డబ్బే ప్రామాణికం అంటున్నారా?

డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. అదే నిత్యసత్యం కూడా. మనిషి ఆలోచనలు ఎప్పుడూ డబ్బు వెంట తిరుగుతూ ఉంటాయి. ఈకాలంలో పెద్దల తీరు ఎలా ఉంటోంది అంటే పిల్లలకు ఇంకా మాటలు కూడా రాకముందే డబ్బు గురించి ఎన్నో విషయాలు ప్రవర్తనల ద్వారా నేర్పిస్తున్నారు. పిల్లలు కూడా డబ్బును బట్టి స్పందిస్తారు. నిజానికి ఎంతటి సంపదనైనా మనిషి పరిమితంగానే అనుభవించగలడు. ఆ విషయం తెలియకుండా మనం ప్రతి నిమిషాన్నీ పైకంతోనే ముడేస్తున్నాం. ముఖ్యంగా మారుతున్న సమాజంలో వ్యక్తి విలువను బేరీజు వేసేందుకు అతని సిరిసంపదలనే ప్రామాణికంగా తీసుకోవడం అలవాటుగా మారింది అందరికీ. అందుకే ప్రతి ఒక్కరూ ఆస్తిపాస్తుల పెంపకంలో పోటీ పడుతున్నారు.ఇది సహజమే అన్నట్టుగా ఉంటారు అందరూ… కానీ ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి! ప్రాణం లేని నోట్ల కట్టలు, నిలువెత్తు సజీవమూర్తి అయిన మనిషి విలువను వెలకడుతున్నాయంటే ఎంత ఆశ్చర్యకరమో అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి! ఈ ప్రపంచంలో మనిషిని ఎప్పుడైనా ఎక్కడైనా పరిగాణలోకి తీసుకుని గౌరవించాలి అంటే ముఖ్యంగా చూడాల్సింది ఆ వ్యక్తిలో ప్రవర్తన, నైతిక విలువలు, మంచితనం, హుందాతనం ఇతరులకు మేలు చేసే గుణం మొదలైనవి.  కానీ ప్రస్తుతం అందరూ వాటన్నిటినీ పక్కనపెట్టి కేవలం మనిషి దగ్గర డబ్బు ఉంటే చాలు అతడే గొప్ప వ్యక్తి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. డబ్బుతో మనిషి తెచ్చిపెట్టుకున్న స్థాయిని విలువగా భావించి అతనే గొప్పవాడనే కితాబు ఇస్తున్నారు. ఇదంతా కూడా ఆ మనిషి దగ్గర డబ్బు ఉన్నంత వరకే.. అనే విషయం వారికి తెలియకపోయినా వారిని గౌరవిస్తున్నవారికి మాత్రం కచ్చితంగా తెలుసు. అంటే డబ్బున్నవాడు గొప్ప, అదే వ్యక్తి దగ్గర డబ్బు లేకపోతే అతని గొప్పతనం కనుమరుగైపోతుంది.  డబ్బెంత అశాశ్వతమో, ఆ డబ్బు ద్వారా వచ్చే పేరు, పొగడ్తలు, ఇతర పలుకుబడి కూడా  అంతే అశాశ్వతం. పైగా ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. అనుకోకుండా వచ్చిపడే డబ్బును నడమంత్రపు సిరి అని అంటారు. ఈ  నడమంత్రపు సిరి మనషులను నేలపై నిలబడనివ్వని అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. కన్నూ మిన్నూ కనబడకుండా ప్రవర్తించేలా చేస్తుంది. అలాంటి డబ్బు మనుషులకు  భవిష్యత్తులో దారిద్ర్యమే గుణపాఠం నేర్పుతుంది.  ఆదిశంకరాచార్యులు డబ్బు గురించి చెబుతూ పంచితేనే పరమసంతోషం అని అంటారు.. అంటే డబ్బును పంచేయమని ఈయన ఉద్దేశ్యం కాదు. గృహస్థుగా ధనార్జనను విస్మరించమని కూడా శంకరాచార్యులు చెప్పలేదు. కానీ ఆ వైభోగాల పట్ల వ్యామోహాన్ని వదులుకోమని అంటున్నారు.  యవ్వనం దాటగానే మనిషికి డబ్బు వేట మొదలవుతుంది. మధ్యవయసు దాటి వార్ధక్యం లోకి అడుగుపెడుతున్న క్షణం నుంచి ఆ సంపదలపై వ్యామోహాన్ని తగ్గించుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. ఆ వయసులో వీలున్ కలిగినప్పుడల్లా మనస్ఫూర్తిగా నలుగురికీ దానధర్మాలు చేయాలి. మనిషిని అతలాకుతలం చేసే ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి.  భగవాన్ శ్రీరామకృష్ణులు “ధనవంతుడు దానం చేయాలి. పిసినారుల డబ్బు హరించుకుపోతుంది. దానం చేసేవాడి ధనం సంరక్షింపబడుతుంది. సత్కార్యాలకు వినియోగింపబడుతుంది. దానధర్మాలు చేసేవాడు ఎంతో ఫలాన్ని ప్రాప్తించుకుంటాడు. నాలుగు పురుషార్థాలనూ సాధించుకుంటాడు" అని అంటారు. వీటిని బట్టి చూస్తే డబ్బు అనేది మనిషికి ఎంత అవసరమో.. మనిషి తనదగ్గర అదనంగా ఉన్న డబ్బుకు దూరంగా ఉండటం అనేది కూడా అంతే అవసరం.                                ◆నిశ్శబ్ద.

ఇలాంటి విద్య ప్రతి ఒక్కరికీ అవసరం!

విద్యార్థులు ఆటలు, పాటలు, విహారయాత్రలకు స్వస్తి చెప్పి చదువుల తల్లి చెంతకు చేరే సమయం ఆసన్నమైంది. పాఠశాల చదువులు ముగించి కళాశాలకు పోయే విద్యార్థులు కొందరైతే, కళాశాల చదువులు పూర్తిచేసి విశ్వవిద్యాలయాలకు వెళ్ళేవారు మరికొందరు. అలాగే విశ్వవిద్యాలయాలకు వీడ్కోలు చెప్పి విదేశాలకెగసే విద్యార్థులు మరెందరో! గదులు మారి తరగతులు పెరిగినా,  గతులు వేరై ఘనకార్యాలు  సాధించినా… మేధావులు సృష్టించిన నేటి మన విద్యావిధానం మహాత్ముల్ని సృజించడంలో  విఫలమవుతుంది. వైజ్ఞానికంగా ఎంత ఎదిగినా వివేకపథంలో వెనుకంజ వేస్తుంది. నేటి సమాజంలో సత్యధర్మాలు, సేవా త్యాగాల్లాంటి... విలువలు మానవతా గగనకుసుమా లయ్యాయి. సంఖ్యలకే ప్రాధాన్యతనిచ్చే విద్యతోపాటు నడవడికలో నాణ్యతను పెంచే విద్య చాలా అవసరం. అక్షరజ్ఞానంతో పాటు విజ్ఞానం తోడైనప్పుడే మానవతా విలువలు భాసిల్లుతాయి. చదువుతో పాటు సంస్కారాన్ని పెంచే విద్యే నిజమైన విద్య. బుద్ధిని వృద్ధిచేసే విద్యే నేటి సమాజంలోని అన్ని రుగ్మతలకు సరైన ఔషధం. విద్యకు భూషణం వినయం... విద్యార్థి గురువు వద్ద ఎలా అణకువతో ప్రవర్తించాలో శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో బోధించాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా । ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః ॥  శిష్యుడు గురువు సన్నిధిలో ఉంటూ భక్తిశ్రద్ధలతో గురువుకు సపర్యలు చేస్తూ తన సందేహ నివృత్తి చేసుకోవాలి. శిష్యుని వినయ విధేయతలకు గురువు ప్రీతి చెంది శిష్యునికి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. పెద్దలయందు, గురువులయందు గౌరవమర్యాదలు లేనివాడు ఎన్నటికీ జీవితంలో ఉన్నతి పొందలేడు. అహంకారి అయిన దుర్యోధనునితో 'నువ్వు గురువులకు, పెద్దలకు వినయంతో సేవ చేయడం నేర్చుకో దాని వల్ల నీలో సత్ప్రవర్తన వృద్ధి చెందుతుంది' అని శ్రీకృష్ణుడు అంటాడు. విద్యార్థి గ్రంథాల ద్వారా నేర్చుకొనే దాని కన్నా గురువు సాంగత్యంలో నేర్చుకొనే విద్య ఎక్కువ ప్రయోజనాన్నిస్తుంది. ఆచరించేవాడే ఆచార్యుడు...  ఆచార్య అంటే సంగ్రహించే వాడు. శాస్త్ర సారాన్ని సంగ్రహించి, విద్యార్థులకు బోధించేవాడు ఆచార్యుడు అని అర్థం. తాను సంగ్రహించిన వేదసారాన్ని శిష్యులకు ఆచరణలో చూపించిన వాడే ‘ఆచార్యుడు' అని మరో అర్థం. ఆచరణాత్మక బోధ నలతో ఆదర్శజీవితాన్ని గడిపి, శిష్యుల్లో మానవతా విలువల్ని పెంపొందించే వాడే నిజమైన ఆచార్యుడు. విలువల్ని పెంచే విద్య...  నేడు మనకు కావలసిన విద్య ఎలా ఉండాలో స్వామి వివేకానంద మాటల్లో…  We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded... శీలనిర్మాణం, మనోబలం, విశాలబుద్ధి ఈ మూడు సుగుణాల్ని పెంపొందించే విద్య నేడు మనకు అవసరం. స్వామి వివేకానంద నిర్వచించిన విద్యలో ఉన్న మూడు లక్షణాలను విద్యార్థి అలవరచుకోవాలంటే తైత్తిరీయో పనిషత్తులో గురువు శిష్యులకిచ్చిన సూచనల్ని ఆచరణాత్మకం చెయ్యాలి.                                          ◆నిశ్శబ్ద.

