వివాహ బంధం బలంగా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ నియమాలు పాటించాలి..!
posted on Feb 8, 2025 @ 9:30AM
ప్రతి మగాడు, ప్రతి మహిళ తమ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని, వారి జీవితంలో ఎలాంటి సమస్యలు రాకూడదని కోరుకుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా సంబంధంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు కొన్ని చిన్నగా ఉండగానే పరిష్కారం అయిపోతే మరికొన్ని సమస్యలు పెద్దవిగా మారతాయి. అటువంటి పరిస్థితిలో ఆచార్య చాణక్యుడు ఇచ్చిన కొన్ని సలహాల గురించి మాట్లాడుకోవాలి. ఆచార్య చాణక్యుడు కేవలం రాజనీతిని, తత్వశాస్త్రాన్ని మాత్రమే కాకుండా కొన్ని వ్యక్తిత్వ, జీవిత విలువలను కూడా స్పష్టంగా తెలిపాడు. ముఖ్యంగా భార్యాభర్తల బంధం బలంగా ఉండానికి ఆయన చెప్పిన అద్బుత సలహాలు ఈ కింద చదివి తెలుసుకోండి.
అహంకారం..
అహంకారం ఏ సంబంధాన్నైనా చెడగొట్టగలదని చాణక్యుడు అందుకే ఎట్టి పరిస్థితిలో వివాహం తరువాత ఇద్దరిది కలిసి ఒక జీవితంలా మారిందని, ఆ జివితంలో అహాన్ని వీలైనంత దూరంగా ఉంచాలని ఆయన చెప్పాడు. అహాన్ని దూరం పెట్టి తెలివిగా వ్యవహరించేవారి జీవితం ఎప్పుడూ బాగుంటుందట.
ఓపిక..
వివాహ జీవితంలో ఓపిక కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలాసార్లు భాగస్వామి కోపంలో నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిలో అవతలి వ్యక్తి ఓపికగా ఉండి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి, అప్పుడే సంబంధాన్ని నిర్వహించడంలో విజయం సాధించగలరు.
నమ్మకం..
వైవాహిక జీవితానికి నమ్మకం అతిపెద్ద ఆధారం. భాగస్వామి దగ్గర ఏదైనా దాచిపెడితే అది సంబంధాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి సంబంధంలో నిజం, నిజాయితీ ఉండాలి. దీనితో పాటు, భార్యాభర్తలు ఒకరితో ఒకరు మంచిగా ప్రవర్తించాలి. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది.
మూడవ వ్యక్తి..
వివాహ జీవితంలో మూడవ వ్యక్తి ప్రవేశించడమే కాకుండా, మూడవ వ్యక్తి సలహా ఇవ్వడం, మూడవ వ్యక్తి జోక్యం చేసుకోవడం భార్యాభర్తల సంబంధం విచ్ఛిన్నానికి దారితీస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ భాగస్వామితోనే అన్ని విషయాలను చర్చించడం, గొడవ పడటం, అరవడం, తరువాత సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించడం చేయాలి. పరస్పర అంగీకారంతో వివాహ జీవిత నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడూ భాగస్వామిని కాదని ఇతరుల సలహాతో నిర్ణయాలు తీసుకోరాదు. చాణక్యుడి ప్రకారం వివాహ జీవితంలో మూడవ వ్యక్తి జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది సంబంధంలో గందరగోళాన్ని, అపార్థాన్ని సృష్టిస్తుంది.
భార్యాభర్తలకు తమ తల్లిదండ్రుల తరపు కానీ స్నేహితులు, సన్నిహితులు ఎంత మంచివారైనా, ఎంత గొప్పవారైనా, ఎంత ఎదిగిన వారైనా.. భాగస్వామిని కాదని వారి నుండి సలహాలు తీసుకుని ఏ పనులైనా చేస్తే ఖచ్చితంగా భాగస్వామికి విలువ ఇవ్వనట్టే లెక్క. ఇది బాగస్వామిని అవమానించినట్టే అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఇలాంటి అనుభవాలు ఎక్కువ అవుతుంటాయి. భర్త తన ఆధిపత్యం కోసం, భార్యను చులకనగా చూస్తూ తన తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితుల సలహాతో చాలా పనులు చేస్తారు. కానీ అలా చేసే పనుల గురించి భార్యకు చెప్పకపోవడం చాలా పెద్ద తప్పు.
*రూపశ్రీ.