తీరమైనా, సముద్రమైనా మీ రక్షణకి మేమున్నాం....
posted on Feb 1, 2025 @ 9:30AM
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలని పరిశీలిస్తే అవన్నీ ఎగుమతులు, దిగుమతులు మీదనే ఆధారపడ్డాయని తెలుస్తుంది. మరి ఈ ఎగుమతులు, దిగుమతులు దేని మీద ఎక్కువ ఆధారపడ్డాయంటే దానికి సమాధానం తీరప్రాంత ఓడరేవులు, సముద్ర మార్గాలనే చెప్పాలి. మరి ఇంత ముఖ్యమైన తీరప్రాంతాన్ని, సముద్రాన్ని కాపాడటానికి రక్షకుల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. పొడవైన తీరప్రాంతం కలిగిన దేశాల్లో ఒకటైన మన దేశ తీరాన్ని, మన సముద్ర సరిహద్దుని ఎల్లవేళలా కాపాడటానికి మనకీ ఒక రక్షణ దళం ఉంది. అదే ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసిజి).... ఈ ఐసిజి స్థాపనను గౌరవిస్తూ, వీరు సముద్ర భద్రత కోసం చేపట్టిన కీలక బాధ్యతలను గుర్తు చేసుకుంటూనే… దేశం కోసం, దేశ పౌరుల ప్రాణాలను రక్షించటం కోసం ఎన్నో సాహసోపేతమైన పనులు చేస్తున్న కోస్ట్ గార్డుల కృషిని గౌరవించేందుకు ప్రతీ సంవత్సరం ఇండియన్ కోస్టుగార్డ్ డే జరుపుకుంటాము. 2025లో ఐసిజి తన 49వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సంధర్భంగా మన కోస్ట్ గార్డ్ ప్రయాణం గురించి తెలుసుకుంటే….
ఇండియన్ కోస్టుగార్డ్(ఐసిజి) ఎప్పుడు మొదలైంది....
ఫిబ్రవరి 1, 1977న తీర సంరక్షణ దళ చట్టం చేయటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టాపించబడింది. అయితే 1978లో భారత పార్లమెంట్ దీన్ని ఆమోదించటంతో అధికారిక గుర్తింపు లభించింది. అప్పటి ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ సారథ్యంలో ఇండియన్ కోస్టుగార్డ్ ఏడు నౌకలతో అధికారికంగా స్థాపించబడింది. ఐసిజి ఒక రక్షణ దళమే తప్ప మిలిటరీ విభాగం కాదు. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
దీని ప్రధాన కార్యలయం ఢిల్లీలో ఉంది. ఐతే మొదట కేవలం ఏడు నౌకలతోనే మొదలైన దీని ప్రయాణం ఇప్పుడు 158 నౌకలు, 78 విమానాలతో, సాంకేతిక పరికరాలతో శక్తివంతంగా మారి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద కోస్ట్ గార్డుగా నిలిచింది. ఇది 2030 నాటికి 200 నౌకలు, 80 విమానాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది.
ఇండియన్ కోస్టుగార్డ్ ఏం చేస్తుంది.....
ఈ దళం నినాదం: “వయం రక్షామహ”, అంటే దీనర్ధం “మేము రక్షిస్తాము” అని. ఈ మాట నిజం చేస్తూనే దాదాపు అర్ధ శతాబ్ధం నుంచి ఐసిజి మన తీరాన్ని, మనల్ని రక్షిస్తూ వస్తుంది. సముద్ర ప్రాంతాల్లో కృత్రిమ ద్వీపాలు, ఆఫ్‌షోర్ టెర్మినల్స్, ఇతర నిర్మాణాల రక్షణ & భద్రతను చూసుకుంటుంది. ఎల్లప్పుడూ భారత తీర రేఖను గస్తీ కాస్తూ, అక్రమ కార్యకలాపాలైన స్మగ్లింగ్, సముద్ర దొంగతనాలు, ఇతర నేరాలను అరికడుతుంది. . తుఫాన్లు, సహజ విపత్తుల సమయంలో సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులకు సహాయం అందించి రక్షిస్తుంది. సముద్ర కాలుష్యం జరగకుండా నియంత్రణ, నివారణ చర్యలు తీసుకుంటూ, సముద్ర పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. అరుదైన సముద్ర జీవులను రక్షిస్తుంది. ఇది ఇండియన్ నేవీ, మత్స్య శాఖ, కస్టమ్స్, కేంద్ర-రాష్ట్ర పోలీసు విభాగాలతో సమన్వయం చేస్తూ అక్రమ రవాణా జరగకుండా ఆపుతుంది. భారత సముద్ర పరిధుల చట్టం అమలు జరిగేలా చూస్తుంది. మన సముద్ర పరిధిలోకి ఇతర దేశాలవారు అక్రమంగా రాకుండా నివారిస్తుంది. సముద్రంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. సైంటిఫిక్ డేటాను సేకరించి, యుద్ధ సమయాల్లో నౌకాదళానికి మద్దతు అందిస్తుంది. భారత సముద్ర జలాల్లో చమురు లీకేజీ జరిగితే, దాన్ని తొలగించడానికి మొదటగా ఇండియన్ కోస్టుగార్డ్ స్పందిస్తుంది.
ఇండియన్ కోస్టుగార్డ్ చేస్తున్న కృషిని గుర్తించాలి......
సముద్రంలో ఒక షిప్పులో ప్రయాణించటం అందరూ అనుకున్నంత సరదాగా ఏమీ ఉండదు. అదీ కాక దేశ రక్షణ కోసం పనిచేస్తున్న కోస్టల్ గార్డ్ షిప్పులో ఉన్నవారికి అది ఎన్నో సవాళ్ళతో కూడుకున్న ప్రయాణం. ప్రతీరోజు కొత్తగా, సాహసోపేతంగా ఉంటుంది. ఈ విశాల నీలి సముద్రంలో పగలు, రాత్రి అని చూడకుండా అహర్నిశలు మన దేశ సముద్ర సరిహద్దులని గస్తీ కాస్తున్న కోస్ట్ గార్డుల జీవితం అంత సులభంగా ఉండదు. సముద్రంలో చిన్న చిన్న దారి దోపిడీలు చేసే దొంగల చేతికి కూడా ఆధునిక మారణాయుధాలు అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కోస్టల్ గార్డ్ తన కర్తవ్యం నెరవేర్చటం ఎంత కఠినమో, ఎంత సాహసమో ఆలోచించాలి.
భారతదేశ తీరప్రాంతంలో 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. సుమారు 7516 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది కొత్త ఆధునిక సాంకేతిక లెక్కల ప్రకారం సుమారు 11000 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. పైగా మన భారతదేశం అనేక దేశాలకి దగ్గరగా ఉండటంతో పాటూ, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సంప్రదాయ సముద్ర వాణిజ్య మార్గం దగ్గరగా కూడా ఉంటుంది. మరి ఇటువంటి బౌగోళిక పరిస్థితులున్న మన దేశ తీరాన్ని, సముద్ర సరిహద్దులని కాపాడటంలో మన కోస్టుగార్డులు ఎంతలా కృషి చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి. ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే సంధర్భంగా ఎంతో సేవ చేసిన, చేస్తున్న మన రక్షకులకి సలాం!
*రూపశ్రీ.