మీ మనసును మర్చివేసే కథ

కొన్ని కథలు మనుషుల జీవితాలను, ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి. ప్రాంతాలు ఏవైనా సరే మనుషుల ప్రవర్తనలో అసూయ, ద్వేషం, కోపం వీటితోపాటు.. ప్రేమ, ఆప్యాయత కూడా ఉంటాయి. మనం ఏ కోణాన్ని చూస్తామో అదే మనలో నుండి వ్యక్తమవుతుంది కూడా..  మనిషి మనసుకు సంబంధించి ఓ కథ ఉంది.. ఇది ఒక చైనా దేశం కథ. వివాహానంతరం ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. మొదటి ఆరు నెలలు అత్తాకోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. గోరంతలు కొండంతలై చివరకు కోడలు పుట్టింటికి పరుగెడుతుంది. అక్కడ ఆమె తండ్రిగారి స్నేహితుడైన ఒక డాక్టర్తో తన బాధల్ని వెళ్ళబోసుకుంటూ 'ఎలాగైనా మా అత్త మరణిస్తే గాని నాకు సుఖశాంతులుండవు అని చెప్పింది. ఒకప్పుడు తన దగ్గర కూర్చొని ముద్దుమాటలతో చిలిపి చేష్టలతో ఆనందింపజేసిన ఆ చిన్నారిలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ రాక్షసత్వాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ డాక్టర్. తర్వాత ఇలా అన్నాడు. ' అమ్మా! నీ మీద ప్రేమతో ఈ పనిచేస్తున్నాను. ఒక మందు నీకిస్తాను. దానిని మీ అత్తగారికివ్వాలి. అది తీసుకున్న సంవత్సరం తరువాత ఆమె మరణిస్తుంది. వెంటనే చనిపోతే, అందరికీ అనుమానం రావొచ్చు. అప్పుడు మన పన్నాగం బయట పడుతుంది.  అందుకే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా చంపే మందు ఇస్తున్నాను. ఒక సంవత్సరం నీవు ఓపిక పట్టాలి. అత్త ఎలాగూ చనిపోతుంది. కాబట్టి నీవు ఆమెను ఈ సంవత్సర కాలం పాటు ప్రేమగా చూసుకుంటూ సేవ చేస్తానని నాకు హామీ ఇవ్వు. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు” అన్నాడు.  అమ్మాయి సరేనని అంగీకరించింది. మందు తీసుకుని అత్తగారింటికి వెళ్లింది.  అత్తకు తినిపించి ప్రేమతో సపర్యలు చేయడం ప్రారంభించింది. అత్తకు అమితానందం. తన కోడలు చేసే సేవకు స్పందించింది. ఆమె చూపిన ప్రేమకు దాసోహం అయ్యింది. తనకు ఓపికలేక పోయినప్పటికీ కోడలికి చిన్నచిన్న పనుల్లో సహాయం చేయడం మొదలు పెట్టింది. కోడలిని తన సొంత కూతురిలా భావించింది. అప్పుడు కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ఆరు నెలలు గడిచాయి. కోడలు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఆ డాక్టర్ని కలిసింది. ఆమె ముఖంలో విషాదం. గద్గద స్వరంతో ఇలా అంది. 'డాక్టర్! నేను ఓ పెద్ద తప్పు చేశాను. దేవతలాంటి మా అత్తను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాను. నా చేతులతో ఆమెకు విషం తినిపించాను. ఆరు నెలల్లో నన్ను ప్రేమించే నాదేవత నాకుండదు. ఆమెను ఎలాగైనా నేను రక్షించుకోవాలి'. ఈ మాటలు విన్న డాక్టర్ నవ్వి 'అమ్మా నేనిచ్చిన మందు, విషం కాదు. మీ అత్తగారికి ఏ అపాయంలేదు. అప్పుడు నీ మనసులో ఉన్నది విషం. ఇప్పుడది లేదు. మీ అత్తాకోడళ్ళ మధ్య ఈ ఆరు నెలల్లో నెలకొన్న ప్రేమానురాగాల ప్రవాహంలో ఆ ''విషం' కొట్టుకు పోయింది. మనసులో ఏ కల్మషం లేకుండా జీవించు' అన్నాడు. ఇది మనసు కథ, ప్రతి మనిషి కథ.                                       ◆నిశ్శబ్ద.

సెక్స్ గురించి మీకు తెలిసిందేంటి.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది ఇదే!

భారతదేశంలో సెక్స్ అనే పదం ఎక్కడైనా పబ్లిక్ గా వినిపిస్తే చాలా పెద్ద చర్చలు, మరెంతో పెద్ద వార్తలుగా మారతాయి. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ఈ శారీరక సంబంధం గురించి అందరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పబ్లిగ్గా చర్చలు పెట్టడం వల్ల మార్పులు సాధ్యమవుతాయంటే ఇప్పటికి భారతదేశంలో ఎన్నో విషయాలు మార్పు చెంది ఉండాలి. వీటిలో లింగ సమానత్వం, అక్షరాస్యత, కనీస మానవహక్కులు మొదలైనవి తప్పనిసరిగా ఉండాల్సినవే. కాబట్టి మార్పు అనేది ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడటం వల్లే రాదు.. చరిత్ర ఏమి చెప్పింది?? వాస్తవంలో ఏమి జరుగుతోంది?? వీటిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే కాలానికి తగ్గట్టుగా జరగాల్సిన మార్పులు ఏమిటి అనేది తెలుస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 9 వ తేదీని జాతీయ సెక్స్ డే లేదా లైంగిక సంబంధాల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి మనిషికి జీవితంలో తిండి, నిద్ర, నీరు వంటి కనీస అవసరాలు ఎలాగో అలాగే.. సెక్స్ కూడా ఒక కనీస అవసరం. వయసు వల్ల ఏర్పడే శారీరక స్పందనల నుండి శరీరాన్ని సహజస్థితిలోకి తీసుకురావడానికి సెక్స్ ఉపయోగపడుతుంది.  నిజానికి సెక్స్ అనే పదం విదేశీయులది అయినా దీన్ని కూడా కళాత్మకంగా చూపెట్టిన ఘనత భారతీయులకే దక్కింది. శృంగారం, సంభోగం పేర్లతో ఈ శారీరక అవసరం ఎన్నో వేల ఏళ్ల నుండి వ్యక్తుల మధ్య ఒక జీవనదిలా సాగుతోంది. పండితులు తృతీయ పురుషార్థంగా కామంను వర్ణించారు. ముఖ్యంగా వాత్సాయనుడు రచించిన కామసూత్రం, కొక్కోకుడు రచించిన కొక్కోక శాస్త్రం  మొదలైనవి వేల ఏళ్ల క్రితం నుండే ఉన్నాయి. కామసూత్రలో 64 విధాలుగా శృంగారాన్ని ఆ కాలానికే వర్ణించారంటే ఈ విషయం గురించి దేశ దేశాలు భారతదేశం నుండే ఎన్నో నేర్చుకున్నాయని చెప్పవచ్చు.  ఇవి అప్పట్లో రాజకుటుంబీకులు, పండితులకు మాత్రమే లభ్యమైనా క్రమంగా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి.  ఇకపోతే సెక్స్ అనేది ఆరోగ్యకరమైన సంబంధంగా కొనసాగితే అది ఎంతో గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ఒత్తిడి, శరీరం ఫిట్ గా ఉండటం దీని ద్వారా సాధ్యమవుతుంది. కేవలం పునరుత్పత్తికి ఇదొక మార్గమనే కోణంలో దీన్ని ఎప్పుడూ భావించకూడదు. ఇవి అర్థం చేసుకుంటే సెక్స్ అనేది ఎప్పుడూ బూతుగా కనిపించదు, అనిపించదు.                                      ◆నిశ్శబ్ద  

ఓటమి ఓ గుణపాఠమే!

ప్రతి మనిషి తన జీవితంలో చేసే ప్రయత్నాలు అన్నీ మొదలుపెట్టే పనిలో గెలవాలనే చేస్తారు. ఆ ప్రయత్నాలలో ఎప్పుడూ విజయాలే కాదు ఓటమిలు కూడా ఎదురవుతాయి. మనం విజయాన్ని సాధించాలంటే కొన్నిసార్లు ఓటమిని తప్పనిసరిగా అంగీకరించాలి. ఓటమి విజయానికి తొలిమెట్టు అనే మాటను ఎప్పుడూ మరచిపోకూడదు.  ఓటమి అనేది మనం విజయాన్ని ఎలా సాధించాలో తెలియజేస్తుంది. అంటే ఓటమితో దాగున్న గొప్ప గుణం అనుభవం. అనుభవం ఎదురైనప్పుడు మనం చేస్తున్న తప్పేమిటో చాలా తొందరగా అర్థమైపోతుంది. చాలామంది వారు చేసే పనులలో ఓటమి ఎదురయినప్పుడు ఓటమికి భయపడి ఆ పనిని చివరివరకు పూర్తిచేయకుండా వారు అనుకున్నది సాధించలేక వారి ఆశలను నిరాశలను చేసుకుంటున్నారు. చివరివరకు పనిని పూర్తిచేయడం అంటే ఓటమి ఎదురవ్వగానే ఇక ప్రయత్నం ఆపేయడం. అది మంచి పద్ధతి కాదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి. విఫలం అయిన ప్రతిసారి చేసిన తప్పేంటో అర్థం చేసుకుని అది తిరిగి పునరావృతం కాకుండా ముందడుగు వేయాలి. ఓటమి ఎదురయితే కృంగిపోకూడదు. అలాచేస్తే అది మనల్ని డిప్రెషన్లోకి తీసుకువెళుతుంది. ఆ డిప్రెషన్ వల్ల మనుషులకు కొన్నిరకాల చెడు వ్యసనాలు అలవాటు అవుతాయి. మనుషులు డిప్రెషన్ కి లోనైనప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు నచ్చిన వ్యక్తులను కలవడానికి, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే నిరాశానిస్పృహల నుండి తొందరగా బయటపడవచ్చు.  అసలు ఓటమి అంటే ఓడిపోవడమా?? కానే కాదు!! ఓటమి అంటే ఎప్పటికీ ఓడిపోవడం కాదు. గెలుపు ఇంకా అందుకోలేదని అర్ధం, గెలుపుకు తగిన సన్నద్ధత ఇంకా రాలేదని అర్థం. ఓటమి అంటే భయంతో అసలు పనిచేయకపోవడం కాదు. ఆ పని మరొక విధంగా చేస్తే బావుంటుందేమోనని ప్రయత్నించటం. కొన్నిసార్లు చేసే పనుల వల్ల  కూడా వైఫల్యాలు ఎదురవుతాయి.   పరాజయం అనేది ఉందా?? చాలామంది పరాజయాన్ని నిర్వచిస్తారు. గెలవలేకపోతే ఇక పరాజయం పాలైనట్టు చెబుతారు. కానీ అన్నీ మనం చేసే పనులకు వచ్చే ఫలితాలు మాత్రమే. మనం నిర్వహించే పని సరైనది అయినప్పుడు వచ్చే ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మనం అనుకున్న ఫలితాలు సరిగారానప్పుడు చేసేపనిలో, పద్దతిలో మార్పు తీసుకురావడం ద్వారా కోరుకున్న ఫలితాలు వచ్చేంతవరకూ మార్పులు తీసుకువస్తూ ఉండాలి. అందువల్ల ఫలితాలే తప్ప పరాజయాలు లేవు. వచ్చే ఫలితాలు ఆశించినవి కాకపోవచ్చు కానీ అసలు పలితం అంటూ లేకుండా లేదు కదా!! సముద్రంలో ప్రయాణం చేసే ఓడ తుఫానుని ఎదుర్కొనవలసి వస్తుందని భయపడి హర్భర్ లోనే ఉంచితే అది తుప్పుపడుతుంది. అప్పుడు ఓడను నిర్మించిన లక్ష్యం నెరవేరదు. ఓడను హార్బర్ లో పెట్టడానికి ఎవరూ తయారుచేయరు కదా!! దాన్ని తయారుచేయించుకున్న వ్యక్తి సముద్రంలో తిప్పుతూ డబ్బు సంపాదించాలని మాత్రమే కాదు, అది సముద్రంలో సమస్యకు లోనయ్యి నష్టం వచ్చినా భరించడానికి సిద్ధంగానే ఉంటాడు. అలాగే గెలవడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేసేవాడు గెలుపుమీద ఆశతో ఉండాలి అలాగే ఓటమి ఎదురైతే దాన్ని స్వీకరించే మనసు కూడా ఉండాలి.   ఓడిపోయేవారు భద్రత కోసం ఆలోచిస్తారు. గెలవాలనుకొనేవారు అవకాశాలకోసం ఎదురు చూస్తారు. ఓటమి పొందటం నేరం కాదు. ఓటమికి అసలు కారణాలు తెలుసుకోలేకపోవటం అతిపెద్ద నేరం. ఓటమికి గల అసలు కారణాలు తెలుసుకోగలిగితే మనం సగం విజయాన్ని సాధించినట్లే. ఓటమి, విజయం ఈ రెండూ కూడా మన వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటాయి. వ్యక్తిత్వపరంగా వ్యక్తిలోని లోపాలే వారికి విజయాన్ని దక్కకుండా చేస్తాయి. మన ఆలోచనలు, అలవాట్లు, చర్యలు, మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి. మన లోపాలను సరిదిద్దుకుని మంచి నడవడికను మనదిగా చేసుకుంటే స్థిరమైన వ్యక్తిత్వం సొంతమవుతుంది. ఓటమి భయంతో నిర్ణయాలు తీసుకోకపోవటం తప్పు, ఓటమి రావటం తప్పుకాదు. కానీ ఆ ఓటమిని తలచుకుంటూ, కుమిలిపోతూ జీవిస్తూ, ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకపోవటం మరింత తప్పు.                                         ◆నిశ్శబ్ద.

