ధనవంతులు కావాలని అనుకునేవారు ఈ ప్రదేశాలకు దూరంగా ఉండాలి..!

  ఆచార్య చాణక్యుడే కౌటిల్యుడు అని కూడా పేరు పొందాడు. ఈయన రాజనీతిని మాత్రమే కాకుండా ఆర్థిక నీతిని, తత్వజ్ఞానాన్ని కూడా బోధించాడు. ఆయన సలహాల ద్వారా, ఈయన మార్గనిర్దేశకత్వంలో చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.  మనిషి జీవితంలో ధనవంతులు కావాలన్నా,  పేదవాడు కావాలన్నా అది అతను తీసుకునే నిర్ణయాలు,  అతని ఆలోచలన మీదనే ఆధారపడి ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.  ముఖ్యంగా ఒక వ్యక్తి ధనవంతుడు కావాలనే ఆలోచినలో ఉంటే కొన్ని రకాల  ప్రదేశాలకు దూరంగా ఉండాలట. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుంటే.. ధనమేరా అన్నింటికి మూలం అని రాశాడు ఓ రచయిత.  డబ్బు మనిషి జీవితాన్ని శాసిస్తోంది. అలాంటి డబ్బును కూడబెట్టుకోవాలని, జీవితంలో ఉన్నతంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. అయితే డబ్బు అభివృద్ది చెందేలా చేయడం కూడా ఓ కళనే.. అది అందరికీ సాధ్యం కాదు. కానీ కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉండటం వల్ల డబ్బు వృథా కావడాన్ని అరికట్టవచ్చు. ఉపాధి లేని ప్రదేశాలు.. ఉపాధి ఉంటేనే మనిషి ఆర్థికంగా ఎదగగలడు. వాణిజ్య కార్యకలాపాలు లేని ప్రదేశాలో నివసించడం మంచిది కాదట. ఉపాధి సరిగా లేని ప్రదేశాలలో నివసించే ప్రజలు పేదరికంలోనే ఎక్కువ మగ్గిపోతారట. వేదాల పరిజ్ఞానం ఉన్న పండితులు,  బ్రాహ్మణులు నివసించని ప్రాంతాలలో నివసించడం కూడా మంచిది కాదట. బ్రాహ్మణులు  సమాజంలో మతపరమైన, సాంస్కృతిక విలువలను రక్షిస్తారు.  అలాంటి బ్రాహ్మణులు లేని స్థలంలో పురోగతి అనేది ఎక్కువగా ఉండదట.  బ్రాహ్మణులు ఉన్న ప్రదేశాలలో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని అంటారు.  పాజిటివ్ వైబ్రేషన్ లేకుంటే ఆర్థిక వృద్ధి కూడా ఉండదు. నీరు లేని ప్రాంతాలు.. నీరు లేని జీవితాన్ని ఊహించలేము. నదులు, చెరువులు,  ఇతర నీటి వనరులు ఉన్న ప్రదేశాలలోనే జీవించాలి. ఇవి  లేని ప్రదేశాలలో నివసించేవారు ఆర్థికంగా అభివృద్ది చెందలేరు. నీటి ఎద్దటి ఉన్న ప్రాంతాలలో నివసిస్తే  చాలా వరకు నీటి సమస్యల కారణంగా సమయం వృథా అవుతుంది.  చాలా వరకు సంపాదనా అవకాశాలకు అంతరాయం కూడా ఏర్పడుతుంది.   వైద్య సౌకర్యాలు.. వైద్య సౌకర్యాలు ప్రతి ఒక్కరికీ చాలా అవసరం.  అత్యవసర సమయంలో వైద్య సదుపాయం ఉన్నప్పుడు చాలా మంది ప్రాణాలు నిలబడతాయి. ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించగలిగే వైద్య సేవలు లేని ప్రదేశాలలో నివసిస్తే ఆర్థిక  ఎదుగుదల ఉండదు.                                     *రూపశ్రీ.  

నేతాజీ సుభాస్ చంద్రబోస్.. పరాక్రమ్ దివస్2025..!

  “నాకు నీ రక్తమివ్వు, నేను నీకు స్వేచ్చనిస్తాను” అనే  నినాదం ఈ దేశ భవిష్యత్తును మరో మలుపుకు తీసుకెళ్లింది.   బానిస సంకెళ్లలో నలిగిపోతున్న ఈ దేశం   అడుక్కోవటం వల్లనో లేక బ్రతిమిలాడడటం వల్లనో స్వేచ్ఛ సంపాదించలేదని, పోరాటం చేసి ఆ  సంకెళ్లని ఈ దేశ ప్రజలే  తెంచుకోవాలన్న సందేశాన్ని భారత పౌరులకి సూటిగా అందజేయగలిగింది ఈ నినాదమే..  స్వాతంత్ర్యం కోసం మనం అమరులమయినా పర్వాలేదు, మన సమాధులే మెట్లుగా స్వతంత్ర సాధనవైపు అడుగులు పడితే చాలు అనుకున్న గొప్ప దేశ భక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయనకున్న అపారమైన దేశభక్తి స్వాతంత్ర్య పోరాటంలో అనేకమందికి స్ఫూర్తిగా నిలిచింది. సివిల్ సర్వీసెస్ కూడా వదిలేసి భారతదేశానికి సేవ చేయాలనే తపనతో స్వాతంత్ర్య పోరాటంలో భాగమైన మహనీయుడాయన. స్వాతంత్య్ర పోరాటంలో తన అపూర్వమైన నాయకత్వం, ధైర్యం, త్యాగంతో లక్షలాదిమందికి స్ఫూర్తిగా నిలిచి, భారతీయుల హృదయాల్లో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్..  ఆయన త్యాగాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన జయంతి దినమైన జనవరి 23ను ‘పరాక్రమ దినోత్సవం’గా గుర్తించి ప్రతీ సంవత్సరం జరుపుకుంటుంది. ఈ రోజు  గురించి, నేతాజీ  పోరాటం గురించి,  ఆయన నాయకత్వం గురించి తెలుసుకుంటే. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. నేతాజీ 1897,జనవరి 23న  ఒడిషాలోని కటక్‌లో జన్మించారు. ఆయనలో చిన్ననాటి నుంచే దేశభక్తి భావనలు గాఢంగా పెరిగాయి.  ఆయన తల్లిదండ్రుల సూచనతో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసి ‌ఎస్) కోసం సిద్ధమయ్యారు. 1920లో సివిల్ సర్వీస్ పరీక్షలో పాసయ్యారు. కానీ 1921 ఏప్రిల్‌లో భారతదేశంలో జరుగుతున్న జాతీయవాద ఉద్యమాల గురించి తెలుసుకుని అక్కడ రాజీనామా చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. గాంధీజీ అనుచరుడిగా, చిత్తరంజన్ దాస్ రాజకీయ శిష్యుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన నేతాజీ తర్వాత యువజన నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. తర్వాత నేతాజీ  విధానాలు నచ్చకపోవటంతో   గాంధీగారి మద్దతు దొరకలేదు.  అయినా సరే భారత స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు సుబాష్ చంద్రబోస్. ఆయన నాయకత్వం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశను అందించింది. “స్వాతంత్ర్యం ఎవరూ ఇవ్వరు,  దాన్ని మనమే సంపాదించుకోవాలి” వంటి నినాదాలు కోట్లాది మందికి స్ఫూర్తి నిచ్చాయి. స్వాతంత్య్రాన్ని  సాధించడానికి ఆయన ప్రదర్శించిన పట్టుదల, అనుసరించిన తెలివైన విధానాలు ఆయనను జాతీయ నాయకుడిగా నిలిపాయి.  స్వాతంత్ర ఉద్యమానికి చేసిన కృషి.. రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగి, 1938-39లలో  ఐ‌ఎన్‌సి  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నేతాజీ. మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ఈయన విభేధించారు.  ఈ  కారణంగా రాజీనామా చేసి స్వతంత్ర మార్గంలో స్వాతంత్ర్యం సాధించాలన్న తన విధానాన్ని అమలు చేశారు. 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి, వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆక్టివ్గా ఉన్న ప్రతీ వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి,  స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పనిచేశారు. ఆయన 1941లో భారతదేశం నుండి జర్మనీ వెళ్ళి కూడా భారత స్వాతంత్ర్యం కోసం పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్, జర్మనీతో స్నేహం చేయటం ద్వారా, వలస పాలనకు వ్యతిరేకంగా భారత్ పోరాటాన్ని బలపరిచారు.  1943లో ఆయన సింగపూర్‌కు వచ్చి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు నాయకత్వం వహిస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను(ఇండియన్ నేషనల్ ఆర్మీ) పునర్నిర్మించారు. భారతీయ యుద్ధ ఖైదీలు, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులని కలిపి  దాదాపు 45,000 మంది సైనికులతో ఈ ఐ‌ఎన్‌సి ఏర్పాటు చేశారు. ఇది భారత స్వాతంత్య్రానికి సమర్థవంతమైన సాధనంగా మారింది. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశాన్ని బ్రిటీష్ పాలననుంచి విముక్తి చేయడంలో విఫలమైనప్పటికీ,   స్వాతంత్ర్య ఉద్యమానికి  స్పూర్తినివ్వటంలో కీలక పాత్ర పోషించింది. "ఢిల్లీ చలో", "జై హింద్" వంటి ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదాలు  భారతీయుల ఐక్యతను, ధైర్యాన్ని పెంచాయి. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో రాణి ఝాన్సీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడం స్వతంత్ర పోరాటంలో మహిళల పాత్రను ప్రోత్సహించింది. నేతాజీ అనుసరించిన విధానాలు, సైనిక చర్యలవల్ల మున్ముందు భారత సైన్యం తమకి విశ్వాసంగా ఉంటుందన్న నమ్మకం లేదన్న విషయం   బ్రిటిషు వారికి అర్ధమైంది. తద్వారా భారత స్వాతంత్ర్య ప్రక్రియ వేగవంతమైంది.   ఆయనే త్యాగమే మనకు స్పూర్తి..  మన దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో జీవితాన్ని త్యాగం చేసిన  గొప్ప నాయకుడు నేతాజీ..  ఆయనను గౌరవించడానికి ఒక అద్భుత అవకాశం ఆయన జన్మదినం. ఆయన 128వ జయంతి సందర్భంగా ఆయన చూపిన  ధైర్యం, పట్టుదల, త్యాగం, ఆయన పోరాటం, ఆయన నాయకత్వం వంటివన్నీ అందరికీ స్పూర్తిగా నిలవాలి. ఆయన చేసిన కృషిని, దేశ నిర్మాణానికి ఇచ్చిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ స్వేచ్ఛ, అభివృద్ది కలిగిన భారతదేశ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రతీ పౌరుడు ఐకమత్యం, ధైర్యం, దేశం పట్ల అంకితభావం అనే ఉన్నత లక్షణాలని అలవర్చుకోవాలి. నేతాజీ హిమాలయాలకు వెళ్ళిపోయాడని,  ఆయన అక్కడే ఉంటాడని చాలా వార్తలు వ్యాపించాయి.  హిమశిఖరాలలో తానూ ఒక శిఖరంగా మారి ఈ దేశానికి ఆయన ఎప్పుడూ కాపు కాస్తుంటాడని భారతీయ దేశభక్తులు,  నేతాజీ త్యాగాన్ని అర్థం చేసుకున్న వారి విశ్వాసం. నేటి కాలం యువత దేశం తల ఎత్తుకునేలా చేయడమే ఆయనకు ఇచ్చే గొప్ప బహుమానం అవుతుంది.                                          *రూపశ్రీ.

భార్యాభర్తల బంధంలో నమ్మకం పెరగాలంటే  ఇలా చేయండి..!

