టెడ్డీ డే.. టెడ్డీ బేర్ రంగును బట్టి అర్థాలు ఉన్నాయి తెలుసా?
posted on Feb 10, 2025 @ 9:30AM
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న టెడ్డీ డే జరుపుకుంటారు. టెడ్డీ బేర్ కేవలం ఒక బొమ్మ మాత్రమే కాదు భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఇది ఒక అందమైన మార్గం కూడా. ప్రతి టెడ్డి బేర్ రంగు వేర్వేరు భావోద్వేగాలను సూచిస్తుంది. ఎవరైనా టెడ్డీని బహుమతిగా ఇస్తే, దాని రంగును బట్టి వారి మనసులో ఏముందో అర్థం చేసుకోవచ్చు. టెడ్డీ బేర్ ను కేవలం ప్రేమికురాలికి, లేదా ప్రియుడికి మాత్రమే కాదు.. ఎవరికి అయినా ఇవ్వవచ్చు. అయితే అది ఎవరికి ఏ రంగు ఇవ్వాలనే విషయం తెలుసుకుని ఇస్తే ఎంతో మంచిది. ఏ రంగు టెడ్డీ బేర్ ఏ విషయాన్ని తెలుపుతుందంటే..
ఎరుపు రంగు టెడ్డీ బేర్..
ఎరుపు టెడ్డీ బేర్ ఐ లవ్ యు అనే మాటను వ్యక్తం చేయడానికి ఇస్తారట. మాటలు లేకుండా ప్రేమను వ్యక్తపరచడానికి ఎరుపు రంగు టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఎవరైనా ఎర్రటి టెడ్డీ బేర్ ఇస్తే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అర్థం. సంబంధాన్ని బలోపేతం చేయడానికి, ప్రేమను వ్యక్తపరచడానికి ఎర్రటి టెడ్డీ బేర్‌ను ఇస్తారు.
పసుపు టెడ్డీ బేర్..
పసుపు గులాబీల మాదిరిగానే, పసుపు టెడ్డీ బేర్లు కూడా స్నేహాన్ని, కొత్త ప్రారంభాలను సూచిస్తాయి. పసుపు రంగు ఆనందం, స్నేహం, సానుకూలతను సూచిస్తుంది. ఎవరైనా పసుపు రంగు టెడ్డీని ఇస్తే, వారు మిమ్మల్ని మంచి స్నేహితుడిగా భావిస్తారని అర్థం. ఇది కొత్త సంబంధాన్ని ప్రారంభించే సంకేతం కూడా కావచ్చు. ఒక వేళ టెడ్డీ డే రోజు పసుపు రంగు టెడ్డీని ఎవరైనా ఇస్తే వారు ప్రేమిస్తున్నారనే అపోహలో పడకండి.
బ్రౌన్ టెడ్డీ బేర్..
బ్రౌన్ రంగు టెడ్డీ బేర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది సంరక్షణకు, బలానికి చిహ్నం. ఎవరికైనా బ్రౌన్ టెడ్డీ బొమ్మను ఇస్తే, సంబంధం బలంగా, నమ్మదగినదిగా ఉందని చూపిస్తుంది. ఎవరికైనా మద్దతుగా ఉండాలన్నా, వారికి బలం కలిగించాలనుకున్నప్పుడు, ఇలాంటి టెడ్డీని బహుమతిగా ఇవ్వవచ్చు.
నీలం రంగు టెడ్డీ బేర్..
నీలం రంగు నిజమైన ప్రేమ, నమ్మకాన్ని సూచిస్తుంది. ఎవరైనా నీలిరంగు టెడ్డీని బహుమతిగా ఇస్తే, వారు మిమ్మల్ని తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారని అర్థం. ఇది సంబంధంలో నమ్మకాన్ని, నిజాయితీ సూచిస్తుంది. ఎవరికైనా ఎల్లప్పుడూ అండగా ఉంటారని చూపించాలనుకున్నప్పుడు, నీలిరంగు టెడ్డీ బేర్ ఇవ్వవచ్చు.
పింక్ టెడ్డీ బేర్..
పింక్ టెడ్డీ ఎవరైనా ఇస్తే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని. మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నారని అర్థం. ఇది ఇష్టాన్ని, ప్రేమ భావాలను సూచిస్తుంది. ఎవరైనా మీకు పింక్ టెడ్డీని ఇస్తే, వారు మీతో ఉన్న సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారని అర్థం. మీరు ఎవరికైనా ప్రత్యేకంగా అనిపించాలని, వారు మీకు ఇష్టమని చెప్పాలని అనుకున్నప్పుడు ఈ రంగు టెడ్డీ బేర్‌ను వారికి ఇవ్వవచ్చు.
*రూపశ్రీ.