మూఢనమ్మకాలు ముంచేస్తాయ్!

నమ్మకాలు మనిషిని బలంగా ఉంచేవి, అభివృద్ధికి దోహదం చేసేవి అయి ఉండాలి. అంతేకానీ మనిషిని పిచ్చోళ్ళలా మార్చేవి కాకూడదు. కొన్ని నమ్మకాల వెనక శాస్త్రీయ కారణాలు ఉంటాయి. వాటిని కొట్టి పడేయలేం. కానీ మరికొన్ని కారణాలు ఎలాంటి శాస్త్రీయ కారణాలు లేకుండా కేవలం ఆచరించాలని చెబుతారు. అంతేనా వాటివల్ల మనుషులకు ఆర్థిక నష్టమే కాకుండా సమయానికి కూడా నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు జీవితంలో ఎంతో ముఖ్యమైన అవకాశాలు కోల్పోవచ్చు, మరికొన్నిసార్లు ఎంతో గొప్పవైన మానవ సంభంధాలకు నష్టం కలగచ్చు. మొత్తానికి మనుషులను మనుషుల అభివృద్ధిని సమాజాన్ని వెర్రివాళ్లను చేసే మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి.  బయటకు వెళ్తున్నప్పుడో లేక ముఖ్యమైన పనిమీద వెళ్తున్నప్పుడో పిల్లి ఎదురయ్యిందనో లేదా భర్త చనిపోయిన ఆడవాళ్లు ఎదురయ్యారనో, చనిపోయిన శవాన్ని ఎవరో తీసుకెళ్తున్నారనో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.  చాలామంది వీటిని అరిష్టం అని అపశకునం అని అనుకుంటారు. ముఖ్యమైన పనుల కోసమో, చాలా అవసరమైన వాటికోసమో ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఎదురవ్వగానే 90% ఖచ్చితంగా తిరిగి ఇంటికి వెళ్లడం, లేదా అలా ఎదురైన తరువాత సాదారణంగానే ఎక్కడో ఒకచోట కూర్చోవడం వంటివి చేస్తుంటారు. దానివల్ల వాళ్లకు ఆలస్యం అవడం, ముందున్నంత మానసిక దృఢత్వం తరువాత కోల్పోవడం జరుగుతుంది. ఒక్కసారి బాగా గమనిస్తే తుమ్ము వచ్చిందనో, పిల్లి ఎదురొచ్చిందనో చేసే ఆలస్యాలు, అపశకునం కాబట్టి ఏదో సమస్య ఎదురవుతుందని దానిగురించి చేసే ఆలోచనలు చెయ్యాల్సిన పనులను సరిగ్గా చేయనివవ్వు, సరిగ్గా జరగనివ్వవు. మనం చేసే ఆలస్యానికి సమయానికి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ లేదా బస్ ఎక్కడికీ వెళ్లకుండా మనకోసం స్టాప్ లోనే ఉంటాయా ఏంటి??  ముఖ్యమైన పనులు చెయ్యాల్సినప్పుడు మానసికంగా దెబ్బతింటే అప్పుడు చేసేపనిని సరైన ద్యాసతో చేయలేము. మనమే పనిమీద సరైన దృష్టిపెట్టకుండా ఎదురైన పిల్లుల మీద, చనిపోయిన మనుషుల మీద కారణాలు తోసేయడం ఎంతవరకు సరైనది. కాలం మారిపోయింది మూఢనమ్మకాలు ఇప్పుడెక్కడున్నాయిలే అని అందరూ అనుకుంటారు కానీ అభివృద్ధి చెందుతున్న, ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.  అప్పుడెప్పుడో బాగా చదువుకుని లెక్చరర్ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు కూతురిని చంపేయడం మూఢనమ్మకం అయితే తాజాగా ఒక దినపత్రికలో అష్టమి నాడు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త భార్యను హింసించడం అనే సంఘటన గురించి తెలిసినప్పుడు  ఈ సమాజంలో నమ్మకాలు ప్రజలను ఎంతగా వెర్రివాళ్లను చేస్తున్నాయో అర్థమవుతుంది. నమ్మకాలు ఏవైనా మనిషి మానసిక స్థితిని దెబ్బకొట్టేవే. ఆ విషయం అర్ధం చేసుకున్నప్పుడు ఏదో ఎదురొచ్చిందని, మరింకేదో అడ్డొచ్చిందని ఆగిపోరు. ఎదురయ్యే జంతువుల్ని, మనుషుల్ని, సంఘటనలను చూసుకుంటూ తమ పనులను నిర్లక్ష్యం చేయరు. ప్రతిదాంట్లో మంచిని చూస్తూ ప్రతి సమస్యకు తమ నమ్మకమే బలం అని తెలుసుకున్నవాళ్ళు తాము మొదలుపెట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసుకుని కార్యశూరులు అవుతారు. అంతేకానీ మూఢనమ్మకాల మధ్య జీవితాన్ని ముంచేసుకోరు.                                 ◆ వెంకటేష్ పువ్వాడ.

లక్ష్మీ రావే మా ఇంటికి!

లక్ష్మీ అంటే మహావిష్ణువు భార్య, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంపదలుంటాయి. ఆమె వెళ్లే ప్రతి చోట డబ్బు తిరగడుతూ ఉంటుంది. అందుకే పెద్దలు ఆంటారు డబ్బును, లకహ్మి దేవిని వేరు వేరుగా కాకుండా ఒక్కటిగా చూస్తారు. డబ్బు అంటే లక్ష్మీదేవినే అని అంటారు. డబ్బు దగ్గరుంటే ఈ కాలంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. కమర్షియల్ జీవితాల ప్రపంచంలో డబ్బు లేకుండా బతకడం కష్టమే కదా!! కాదని కొందరు వాదించవచ్చు. కానీ ఇలా బతకడం అలవాటు పడిపోయిన మనిషికి డబ్బు లేకపోతే ఏమీ తోచదు. అందరికీ మనసులో ఉంటుంది బోలెడు డబ్బు దగ్గరుండాలని. ఆ డబ్బుతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలని, ఎన్నో నచ్చినవి, అవసరమైనవి తీసుకోవాలని. కొన్ని కలలను తీర్చుకోవాలని. కానీ డబ్బులు ఏమీ చెట్లకు కాయవు కదా!! మరి డబ్బు మనదగ్గరకు ఎలా వస్తుంది?? కష్టపడినా తగినంత డబ్బు చేతికి రావడం లేదని, కష్టానికి తెగగా ఫలితం లేదని చెప్పేవాళ్ళ కోసం కొన్ని డబ్బులు చేతిలో ఒడిసిపట్టే చిట్కాలు!! అనవసరపు ఆడంబరాలు వద్దు!! కొన్ని విషయాల్లో పిసినారితనంగా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది. కొన్నిసార్లు లేనిపోని మోహమాటాలతో కొన్ని ఆడంబరాలు చేయాల్సి రావచ్చు. అలాంటి సందర్భాలను సున్నితంగా ఏదో ఒక పని చెప్పి తప్పించుకోవచ్చు. ఇక్కడ ఎవరూ రూపాయి కూడా చెయ్యి చాచి ఇచ్చేవాళ్ళు లేరండి. సగటు మధ్య మరియు దిగువ తరగతి మనిషికి ఆడంబరాలు నెత్తిమీద కొండంత బరువులా ఉంటాయి.  సింప్లిసిటీ!! నిజం చెప్పాలంటే ఈ సింప్లిసిటీ మనిషిని కమర్షియల్ గా ఎదిగేలా చేస్తుంది. ప్రతిదాంట్లో అతిగా ఉండకపోవడం ఎన్నో ఖర్చులను అవుతుంది. కట్టు బొట్టు నుండి, తిండి విషయం వరకు. వాడే వస్తువుల నుండి ఎక్పెక్ట్ చేయడం వరకు అన్నింటిలోనూ సింప్లిసిటీ ఉన్నవాళ్లు ఖర్చుపెట్టడంలో కూడా అనవసరమైన వాటికి సున్నితంగా దూరం వెళ్ళిపోతారు. పొదుపు సూత్రాలు!! నిజానికి పొదుపు అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలసి చేసే ప్లాన్. అయితే ఒక రిలేషన్ లోకి వెళ్లే ముందు నుంచే పొదుపు ప్లాన్ చేయడం వల్ల రిలేషన్ తరువాత చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. ప్రస్తుతకాలంలో పని చేయకుండా ఇంటిదగ్గరే ఉండే ఆడవాళ్లు చాలా తక్కువ. కాబట్టి పొదుపు చేయడం కూడా సులభమే. నిజానికి మగవాళ్ల కంటే ఆడవాళ్లే పొదుపు విషయంలో ముందుంటారు. అయితే ఆడవాళ్లు చేసే ఖర్చుల గురించి మాత్రం మాట్లాడకూడదు సుమా!! ఇన్వెస్ట్మెంట్!! చాలామంది బంగారం కొనడం, భూములు కొనడం ద్వారా తమ డబ్బును పెంచుకుంటారు. బంగారం, భూములు ఈ వేగవంతమైన కాలంలో అవి కూడా వేగంగా తమ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. బంగారం కేవలం పెట్టుకోవడానికి మాత్రమే కాదు ఆర్థిక స్థాయిని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక భూములు కూడా క్రమంగా ధర పెరిగేవే. అపార్టుమెంట్లు తప్ప గతిలేని ఈ కాలంలో భూములు బంగారం పండించకపోయినా డబ్బులను పుష్కలంగా సమకూరుస్తాయి. వ్యాపారాలు!! ప్రజలు ఎక్కువగా ఆధారపడే ఏ విధమైన వ్యాపారం అయినా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సంపాదించడానికే తమ సమయాన్ని వినియోగిస్తూ కనీసం వండుకోలేని మనుషులున్న కాలంలో చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో మంచి రాబడి పొందుతున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఆడవాళ్లు అయితే తమకు రుచికరంగా వండటం వస్తే ఏదైనా బిజినెస్ గా మార్చేయచ్చు. రుచి దొరకక జనాలు చచ్చిపోతున్నారండి బాబు.  పైన చెప్పుకున్నట్టు కొన్ని పాటిస్తే లక్ష్మీ రావే మా ఇంటికి అని మరీ బతిమలాల్సిన అవసరం లేదు.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

ఒత్తిడులను అధిగమించకపోతే జరిగే నష్టమిదే...