  నమ్మకం ఏ బంధం లో అయినా మూలకారణం అవుతుంది.  నమ్మకం లేకపోతే చిన్నచిన్న విషయాలే పెద్ద సమస్యలకు కారణం అవుతాయి. ఇక జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తల మధ్య ఈ నమ్మకం ఎక్కువే ఉండాలి.  చాలా వరకు భార్యాభర్తల రిలేషన్ అనేది నమ్మకం లోపించడం వల్లే విఫలం అవుతుంటాయి. నమ్మకం లేని చోట కనీసం మనుషుల మీద మంచి అభిప్రాయం కూడా ఉండదు. భార్యాభర్తల మధ్య నమ్మకం పెరగడానికి  ఏం చేయాలో తెలుసుకుంటే..  భార్యాభర్తల తమ మనసులో ఉండే భయాలు,  గత అనుభవాలను షేర్ చేసుకోవడం,  ఏ విషయాన్ని అయినా మొదట తన భాగస్వామితోనే చెప్పుకోవడం వంటివి చేయడం వల్ల అవతలి వ్యక్తి  మనసులో ఒక మంచి అబిప్రాయం,  నమ్మకం ఏర్పడటానికి దారితీస్తుంది. ఇది భార్యాభర్తల మద్య బంధాన్ని బలంగా ఉంచుతుంది. తప్పులు అందరూ చేస్తారు.  అలాగే భార్యాభర్తలు కూడా తప్పులు చేస్తుంటారు.  భార్యాభర్తలు ఇద్దరూ తమ భాగస్వామి తప్పు చేసినప్పుడు వారిని నిందించడం చేస్తుంటారు. అయితే అలా నిందించడానికి బదులుగా తప్పు చేయడానికి గల కారణాలు తెలుసుకుని దానికి సరైన పరిష్కారం చెప్తే ఇంకొకసారి తప్పు చేయకుండా సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తారు. అంతేకాదు.. భాగస్వామి తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించడమే కాదు.. తను తప్పు చేసినా  దాన్ని ఓపెన్ గా చెప్పి అంగీకరించే స్వభావం కూడా కలిగి ఉండాలి.  అలా ఉంటే ఇద్దరూ బాగుంటారు. ఇద్దరూ కలిసి చేసే ఏ పని అయినా చాలా మంచి అనుభవాన్ని ఇస్తుంది.  ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది ఇద్దరినీ దగ్గర చేస్తుంది. మంచి, చెడులను పరస్పరం పంచుకోవడం,  ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య బంధం బాగుంటుంది.  ఒకరి మీద మరొకరికి నమ్మకం కూడా ఏర్పడుతుంది. చెబితే నమ్మరు కానీ ఫోన్లు చేసుకోవడం,  మెసేజ్ చేయడం కంటే ఉత్తరాలు రాసుకోవడం,  ఒకరికి ఒకరు కాగితాలలో ఏదైనా సమాచారాన్ని షేర్ చేసుకోవడం వంటివి   చాలా మంచి అనుభవాన్ని ఇస్తాయి.                                               *రూపశ్రీ.

ఆంధ్ర మహాసభల రూపశిల్పి..ఆంధ్ర పితామహుడు.. మన మాడపాటి హనుమంతరావు..!

  జాతి పిత అనే పేరు అందరూ వినే ఉంటారు.  జాతిపితగా గాంధీని పిలుస్తారని తెలుసు. కానీ ఆంధ్రదేశ పితామహుడి గురించి తెలుసా? అసలు ఆంధ్రదేశానికి పితామహుడిగా ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసా? ఆంధ్రదేశ ప్రజలకు తెలియని ఆంధ్ర పితామహుడు మన మాడపాటి హనుమంతరావు  గారు.  మాడపాటి హనుమంతరావు గారు ప్రముఖ రాజకీయ నాయకుడు,  రచయిత,  ఆంద్రోద్యమ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించాడు.  మాడపాటి హనుమంతరావు గారి గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  ఆయన జీవితం ఏంటి? ఆయన ఆంధ్ర పితామహుడుగా ఎలా పిలవబడ్డాడు.. మొదలైన విషయాలు తెలుసుకుంటే.. మాడపాటి హనుమంతరావు గారు కృష్ణా జిల్లా, నందిగామ తాలూకా, పొక్కునూరులో వెంకటప్పయ్య,  వెంకట సుబ్బమ్మ దంపతులకు 1885, జనవరి 22న జన్మించారు.  వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు. ఈయన తండ్రి గ్రామాధికారిగా చేసేవారు. మాడపాటి వారు మంచి కవి,  రచయిత కూడా.  ఆయన చాలా కథలు రాశారు.  ఇవి పుస్తక రూపంలో కూడా వెలువడ్డాయి. తెలంగాణా ఆంద్రోద్యమం ఈయనకు రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.  ఈయన బహుభాషా వేత్త. పాత్రికేయునిగా కూడా తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ప్రాంతంలో నైజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను మేల్కొలిపి  ఆంధ్ర మహాసభను నెలకొల్పారు.  రాజకీయంలో ఈయన మితవాదిగా ఉన్నారు. పేరుకు మితవాదిగా ఉన్నా ఈయన తరువాతి తరం వారు అతివాదులుగా రాణించడానికి ఈయన నాయకత్వమే కారణమని విమర్శకుల అభిప్రాయం.  తెలంగాణలో చైతన్యానికి ఆయన చేసిన  తొలి ప్రయత్నాలే కారణం.  అందుకే ఈయన అంటే అందరికీ ఇష్టం ఉండేది. ఆంధ్ర మహాసభకు ఈయన పెద్ద దిక్కులా ఉండేవారు. నిజాం పాలన కారణంగా తెలంగాణలో తెలుగు భాష దెబ్బతింటున్నప్పుడు  తెలుగు భాష, తెలుగు సంస్కృతి వికాసానికి చాలా కృషి చేశారు. ఆయన కృషిని గురించి ప్రస్తావిస్తూ రావి నారాయణరెడ్డి "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా మాడపాటి వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." అన్నారు. ఆంద్రోధ్యమంలో పనిచేయగలిగిన వారిని స్వయంగా గుర్తించి వారికి తగిన భాద్యతలు అప్పగించేవారట.  ఇలా సమర్థులైన  తెలంగాణ వారే తరువాతి తరంలో తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో నాయకత్వాన్ని సమర్థవంతంగా నడపగలిగారని అంటారు. గ్రంథాలయోధ్యమంలోనూ చెప్పుకోదగ్గ కృషి సాగించారు మాడపాటి వారు. సన్మానాల ద్వారా తనకు వచ్చే డబ్బును కూడా గ్రంథాలయాల అభివృద్దికే ఉపయోగించారు.  భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత  పాఠశాలను హైదరాబాద్ లోని నారాయణగూడలో స్ఖాపించారు.  ఈ పాఠశాల ఇప్పటికీ ఉంది.  ఈయన ప్రజా జీవితాలలోనే ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల రాజకీయ రంగంలో అంత చురుగ్గా ఉండలేకపోయారు. ఆంధ్రోద్యమాన్ని బలోపేతం చేయాలంటే గ్రంథాలయాల స్థాపన జరగాలి, మాతృభాష పట్ల అభిమానం పెరగాలి. ఆంధ్రోద్యమ స్ఫూర్తి పల్లెసీమల ద్వారా వ్యాపించాలి. గ్రామీణ జనావళికి సర్కారీనౌకర్ల వల్ల ఏర్పడే పీడను తొలగించాలి. ఉద్యమంలో రాజకీయ క్రీనీడలు చోటు చేసుకోకుండా చూడాలి. ప్రభుత్వానికి అధికార వర్గానికి ఆంధ్రోద్యమ కార్యకర్తలపై అనుమానాలు ప్రబలకుండా జాగ్రత్తపడాలని ఆయన అనుకునేవారు. మాడపాటి హనుమంతరావు తన ప్రజాజీవితంలో ఒకే ఒకసారి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని శాసనసభకు 1952లో పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరుగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలోనూ ఆయనకు స్థానం దక్కింది. ఆ శాసనమండలికి తొలి అధ్యక్షునిగానూ ఆయన వ్యవహరించారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతికి కృషి చేసిన మాడపాటి వారు చిరస్మరణీయులుగా నిలిచారు.                                   *రూపశ్రీ. 

ఫ్యూచర్ ఫేకింగ్.. చాలామంది జీవితాలు నాశనం అయ్యేది దీనివల్లే..!

  ఫ్యూచర్ అంటే భవిష్యత్తు..  రేపు అనేది కూడా భవిష్యత్తు కిందకే వస్తుంది.  రేపు అనేది ఎప్పుడూ బావుంటుంది.  చాలా వరకు రేపటి గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తారు.  కానీ రేపు అనేది  చాలా అందంగా ఉంటుందని నమ్మించి ఆ తర్వాత మోసం చేయడమే ఫ్యూషర్ పేకింగ్ అని పిలవబడుతోంది. చాలా వరకు ఈ ఫ్యూచర్ ఫేకింగ్ లో ప్రేమ, వివాహం బంధాలలో చిక్కుకున్న వాళ్లే బలి అవుతూ ఉంటారు.  అసలు ఈ ఫ్యూచర్ పేకింగ్ కారణంగా ఎందుకు నష్టం జరుగుతుంది? దీని కారణంగా ఎవరు ఎలా బలి అయిపోతున్నారు తెలుసుకుంటే.. నువ్వు బాగా చదువుకుంటే నీ భవిష్యత్తు అందంగా ఉంటుంది. మంచి ఉద్యోగం వస్తుంది అని పెద్దలు పిల్లలకు చెబుతారు. ఇది పిలల్ల భవిష్యత్తును మంచిదిశగా తీసుకెళ్తుంది. కానీ ప్రేమించిన అమ్మాయితో  అబ్బాయి  భవిష్యత్తు గురించి ఆశ కల్పించి,  భవిష్యత్తులో  తనను చూసుకునే విధానం గురించి అందంగా, గొప్పగా చెప్పి  వాస్తవ జీవితంలో ఆ అమ్మాయిని  శారీరకంగా లేదా ఆర్థికంగా ఉపయోగించుకోవడం అనేది ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది.  ఎందుకంటే అమ్మాయికి తన ప్రేమికుడు చెప్పిన మాటలన్నీ కేవలం ఆశ పెట్టడం కోసం చెప్పిన మాటలే తప్ప అవన్నీ వాస్తవంగా అతను చేయడు.   పైన చెప్పుకున్నట్టే.. వివాహం అయిన తరువాత భార్యను మభ్యపుచ్చి  భార్యను ఇబ్బందుల పాలు చేసి,  ఆర్థికంగా అయినా వేరే ఇతర విషయాలలో అయినా లాభపడే భర్తలు చాలామంది ఉన్నారు.  భార్యకు భవిష్యత్తు గురించి ఆశను,  సంతోషాన్ని ఎర వేసి భార్యను  మోసం చేసేవారు ఉంటారు.  ఇందులో భార్య నష్టపోవడమే కాకుండా భవిష్యత్తులో తనకంటూ ఎలాంటి సంతోషం లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది.   మనుషులకు రేపటి మీద ఆశ చూపడం,  భవిష్యత్తులో అది చేస్తా, ఇది చేస్తా అని అబద్దపు వాగ్దానాలు చేసి వారు లాభపడిన తరువాత   అవన్నీ వట్టి మాటలుగానే మిగిలిపోతాయి. ఇది కేవలం భార్యాభర్తలు, ప్రేమ వంటి స్థితులలోనే కాకుండా  వృద్దులు, పిల్లలు కూడా ఈ ఫ్యూచర్ పేకింగ్ లో బలైపోయే అవకాశాలు ఉన్నాయి.    అందుకే భవిష్యత్తు గురించి ఎవరైనా చేసే వాగ్థానాల కోసం  వర్తమానంలో నష్టపోవడానికి ఎప్పుడూ సిద్దపడకూడదు.                                       *రూపశ్రీ.  

ఈ ఒకే ఒక్క గుణం మనిషి పతనానికి కారణం అవుతుంది!!