మనిషిలో సంఘర్షణలు.. వాటి తీరు..

మనిషి తన జీవితంలో సంఘర్షణలు ఎదుర్కోవడం  సహజం. సంఘర్షణ అంటే ఏమిటి?? అని ప్రశ్న వేసుకుంటే మనసులో ఉన్న అభిప్రాయానికి, బాహ్య పరిస్థితుల వల్ల ఎదురయ్యే అనుభవాలను మధ్య మనిషికి అంతర్గతంగా అంగీకారం కుదరకపోవడం వల్ల కలిగేది సంఘర్షణ. ఏకాభిప్రాయం ఎప్పుడైతే కలగదో.. అప్పుడు మనిషి వ్యతిరేకభావంలోకి వెళతాడు. మనిషిలో ఉన్న వ్యతిరేకభావం కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సి వస్తుంది. ఈ తరహా రెండు విరుద్ధ భావాల మధ్య మనిషి ఊగిసలాడటం వల్ల కలిగేది సంఘర్షణ. మనిషిలో ఇలాంటి సంఘర్షణలు చాలానే ఉంటాయి. చాలా సందర్భాలలో సంఘర్షణలు అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ సంఘర్షణలలో కూడా రకాలు ఉన్నాయని… అవి వివిధ వైఖరులు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు.  కావాలి-వద్దు అనిపించే సంఘర్షణలు:- కొన్నిటి నుండి దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఉన్నదాన్ని వదిలేసుకోవాలని అనిపిస్తుంది. కానీ అది వదిలేసుకొని వెళ్ళిపోతే ఆ తరువాత జీవితం క్లిష్టం అవుతుందేమో అనే భయం, ఈ సమస్యను చూసి వెళ్ళిపోతే.. ఆ తరువాత కూడా సమస్యలు ఎదురవ్వడం వల్ల ఇబ్బంది తప్పదనే ఆలోచన మనిషిని సంఘర్షణలోకి నెట్టేస్తాయి.  ఉదాహరణకు..  భర్త పెట్టే కష్టాల్ని భరించలేని ఓ మహిళ వివాహ బంధం నుంచి విముక్తి పొందాలని ఆలోచించవచ్చు. అయితే వివాహంలో ఉన్న భద్రత, విడిపోతే ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఆమె ఆలోచిస్తూ ఉండిపోతుంది. భర్తకు దూరంగా వచ్చేసే  స్త్రీ గురించి ఈ సమాజం ఆలోచనా తీరు, సమాజంలో పౌరుల ప్రవర్తన ఆ మహిళను ఒక నిర్ణయం తీసుకోనీయకపోవచ్చు.  ఇక్కడ ఆ మహిళ ఏ నిర్ణయం తీసుకున్నా దానికుండే మంచీ చెడు, కష్టనష్టాలు దానికుంటాయి. జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదురౌతూ ఉంటాయి. అవి ఒత్తిడికి దారి తీసి అదే క్రమంగా డిప్రెషన్ అనే సమస్యను క్రియేట్ చేస్తుంది.  అదే విధంగా  పెద్ద చదువులు చదవాలని అనుకొనే విద్యార్ధి ఏమి చదవాలా అనే ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఆ ఆలోచనలోనే సంఘర్షణకి లోను కావచ్చు. అయిదారు సబ్జెక్టులలో ఒకటి ఎంచుకోవటం అతనికి కష్టం కావచ్చు. రెండూ కావాలనిపించే సంఘర్షణ:- దీన్నే చాలామంది అవ్వా కావాలి, బువ్వా కావాలి అని సామెతకు అన్వయిస్తారు. ఒక వ్యక్తి దగ్గర చాలా మొత్తమే డబ్బు ఉంది. ఆ డబ్బు ఆ వ్యక్తికి ఇల్లు కాని, కారు కాని ఏదో ఒకటి  కొనుక్కోవటానికి సరిపోతుందనుకుంటే… ఇక్కడ అతనిలో సంఘర్షణ మోడ్స్లవుతుంది. ఇల్లు కొనుక్కుందామని అనుకుంటే… కారు గుర్తుకు వస్తుంది. పోనీ కారు కొనుక్కుందామని అనుకుంటే… ఇల్లు గుర్తుకువస్తుంది. రెండూ కావాలని అనిపిస్తుంది కానీ ఏదో ఒకటే అతని తాహతుకు సరిపోతుంది. ఇందులో పైన చెప్పుకున్నా సంఘర్షణ కంటే దీని తీవ్రత తక్కువే ఉన్నా ఇది సాధారణంగా పెద్దలలో కంటే.. పిల్లలలో ఇంకా యువతలో ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది.  రెండూ వద్దనిపించే సంఘర్షణ:- ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది కొందరి పరిస్థితి. కానీ ముందుకో, వెనక్కో తప్పకుండా అడుగు వెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ  వ్యక్తికి మాత్రం రెండు దారులూ ఇష్టం ఉండవు. ముందు వెళ్లడమూ నచ్చదు, వెనక్కు రావడమూ నచ్చదు. ఇలాంటి సందర్భాలలో సంఘర్షణ ఏర్పడుతుంది. కొందరికి ఒకవైపు పెళ్లి వయసు దాటిపోతూ ఉంటుంది. మరొకవైపు ఉద్యోగం ఉండదు. రెండూ ఉండక మనిషి జీవితం స్తబ్దుగా ఉంటుంది. కానీ ఓ వయసు దాటాక ఉద్యోగం చేయడం మీద ఆసక్తి పోతుంది, అలాగే పెళ్లి అంటే ఆసక్తి పోతుంది. కానీ పెద్దల పోరు వల్ల రెండూ చేయాల్సి వస్తుంది. ఇలాంటి వ్యక్తి సంఘర్షణ మాటల్లో చెప్పలేనిది. కొందరు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అనే ఆలోచన చేస్తుంటారు కూడా.  ఇలా మనిషి తన జీవితంలో ఎన్నో సంఘర్షణలకు లోనవుతూ ఉంటాడు.                                       ◆నిశ్శబ్ద.

హస్తసాముద్రికం నిజంగానే నిజమా? ఏ చెయ్యి ఉన్నవారికి ఎలాంటి యోగం ఉంటుందంటే...

ప్రతి వ్యక్తి జీవితం వేరుగా ఉన్నట్టే మనిషి అరచేతి ఆకారం, దాని పరిమాణం కూడా భిన్నంగా ఉంటుంది. అరచేతి రేఖలు, గుర్తులను చూసి వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుందో, అదే విధంగా అరచేతి ఆకారాన్ని చూసి మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎంత అదృష్టవంతుడో, జీవితంలో ఎంత పురోగతి సాధిస్తాడో తెలుసుకోవాలంటే అతని అరచేతి ఆకృతి చూడాలంటారు. నిజానికి ఇవన్నీ కట్టుకథలుఅని కొట్టిపారేసేవారున్నా హస్తసాముద్రిక శాస్త్రం ఎంతో పేరు ప్రఖ్యాతులు కలది. ఒక వ్యక్తి  అరచేతి  ఆకృతి, దాని పొడవు  వెడల్పును చూడటం ద్వారా వ్యక్తి  గురించి చాలా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇంతకీ విభిన్నమైన అరచేతులు ఎలా గుర్తించాలి? ఎలాంటి చెయ్యి కలిగిన వారికి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది? ఇవన్నీ జ్యోతిష్యం చెప్పేవారే ద్వారానే కాదు సాధారణంగా కూడా తెలుసుకోచ్చు. ఎలాగంటే.. అరచేయి చిన్నగా ఉంటే.. అరచేతులు చిన్నగా ఉన్న వ్యక్తులు  చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వీరికి చాలా  స్వచ్ఛమైన హృదయం ఉంటుంది. చిన్న అరచేతులు ఉన్నవారిలో దేవుడి పట్ల భక్తి, విశ్వాసం అధికంగా ఉంటాయి.  దైవారాధనను వీరు బాగా ఇష్టపడతారు. చిన్న అరచేతులు ఉన్న వ్యక్తులు జీవితంలోని అన్ని ఆనందాలను సంపాదించగలుగుతారు.  ఈ వ్యక్తులు వారి వ్యక్తిత్వాన్ని వారు చాలా ఇష్టపడతారు.  కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారు. అరచేయి పెద్దగా ఉంటే.. పెద్ద అరచేతులు ఉన్న వ్యక్తులు తెలివిగా,  గంభీరంగా ఉంటారు. ఇలాంటి వారు తమ పనిని బాధ్యతగా చేస్తారు. వీరు తమ  జీవితంలో  కష్టపడి మంచి విజయాలు సాధిస్తారు.  సామాజిక,  మతపరమైన కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారు. మృదువైన అరచేతులు ఉంటే.. అరచేతులు మృదువుగా, మందంగా  ఉన్న వ్యక్తులు నిజంగా అదృష్టవంతులే అని చెప్పవచ్చు.  అలాంటి వారిని అదృష్టలక్ష్మి వెంబడిస్తూనే ఉంటుంది.  వీరు జీవితంలో  చాలా  ఆనందాన్ని పొందుతారు. జీవితంలో సంతోషాన్ని వెతుక్కోవడానికి కష్టపడరు. అరచేతులు గట్టిగా ఉంటే.. గట్టి అరచేతి ఉన్నవారు జీవితంలో ఆనందం కోసం చాలా  కష్టపడాల్సి ఉంటుంది. సంతోషం కోసం, సుఖవంతమైన జీవితం కోసం వీరు బాగా   కష్టపడతారు. అలాగే పని పట్ల ఇతర విషయాల్లో నిజాయితీగా ఉంటారు. ఈ వ్యక్తులు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు.                                                                               *నిశ్శబ్ద.