సమస్య ఎదురవగానే మనస్సు దానిని అసలు గుర్తించదు. అది ఒక గదిలో జంబుఖానా క్రింద దుమ్మును దులపడం లాంటిది. నేలపై బాహ్యంగా ఏమీ కనిపించకపోయినా, జంబుఖానా క్రింద చాలా దుమ్ము ఉంటుంది. కానీ దుమ్మును ఆ విధంగా కప్పి ఉంచడం వల్ల గది అంతా ఎంతో పరిశుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే విధంగా, సమస్య ఉత్పన్నమైనప్పుడు, శిక్షణ లేని మనస్సు ఆ సమస్యను తనకు తెలియకుండానే చైతన్యయుతమైన మనస్సు నుండి బయటకు త్రోయాలని అనుకుంటుంది. అప్పుడా సమస్య జంబుఖానా క్రింది దుమ్ము లాగా అచేతనమైన మనస్సు పొరలలోకి వెళ్ళి, అక్కడ స్థిరపడుతుంది. ఆ సమస్య తీరిపోదు కానీ, జరిగేది ఏమంటే అది మన కళ్ళ ముందు ఉండదు, కనిపించదు. ఏ సమస్య అయినా సరే పై స్థాయిలో కనిపిస్తూ ఉంటేనే మనం దాన్ని పట్టించుకోగలుగుతాం. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే.. మనస్సు సమస్యలను ఎదుర్కోలేదు. ఎందుకు ఎదుర్కోలేదు అంటే.. సమస్యలను ఎదుర్కోవడం అంటే బాధాకరం కాబట్టి, సమస్యలు అంటేనే శారీరకంగానో.. మానసికంగానో.. భౌతికంగానో.. ఇబ్బంది పడటం. ఆ ఇబ్బందిని ఓర్చుకోవడం.. చాలామందికి అలా ఓర్చుకోవడంలో కష్టం, బాధ ఎదురవుతాయి. కాబట్టి సమస్యను ఎదుర్కోవడం మనిషికీ.. మనసుకు కూడా అసలు ఇష్టముండదు. కానీ సమస్య అలాగే ఉంటే ఏమి జరుగుతుంది?? అది అట్లాగే ఒక దొంతర కింద దాగిపోయి ఎప్పుడో ఆ దొంతర తొలగ్గానే దుమ్ము మురిగ్గా.. పరిసరాలను అపరిశుభ్రం చేసి, శ్వాసకు ఇబ్బంది కలిగించినట్టు సమస్య కూడా మనిషిని ఇబ్బంది పెడుతుంది.   కానీ మనసు ఏమి చేస్తుంది??  సమస్యల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవిక పరిస్థితులను ఆ విధంగా అణచి వేయడం వల్ల సమస్యల పట్ల మనకున్న భయాలు, అపోహలు మనస్సులోని అచేతనమైన పొరకు త్రోసివేయబడతాయి. అప్పుడు ఈ అచేతనపు పొరలలో ఉన్న అచేతన ప్రేరణలు, శక్తులు మనస్సును నియంత్రించడం ప్రారంభిస్తాయి. అప్పుడది సమస్య పరిష్కారాలను అన్ని రకాల పద్ధతుల ద్వారా వాయిదా వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ రోజు ఎన్నడూ రాదు. సుదీర్ఘకాలం అట్లాగే దాన్ని పరిష్కరించకుండా ఉంచితే చిన్న సమస్యలు కూడా క్లిష్ట సమస్యలుగా మారతాయనే విషయం మనస్సు మరచిపోతుంది. సమస్యలను పరిష్కరించడం ద్వారానే వాటిని అధిగమించగలం. ఒక సామెతలో చెప్పినట్లు, "సరియైన సమయంలో ఒక కుట్టు వేస్తే, తొమ్మిది కుట్లు వేయాల్సిన అవసరం రాకుండా నివారించవచ్చు" ఒక చిన్న నిప్పురవ్వను ఆర్పకపోతే పెద్ద మంట అవుతుంది. నిప్పురవ్వగా ఉన్నప్పుడు దాన్ని ఆర్పడం తేలిక. కానీ సరైన సమయంలో ఆ పని చేయకపోతే, అది ప్రజ్వరిల్లుతుంది. దీని ఫలితంగా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్య నుండి పారిపోవడం, అసలు చూడకుండా ఉండడం, లేదంటే వాయిదా వేయడం అనే స్వభావాన్ని మానేయాలి. ఏదో ఒక భయంతో బయటకు చెప్పలేనిదాన్ని మనం తరచూ పూర్తిగా అణచివేసే ప్రయత్నం చేస్తుంటాం. ఉదాహరణకు నలుగురితో చెడుగా ప్రవర్తించడం మర్యాద కాదు కాబట్టి మన కోపాన్ని వ్యక్తపరచం. కానీ అది ఎంతకాలం కొనసాగుతుంది? ఏదో ఒక రోజున అంతా బట్టబయలవుతుంది. ఇతరులపై కోపం చూపలేకపోతే అది మన ఆరోగ్యాన్నే దెబ్బ తీస్తుంది. అది కడుపులో పుండునో, అధిక రక్తపోటునో, లేదంటే గుండె ఆగిపోవడాన్నో, గుండె పోటునో కలగజేస్తుంది. అందుచేత మన లోపల ఉన్న ఈ ఒత్తిళ్ళను అధిగమించడం నేర్చుకోవాలి. అది కూడా ఇతరులను నొప్పించకుండా.. మన అసంతృప్తులు ఇతరుల మీదకు వెళ్లకుండా మన ఒత్తిడులను అధిగమించాలి.                                        ◆నిశ్శబ్ద.

పాలసీలు బహుపరాక్!! 

ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాలసీ అనేది కామన్ అయిపోయింది. ఏ రోజు సంపాదన ఆరోజు సరిపోయి ఏదో జీవితం అట్లా సాగుతున్నవాళ్ళు తప్ప పేదల నుండి, మధ్యతరగతి, ధనవంతుల వరకు ఈ పాలసీలలో మునిగి తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి వారి మీదనే ఈ పాలసీ సంస్థలు కూడా నడుస్తున్నాయంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ధనవంతులకు ఈ పాలసీలు ఉన్నా లేకపోయినా ఏమి సమస్య లేదు. పెద్దలు వెనుకేసిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, వ్యాపార లాభాలు వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల వారికి పాలసీల గురించి పెద్ద ఆసక్తి కూడా తక్కువే.  అయితే వ్యక్తి నుండి వాహనాలకు, వస్తువులకు, ఇళ్లకు, సంస్థలకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది మొదలయ్యాక ఈ ధనవంతులు కూడా వీటితో బాగానే ప్రయోజనాలు పొందుతున్నారు. ఇకపోతే చాలా చోట్ల చాలా కుటుంబాలలో కనిపించే అతి సాధారణ సమస్య ఒకటుంది. శ్రీరామ్ చిట్స్ ఎల్.ఐ.సి హెచ్.డి.ఎఫ్.సి ఇంకా ఇంకా వివిధరకాల బోలెడు సంస్థలు ఎన్నో ఇన్సూరెన్స్ లు అందిస్తున్నాయి. వీటిలో పాలసీలు తీసుకుని వాటిని కడుతున్న వారిలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయి. అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య పాలసీ చెల్లింపు గడువు రాగానే పైసల కోసం వెతుక్కోవడం. నిజానికి ఈ పాలసీలు కట్టడం మొదలుపెట్టినప్పుడు తప్ప మిగిలిన సందర్భాలలో డబ్బు సమకూర్చుకోవడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిక్కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సగటు మధ్యతరగతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి మూడువేల రూపాయల పాలసీ కట్టడానికి నిర్ణయించుకుంటే అతడి నెలవారీ సంపాదనలో ఐదువందల రూపాయలను పక్కన పెడుతుండాలి. ఆ ఆరు నెలల మొత్తం పాలసీ చెల్లింపును ఎలాంటి ఆందోళన లేకుండా చేస్తుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు ఈ విషయం గూర్చి ఎక్కువ ఆలోచించరు. తీరా చెల్లింపు గడువు ముందుకొచ్చినప్పుడు అప్పు చేసో లేక వేరే చెల్లింపుల నుండి దీనికి డబ్బు మరల్చడమో చేస్తుంటారు. ఫలితంగానే ఒకవైపు ఇన్సూరెన్స్ లు కడుతూ మరోవైపు అప్పులు చేస్తూ ఉంటారు. ఇదీ సగటు మధ్యతరగతి పాలసీదారుని పితలాటకం. హెల్త్ ఇన్సూరెన్స్ లు వచ్చినప్పటి నుండి ఓ ఆలోచన పురుగులా మెదడును తొలిచేది. చావుకు అగ్రిమెంట్ రాసుకున్నట్టు చస్తే ఆ ఇన్సూరెన్స్ తాలూకూ డబ్బులు బోల్డు వస్తాయని కదా ఇవన్నీ అని. కానీ నిజానికి  పేద, మధ్యతరగతి వ్యక్తులు ఎప్పుడూ ఇంతే కదా కుటుంబచట్రంలో ఇరుక్కుపోయిన జీవులు కదా అనిపిస్తుంది. ఇకపోతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచనలు చేసే మధ్యతరగతి జీవుల వల్ల హాయిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి.  సంవత్సరంలో ఈ పాలసీలు కట్టాలనే కోణంలో తమ సంతోషాలు కూడా వధులుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. మనిషికోక పాలసీ, కానీ సంపాదన ఒకే ఒకరిది. ఇబ్బందులున్నా కట్టడానికే ముందుకు వెళ్తారు. కారణం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండటమే.  పాలసీలతో జాగ్రత్త!! కొందరుంటారు. ఈ పాలసీ సంస్థలలో పనిచేసే ఎంజెంట్లు. వీళ్ళు పాలసీలు తీయించడం, డబ్బులు వసూలు చేయడం పనిగా చేస్తుంటారు. అదే వారి ఉద్యోగం కూడా. అయితే పాలసీ తీయించేటప్పుడు 90% మంది ఆ పాలసీ వల్ల లాభాలు మాత్రమే చెబుతారు. కానీ దాని వల్ల వచ్చే నష్టాలు ఎవరూ ఏమీ చెప్పరు. చివరకు దానివల్ల ఏదో ఒక నష్టం ఎదురయ్యే దాకా దాని గురించి పాలసీదారుడికి తెలియదు కూడ. ఇలాంటి సంఘటనలు బోలెడు జరుగుతూ ఉంటాయి. సగటు మధ్యతరగతి ఒక సంస్థమీద ఎంతకని పోరాడతాడు. కాబట్టి ఒకటికి బట్టి నాలుగైదు సార్లు తిరుగుతాడు, ఆ తరువాత మోసం చేసిన వాడి నాశనం వాడిదే  అనుకుని కొన్నిరోజులు బాధపడి తిరిగి జీవితమనే పోరాటంలో పడిపోతాడు. కానీ నిజానికి ఆ సంస్థవాడు హాయిగా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు అందులో ప్లస్ పాయింట్స్ మాత్రమే కాదు మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మొదట అందరూ తెలుసుకోవాలి. పైన చెప్పుకున్న విషయమంతా చదివాక పాలసీ అంటే భరోసా ఇవ్వాలి కానీ అది చిరాకు పెట్టించేదిగా ఉండకూడదని అందరికీ ఆర్గమయ్యే ఉంటుందనుకుంటా!! ◆ వెంకటేష్ పువ్వాడ  

సంతోషంగా ఉండాలంటే యువత తెలుసుకోవలసిన విషయమిదే!

ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలనే కోరుకుంటారు. అయితే సంతోషంగా ఉన్నామనే దానికి కొలమానం ఏమిటి? యువత సంతోషంగా ఉండాలంటే కావల్సింది ఏమిటి? అని  ఒక సర్వే నిర్వహించారు. సంతోషంగా ఉండడానికి కావాల్సినవి 'కీర్తి, సంపదలు, అందం, ఆరోగ్యం' అని చాలా మంది ఆ సర్వేలో వెల్లడించారు. ఒకరు భోగ భాగ్యాలతో జీవిస్తున్నప్పటికీ అతనికి ఉన్న ఐశ్వర్యం సంతృప్తిని ఇవ్వకపోతే సంతోషం లేనట్లే కదా? మరొక వ్యక్తి తనకున్న సంపదతో సంతృప్తిగా జీవించగలిగితే అతడు సంతోషంగా ఉన్నట్లే! సంతోషానికి అర్థం సంతృప్తిగా జీవించడం. సంతోషం, సంతృప్తి మనస్సుకు సంబంధించినవి. సాధారణంగా మనం కోరుకున్నది మనకు లభించినప్పుడు సంతోషం కలుగుతుంది. అలాంటి ఆనందం మరొక కోరికకు దారితీస్తుంది. ఆ సంతోషం స్వల్పకాలం మాత్రమే. మనలో కోరికలు ఉన్నంత వరకూ నిజమైన ఆనందం పొందలేమనడానికి  భాగవతంలోని ఒక కథ ఉదాహరణగా నిలుస్తుంది.  “ఒక రోజు కొంతమంది బెస్తలు చేపలు పడుతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద రివ్వున క్రిందికి వచ్చి ఒక చేపను తన్నుకుపోయింది. గ్రద్ద నోటిలో చేప కనపడేసరికి, కాకులు గుంపులు గుంపులుగా దాని వెంటపడ్డాయి. ఆ గందరగోళంలో గ్రద్ద నోటిలో నుంచి చేప జారి క్రింద పడిపోయింది. తక్షణమే కాకులన్నీ గ్రద్దను వెంబడించడం మానేశాయి. అప్పుడు ఆ గ్రద్ద ఓ చెట్టుకొమ్మ మీద వాలి ప్రశాంతంగా కూర్చుని 'ఛీ! నికృష్టమైన ఆ చేప ఈ అనర్థాలన్నిటికీ మూలం! దాన్ని వదిలేసరికి నాకు మనశ్శాంతి లభించింది" అని అనుకుంది. మనలో ప్రాపంచిక కోరికలు ఉన్నంత వరకూ అశాంతి మనల్ని వెంటాడుతూనే ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. స్వామి వివేకానంద తమ జ్ఞానయోగం పుస్తకంలో ఇలా వ్రాస్తారు: "మరణం అనేది ఉన్నంత వరకు సంతోషం కోసం పరుగులు, ప్రయాస జలగల్లాగ పట్టుకొని వేలాడతాయి. ఇవన్నీ కొంత కాలానికి అనిత్యాలుగా తోస్తాయి. జీవితమంతా ఎంతో బుద్ధిపాటవంతో, తదేక దీక్షతో, పరిశ్రమించి నిర్మించుకొన్న ఆశాసౌధాలు ఒక్క నిమిషంలో కుప్పకూలిపోతాయి.” సంతోషం బయటదొరికేది కాదు అని అర్థం అవుతుంది. కోరికల నుండి దూరమైనప్పుడే మనస్సు ప్రశాంతతను సంతరించుకొంటుంది. Happiness comes from being and not having సంతోషం అనేది మనలో ఉన్నదే కానీ బాహ్య వస్తువుల నుంచి వచ్చేదికాదు. కోరికలు లేకుండా ఉండడం అసాధ్యం కాబట్టి, జీవించడానికి అవసరమైనవాటిని, ఆత్మనిగ్రహానికి ఆటంకం లేనివాటిని మాత్రమే కోరుకోవాలి. ప్రకృతి ద్వారా వచ్చే ప్రతిబంధకాల నుండి అనాసక్తులమై ఉండగలగాలి. మనలో  ఉన్న సంతోషాన్ని, బాహ్యవస్తువుల ద్వారా వచ్చే సంతోషంతో అనుసంధానం చేయాలి. దానికై ధ్యానం క్రమం తప్పక చేయాలి. ఒక సాధువుగారు తన శిష్యుడితో సాయంకాలం ఊరి పొలిమేరలకు వెళ్ళారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. ఎదురుగా పొలంలో వాడిపోయిన మొక్కలు కనిపించాయి. శిష్యుడు వెంటనే ఆ విధంగా ఉండడం చూసి గురువుగారిని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా సాధువు “నాయనా! ఈ చెట్ల వేర్లు భూమిలో నీటి మట్టం వరకు పోయాయి. కనుక ఈ చెట్లు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ చిన్న మొక్కల వేర్లు పైపైనే ఉన్నాయి. అవి నీటి మట్టాన్ని తాకలేవు కాబట్టి వాడిపోయాయి" అని సమాధానం ఇచ్చాడు. ఎవరైతే తమ మనస్సును అంతరాత్మతో అనుసంధానం చేస్తారో వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలరు. ఎవరి మనస్సు అయితే నిత్యసత్యమైన ఆత్మను మరచి అనిత్యాలైన బాహ్యవస్తువుల వెంట పరుగులు తీస్తుందో అలాంటివారు. ఎన్నటికీ ఆనందంగా జీవించలేరు. కాబట్టి మనస్సును బాహ్య విషయాలపైకి పోనివ్వకుండా మనలో ఉన్న దివ్యత్వంతో అనుసంధానం చేసుకొని సంతోషంగా జీవించడానికి ప్రయత్నిద్దాం.                                        *నిశ్శబ్ద.

మనిషి అభివృద్ధికి అసలైన ఆటంకం ఇదే...

మనషి తన జీవితంలో గెలవలేకపోతున్నాడు అంటే దానికి కారణం అతను గెలుపు కోసం ప్రయత్నం చేయడం లేదని కాదు. అంతకు మించి ఆ మనిషిలో భయం ఉందని అర్థం. భయం మనిషిని ఓటమి అంచుల్లోకి తీసుకెళ్తుంది. ఎంత ప్రతిభావంతుడినైనా పరాజయుడిని చేస్తుంది. ఇంతకూ భయం మనిషికి శత్రువుగా ఎలా మారుతుంది?? అసలు భయం అంటే ఏంటి?? దాన్ని ఎలా జయించాలి?? ఈ విషయాలు నేటి తరం వారు తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. మన సామర్థ్యం మీద మనకు నమ్మకం తగ్గిపోయి, గెలుపుకు వ్యతిరేకంగా ఉండే విషయాల ప్రభావానికి లోనైనప్పుడు మనిషిలో కలిగే ఒత్తిడిని, మార్పును, ప్రవర్తనను భయం అంటారు. మన పరాజయాలన్నింటికీ మూలకారణం భయమే!  భయం కలగడానికి ముఖ్య కారణాలు :  ఆత్మవిశ్వాసం లేకపోవడం :  మనం మన మీద విశ్వాసం కోల్పోయినప్పుడు ప్రతికూలభావాలు మనల్ని ఆవరిస్తాయి. "భయమే మరణం, భయమే పాపం, భయమే నరకం, భయమే దుఃఖానికి మూలకారణం. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రతికూల భావాలూ ఉత్పన్నమయ్యేవి భయం అనే దుష్టశక్తి నుంచే" అని అంటారు స్వామి వివేకానంద. పరులపై ఆధారపడడం :  మన స్వశక్తిపై ఆధారపడకుండా ప్రతిదానికీ ఇంకొకరిపై ఆధారపడే స్వభావం మనల్ని నిస్సహాయులుగా, భయస్థులుగా మారుస్తుంది. ప్రతి విషయంలో ఇతరుల సహాయం అర్థించేవాడు స్వశక్తితో ఎన్నటికీ ఎదగలేడు. ఆధారపడటం అంటే మనిషిలో పిరికితనం పేర్చుకుంటూ పోవడమే. "Why are people so afraid? The answer is that they have made themselves helpless and dependent on others".- అంటారు స్వామి వివేకానంద. కాబట్టి నిస్సహాయత మనిషి భయానికి మూలం.  పని మీద నిబద్ధత, నమ్మకం కోల్పోవడం :  మనం చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ ఇతరులు చులకనగా చూస్తారనే భావన మనలో రానివ్వకూడదు. దానివల్ల మనం పని మీద నిబద్ధతనూ, నమ్మకాన్నీ కోల్పోతాం. అలాంటి ఊహాజనిత భయాలను వీడితేనే ప్రగతి సాధ్యం. పేపర్లు వేసి డబ్బు సంపాదించడం, టీ అమ్ముతూ డబ్బు సంపాదించడం, చిరిగిపోయిన దుస్తులను కుట్టుకుని వాటిని ధరించడం, ఇలాంటి వాటికి మనిషి చిన్నతనంగా ఎవరో ఏదో అనుకుంటారేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. విమర్శల గురించి అతిగా ఆలోచించడం:  ఇతరుల విమర్శలకూ, అభిప్రాయాలకూ భయపడితే ఏ కార్యంలోనూ విజయాన్ని సాధించలేం. కాబట్టి వాటి గురించి అతిగా ఆలోచించి భయపడకూడదు. We cannot succeed in anything, if we act in fear of other people's opinions.- భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారు ఇలా చెబుతారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయపడితే మనం విజయం సాధించలేము. భయాన్ని పోవాలంటే అందరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి... భయం మానసిక బలహీనత వల్ల కలుగుతుంది. 'A sound mind in a sound body' అనే నానుడి మనందరికీ తెలిసిందే! దృఢమైన మనస్సు ఉండాలంటే దృఢమైన శరీరం అవసరం. అందుకు ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం శరీరానికి అయినా ఎది మనసును కూడా దృఢంగా మారుస్తుంది. వ్యాయామం తో పాటు ధ్యానం మంచిది. ప్రతిరోజూ మనిషి తనగురించి, తను చేసిన పనుల గురించి ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది. క్రమశిక్షణతో కూడిన నీతిబద్ధమైన జీవితాన్ని గడపడం అలవరచుకోవాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. అదే క్రమశిక్షణ లేకోతే మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండదు. ఇతరుల విమర్శలను మనలోని బలహీనతల్ని తొలగించు కోవడానికి ఉపయోగించుకోవాలి. అంతేకానీ ఎవరైనా ఎదైనా అంటే వారిని కోపం చేసుకుని, నోరు పారేసుకోకూడదు. నెమ్మదితనం విజ్ఞుల లక్షణం. పోలిక మనిషిని దారుణంగా దెబ్బతీస్తుంది. అందుకే ఇతరుల శక్తి సామర్థ్యాలతో పోల్చుకొని బాధపడకుండా నిరంతర తపన, నిర్విరామ కృషితో దేనినైనా సాధించగలమనే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ప్రతి మనిషిలో లోటుపాట్లు అనేవి ఉంటాయి. మొదట్లోనే ఎవరూ సంపూర్మణులు కాదు. మనలోని లోటుపాట్లను అధిగమించడానికి అనుభవజ్ఞులైన పెద్దల నుంచీ, సన్నిహితుల నుంచీ సలహాలను స్వీకరించాలి.                                        *నిశ్శబ్ద.

వావ్ ఎమోజీస్... స్క్రీన్ మీద చిలిపి ముసుగులు...

వాట్సాప్, ఫేస్ బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. ఓయబ్బో సోషల్ మీడియాకు  ఎన్ని అలంకార భూషితాలో..  పోస్టులు, ఆ పోస్టుల మీద రోస్టులు, పొగడ్తలు, వీటన్నింటికోసం విరివిగా చెక్స్ట్ కంటే ఎక్కువగా అందరూ ఇప్పట్లో ఉపయోగించేది ఎమోజీలే.. నవ్వు వ్చిచనా, ఏడుపు వచ్చినా, ప్రేమ పుట్టినా, అలిగినా, ముద్దు చేయాలన్నా ఇలా ఒకటనేమిటి నవరసాలకు మించి ఎమోజీలు ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉంటాయి. అయితే ఈ ఎమోజీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. వాటితో ఎంత సరదా చేయచ్చనేది తెసుసుకుందాం. మనిషి భావానికి బదులుగా ఇంటర్నెట్ యుగంలో ఎమోజీలను వాడుతున్నాం. అయితే ఈ ఎమోజీ అనే పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ లో 2015లో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఏడాది  జులై 17న ప్రపంచ వ్యాప్తతంగా ఎమోజీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఎమోజీలకు మొదటిరూపం ఎమోటికాన్. ఫుల్ స్టాప్, కమా, బ్రాకెట్ వంటి నమూనాలతో వీటిని రూపొందించేవారు. మొట్టమొదటి సారి 1862 సంవత్సరంలో అబ్రహం లింకన్ ప్రసంగానికి సంబంధించిన కాపీని ముద్రించడంలో జరిగిన పొరపాటుకు  - ':)' - అనే ఎమోటికాన్ వినియోగించబడింది. ఆ తరువాత 1881లో ఈ ఎమోటికాన్ లను అమెరికన్ వ్యంగ్య పత్రిక పక్ ద్వారా ప్రచురించింది.  ఆ తరువాత ఎమోజీలను చిన్న చిన్న బొమ్మల ఆకారంలో పరిచయం చేయడం మొదలుపెట్టారు. మొదటి ఎమోజీని జపనీస్ కళాకారుడు పిగెటకా కురిటా రూపొందించాడు. ఇది 1999నాటి ఆవిష్కరణ. 2010లో యూనికోడ్ లో ఎమోజీలను చూపించడం, కొత్త వాటిని జోడించడం మొదలుపెట్టారు. ఎమోజీల కోసం మొత్తం 198ఆకారాలు జత చేశారు. ఇదీ ఎమోజీ గురించి కొంత ఆసక్తికరమైన విషయాలు. అయితే ఈ ఎమోజీ రోజు స్నేహితులు, బంధుమిత్రులు ఎమోజీల ద్వారా సంభాషణ సాగించడం, కొత్త కొత్త ఎమోజీలు సృష్టించడానికి ప్రయత్నించడం వంటివి మంచి ఫన్ ను అందిస్తాయి.                                           *నిశ్శబ్ద.

