వాడు చెప్పేది నేను వినడం ఏంటి? అనే ఆలోచనలో మీరూ ఉన్నారా? అయితే ఇది చదవండి!

ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడమనేది ఎప్పుడో పోయింది. పరుగులు పెట్టే జీవితంలో ఎవరికీ పక్కవాళ్లు చెప్పేది ఎంతటి విషయమైనా సరే ఏకాగ్రతతో వినే తీరిక, ఓపిక - రెండూ లేవు. వాళ్ళ దోవన వాళ్ళు చెప్పుకుపోతుంటే మన దోవన మనం ఏదో ఆలోచిస్తుంటాం. కాలక్షేపం బాతాఖానీలు, కబుర్లూ అయితే మనస్సుపెట్టి వినకపోయినా ఫరవాలేదు కానీ ఇతరత్రా ఏ మంచి విషయమైనా శ్రద్ధగా వినాలి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. అధికారంలో ఉన్నవాళ్ళు, కింద వాళ్ళ పట్ల శ్రద్ధ కనబరిచి వాళ్ళు చెప్పేది సహనంతో వింటే ఉత్తమ పాలకులూ, ఉత్తమ అధికారులూ అవుతారు. నవ విధ భక్తిమార్గాలలో కూడా శ్రవణానికే మొదటి స్థానం కల్పించారు. శ్రవణం సరిగ్గా ఉంటే, మిగిలినవన్నీ తేలిగ్గా సిద్ధిస్తాయి. శ్రవణం అంటే వినడం. ఆ వినడమేదో శ్రద్ధగా వినాలి. భావప్రసారమంటే వ్రాయడం, మాట్లాడడం, సంభాషించడమే కాదు, వినడం కూడా! ఇతరులు చెప్పింది సరిగ్గా వినక పోవడం వల్ల మనఃస్పర్థలు వస్తాయి. 'శ్రద్ధయా శ్రవణం కుర్యాత్. శ్రద్ధతో వినాలని శాస్త్రం చెబుతోంది. శ్రవణమే జ్ఞానానికి తొలి మెట్టు. అది లేకుంటే జ్ఞానం ఉదయించదు. విషయాన్ని కూలంకషంగా తెలుసు కోవాలంటే ఓపిగ్గా వినాలి. ప్రహ్లాదుడి కథ మనందరికీ తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని తల్లి లీలావతికి నారదమహర్షి ఉపదేశిస్తుండగా శ్రద్ధగా విన్నాడు కాబట్టే విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడు. వినదగు నెవ్వరు చెప్పిన  వినినంతనె వేగపడక వివరింపదగుస్ కని కల్ల నిజము దెలిసిన  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా ముందు వెనుకలు ఆలోచించి, మంచిచెడ్డలు విచారించి, నిజానిజాలు తెలుసుకొని, తెలివిగా వ్యవహరించాలి. అలాంటి వాడే నిజమైన వివేకవంతుడని సుమతీ శతకకారుడు బద్దెన చెప్పాడు. అందరూ అలవరచు కోవలసిన మంచి గుణమిది. ఎవరు ఏం చెప్పి ఉద్రేకాలకు, ఉద్వేగాలకు లోను కాకుండా శాంతంగా వినాలి. వాస్తవ దృక్పథంతో వినాలి. ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో ఏదీ వినకూడదు. అలాగే చెప్పేది పూర్తిగా వినకుండా ఏ నిర్ణయానికీ రాకూడదు. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడడం మంచిది కాదు. అలా చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ముఖ్యమైన విషయమేదో వినకుండా పోయే ప్రమాదం ఉంటుంది. మనం ఎదుటివారికి ఏదైనా చెబుతున్నప్పుడు వాళ్ళ నుంచి సానుకూల స్పందన కోరుకుంటాం. అలాగే ఎవరైనా! నచ్చితే మెచ్చుకోలు మాట ఏదైనా అనండి. కనీసం తల ఆడించండి. ఓ చిరునవ్వు నవ్వండి. నచ్చకపోతే మాత్రం మెత్తగా, అన్యాపదేశంగా చెప్పండి. కటువుగా చెప్పకండి. దీనిని పాటించడం వల్ల మనకూ చెప్పేవారికీ మధ్య  సదవగాహన, సద్భావన పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం.. వినేవాడికి చెప్పేవాడు లోకువ కాదని తెలుసుకోండి. పక్కవాడు చెప్పేది శ్రద్ధగా వింటేనే మనకు గ్రహణశక్తీ, సహనమూ పెరిగేది. *నిశ్శబ్ద.