నేటికాలంలో అధికారుల తీరు ఎలా ఉంది?

మనిషి ఎంతటి నీచుడైనా, పిరికిపంద అయినా, రాజసేవకుడైతే అతడిని ఎవరూ అవమానించలేరు. ఇది లోకరీతి, "నువ్వు గొప్ప పని సాధించకున్నా పరవాలేదు, గొప్పవాడి పక్కన నిలబడితే చాలు వాడి గొప్ప కొంత నీకూ అంటుకుంటుంది" అని ఓ సామెత ఉంది. అందుకే బలహీనులు, చేత కానివారు, స్వయంగా ఏమీ సాధించలేనివారు శక్తిమంతుడి చుట్టూ చేరాలని ప్రయత్నిస్తారు. శక్తిమంతుడి పంచన చేరి, అతడి శక్తి ద్వారా తమ పనులు సాధించుకోవాలని చూస్తారు. తమకు లేని గొప్పను ఆపాదించుకోవాలని చూస్తారు. అధికారి అహాన్ని సంతృప్తి పరచి, అతడి నమ్మకాన్ని పొందుతారు. ఆపై, అధికారి దగ్గర తమకున్న ప్రాబల్యాన్ని ప్రకటిస్తూ, ఇతరులను భయపెట్టి తమ ఆహాన్ని సంతృప్తి పరచుకుంటారు. ఇటువంటివారిని గుర్తించటం కష్టం. కానీ ఇటువంటి వారిని చేరదీయటం వల్ల అధికారి ఎంత మంచివాడైనా చెడ్డ పేరు సంపాదిస్తాడు. పాలను గలసిన జలమును బాల విధంబుననే యుండు, బరికింపంగా,  బాల చవి జెరుచు, గావున  బాలసుడగువాని పొందు వలదుర సుమతీ! పాలతో కలిసిన నీరు పాలలాగే ఉంటుంది. కానీ పాల రుచిని పోగొడుతుంది. అలాగే చెడ్డవారితో స్నేహం వల్ల మంచి గుణాలు పోతాయి. కాబట్టి అంతరంగికులను ఎన్నుకునే విషయంలో అధికారి ఎంతో జాగరూకత వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆఫీసుల్లో పనివారిని రెండు రకాలుగా విభజించవచ్చు. పని చేయనివారు ఒక రకం. వీరితో పని చేయించటం బ్రహ్మతరం కూడా కాదు. పని చేసేవారు రెండో రకం. వీరిని పని చేయకుండా ఉంచటం బ్రహ్మతరం కాదు. అయితే పని చేయనివారిని మరి కొన్ని రకాలుగా విభజించవచ్చు. పనిచేయగలిగి చేయనివారు ఒకరకం. పని చేయలేక చేయనివారు ఇంకో రకం. అలాగే పనిచేసే వారిలో, ఎదుటివాడి గురించి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయేవారో రకం, తాము పనిచేస్తూ ఎదుటివాడు పని చేయటం లేదని ఏడుస్తూ పని చేసేవారు ఒక రకం, తమపనికి గుర్తింపు లభించటం లేదని బాధపడుతూ పనిచేసేవారు ఇంకో రకం. ఇటువంటి వారందరినీ వారివారి మనస్తత్వాలను అనుసరించి వ్యవహరిస్తూ నియంత్రించవచ్చు. కానీ.. ప్రమాదకరమైన ఇంకో రెండు రకాల పనివారున్నారు ఉంటారు.  వీరు పని చేస్తున్నట్టు నటిస్తారు, నమ్మిస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. ఆఫీసర్ విశ్వాసం సంపాదించిన తరువాత ఎదుటివారిమీద పితూరీలు చెప్తారు. ఎదుటివారిని తక్కువ చేయటం వల్ల తమ ఆధిక్యాన్ని చాటుకుంటారు. మరో ప్రమాదకరమైనవారు, పనిచేస్తారు. కానీ పనిచేస్తూ వక్రకార్యాలకు పాల్పడుతారు. వక్రమార్గంలో ప్రయాణిస్తారు. తమ అక్రమచర్యల నుండి రక్షణ పొందేందుకు ఆఫీసర్ను ఆశ్రయిస్తారు. అతడికి సేవలు చేస్తారు. అవసరమైనవి అడగకుండానే అందిస్తారు. ఆఫీసరు అడుగులకు మడుగులొత్తుతారు. విశ్వాసం సంపాదిస్తారు. తద్వారా తమ పనులు సాధించుకుంటారు. ఈ రెండు రకాల మనుషుల వల్లా అధికారికి చెడ్డ పేరు వస్తుంది. కానీ ఇటువంటివారే అధికారులకు దగ్గరవటం జరుగుతుంది. ఎందుకంటే, పని చేసేవాడికి స్వతహాగా ఉండే ఆత్మవిశ్వాసం వల్ల వాడు ఎవరి ప్రాపు సంపాదించటానికీ ఇష్టపడడు. తనను ప్రజలు గుర్తించాలని ఆరాటపడకుండా రత్నం ఎలా భూమిలోనే ఉండిపోతుందో, అలా వీరు కూడా ఆఫీసర్ దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇందుకు భిన్నంగా, ఆఫీసరు దృష్టిని ఆకర్షించాలని, దగ్గరవ్వాలని ప్రయత్నించే వారికి స్వలాభాలుంటాయి, ఉద్దేశ్యాలుంటాయి.  కానీ అధికారిలో ఉన్న అహం, తన ప్రాపు కోసం తాపత్రయపడేవారిని చూసి సంతృప్తి చెందుతుంది, వారే ఇష్టులవుతారు. తమని లెక్క చేయని పనివారంటే ఆఫీసర్లో కోపం కలుగుతుంది. అతడి అహం దెబ్బ తింటుంది. తన చుట్టూ చేరినవారి ప్రభావంతో, తప్పు అని తెలిసి కూడా, పని చేసేవారిని బాధించాల్సి వస్తుంది. చెడ్డ పేరు మూటకట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది నేటికాలంలో అధికారుల తీరు.                                      ◆నిశ్శబ్ద.

జీవితంలో అవకాశాల పాత్ర ఏమిటి?

జీవితంలో మనిషిని మరొక స్థాయికి తీసుకెళ్ళేవి అవకాశాలు. ఒక అవకాశం మనిషి ఆర్థిక, సామాజిక స్థితిగతులనే మార్చేస్తుంది. కానీ కొందరు అవకాశాల్లేవని సాకులు చెపుతూ ఉంటారు.  కష్టపడటాన్ని ఇష్టపడకపోవడమే వాళ్ళు అలా చెప్పడానికి కారణం. కష్టం ఉంటేనే మనిషికి జీవితం విలువ, జీవితంలో అవకాశాలు, ఎదుగుదల మొదలైన వాటి విలువ అర్థమవుతుంది.  "అవకాశాలకు అనుగుణంగా జీవిస్తూ వనరులను పెంచుకోవటమే మానవుని అద్భుత విజయం" అంటారు   -వాలేనార్గ్స్.  ప్రపంచంలో చాలామంది వ్యక్తులు వున్న అవకాశంతోనే సంతృప్తిపడి, నూతన అవకాశాల కోసం ఎదురుచూడరు. కొంతమంది విజేతలు నిరంతరం అవకాశాలకేసి చూస్తుంటారు. చాలామంది ఉద్యోగులు అన్ని అర్హతలు ఉండికూడా వారు చేస్తున్న వృత్తిలో సుఖాన్ని, క్షేమాన్ని పొందుతూ నూతన ప్రయత్నాలు చేయరు. వారికి ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోగలిగితే జీవితంలో గొప్ప వ్యక్తులుగా మార్పు చెందవచ్చు. అవకాశం అనేది మనల్ని అదృష్టవంతుల్ని చేస్తుంది. అవకాశాలు అనేవి అందరికీరావు, అవి కొంతమందికే వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని సద్వినియోగ పరచుకోవాలి. అవకాశాలు మీ ఇంటి తలుపు తట్టినపుడు మీరు లేకుంటే మరోసారి ఆ అవకాశాలు ఇంక మీ ఇంటికి రావు అని ఎవరైనా అంటే వారు తప్పు చెప్పినట్లే ! ఎందుకంటే అవకాశాలు ప్రతిరోజూ మీ ఇంటి బయట నిలబడి నిద్రలేపి, పోరాడి విజయలక్ష్మిని చేపట్టమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటాయన్న విషయం మరచిపోవద్దు ! ఒక్కొక్కసారి అవకాశాలు మనకి కష్టమైనవిగా, సాధించలేనివిగా, చేయలేనివిగా అనిపిస్తాయి. పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని, పట్టుదలతో ప్రయత్నిస్తే, విజయాలు సాధించవచ్చు. మనం వదిలేసిన అవకాశాలను సమర్థులు ఎగరేసుకు పోతారు. అవకాశాలు అనేవి అదృష్టాలు కావు, వారసత్వాలు అంతకంటే కావు, వాటిని పట్టుదల తో సాధించుకోవాలి. చెట్టుపైనుండి ఆపిల్ క్రిందపడటాన్ని చూసిన న్యూటన్ కి అది కొత్త సిద్ధాంతానికి ప్రేరణగా, అవకాశంగా అనిపించింది. అంతకుముందు ఆపిల్ క్రిందపడటాన్ని చూసిన కొన్ని లక్షలమంది దాన్ని కొత్త ఆవిష్కరణకు అవకాశం అనుకోలేదు. తినడానికి దొరికిన పండుగా అనుకున్నారు. న్యూటన్ దాని కొత్త ఆవిష్కరణకి అవకాశం అనుకుని, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. చరిత్రలో నిలిచాడు. ఆ విధంగా మనంకూడా అవకాశాలను సృష్టించుకోవాలి.  అవకాశాల కోసం కాచుకుని ఉండటం బలహీనుల లక్షణం, అవకాశాలను సృష్టించుకోవడం బలవంతుల లక్షణం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడడం కన్నా మనమే అవకాశాలకోసం వెతుక్కుంటూ వెళ్లాలి. అవకాశాలు వాటంతట అవిరావు. వాటిని మనమే సృష్టించుకోవాలి. అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూడకూడదు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓ కొమ్మమీదో, ఓ గూటిలోనో ఎక్కువసేపు ఉండని పక్షి లాంటిదే అవకాశం. ఒక అవకాశాన్ని మనం జారవిడుచుకున్నప్పుడు విచారించకూడదు. మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్తపడాలి. అవకాశాలను అందుకోవడమే కాదు. దొరికిన అవకాశాన్ని జారవిడుచుకోకపోవడం కూడా ముఖ్యమే ! అవకాశాలు అందిపుచ్చుకోవడం అంటే ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. అవకాశాల ద్వారా డబ్బులు, పేరు ప్రతిష్ఠలు, కీర్తి, అధికారాల్ని మంచి జీవితాన్ని సంపాదించు కోవచ్చు. అందుకే మనిషి తన జీవితంలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా తనచుట్టూ ఉన్న అవకాశాలను కనుగొని వాటి సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే తనున్న పరిస్థితులకు అనుగుణంగా అవకాశాలను సృష్టించుకోవాలి.                                      ◆నిశ్శబ్ద.