అనుభవం ఎలా వస్తుంది?

ప్రతి మనిషి తన జీవోతంలో ఏదైనా సాధించాలి అంటే అనుభవం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అనుభవం ఉన్న వారు పని చేసే విధానానికి, అనుభవం లేనివారు పనిచేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. స్వామి వివేకానంద లాంటి గొప్పవాడే అనుభవమే గురువు, అనుభవాల సారమే జీవితం అని అన్నారు. అయితే అనుభవం ఎలా వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అనుభవం అనేది దానికది వచ్చేది కాదు. అనుభవాన్ని సంపాదించుకోవాలి. ప్రతి పనీ ఒక అనుభవాన్ని పరిచయం చేస్తుంది. అందుకే చాలామంది తమపనులు తాము చేసుకోవాలి అని అంటారు. అంటే ఆ పని అనుభవం వ్యక్తికి పరిచయం కావాలని వారి ఉద్దేశ్యమన్నమాట. అయితే నేర్చుకునే అలవాటు ఉంటేనే అనుభవం వస్తుంది. మనిషి ఎలా బ్రతకాలో అనుభవమే నేర్పిస్తుంది. బోధనలు, శాస్త్రాలు అనేవి వినడానికే బాగుంటాయి. వినడం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకునేది అవగింజ అంత మాత్రమే. అందుకే  భోధనల ద్వారా నేర్చుకోవడం కొంతవరకే సాధ్యమవుతుందని,  అన్నీ చదివిన వారికంటే అనుభవం ఉన్నవారు ఎన్నో రెట్లు మేలని విజ్ఞానవంతులు చెబుతారు.. ఒక పనిచేయటంలో అనుభవం ఉన్న వారికి ఆ పనిలో ఉన్న మెళకువలు అన్నీ తెలుస్తాయి. తద్వారా వారు ఆ పనిని త్వరగా చేయగలరు. అదే కొత్తగా ఆ పని చేయడానికి వచ్చినవారు చేసేటప్పుడు తడబడుతూంటారు. అనుభవం గలవారి వద్ద ఉంటే మనం ఆ పనిని త్వరగా నేర్చుకోవచ్చు. అలా కాకుండా వాడి దగ్గర నేను నేర్చుకునేదేమిటి నాకు నేనుగానే ఈ పనిని చేయగలను నేర్చుకుంటాను అనుకుంటే ఆ పనిని నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. అంతే కాకుండా కొన్ని కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో మనకున్న అహం అనేది మనల్ని ఇబ్బందులపాలు చేస్తుంది.  అనుభవం అనేది ఒక పనిని మనం చేసినప్పుడో లేదా నేర్చుకున్నప్పుడో వస్తుంది. అంతేకానీ ఊరికే రాదు. మనం ఒక పనిని నేర్చుకుంటున్నపుడు ఆ పనిలో అనుభవం ఉన్న వారికి మన సందేహాలను చెప్పొచ్చు, వారి ద్వారా పరిష్కారాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఏ విషయంలోనైనా మంచి చెడ్డలు, లాభనష్టాలు దానికి సంబంధించిన అనుభవం ఉన్నవారికే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు. అందువల్లే అనుభవాన్ని సంపాదించాలి. అనుభవం గలవారు చెప్పే మాటలు అప్పుడప్పుడూ కూడా వింటూ ఉండాలి. వారు అనుభవం కలవారు ఎందుకు చెప్తున్నారో అర్ధం చేసుకోవాలి.  పనిలోగానీ, ఉద్యోగంలోగానీ ఏ రంగంలోనైనా సరే అనుభవం సంపాదించటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటున్నాము మనం ఒక ఉద్యోగాన్ని మాని వేరే ఉద్యోగానికి వెళితే అనుభవం ఉందా అని అడుగుతారు. దానినిబట్టి మనకు ఉద్యోగం ఇవ్వాలా లేదా మనకు ఎంత జీతం ఇవ్వాలి అన్నది. ఆలోచిస్తారు. మనం ఒక పనిని లేదా ఒక ఉద్యోగాన్ని చేస్తున్నప్పుడు దానిని మనం వృధా చేయకుండా కాలాన్ని వృధాగా గడవకుండా అనుభవం సంపాదించటం కోసమే పని చేయాలి. అనుభవం కోసం, పనిలో నైపుణ్యత సంపాదించడం కోసం పనిచేస్తూ పోతే ఖచ్చితంగా గొప్ప అనుభవాన్ని సంపాదించుకున్నవారిగా ఎదుగుతారు. జీవితంలో కావలసినవి అన్నీ ఆ అనుభవమే సమకూర్చుకునేలా సహాయపడుతుంది.                                        ◆నిశ్శబ్ద.

సాలీడు ఆధారంగా ఓ అద్భుత కథ!

నేనేగనక దేవుడినయితే నా సృష్టి రహస్యాలను కనుగొనడానికి శాస్త్రజ్ఞులకు కొంత అవకాశమిస్తాను అంటారు విశ్వవిఖ్యాత చైనీస్ రచయిత లిన్ యూటాంగ్. ఆయన ఇంకా ఇలా అంటారు. నా అంతట నేను వారికి అట్టే సహాయమందివ్వక పోయినా, వారు చేసే కృషిలో మాత్రం అడ్డం రాను. ఒకటి రెండు శతాబ్దాల పరిశోధన ద్వారా వారేమీ కనుక్కుంటారనేది శ్రద్ధగా గమనిస్తుంటాను. శాస్త్రజ్ఞుడి దృష్టి సాలీడువంటి సామాన్య పురుగు మీదికి మళ్లిందనుకుందాం. అది ఎట్లా నిర్మింపబడిందీ, ఏ రసాయనాల ప్రభావం చేత అది ఆ విధంగా చరిస్తున్నదీ, మొదలైన విషయాలన్నీ అతడు తన పరిశోధన ద్వారా తెలియజేస్తాడు. నిర్మాణం యాంత్రికంగా జరిగిందనే విషయంలో ఎవరికీ సందేహ ముండనక్కరలేదు. అతడు సత్యమే ప్రకటించాడని అనవచ్చు. శాస్త్రజ్ఞుడి అన్వేషణ అతడ్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. సాలీడు దవడలు, జీర్ణప్రక్రియ ఎలాంటివో, అది తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటుందో అన్నీ కనిపెడతాడు. సాలీడు నుండి వెలువడే మెత్తటి సన్నని దారం వంటిది ఎలా ఉత్పత్తి అవుతుందో, గాలి తగిలినప్పుడు కూడా అది అది ఎందుకు ఎండిపోదో కనిపెట్టవలసి వుంటుంది. ఈ ఆన్వేషణలో మరికొన్ని దశాబ్దాలు గడిచిపోతాయి. తాను అల్లినగూడులో తానే చిక్కుకోకుండా వుంటానికి సాలీడు కాళ్ళల్లో బంకని నిరోధించే శక్తి ఏమున్నదనేది అంతుబట్టదు. ఇలా మరికొన్ని దశాబ్దాలు గడిచిపోతై. ఈ లోగా కాన్సర్ వ్యాధిని పరిశోధిస్తున్న సంస్థ ఏదో అనుకోకుండా, ఈ బంక నిరోధక శక్తి ఎలా ఉద్భవిస్తుందనే విషయాన్ని కనుగొని, అలాంటి కృత్రిమ రసాయనాన్ని తాను ఉత్పత్తి చేస్తున్నానని ప్రకటిస్తుంది. ఇంతవరకు బాగానే వుంది. కానీ శాస్త్రజ్ఞుడికి ఇపుడొక ప్రధానమైన సమస్య ఎదురవుతుంది. తల్లి యొక్క శిక్షణ లేకుండానే పిల్లసాలీడు గూడు అల్లుకోడం ఎలా సాధ్యం? ఇది పుట్టుకతో వస్తుందా తల్లిని చూచి నేర్చుకుంటుందా, పుట్టగానే తల్లినుండి వేరుచేస్తే నేర్వగలదా అనే తర్కవితర్కాలలో పడిపోతాడు. అప్పుడు శాస్త్రజ్ఞుడు దేవుడితో ముఖాముఖి సంభాషించ కోరుతాడు. "శాస్త్రజ్ఞుడి కోరికపై, సాలీడు మెదడులో దానికి అవసరమైన విజ్ఞానమంతా స్మృతిరూపంలో ఎలా నిక్షిప్తం చేసిందీ దేవుడు విశదీకరించవచ్చు. అటు తర్వాత సంభాషణ ఈ రూపంలో వుండచ్చునని అంటాడు లిని యూటాంగ్.   "జీవరసాయనిక శాస్త్రాధారంగా సాలీడు జీన్స్ ఎలా ప్రవర్తిల్లేదీ నీకు తెలియజేశాను కదా శాస్త్రజ్ఞా” అంటాడు దేవుడు. "తెలియజేశారు భగవాన్” అంటాడు శాస్త్రజ్ఞుడు. "సాలీడు ప్రవర్తనను యాంత్రిక సరళిలో వివరించాను కదా?” "కృతజ్ఞుణ్ణి” భగవాన్ అంటాడు శాస్త్రజ్ఞుడు. "తృప్తి కలిగిందా నాయనా?” అని అడుగుతాడు.  "ధన్యుణ్ణి " అంటాడు శాస్త్రజ్ఞుడు. "అంతా అర్థమైనట్లే కదా?” అని మళ్ళీ అడుగుతాడు దేవుడు.  "అందుకు సందేహమా స్వామీ? ఏ రసాయనిక మిశ్రమం వలన, ఏ పదార్థాల ద్వారా ఈ ప్రపంచం నిర్మించబడినదో తెలుసుకోగలిగితే ఈ సమస్తాన్ని అర్థం చేసుకోవచ్చని నా నిశ్చితాభిప్రాయం” అంటాడు శాస్త్రజ్ఞుడు. "అదలావుంచి ఈ అద్భుతమంతా ఏమైవుంటుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా శాస్త్రజ్ఞా?" అని అడుగుతాడు దేవుడు. "మీ సృజనాశక్తికి అచ్చెరువొందుతూనే వున్నాను, భగవాన్” అంటాడు శాస్త్రజ్ఞుడు. "అదికాదు శాస్త్రజ్ఞ, ఇదంతా ఎలా సంభవిస్తున్నదీ, ఏ పదార్థాలు, రసాయనాలు ఇందులో ప్రయోగించారు అనే వివరణ కొంత కనుగొన్నావు. నేను మరికొంత తెలియజేశాననుకో, కానీ అసలీ విధంగా ఎందుకు జరుగుతున్నది దీని అంతరార్థం ఏమైవుంటుంది. ప్రయోజనమేమిటి అనే విషయం నీకు నేను చెప్పలేద సుమా. ఎలా సంభవిస్తున్నదనే ప్రశ్న వేరు. మొదటి ప్రశ్న అలాగే వుండిపోయింది. కదా నాయనా." అంటాడు దేవుడు. శాస్త్రజ్ఞుడి కళ్ళల్లో నీళ్ళు నిండినై, గద్గద స్వరంతో "చెప్పండి స్వామి. ఇదంతా ఏమిటి? ఈ సృష్టి ప్రయోజనమేమిటి? ఎందుకదంతా?" అని ఆక్రందించాడు. “రసాయనిక సూత్రాలద్వారా అది కనుగొనలేవు బాబూ. కాని “ఎందుకు?” అనే ప్రశ్నకు నువు సమాధానం కనుగొనలేనంత కాలం సాలీడు జన్మ రహస్యాన్ని చేదించలేవు నాయనా!". "నిజమే ప్రభూ" అంటూ శాస్త్రజ్ఞుడు వినమ్రుడైనాడు. రచయిత కథనిలా అంతం చేస్తే ముచ్చటగా వుంటుందంటారు వాళ్ళంతా. చెమటలతో శాస్త్రజ్ఞుడు నిద్ర మేల్కొన్నాడు. ఏడు రోజులపాటు నోట మాటలేకుండా, స్పృహ లేకుండా పడివున్న తన భర్త కళ్ళు తెరవడం చూచి భార్య చాలా సంతోషించింది. ఆ రోజు ఇంత పథ్యం పెట్టింది. అతడు మాత్రం ఎక్కడైనా సాలీడు కనిపిస్తే అంతదూరం పరుగెడతాడు. సాలీడును గురించి అతడి కేర్పడ్డ ఈ తీవ్రమైన భయం నయమయ్యే రోగం కాదని వైద్యులు తేల్చి చెప్పారు.”                                 ◆నిశ్శబ్ద.

