ఆకాశవాణి మాట.. అందరినీ అలరించిన పాట..
posted on Feb 12, 2025 @ 9:30AM
టెలివిజన్, ఇంటర్నెట్ ఇవేవీ రాక ముందే ప్రపంచాన్ని ఇది కలపగలిగింది. అప్పటి వాళ్ళకి అదేదో మాయాజాలం జరుగుతుందేమో అన్నట్టు ప్రపంచ ముచ్చట్లన్నీ గాలిలోనే జనాల దగ్గరకి చేరవేసి అందరికీ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. అంతలా అందరినీ ఆశ్చర్యపరిచినదేమిటో.. అననుకుంటున్నారా? ఆకాశం నుండి ఏదో మాట వినబడినట్టు.. ఒక బుల్లి పెట్టేలో నుండి లీలగా వినిపించే మాటలు, పాటలు, ముచ్చట్ల సమాహారం.. పెద్దవాళ్లకు మరచిపోలేని అనుభూతులను పంచిన వెలకట్టలేని బహుమానం.. అదే.. “రేడియో”. మన భారతదేశ ప్రజలకి మాత్రం ‘ఆకాశవాణి’గా బాగా పరిచయం. ఇప్పుడున్న చాలామంది తమ బాల్యంలో ఈ ఆకాశవాణి మాట, పాట విననివారు ఉండరు. టెక్నాలజీ పెరిగినా కూడా ఇది మన జీవితాల్లో ఇప్పటికీ ఉంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భం జరుపుకుంటారు. ఒకప్పుడు అందరినీ ఎంతగానో అలరించిన చిన్ననాటి నేస్తమైన రేడియో గురించి తెలుసుకుంటే....
రేడియో..
19వ శతాబ్ధపు తొలినాళ్లలోనే రేడియో ప్రపంచానికి పరిచయమైనప్పటికీ దానికంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఆలోచన మాత్రం 2010లో ప్రారంభమైంది. రేడియో ప్రాముఖ్యతను గుర్తించి, దీనికంటూ ప్రత్యేకమైన రోజు ఉండాలని మొదటగా స్పెయిన్ దేశం ప్రతిపాదించింది. ప్రపంచవ్యాప్తంగా రేడియో ప్రభావాన్ని గుర్తించిన యునెస్కో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011, ఫిబ్రవరి 13న అధికారికంగా ప్రకటించింది. ప్రజలకు సమాచారం అందించడంలోనూ, విద్యను ప్రోత్సహించడంలోనూ, సాంస్కృతిక సరిహద్దులను అధిగమిస్తూ ప్రజలను ఏకం చేయడంలోనూ రేడియో ఎంతగానో సహాయపడింది. వార్తలు, వినోదం అందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. పట్టణాలకే కాక గ్రామాలకు కూడా చేరువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా విషయం పట్ల అవగాహనను వ్యాప్తి చేయడంలోనూ, ప్రజలకి వర్తమాన విషయాల గురించి సమాచారం అందించటంలోనూ శక్తివంతమైన సాధనంగా పనిచేసింది.
రేడియోతో భారతదేశ ప్రజలకున్న అనుబంధం..
దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోయలు, విశాల మైదానాలతో ఎంతో భౌగోళిక వైవిధ్యం ఉన్న భారతదేశంలో ఎక్కడెక్కడో నివసించే ప్రజలందరికీ సమాచారం అందించటం అంత సులువైన విషయం కాదు. కానీ రేడియో ఆ పనిని సాధ్యం చేసింది. అందుకే మన దేశంలో రేడియో ఒక ప్రాచీనమైన, అత్యంత నమ్మదగిన సమాచార మాధ్యమాలలో ఒకటిగా ఇప్పటికీ పరిగణించబడుతుంది. భారతదేశంలో మొదటిసారిగా రేడియో ప్రసారం 1927లో ప్రారంభమైంది. 1936లో "ఆకాశవాణి"(ఆల్ ఇండియా రేడియో) ఏర్పడింది. అప్పటి నుండి, భారతదేశంలో సామాన్య ప్రజల రోజువారీ జీవితాల్లో రేడియో ఒక భాగమైపోయింది. సమాచారాన్ని అందించడంలోనూ, వినోదాన్ని పంచడంలోనూ, సంగీతం, వార్తలు, సమకాలీన అంశాలను అందించడంలోనూ రేడియో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ నాటికీ కూడా భారతదేశంలో ఇంటర్నెట్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలకు వార్తలు, వినోదం, విద్యా సంబంధిత సమాచారంతో పాటూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించడంలో రేడియో ఎంతో సహాయపడుతోంది. ఆపద సమయాల్లో, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, రేడియో అత్యవసర సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ వంటి కార్యక్రమాల ద్వారా, ప్రజలతో నేరుగా మాట్లాడటానికి, వారి సమస్యలు తెల్సుకోవటానికి ఈ రేడియో ఎంతగానో ఉపయోగపడుతోంది.
రేడియో భవిష్యత్తు....
టెక్నాలజీ ఎంత పెరిగినా, మనమెంత ఎదిగినా అమ్మ పిలుపులాంటి ఆకాశవాణి మాటని మర్చిపోలేము, మర్చిపోకూడదు. ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా ఈ రేడియో మన తరానికి అందించిన సేవలని గుర్తించి, ప్రశంసించాలి. ప్రస్తుతం ఎఫ్.ఎం రేడియోలు, కమ్యూనిటీ రేడియోలు, ఆన్‌లైన్ రేడియోలు మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ రేడియో, పాడ్ కాస్టులు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా కానీ, ఇప్పటికీ ప్రజలకు అత్యంత నమ్మకమైన సమాచార మాధ్యమంగా సంప్రదాయ రేడియో కొనసాగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంటుంది.
*రూపశ్రీ.