భయాన్ని జయించే మంత్రం!!

జీవితంలో మనిషి కలలు చాలా ఉంటాయి. అయితే కలను నిజం చేసుకోవడానికి ఒక్కో ప్రయత్నం చేస్తూ వెళ్తాడు మనిషి. ఆ ప్రయత్నం అందరి జీవితంలోనూ సఫలం అవ్వడం లేదు ఎందుకు??   ప్రశ్నించుకుంటే చుట్టూ బోలెడు కారణాలు కనబడతాయి. అయితే అవన్నీ తమను, తమ సామర్త్యాన్ని తక్కువ చేసుకోకుండా కప్పిపుచ్చుకునే చక్కెర గుళికలు. ఎప్పుడైతే మనిషి శరీరానికి చక్కెర శాతాన్ని ఎక్కువగా అందిస్తాడో అప్పుడే డయాబెటిస్ వైపు అడుగులు వేగంగా పడిపోతాయి. ఫలితంగా ఏదో ఒకరోజు శరీరమంతా చక్కెర వ్యాధితో నిండిపోయిందనే వార్త వినాల్సివస్తుంది. అలాంటిదే జీవితంలో ఈ కప్పిపుచ్చుకోవడం కూడా.  నిజానికి మనిషి ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు.  తనకు నచ్చింది చేయడానికి భయం, ఎవరైనా ఆ పనిని వేలెత్తి చూపుతారని. పని చేసాక అపజయం ఎదురైతే భయం. తను ఆ పనిని అంత శ్రద్దగా చేయలేదనే విమర్శ ఎదురవుతుందని. విజయం సాధించగానే భయం. తదుపరి విజేతగా కొనసాగుతూ ఉండగలనా లేదా అని. రేపు అంటే భయం. ఏమవుతుందో ఏంటో?? అని. ఇట్లా అడుగడుగునా అన్నీ భయాలే…..  వీటికి కారణం ఏమిటి?? అని ఒకసారి ఆలోచిస్తే అందరూ చేస్తున్న భయంకరమైన తప్పేంటో తెలిసిపోతుంది. అది చేదు గుళికలా అనిపించినా తమని తాము సరిదిద్దుకునే ఔషధం అవుతుంది.  ఇంతకు ఆ తప్పేంటి అంటే, గతాన్నో, భవిష్యత్తునో ఆలోచిస్తూ వర్తమానాన్ని వృథా చేయడం. మనం జీవించాల్సిన అమూల్యమైన క్షణాలను గతం లిస్ట్ లోకి పనికిమాలిన క్షణాలుగా మార్చి పడదోయడం. మనిషికి ఆలోచన మంచిదే. తమని తాము విశ్లేషించుకోవడం ద్వారా తదుపరి అడుగులను మరింత మెరుగ్గా వేసేందుకు దోహాధం చేస్తుందది. అయితే ఎప్పుడూ అదే ఆలోచన చేయడం వల్ల, ఆలోచనల్లో, ఊహల్లో తప్ప ఎక్కడా మనిషి ఉనికి కనబడనంత పాతాళంలోకి తోస్తాయి అవి. అంతే కాదు ఇలా ఎప్పుడూ ఆలోచించడం వల్లే ప్రతి పనిలో భయం తొంగిచూస్తూ ఉంటుంది.  ఇంతకు పరిష్కారం ఏమిటి?? ముందుగా తెలుసుకోవలసిన విషయం. ఈ భయం అనేది శారీరక విషయం కాదు. నోప్పో, నలతో కాదు. ఇది కేవలం మానసికమైనది. ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఈ భయం అంతా మన బుర్రలో కంటే, మన ఆలోచనల నుండి సృష్టించబడుతున్నదే అధికం. బుర్రకు, ఆలోచనలకు తేడా ఉంది. మెదడు పాజిటివ్, నెగిటివ్ రెండు విధాలుగా కూడా ఉండగలదు. అయితే ఈ అతి ఆలోచన అనేది పూర్తిగా నెగిటివ్ కోవలోకి జరిగిపోయి మానసికంగా బలహీనులను చేసి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసి, అనవసరపు భయాన్ని అడుగడుగునా జోప్పిస్తుంటుంది. కాబట్టి ముందు మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. మానసిక పరిస్థితి మెరుగవ్వడానికో అద్భుతమైన మార్గం ఉంది. మానసిక సమస్యలు చాలా కఠినమైనవి, వీటిని అధిగమించడం ఎంతో కష్టతరమైన పని. అనుకుంటూ వుంటారు చాలా మంది. అయితే అది నిజమే కావచ్చు కానీ అది కేవలం అలా భావించే వాళ్లకు మాత్రమే. ఈ మానసిక సమస్యలు అన్ని కూడా చూసే చూపును బట్టే ఉంటాయి. చిన్న సమస్య అనుకుంటే చిన్నగా, పెద్దగా అనుకుంటే కొండంతగా అనిపిస్తాయి. అయితే దీన్ని అధిగమించడానికి ఒక అద్భుత మార్గం ఉంది. అదే వర్తమానంలో జీవించడం. ఇది వినగానే కొందరికి నవ్వు రావచ్చు. మరికొందరు ఆలోచనలో పడిపోవచ్చు. కానీ అదే నిజం. భయాలు అన్నిటికి తరువాత, రేపు, జరిగిపోయిన గతం అనేవి 90% కారణాలుగా ఉంటున్నపుడు వాటిని గూర్చి వదిలి కేవలం వర్తమానం గురించి ఆలోచించడం చాలా గొప్ప పరిష్కారం కదా. మరి వర్తమానంలో భయం ఉండదా?? వర్తమానం గురించి భయం వేయదా?? అని ఎవరైనా అనుకోవడం కూడా పరిపాటే. అయితే వర్తమానంలో, కేవలం ఉన్న క్షణాలలో జీవించడం అంటే మనం చేస్తున్న ఏ పనిలో అయినా పూర్తి స్పృహాతో ఉంటూ దాన్ని పూర్తి చేయడం. ఇలా చేయడం వల్ల ఆ పని మీదనే ఏకాగ్రత పెరిగి 100% ఆ పనికి న్యాయం చేయగలుగుతాం. కాబట్టి మన శక్తిసామర్ధ్యాల మీద మనకు శంక అవసరమే ఉండదు. భయం అనే రాక్షసి మంత్రమేసినట్టు మాయం అవుతుంది మన జీవితాల్లో నుండి.  కాబట్టి భయాన్ని జయించే మంత్రం అయిన వాస్తవంలో జీవించడాన్ని మిస్సవకండి. లేకపోతే మీ క్షణాలు అన్ని గతంలోకి చూసినపుడు పనికిమాలినవిగా కనబడతాయి. ◆ వెంకటేష్ పువ్వాడ  

మాటని ఒకే మాటని.. నీతోనే ఉంటానని…

◆ప్రామిస్ డే◆   ఓ మనిషికి నమ్మకాన్ని ఇవ్వడం, ఆ నమ్మకంతో భరోసా కల్పించడం ఈ ప్రపంచంలో చాలా గొప్ప విషయం. అయితే ఆ నమ్మకం ఇతరుల్లో ఎట్లా కల్పిస్తారు?? అది ఎదుటివారికి ఎలా ధైర్యాన్ని ఇస్తుంది??  వాలెంటైన్స్ వీక్ లో భాగంగా అయిదవ రోజును ప్రామిస్ డే గా జరుపుకుంటారు. మీ భాగస్వామి పట్ల మీకున్న అభిమానం, ప్రేమ ఎంత గొప్పదో.. వారికి మీ జీవితంలో ఎలాంటి స్థానం ఉందో తెలియజేసి వారితో ఎప్పటికీ ఉంటానని వాగ్దానం చేయడం ఈ ప్రామిస్ డే లో ఉన్న ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11 వ తేదీన ప్రేమికుల నుండి, ప్రేమలో ఉన్న  భార్యాభర్తల వరకు అందరూ ప్రామిస్ డే ని సెలెబ్రెట్ చేసుకుంటారు. ఇందులో భాగంగా తమ జీవిత భాగస్వామితో బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవడం, బంధాన్ని మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా సాగేలా చేయడం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా జీవితంలో భాగస్వామి తమకు ఎంతో ముఖ్యమని చెప్పడమే ఇక్కడ ప్రధానాంశం. జీవితాంతం తోడు నిలిచేది ఒక్క జీవన సహచరులే.. అందుకే జీవితంలో తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నా జీవిత భాగస్వాములకు అంత ప్రాధాన్యత ఉంది.    ప్రామిస్ ప్రాముఖ్యత.. బంధంలో ఉన్నప్పుడు నమ్మకం ఇస్తే ఆ బంధం పదిలంగా ఉంటుంది. అంటే.. నమ్మకం అనేది బంధాలకు పునాది లాంటిది. జీవితంలో భాగస్వాములకు ఎన్నో వాగ్ధానాలు చేస్తుంటాం. కొన్నిసార్లు వాటిని విస్మరిస్తుంటాం. అయితే ఈ ప్రామిస్ డే రోజును వాటిని క్లియర్ చేసి భాగస్వామి కళ్ళల్లో మెరుపును, పెదవుల మీద చిరునవ్వును చూడగలిగితే.. ఒక భాగస్వామిగా మీరు సఫలం అయినట్టే.. ఒకరి పట్ల మరొకరు చూపించే అనురాగం వెలకట్టలేనిదే.. అలాగే మాట ఇవ్వడం ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో.. ఆ మాట తప్పడం వల్ల జీవిత భాగస్వాములు ఎంత డిజప్పాయింట్ అవుతారో కూడా అలాంటి సందర్భాలలో స్పష్టం అవుతుంది. వీటన్నింటినీ పక్కన పెడితే.. ఇలాంటి చిన్న చిన్న మాట ఇవ్వడాలు, తప్పడాల గురించి వదిలేస్తే.. నిన్ను నేను ఎప్పటికీ వదలను.. జీవితాంతం నీతోనే ఉంటానని మాట ఇవ్వడం ఆ మాటను నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యం.  ప్రామిస్ డే రోజు మీ భాగస్వామికి ప్రామిస్ చేయండి. మాటని ఒకే మాటని.. నీతోనే ఉంటానని.. అని ఓ రిథమ్ లో చెప్పండి..                                         ◆నిశ్శబ్ద.  

కాలాన్ని ఆదా చేసే కళ ఇదిగో!

