భక్తి అంటే ఏంటి?? భక్తి మంచిదేనా??
ఈ ప్రపంచమొక భక్తి సముద్రం. ఆధ్యాత్మికత, ఆరాధన నిండి ఉన్న ప్రపంచంలో చాలా గొప్ప ప్రశాంత అనుభూతి పొందుతారు అందరూ. అయితే ఇదంతా కాయిన్ కు వన్ సైడ్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకొక సైడ్ చూస్తే దేవుడు, ఆరాధన, భక్తి ఇవన్నీ చాలా కమర్షియల్ గా ఉంటాయి, ఇవి కాకుండా మరొక విభిన్నమైన కోణం కూడా ఉంది. అదే మూఢంగా అన్ని నమ్మేయడం.
భక్తి గొప్పది, ఆ భక్తిని కమర్షియల్ గా చేసి దాన్ని కృత్రిమం చేయడం ఒక పనికిమాలిన చర్య ఆయితే ఆ భక్తిని పిచ్చిగా అనుసరించడం కూడా అలాంటిదే. భక్తిలో మూఢం ఉంటుందా?? అది పనికిమాలిన చర్య అవుతుందా?? అనేది ఎంతోమందికి కలిగే సందేహం.
భక్తి!!
భక్తి అనేది మనిషిని ఉన్నతుడిగా, ఆ దేవుడికి దగ్గరగా తీసుకెళ్లే సాధనం. దేవుడెక్కడున్నాడు ఆయన దగ్గరకు వెళ్ళడానికి భక్తి ఎలా సహకరిస్తుంది అనే అనుమానం వస్తే, దేవుడు మనం చూసే ప్రతి ఒక్క వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ(మనుషులు, జంతువులు, పక్షులు ఇలా అన్ని రకాల ప్రాణులు) ఉంటాడు. అన్నిటినీ సమానంగా చూసిననాడు అన్నింటిలో ఆ దేవుడు ఉన్నాడని తెలుసుకున్ననాడు అన్ని విషయాల పట్లా భక్తిగా ఉంటారు. నిజానికి భక్తిలో క్రమశిక్షణ, బాధ్యత ఉంటాయి. అవి జీవితాన్ని ఒక సమాంతర రేఖ మీద ప్రయాణించేలా చేస్తాయి.
నేటి భక్తి!!
ఇప్పటి కాలంలో భక్తి ఎలా ఉంటుంది?? కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దేవుడి దగ్గరకు వెళ్లి దేవుడిని కూడా సరిగ్గా చూడకుండా నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇస్తాను అని కొన్ని అగ్రిమెంట్లు మొక్కుల రూపంలో డిసైడ్ చేసి అక్కడ ప్రసాదాలు మెక్కి, షాపింగ్ లు చేసి తిరుగుప్రయాణం చేయడం.
ఇంకా కొన్ని వేరే దారుల్లో దేవుడి పేరు చెప్పి అన్నదానాలు అంటారు, వస్త్రదానాలు అంటారు, ఎన్నెన్నో హడావిడి పనులు చేస్తారు కానీ అక్కడ దేవుడి కంటే కొందరు మాహానుభావులను పొగడటానికి లేదా కొందరి చేత పొగిడించుకోవడానికి చేసే పనులు ఎక్కువ. దేవుడి కార్యంలో దేవుడు తప్ప మిగతా అంతా హైలైట్ అవుతుంది. మరి అక్కడ భక్తి ఎక్కడుంది??
మరొక వర్గం వారు ఉంటారు. వాళ్ళు మరీ మూఢంగా ఉంటారు. భక్తి అంటే అన్నింటిలో దేవుడిని చూడటం అనే విషయం మరచిపోయి భక్తి పేరుతో అందరినీ హింసిస్తూ ఉంటారు. కులం, మతం, వర్గం, భక్తిలో హెచ్చు తగ్గులు అబ్బో చాలా ఉంటాయి. వీటి కోణంలో మనుషులు ఒకరిని ఒకరు తక్కువ, ఎక్కువ చేసి చూసుకుంటూ దేవుడి పట్ల విశ్వాసంతో ఉన్నామని అనుకుంటారు కానీ అందులో భక్తి తప్ప మనిషిలో అహంకారం, కోపం, ద్వేషం, అసూయ వంటివి అన్నీ ఉంటాయి. అదే భక్తి అనుకునేవాళ్ళు మూఢులు. ఇంకా అనవసరంగా ఉపవాసాలు చేస్తూ తమని తాము హింసించుకునేవారు మరొక మూఢ వర్గానికి చెందినవాళ్ళు. అందుకే నిజమైన భక్తి అంటే అన్నింటిలో దేవుడిని చూడటం, గౌరవం, ప్రేమ, మర్యాద కలిగి ఉండటం అని అంటారు.
మనిషి ఎలా ఉండాలి??
నేటి కాలంలో ఉండే ఒత్తిడిని జయించడానికి మనిషికి ఆధ్యాత్మికత, యోగ, ధ్యానం ఎంతో ముఖ్యమైనవి. అవన్నీ స్వచ్ఛమైన భక్తిలో ఉంటాయి. ఏమీ ఆశించకుండా దేవుడి మీద భక్తితో పూజ, దేవుడి పేరుతో దానం, దేవుడిని తలచుకుని ఎలాంటి తప్పులు చేయకుండా గడిపే జీవితంలో ఎంతో ప్రశాంతత దాగి ఉంటుంది.
తప్పులు చేసి దేవుడా నా పాపాలు పోగొట్టు అని ముడుపులు చెల్లిస్తే ఒరిగేది ఏమీ ఉండదు. దేవుడికి కావాల్సింది ముడుపులు కాదు సాటి భూతదయ కలిగి ఉండటం, నిస్వార్థంగా ఇతరులకు సహాయపడటం. కాబట్టి నిజమైన భక్తి అంటే ఏమీ ఆశించకుండా ఉండటమే. ఇతరులను గౌరవిస్తూ ప్రేమించడమే.
◆వెంకటేష్ పువ్వాడ.