మీరు చేసే ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారా?

ప్రస్తుత సమాజంలో చదివింది ఒకటయితే చేసే ఉద్యోగం మరొకటి అవుతుంది. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకటం చాలా కష్టంగా వుంటుంది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక అవసరాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ కారణాలు కావచ్చు చదివిన చదువుకు సంబంధించినది కాకుండా పరిచయం లేని, దాని గురించి ఏమీ తెలియని ఉద్యోగం చేయాల్సి రావచ్చు.  చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లభించకపోవటం వల్ల మనలో నిరాశ, అసంతృప్తి అనేవి చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తుతం ఉన్న యువతలో చాలా బాగా గమనించవచ్చు. దానివల్ల  మానసిక ప్రశాంతత అనేది కరువైపోతుంది. ఈ మానసిక ప్రశాంతత లేని కారణంగానే  ఇబ్బందులకు గురి అవుతున్నాము. మానవ జీవితాలలో అత్యంత ప్రాముఖ్యత వహించే అంశం ఉద్యోగం, మనకు అనుకూలమైన ఉద్యోగం దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి చెందుతూనే మనకు అనుకూలమైన ఉద్యోగం దొరికేంత వరకు దాని కోసం కృషి చేయాలి, దానిని సాధించుకోవాలి. అంతే తప్ప మనకు తగినది దొరకలేదనే కారణంతో ఏదీ చేయకుండా కాలాన్ని వృధా చేస్తూ ఉండటం వివేకవంతుల లక్షణం కాదు.  దీనికంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది అని మనం మానసికంగా ఫీల్ అవ్వాలి అటువంటి మంచి ఉద్యోగం పొందే సామర్థ్యాన్ని, అంటే అర్హతలు మనకున్నాయో లేదో గమనించుకుని ఆ అర్హతలు సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చెయ్యాలి. అలాగని చెప్పి, ఉన్న ఉద్యోగం వదులుకుని, నిరుద్యోగిగా ఆఫీసులచుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. చేస్తున్న ఉద్యోగం మంచి క్రమశిక్షణతో అంకిత భావంతో చేస్తూనే మన సమర్ధతకు సరిపోయే ఉద్యోగం కోసం కృషి చేయాలి. కృషి చేస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాలు లేక, దొరికిన ఉద్యోగాలు చేయలేక ఆత్మనూన్యతాభావంతో ఎన్నో రకాలైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కాని అది సమంజసం కాదు. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే అసమర్ధుడిగా ముద్రపడే ప్రమాదం ఉంది. అందుకే దొరికిన ఉద్యోగం చేసుకుంటూ మనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలి. నిజానికి పరిచయం లేని పని దొరికినా ఆ కొత్త పనిలో విషయాన్ని, ఆ పనికి సంబంధించిన మెలకువలను ఆసక్తిగా తెలుసుకునేవాడు ప్రతిభావంతుడు అవుతాడు. ఎదురయ్యే ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోవడమే వివేకవంతుల విజయాల వెనుక కారణం. ప్రస్తుతం సమాజంలో వ్యక్తి నైపుణ్యానికి తెలివికి విలువలేని కాలంలో తనకు గుర్తింపు లేదనో, తన తెలివికి తగ్గ ఉద్యోగం లేదనో బాధపడుతూ అశాంతికి గురి అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలివిని మన నైపుణ్యాన్ని గుర్తించే రోజు ఒకటంటూ వుంటుందని గ్రహించాలి, విశ్వసించాలి. పరిస్థితులను అర్ధం చేసుకుని జీవించాలి. మనం వున్న పరిస్థితులలో మౌనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటూనే నిత్య జీవితంలో తమ ప్రతిభను వెల్లడించాలి, మనం కొంతమందిని చూస్తూ వుంటాము. వారు ఎదుటివారి దోషాలు చూపటం వల్ల తాను గొప్పవాడైనట్టు భావిస్తుంటారు. తప్ప, తమలోనూ లోపాలున్నాయని అనుకోరు. ఎదుటివారిలో తప్పులు వెతకడం మాని, తనలోని లోపాలను గుర్తించి, సరిదిద్దుకునే వ్యక్తికి ఉన్నత అవకాశాలు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి.                                       ◆నిశ్శబ్ద.