మనిషి జీవితంలో విజయం అనేది స్థాయిని పెంచుతుంది.  సమాజంలో పేరు, ప్రతిష్టలు, గౌరవం మొదలైనవి సంపాదించి పెడుతుంది. విజయం గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. అయితే విజయం సాధించిన వ్యక్తికి మాత్రం కష్టం అంటే ఏమిటి?? కష్టం ఎలా ఉంటుంది?? కష్టం తరువాత విజయం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?? విజయ సూత్రం ఏంటి?? ఇలాంటి విషయాలు తెలిసి ఉంటాయి.  ఒక విజేతను "మీ విజయరహస్యం ఏమిటి?" అని ప్రశ్నించినప్పుడు  "నేను జీవితంలో  విజయాలు సాధించడానికి కారణం నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే హాజరు కావటమే” అని అన్నాడట! మనిషి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నా, ఎంత కష్టపడేతత్వం ఉన్నా చేసే పని ఇంకా మిగిలుందే అని కాలాన్ని పట్టుకుని ఆపలేడు. నిరంతర ప్రవాహిని లాగా కాలం అలా సాగిపోతూ ఉంటుంది. అయితే చేసే పనిపట్ల అవగాహన పెంచుకుంటే కాలాన్ని ఆదా చేయవచ్చు. నిర్ణీత సమయంలో పని పూర్తి కావాలంటే ఆ పనిని వేగంగా, సమర్థవంతంగా చేయడం ఒకటే మార్గం. చేసే పని గురించి అవగాహన పెంచుకుంటే సమయాన్ని ఆదా చేసే కళ తెలుస్తుంది. సమయాన్ని ఆదా చేయడం కూడా ఒక కళనా అని అనిపిస్తుందేమో!!  కాలాన్ని ఆదా చేయడమనే కళ!! మనం నిత్యం చేయవలసిన పనులను అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో రూపొందించుకోవాలి. ఈ ప్రక్రియనే కాలాన్ని ఆదాచేసే కళ అంటారు. క్రమపద్ధతిలో రూపొందించుకోవడం అంటే ప్రతిరోజూ చెయ్యాల్సిన పనులను సమయ ప్రణాళిక వేసుకుని ఒక పట్టిక రూపొందించుకోవడం. అయితే ఇలా రూపాందించుకోవటంతోనే సమేక్మ్ ఆదా అయిపోదు. రూపొందించుకున్న ప్రణాళికను ఆచరణలో పెట్టాలి. ఆచరించినప్పుడే సరైన ఫలితం. దక్కుతుంది.   “నిన్న జరిగిన దానిని గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఈ రోజు కూడా వృధా చేసుకోవటం నిరర్ధకం. నిన్నటికంటే ఈరోజు మనిషిలో ఆలోచనాపరంగా బుద్ధి వికాసం కలగాలి. అలా కలగకపోతే  మన జీవితంలో మరొక రోజు వ్యర్ధమవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. ఈరోజు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎంత గొప్పగా, ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటాం అనేది మన ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది.  గడిచి పోయిన క్షణాలు తిరిగిరావు, అలాంటప్పుడు గడిచిపోయిన కాలంలో ఎలాంటి బాధపెట్టే విషయాలు ఉన్నా వాటిని తలచుకుంటూ బాధపడకూడదు.  ఏపుగా పెరిగిన పైరుని కోయకపోతే దాని పరమార్ధం దెబ్బ తింటుంది. అలాగే వికసించిన పూలను కోసుకోకపోతే వాటి ప్రయోజనమే దెబ్బ తింటుంది. అదే విధంగా వయస్సులో ఉన్నప్పుడే కష్టపడాలి. ఎందుకంటే ఆలస్యమయితే కాలం మన చేతిలో ఉండదు. గడిచిపోయే ప్రతి నిమిషం తన విలువను గుర్తుచేసే సందర్భాలు భవిష్యత్తులో అప్పుడప్పుడూ ఎదురవుతాయి. ఆ సందర్భాలలో " అయ్యో!! అప్పుడు ఆ కాలాన్ని అలా వృధా చేయకపోతే ఇప్పుడు ఇలా కలలను కోల్పోయి ఉండను కదా!!" అనుకునేలా ఉంటుంది మనసు పరిస్థితి. ఈ సెకను, ఈ నిమిషం, ఈ రోజు నాది. నేను ఏ పనినైనా చేయగలను అనుకునేవాడిదే ఈ ప్రపంచం. కాలానికి ఎదురుపడి ప్రయాణం చేసేవాడే విజేత. ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది అనే విషయం మర్చిపోకూడదు. కాలాన్ని సరిగా అర్ధం చేసుకున్నవాడే జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలడు.  మనం నిమిషాల గురించి జాగ్రత్త పడితే గంటలు అవే జాగ్రత్త పడతాయి. రూపాయలను పొదుపుచేస్తే వేలు అయినట్టు, కాలం ఆ విధంగానే పొదుపు అవుతుంది. కాలాన్ని దుర్వినియోగం చేసుకునే వారు ఎప్పుడూ పరాజితులుగా మిగిలిపోతారు. మరికొందరు పరాజయానికి, కాలం వృధా అవ్వడానికి సాకులు వెతికి వాటిని చూపిస్తుంటారు. వాటివల్ల ఇతరులను నమ్మించగలరేమో కానీ అలా తనని తాను మభ్యపెట్టుకోవడం తనని తాను మోసం చేసుకోవడం అవుతుంది. దానివల్ల ఇతరులకంటే అలా సాకులు చెప్పేవారికే నష్టం. అందుకే   ప్రతి ఒక్కరూ కూడా కాలాన్ని ఆదా చేసే కళ నేర్చుకుంటే జీవితంలో విజేతలుగా గుర్తించబడతారు.                                        ◆నిశ్శబ్ద.

క్షమించేద్దామా!!

తప్పు చేసిన వారిని, నొప్పించిన వారిని పెద్ద మనసుతో క్షమించడం ఎంతో గొప్ప విషయం. ఇది ఇప్పుడు చెబుతున్న మాట కూడా కాదు. ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుండి పెద్దలు చెబుతున్న మాట. ఇంకా చెప్పాలంటే మన పురాణాల నుండే ఈ క్షమాగుణాన్ని నలుగురికి తెలిసేలా చేయడం మొదలయ్యింది.  ప్రతి మనిషి తన జీవితంలో ఎవరో ఒకరి వల్ల బాధపడుతూ ఉంటాడు. ఆ బాధలో నుండి కోపం పుట్టుకొస్తుంది. కోపంలో నుండి ఆ మనిషి మీద వ్యతిరేక భావం పుడుతుంది. ఆ వ్యతిరేక భావం కాస్తా శత్రుత్వంగా మారిపోతుంది. ఇలా ఒక నిర్దిష్ట దశలలో మనుషుల మధ్య ఏర్పడే గొడవలు, లేదా చిన్న చిన్న తగాదాలు క్రమంగా శత్రుత్వం వరకు దారి తీయడం అంటే మనుషుల మధ్య అర్థం చేసుకునే గుణం తక్కువ ఉందనే చెప్పాలి. మాటా మాటా కారాదు తూటా!! ఇంట్లో సాధారణంగా భార్యాభర్తలు, ఇంకా పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక విషయంలో కచ్చితంగా గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ ఎలాంటిదంటే ఒకరు ఎడ్డేమంటే ఇంకొకరు తెడ్డెమంటూ ఉంటారు. ఎవరో ఒకరు మాత్రమే కాస్తో కూస్తో ఆలోచించే మైండ్ సెట్ కలిగి ఉంటారు. అవతలి వాళ్ళ మొండితనం తెలిసి వాళ్ళతో ఇక వాదులాట ఎందుకు అని వదిలేయాలి. నిజానికి ఇలా వాధించే వాళ్ళతో, మనల్ని నొప్పించిన వాళ్ళను క్షమించేసేయ్యడం అంటే మనం తగ్గిపోవడం కాదు, అవతలి వాళ్లకి భయపడటం అసలే కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.  కాబట్టే ఏదైనా తప్పు జరిగినప్పుడో, గొడవ జరిగినప్పుడో మాటకు మాట పెంచుకుంటూ పోవడం కంటే దాన్ని మొదలులో తుంచేయడం మంచిది. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు!! తప్పులు చేయడం అందరూ చేస్తారు. ఆ తప్పులను అందరూ గమనిస్తారు. అయితే ఆ తప్పులను అదేపనిగా ఎత్తిచూపేవారు కొందరు ఉంటారు. మూర్ఖుల లిస్ట్ లో ధీమాగా నిలబడదగిన వాళ్ళు వీళ్ళు. ఎప్పుడూ ఇతరులను చూస్తూ వాళ్ళ తప్పులు గురించి మాట్లాడటమే కానీ తాము చేస్తున్న తప్పులను విశ్లేషించుకునే తీరికా ఓపిక అసలు ఉండవు వీళ్ళకు.  ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటే బుర్ర పాడు అవ్వడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. క్షమించడానికి కావాలి కాసింత ఓర్పు, నేర్పు!! నిజంగా నిజమే. ఎదుటి వారు నొప్పిస్తే దాన్ని మనసులో ఎంతో లోతుకు తీసుకుని వాళ్ళను తిరిగి ఏమి అనకుండా క్షమించడం గొప్ప విషయం. ఎదుటి వారి ప్రవర్తనను భరించడానికి, ఆ తప్పు తాలూకూ నష్టం మానసికం అయినా, ఆర్థికపరం అయినా దాన్ని భరించడానికి ఎంతో ఓర్పు కావాలి. తరువాత ఆ తప్పు తాలూకూ విషయాలు మళ్లీ మళ్లీ ప్రస్తావనకు తీసుకురాకుండా, అదే వ్యక్తులతో ఆ విషయం గురించి ఎలాంటి చర్చా లేకుండా గడపడమనే నేర్పు కూడా కలిగి ఉండాలి. విలువ కోల్పోకూడదు!! కొందరుంటారు. తప్పు చేసిన వాళ్ళను క్షమిస్తారు. అయితే ఆ ఎదుటి వారికి ఆ క్షమాగుణం గొప్పదనం అర్ధం కాదు. వాళ్ళేదో తోపు అయినట్టు. వాళ్లను ఏమీ అనలేమనే కారణంతో క్షమించిన వాళ్ళను తక్కువ చేసి చూస్తుంటారు. దీని పలితం ఎలా ఉంటుంది అంటే మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తూ, ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం అనుభవిస్తారు వాళ్ళు. కేవలం క్షమాగుణం వల్ల ఇలా సఫర్ అవ్వడం చాలా మంది జీవితాలలో గమనించవచ్చు కూడా. అందుకే ఆ క్షమాగుణానికి కూడా ఒక పరిధి అంటూ ఉండాలి. మాటి మాటికి తప్పులు చేస్తూ వాళ్ళు, వాళ్ళను క్షమిస్తూ ఎదుటివాళ్ళు ఇలా అయితే ఆ తప్పులు చేసేవాళ్ళు ఎప్పటికీ ఒక మంచి మార్గాన్ని తెలుసుకోలేరు మరియు దాన్ని ఫాలో అవ్వలేరు. అందుకే క్షమించడం గొప్ప విషయం.  క్షమించేవారిని గౌరవించకపోతే ఎంతో పెద్ద తప్పు చేసినట్టే.  ◆ వెంకటేష్ పువ్వాడ  

నమ్మకానికి ఉన్న శక్తి ఎలాంటిదో తెలుసా?

