సంగీతానికి ఊపిరి పోసిన వీణా తంత్రువు .. ఘంటసాల ..!

 

మన దక్షిణాదిలో  ఏ  మారుమూల ప్రాంతంలో ఐనా రేడియో నుంచో,  టి.వి నుంచో భగవద్గీత వినిపిస్తుందంటే,  ఆ స్వరమాధుర్యం అందరికీ పరిచయమైనదై ఉంటుందని వేరేగా చెప్పక్కర్లేదు.  సాక్షాత్తు శ్రీకృష్ణుడే  ఆ గాత్రంతో మనకి గీతోపదేశం చేసినట్టు ఉంటుంది. అంత గొప్ప స్వరం కలిగిన స్వర మాంత్రికుడు ఇంకెవరో కాదు.. అందరూ ఘంటసాల అని ఎంతో ప్రేమతో పిలుచుకునే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు.  “గాయకుడు కావాలంటే కేవలం సంగీత జ్ఞానం మాత్రమే కాదు, కవి హృదయం కూడా  ఉండాలి. పాటలోని భావాన్ని అర్థం చేసుకుని, కథానాయకుడి మాదిరిగా తన గొంతుతో అభినయం చేయగలగాలి” అని తానన్న మాటని తనే నిరూపిస్తూ,  తన సినీ సంగీత కిరీటానికి  తన వజ్రపు స్వరంతో అలంకరించిన గొప్ప గాయకుని   ఘంటసాల గారు. తెలుగు భాషను సాహిత్య పరంగా మరో స్థాయికి తీసుకెళ్లిన ఘంటసాల గారు తన సంగీతాన్ని, తన గాత్రాన్ని పాటల రూపంలో అందరిముందు వదిలి దేహాన్ని ఫిబ్రవరి 11న వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలియని  విషయాలు తెలుసుకుంటే.....


ఘంటసాల ఆంధ్రప్రదేశ్‌లోని చౌటపల్లి గ్రామానికి చెందిన రత్తమ్మ, సూరయ్యలకి డిసెంబర్ 4, 1922న జన్మించాడు. తండ్రి  సూరయ్య  ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడు మాత్రమే కాకుండా, ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడిగా, తారంగాలను పాడే గాయకుడిగా, గురువుగా పేరుపొందారు. తండ్రి  సంగీత ప్రదర్శనల సమయంలో ఘంటసాల నృత్యం చేసేవాడు.  అలా ‘బాలభారత’ అనే బిరుదును పొందాడు.  ఘంటసాల 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి సూరయ్య మరణించారు. తండ్రి బ్రతికున్నప్పుడు  నాదోపాసన చేయాలని తనకి చెప్పిన మాటని  ఎంతో భక్తిశ్రద్ధలతో పాటించాడు. సంగీతం నేర్చుకోవాలనుకునే తపనతో విజయనగరం సంగీత కళాశాలలో చేరి అక్కడ జరిగిన ఒక తప్పు కారణంగా  కళాశాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది.  ఆ కాలంలో భిక్షాటన చేసే సాధువుల్లాగానే ఘంటసాల కూడా కొన్ని ఇళ్లలో భిక్షాటన చేసి భోజనం చేసేవారు. ఆయనకి  అన్నం పెట్టి  ఆదరించిన మహిళల సహాయాన్ని ఎప్పుడూ  మరిచిపోలేదు. ఆ తర్వాత, కాలేజీలో తనపై వచ్చిన  ఆరోపణ తప్పు అని నిరూపించబడటంతో   కళాశాలలో తిరిగి చేరి 1942లో సంగీత డిప్లొమా పొందారు.

స్వాతంత్ర్య పోరాటం సాగుతున్న రోజులలో  ఆయన కూడా అటువైపు ఆకర్షితుడయ్యాడు.  "భారత మాత పిలుపు నా జీవితం కన్నా ముఖ్యమైనది" అనే భావనతో ఆయన "క్విట్ ఇండియా" ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ కారణంగా ఆలీపుర్ జైలులో ఆరు నెలలు శిక్ష అనుభవించారు. అయితే, జైలులో కూడా ఆయన తన పాటల ద్వారా సహచర ఖైదీలను, జైలు అధికారులను ఆకట్టుకున్నారు.