మనకు మనమే మిత్రుడు, శత్రువు అంటారు ఇందుకే..

మనిషి జీవితంలో మానసిక దృక్పథం గొప్ప పాత్ర పోషిస్తుంది. సరైన మానసిక దృక్పథంతో, మనల్ని మనం చక్కగా అదుపులో పెట్టుకున్నప్పుడు, మన శ్రేయస్సును మనమే ప్రోదిచేసుకుంటాము. అలా కాక చెదిరిన మనస్సుతో, అజ్ఞానపు మబ్బులు క్రమ్మిన మనస్సు మనకే శత్రువుగా తయారవుతుంది. మనల్ని మనం కించపరుచుకున్న ప్రతిసారీ మనలోని ఉన్నతమైన ఆత్మకు మనం వ్యతిరేకంగా పనిచేస్తున్నామన్న మాట.  నిజానికి మనల్ని మనం కించపరచుకున్నప్పుడు మనలో ఉన్న ఆత్మశక్తిపై మనకు నమ్మకం లేదని అర్థం. మనల్ని మనం నాశనం చేసుకోవడానికి ఇదే కారణం. అదే విధంగా, మనం గర్వం, అహంకారంతో మిడిసిపడుతున్నప్పుడు కూడా మనం ఆ ఆత్మశక్తి నుంచి మరలిపోతున్నామన్నమాట. ఈ అహంకారం రెండు విధాలుగా పనిచెయ్యగలదు. దంభాన్ని, దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పుడే కాక విషాదంలో, నిస్పృహలో మునిగిపోయినప్పుడు కూడా ఈ అహంకారమే మనలో పనిచేస్తూ ఉంటుంది. దీనిని బట్టి, మనకు అన్నిటికన్నా మించి ఒక సమస్థితి కలిగిన మనస్సు కావాలి అని అర్థమవుతుంది. ఆ సమస్థితితో మనస్సు ఒక అంచు నుంచి మరొక అంచుకు పరుగులు తీయకుండా ఉండాలి. మనం ధనవంతులమనీ, అధికారం కలవారమనీ మిడిసిపడటం ఒకవైపు అయితే, మనకేమీ లేదనీ, పేదవారమనీ, దుఃఖాలలో మునిగి ఉన్నామనీ అనుకోవడం రెండవవైపు. ఈ రెంటికీ మధ్యనున్న మార్గాన్ని మనం అనుసరించాలి. వేదాలలో కనిపించే బోధలు, మనకు ఆ మార్గాన్ని అత్యంత శక్తిమంతంగా, స్పష్టంగా చూపాయి. మిగిలిన విషయాలన్నింటికన్నా మిన్నగా మనకు ఈ సమస్థితి కావాలనీ, ఇది కేవలం ఆధ్యాత్మిక జీవితంలోని ఉన్నత శిఖరాలకు చేరుకునేవారి కోసం మాత్రమే కాక మన రోజువారీ జీవితంలో కూడా అంతే అవసరం.  కొందరు చిన్నచిన్న విషయాలను కూడా తట్టుకోలేరు. వాతావరణం కొద్దిగా వేడెక్కినా, కొద్దిగా చలిగాలి వీచినా వారు గోరంతలు కొండంతలు చేసి తమ బాధల్ని వివరిస్తారు. కానీ అదంతా వారి మనస్సులో తయారయినదే. నిజానికి మనం అత్యంత విషాదం అని భావించే పరిస్థితి కూడా మన మనస్సులో తయారు చేసుకున్నదే. మన విషయమేమిటో మనమే ముందుగా గమనించాలి. ఒకరోజు మనం మంచి ఉత్సాహం నిండిన మనస్సుతో, ధైర్యంతో, నిర్భయంగా, అంతా భగవదర్పణమే అన్నట్టు పనిచేస్తాము. మరొకరోజు నిరాశతో, సంశయంతో, అసంతృప్తితో పనిచేస్తాము. వీటియొక్క ప్రభావం మన జీవితం మీద ఎలావుంటుందో మనం గమనిస్తే, 'మనకు మనమే మిత్రుడు, మనకు మనమే శత్రువు' అని ఎందుకు చెప్పారో ఇట్టే అర్ధమవుతుంది. నిస్పృహ వల్ల మనల్ని మనమే అధోగతి పాలుచేసుకోవడం కాక తోటివారిని కూడా మనతో పాటు క్రిందికి లాగుతాము.  