుండి నేర్చుకునేవి కాదని, అవి జీవితాలను, సమాజాన్ని, బయట ప్రపంచాన్ని చూస్తూ నేర్చుకోవడం అని. కింద పడి దెబ్బ తగిలితే ఇంకోసారి పడకూడదు అనే జాగ్రత్త పిల్లలకు అర్థమవుతుందని పెద్దలు తెలుసుకోవాలి. అంతేకానీ పిల్లలు కిందపడకుండా వాళ్ళను ఎత్తుకునే తిప్పడం వల్ల వాళ్లకు నడవడం ఎలాగో తెలియకుండా పోతుంది. అందుకే చాలామందికి జీవించడం ఎలాగో తెలియకుండా పోతోంది.
మాయమైపోతున్న పిల్లల ప్రపంచాన్ని ఏ డాక్యుమెంటరీలలో, కార్టూన్ చానల్స్ లో పిల్లలకు చూపించకుండా వారిని వారిగా ఎదగనిస్తే పిల్లల జీవితాలు పచ్చగా ఉంటాయి.
◆ వెంకటేష్ పువ్వాడ.