సినీ సంగీత ప్రయాణం..

1944లో ఘంటసాలకి తన బంధువైన సావిత్రితో పెళ్లి జరిగింది.  ప్రముఖ తెలుగు సినిమా రచయిత సముద్రాల రాఘవాచార్యుల పరిచయం ఈ పెళ్లి వల్లనే జరిగింది.సముద్రాల సూచనతో ఘంటసాల మద్రాస్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఆయన సినీ సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. మొదట చిత్తూరు నాగయ్య నటించిన త్యాగయ్య వంటి సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. అదేవిధంగా, సినిమాల్లో  గుమ్మడి పాటల్లో  పాడే ఛాన్స్ పొందారు. మొదట్లో, గ్రామఫోన్ రికార్డింగ్ కోసం ప్రయత్నించినప్పటికీ, ఆయన గొంతు మైక్రోఫోన్‌కు సరిపోదని కొందరు అన్నారు.  అయితే, తరువాత తానే పాటలని  రికార్డు చేసి  చరిత్ర సృష్టించారు. ఆ కాలంలో, మద్రాస్ ఆకాశవాణి కేంద్రం ఘంటసాలకు శాస్త్రీయ సంగీతం, లలిత గీతాలను పాడేందుకు అవకాశం కల్పించింది.

ఘంటసాల విజయాలు....

 1945లో వచ్చిన స్వర్గసీమ చిత్రంలో భానుమతితో కలిసి పాడే అవకాశం ఆయనకు లభించింది. ప్రసిద్ధ దర్శకుడు బి.ఎన్.రెడ్డి,  సంగీత దర్శకుడు చిత్తూరు నాగయ్యలు   ఈ  అవకాశాన్ని ఇచ్చారు.  ఈ చిత్రం నుంచి ఘంటసాల ప్లేబ్యాక్ సింగర్‌గా తన స్థానాన్ని ఖరారు చేసుకున్నారు.

 ఘంటసాల వారి  గానం తెలుగు పద్యాలకు, గీతాలకు భావవ్యక్తీకరణ పరంగా గొప్పగా సరిపోయేది.  తెలుగు సినిమా అగ్ర హీరోల పాటలకు ఆయన స్వరమే  మంచి విజయాలు ఇచ్చింది. . తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాలలో కూడా ప్రసిద్ధ గాయకుడిగా పేరొందారు. ఘంటసాల పాడిన కొన్ని చిరస్మరణీయమైన పాటలలో పాతాళ భైరవి, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసు, జయభేరి, మహాకవి కాళిదాసు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, మూగమనసులు, గుండమ్మ కథ, శ్రీకృష్ణావతారం, నిర్దోషి వంటి సినిమాలు అజరామంగా నిలిచాయి.
ఘంటసాల పాడిన భక్తిగీతాలు, స్వతంత్ర గీతాలు ఇప్పటికీ వినేవారిని  ఆకట్టుకుంటున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిపై పాడిన గీతాలు అపారమైన భక్తిని కలిగిస్తాయి. "పుష్ప విలాపం"లో ఆయన గానం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. భగవద్గీతను అర్ధంతో సహా ఆలపించిన ఘంటసాల తెలుగువారి గుండెల్లో  అమరునిగా నిలిచిపోయారు. ఈ గీతా పారాయణం ఆయన మరణించాక  విడుదలైనప్పటికీ అది ఘంటసాల పేరుతో సదా గుర్తుండిపోయే గొప్ప సంపద అయిపోయింది.

ఘంటసాల నిర్మాతగా మారి "పరోపకారం", “సొంత ఊరు", "భక్త రఘునాథ"  చిత్రాలను నిర్మించారు. అయితే, ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. వాటి కారణంగా ఆయన ఆర్థికంగా కష్టాల్లో పడిపోయారు. అయినా సంగీత సామ్రాజ్యంలో మాత్రం మరణం వరకూ.. మరణం తర్వాత కూడా  మకుటం లేని మహారాజుగా నిలిచారు.

                       *రూపశ్రీ.