నమ్మకం లేకుండా ఈ సృష్టే లేదుకదా?!  మనిషి తన జీవితంలో ఏమి చేయాలన్నా నమ్మకమే ప్రముఖ పాత్ర పోషిస్తుంది.నమ్మకం ఉంటే ఎంతటి పనిని అయినా చేయడానికి నడుం బిగిస్తారు. అదే నమ్మకం లేకపోతేనో… ఆలోచించండి. నమ్మకం లేకుండా ఈ ప్రపంచంలో ఎలాంటి విజయమైనా, ఎలాంటి విషయాలైనా జరుగుతాయా? ఆలోచించండి. నమ్మకం అనేది ఈనాడు మరో ప్రతిసృష్టినే చేయగలదు. మంచినీ, చెడునీ రెండింటిని చేయగలదు. కానీ ! మనం మంచిని మాత్రమే నమ్ముదాం. గెలుపును మాత్రమే నమ్ముదాం... అద్భుత విజయం మనకు చేకూరబోతుందని నమ్ముదాం. ఇలా చేయడం వల్ల మనిషి తన జీవితంలో తాను ఎంతో అత్యున్నత స్థాయికి ఎదగగలడు. మాటల్లో చెప్పినంత, వందకు వంద శాతం కాకపోయినా కనీసం మనిషి ఆశించిన మేరకు సాధించగలడు.   ఒక నెలలో కోటి రూపాయలు సంపాదించాలని అనుకుంటున్నారా! మీరు మీ సొంత విమానంలో దేశదేశాలూ తిరగాలని అనుకుంటున్నారా! ప్రపంచంలోనే గొప్ప వ్యాపారవేత్త కావాలని అనుకుంటున్నారా! ఇవన్నీ... ఎటువంటి సందేహం  లేకుండా... నిస్సంకోచంగా ఎవరైనా, ఎలాంటి వారైనా... ఎంత పేదవారైనా, ధనికులైనా సాధించరు. కానీ ఒక్క విషయం... మీరు అది చెయ్యలేనేమో ... ఇది సాధ్యమేనా అని ఆలోచనలను బలవంతంగా తుడిచివేసి... నూటికి నూరుపాళ్ళు నేను చెయ్యగలను అని నమ్మండి. ఈ నమ్మకమే ఎంతటి అసాధ్యమునైనా సాధింపజేస్తుంది. ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్న వారు, పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించినవారిలో స్వంతంగా ఎదిగినవారు బోలెడు మంది ఉన్నారు. వారందరూ మనవల్ల ఏమవుతుందిలే… అనుకుని ఉంటే ప్రస్తుతం ఆ స్థాయికి చేరగలిగేవారా?? నమ్మకం అందరిలోనూ ఒకటే కదా… ఒక్కొక్కరికి ఒకో విధమైన మెదడు ఇవ్వలేదు ఆ భగవంతుడు. కానీ మనిషి ఆలోచనే వెరైపోతోంది… ఈ సృష్టినే సృష్టించగల నమ్మకం... మీకు  విజయాన్ని ఇవ్వలేదా? నమ్మండి. బలవంతంగానో లేక ఇష్టంగానో లేక నమ్మకంగానో  మొత్తానికి నమ్మకాన్ని మనసులో బలంగా నాటుకొండి.  మీరు నమ్మడం వలన కలిగే లాభం ఏంటో తెలుసా...! మీరు కోరుకున్న మహోన్నత విజయం.. మీకు లభిస్తుంది. మీరు ఎందుకు ఈ విషయాలను నమ్మాలంటే... ఒక నమ్మకం పనిచేసే తీరును మీకు వివరిస్తుంది. మీ విజయానికి కావాల్సిన శక్తిని, నేర్పును, మార్గాలను మీకు  చూపిస్తుంది. నేను గొప్పగా మారగలను అనే నమ్మకమే... మీరెలా మారాలి అనే దారిని చూపిస్తుంది. విజయం సాధించడానికి మార్గాలను ఏర్పరుస్తుంది. ఎంతటి విజయాన్నైనా సాధించడానికి కావాల్సిన అత్యవసరమైన అతి ముఖ్యమైన మొట్టమొదట అర్హత ఏంటో తెలుసా... "నేను సాధించగలను" అని నమ్మడం.  నమ్మకానికి అపరిమితమైన శక్తి ఉంది. అది మిమ్మల్ని ఎంత ఎత్తుకైనా చేరుస్తుంది. ఎంతో శ్రమకోర్చి... ఎన్నో అనుభవాల నుంచి, మరెందరో విజేతల జీవితాల నుండి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఎందరో విజయవంతుల జీవితాల్లోని ప్రతి మాటా ప్రతి విషయమూ సూటికి నూరుపాళ్ళూ మీకు విజయం చేకూర్చడానికి... ఉద్దేశించబడిందే. అయితే నమ్మకంతో మీ మనసు చెప్పే మాటను మనస్ఫూర్తిగా నమ్మడం మొదలు పెట్టండి... ఖచ్చితంగా... మీరు మారడం మొదలు పెడతారు. విజయం సాధించేదాకా వెనుదిరగరు. “ఎందుకంటే నమ్మకమే విజయం" “సందేహమే ఓటమి" ఈ విషయాలు మరవకండి.                                     ◆నిశ్శబ్ద.

మనిషికి, డబ్బుకు మధ్య సంబంధం!

“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు. మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు. మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే. కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు. నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా. " ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు.  బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు. "కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా. "అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు.  బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు. "ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు. "ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు.  "నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు "అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా.  "అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను. అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు.. “సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా. ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు.                                           ◆నిశ్శబ్ద.

మనిషిలో విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా?

అనగనగా ఓ రాజ్యం ఉండేది.  ఆ రాజ్యానికి ఓ రాజున్నాడు, రాణి కూడా ఉంది. ఆ రాజ్యంలో ఓ సన్యాసి కూడా ఉన్నాడు. ఆ సన్న్యాసి ప్రత్యేకత ఏమిటంటే, అతడు అబద్ధం వినలేడు. అబద్ధం ఆయన చెవిన పడిన వెంటనే అది అబద్దం అని ఆయనకు తెలిసిపోతుంది. దాని కారణం వల్ల ఆయన తన తల మీదున్న ఓ వెంట్రుకని లాగి పడేసేవాడు. అది ఆయనకు అలవాటో లేక అది అందులో ఏదైనా రహస్యం ఉందొ ఎవరికీ తెలీదు. కానీ అలా అబద్దం వినగానే వెంట్రుక లాగి పడేయడం ఆ రాజ్య రాజుకి తెలిసింది. ఆయన గొప్ప సన్యాసి అనే కారణంతో పట్టణం పొలిమేరల్లో ఉన్న వనంలో ఓ ఆశ్రమం కట్టించి ఇచ్చాడు రాజు.  అయినా సరే, ఏవో అబద్ధాలు ఆయన చెవిన పడుతూనే ఉన్నాయి. ఆయన వెంట్రుకలు పీక్కుంటూనే ఉన్నాడు. చివరికి ఆయన తలపై ఒకే వెంట్రుక మిగిలింది. అదొక్కటే పోతే ఆయన మరణిస్తాడు అని తెలిసి ఆ సన్యాసి ఉంటున్న ఆశ్రమ పరిసరప్రాంతాలలో ఎవరూ మాట్లాడకూడదని ఆజ్ఞ జారిచేసాడు రాజు. రాజు ఆజ్ఞ ప్రకారం అక్కడ ఎవరూ తిరిగేవారు కాదు, ముఖ్ట్లాడేవారు కూడా కాదు.  పట్టణం పొలిమేరలో ఆశ్రమానికి పక్కనే ఒక తోట ఉంది. అది రాజుగారి తోట. ఓ రోజు రాజు, రాణి తోటలో విహరిస్తున్నారు. శృంగారసరససల్లాపాలు ఆడుతున్నారు. రాణి మీదకు ఓ పువ్వు విసిరాడు రాజు, ఆ దెబ్బకు తట్టుకోలేక పడి పోయినట్టు నటించింది రాణి. వెంటనే రాజు ఆమెకు ఉపశమనాలు చేయటం ప్రారంభించాడు. ఇంతలో రాజుకు 'హుం'కారం వినిపించింది.  "అంతా అబద్ధం నటన!" అంటూ అరుస్తూ రాజు, రాణి ఉన్నచోటుకు వచ్చాడు సన్న్యాసి. "నాకు తెలుసు, రాణికి దెబ్బ తగలలేదు. అంత సుకుమారి కాదామె!" అని అరచి, తలమీద ఉన్న ఒక్క వెంట్రుక పీకేసుకుని అక్కడే పడి మరణించాడు సన్న్యాసి. జరిగిందానికి రాజు విచారించాడు. ముఖ్యంగా సన్న్యాసి విచక్షణరాహిత్యానికి మరింత విచారించాడు. ఎందుకంటే, రాణిది నటనే అయినా శృంగార సమయంలో అది చెల్లుతుంది. ఇది అర్థం కాని సన్న్యాసి మాటల అర్థం వెంట పడ్డాడు కానీ సందర్భాన్ని పట్టించుకోలేదు. సందర్భాన్ని బట్టి మనుషుల మాటల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలనేది ఇక్కడి విషయం. పిల్లలకు బ్రహ్మభావన వివరించేటప్పుడు ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాలి. "ప్రపంచమంతా బ్రహ్మమయం" అన్న భావనను అపార్థం చేసుకునే  మూర్ఖులు ఉన్నారు ఈ ప్రపంచంలో.  ప్రపంచమంతా బ్రహ్మమయమై, అంతా ఆయన ఇష్టప్రకారం జరిగితే మనం చేసేదేం లేదు. అంతా కర్మప్రకారం జరుగుతుందని చేతులు ముడుచుకుని కూర్చునే ప్రయత్నాలు చేస్తారు కొందరు. అబద్ధాల విషయంలో సన్న్యాసి ప్రదర్శించిన మూర్ఖత్వం లాంటిదే ఇది కూడా. కాబట్టి సృష్టికర్తపై మనుషులకు ఉన్న విశ్వాసం ఆ వ్యక్తిలో శక్తిలా ఎదగాలి తప్ప, బలహీనతలా మారకూడదు. బలహీనతలా ఎలా మారుతుందో మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం నిజజీవితంలో వాటిని  అనుభవిస్తూనే ఉంటాం కూడా.. దాన్ని శక్తిగా మార్చుకోవడమే మనుషుల్లో ఉండాల్సిన గుణం.                                     ◆నిశ్శబ్ద.

డిప్రెషన్‌ వల్ల ఓ ఉపయోగం ఉంది!

పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు... అంటూ మనకి ఓ వేమన పద్యం ఉంది. ఆరంభింపరు నీచ మానవులు... అంటూ భర్తృహరి సుభాషితంలో ఉన్న పద్యాన్నీ వినే ఉంటాము. ఏతావాతా తేలేదేమిటంటే- కార్యసాధకుడనేవాడు ఒక పనిని మొదలుపెట్టాక, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడడు. ఆరు నూరైనా సరే తన లక్ష్యాన్ని సాధించి తీరతాడు. ఇదంతా వినడానికి చాలా బాగుంది. పైగా భౌతిక విజయాలే కీలకమైన ఈ పోటీ ప్రపంచంలో పట్టుదల కలిగినవారిదే పైచేయి అన్న వాదనా వినిపిస్తోంది. కానీ...   డిప్రెషన్‌తో కూడా లాభం ఉంది జర్మనీలోని ‘University of Jena’కు చెందిన సైకాలజిస్టులు డిప్రెషన్ వల్ల కూడా ఓ ప్రయోజనం ఉందని వాదిస్తున్నారు. కొంతమంది తమకు పొంతన లేని లక్ష్యాలను ఎన్నుకొని, వాటిని సాధించలేక క్రుంగుబాటుకి లోనవుతుంటారనీ... ఆ క్రుంగుబాటులోంచే వారికి తమ పొరపాటు అర్థమవుతుందనీ తేల్చి చెబుతున్నారు. తాము ఎన్నుకొన్న లక్ష్యంలోనే పొరపాటు ఉందని తేలిపోయాక, తమకు సాధ్యమయ్యే లక్ష్యాలనే ఎంచుకుంటారని అంటున్నారు. అంతేకాదు! దేని కోసం ఎంతవరకు ప్రయత్నించాలి? అనే విచక్షణ కూడా వారికి క్రుంగుబాటుతో అలవడుతుందట.    వదులుకునే విచక్షణ తమ వాదనలో ఎంత వరకు నిజం ఉందో తేల్చుకునేందుకు సదరు సైకాలజిస్టులు ఓ పరిశోధనను చేపట్టారు. ఇందుకోసం అటు డిప్రెషన్‌తో బాధపడుతున్నవారినీ, ఇటు ఆరోగ్యంగా ఉన్నవారినీ ఎన్నుకొన్నారు. వారందరికీ కొన్ని గజిబిజి పదాలను (jumbled words) అందించారు. అంతవరకూ బాగానే ఉంది. పనిలో పనిగా కొన్ని అసాధ్యమైన పదాలను కూడా అందించారు. అంటే వాటిని ఎంతగా ప్రయత్నించినా కూడా ఒక అర్థవంతమైన పదం రాదన్నమాట! మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు జవాబు లేని పదాలను కూడా సరిచేసేందుకు పట్టువిడవకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారట. కానీ డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులు కాసేపు ప్రయత్నించిన తరువాత, ఇక తమవల్ల కాదు అన్న అనుమానం వస్తే వాటని పక్కన పెట్టేయడాన్ని గమనించారు. పట్టువిడుపులు ఉండాలి.   పట్టివిడువరాదు అన్న సూక్తి ప్రతి సందర్భానికీ వర్తించదు అన్నది నిపుణుల మాట. మన అవకాశాలకీ, లక్ష్యానికీ మధ్య అంతులేనంత అగాధం ఉన్నప్పుడు ఒక స్థాయిలో దానిని విడిచిపెట్టేయడం మంచిదంటున్నారు. అందుకే ఈసారి ఎవరన్నా క్రుంగుబాటుతో సతమతమవుతూ ఉంటే, ముందు వారి లక్ష్యాలను కూడా విచారించాలని సూచిస్తున్నారు. - నిర్జర.

డబ్బు సంపాదించే ఉపాయం చెప్పిన చాణక్యుడు..!!

చాణక్యుడి పేర్కొన్న అనేక అంశాల్లో డబ్బు ఒకటి. మన జీవితంలో డబ్బు ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని చాణక్య నీతిలో స్పష్టంగా వివరించారు. చాణక్యుడి విధానంలో, 'ధనమే మతాన్ని అనుసరించేవాడు'. ఎవరైతే డబ్బును సరైన మార్గంలో వినియోగిస్తారో...వారు మతాన్ని కూడా మంచి మార్గంలో అనుస్తారిస్తారని తెలిపారు. చాణక్యుడు చెప్పినట్లుగా మనం డబ్బును ఎలా ఉపయోగించాలి? సరైన మార్గంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభం పొందగలము. ధనం జనం పరిత్రయ: మనం సరైన మార్గంలో ధనాన్ని ఉపయోగించినప్పుడే..అది సమాజ శ్రేయస్సుకు ఉపయోగించినట్లు అర్థం. తప్పుడు పనులు చేయడానికి లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి డబ్బు ఖర్చు చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి లేదా సమాజానికి మాత్రమే ఇబ్బంది లేదు. దీనితో మీరు సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. మంచి మార్గంలో సంపాదించడం: మనం మంచి మార్గాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించాలి. చెడు లేదా హింసాత్మక మార్గాల ద్వారా సంపాదించిన లేదా సంపాదించిన డబ్బు మనకు సంతోషాన్ని లేదా సంతృప్తిని ఇవ్వదు. మీరు స్వచ్ఛమైన మార్గాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బును మంచి పనుల కోసం ఉపయోగించాలి. కష్టపడి సంపాదించాలి: మనం ఎప్పుడూ కష్టపడి సంపాదించాలి. కష్టపడి సంపాదించిన లేదా కష్టపడి సంపాదించిన డబ్బుతో మనం ఏ పని చేసినా, దాని నుండి మనకు మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి డబ్బు మాత్రమే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు తప్పుడు మార్గాల ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ, ఇది ఈరోజు కాదు రేపు మీకు సమస్య తీసుకురావడం ఖాయం. ధనభావానాం అపి స్వధర్మ నాశః మితిమీరిన కోరికలు, సంపాద...మీ స్వధర్మాన్ని నాశనం చేస్తుంది. డబ్బు సంపాదించాలన్న మితిమీరిన కోరిక అధర్మం వైపు నడిపిస్తుంది. దీంతో జీవితంలో ఎన్నో సమస్యలు తప్పవు. కాబట్టి.., డబ్బు సంపాదించాలనే మితిమీరిన కోరికను వదిలివేయడం మంచిది. ధనాని పూజ్య నరః వంటిది: అంటే ధనవంతులకు సమాజంలో ఎప్పుడూ గౌరవం ఉంటుంది. డబ్బు లేదా సంపద ఉన్నవారిని సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది. అలాంటి వ్యక్తులు చాలా సులభంగా గౌరవం మరియు కీర్తి పొందుతారు. దానేన విత్తం వినీతం: వినయంతో డబ్బు సంపాదించండి. తెలివిగా ఉపయోగించుకోండి. ఇలా డబ్బును వినియోగించినప్పుడే దానికి అర్థం ఉంటుంది.  ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేయడం మానేయండి.

పిల్లలకు తల్లిదండ్రులు చేస్తున్న లోటు ఇదే!

తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు ఇది అవసరం అని ఆలోచిస్తూ.. ఎన్నెన్నో ఇస్తుంటారు. కానీ వాళ్లకు లోటుగా ఉన్నదేంటి అని ఆలోచించరు. తత్త్వవేత్త ఖలీల్ జిబ్రాన్ అంటాడు... Children through you, But not to you.... పిల్లలు మీ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయమయ్యారే కానీ, మీ నుంచి కాదు. వారి రాకకు మీరు వారధులు మాత్రమే. ఈ నిజాన్ని భరించాలంటే తల్లితండ్రులకు కఠినంగానే ఉంటుంది. అయితే ఈ సార్వత్రిక సత్యాన్ని విశ్వసిస్తే ఎలాంటి ఆందోళన, ఆవేదన లేకుండా పిల్లల్ని తీర్చిదిద్దగలరు. భగవంతుడు నిర్దేశించిన లక్ష్యానికి మీ పిల్లల్ని బాణాల్లా సంధించే ప్రయత్నంలో మీరు ధనుస్సులు మాత్రమే. ధనుస్సు నిఖార్సుగా ఉంటేనే బాణాన్ని పదునుగా వినరగలదు లక్ష్యానికి. అందుకే మిమ్మల్ని మీరు ఉన్నతంగా, విశాలంగా తీర్చిదిద్దుకోవాలి.. ప్రశాంతంగా, పొదరిల్లుగా ఇంటిని తీర్చిదిద్దాల్సింది తల్లితండ్రులే. ఏడిపించే సీరియళ్లు చూస్తూ తల్లి... ఏ ఇంక్రిమెంట్ల గురించో మాట్లాడుకుంటూ తండ్రి... ఉంటే పిల్లలు అన్నం కోసం తప్ప ఆత్మీయత కోసం ఇంటికిరారు. అర్ధరాత్రి పుట్టిన క్షణం నుంచి అష్టకష్టాలు పడ్డాడు శ్రీకృష్ణుడు... అయినా చెక్కిలిపై చిరునవ్వును చెదరనీయని స్థితప్రజ్ఞుడు. అందుకే భగవద్గీత బోధించిన భగవానుడాయన. ఆ సమత్వభావనే, ఆ ధీరోదాత్తతే ప్రతీ తండ్రీ పుణికిపుచ్చుకోవాలి. తలలు తెల్లపడటమో, ముఖం ముడతలు పడటమో పెద్దరికం కాదు. సుఖదుఃఖాల్ని, లాభాలాభాల్ని, జయాపజయాల్ని సమంగా స్వీకరించడమే ఎదుగుదల. పిల్లల ముందు మీరు నవ్వుతూ ప్రశాంతంగా  కనిపిస్తూ.. నిశ్చల తటాకంలా నిలబడి చూస్తే.. పిల్లలు ఎంత సంతోషపడతారో అర్థమవుతుంది. ఇంట్లో తమ సమస్యల్ని అర్థం చేసుకోటానికి గురువుల్లాంటి స్నేహితులయిన తల్లితండ్రులు పక్కనుండాలని ప్రతీ బిడ్డా కోరుకుంటుంది. బడి పాఠాలే కాదు, బ్రతుకు పాఠాలూ ముఖ్యమే... ఈనాటి పిల్లలకు బడి పాఠాలకేమి కొదవలేదు. వచ్చిన కొరతంతా బ్రతుకు పాఠాలకే. కుటుంబంలోనే ఆ పాఠాలు వల్లె వేయించాలి. వినయం లేని విద్య శోభించదని, విలువలు లేని ఎదుగుదలకు విలువే లేదని, ఇచ్చే బాధ్యత తెలియని చేతికి పుచ్చుకునే హక్కూ లేదని, మనం పైకి రావాలంటే పక్కవాడు పడిపోవాల్సిన అవసరం లేదని.. ఇలా అన్నీ చెప్పాల్సింది అమ్మానాన్నలే. పిడికెడు అటుకులు పెట్టినందుకే మిత్రుడికి పసిడివరాలు కురిపించిన కృష్ణుడు... పితృవాక్య పరిపాలన కోసం పడరాని కష్టాలు పడ్డ రాముడు... బిడ్డల బ్రతుకు పాఠాల్లో పరిచయమైతే వారు ఆణిముత్యాలై వెలుగుతారు. అందుకే కనీసం రాత్రి భోజనమైనా పిల్లలతో కలసి చేయాలని చెప్పేది... ఓ మంచి కథని గోరుముద్దలతో కలిపి తినిపించిన్నప్పుడు ఆ ఫలితం ఎంత మధురంగా, మహత్తరంగా ఉంటుందో స్వామి వివేకానంద మాతృమూర్తి భువనేశ్వరీ దేవికి తెలుసు, కలామ్ కన్నతల్లి ఆషియమ్మకు తెలుసు. ఇవి ప్రతి తల్లిదండ్రి తెలుసుకుని తీరాలి.                                 ◆నిశ్శబ్ద.