వర్షాకాలం ఇవి వద్దు... ఇలా చేస్తే ముద్దు!

అసలే వర్షాకాలం. బయటకు వస్తే చలి... అలాగని వెచ్చదనం కోసం ఇంట్లోనే కూర్చుంటే చదువులెలా సాగుతాయి? ఉద్యోగాలెలా చేస్తాం? రెయిన్‌ కోటు తగిలించుకునో గొడుగేసుకునో బయటికి వెళ్లక తప్పదు. అయితే మనం ధరించే దుస్తులు మాత్రం వానకు తగ్గట్టు లేకపోతే అసౌకర్యం తప్పదు మరి. ఈ వానలకు ఎలాంటి దుస్తులయితే బాగుంటుంది, యాక్సెసరీస్‌ ఏవి బాగుంటాయి... ఒకసారి తెలుసుకుందాం. వర్షాకాలంలో యువతరం బట్టల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక కాలేజీకి వెళ్లే విద్యార్ధులకు దీని పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఎండల్లో పల్చని రంగులు వాడినప్పటికీ ఇప్పుడు ముదురు రంగులు వాడటం ఉత్తమం. ఎందుకంటే వర్షాకాలంలో తడి , బురద ఉంటుంది .. పల్చని రంగులయితే మరకలు పడితే త్వరగా వదలవు . అలాగని మందపాటి దుస్తులు వాడకూడదు . తేలికపాటివి అయితేనే మంచిది. వాటిలో తెలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఈ కాలంలో ఎంతో శ్రేయస్కరం. ఇవి వద్దు! ఇలా చేస్తే మేలు : 1. వర్షాకాలంలో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే దుస్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. 2. బట్టలు పొడిగా వుంచుకోవాలి. తడి వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అందుకే ఎక్కువసేపు తడిగా వుండకూడదు. 3. తెలుపు రంగు బట్టలు అసలు వాడొద్దు . మురికి పట్టిందంటే తొందరగా వదలదు. 4. ఏ చిన్న మరక పడ్డా దూరానికి కూడా కనిపించి అసహ్యంగా వుంటుంది కాబట్టి ముదురు రంగు బట్టలు వాడితే మంచిది. ఇవి బాగుంటాయి! 1. కాటన్, సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌ వంటి దుస్తులను వాడటం మంచిది. 2. సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. 3. స్కిన్‌ టైట్, లెగ్గింగ్స్‌ కూడా బాగుంటాయి. 4. అదే విధంగా చీరలు, చుడిదార్లు ధరించే వారు శాండిల్స్, షూస్‌ వంటి వాటిని వేసుకుంటే మంచిది. 5. హ్యాండ్‌ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి అయితేనే నయం. 6. వర్షాకాలంలో ఎక్కువగా మేకప్‌ వేసుకోకపోవడమే మంచిది. 7. అలాగే వర్షాకాలంలో స్లిప్పర్స్‌ కంటే షూ వాడడం బెటర్‌. లేదంటే శాండిల్స్‌ అయినా ఫరవాలేదు. 8. స్లిప్పర్స్‌ వేసుకుంటే మాత్రం బట్టలపై బురద మరకలు పడి అసహ్యంగా కనిపిస్తాయి.

మనిషి ఎలా జీవించాలంటే...

మనిషి జీవించే విధానం ఎలా ఉండాలో మనిషే నిర్ణయించుకోవాలి. పూలు ఎక్కడున్నా సువాసన వ్యాపించినట్లు  మనం ఎక్కడ ఉన్నా మన వ్యక్తిత్వం పరిమళిస్తూ ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన పనులు అన్నీ సువాసన సంభరితంగా ఉండాలి. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, రోడ్డుపై నడుస్తున్నా, తరగతి గదిలో కూచొన్నా, మన కింద పని చేస్తున్న వారికి ఆజ్ఞలు ఇస్తున్నా.. మనపై అధికారుల ఆజ్ఞల్ని వింటున్నా... అసలు మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా - బతికి ఉన్నంత కాలం... తోటివారు మన గురించి, మన వ్యక్తిత్వం గురించి, మన విశాల హృదయం గురించి 'భేష్' అనుకోవాలి. అలా ప్రవర్తించాలి. గర్వం లేకుండా, ఇతరులను హీనంగా చూడకుండా నలుగురికీ తలలో నాలుకలా... నలుగురితో కలగలిసి పోతూ... ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ... మన కర్తవ్యం నిర్వహణ చేస్తూ... ముందుకు సాగడమే మానవ జీవిత సార్థకత అంటే! కమ్మని మామిడి చిగుళ్ళు తినే కోకిలకు ఏ మిడిసిపాటూ ఉండదు. కానీ బురదనీళ్ళు తాగే కప్ప మాత్రం బెకబెకమంటూ ఒకటే గొడవ చేస్తుంది. "కాకః కృష్ణః పికః కృష్ణః, కో భేదః పిక కాకయోః వసంతకాలే సంప్రాప్తే, కాకః కాకః పికః పికః"  అంటే… 'కాకి నల్లగా ఉంటుంది. మరి కోకిల? అది కూడా నల్లగానే ఉంటుంది. మరి ఏమిటి రెండింటికి తేడా? వసంతకాలం రానీయండి అవి రెండూ గొంతు విప్పితే - కాకి కాకేనని, కోకిల కోకిలేనని తేలిపోతుంది! అదే విధంగా  మనమంతా... మనుష్యులమంతా... పైకి ఒక్కలాగే ఉంటాం. కానీ కాలం గడిచేకొద్దీ... పుట్టి పెరిగే కొద్దీ... పెరిగి ఎదిగే కొద్దీ మరణం సమీపించే కొద్దీ... మనం సుమధుర సంగీతాన్ని అందించామా, బెకబెకమంటూ అరుస్తున్నామా... అన్నది మనమే తేల్చుకోవాలి. ఒకసారి ఒక కొంగా, హంసా మాట్లాడుకుంటున్నాయి. హంసను చూసి కొంగ ఇలా అడిగింది: "కళ్ళు, కాళ్ళు, ముక్కు ఎర్రగా ఉన్నాయ్ ఎవరోయ్ నువ్వు?” "నేను హంసను”. “ఎక్కడి నుండి వస్తున్నావు" "మానససరోవరం నుంచి” “అక్కడ ఏమేం ఉంటాయేమిటి?” "స్వర్ణ కమలాలు, అమృతం, రత్నాలు, పారిజాతాలు... ఇంకా ఎన్నో మనోహరమైనవి, లోకానికి ఉపకరించేవి. ఉంటాయి" "ఇంతేనా! నత్తగుల్లలు ఉండవా?". "ఉండవు" అందట హంస అది విన్న కొంగ వేళాకోళంగా నవ్వుకొంటూ వెళ్ళి పోయిందట. ఇప్పుడు మనకు మనమే నిర్ధారించుకోవాలి - హంసలా బతకాలనుకొంటున్నామా? కొంగలా ఇతరుల్ని వేళాకోళమాడి.. నత్తగుల్లలే గొప్పవని భ్రమపడాలనుకొంటున్నామా!                                          *నిశ్శబ్ద. 

బాధించే గతం నుండి బయటపడటానికి గొప్ప మార్గాలు!