మనిషిని అధమ స్థితిలోకి నెట్టేసే దారుణమైన గుణం అహంకారం. అహంకారం గురించి కలిగిన నష్టాలను చరిత్రలో ఒకసారి పరికిస్తే.. మహాభారతంలో దుర్యోధనుడు స్వయంగా ఏమీ రాజ్యాన్ని సంపాదించుకోలేదు. కానీ కాలానుగుణంగా, వారసత్వంగా అధికారం సంప్రాప్తించింది. ఆ ఆధిపత్యం ఆయనలో అంతకు పదింతల అహంకారాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ శకునుతో పాటు దుష్టులందరూ వచ్చి చేరారు. యువరాజుగా యౌవనంలో ఉన్న ఆయనకు గర్వం కళ్ళను నెత్తికెక్కించింది. ఇక నన్ను ఎదిరించేవారు ఎవరుంటారన్న అహంభావానికి మనస్సులో బీజం పడింది. అప్పటి వరకూ సోదరసమానులైన పాండవులతో అతను సఖ్యంగానే ఉన్నప్పటికీ ఆయనలోని అధికారమదం వారిపై విషభావనలను ఎగజిమ్మింది. ఫలితంగా పెద్దల మాటలను పెడచెవిని పెట్టాడు. సాక్షాత్తూ కాలస్వరూపుడైన భగవంతుడు ప్రత్యర్థిగా ఉన్నాడని తెలుసుకోలేనంత గర్వాంధకారుడయ్యాడు. తన బలగం, బలం అతి స్వల్పమైనా, దానినే దుర్యోధనుడు అత్యధికమైందిగా భావించాడు. పాండవులను హేళన చేశాడు.  ఒక్క యాదవుడిని, అదీ యుద్ధం చేయకుండా సారథిగా రథం తోలుతానన్న వాడిని నమ్ముకొని కురుక్షేత్ర రణరంగంలోకి కాలుమోపుతున్నారని అవమానపరిచాడు. 'తాత్కాలిక సంపదలను, వైభవాలను చూసుకొని పొగరుతో ఎదుటివారిని చులకన చేసే వారి సంపదలు చెదిరిపోవటమే కాకుండా, వారికి పూర్వుల నుంచి సంక్రమించిన వారసత్వ వైభవాలు కూడా సమూలంగా నాశనమవుతాయి' అని విదురుడు లాంటివారు హితవు పలుకుతారు. అయినా దుర్యోధనుడు తలబిరుసుతో దాయాదులతో సమరానికే సిద్ధ పడ్డాడు. ఫలితంగా రణభూమిలో అసువులుబాసాడు. తాత్కాలికమైన పేరు ప్రతిష్ఠలనూ, ధన, పరివారాలనూ చూసుకొని విర్రవీగే అవివేకులను హెచ్చరిస్తూ కాలమహిమను అభివర్ణిస్తూ శంకర భగవత్పాదులు ఇలా అన్నారు..... మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల స్సర్వమ్ ।  మాయామయ మిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ॥ ధనం, పరివారం, యౌవనం ఉన్నాయని గర్వించకు. క్షణంలో కాలం వాటన్నింటినీ హరించివేస్తుంది. ఇదంతా మాయామయ మనీ, మిథ్య అనీ, అశాశ్వతమని గ్రహించి, జ్ఞానివై పరబ్రహ్మాన్ని పొందడమంటున్నారు. కాలవశాన సంప్రాప్తించినవి కాలంతోనే సమసిపోతాయని తెలుసుకోలేక, మనలో చాలామంది. అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.  నిజానికి ఈ ప్రపంచంలో మనం సాధించామనుకుంటున్నవన్నీ మధ్యలో వచ్చి, మధ్యలోనే వెళ్ళిపోతాయి. అందం కావచ్చు, అందలం కావచ్చు ఏదైనా శాశ్వతంగా మనతోనే ఉండిపోదు. అలాంటి తాత్కాలికమైన తళుకుబెళుకులను చూసుకొని అహంకరిస్తే, అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు. మహా మహా సామ్రాజ్యాలే కాలగర్భంలో కలిసిపోయాయి. మగధీరులనిపించుకున్న మహారాజులే నేడు మౌనంగా సమాధుల్లో సేద తీరుతున్నారు. కాలమే మనందరితో భిన్నమైన పాత్రల్ని పోషింపజేస్తుందని తెలుసుకోలేక ఆయా స్థానాలతో విపరీతంగా తాదాత్మ్యం చెందుతున్నాం. వాటినే మన నిజ స్వరూపాలుగా నిర్వచించుకుంటున్నాం. తీరా అవి చేజారిపోయాక, విలపిస్తూ ఉన్నాం.   కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే?... అంటాడు బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడితో! పూర్వం ఎందరో రాజులు ఉన్నారు! వారికి ఎన్నో రాజ్యాలూ ఉన్నాయి! వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదను మూటకట్టుకొని పోలేదు కదా! ప్రపంచంలో వారి పేరు కూడా మిగల్లేదు కదా! ఈ విషయం అర్థం చేసుకుంటే మనిషి జీవితం ఎంతో బాగుంటుంది.                                      *నిశ్శబ్ద.

మీ భర్త రొమాంటిక్ గా ఉండటం లేదా? ఇలా చేసి చూడండి..!

భార్యాభర్తల మధ్య  బంధం దృఢంగా ఉండటానికి,  భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని కీలకంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఫిజికల్ రిలేషన్,  ప్రేమను వ్యక్తం చేయడం, చనువుగా ఉండటం,  ఇద్దరూ కలిసి సమయాన్ని గడపడం వంటివి ఎన్నో ఉంటాయి.  చాలామంది భార్యలు తమ మనసులో భర్త పట్ల తమకున్న ప్రేమను,  వారి పట్ల తమ ఇష్టాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తుంటారు. కానీ మగాళ్లు మాత్రం తమ మనసులో విషయాలు బయట పడకుండా కొందరు,  అసలు ఎలాంటి రొమాంటిక్ సెన్స్ లేకుండా ఎప్పుడూ గంభీరంగా ఉండటం,  తమ పనులలో తాము నిమగ్నం అయి ఉండటం వంటివి చేస్తుంటారు.  దీని కారణంగా భార్యలు చాలా డిజప్పాయింట్ అవుతుంటారు.  తమ వైవాహిక జీవితం ఆశించినంత రసభరితంగా లేదని వాపోతుంటారు.  అలాగని తమ భర్తలు చెడ్డ వారు ఏమీ కాదని చెబుతుంటారు.  ఇలాంటి భార్యలు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. వారి భర్తలు భార్యలను ప్రేమలో ముంచెత్తుతారు. తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఓపెన్ గా మాట్లాడాలి.. ప్రతి భార్య చాలా వరకు తను ఏమీ చెప్పకుండా, అడగకుండానే తన భర్త తన ముందు ప్రేమను వ్యక్తం చేయాలని,  తనను సంతోషపెట్టాలని అనుకుంటుంది. కానీ భర్త రొమాంటిక్ గా లేనప్పుడు భార్య ఓపెన్ గా మాట్లాడటం ముఖ్యం.  తను కోరుకుంటున్నది ఏంటి? జీవితంలో ఉండాల్సిన విషయాలేంటి? భార్యాభర్తలు ఎలా ఉండాలని తను అనుకుందో.. ఇద్దరికీ సాధ్యాసాధ్యమైన విషయాలు ఏంటో.. భర్త ఏ విషయాల పట్ల నిరాసక్తిగా ఉంటున్నాడో,   ఎందుకు నిరాసక్తిగా ఉంటున్నాడో.. మొదలైన విషయాలన్నీ ఫిర్యాదు చేస్తున్నట్టు కాకుండా, భర్తను నిందిస్తున్నట్టు కాకుండా..  సౌమ్యంగా తన మనసును అర్థం అయ్యేలా చెప్పాలి. ఇలా చేస్తే భర్త కూడా భార్య మనసును అర్థం చేసుకుని భార్య కోరుకున్నట్టు ఉండటానికి తన వంతు ప్రయత్నం చేయగలడు. సర్ఫ్రైజ్.. చిన్న చిన్న సర్ప్రైజ్ లు భార్యభర్తల మధ్య బంధాలను దృఢంగా ఉంచుతాయి. భర్త కోసం కూడా అదే విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేయవచ్చు.  లేదంటే భర్తకు నచ్చిన ఆహారాన్ని వండి పెట్టవచ్చు. అతను చాలా రోజుల నుండి కొనాలనుకుని కొనలేకపోయిన  వస్తువును అతనికి ఇవ్వవచ్చు. ఇవన్నీ చేస్తే భార్య భర్త గురించి ఎంత ఆలోచిస్తోందో అనే విషయం భర్తకు అర్థమవుతుంది. అతను కూడా భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి సమయం కేటాయించుకుంటాడు. ఆప్యాయత.. భార్యాభర్తలు రొమాంటిక్ గా ఉండాలంటే వారి మద్య ప్రేమ కూడా బలంగా ఉండాలి.  ఇద్దరి మధ్య ప్రేమ, అప్యాయత,  ఒకరి పట్ల ఒకరు చూపించే బాధ్యత వంటివి ఇద్దరినీ దగ్గర చేస్తాయి. అప్పుడప్పుడు భార్యభర్తలు ఒకరిపట్ల  ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకోవాలి.  ప్రేమికులలాగా చిలిపి పనులు చేయడం,  సమయాన్ని గడపడం,  ప్రేమను వ్యక్తం చేయడానికి తమకు తూచిన విషయాలను కవితాత్మకంగా వ్యక్తం చేయడం, చూపులు,  సైగలతోనే మాట్లాడటం వంటివి రొమాంటిక్ ఫీలింగ్ ను పెంచుతాయి. స్పేస్.. ఒక మనిషిని అతిగా పట్టించుకోవడం కూడా అవతలి వారికి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.  భార్యాభర్తలు కూడా అంతే.  వారు ఇద్దరూ ఓ శాశ్వత బంధంలో ఉన్నా సరే.. ఇద్దరికి స్పేస్ అవసరమే.. భర్తకు ఉన్న స్నేహాలు, పరిచయాలలో అతను తనంతకు తాను భార్యకు పరిచయం చేసే వరకు భార్య పట్టించుకోకపోవడమే మంచిది. ప్రతి వ్యక్తి తన ప్రేమను వ్యక్తం చేయడానికి వివిధ మార్గాలు   ఉంటాయి.  వారు ఆ మర్గాన్ని ఎంచుకుని తమ ప్రేమను వ్యక్తం చేసేవరకు ఓపిక పట్టాలి తప్ప రొమాంటిక్ తెలియని వ్యక్తి అని అనకూడదు. ఈ కాలంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే తమ మనసులో విషయాలను వ్యక్తం చేయడానికి చాలా సమయం తీసుకుంటారు.  కాబట్టి అబ్బాయిలకు  సమయం ఇవ్వాలి.  బలవంతంగా అతను ఏదో చెయ్యాలని చేయడానికి బదులు, అతను సహజంగా భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేసేవరకు అతనితో ఫ్రెండ్లీగా ఉంటూ సాగాలి. అంగీకారం.. భార్యాభర్తలు ఒకరి పట్ల మరొకరు ప్రేమను పెంచుకోవాలన్నా, దాన్ని వ్యక్తం చేయాలన్నా అంగీకార గుణం బాగా సహాయపడుతుంది.  భర్త అలవాట్లు, అతని ఇష్టాలు, అభిరుచులను భార్య గౌరవిస్తూ ఉంటే సహజంగానే భర్తకు తన భార్య పట్ల ఎనలేని ప్రేమ,  గౌరవం పెరుగుతాయి. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించడమే కాకుండా ఒకరికి నచ్చిన పనులు  ఇద్దరూ కలిసి చేస్తుంటే ఒకరి పట్ల మరొకరికి ప్రేమ పెరుగుతుంది.  దాన్ని వ్యక్తం చేసే సందర్బాలు కూడా పెరుగుతాయి. గ్రహించడం ముఖ్యం.. ప్రేమ అంటే పెద్ద పెద్ద సర్ప్రైజ్ లు ఇవ్వడం,  పెద్ద బహుమతులు ఇవ్వడం, ఖరీదైన వస్తువులు ఇవ్వడం.  పనులు పదులుకుని మరీ సమయాన్ని కేటాయించడం కాదు.. భర్తలు తమకున్న సమయంలోనే భార్యలను సంతోషపెట్టాలని చూసేవారు ఉంటారు.  భార్యకు చిన్న పనులలో సహాయం చేయడం,  భార్య చెప్పే విషయాలను ఓపికగా వినడం, భార్య బాధలో ఉన్నప్పుడు ఆమెకు ఊరట ఇవ్వడం మొదలైనవన్నీ భార్య పట్ల ప్రేమతో చేసేవే. కొందరు సింపుల్ గా తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.  ఈవిషయాన్ని భార్యలు గుర్తిస్తే  భర్తకు తమ పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.                                                *రూపశ్రీ. 

వేమన జయంతి..  వేమన వాక్కులు.. జగతికి చుక్కానీ లు..!