ఎవరైతే అలాంటి నిరాశానిస్పృహలలో మునిగిపోయి ఉంటారో, వారికి వేరొకరి జీవితాన్ని తాకే అధికారం లేదు అని ఒక గొప్ప గురువు చెప్పుతూ ఉండేవాడు. జీవితమనేది విషాదంగా ఉండటం కోసం కాదు. మన నెత్తిమీద ఉన్న బరువును వేరొకరిని మోయమనడం సమంజసం కాదు. విచ్చలవిడి ప్రవర్తన వల్ల ప్రయోజనం లేదు.  కొందరు విషాదంలో మునిగితేలుతూ ఉంటారు. చూడబోతే వారికి అదే చాలా ఇష్టంగా కనిపిస్తున్నట్టు తోస్తుంది. మీరు వారిని అందులోనుండి ఒకసారి బయటకు లాగితే వాళ్ళు తిరిగి అందులోనే పడిపోతూ ఉంటారు. వారికి ఆ నిస్పృహ అనే పంజరంలో ఉండటం అలవాటయిపోయింది. ఇక వారు తమకు తామే అందులోనుంచి బయట పడాలి. ప్రపంచంలోని మతాలన్నీ కలసి, అత్యున్నతమైన ఆదర్శాలన్నీ వారికి బోధించినా, వారిని వారు మేల్కొల్పుకునేవరకూ, వాటివల్ల వారికి ఏ ప్రయోజనమూ ఉండదు. అందుచేతనే భగవద్గీత ఎలుగెత్తి ఘోషించింది - "నిన్ను నీవు, నీచేతనే ఉద్దరించుకోవాలి! నిన్ను నీవు దిగజార్చుకోకూడదు!" అని.                                         ◆నిశ్శబ్ద.

అన్నింటికంటే విలువైనది

అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.   కాకి పక్కకి తిరిగి చూసేసరికి మామిడి చెట్టు మీద ఒక కోయిల కనిపించింది. ‘మిత్రమా! నీ గొంతు భలే మధురంగా ఉంది సుమా! పైగా నాలాగా నువ్వు నానాచెత్తా తినాల్సిన అవసరం లేదు. హాయిగా ఆ మామిడి చిగురులతో కడుపు నింపుకోవచ్చు. నీ గొంతు విన్న ఈ లోకం ఉగాది వచ్చేసిందని పొంగిపోతుంది. నీదెంత అదృష్టజాతకం’ అని తెగ పొగిడేసింది. ‘ఆ నాదీ ఒక బతుకేనా!’ అంది కోకిల నిట్టూరుస్తూ. ఆపై ‘నా రంగు నీకంటే నలుపు. పైగా వసంత రుతవులో తప్ప కూయలేను. అంతదాకా ఎందుకు! ఆఖరికి నా పిల్లలని కూడా నేను పొదగలేక, నీ గూటిలోకి చేరుస్తుంటాను. నా జాతి ముందుకి సాగుతోందంటే అది నీ చలవే. ఇక అదృష్టం అంటావా! ఆ మాట వస్తే చిలుకే గుర్తుకువస్తుంది. పంచరంగుల వన్నెలు, పంచదార పలుకులు దాని సొంతం కదా’ అని నిట్టూర్చేసింది.   కోకిల మాటలు విన్న కాకికి అందులో నిజం లేకపోలేదనిపించింది. వెంటనే ఓ చిలుకని వెతుక్కుంటూ బయల్దేరింది. కొన్ని గడియలు గడిచేసరికి ఓ జామచెట్టు మీద మాంచి దోరపండుని తింటున్న చిలకమ్మ కనిపించింది. ‘చిలుకా క్షేమమా! ఇప్పటిదాకా నీ అదృష్టం గురించే నేనూ కోకిలా మాట్లాడుకున్నాము. నిన్ను చూస్తుంటే కోకిల చెప్పినదానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. ఏమి అందం, ఏమి గాత్రం... పైగా కమ్మని జామపళ్లతోనే కడుపు నింపుకునే భాగ్యం. అసలు బతుకంటే నీదే!’ అంటూ పొగడ్తలను వల్లె వేసింది.   ‘ఉష్‌! గట్టిగా అరవబాక. ఏ వేటగాడన్నా వింటే నన్ను పట్టుకుపోయి పంజరంలో బంధించేయగలడు. అయినా నాదీ ఒక అందమేనా? నాదీ ఒక స్వరమేనా? అసలు నువ్వెప్పుడన్నా నెమలి అనే పక్షిని చూశావా? అది పురివిప్పి నాట్యమాడటాన్ని గమనించావా? అదీ అందమంటే! అదీ నాట్యమంటే! అదీ అదృష్టమంటే!’ అంటూ నోరు తెరుకుని ఉండిపోయింది. కాకికి చిలుక మాటలు నిజమే కదా అనిపించాయి. తానెప్పుడూ నెమలి నాట్యం గురించి వినడమే కానీ చూసే అదృష్టం కలుగలేదు. ఈసారి ఆ నాట్యమేదో తను కూడా చూసి తీరాలి. చిలుక చెప్పిన మాటలను పూర్తిగా రూఢిచేసుకోవాలి. నెమలి జీవితమే అన్నింటికంటే అదృష్టజాతకం అని రుజువుపరుచుకోవాలి. అలా అనుకుంటూ నెమళ్లు ఎక్కువగా తిరుగాడే ప్రాంతానికి వెళ్లి కాపువేసింది.   కాకి అదృష్టం ఏమో కానీ, కాసేపట్లోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గుంపులోని నెమళ్లు కొన్ని పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఆ నాట్యాన్ని చూసి కాకి కళ్లు చెదిరిపోయాయి. ఏం అందం! ఏం నాట్యం! ఏం ఈకలు! ఏం హొయలు! అనుకుంటూ ఆశ్చర్యపోయింది. వెంటనే ఓ నెమలి దగ్గర వాలి ‘ఆహా అదృష్టమంటే మీదే కదా! అసలు పక్షిజాతిలో మిమ్మల్ని మించినవారు లేనే లేరు. మీ గాత్రం, మీ నాట్యం, మీ అందం.... ముందర మా బతుకులన్నీ బలాదూర్‌’ అనేసింది.   ఆ మాటలు విన్న నెమలి కళ్లలోంచి కన్నీరు ఒలికింది ‘ఓసి పిచ్చిదానా! నాదీ ఒక బతుకేనా! మబ్బు పట్టినప్పుడు తప్ప నేను నాట్యం చేయలేను. మిగతా సమయాలలో ఈ ఈకలు నాకు బరువు. పైగా ఈ ఈకల కోసమే వేటగాళ్లు నన్ను వేటాడుతూ ఉంటారు. ఈ శరీరాన్ని వండుకు తినేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక అన్నింటికీ మించిన దౌర్భాగ్యం చెప్పనా! పక్షినన్న మాటే కానీ ఆకాశంలో అంతెత్తున ఎగరగలనా? నా మటుకు నాకైతే నిన్ను చూసినప్పుడల్లా భలే ఈర్ష్యగా ఉంటుంది. ఏది పడితే అది తిని బతికేస్తావు. ఆకాశంలో చక్కుర్లు కొడుతూ తిరిగేస్తావు. నీకు వేటగాళ్ల బాధ లేదు. ఆకలితో ఉండే రోజూ ఉండదు. హాయిగా వేళకింత తింటూ, పిల్లల్ని కంటూ, గూట్లో గువ్వల్లే బతికేస్తావు. అసలు అదృష్టమంటే నీది. అన్నింటికంటూ అమూల్యమైన స్వేచ్ఛ నీ దగ్గర ఉంది. అన్నింటికంటే శాపమైన ఆకలి నీ జోలికి రాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెమలి మాటలకు కాకి మనసు ఆకాశంలో తేలిపోయింది. ఆ మనసుతో పాటే తాను కూడా రివ్వున నింగికి ఎగిరిపోయింది. (జానపద కథ ఆధారంగా) - నిర్జర.

ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే కథ!

మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్థంభం. ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు, జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు.ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు. అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం. తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పు దారిలో వెళ్తున్నారని అర్థం. మనిషి ధర్మం గా ఉండాల్సిన అవసరం గురించి, ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి, ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఇది!! ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది. అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది.  "ఏమిటండీ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు" అని అడిగిందామె. యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది" అని బదులిచ్చాడు అతడు. "అవునా నేను నిన్న పొరపాటున  తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను. అదే ఇలా బంగారం అయ్యిందేమో!!"  "తాంబూలం అమ్మితే బంగారు ముద్ద రావడం ఏమిటే!! నీ బుద్దిలేని ఆలోచన కాకపోతే" అని విసుక్కున్నాడు అతడు. "సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను. రేపు ఏమవుతుందో చూద్దాం" అన్నదామె. అతను సరేనని చెప్పడంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మేసింది. మరుసటిరోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారు ముద్ద కనిపించింది. వారికి రోజు తాంబూలం ఉమ్మి వేయడం, మరుసటిరోజు బంగారు ముద్ద తీసుకోవడం అలవాటు అయిపోయింది. అలా చేయడం వల్ల కొద్ధి కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు. వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది. ఆ ఊర్లో మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయడం బంగారు ముద్దలు తీసుకోవడం అందరికీ అలవాటు అయింది.  అందరూ ధనవంతులైపోతున్నారు. అయితే ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా ఆమె యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు. అందరూ ధనవంతులవుతుంటే, తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరికి భర్త ఎంతకీ మాట వినకపోవటంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది. చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు. వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇళ్ళు తగలబడిపోసాగాయి.  అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు "ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది. అలా కాక ధర్మచ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారి తీస్తుంది. ఇన్నాళ్ళూ మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది. మనం ఊరిని వదిలాం. అసూయా, ద్వేషాలతో ఊరు నాశనమైంది" అని. అది విన్న భార్యకు విషయం అర్థమైంది. ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళోవారున్న స్థితిలో ఉంది. ధనసంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరివాళ్ళలాగా, ప్రస్తుతసమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డీ మేసేందుకు సిద్ధమౌతోంది. ఎంత ధనం సంపాదిస్తే, అంత అశాంతి పాలవుతోంది. నైతికవిలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది. మన తరువాతి తరాలైనా ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే "ఉత్తమ ఆదర్శం" ఎంతో అవసరం.                                    ◆నిశ్శబ్ద.

 ఇంకొంచెం సంతోషంగా జీవిద్దాం 