చాలామంది గతంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూసి ఉంటారు. వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ తమలో తాము కుమిలిపోతుంటారు. స్ఫూర్తివంతమైన విషయాలు చదివినంత సేపు వారికి ఎంతో ధైర్యం వస్తుంది. కానీ తరువాత అంతా మామూలే! ఇలాంటి వారికి తమ బాధలను స్నేహితులతో చెప్పుకోవాలంటే  ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. అలాంటి సమయంలో ఈ పరిస్థితుల నుండి బయటపడే మార్గాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.. మన సమస్యలన్నింటికీ ముఖ్యకారణం మనస్సు వర్తమానంలో ఉండక పోవడమే! గతాన్ని తలుచుకుంటూ బాధపడడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మనస్సు స్వభావం. గతంలోని చేదు అనుభవాలను పూడ్చిపెట్టి, భవిష్యత్తు గురించి ఆలోచనల్ని అరికట్టినప్పుడు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్ని తీర్చిదిద్దుకోవడం సాధ్యమవుతుంది. ఈ సమస్యను మూడు మార్గాలను అనుసరించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. భగవంతునితో మొరపెట్టుకోవడం :  ఒక్కసారి భగవద్భక్తుల జీవితాల్ని తరచి చూస్తే వారంతా ఎన్ని కష్టాల్ని అనుభవించారో మనకు అర్థమవుతుంది. ఆ మహాభక్తులు అనుభవించిన కష్టాలు మేరు పర్వతమంతైతే మన కష్టాల్ని ఆవగింజతో పోల్చవచ్చు. కానీ మనకు కలిగిన ఆవగింజంత కష్టానికే అవధుల్లేని అశాంతికి లోనవుతుంటాం. మరి వారు మేరుపర్వతమంత కష్టాల్ని సైతం అవలీలగా ఎలా దాటగలిగారు? తమ బాధలను భగవంతునితో మొరపెట్టుకోవడం వల్లనే అది సాధ్యమయిందని నిరూపించారు సఖుబాయి, జనాబాయి, మీరాబాయి, ముక్తాబాయి, కాన్హోపాత్ర లాంటి అనేక మంది భక్త శిరోమణులు. It is difficult to live without someone to whom we can open our hearts. But to whom can we better dis- close them than to God! - Thomas A. Kempis ఈ ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించే తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు, శ్రేయోభిలాషి అన్నీ ఆ భగవంతుడు మాత్రమే! కాబట్టి మన బాధలను భగవంతుని వద్ద విలపిస్తూ విన్నవించుకుంటే మేరు పర్వతమంత కష్టమైనా దూదిపింజలా ఎగిరిపోతుంది. 'వ్యాకుల మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనల్ని తప్పక వింటాడు'. ఈ మార్గాన్ని అనుసరించడం కష్టమైనప్పటికీ ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు! స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడడం: మనోవ్యధలను తొలగించేందుకు ఔషధంలా ఉపయోగపడే వారు మంచి స్నేహితులు. No medicine is more valuable, none more. efficacious, none better suited to be cure of all our miseries than a friend - St. Aleredx మన బాధలను స్నేహితులతో చెప్పుకోవడానికి ఆత్మాభిమానం అడ్డువస్తోందని అనుకోవడానికి కారణం స్నేహితుడు, మనం వేర్వేరు అనే భేద భావం ఉండడం వల్లనే! 'నిజమైన స్నేహితుడు ఇద్దరిలో ఉన్న ఒకే ఆత్మ'  A true friend is one soul in two bodies - Aristotle కాబట్టి బాధలను తలచుకుంటూ కుమిలి పోవడం కన్నా స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడడం వల్ల మనస్సు తేలికపడుతుంది. కార్యకలాపాల్లో మనస్సును నిమగ్నం చేయడం :  వీలైనంత వరకూ ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసిమెలిసి ఉండడం, ఏదో ఒక పనిలో మనస్సును నిమగ్నం చేయడం వల్ల గతాన్ని మరిచిపోవడం సాధ్యమవుతుంది. స్వామి వివేకానందుని పాశ్చాత్య శిష్యురాలైన మేడం ఈ. కాల్వే మనోవేదనకు గురైనప్పుడు ఆమెను ఓదారుస్తూ స్వామీజీ! ఇలా అన్నారు : "నువ్వు గతాన్ని మరిచిపో. నీ దుఃఖాలను గురించి మౌనంగా తలపోస్తూ కూర్చోవద్దు. నీలోని భావోద్వేగాలను ఏదో ఒక బాహ్యరూపంలో సృజనాత్మకంగా వ్యక్తీకరించే ప్రయత్నం చెయ్యి" అన్నారు.  స్వామీజీ సలహాను పాటించిన ఆమె జీవితం ప్రశాంతమయమైంది. ఈ మూడు మార్గాల్లో ఏ ఒక్క మార్గాన్ని అవలంబించినా.. మనస్సు గతంలోనికి అడుగుపెట్టదు. పట్టుదలతో ప్రయత్నిస్తేనే ఏదైనా సాధ్యమవుతుందన్న విషయాన్ని మాత్రం మరువకూడదు.                                     *నిశ్శబ్ద.

మతం గురించి వివేకానంద చెప్పిన మాటలు ఏంటంటే..

ఈ ప్రపంచంలో మతానికున్న శక్తి చాలా పెద్దది. కొందరు మతాన్ని ఆయుధంగా మలచుకుంటారు. ప్రపంచాన్ని అయోమయంలోకి తోస్తారు. భారతదేశం భిన్న మతాల సమ్మేళనం. అయితే ఈ మతాల కొట్లాటలు ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. ఈ మతం గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలు వింటే మతం గురించి అందరికీ అవగాహన వస్తుంది. వివేకానంద ఏమి చెప్పాడంటే… మతం యొక్క అసలు రహస్యం ఆచరణ రూపంలో నిరూపితమవుతుంది కానీ సిద్ధాంతాల్లో కాదు. మంచిగా నడచుకోవడం, మంచిని ఆచరించడం అదే మత సారాంశం. భగవన్నామాన్ని బిగ్గరగా అరవడం మతం కాదు. భగవానుని నిర్ణయాలను అమలు చేయడమే నిజమైన మతం. నైతిక పథంలో వ్యక్తి సంచరించాలి. వీరోచితంగా నడచుకోవాలి. హృదయపూర్వకంగా కర్తవ్యాన్ని నిర్వహించాలి. సడలని నైతిక పథంలో, భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి. వ్యక్తి పవిత్రాత్ముడైతే అతడు అపవిత్రతను దర్శించలేడు. దానికి కారణం అతని అంతరంగ ప్రవృత్తే బాహ్యంలో ప్రతిబింబించడం. మన లోపల మలినం ఉంటే తప్ప బాహ్యప్రపంచంలో మలినాన్ని చూడలేం. ఈ విజ్ఞానాంశాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో అనుసరించడం శ్రేయస్కరం. సర్వజన సంక్షేమం, నైతిక పథ గమనం సాధించాలంటే ముఖ్యంగా స్వార్థరాహిత్యాన్ని అవలంబించాలి. 'నీ కొరకు నేను, నా కొరకు కాదు' అనే భావాన్ని ప్రతి వ్యక్తీ అలవరచుకోవాలి. స్వర్గం, నరకం అనేవి ఉన్నాయో లేవో ఎవరికీ అవసరం లేదు. ఆత్మ పదార్థమనేది ఉందో, లేదో ఆలోచించాల్సిన పని లేదు. 'చిత్తు, సత్తు' అంటూ వాటిని గురించి వితర్కించుకోవాల్సిన పని లేదు. మన ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని గురించి మాత్రమే మనం విచారించాలి. ఈ ప్రపంచం అంతా దుఃఖ భూయిష్ఠంగా ఉంది. బుద్ధుడి లాగే మనం కూడా ప్రపంచంలో సంచరించి, ప్రజల కష్టాల్ని రూపుమాపడానికి శాయశక్తులా కృషి చేయాలి. ఆ ఉద్యమంలో మనం ఆత్మాహుతికి కూడా సిద్ధమవ్వాలి. ఒక వ్యక్తి నాస్తికుడా, ఆస్తికుడా, భౌతికవాదా, వేదాంతా, క్రైస్తవుడా, మహమ్మ దీయుడా అని విచారించాల్సిన పని లేదు. పరోపకారం పరమోత్కృష్ట ధర్మం. అలాగే పరపీడనం పరమ నికృష్టకార్యం. పరులను ప్రేమించడం ఉత్తమ లక్షణం కాగా, ఇతరులను ద్వేషించడం హైన్యం. దైవశక్తి పట్ల విశ్వాసం, ఆత్మ విశ్వాసం సద్గుణాలు అవుతాయి. సంశయించే ప్రవృత్తి పాపంగా పరిగణిత మవుతుంది. సమైక్యభావం శ్లాఘనీయం. భేదభావం నైచ్యం అవుతుంది. ఇదీ విలివేకానందుడు చెప్పిన మాటలు.. *నిశ్శబ్ద.

వాడు చెప్పేది నేను వినడం ఏంటి? అనే ఆలోచనలో మీరూ ఉన్నారా? అయితే ఇది చదవండి!

ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడమనేది ఎప్పుడో పోయింది. పరుగులు పెట్టే జీవితంలో ఎవరికీ పక్కవాళ్లు చెప్పేది ఎంతటి విషయమైనా సరే ఏకాగ్రతతో వినే తీరిక, ఓపిక - రెండూ లేవు. వాళ్ళ దోవన వాళ్ళు చెప్పుకుపోతుంటే మన దోవన మనం ఏదో ఆలోచిస్తుంటాం. కాలక్షేపం బాతాఖానీలు, కబుర్లూ అయితే మనస్సుపెట్టి వినకపోయినా ఫరవాలేదు కానీ ఇతరత్రా ఏ మంచి విషయమైనా శ్రద్ధగా వినాలి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. అధికారంలో ఉన్నవాళ్ళు, కింద వాళ్ళ పట్ల శ్రద్ధ కనబరిచి వాళ్ళు చెప్పేది సహనంతో వింటే ఉత్తమ పాలకులూ, ఉత్తమ అధికారులూ అవుతారు. నవ విధ భక్తిమార్గాలలో కూడా శ్రవణానికే మొదటి స్థానం కల్పించారు. శ్రవణం సరిగ్గా ఉంటే, మిగిలినవన్నీ తేలిగ్గా సిద్ధిస్తాయి. శ్రవణం అంటే వినడం. ఆ వినడమేదో శ్రద్ధగా వినాలి. భావప్రసారమంటే వ్రాయడం, మాట్లాడడం, సంభాషించడమే కాదు, వినడం కూడా! ఇతరులు చెప్పింది సరిగ్గా వినక పోవడం వల్ల మనఃస్పర్థలు వస్తాయి. 'శ్రద్ధయా శ్రవణం కుర్యాత్. శ్రద్ధతో వినాలని శాస్త్రం చెబుతోంది. శ్రవణమే జ్ఞానానికి తొలి మెట్టు. అది లేకుంటే జ్ఞానం ఉదయించదు. విషయాన్ని కూలంకషంగా తెలుసు కోవాలంటే ఓపిగ్గా వినాలి. ప్రహ్లాదుడి కథ మనందరికీ తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని తల్లి లీలావతికి నారదమహర్షి ఉపదేశిస్తుండగా శ్రద్ధగా విన్నాడు కాబట్టే విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడు. వినదగు నెవ్వరు చెప్పిన  వినినంతనె వేగపడక వివరింపదగుస్ కని కల్ల నిజము దెలిసిన  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా ముందు వెనుకలు ఆలోచించి, మంచిచెడ్డలు విచారించి, నిజానిజాలు తెలుసుకొని, తెలివిగా వ్యవహరించాలి. అలాంటి వాడే నిజమైన వివేకవంతుడని సుమతీ శతకకారుడు బద్దెన చెప్పాడు. అందరూ అలవరచు కోవలసిన మంచి గుణమిది. ఎవరు ఏం చెప్పి ఉద్రేకాలకు, ఉద్వేగాలకు లోను కాకుండా శాంతంగా వినాలి. వాస్తవ దృక్పథంతో వినాలి. ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో ఏదీ వినకూడదు. అలాగే చెప్పేది పూర్తిగా వినకుండా ఏ నిర్ణయానికీ రాకూడదు. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడడం మంచిది కాదు. అలా చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ముఖ్యమైన విషయమేదో వినకుండా పోయే ప్రమాదం ఉంటుంది. మనం ఎదుటివారికి ఏదైనా చెబుతున్నప్పుడు వాళ్ళ నుంచి సానుకూల స్పందన కోరుకుంటాం. అలాగే ఎవరైనా! నచ్చితే మెచ్చుకోలు మాట ఏదైనా అనండి. కనీసం తల ఆడించండి. ఓ చిరునవ్వు నవ్వండి. నచ్చకపోతే మాత్రం మెత్తగా, అన్యాపదేశంగా చెప్పండి. కటువుగా చెప్పకండి. దీనిని పాటించడం వల్ల మనకూ చెప్పేవారికీ మధ్య  సదవగాహన, సద్భావన పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం.. వినేవాడికి చెప్పేవాడు లోకువ కాదని తెలుసుకోండి. పక్కవాడు చెప్పేది శ్రద్ధగా వింటేనే మనకు గ్రహణశక్తీ, సహనమూ పెరిగేది. *నిశ్శబ్ద.

మీరు చేసే ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారా?