  విశ్వదాభిరామ వినురవేమ..  ఈ వాక్యం దాటి ఏ విద్యార్థి ముందుకు వెళ్లడు.  పిల్లల నాల్కల మీద నాట్యం అడే తొలి పద్యాలు వేమన పద్యాలే.. ఎంతో సులువుగా ఉంటూ ఎంతో లోతైన విషయ సమాచారాన్ని తెలపడం వేమన పద్యాల విశిష్టత.  వేమన 1367-1478 కాలాల మధ్య జీవించాడు.  సి.పి బ్రౌన్ వేమన పద్యాలను పుస్తక రూపంలో అచ్చు వేయించడం ద్వారా వేమన పద్యాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.  అంతేనా.. సి.పి బ్రౌన్ వేమన పద్యాలను ఇంగ్లీషులోకి కూడా అనువదించాడు. పామరులకు అర్థమయ్యే భాషలు పద్యాలు చెప్పిన ప్రజాకవి వేమన. ఆటవెలది పద్యాలతో అందరిని మెప్పించిన వేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా యోగి వేమన గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే.. యోగి వేమన ఎంత ప్రాచీన కవినో అందరికీ తెలిసిందే.. అయితే ఈయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈయన కులం నుండి ఈయన జన్మ వృత్తాంతం, కవిగా మారిన వైనం అన్నీ ఇప్పటికీ  స్పష్టత లేకుండానే ఉన్నాయి. వేమన గురించి పరిశోధన చేసిన వారు ఒక్కొక్కరు ఒకో విధమైన విశ్లేషణ,  ఒకో విధమైన కథనం అందించారు. అయితే వీటిలో వేమన వేశ్యాలోలుడి నుండి కవిగా మారిన కథనే చాలా ఆదరణ పొందింది.  పైగా వేమన కవిగా మారిన విధానం,  వేమన పద్యాల మకుటం గురించి కూడా స్పష్టత ఇస్తుంది. వేమన కథ.. కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అసలు పేరు అనువేమారెడ్డి. ఈయన చిన్నతమ్ముడే వేమన్న.  వేమన వదిన నరసాంబారాణి. వేమన ఒక వేశ్య వలలో చిక్కుకుంటాడు. వేశ్య ఏది అది కాదనకుండా ఆమె ముందు ఉంచేవాడు.  ఒకరోజు వేశ్య తనకు రాణి అయిన నరసాంబారాణి ఆభరణాలు వేసుకుని సంతోషపడాలని ఉందని వేమనకు చెబుతుంది.  వేమన వేశ్య మాటను కాదనలేక తన వదినతో ఆభరణాలు అడుగుతాడు.  నరసాంబారాణి తన ముక్కుకు ఉన్న బులాకీ తప్ప మిగిలిన ఆభరణాలు అన్నీ వేమనకు ఇచ్చి పంపుతుంది. కానీ వేశ్య మాత్రం తనకు బులాకీ కూడా కావాల్సిందే అని పట్టుబడుతుంది. దీంతో వేమన బులాకీ కూడా అడుగుతాడు.  అయితే నరసాంబారాణి తన బులాకీని ఇస్తూ నేను ఇచ్చిన ఆభరణాలు అన్నీ వేసుకుని నగ్నం ఉన్నప్పుడే నువ్వు ఆమెను చూడు అని చెప్పి పంపుతుంది.   వేమన వేశ్యను అలాగే చూడగా అతనికి స్త్రీలు అంటే విరక్తి పుట్టింది.  వెంటనే కోటకు వెళ్లిపోయాడు. నరసాంబారాణి నగలను తయారుచేసే అభిరాముడు ఎప్పుడూ కోటకు ఆలస్యంగా వచ్చేవాడు. ఇది గమనించిన వేమన అతను ఎందుకు కోటకు వస్తున్నాడో తెలుసుకోవాలని అభిరాముడిని కంట కనిపెట్టాడు.  అభిరాముడు దగ్గరలో ఒక కొండ గుహలో ఉన్న అంబికాశివయోగిని సేవించడం వేమన్న చూశాడు.  అంబికాశివయోగి అబిరాముడితో రేపు రా నీకు మంత్రోపదేశం చేస్తాను అంటాడు.  అయితే వేమన్న అంబికాశివయోగిని బంధించి అబిరాముడిలాగా కొండ గుహకు వెళతారు.  యోగి వేమన్న చెవిలో మంత్రోపదేశం చేసి నాలుక మీద బీజాక్షరాలు రాస్తాడు. దీంతో వేమన్నకు పాండిత్యం లభిస్తుంది.  అబిరాముడికి దక్కాల్సినది తనకు దక్కినందుకు వేమన పశ్చాత్తాప పడి అబిరాముడి కాళ్ల మీద పడి.. తను రాసే పద్యాల మకుటంలో అభిరాముడి పేరు చేర్చి అభిరాముడి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశాడు. ఇదీ వేమన వెనుక ఉన్న కథ. యోగి వేమన గురించి తెలుగు సాహిత్యం చాలా గొప్పగా చెప్తుంది.  తెలుగు కవులు, రచయితలు వేమన పద్యాల లోతును, పద్యాల విశిష్టతను తమ పరిశోధనలు,   విశ్లేషణల ద్వారా తెలిపారు.  వేమన గురించి,  వేమన పద్యాల గురించి ఎన్నో పరిశోధనా వ్యాసాలు కూడా వెలువడ్డాయి. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నార్ల వెంకటేశ్వరరావు  వేమన జీవిత చరిత్రను రాయగా అది 14 భాషలలోకి అనువాదం అయ్యింది.  ఐక్యరాజ్యసమితి -యునెస్కో విభాగం వారు ప్రపంచ భాష కవులలో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను కూడా ఎన్నుకుని ఆయన పద్యాలను వివిధ భాషలలోకి అనువదించారు.                                             *రూపశ్రీ.

సైకోపాత్ లైఫ్ పార్ట్నర్ లకు ఉండే లక్షణాలు ఇవే..!

  సైకోపాత్.. వినడానికి కాస్త భయం పుట్టించే పదం.  మానసికంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు సైకోపాత్ లాగా బిహేవ్ చేస్తుంటారు.  సాధారణంగా బయట ఎవరికో ఇలాంటి సమస్య ఉంటే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ  రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులతో జీవితం పంచుకోవాల్సి వస్తే మాత్రం అది నరకమే.  సైకోపాత్ ల ప్రవర్తన, వారి స్వభావం చాలా ప్రమాదకంగా ఉంటుంది. సైకోపాత్ లకు ఉన్న కొన్ని లక్షణాలు తెలుసుకుంటే.. సైకోపాత్  లక్షణాలున్న లైఫ్ పార్ట్నర్ ను గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తమ నిజమైన వ్యక్తిత్వాన్ని దాచడంలో చాలా తెలివైనవారు.  సైకోపాత్ భాగస్వామితో జీవించడం  మానసిక,  భావోద్వేగ ఆరోగ్యానికి ప్రమాదకరం. అబద్దం చెప్పే అలవాటు.. సైకోపాత్‌లు తమ అసలు వ్యక్తిత్వాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు చిన్న విషయాల గురించి కూడా అబద్ధాలు చెబుతారు. తమ అబద్ధాలను నిజమని నిరూపించుకునేందుకు కొత్త కథలను అల్లుతూనే ఉంటారు. అతని మాటలు తరచూ ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటాయి. ఎమోషన్స్.. ఎలాంటి   తప్పు చేయకపోయినా,  ఏమాత్రం సంబంధం లేకోపోయినా సరే.. తప్పు చేసిన భావనను కల్పించేలా వారు ప్రవర్తిస్తారు.  అవి వారితో రిలేషన్ లో ఉన్న వారిని  మళ్లీ మళ్లీ అపరాధ భావంలోకి లాగేస్తాయి. సైకోపాత్ లైఫ్ పార్ట్నర్స్ తమ భాగస్వాములను  నియంత్రించడానికి ఎమోషన్స్ తో ఆడుకుంటారు.   ఇలాంటి వారితో రిలేషన్ లో ఉంటే తమ రిలేషనే్ బలంగా ఉందని వారితో రిలేషన్ లో ఉన్నవారికి అస్సలు అనిపించదు. విమర్శ.. సైకోపాత్‌లు తమతో రిలేషన్ లో ఉన్నవారిని  అవమానపరచడానికి ఎటువంటి చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. అలాంటి వారికి తమతో రిలేషన్ లో ఉన్న వారి తప్పులను పదే పదే ఎత్తి చూపడం అలవాటుగా ఉంటుంది. ముఖ్యంగా వారితో రిలేషన్ లో ఉన్న వారి ఆత్మగౌరవాన్ని నాశనం చేసేందుకు చాలా ప్రయత్నిస్తారు. ప్రతిస్పందన.. సాధారణంగా మనిషికి ఎదుటివారు ఎమోషన్స్ లో ఉన్నప్పుడు రెస్పాండ్ కావడం అనే అలవాటు ఉంటుంది.  కానీ సైకోపాత్ లతో రిలేషన్ లో ఉంటే వారి నుండి ఎలాంటి ప్రతిస్పందన లభించదు. ఎమోషన్ అవుతున్న వ్యక్తులను ఊరడించక పోగా.. విమర్మలు గుప్పించి మరింత బాధపెట్టడానికి, తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే వారు ఆలోచిస్తారు. నిందలు.. సైకోపాత్ లు తాము చేసే తప్పులను ఎప్పుడూ అంగీకరించరు.  ప్రతిసారీ ఎదుటి వారినే నిందిస్తుంటారు.  తాము చేసిన తప్పులకు కూడా ఎదుటివారినే భాద్యలను చేసి వారిని దూషించి మరీ సంతోషపడతారు. వారికి అహం కూడా ఎక్కువగా ఉంటుంది. వారి అహాన్ని తృప్తి పరచుకోవడానికి  తమ భాగస్వామిని ఎంత బాధపెట్టడానికి అయినా సైకోపాత్ లు వెనుకాడరు. నియంత్రణ.. సైకోపాత్ లు తమతో రిలేషన్ లో ఉన్నవారిని ఎప్పుడూ నియంత్రించాలని  కోరుకుంటారు.  వారు ప్రథితీ తమ కనుసన్నల్లో జరగాలని అనుకుంటారు. వారి నిర్ణయాలతో వారి భాగస్వాములను పదే పదే ఇబ్బంది పెడతారు. వారితో రిలేషన్ లో ఉండేవారు చాలా వరకు స్వతంత్రత కోల్పోతుంటారు. ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోలేరు. కోపం.. సైకోపాత్ లకు కోపం ఎక్కువ.  చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉంటారు. ఒక్కోసారి కోపంలో హింసాత్మకంగా కూడా మారుతుంటారు .  ఆ తరువాత తమ ప్రవర్తనకు తమ భాగస్వామినే భాధ్యులను చేస్తారు.                                          *రూపశ్రీ.  

పిల్లలకు చిన్నతనంలోనే ఈ అలవాట్లు నేర్పిస్తే.. పెద్దయ్యాక ఎవరి మీద ఆధారపడరు..!

  తల్లిదండ్రులుగా  పిల్లలకు ఇవ్వగల గొప్ప బహుమతి ఆరోగ్యకరమైన, సమతుల్య జీవనశైలి.  దీని కోసం పిల్లలకు తగిన  శక్తిని,  సమతుల్య జీవనశైలి మీద తగిన అవగాహనను పిల్లలకు కల్పించాలి. చిన్న వయస్సు నుండే సరళమైన, స్పృహతో కూడిన అలవాట్లను నేర్పించడం అనేది పిల్లల శారీరక, మానసిక శ్రేయస్సుకు పునాది వేస్తుంది.  అదే సమయంలో పిల్లల రోజును కూడా పర్పెక్ట్ గా ఉండేలా చేస్తుంది. పిల్లలకు సరైన దినచర్యను అందించి మంచి అలవాట్లు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఆహారం.. పిల్లలు ముందుగా తమ కళ్లతో ఆహారాన్ని చూసి అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. పిల్లల ప్లేట్‌లో రంగురంగుల ఆహారాన్ని చేర్చాలి . ఇందులో పండ్లు, కూరగాయలు, గింజలు,  విత్తనాలు మొదలైనవి ఉంటాయి. వివిధ ఆకారాలలో ఆహారాన్ని పెట్టడం వల్ల పిల్లలు ఆహారం పట్ల ఆకర్షితులవుతారు. ఆహారాన్ని ఇష్టంగా,  వృథా చేయకుండా తినడం అలవాటు చేసుకుంటారు. యాక్టీవిటీ.. పిల్లలు సాధారణంగానే చురుగ్గా అల్లరి చేస్తూ ఆడుతూ ఉంటారు. అయితే వారిని సైక్లింగ్,  వాకింగా్,  డాన్స్ వంటి ఫిజికల్ యాక్టివిటీ ల వైపు ఆకర్షితులయ్యేలా తల్లిదండ్రులే చేయాలి. నిద్ర.. పిల్లలు కొంతమంది రాత్రి సమయంలో నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటారు.  రాత్రి నిద్రించడానికి ఇబ్బంది ఉంటే పడుకునే ముందు ప్రశాంతమైన దినచర్యను అలవాటు చేయాలి. వెచ్చని స్నానం చేయడం, తేలికపాటి సంగీతం వినడం, నిద్రవేళ కథ వినడం మొదలైనవి బిడ్డ రాత్రిపూట బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి.ఇవి పిల్లల మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.  బాగా నిద్ర పట్టేలా చేస్తాయి. ఎమోషన్స్..  “ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది?”.. ఇాలాంటి ప్రశ్నను పిల్లలకు ఎప్పుడైనా వేశారా? ఇలాంటి ప్రశ్నలు పిల్లల ఎమోషన్స్ ను తెలుసుకోవడంలో సహాయపడతాయి.  భావోద్వేగాలను గుర్తించడానికి,  వ్యక్తీకరించడానికి పిల్లలకు ఇదొక మార్గం.  దీన్ని పిల్లలకు  నేర్పించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి భావాలు ఉంటాయి.  వాటిని పంచుకోవడం ఎల్లప్పుడూ సరైందేనని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి. పని.. రోజువారీ కార్యకలాపాలను వారి స్వంతంగా చేయడం వలన పిల్లలు తమ అవసరాలపై తాము దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. పళ్లు తోముకోవడం, బాత్‌రూమ్‌కి వెళ్లడం, స్నానం చేయడం, దుస్తులు ధరించడం, తినడం.. ఇవన్నీ పిల్లలను వ్యక్తిగతంగా ఎదగడంలో సహాపడతాయి.  పిల్లల పనులు వారు చేసుకోవడం అలవాటు చేసుకుంటే వారి ప్రవర్తన కూడా మెచ్యురిటీగా మారుతుంది.  ఇలా పనులు చేసుకోవడాన్ని పిల్లలు  స్వాతంత్ర్యం గా భావిస్తారు.  ఇది వారిలో సెల్ఫ్ రెస్పెక్ట్ ను,  సెల్ఫ్ కాన్పిడెంట్ ను పెంచుతుంది.                                        *రూపశ్రీ.

మగువల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. ఆరోగ్యకరమైన బరువే..!