 జీవించడానికి, బతకడానికి మధ్య ఒక సన్నని గీతను చూపెడుతుంటారు కొందరు. అయితే సాధారణ జీవితాల్లో బంధాలు, భాధ్యతలు, సర్దుకుపోవడాలు త్యాగాలు, వీటన్నిటికీ మించి  కాలం తో పాటు అన్నిటికి అలవాటు పడుతూ కుటుంబంలో అందరితో సమన్వయంగా ఉంటూ ఇలా కొనసాగడం ఎక్కువ మంది చేసే పని. బహుశా ఇట్లా చేసే పనుల్లో ఇష్టం, తృప్తి కంటే బాధ్యత కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే మెంటాలిటీనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక విషయం. ఇలా చేసే పని వల్ల సంతోషం ఉంటుందా?? యాంత్రికంగా, కృత్రిమత్వంగా చేసే పనికి, ఇష్టంగా చేసే పనికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆ రెండిటి మీదనే మనిషిలో తృప్తి తాలూకూ స్పందనలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని బహుశా చాలామంది గమనించరు. అలా గమనించకపోవడం అనేది కూడా ఆ యాంత్రికం మరియు కృత్రిమత్వంలో భాగమే. అయితే కొందరు మాత్రం చేసే పనిలో కూడా ఎంతో తృప్తిని చవిచూడగలుగుతారు కారణం ఏమిటి అని ప్రశ్న వస్తే కొందరు చెప్పే సమాధానం. బహుశా నచ్చిన పని కావచ్చు అందుకే అంత సంతోషం అనేస్తారు.  కానీ అసలు నచ్చిన పని ఏమిటి?? నచ్చని పని ఏమిటి?? మనిషికి, సంతోషానికి, ఇష్టానికి మధ్య సంబంధం ఏమిటి?? ఇవన్నీ ఆలోచించాల్సి వస్తే మొదట మనసును ప్రభావితం చేసిన పరిస్థితులు, చేతనైనది, చేతకానిది, లేదా నైపుణ్యం సాధించింది ఇలా ఎన్నో పరిగణలోకి వస్తాయి. కానీ ఏ పనిని అయినా ఒక అవగాహనతో, ఒక ప్రణాళికతో చేయాలని అనుకుంటే మాత్రం తప్పని సరిగా ఆ పనిలో తృప్తిని పొందగలం. వాస్తవాన్ని స్వీకరించి, కాలాన్ని ప్రేమించాలి వాస్తవం ఏది అనేది తెలిసినప్పుడు దాన్ని నిజాయితీగా స్వీకరించాలి. ఎప్పుడూ అది కాదు, అది బాగలేదు, అది నాకు సంబంధించినది కాదు వంటి మభ్యపెట్టుకునే ఆలోచనల్లో ఉండకూడదు. వాస్తవాన్ని ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు స్వీకరిస్తామో అప్పుడు కాలాన్ని కూడా ప్రేమించగలుగుతాము. ఇదంతా కూడా కొన్ని భ్రమలు, కొన్ని కల్పనలను బుర్రలో నుండి వదిలేసి స్పష్టమైన కోణంలో ఆలోచించడం వల్ల కలిగేది.  ఒక వస్తువును చూడాలి అంటే కాగితాన్ని అడ్డు పెట్టుకుంటే ఎలాగైతే మసకగా కనిపిస్తుందో అలాగే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమాలు, షరతులు, మనసును కట్టిపడేసే పద్ధతులు అన్నిటి మధ్య చూస్తే వాస్తవం అనేది స్పష్టంగా కనిపించదు, అర్థం కాదు. అలా కాకుండా కేవలం విషయాన్ని, దాని తాలూకూ కారణాలను మాత్రమే చూస్తూ, విశేక్షించుకుంటే వాస్తవం తొందరగా బోధపడుతుంది. ఇక కాలాన్ని ప్రేమించడమంటే అన్ని దశలను కూడా ప్రేమించడం. ఇక్కడ మనిషి పరిపక్వతను సూచించేది ఏదైనా ఉందంటే అది కచ్చితమై కాలం. అదే వర్తమానం. పరిపక్వత కలిగిన మనిషి గతాన్ని గురించి బాధపడడు, భవిష్యత్తు గురించి ఖంగారు పడడు. కేవలం వర్తమానాన్ని ఎంత సమర్థవంతంగా ఎంత సంపూర్ణంగా వినియోగించుకుంటున్నాం. మన పనులను వర్తమానంలో ఎంత బాగా చేస్తున్నాం అనే విషయం మీదనే శ్రద్ధ పెడతాడు. కాబట్టి ఇక్కడ తెలిసొచ్చేది ఏమిటంటే మనం సాధారణంగా ఏ పని చేసిన కూడా దాన్ని మనసుకు తీసుకునే విధానంలోనే సంతోషం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే చేసే పని ఏదైనా దాన్ని ఇష్టంతో చేయగలిగితే మరింత సంతోషంగా ఉండవచ్చు. ఆ పాజిటివ్ కోణమే మీ జీవితాన్ని కూడా సంతోషంగా ఉంచుతుంది.                                                                                                                                                                                                                                                                                              ◆ వెంకటేష్ పువ్వాడ

మంచి నిద్రకు అద్భుతమైన మందు!!

