పిల్లలలో పరీక్షల ఒత్తిడి తగ్గాలంటే ఇలా చేయండి..!
సాధారణంగా కొత్త ఏడాది మొదలయ్యిందంటే పిల్లలలో ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రులకు కొత్త టెన్షన్ మొదలవుతుంది. దీనికి కారణం పిల్లల చదువుల ఏడాది ముగింపు చాలా దగ్గరకు వచ్చేయడమే.. సిలబస్ పూర్తీ చేయాలి, అన్ని విషయాలు బాగా నేర్చుకోవాలి, పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలి. పిల్లలు తమ ప్రతిభ నిరూపించుకుంటేనే తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. తమ పిల్లలను మరింత మంచి స్కూలు, కాలేజీలో చేర్పించడానికి ఆసక్తి చూపుతారు. వీటన్నింటి మధ్య తల్లిదండ్రులు ఎంత టెన్షన్ అనుభవిస్తారో.. పిల్లలు అంతకంటే ఎక్కువ టెన్షన్ అనుభవిస్తారు. ఈ ఒత్తిడి లేకపోతే పిల్లలు కనీసం తాము చదువుకున్న దాన్ని అయినా ఎలాంటి గందరగోళం లేకుండా రాసి మార్కులు తెచ్చుకోగలుగుతారు. ఒత్తిడి తగ్గడానికి చేయాల్సిన పనులివే..
క్రమం తప్పకుండా వ్యాయామం..
పిల్లలలో ఒత్తిడి తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయించాలి. ఏరోబిక్స్, రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి సులువైన వ్యాయామాలు కనీసం ఉదయం సమయంలో 30నిమిషాలు చేసేలా చూడాలి. శారీరక శ్రమ అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును రిలాక్స్ చేస్తుంది.
ఆహారం..
పిల్లలకు సమతులాహారం ఇవ్వడం తప్పనిసరి. చదువు పేరుతో ఆహారన్ని కూడా స్కిప్ చేస్తే అది మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండేలా చూడాలి. చేపలు, తృణధాన్యాలు వంటి పోషకాలు ఆహారంలో ఇవ్వాలి.
నిద్ర..
చదువు పేరుతో పిల్లలను నైటౌట్లు చేయించడానికి అస్సలు అనుమతించకూడదు. ప్రతిరోజూ రాత్రి 10 గంటల తరువాత పిల్లలు నిద్రపోయేలా చూడాలి. ఉదయం 5గంటలకు లేచి చదువుకునేలా ప్రోత్సహించాలి. ఇంకా ముందే నిద్రపోయి మరింత ముందే నిద్రలేచినా మంచిదే. కానీ నిద్ర వేళలు, నిద్ర నుండి మేల్కొనే వేళలు తప్పకుండా ఫాలో అయితే పిల్లలకు సహజంగానే చదువుకోవడం మీద ఆసక్తి ఉంటుంది. చదువుకున్నది బాగా గుర్చుపెట్టుకోగలుగుతారు.
బ్రేక్..
పరీక్షలు దగ్గర్లో ఉన్నాయనే కారణంతో గంటలు, గంటలు కూర్చుని చదువుతుంటారు. అయితే ప్రతి 3గంటలకు ఒకసారి కాస్త బ్రేక్ తీసుకోవాలి. కనీసం 10 నుండి 15 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం వల్ల కళ్లకు, మనసుకు రిలాక్స్ గా ఉంటుంది. ఈ సమయంలో లోతైన శ్వాస, ధ్యానం, సంగీతం వినడం వంటివి చేస్తుంటే ఒత్తిడి తగ్గుతుంది.
పాజిటీవ్ డిస్కషన్..
పిల్లలతో పరీక్షల గురించి, మార్కుల గురించి, వారు చదువుతున్న విధానం గురించి ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి. తాము చదువుతున్న విషయాల మీద, పరీక్షలలో అడిగే విషయాల మీద ఆత్మవిశ్వాసంతో ఉండేలా చూడాలి. పిల్లలు చదువుతున్న తీరులో ఏవైనా తప్పులున్నా, సరిగా లేదని అనిపించినా పిల్లలు వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి తప్ప కసురుకోవడం, నువ్వెప్పుడూ ఇంతే, నీకేం రాదు, ఇలా ఉంటే పరీక్షలు ఏం రాస్తావు అంటూ తిట్టకూడదు.
కెఫిన్ వద్దూ..
పిల్లలు కూడా కాఫీ, టీ లు తాగుతుంటే వారిని పరీక్షల సందర్భంలో కాఫీ, టీ ల బారిన పడకుండా చూసుకోవాలి. కాఫీ, టీలు ఎక్కువగా తాగుతూ నైటౌట్లు చేయడం, చదువుతున్న విషయం మీద శ్రద్ద పెరగాలని కాఫీ, టీలు తాగడం వంటి అలవాట్లుంటే వాటిని మాన్పించాలి. పిల్లలు మానసికంగా దృఢంగా ఉండటానికి పండ్లు, పండ్లరసాలు, నీరు, కొబ్బరినీరు, స్మూతీలు మొదలైనవి తీసుకునేలా చేయాలి. ఇవి శరీరాన్ని హేడ్రైట్ గా కూడా ఉంచుతాయి.
ఫన్ కూడా ముఖ్యం..
ఎప్పుడూ చదువే ఉంటే పిల్లలకు బోర్ కొడుతుంది. అందుకే కాస్త సరదాగా ఉండటం కూడా ముఖ్యం. కొద్దిసేపు టీవీ చూడటం, స్నేహితులతో గడపడం, ఇంట్లో తోట పని, సరదాగా కొద్దిసేపు బయటకు వెళ్లడం, బ్రెయిన్ పవర్ పెంచే పజిల్స్, గేమ్స్ ఆడటం వంటివి చేయాలి. ఇది ఎక్కువ చదవడం వల్ల కలిగే ఒత్తిడిని తరిమేస్తుంది.
సందేహాలు.. సమాధానాలు..
పరీక్షలకు, చదువుతున్న విషయాలకు సంబంధించి సందేహాలు, సమాధానాలు అవసరమైతే స్నేహితులతో చర్చించడం చాలామంచిది. గ్రూప్ డిస్కషన్ వల్ల గంటసేపులో అర్థమయ్యే విషయాలు కేవలం 10 నిమిషాలలో అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సొంతంగా చదివి అర్థం చేసుకునే విషయాలు గ్రూప్ డిస్కషన్ ద్వారా అర్థమవుతాయి. ఇలా సమస్యలు పరిష్కారమవుతుంటే ఎలాంటి ఒత్తిడి దరిచేరదు.
*నిశ్శబ్ద.