  ఆరోమగువలగ్యానికి శ్రీరామ రక్ష.. ఆరోగ్యకరమైన బరువే..!ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పటి మహిళల ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా చాలా దారుణ స్థితికి దిగజారింది.  ముఖ్యంగా చాలామంది మహిళలు అధిక బరువు సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల మార్పుల కారణంగా,  ఒత్తిడి కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.. మహిళలు  సరైన బరువు ఉంటే ఈ సమస్యలు అసలు ఉండనే ఉండవనీ.. దీని గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో మహిళల ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడానికి కూడా ఒక ప్రత్యేక రోజును జరుపుకోవడం మొదలుపెట్టారు.  ప్రతి ఏడాది జనవరి నెలలో మూడవ గురువారాన్ని మహిళల ఆరోగ్యకరమైన బరువు దినోవత్సంగా కేటాయించారు. ఇది అంత పరిచయమైన దినోత్సవం కాకపోయినా మహిళల కోణంలోనూ, మహిళల ఆరోగ్య పరంగా గమనిస్తే ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగినదే.. ఎవరిని అయినా మొదట చూడగానే వారి శారీరక రూపాన్నే చూస్తాం.  లావుగా ఉంటే అబ్బో ఎంత లావో అని.. సన్నగా ఉంటే బక్కగా ఉన్నారని అంటుంటాం. అయితే కొందరు లావు ఉన్నా ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు.  మరికొందరు సన్నగా ఉన్నా చాలా ఇబ్బందికరంగా, అనారోగ్యంగా,  ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ లావుగా ఉంటే అదేదో రోగమున్నట్టు,  సన్నగా ఉండటం అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు భావిస్తారు కొందరు. కానీ ఆరోగ్యంగా ఉండటం అనేది కేవలం బరువు ద్వారా నిర్ణయించడం జరగదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనేది ఆరోగ్యకరమైన బరువును నిర్ణయించడానికి ఉపయోగించే ప్రమాణం. ఇటీవల, ఆరోగ్యకరమైన బరువును కొలవడానికి కొత్త ప్రమాణాలు అభివృద్ధి చేస్తున్నారు.  ఇవి  BMI కంటే మరింత ఖచ్చితమైనవిగా ఉంటాయట. చాలా మంది మహిళలు  సరైన బరువుకు రావడానికి చాలా కష్టపడతారు. అధిక బరువు ఉన్నవారు అయితే బరువు తగ్గడం కోసం కడుపు మాడ్చుకుంటారు. సన్నగా ఉన్నవారు సరైన బరువుకు చేరడానికి అనారోగ్యకరమైన తిండి కూడా తింటారు. ఈ కారణాల వల్ల చాలా మంది ప్రాణాంతక సమస్యలలోకి జారుకుంటారు.  మరికొందరు మహిళలు బరువు మీద దృష్టి పెట్టరు. అందుకే కనీసం ఈ రోజు అయినా మహిళలు తమ బరువు విషయంలో ఆలోచించి సరైన బరువును  చేరుకోవడానికి ప్రణాళికలు వేసుకుని ప్రయత్నాలు చేసి లక్ష్యాలు చేరుకోవాలి. బరువు చేరుకోవడానికి ఏం చేయాలి? సరైన బరువు చేరుకోవడానికి డైట్ మెయింటైన్ చేయాలి.  ఆరోగ్యకరమైన, పోషకాహారం తీసుకోవాలి. వేపుళ్లు, నూనెలో వేయించిన ఆహారాలు,  ఫాస్ట్ ఫుడ్,  ఇన్స్టంట్ ఫుడ్ మొదలైనవి అవాయిడ్ చేయాలి. సమతుల్య ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించాలి. పాలు, పండ్లు, ఆకుకూరలు,  కూరగాయలు బాగా వినియోగించాలి. ఆహారం తీసుకోవడానికి తగినట్టు శారీరకంగా చురుగ్గా ఉండాలి.  రోజూ వ్యాయామం, నడక,  యోగా, సైక్లింగ్ వంటివి  ఏవో ఒకటి ఫాలో అవుతూ ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రతిరోజూ ధ్యానం చేయాలి.  ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాలి.  ఆహారం, వ్యాయామం,  ధ్యానం విషయాలలో ఎప్పుడూ ఏమాత్రం రాజీ పడకూడదు.                                  * రూపశ్రీ.

భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే.. ఇవి పాటించండి..!

  భార్యాభర్తల బంధం.. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి జీవితాంతం తోడు ఉండేది భార్యాభర్తల బంధమే.. మధ్యలో వచ్చే జీవిత భాగస్వాములు జీవితాంతం కష్టాల్లోనూ, సుఖాలలోనూ,  బాధలలోనూ తోడు ఉంటారు.  అయితే నేటి కాలంలో భార్యాభర్తల  బంధాలు చాలా పేలవంగా మారిపోయాయి.  విడాకులు ఎక్కువ అయ్యాయి.  చీటికి మాటికి గొడవలు జరగడం,  చిన్న విషయాలే విడిపోవడం వరకు దారితీయడం జరుగుతున్నాయి.  అలా కాకుండా భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా ఉండాలన్నా, భార్యాభర్తల మధ్య ఎలాంటి విషయాలు వారి బంధాన్ని విడదీసేంత ప్రభావం చూపించకూడదు అన్నా.. కొన్ని విషయాలు గుర్తుంచుకుని వాటిని పాటించాలి. మాట్లాడటమే కాదు.. వినాలి కూడా.. భార్యాభర్తల మధ్య బంధంలో మాట్లాడటం,  తమ పరిస్థితిని,  తమ బాధను,  సమస్యను తమ భాగస్వామితో చెప్పుకోవడం మామూలే.. అయితే కొందరు తాము చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పడానికి చూపించినంత ఆసక్తిని ఎదుటివారు చెప్పేది వినడానికి చూపించరు. అలా కాకుండా భార్యభర్తలు ఇద్దరూ తాము చెప్పే విషయంతో పాటూ.. ఎదుటివారు చెప్పేది కూడా శ్రద్దగా వెంటే చాలా వరకు వారి మధ్య సమస్య చిన్నగా ఉండగానే పరిష్కారం అవుతుంది. చర్చించాలి.. మనసులో ఉన్న ఏదైనా విషయాన్ని భాగస్వామితో చెప్పాలి అనుకుంటే దాన్ని డిస్కస్ చేసినట్టు చెప్పాలి. అంతేకానీ వాదించినట్టు,  గొడవ పడినట్టు ఎప్పుడూ చెప్పకూడదు. గౌరవం.. భాగస్వామితో ఎప్పుడైనా ఏదైనా విషయం గురించి విబేధించాల్సి వచ్చినా,  విబేదిస్తున్నా దాన్ని గౌరవంగానే చెప్పాలి. అంతేకానీ కోపంలో గౌరవాన్ని వదిలి  అరవడం,  ఏకవచనంలో నిందించడం,  అసభ్య పదజాలం వాడం చేయకూడదు. ప్రశంస.. ప్రశంస ప్రతి ఒక్కరికి మంచి బూస్టింగ్ ఇస్తుంది.  భాగస్వామిని ప్రసంశించడం వల్ల బంధం ఆరోగ్యంగా ఉంటుంది.  భాగస్వామి చేసే ఏ పనిని అయినా సరే.. నచ్చితే మొహమాటం లేకుండా మెచ్చుకోవాలి.  ఎలాంటి ఇగో లకు తావు ఇవ్వకూడదు. హ్యాపీ సొల్యూషన్.. భార్యాభర్తల బంధంలో ఏదైనా సమస్య వస్తే.. దాన్ని పరిష్కరించడానికి గొడవను ఎంచుకోవద్దు. దానికి బదులుగా శాంతియుతంగా దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమయం.. ఇప్పటి జనరేషన్ లో వాళ్లు ఉద్యోగాలు, బిజీ లైఫ్ ల కారణంగా ఒకరితో ఒకరు కలిసి ఉండే సమయం చాలా తక్కువ. దీని వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రోజులో ఇద్దరూ కొంతసేపు ఏకాంతంగా గడపాలి.  ఇద్దరూ కలిసి తినేలా,  ఇద్దరూ కలసి బయటకు వెళ్లేలా, ఇద్దరూ కలసి వంట చేసుకోవడం,  వర్కౌట్స్ చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. వన్ సైడ్ నిర్ణయాలు వద్దు.. భార్యాభర్తలు  ఏదైనా పని చేయాలని అనుకున్నా, ఏవైనా ప్లానింగ్ లు వేసినా అవి ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు అయి ఉండాలి.  అలా కాకుండా భార్యాభర్తలలో భర్త లేదా భార్య మాత్రమే నిర్ణయం తీసుకుని భార్యను ప్రేక్షకపాత్ర వహించేలా చేయకూడదు. దీని వల్ల భార్య తనకు ఎలాంటి విలువ ఇవ్వడం లేదని అనుకుంటుంది. ఇది తక్షణమే కాకపోయినా కాలక్రమంలో గొడవలకు,  విబేధాలకు దారి తీస్తుంది.                                        *రూపశ్రీ.

భారత సరిహద్దుకు భరోసా ఇచ్చే సోల్జర్.. ఇండియన్ ఆర్మీ డే 2025..!

"జై జవాన్.. జై కిసాన్" అనే నినాదం అందరికీ తెలిసిందే.. దేశానికి తిండి పెట్టేవాడు రైతన్న అయితే.. దేశానికి, దేశ ప్రజలకు రక్షణ ఇస్తూ దేశ ప్రజలు అందరూ ప్రశాంతంగా నిద్రపోవడానికి కారణం అవుతున్నది సైనికులు. దేశాన్ని రక్షించే వీర సైనికుల ధైర్యం,  అంకితభావం, వారు చేసే త్యాగాలు వెలకట్టలేనివి.  ఇలాంటి  వీర సైనికులను గౌరవించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన ఇండియన్ ఆర్మీ డే లేదా ఇండియన్ సోల్జర్ డే జరుపుకుంటారు.  దేశ సరిహద్దులలో శాంతి భద్రతలను కాపాడటంలోనూ, సంక్షోభాల సమయంలో అపన్న హస్తం అందించడంలోనూ దేశ సైన్యం చేసే కృషి మాటల్లో వర్ణించలేనిది. ఇంతకీ ఇండిన్ సోల్జర్ డే లేదా ఇండియన్ ఆర్మీ డే ని ఎందుకు జరుపుకుంటారు? ఇదే రోజు ఈ భారతదేశ సైనిక దినోత్సవం జరుపుకోవడం వెనుక కారణం ఏంటి తెలుసుకుంటే.. జనరల్  KM కరియప్ప గౌరవార్థం భారతదేశ సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదట్లో జనరల్ గానూ ఆ తరువాత ఫీల్డ్ మార్షల్ గానూ .. ఈయన జనవరి 15, 1949న భారత సైన్యం  కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు.  చివరి బ్రిటీష్ అధికారి జనరల్ సర్ ఫ్రాన్సిస్ రాయ్ బుచెర్ స్థానంలో KM కరియప్ప  నిలిచాడు. అందుకే ప్రతి సంవత్సరం భారతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత సైన్యం పూర్తి స్వాతంత్ర్యం పొంది, ప్రజాస్వామ్య దేశంగా మారింది. ఇది దేశ స్వాతంత్య్రం తరువాత  చరిత్రలో ఒక మలుపు. జనరల్ కరియప్ప ఆధ్వర్యంలో దేశం స్వాతంత్ర్యం వైపు,  స్వయం నిర్ణయాధికారం వైపు పురోగతి దిశగా సాగింది. ఇండియన్ ఆర్మీ డే ని దేశం యావత్తూ ఒక వేడుకగా జరుపుకుంటారు. అయితే ఇండియన్ ఆర్మీ డే  అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఈ రోజు ఆత్మపరిశీలన చేసుకోవడం,  కృతజ్ఞత తెలుపుకోవడం ముఖ్యమైన విషయం. సంక్షోభ సమయాల్లో దేశం బలంగా ఉండటం,   బయటి నుండి  దాడి చేసేవారి నుండి దేశాన్ని రక్షించడంలో భారత సైన్యం అందించిన, అందిస్తున్న  సేవలను గౌరవించడం ఈ రోజు ఉద్దేశం.  భారత సైన్యంలో 1.4 మిలియన్లకు పైగా క్రియాశీల సైనికులు ఉన్నారు.  భారతదేశ ఆర్మీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టాండింగ్ ఆర్మీగా నిలిచింది. భారతీయ సైన్యం స్వీయ నియంత్రణ, ధైర్యం,  సాహసోపేతమైన పనితీరుుకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా పేరొందిన సియాచిన్ గ్లేసియర్‌లోని రాజస్థాన్ ఎడారులు,  మంచుతో కూడిన ఎత్తులతో సహా కఠినమైన వాతావరణంలో భారత సైన్యం సైన్యం పని చేస్తుంది. అయితే చాలామందికి ఇండియన్ ఆర్మీ గురించి కొన్ని విషయాలు తెలియవు. అవేంటంటే.. 2019 నాటికి భారతదేశంలో అధికారికంగా  61 కంటోన్మెంట్లు ఉన్నట్టు గుర్తించబడింది.   శత్రు సేనలను ఎదుర్కొని అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన 21 మంది సైనికులకు భారతదేశ అత్యున్నత సైనిక అలంకరణ అయిన పరమవీర చక్ర అవార్డు లభించింది. భారత సైన్యం  మానవతా ప్రయత్నాలలో  ఆపరేషన్ రాహత్ కూడా ఉంది.  ఇది 2013లో ఉత్తరాఖండ్ వరదల సమయంలో నిర్వహించిన అతిపెద్ద పౌర రెస్క్యూ ఆపరేషన్లలో ఒకటి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను నిర్మించిన ఘనత భారత సైన్యానికి దక్కింది. బెయిలీ వంతెనగా పిలువబడే ఇది లడఖ్ లోయలో, కఠినమైన హిమాలయ పర్వతాల మధ్య ద్రాస్,  సురు నదుల మధ్య విస్తరించి ఉంది. ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆగస్టు 1982లో భారత సైన్యం పూర్తి చేసింది. భారత సైన్యం 27 రెజిమెంట్లను కలిగి ఉంది. ప్రతి దానికి స్వంత,  ప్రత్యేక చరిత్ర,  సంప్రదాయాలు ఉన్నాయి. సిక్కు రెజిమెంట్ అత్యధికంగా అలంకరించబడిన రెజిమెంట్ కాగా, 1750లో స్థాపించబడిన మద్రాస్ రెజిమెంట్ పురాతనమైనది. భారతదేశం ఎన్నడూ నిర్బంధాన్ని అమలు చేయలేదు. భారతీయ సైన్యంలోని సిబ్బంది అందరూ స్వచ్ఛంద సేవకులు, వృత్తిపరమైన సైనిక దళం పట్ల దేశం  నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కుమావోన్ రెజిమెంట్ తొలిసారిగా శౌర్య పురస్కారాలను అందుకుంది. సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ గ్లేసియర్‌ను భారతదేశం నియంత్రిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ చలనచిత్రం "బోర్డర్"కి స్ఫూర్తినిచ్చిన లాంగేవాలా యుద్ధంలో భారతదేశం వైపు కేవలం రెండు మరణాలు మాత్రమే జరిగాయి. డిసెంబర్ 1971లో భారతదేశం-పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో జరిగిన ఈ యుద్ధంలో కేవలం 120 మంది భారతీయ సైనికులు మాత్రమే పాల్గొన్నారు, వారు ఒకే జీపులో అమర్చిన M40 రీకాయిల్‌లెస్ రైఫిల్‌తో ఆయుధాలు ధరించి పాకిస్తాన్ బలగాలకు వ్యతిరేకంగా కోటను రక్షించారు. శత్రు దళాలు దాదాపు 2,000 మంది ఉన్నారు, వీరికి 45 ట్యాంకులు,  మొబైల్ పదాతిదళ బ్రిగేడ్ మద్దతు ఉంది. అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ భారత సైనికులు రాత్రంతా తమ మైదానాన్ని నిలబెట్టుకున్నారు. భారత వైమానిక దళం నుండి కీలకమైన వైమానిక మద్దతుతో పాకిస్తాన్ దళాలను  ఓడించగలిగారు. ఇలా భారత సైన్యం విజయాలు,  పోరాట పటిమ దేశం యావత్తూ స్మరించుకోదగినవి, వేడుక చేసుకోదగినవి.  *రూపశ్రీ.  