ప్రస్తుత సమాజంలో చదివింది ఒకటయితే చేసే ఉద్యోగం మరొకటి అవుతుంది. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకటం చాలా కష్టంగా వుంటుంది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక అవసరాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ కారణాలు కావచ్చు చదివిన చదువుకు సంబంధించినది కాకుండా పరిచయం లేని, దాని గురించి ఏమీ తెలియని ఉద్యోగం చేయాల్సి రావచ్చు.  చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లభించకపోవటం వల్ల మనలో నిరాశ, అసంతృప్తి అనేవి చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తుతం ఉన్న యువతలో చాలా బాగా గమనించవచ్చు. దానివల్ల  మానసిక ప్రశాంతత అనేది కరువైపోతుంది. ఈ మానసిక ప్రశాంతత లేని కారణంగానే  ఇబ్బందులకు గురి అవుతున్నాము. మానవ జీవితాలలో అత్యంత ప్రాముఖ్యత వహించే అంశం ఉద్యోగం, మనకు అనుకూలమైన ఉద్యోగం దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి చెందుతూనే మనకు అనుకూలమైన ఉద్యోగం దొరికేంత వరకు దాని కోసం కృషి చేయాలి, దానిని సాధించుకోవాలి. అంతే తప్ప మనకు తగినది దొరకలేదనే కారణంతో ఏదీ చేయకుండా కాలాన్ని వృధా చేస్తూ ఉండటం వివేకవంతుల లక్షణం కాదు.  దీనికంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది అని మనం మానసికంగా ఫీల్ అవ్వాలి అటువంటి మంచి ఉద్యోగం పొందే సామర్థ్యాన్ని, అంటే అర్హతలు మనకున్నాయో లేదో గమనించుకుని ఆ అర్హతలు సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చెయ్యాలి. అలాగని చెప్పి, ఉన్న ఉద్యోగం వదులుకుని, నిరుద్యోగిగా ఆఫీసులచుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. చేస్తున్న ఉద్యోగం మంచి క్రమశిక్షణతో అంకిత భావంతో చేస్తూనే మన సమర్ధతకు సరిపోయే ఉద్యోగం కోసం కృషి చేయాలి. కృషి చేస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాలు లేక, దొరికిన ఉద్యోగాలు చేయలేక ఆత్మనూన్యతాభావంతో ఎన్నో రకాలైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కాని అది సమంజసం కాదు. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే అసమర్ధుడిగా ముద్రపడే ప్రమాదం ఉంది. అందుకే దొరికిన ఉద్యోగం చేసుకుంటూ మనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలి. నిజానికి పరిచయం లేని పని దొరికినా ఆ కొత్త పనిలో విషయాన్ని, ఆ పనికి సంబంధించిన మెలకువలను ఆసక్తిగా తెలుసుకునేవాడు ప్రతిభావంతుడు అవుతాడు. ఎదురయ్యే ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోవడమే వివేకవంతుల విజయాల వెనుక కారణం. ప్రస్తుతం సమాజంలో వ్యక్తి నైపుణ్యానికి తెలివికి విలువలేని కాలంలో తనకు గుర్తింపు లేదనో, తన తెలివికి తగ్గ ఉద్యోగం లేదనో బాధపడుతూ అశాంతికి గురి అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలివిని మన నైపుణ్యాన్ని గుర్తించే రోజు ఒకటంటూ వుంటుందని గ్రహించాలి, విశ్వసించాలి. పరిస్థితులను అర్ధం చేసుకుని జీవించాలి. మనం వున్న పరిస్థితులలో మౌనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటూనే నిత్య జీవితంలో తమ ప్రతిభను వెల్లడించాలి, మనం కొంతమందిని చూస్తూ వుంటాము. వారు ఎదుటివారి దోషాలు చూపటం వల్ల తాను గొప్పవాడైనట్టు భావిస్తుంటారు. తప్ప, తమలోనూ లోపాలున్నాయని అనుకోరు. ఎదుటివారిలో తప్పులు వెతకడం మాని, తనలోని లోపాలను గుర్తించి, సరిదిద్దుకునే వ్యక్తికి ఉన్నత అవకాశాలు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి.                                       ◆నిశ్శబ్ద.

మనకు మనమే మిత్రుడు, శత్రువు అంటారు ఇందుకే..

మనిషి జీవితంలో మానసిక దృక్పథం గొప్ప పాత్ర పోషిస్తుంది. సరైన మానసిక దృక్పథంతో, మనల్ని మనం చక్కగా అదుపులో పెట్టుకున్నప్పుడు, మన శ్రేయస్సును మనమే ప్రోదిచేసుకుంటాము. అలా కాక చెదిరిన మనస్సుతో, అజ్ఞానపు మబ్బులు క్రమ్మిన మనస్సు మనకే శత్రువుగా తయారవుతుంది. మనల్ని మనం కించపరుచుకున్న ప్రతిసారీ మనలోని ఉన్నతమైన ఆత్మకు మనం వ్యతిరేకంగా పనిచేస్తున్నామన్న మాట.  నిజానికి మనల్ని మనం కించపరచుకున్నప్పుడు మనలో ఉన్న ఆత్మశక్తిపై మనకు నమ్మకం లేదని అర్థం. మనల్ని మనం నాశనం చేసుకోవడానికి ఇదే కారణం. అదే విధంగా, మనం గర్వం, అహంకారంతో మిడిసిపడుతున్నప్పుడు కూడా మనం ఆ ఆత్మశక్తి నుంచి మరలిపోతున్నామన్నమాట. ఈ అహంకారం రెండు విధాలుగా పనిచెయ్యగలదు. దంభాన్ని, దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పుడే కాక విషాదంలో, నిస్పృహలో మునిగిపోయినప్పుడు కూడా ఈ అహంకారమే మనలో పనిచేస్తూ ఉంటుంది. దీనిని బట్టి, మనకు అన్నిటికన్నా మించి ఒక సమస్థితి కలిగిన మనస్సు కావాలి అని అర్థమవుతుంది. ఆ సమస్థితితో మనస్సు ఒక అంచు నుంచి మరొక అంచుకు పరుగులు తీయకుండా ఉండాలి. మనం ధనవంతులమనీ, అధికారం కలవారమనీ మిడిసిపడటం ఒకవైపు అయితే, మనకేమీ లేదనీ, పేదవారమనీ, దుఃఖాలలో మునిగి ఉన్నామనీ అనుకోవడం రెండవవైపు. ఈ రెంటికీ మధ్యనున్న మార్గాన్ని మనం అనుసరించాలి. వేదాలలో కనిపించే బోధలు, మనకు ఆ మార్గాన్ని అత్యంత శక్తిమంతంగా, స్పష్టంగా చూపాయి. మిగిలిన విషయాలన్నింటికన్నా మిన్నగా మనకు ఈ సమస్థితి కావాలనీ, ఇది కేవలం ఆధ్యాత్మిక జీవితంలోని ఉన్నత శిఖరాలకు చేరుకునేవారి కోసం మాత్రమే కాక మన రోజువారీ జీవితంలో కూడా అంతే అవసరం.  కొందరు చిన్నచిన్న విషయాలను కూడా తట్టుకోలేరు. వాతావరణం కొద్దిగా వేడెక్కినా, కొద్దిగా చలిగాలి వీచినా వారు గోరంతలు కొండంతలు చేసి తమ బాధల్ని వివరిస్తారు. కానీ అదంతా వారి మనస్సులో తయారయినదే. నిజానికి మనం అత్యంత విషాదం అని భావించే పరిస్థితి కూడా మన మనస్సులో తయారు చేసుకున్నదే. మన విషయమేమిటో మనమే ముందుగా గమనించాలి. ఒకరోజు మనం మంచి ఉత్సాహం నిండిన మనస్సుతో, ధైర్యంతో, నిర్భయంగా, అంతా భగవదర్పణమే అన్నట్టు పనిచేస్తాము. మరొకరోజు నిరాశతో, సంశయంతో, అసంతృప్తితో పనిచేస్తాము. వీటియొక్క ప్రభావం మన జీవితం మీద ఎలావుంటుందో మనం గమనిస్తే, 'మనకు మనమే మిత్రుడు, మనకు మనమే శత్రువు' అని ఎందుకు చెప్పారో ఇట్టే అర్ధమవుతుంది. నిస్పృహ వల్ల మనల్ని మనమే అధోగతి పాలుచేసుకోవడం కాక తోటివారిని కూడా మనతో పాటు క్రిందికి లాగుతాము.  ఎవరైతే అలాంటి నిరాశానిస్పృహలలో మునిగిపోయి ఉంటారో, వారికి వేరొకరి జీవితాన్ని తాకే అధికారం లేదు అని ఒక గొప్ప గురువు చెప్పుతూ ఉండేవాడు. జీవితమనేది విషాదంగా ఉండటం కోసం కాదు. మన నెత్తిమీద ఉన్న బరువును వేరొకరిని మోయమనడం సమంజసం కాదు. విచ్చలవిడి ప్రవర్తన వల్ల ప్రయోజనం లేదు.  కొందరు విషాదంలో మునిగితేలుతూ ఉంటారు. చూడబోతే వారికి అదే చాలా ఇష్టంగా కనిపిస్తున్నట్టు తోస్తుంది. మీరు వారిని అందులోనుండి ఒకసారి బయటకు లాగితే వాళ్ళు తిరిగి అందులోనే పడిపోతూ ఉంటారు. వారికి ఆ నిస్పృహ అనే పంజరంలో ఉండటం అలవాటయిపోయింది. ఇక వారు తమకు తామే అందులోనుంచి బయట పడాలి. ప్రపంచంలోని మతాలన్నీ కలసి, అత్యున్నతమైన ఆదర్శాలన్నీ వారికి బోధించినా, వారిని వారు మేల్కొల్పుకునేవరకూ, వాటివల్ల వారికి ఏ ప్రయోజనమూ ఉండదు. అందుచేతనే భగవద్గీత ఎలుగెత్తి ఘోషించింది - "నిన్ను నీవు, నీచేతనే ఉద్దరించుకోవాలి! నిన్ను నీవు దిగజార్చుకోకూడదు!" అని.                                         ◆నిశ్శబ్ద.

