-->

తియ్యని చాక్లెట్ డే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ప్రేమకు ప్రేమ..!

 

వాలెంటైన్స్ డే హవా సాగుతోంది. దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా వాలంటైన్స్ వీక్ ను చాలా గొప్పగా జరుపుకుంటారు. నిజం చెప్పాలంటే విదేశాలలోనే వాలంటైన్స్ వీక్ ను బాగా గ్రాండ్ గా జరుపుకుంటారు.  అయితే వాలంటైన్స్ వీక్ లో భాగంగా  మూడవ రోజును టాక్లెట్ డే గా జరుపుకుంటారు. వాలెంటైన్స్ వారంలో మూడవ రోజు అంటే ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటారు. చాక్లెట్  తీపిని ప్రేమ  మాధుర్యానికి చిహ్నంగా చూస్తారు. ఇది ప్రేమ, అనురాగాన్ని పెంచుతుంది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే.. మరొక కోణంలో చూస్తే కానీ చాక్లెట్ గుండెకు చాలా మంచిది.  అంతేకాదు మెదడు, చర్మ ఆరోగ్యంపై కూడా  ప్రభావాన్ని చూపుతుంది.

 చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది, దానిని సరైన పరిమాణంలో, సరైన రకంలో తింటే ఆరోగ్యానికి ఉత్తమమైనది. అయితే అతిగా తియ్యగా  ఉండే చాక్లెట్‌కు దూరంగా ఉండాలి. చాక్లెట్‌ను సమతుల్య పద్ధతిలో తీసుకుంటే, అది గుండె, మెదడు, చర్మం..  ఇలా  మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

డార్క్ చాక్లెట్ కే ఓటు..

వాలంటైన్స్ వీక్ లో భాగంగా ప్రేమికులు తమ బంధానికి గుర్తుగా చాక్లెట్ లు ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే చాక్లెట్ లో కూడా డార్క్ చాక్లెట్ ఏ బెస్టు.. ఎందుకంటే డార్క్ చాక్లెట్ వల్ల ఆరోగ్యం బేషుగా ఉంటుంది.  ఎప్పుడైనా చిరాకుగా అనిపిస్తే ఒక ముక్క డార్క్ చాక్లెట్ తింటే వెంటనే  యాక్టీవ్ అయిపోచ్చట.

చాక్లెట్ ఏ ఎందుకు?

వాలెంటైన్స్ వీక్ లో చాక్లెట్ డేను ఎందుకు ఏర్పాటు చేసారు?  మన లడ్డు లేదా పాయసం లాంటివి ఎందుకు లేవు అనే డౌట్ కూడా వస్తుంది.  ఇది పూర్తీగా విదేశీయుల వేడుక. విదేశాలలో తీపి అంటే చాక్లెట్ ఏ.. వారి ఆహారంలో కూడా చాలా వరకు చాక్లెట్ ఆధారిత పదార్థాలు ఉంటాయి.  చాక్లెట్ సాస్,  చాక్లెట్ కేక్, చాక్లెట్ పుడ్డింగ్, చాక్లెట్ బ్రెడ్.. ఇలా అన్నివిధాలుగా చాక్లెట్ భాగం. ఇక చాక్లెట్ ఉత్పత్తి కూడా విదేశాలలో ఎక్కువ. దీనికి తగినట్టు చాక్లెట్ తయారీకి ఉపయోగించే కోకో బీన్స్ ఉత్పత్తి కూడా అక్కడే ఎక్కువ. దాన్నే ప్రపంచ మార్కెట్ గా ఇలా మార్చేశారు.  ఇక ఈ చాక్లెట్ లలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

డార్క్ చాక్లెట్ లో  ఫ్లేవనాయిడ్లు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే ఫ్లేవనాల్స్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడానికి ధమనుల లైనింగ్‌ను ప్రేరేపిస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ ధమనులను సడలించి, రక్త ప్రవాహానికి అడ్డు లేకుండా సాఫీగా జరిగేలా చేస్తుంది.  దీనివల్ల రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది.  ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కోకో బీన్స్,  డార్క్ చాక్లెట్ రక్త ప్రసరణ,  రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తాయి.

మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది..

చాక్లెట్‌లో సెరోటోనిన్,  డోపమైన్‌ను పెంచే అంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి,  నిరాశను తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మెదడు పనితీరును పెంచడం ద్వారా ఏకాగ్రత,  జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.   డార్క్ చాక్లెట్‌ను దాదాపు 5 రోజుల పాటు రోజూ ఓ ముక్క అయినా తినడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగని అతిగా తినకూడదు.


రోగనిరోధక శక్తి మరియు జీర్ణక్రియను బలపరుస్తుంది..

చాక్లెట్‌లో ఉండే ఫైబర్,  ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

చర్మం,  జుట్టుకు మేలు చేస్తుంది..

డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించి యవ్వనంగా ఉంచుతాయి. చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో డార్క్ చాక్లెట్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో లభించే బయోయాక్టివ్ సమ్మేళనాలు చర్మానికి కూడా గొప్పగా సహాయపడతాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో డార్క్ చాక్లెట్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.   డార్క్ చాక్లెట్ సరైన మొత్తంలో తీసుకోవడం వల్ల  జుట్టుకు పోషణనిచ్చి బలంగా,  మెరిసేలా చేస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది..

డార్క్ చాక్లెట్ తింటే జీవక్రియ మెరుగుపడుతుంది, ఇది కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.  ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

నష్టాలు కూడా..

డార్క్ చాక్లెట్ వల్ల లాభాలే కాదు  నష్టాలు కూడా ఉంటాయి.  సరైన మొత్తంలో డార్క్ చాక్లెట్ తింటే బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ అదనపు చక్కెరతో కూడిన చాక్లెట్ బరువు పెరగడానికి దారితీస్తుంది.

పాలు,  తెల్ల చాక్లెట్లలో ఎక్కువ చక్కెర, కొవ్వు ఉంటాయి, ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.

తీపి చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది, ఇది మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

కొంతమందికి చాక్లెట్ తినడం వల్ల తలనొప్పి (మైగ్రేన్లు) రావచ్చు, ముఖ్యంగా  కెఫిన్ లేదా థియోబ్రోమిన్‌కు అంటే శరీరానికి పడని వారికి ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. చాక్లెట్ ఎక్కువగా తినడం వల్ల అసిడిటీ,  కడుపులో చికాకు కలుగుతుంది.

చిన్న పిల్లలకు అతిగా తీపి చాక్లెట్ ఇవ్వడం వల్ల దంతక్షయం,  హైపర్యాక్టివిటీ ఏర్పడతాయి.


చూశారా వాలంటైన్ వీక్ లో ఎంతో హ్యాపీగా తియ్యగా వేడుక చేసుకునే వారు ఆ చాక్లెట్ పర్యవసానాలు  కూడా ఆలోచించుకోవాలి మరి.

                                                *రూపశ్రీ.