ఇలాంటి విద్య ప్రతి ఒక్కరికీ అవసరం!

విద్యార్థులు ఆటలు, పాటలు, విహారయాత్రలకు స్వస్తి చెప్పి చదువుల తల్లి చెంతకు చేరే సమయం ఆసన్నమైంది. పాఠశాల చదువులు ముగించి కళాశాలకు పోయే విద్యార్థులు కొందరైతే, కళాశాల చదువులు పూర్తిచేసి విశ్వవిద్యాలయాలకు వెళ్ళేవారు మరికొందరు. అలాగే విశ్వవిద్యాలయాలకు వీడ్కోలు చెప్పి విదేశాలకెగసే విద్యార్థులు మరెందరో! గదులు మారి తరగతులు పెరిగినా,  గతులు వేరై ఘనకార్యాలు  సాధించినా… మేధావులు సృష్టించిన నేటి మన విద్యావిధానం మహాత్ముల్ని సృజించడంలో  విఫలమవుతుంది. వైజ్ఞానికంగా ఎంత ఎదిగినా వివేకపథంలో వెనుకంజ వేస్తుంది. నేటి సమాజంలో సత్యధర్మాలు, సేవా త్యాగాల్లాంటి... విలువలు మానవతా గగనకుసుమా లయ్యాయి. సంఖ్యలకే ప్రాధాన్యతనిచ్చే విద్యతోపాటు నడవడికలో నాణ్యతను పెంచే విద్య చాలా అవసరం. అక్షరజ్ఞానంతో పాటు విజ్ఞానం తోడైనప్పుడే మానవతా విలువలు భాసిల్లుతాయి. చదువుతో పాటు సంస్కారాన్ని పెంచే విద్యే నిజమైన విద్య. బుద్ధిని వృద్ధిచేసే విద్యే నేటి సమాజంలోని అన్ని రుగ్మతలకు సరైన ఔషధం. విద్యకు భూషణం వినయం... విద్యార్థి గురువు వద్ద ఎలా అణకువతో ప్రవర్తించాలో శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో బోధించాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా । ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః ॥  శిష్యుడు గురువు సన్నిధిలో ఉంటూ భక్తిశ్రద్ధలతో గురువుకు సపర్యలు చేస్తూ తన సందేహ నివృత్తి చేసుకోవాలి. శిష్యుని వినయ విధేయతలకు గురువు ప్రీతి చెంది శిష్యునికి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. పెద్దలయందు, గురువులయందు గౌరవమర్యాదలు లేనివాడు ఎన్నటికీ జీవితంలో ఉన్నతి పొందలేడు. అహంకారి అయిన దుర్యోధనునితో 'నువ్వు గురువులకు, పెద్దలకు వినయంతో సేవ చేయడం నేర్చుకో దాని వల్ల నీలో సత్ప్రవర్తన వృద్ధి చెందుతుంది' అని శ్రీకృష్ణుడు అంటాడు. విద్యార్థి గ్రంథాల ద్వారా నేర్చుకొనే దాని కన్నా గురువు సాంగత్యంలో నేర్చుకొనే విద్య ఎక్కువ ప్రయోజనాన్నిస్తుంది. ఆచరించేవాడే ఆచార్యుడు...  ఆచార్య అంటే సంగ్రహించే వాడు. శాస్త్ర సారాన్ని సంగ్రహించి, విద్యార్థులకు బోధించేవాడు ఆచార్యుడు అని అర్థం. తాను సంగ్రహించిన వేదసారాన్ని శిష్యులకు ఆచరణలో చూపించిన వాడే ‘ఆచార్యుడు' అని మరో అర్థం. ఆచరణాత్మక బోధ నలతో ఆదర్శజీవితాన్ని గడిపి, శిష్యుల్లో మానవతా విలువల్ని పెంపొందించే వాడే నిజమైన ఆచార్యుడు. విలువల్ని పెంచే విద్య...  నేడు మనకు కావలసిన విద్య ఎలా ఉండాలో స్వామి వివేకానంద మాటల్లో…  We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded... శీలనిర్మాణం, మనోబలం, విశాలబుద్ధి ఈ మూడు సుగుణాల్ని పెంపొందించే విద్య నేడు మనకు అవసరం. స్వామి వివేకానంద నిర్వచించిన విద్యలో ఉన్న మూడు లక్షణాలను విద్యార్థి అలవరచుకోవాలంటే తైత్తిరీయో పనిషత్తులో గురువు శిష్యులకిచ్చిన సూచనల్ని ఆచరణాత్మకం చెయ్యాలి.                                          ◆నిశ్శబ్ద.

జాతీయ యువజన దినోత్సవం.. వివేకానంద జయంతిని యూత్ డేగా ఎందుకు చేస్తారు..

  ప్రపంచం మొత్తంలో యువకులు ఎక్కువమంది ఉన్న దేశం గురించి ప్రస్తావన వస్తే అందులో  మన భారతదేశమే  మొదటిగా నిలుస్తుంది. ఏ దేశ అభివృద్ధికైనా అనుభవం ఉన్న పెద్దవాళ్లతో పాటూ, పనిచేసే యువశక్తి  ఎంతో  అవసరం అని చెప్పాల్సిన అవసరంలేదు. దేశ  యువతంతా క్రమశిక్షణగా ఉండి వారి శక్తి సామర్ధ్యాలు సరిగా వినియోగిస్తే  ఆ దేశం   ప్రపంచ చరిత్రలోనే గొప్పదిగా నిలవగలుగుతుంది. ఈ విషయాన్ని వందేళ్ల కిందటే అర్థం చేసుకుని యువతకు తన మాటలతో దేశ భక్తి నింపడానికి, యువతే నా దేశ భవిష్యత్తు అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి వివేకానందుడు. స్వామి వివేకానందగా పేరు పొందిన నరేంద్రుడు.. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాడు.  ప్రపంచాన్ని తన మాటలతో,  తన దేశ భక్తితో.. ముఖ్యంగా హిందుత్వం, ఆధ్యాత్మిక భావనతో ప్రభావితం చేసి ప్రపంచం మొత్తం భారతదేశం వేపు తల తిప్పి చూసేలా చేశాడు. ఆయన మాటలు, ఆయన వ్యక్తిత్వం వందేళ్ళ తర్వాత కూడా ఆచరించదగినవి.  మంచి వక్త, తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన స్వామి వివేకానంద  పుట్టినరోజును ప్రతీ సంవత్సరం  జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద.. స్వామి వివేకానందుడు 1863 జనవరి 12న కోల్‌కతలో జన్మించారు. దేశ భవిష్యత్తులో యువత పాత్రను యువతకు గుర్తుచేయడానికి ,  యువత శక్తిని గుర్తుచేయడానికి ఆయన పిలుపు ఇచ్చిన విధానం ఆయనను ప్రసిద్ధుడిగా మార్చింది.  ఈయన రామకృష్ణ పరమహంస బోధనలకు ప్రభావితమై.. సన్మానం స్వీకరించారు.  ధార్మిక బోధకుడిగా, తత్వవేత్తగా,  వేదాలను ఉపనిషత్తులను అవపోషణ పట్టిన వ్యక్తిగా, యోగాను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా.. ఇలా చాలా రకాలుగా ప్రసిద్ధి చెందాడు.   1893లో చికాగోలో నిర్వహించిన  ప్రపంచ సర్వమత మహాసభలలో  ఆయన ఇచ్చిన  ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ ప్రసంగంలో ఆయన యువశక్తి, విశ్వ సోదర భావం, ఆత్మాన్వేషణలు అనేవి సామాజిక మార్పుకు  ప్రాథమిక సూత్రాలుగా చెప్పారు. స్వామి వివేకానందుడు జాతీయవాదంపై ధృడ విశ్వాసం కలిగి, దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉందని నమ్మారు. ఎటువంటి నీచస్థితిలో ఉన్నవారికైనా గొప్ప ఆలోచనలను కలిగేలా చేయగలమనే ఆయన  నమ్మారు.   "శక్తి నీలోనే  ఉందనే నమ్మకంతో ముందుకు సాగితే, నువ్వు అద్భుతాలను సృష్టించగలవు.", "నువ్వు మేల్కొని , ఉప్పొంగు, కానీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకు",  "యువతే దేశ అభివృద్ధికి పునాదులు." అనే మాటలతో..  తన ప్రసంగాలతో దేశ యువతని, ప్రజలని  నిరంతరం ప్రోత్సహించేవారు. 1984వ సంవత్సరంలో స్వామి వివేకానందుడి ఆలోచనలను, విలువలను వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వం జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది.   1985 నుంచి  దేశవ్యాప్తంగా  జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. స్వామి వివేకానందుడి తత్వచింతనలు, ఆదర్శాలు భారత యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని ప్రభుత్వం భావించింది. యువజన దినోత్సవం- యువతకి పిలుపు.... స్వామి వివేకానందుడి బోధనలు యువతకు జీవిత సవాళ్లను ఎదుర్కొనేందుకు స్ఫూర్తినిస్తాయి. వ్యక్తిగతంగా,  సమష్టిగా అభివృద్ధి చెందడానికి విద్య అనేది ముఖ్యమైన సాధనమని ఆయన విశ్వసించారు. యువతలో ఐక్యత, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక  చింతన అభివృద్ధి చేయటం, అందరూ  దేశభక్తి కలిగి ఉండి, మన సంస్కృతి పట్ల గర్వపడాలనే సందేశాన్ని అందిస్తుంది. సమాజంలో మంచి మార్పు తీసుకురావటంలో  యువత పాత్ర  అవసరమని, ఆ దిశగా యువత తమ నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు ఉపయోగించాలనే పిలుపునిస్తుంది.                                  *రూపశ్రీ.