అన్నింటికంటే విలువైనది

అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.   కాకి పక్కకి తిరిగి చూసేసరికి మామిడి చెట్టు మీద ఒక కోయిల కనిపించింది. ‘మిత్రమా! నీ గొంతు భలే మధురంగా ఉంది సుమా! పైగా నాలాగా నువ్వు నానాచెత్తా తినాల్సిన అవసరం లేదు. హాయిగా ఆ మామిడి చిగురులతో కడుపు నింపుకోవచ్చు. నీ గొంతు విన్న ఈ లోకం ఉగాది వచ్చేసిందని పొంగిపోతుంది. నీదెంత అదృష్టజాతకం’ అని తెగ పొగిడేసింది. ‘ఆ నాదీ ఒక బతుకేనా!’ అంది కోకిల నిట్టూరుస్తూ. ఆపై ‘నా రంగు నీకంటే నలుపు. పైగా వసంత రుతవులో తప్ప కూయలేను. అంతదాకా ఎందుకు! ఆఖరికి నా పిల్లలని కూడా నేను పొదగలేక, నీ గూటిలోకి చేరుస్తుంటాను. నా జాతి ముందుకి సాగుతోందంటే అది నీ చలవే. ఇక అదృష్టం అంటావా! ఆ మాట వస్తే చిలుకే గుర్తుకువస్తుంది. పంచరంగుల వన్నెలు, పంచదార పలుకులు దాని సొంతం కదా’ అని నిట్టూర్చేసింది.   కోకిల మాటలు విన్న కాకికి అందులో నిజం లేకపోలేదనిపించింది. వెంటనే ఓ చిలుకని వెతుక్కుంటూ బయల్దేరింది. కొన్ని గడియలు గడిచేసరికి ఓ జామచెట్టు మీద మాంచి దోరపండుని తింటున్న చిలకమ్మ కనిపించింది. ‘చిలుకా క్షేమమా! ఇప్పటిదాకా నీ అదృష్టం గురించే నేనూ కోకిలా మాట్లాడుకున్నాము. నిన్ను చూస్తుంటే కోకిల చెప్పినదానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. ఏమి అందం, ఏమి గాత్రం... పైగా కమ్మని జామపళ్లతోనే కడుపు నింపుకునే భాగ్యం. అసలు బతుకంటే నీదే!’ అంటూ పొగడ్తలను వల్లె వేసింది.   ‘ఉష్‌! గట్టిగా అరవబాక. ఏ వేటగాడన్నా వింటే నన్ను పట్టుకుపోయి పంజరంలో బంధించేయగలడు. అయినా నాదీ ఒక అందమేనా? నాదీ ఒక స్వరమేనా? అసలు నువ్వెప్పుడన్నా నెమలి అనే పక్షిని చూశావా? అది పురివిప్పి నాట్యమాడటాన్ని గమనించావా? అదీ అందమంటే! అదీ నాట్యమంటే! అదీ అదృష్టమంటే!’ అంటూ నోరు తెరుకుని ఉండిపోయింది. కాకికి చిలుక మాటలు నిజమే కదా అనిపించాయి. తానెప్పుడూ నెమలి నాట్యం గురించి వినడమే కానీ చూసే అదృష్టం కలుగలేదు. ఈసారి ఆ నాట్యమేదో తను కూడా చూసి తీరాలి. చిలుక చెప్పిన మాటలను పూర్తిగా రూఢిచేసుకోవాలి. నెమలి జీవితమే అన్నింటికంటే అదృష్టజాతకం అని రుజువుపరుచుకోవాలి. అలా అనుకుంటూ నెమళ్లు ఎక్కువగా తిరుగాడే ప్రాంతానికి వెళ్లి కాపువేసింది.   కాకి అదృష్టం ఏమో కానీ, కాసేపట్లోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గుంపులోని నెమళ్లు కొన్ని పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఆ నాట్యాన్ని చూసి కాకి కళ్లు చెదిరిపోయాయి. ఏం అందం! ఏం నాట్యం! ఏం ఈకలు! ఏం హొయలు! అనుకుంటూ ఆశ్చర్యపోయింది. వెంటనే ఓ నెమలి దగ్గర వాలి ‘ఆహా అదృష్టమంటే మీదే కదా! అసలు పక్షిజాతిలో మిమ్మల్ని మించినవారు లేనే లేరు. మీ గాత్రం, మీ నాట్యం, మీ అందం.... ముందర మా బతుకులన్నీ బలాదూర్‌’ అనేసింది.   ఆ మాటలు విన్న నెమలి కళ్లలోంచి కన్నీరు ఒలికింది ‘ఓసి పిచ్చిదానా! నాదీ ఒక బతుకేనా! మబ్బు పట్టినప్పుడు తప్ప నేను నాట్యం చేయలేను. మిగతా సమయాలలో ఈ ఈకలు నాకు బరువు. పైగా ఈ ఈకల కోసమే వేటగాళ్లు నన్ను వేటాడుతూ ఉంటారు. ఈ శరీరాన్ని వండుకు తినేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక అన్నింటికీ మించిన దౌర్భాగ్యం చెప్పనా! పక్షినన్న మాటే కానీ ఆకాశంలో అంతెత్తున ఎగరగలనా? నా మటుకు నాకైతే నిన్ను చూసినప్పుడల్లా భలే ఈర్ష్యగా ఉంటుంది. ఏది పడితే అది తిని బతికేస్తావు. ఆకాశంలో చక్కుర్లు కొడుతూ తిరిగేస్తావు. నీకు వేటగాళ్ల బాధ లేదు. ఆకలితో ఉండే రోజూ ఉండదు. హాయిగా వేళకింత తింటూ, పిల్లల్ని కంటూ, గూట్లో గువ్వల్లే బతికేస్తావు. అసలు అదృష్టమంటే నీది. అన్నింటికంటూ అమూల్యమైన స్వేచ్ఛ నీ దగ్గర ఉంది. అన్నింటికంటే శాపమైన ఆకలి నీ జోలికి రాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెమలి మాటలకు కాకి మనసు ఆకాశంలో తేలిపోయింది. ఆ మనసుతో పాటే తాను కూడా రివ్వున నింగికి ఎగిరిపోయింది. (జానపద కథ ఆధారంగా) - నిర్జర.

ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే కథ!

మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్థంభం. ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు, జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు.ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు. అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం. తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పు దారిలో వెళ్తున్నారని అర్థం. మనిషి ధర్మం గా ఉండాల్సిన అవసరం గురించి, ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి, ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఇది!! ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది. అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది.  "ఏమిటండీ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు" అని అడిగిందామె. యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది" అని బదులిచ్చాడు అతడు. "అవునా నేను నిన్న పొరపాటున  తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను. అదే ఇలా బంగారం అయ్యిందేమో!!"  "తాంబూలం అమ్మితే బంగారు ముద్ద రావడం ఏమిటే!! నీ బుద్దిలేని ఆలోచన కాకపోతే" అని విసుక్కున్నాడు అతడు. "సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను. రేపు ఏమవుతుందో చూద్దాం" అన్నదామె. అతను సరేనని చెప్పడంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మేసింది. మరుసటిరోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారు ముద్ద కనిపించింది. వారికి రోజు తాంబూలం ఉమ్మి వేయడం, మరుసటిరోజు బంగారు ముద్ద తీసుకోవడం అలవాటు అయిపోయింది. అలా చేయడం వల్ల కొద్ధి కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు. వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది. ఆ ఊర్లో మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయడం బంగారు ముద్దలు తీసుకోవడం అందరికీ అలవాటు అయింది.  అందరూ ధనవంతులైపోతున్నారు. అయితే ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా ఆమె యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు. అందరూ ధనవంతులవుతుంటే, తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరికి భర్త ఎంతకీ మాట వినకపోవటంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది. చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు. వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇళ్ళు తగలబడిపోసాగాయి.  అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు "ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది. అలా కాక ధర్మచ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారి తీస్తుంది. ఇన్నాళ్ళూ మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది. మనం ఊరిని వదిలాం. అసూయా, ద్వేషాలతో ఊరు నాశనమైంది" అని. అది విన్న భార్యకు విషయం అర్థమైంది. ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళోవారున్న స్థితిలో ఉంది. ధనసంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరివాళ్ళలాగా, ప్రస్తుతసమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డీ మేసేందుకు సిద్ధమౌతోంది. ఎంత ధనం సంపాదిస్తే, అంత అశాంతి పాలవుతోంది. నైతికవిలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది. మన తరువాతి తరాలైనా ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే "ఉత్తమ ఆదర్శం" ఎంతో అవసరం.                                    ◆నిశ్శబ్ద.

 ఇంకొంచెం సంతోషంగా జీవిద్దాం 

 జీవించడానికి, బతకడానికి మధ్య ఒక సన్నని గీతను చూపెడుతుంటారు కొందరు. అయితే సాధారణ జీవితాల్లో బంధాలు, భాధ్యతలు, సర్దుకుపోవడాలు త్యాగాలు, వీటన్నిటికీ మించి  కాలం తో పాటు అన్నిటికి అలవాటు పడుతూ కుటుంబంలో అందరితో సమన్వయంగా ఉంటూ ఇలా కొనసాగడం ఎక్కువ మంది చేసే పని. బహుశా ఇట్లా చేసే పనుల్లో ఇష్టం, తృప్తి కంటే బాధ్యత కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే మెంటాలిటీనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక విషయం. ఇలా చేసే పని వల్ల సంతోషం ఉంటుందా?? యాంత్రికంగా, కృత్రిమత్వంగా చేసే పనికి, ఇష్టంగా చేసే పనికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆ రెండిటి మీదనే మనిషిలో తృప్తి తాలూకూ స్పందనలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని బహుశా చాలామంది గమనించరు. అలా గమనించకపోవడం అనేది కూడా ఆ యాంత్రికం మరియు కృత్రిమత్వంలో భాగమే. అయితే కొందరు మాత్రం చేసే పనిలో కూడా ఎంతో తృప్తిని చవిచూడగలుగుతారు కారణం ఏమిటి అని ప్రశ్న వస్తే కొందరు చెప్పే సమాధానం. బహుశా నచ్చిన పని కావచ్చు అందుకే అంత సంతోషం అనేస్తారు.  కానీ అసలు నచ్చిన పని ఏమిటి?? నచ్చని పని ఏమిటి?? మనిషికి, సంతోషానికి, ఇష్టానికి మధ్య సంబంధం ఏమిటి?? ఇవన్నీ ఆలోచించాల్సి వస్తే మొదట మనసును ప్రభావితం చేసిన పరిస్థితులు, చేతనైనది, చేతకానిది, లేదా నైపుణ్యం సాధించింది ఇలా ఎన్నో పరిగణలోకి వస్తాయి. కానీ ఏ పనిని అయినా ఒక అవగాహనతో, ఒక ప్రణాళికతో చేయాలని అనుకుంటే మాత్రం తప్పని సరిగా ఆ పనిలో తృప్తిని పొందగలం. వాస్తవాన్ని స్వీకరించి, కాలాన్ని ప్రేమించాలి వాస్తవం ఏది అనేది తెలిసినప్పుడు దాన్ని నిజాయితీగా స్వీకరించాలి. ఎప్పుడూ అది కాదు, అది బాగలేదు, అది నాకు సంబంధించినది కాదు వంటి మభ్యపెట్టుకునే ఆలోచనల్లో ఉండకూడదు. వాస్తవాన్ని ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు స్వీకరిస్తామో అప్పుడు కాలాన్ని కూడా ప్రేమించగలుగుతాము. ఇదంతా కూడా కొన్ని భ్రమలు, కొన్ని కల్పనలను బుర్రలో నుండి వదిలేసి స్పష్టమైన కోణంలో ఆలోచించడం వల్ల కలిగేది.  ఒక వస్తువును చూడాలి అంటే కాగితాన్ని అడ్డు పెట్టుకుంటే ఎలాగైతే మసకగా కనిపిస్తుందో అలాగే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమాలు, షరతులు, మనసును కట్టిపడేసే పద్ధతులు అన్నిటి మధ్య చూస్తే వాస్తవం అనేది స్పష్టంగా కనిపించదు, అర్థం కాదు. అలా కాకుండా కేవలం విషయాన్ని, దాని తాలూకూ కారణాలను మాత్రమే చూస్తూ, విశేక్షించుకుంటే వాస్తవం తొందరగా బోధపడుతుంది. ఇక కాలాన్ని ప్రేమించడమంటే అన్ని దశలను కూడా ప్రేమించడం. ఇక్కడ మనిషి పరిపక్వతను సూచించేది ఏదైనా ఉందంటే అది కచ్చితమై కాలం. అదే వర్తమానం. పరిపక్వత కలిగిన మనిషి గతాన్ని గురించి బాధపడడు, భవిష్యత్తు గురించి ఖంగారు పడడు. కేవలం వర్తమానాన్ని ఎంత సమర్థవంతంగా ఎంత సంపూర్ణంగా వినియోగించుకుంటున్నాం. మన పనులను వర్తమానంలో ఎంత బాగా చేస్తున్నాం అనే విషయం మీదనే శ్రద్ధ పెడతాడు. కాబట్టి ఇక్కడ తెలిసొచ్చేది ఏమిటంటే మనం సాధారణంగా ఏ పని చేసిన కూడా దాన్ని మనసుకు తీసుకునే విధానంలోనే సంతోషం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే చేసే పని ఏదైనా దాన్ని ఇష్టంతో చేయగలిగితే మరింత సంతోషంగా ఉండవచ్చు. ఆ పాజిటివ్ కోణమే మీ జీవితాన్ని కూడా సంతోషంగా ఉంచుతుంది.                                                                                                                                                                                                                                                                                              ◆ వెంకటేష్ పువ్వాడ