మనిషి ఆశలతో, ఆశయాలతో ఆటాడుకునే దుర్మార్గమిది.. మానవ అక్రమ రవాణా అవగాహనా దినోత్సవం..!

  మనతో పాటూ ఉన్న మనుషులు   ఉన్నట్టుండి ఏమైపోయారో తెలియకపోయినా లేదా వారు ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నారన్న విషయం తెలిసినా మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా జరిగినప్పుడు ఏం చేయాలో, మనమేం చేయగలమో కూడా అర్ధం కాదు. అందుకే ఇటువంటివి జరిగినప్పుడు ఎదురయ్యే పరిణామాలు గురించి  అందరికీ అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీన మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది పెరిగిపోతున్న ఆధునిక బానిసత్వం గురించి అవగాహన పెంచడానికి, ప్రాణాలతో బయటపడిన వారి హక్కుల కోసం వాదించడానికి,  అన్ని రకాల మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి  ఒక అవకాశం ఇస్తుంది. మానవ అక్రమ రవాణా అంటే..... మనుషులని కిడ్నాప్ చేయటమో లేదా ఏమార్చటమో  చేసి తర్వాత వారిని బలవంతంగా  వ్యభిచారం చేయించటానికో, బలవంతపు  వివాహాల కోసమో, అనైతిక కార్యకలాపాలు, కర్మాగారాల్లో పనులు చేయించటానికో ఇలా చాలా రకాలుగా  ఉపయోగించుకుంటారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ అక్రమ రవాణా  సమస్య నానాటికీ పెరుగుతోంది. అందుకే దీన్ని ఆపటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మానవ అక్రమ రవాణా దినోత్సవం ఎప్పుడు మొదలైంది.. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి,  ఎదుర్కోవడానికి యునైటెడ్ స్టేట్స్‌లో చేసిన  ‘ట్రాఫికింగ్ బాధితుల రక్షణ చట్టం2000’ చట్టానికి ఆమోదం తెల్పటంతో ఈ దినోత్సవం మొదలైంది. ఆ తర్వాత  ఈ సమస్య ప్రభావం  ప్రపంచమంతటా ఉందని   గుర్తించిన  దేశాలన్నీ  దాన్ని నివారించటానికి తగిన చట్టాలు ఏర్పాటు చేసుకున్నాయి. భారతదేశంలో మానవ అక్రమ రవాణా- తీసుకున్న చర్యలు.. భారతదేశంలో పురుషులు, మహిళలు, పిల్లలు వివిధ కారణాల కోసం అక్రమ రవాణా చేయబడ్డారు, చేయబడుతున్నారు. దేశంలోని  మహిళలు, అమ్మాయిలను లైంగిక దోపిడీ కోసం, బలవంతపు వివాహాల కోసం రవాణా చేస్తున్నారు.   పురుషుల అవసరం ఎక్కువగా ఉన్నచోట  పురుషులు, అబ్బాయిలను  రవాణా చేసి  కార్మికులుగా, మసాజ్ చేసే వారిగా, ఎస్కార్ట్లుగా ఉపయోగించుకుంటున్నారు.  వీరు కొన్ని సార్లు లైంగిక దోపిడీకి కూడా  గురవుతుంటారు.   ఇక పిల్లలు కర్మాగార కార్మికులుగా, ఇంటి పనివారిగా, అడుక్కునేవారిగా, వ్యవసాయ కూలీలుగా మార్చబడతారు.   అలాగే కొన్ని తీవ్రవాద, తిరుగుబాటు గ్రూపుల ద్వారా శిక్షణ ఇవ్వబడి అసాంఘిక కార్యకాలపాల కోసం  ఉపయోగించుకుంటారు.  భారతీయ మహిళలు మిడిల్ ఈస్ట్ దేశాలకి వాణిజ్య లైంగిక దోపిడీ కోసం రవాణా చేయబడుతున్నారట. ప్రతి సంవత్సరం మిడిల్ ఈస్ట్,  యూరప్ దేశాలకు పనివారిగా,  తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికులుగా వెళ్లిన భారతీయ వలసదారులు  కొన్నిసార్లు మానవ అక్రమ రవాణా పరిశ్రమలో చిక్కుకుంటున్నారు. కొన్ని సార్లు  కార్మికులు నకిలీ నియామక విధానాల ద్వారా తీసుకెళ్లి అక్కడ బానిసలుగా మార్చబడుతున్నారు. ముఖ్యంగా ఆ దేశాలకి వెళ్తే ఆదాయం పెరిగి కుటుంబం బాగుపడుతుందన్న ఆశతో  అప్పు చేసి ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ డబ్బు చెల్లించలేక, తిరిగి రాలేక క్రూరమైన యాజమానుల చేతుల్లో అష్ట కష్టాలు పడతారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు.   ఇవన్నీ గుర్తించిన భారతదేశం 2011లో "ట్రాఫికింగ్ బాధితుల చట్టం 2000" ప్రోటోకాల్‌ను ఆమోదించింది. మన భారత పౌరులు అలాంటివాటిలో చిక్కుకోకుండా  ఒక పక్క అవగాహన కల్పిస్తూనే, మరో పక్క అలా చిక్కుకున్నవారిని ఆయా దేశాల్లోని ఎంబసీల ద్వారా  కాపాడే ప్రయత్నం చేస్తుంది. వారు స్వదేశం చేరటానికి అన్ని రకాలుగా సాయం అందిస్తుంది. మానవ అక్రమ రవాణాని నివారించేందుకు ఏం చేయాలి...   నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్‌నెస్ డేలో పాల్గొనడం వల్ల అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమానికి సహకరించేందుకు అందరికీ అవకాశం లభిస్తుంది. దీని గురించి స్పష్టంగా తెలుసుకనే అవకాశం కూడా లభిస్తుంది. మానవ అక్రమ రవాణాని ఎలా గుర్తించాలి?, ఎలా కంప్లైంట్ చేయాలి?  అనే వాటి గురించి అందరికీ తెలిసేలా  వర్క్‌షాప్‌లు, వెబినార్లు లేదా శిక్షణా సెషన్లను నిర్వహిస్తారు.   ఈ సమస్య గురించి సోషల్ మీడియాలో అవగాహన కల్పించడానికి,  దానికి సంబంధించిన  పోస్ట్‌లు, కథనాలను షేర్ చేయాలి. ఈ  అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహకరించి,  ప్రాణాలతో బయటపడిన వారికి సహాయం అందించాలి. రాజకీయ నాయకులు, లాయర్లతో పాటూ కలిసి మానవ అక్రమ రవాణాను సమర్థవంతంగా పరిష్కరించే చట్టాలు, విధానాలకు మద్దతు ఇవ్వాలి.  అక్రమ రవాణా నిరోధక చట్టాల కోసం గొంతు విప్పాలి. అవేర్‌నెస్ ఈవెంట్‌లను నిర్వహించాలి. ఈ మానవ అక్రమ రవాణా మీద అందరూ తగిన అవగాహన పొందటం వల్ల  మనవాళ్ళు, మనకి తెలిసినవాళ్ళు ఏ మోసకారుల చేతుల్లోనో, ముఠాల చేతుల్లోనో చిక్కుకుని బలి కాకుండా కాపాడుకోవచ్చు.                                        *రూపశ్రీ.

ఆస్తులు కన్నా ఆదర్శాలే ముఖ్యమనుకున్న గొప్ప వ్యక్తి..... లాల్ బహాదూర్ శాస్త్రి వర్ధంతి..!

  ఈ  రోజుల్లో  రాజకీయ నాయకులు అనగానే డబ్బు, హోదా, ఖరీదైన కార్లు  గుర్తొస్తాయి. ఎందుకంటే రాజకీయం అనగానే డబ్బు ఆర్జించే ఒక మార్గం అయిందిప్పటి కాలంలో. కానీ ఒక జాతీయ స్థాయి నాయకుడై  ఉండి, ఒక దేశ ప్రధానై  ఉండి కూడా  ఒక పాత కారుని ఈఎంఐ పద్ధతిలో  కొనుక్కున్నారొక మహనీయుడు.   వ్యక్తిగత ఆస్తి కూడబెట్టటం కంటే ప్రజా సేవనే ధ్యేయంగా పని చేశారాయన.  ఆయన ఎవరో కాదు..  జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారత ప్రజలను చైతన్యం చేసిన లాల్ బహదూర్ శాస్త్రి.  అందరూ ముద్దుగా శాస్త్రిజీ అని పిలుచుకునే లాల్ బహదూర్ శాస్త్రిగారు ఆస్తులకన్నా ఆదర్మాలే ముఖ్యమని నమ్మారు. అదే నేడు ఆయన్ను గొప్ప దేశ నాయకుడిగా నిలబెట్టింది. నిబద్దత, క్రమశిక్షణ, నిస్వార్థ గుణం,నమ్రత, విధేయత  కలిగిన పాతతరపు నాయకుల్లో ఈయన ఒకరు. మన దేశానికి రెండవ ప్రధానమంత్రిగా సేవలందించిన  లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి నేడు.. ఈ సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకంటే.. లాల్ బహాదూర్ శాస్త్రి 1904 అక్టోబర్2న మొగల్‌సరాయ్‌లో జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. తండ్రి మరణానంతరం లాల్ బహాదూర్ శాస్త్రి  ఆయన చెల్లెల్లు వారి మామయ్య అయిన మున్షీ హజారీలాల్ ఇంట్లో పెరిగారు. 1928లో శాస్త్రి గారెకి  లలితా దేవితో వివాహం జరిగింది. ఆయనకి  నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబ సభ్యులు అంతా కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. స్వాతంత్రోద్యమంలో పాత్ర.. లాల్ బహాదూర్ శాస్త్రి హరిశ్చంద్ర హైస్కూల్‌లో ఉన్నప్పుడు దేశభక్తి, ప్రజాదరణ పొందిన ఉపాధ్యాయుడు నిష్కామేశ్వర్ ప్రసాద్ మిశ్రాగారి  ప్రేరణతో స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు.  మహాత్మా గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవ్య నిర్వహించిన ఒక సమావేశానికి వెళ్ళిన శాస్త్రి  ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు బయటకు రావాలన్న  పిలుపు మేరకు, ఆ మరుసటి రోజే హరిశ్చంద్ర హైస్కూల్‌ను వదిలేశారు. వాలంటీరుగా చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆయన అనేక సార్లు జైలు శిక్షను అనుభవించారు. 1925లో కాశీ విద్యాపీఠం నుండి “శాస్త్రి” బిరుదుతో పాటూ తత్వశాస్త్రం, నైతిక శాస్త్రంలో పట్టా పొందారు. ఆయన లాలాలజపతిరాయ్ స్థాపించిన “లక్ సేవక్ మండల్”లో చేరి మహాత్మా గాంధీ నాయకత్వంలో ముజఫర్‌పూర్‌లో హరిజనుల కోసం పనిచేశారు. 1928లో మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌లో పూర్తి స్థాయి సభ్యుడిగా చేరారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు రెండు సంవత్సరాలపాటు జైలులో ఉన్నారు. 1940లో వ్యక్తిగత సత్యాగ్రహానికి మద్దతు తెలపడం వల్ల ఏడాది జైలులో గడిపారు. 1937, 1946లలో ఆయన యునైటెడ్ ప్రావిన్సెస్ శాసనసభకు ఎన్నికయ్యారు. నిర్ణయాలు అద్బుతం.. భారత స్వతంత్రానంతరం శాస్త్రి ఉత్తరప్రదేశ్‌లో రవాణా, పోలీసుశాఖా మంత్రిగా సేవలందించారు. ఆయన రాజకీయ  పరంగా తీసుకున్న నిర్ణయాలు చాలా అద్బుతమైనవి. ఆయనే మొదటిసారి మహిళా కండక్టర్ల నియామకానికి మార్గం చూపించారు.  నిరసనల సమయంలో లాఠీలకు బదులుగా నీటి గొట్టాలను ఉపయోగించడానికి ఆదేశాలు జారీచేశారు. 1951లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 1952లో రైల్వే, రవాణాశాఖ మంత్రిగా, 1961లో హోం మంత్రిగా పని చేశారు. నెహ్రూ మరణానంతరం 1964లో భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రధానిగా.. 1965భారత-పాక్ యుద్ధం సమయంలో ‘జై జవాన్ జై కిసాన్’ అనే  నినాదంతో జవాన్లను, రైతులను చైతన్య పరిచారు. పాల ఉత్పత్తిని పెంచడానికి అతి పెద్ద ఉద్యమానికి మద్దతుగా  అమూల్ సహకార సంఘానికి అండగా నిలిచారు. హిందీ భాషకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను శాంతి పూర్వకంగా పరిష్కరించారు. పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో కలిసి తాష్కెంట్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఆయన హయాంలో విధ్యా సంస్థలు, డ్యాములు, పోర్టులు ఎన్నో నిర్మితమయ్యాయి.   దేశ అభివృద్ధిలో ఆయన చేసిన  కృషి అమోఘం. ఆయన  ప్రధానమంత్రి హోదాలో  సోవియట్ యూనియన్, ఇంగ్లాండ్, కెనడా, నేపాల్, ఈజిప్ట్, బర్మా వంటి అనేక దేశాలను సందర్శించి విదేశాలతో మన దేశ సంబంధాలు మెరుగుగా ఉండేలా చేశారు. మరణం.. శాస్త్రిగారు  1966వ సంవత్సరం,  జనవరి 11న తాష్కెంట్‌లో మరణించారు. 1965 ఇండో-పాక్ యుద్ధానికి శాంతి ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజే ఇలా జరిగింది. ఆయనను ఒక జాతీయ హీరోగా గుర్తించి, ఢిల్లీలో విజయ ఘాట్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. లాల్ బహాదూర్ శాస్త్రి చాలా సాధారణ జీవితం గడిపారు. వ్యక్తిగత ఆస్తిని కూడబెట్టకుండా, ప్రజలకు సేవ చేయడంలో జీవితం గడపాలని ఉద్దేశించిన సేవక్ సొసైటీ సభ్యుడుగా ఉండేవారు.  శాస్త్రిగారి జీవితం నైతిక విలువలు, నమ్రత,  ప్రజా సేవకు ఆదర్శంగా నిలిచింది. తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసి, దేశ అభివృద్ధికి విశేషమైన కృషి చేసి భారతదేశ చరిత్రలో మర్చిపోని నాయకుడిగా నిలిచారు.                                            *రూపశ్రీ.

డబ్బున్నవారు చేసే పెద్ద తప్పులివే.. చాణక్యుడు ఏం చెప్పాడంటే..

చాణక్యుడి గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఈయన చెప్పిన ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి గానీ జీవితంలో వైఫల్యం అనేదే ఎదురుకాదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాలు, వ్యక్తుల మద్య సంబంధాలు.. ఇలా ఒక్కటనేమిటి? ఎన్నో విషయాల గురించి చాణక్యుడు కుండ బద్దలు కొట్టినట్టు విషయాలను స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా డబ్బు చేతికి వచ్చినప్పుడు చాలామంది తమకు తెలియకుండానే కొన్ని, తెలిసి కొన్ని తప్పులు చేస్తారు. వీటి వల్ల  వ్యక్తుల దగ్గర డబ్బున్నా  ప్రశాంతత, సంతోషం అనేది మాత్రం అస్సలుండవట. మరికొందరు పతనానికి చేరుకుంటారట. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుంటే.. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చాలామంది తాము ఇబ్బంది పడిన రోజులను, బాధతో గడిపిన రోజులను మరచిపోతాడు. పూర్తీగా చేతిలో డబ్బుందనే మాయలో పడిపోతారు. ఇలా మరచిపోవడం,  కష్ట సమయాలను, బాధల్ని మరచిపోవడం, డబ్బు విషయంలో తప్పు పనులు చేయడానికి దారితీస్తుంది. దీనివల్ల మళ్లీ డబ్బు లేని స్థితికే చేరుకుంటాడు. సహజంగా ప్రతి ఒక్కరూ డబ్బులేనప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు. డబ్బున్నప్పుడు. డబ్బులోనే సంతోషాన్ని చూస్తున్నప్పుడు దేవుడిని పక్కన పెడతాడు.  ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొన్నిసార్లు తప్పు మార్గంలో కూడా వెళతాడు. ఇలాంటి వారు డబ్బును మధ్యలోనే పోగొట్టుకుంటారు. తిరిగి అశాంతికి, కష్టానికి, బాధలకు దగ్గరవుతారు. కొంతమందికి డబ్బు చేతికి రాగానే అహంకారం వస్తుంది. కుటుంబ సభ్యులతోనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు.  అయితే పొరపాటున కూడా కుటుంబ సభ్యుల ముందు డబ్బు గర్వాన్ని చూపించకూడదు. డబ్బు ఈరోజు ఉండి రేపు పోవచ్చు. కానీ మరణం వరకు తోడుండే ఆత్మీయులు మాత్రం డబ్బు వల్ల దూరం అయితే మళ్లీ దగ్గరకు రావడం కష్టం. డబ్బు సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడమే పరమావధి కాకూడదు. మరీ ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదించే పనులు ఎప్పుడూ చేయకూడదు.  అలాంటివారితో ఎక్కడా ఎవరూ బ్రతకలేరు. ముఖం మీదనే చెప్పి దూరం వెళ్లిపోతారు. అందుకే డబ్బుకోసం ఆత్మగౌరవం విషయంలో అస్సలు రాజీ పడవద్దు. డబ్బు దండిగా ఉన్నప్పుడు అయినా, డబ్బు లేనప్పుడు అయినా ఒకే విధంగా ఉండే వాడే ఎప్పటికైనా జీవితంలో సఫలం అవుతాడు. డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు చేస్తే అది చాలా తప్పు. కానీ డబ్బు ఉన్నప్పుడు అందులో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాలలో  వినియోగించడం ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు. డబ్బు వృధా కంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సహాయం చెయ్యడం చాలా మంచిది. దీని వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత చేకూరతాయి. డబ్బు సంపాదించడం ధనవంతుడు కావడం  గొప్పే.. కానీ  ఆ డబ్బును ఇతరులకు హాని తలపెట్టడానికి ఉపయోగిస్తే మాత్రం పతనానికి చేరుకుంటారు. ఇలాంటి పనులవల్ల ఎంత గొప్ప ధనవంతుడు అయినా పేదవాడిగా మారిపోవడం ఖాయమని చాణక్యుడు చెప్పాడు.                                           *నిశ్శబ్ద.

దేశం వదిలినా మూలాలు మరిచిపోము..... ప్రవాస భారతీయుల దినోత్సవం..2025..!

  “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని,  నిలుపరా నీ జాతి నిండు గౌరవము" అనే గేయాలను చదువుకుంటూ పెరిగినవాళ్లం. దీనికి తగ్గట్టు కొందరు మాతృదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంటారు.  అలాంటి వారిలో మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద నుండి చాలామంది ప్రముఖులు  ఉన్నారు.  ఈ జాబితాలో ప్రవాస భారతీయుల పాత్ర చాలా ఉంది. ఈ రోజుల్లో పొట్ట కూటి కోసం ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాళ్ళు కొందరైతే, తమ చదువుకి, ప్రతిభకి తగిన అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తున్నవాళ్లు కొందరున్నారు. ఉన్నత విద్య అభ్యసించడానికో.. ఉన్నత విద్య ద్వారా వచ్చిన ఉద్యోగ అవకాశాల కోసమో విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య ప్రతి ఏడూ పెరుగుతూ వస్తోంది. దీనికి తగ్గట్టే విదేశాలలో భారతీయుల హవా సాగుతోంది.     మన భారతదేశం నుంచి ప్రపంచ నలుమూలలకి వెళ్ళిన మన వాళ్ళు భారతీయతను చాటి చెప్పటానికి మన దేశ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు.  అలాంటి  ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులు దేశ అభివృద్ధిలో చేసిన, చేస్తున్న సేవలకి గుర్తింపుగా ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటారు. అయితే దీనికి ముఖ్యమైన మూలం మహాత్మా గాంధీ..   మహాత్మా గాంధీ విద్యాభ్యాసం కోసం దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడి  నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజునే ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటున్నారు.   2003 సంవత్సరం నుంచి  ప్రతీ ఏటా జనవరి 9వ తేదీన   ప్రవాస భారతీయుల  దినోత్సవం( ఎన్‌ఆర్‌ఐ డే)  జరుపుకుంటున్నాము. ప్రవాస భారతీయుల దినోత్సవం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుంటే.. 2025 లో జరగబోయే 18వ ఎన్‌ఆర్‌ఐ డే  ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్‌లో జనవరి 8 నుండి 10 వతేదీ వరకు  జరగనుంది. ప్రవాస భారతీయ దినోత్సవం.. మన భారతదేశం  ప్రపంచంలోనే  ఎక్కువ ప్రవాస భారతీయులు ఉన్న దేశంగా పేరుపొందింది. ఈ ప్రవాస భారతీయులు తమ   ఆర్థిక సహకారాలు, పెట్టుబడులు ద్వారా దేశ అభివృద్ధిలో, గ్లోబల్‌గా మన దేశ గుర్తింపుని  పెంచటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న పెద్ద పెద్ద కంపెనీల సి‌ఈ‌ఓలు, రాజకీయ నాయకులు ఇలా చాలామంది మన దేశం వారు లేదా మన దేశ మూలాలున్న వారు విదేశాలలో  ఉన్నారు.  అందుకే ఈ ప్రవాస భారతీయుల దినోత్సవం  వ్యాపారం, విద్య, కళలు, శాస్త్రం, సాంకేతికత వంటి రంగాలలో  ప్రవాస భారతీయుల విజయాలను గుర్తించి, ప్రోత్సహించడమే కాకుండా అంతర్జాతీయంగా  భారతదేశ ప్రతిష్టను మరింత బలోపేతం చేయడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. మన దేశంతో వారి సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి,  భారతీయ మూలాలున్న వ్యక్తులు,  భారతీయ సంస్థల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించటానికి ,  అలాగే ఎన్‌ఆర్‌ఐ లను  ప్రభావితం చేసే ప్రభుత్వ విధానాలపై చర్చించటానికి ఈ ప్రవాస భారతీయుల దినోత్సవం  ఒక వేదికగా  నిలుస్తుంది. భవిష్యత్తులో వివిధ రంగాలలో భారతదేశ అభివృద్ధికి వనరులను, నైపుణ్యాలను, సాయాన్ని  సమీకరించడం కోసం ప్రవాస భారతీయుల సహకారం చాలా అవసరం అవుతుంది.  దీనికి గానూ వారు ఎలా సహకరించగలరో చర్చించేందుకు ఒక  ప్రవాస భారతీయుల దినోత్సవం ఒక వేదిక అవుతుంది. ప్రవాసీయుల సహకారం.. భారతదేశ కలకు సాకారం.. ఏదైనా ఒక దినోత్సవం జరపడం మొదలుపెడితే ప్రతి ఏడాది ఒక విశేషమైన అంశాన్ని ఎంచుకుని ఆ అంశం దిశగా కృషి చేయడం, లక్ష్యాలు సాధించడం జరుగుతుంది.  ప్రవాస భారతీయుల దినోత్సవానికి అలాంటి అంశాల ఎంపిక ఉంది.  ఈ ఏడాది..     “అభివృద్ధి చెందిన భారతదేశపు సంకల్పంలో  ప్రవాస భారతీయుల సహకారం”  అనే అంశాన్ని  ఎంపిక చేశారు. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశ జాబితా నుంచి అభివృద్ధి చెందిన దేశ జాబితాలో మన దేశం చేరేందుకు గానూ  విదేశాలలో ఉండే భారతీయుల  పాత్రని  ఈ అంశం ప్రతిబింబిస్తుంది.    సేవ..  గుర్తింపు.. ఈ ఎన్‌ఆర్‌ఐ దినోత్సవం జరుపుకోవడంలో భాగంగా అందరిని ఆకట్టుకునే ప్రధాన విషయం.. సేవలను గుర్తించడం. ఇవే..  ‘ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులు’. ఇవి భారతీయ ఎన్‌ఆర్‌ఐ లు  చేసిన అసాధారణ సేవలను గుర్తించి సత్కరించేందుకు ఇచ్చే పురస్కారాలు. ఈ అవార్డులు భారత రాష్ట్రపతి చేతులు మీదుగా అందజేయబడతాయి. ఈ గుర్తింపు  భవిష్యత్తులో భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులకి  మధ్య మరింత సహకారం పెరిగేలా చేస్తుంది. ఈ సారి ప్రవాస భారతీయుల దినోత్సవానికి  వేదిక అయిన భువనేశ్వర్ 50 కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చే ప్రవాస భారతీయులను హృదయపూర్వకంగా స్వాగతించనుంది. ఈ సంవత్సరం కార్యక్రమానికి ట్రినిడాడ్ & టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగం ఇవ్వబోతున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు ప్రవాస భారతీయులను ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.  మొదటి రోజు యూత్ ప్రవాస భారతీయ దివస్‌కు కేటాయించబడింది. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖతో కలిసి నిర్వహించనున్నారు. ఇది యువ నాయకత్వం,  సాధికారతపై దృష్టి సారిస్తుంది. ప్రసిద్ధి చెందిన డెవ్ ప్రగాద్ (సి‌ఈ‌ఓ, న్యూస్వీక్) వంటి ప్రసంగకర్తలు ఇందులో పాల్గొంటారు. ఈ సంధర్బంగా మన దేశ యువత కూడా తమ ప్రతిభా నైపుణ్యాలని సరిగా ఉపయోగించుకుని, దేశం వీడినా దేశ సేవ చేస్తున్న  ప్రముఖ ప్రవాస భారతీయులను ఆదర్శంగా తీసుకుని  తమ జీవితాలని మెరుగుపర్చుకోవటమే కాకుండా దేశ అభివృద్ధిలో కూడా భాగం అయితే భారతదేశం అభివృద్ది చెందిన దేశం అవుతుంది.                                                 *రూపశ్రీ.