ఈ కాలంలో హాయిగా నిద్రపోవడం కూడా అదృష్టమే. ఎంతో మంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. నిద్ర పట్టాలని ఎన్నో మార్గాలు అనుసరిస్తుంటారు. కానీ ఏవీ చక్కని పలితాన్ని ఇవ్వవు. కొందరు ధ్యానం అంటారు అయిదు నిమిషాలు స్థిరంగా కూర్చోలేరు. మరికొందరు ఒత్తిడి అంటారు దానివల్ల నిద్రలేమి అంటారు దాని కోసం డాక్టర్లను సంప్రదిస్తారు. మందులు వాడుతూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు అలా మందుల వల్ల నిద్రకు అలవాటు పడి తరువాత వాటిని వాడటం ఒక్కరోజు ఆయన ఇక నిద్ర ఖరాబ్. మళ్లీ నిద్ర రాదు, పట్టదు. ఇంకొందరికి ఆలోచనలు.  జీవితం గూర్చి, భవిష్యత్తు గూర్చి.మరికొందరికి ఓర్వలేనితనం వల్ల నిద్ర పట్టదు. చెప్పుకోవడానికి, వినడానికి కాస్త ఆస్చశ్రయంగా అనిపించినా ఇది నిజం. ఒకరు ఎదుగుతున్నారంటే భరించలేని వాళ్ళుంటారు. వాళ్ళు ఎప్పుడూ ఇతరులు ఎదిగిపోతున్నారని ఆలోచిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇదే కోవకు చెందినవాళ్ళు మరికొందరు ఉంటారు. ఇంకొందరు అయితే చాటింగ్ లు, బ్రౌజింగ్ లు, అనవసరపు పనులు చేస్తూ చేతులారా నిద్రను దూరం చేసుకుంటారు. ఇట్లా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు. నిద్ర పట్టకపోవడానికి కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. అయితే నిద్రకు ఒక చక్కని మందు ఉంది. అదేంటో తెలియాలి అంటే కింద విషయం చదవాలి. అనగనగా ఒకరాజు. ఆయన గొప్పవాడు. రాజ్యం ఉంది, సంపదలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. సకల సౌభాగ్యాలు ఉన్నాయి. కానీ ఆయనకు లేనిది ఒకటే నిద్ర. నిద్ర పట్టదు. పరుపు మీద పడుకుని దొర్లి దొర్లి పెడతాడు. కానీ నిద్ర రాదు. ఒకరోజు రాత్రిపూట నిద్రపట్టక తోటలోకి వెళ్ళాడు. ఆ తోటకు ఆనుకుని అడవి ఉంది. ఆ అడవి నుండి ఆ వేళ ఏదో శబ్దం వస్తోంది. ఈ సమయంలో ఎవరో చూడాలి అనుకుని తోట నుండి అడవిలోకి వెళ్ళాడు రాజు. ఆ అడవిలో ఒక వ్యక్తి చెట్టు నరుకుతూ కనిపించాడు. వెన్నెల వెలుగు ఉండటంతో పని జరుగుతోంది.  "నువ్వు రాత్రిపూట నిద్రపోకుండా చెట్టు నరుకుతున్నావు. నీకు నిద్ర పట్టదా" అని అడిగాడు రాజు. రాజు సాధారణ బట్టలు వేసుకుని ఉండటంతో ఆ వ్యక్తి అతన్ని రాజు అనుకోలేదు. "ఎందుకు రాదు అలా పడుకుంటే కొన్ని సెకండ్లలోనే .శవం మాదిరి నిద్రపోతాను. కానీ పని జరిగితేనే డబ్బులొస్తాయి. కాబట్టి తప్పదు పని చేయాలి" అన్నాడు ఆ వ్యక్తి. "ఏంటి సెకండ్లలోనే నిద్ర వచ్చేస్తుందా నేను నమ్మను" అన్నాడు రాజు. "నమ్మకపోతే నేను ఏమి చేయలేను" అన్నాడు ఆ వ్యక్తి. "ఒకపని చేద్దాం. నేను నీ బదులు చెట్టు నరుకుతాను. నువ్వు సెకండ్లలోనే నిద్రపోతా అన్నావుగా నిద్రపో చూద్దాం" అన్నాడు రాజు. ఆ వ్యక్తి సరేనని గొడ్డలి రాజుకు ఇచ్చి చెట్టుకింద అలా పడుకుని నిమిషంలోపలే గురక పెట్టి నిద్రపోయాడు. "పట్టు పరుపులు, మెత్తని దుప్పట్లు అన్ని ఉన్నా నాకు నిద్ర రాదు. వీడు చెట్టు కిందనే ఇట్లా ఎలా నిద్రపోయాడు" అనుకున్నాడు రాజు. ఆ తరువాత వాడికి మాట ఇచ్చాను కాబట్టి చెట్టు నరకాలి అనుకుని చెట్టు నరికేసాడు. అలవాటు లేని పని అవ్వడం వల్ల చేతులు బొబ్బలెక్కాయి. చెమటతో శరీరం తడిసి ముద్దయ్యింది.అలసట కలిగింది. కాళ్ళు, చేతులు లాగేసాయి. మెల్లిగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతడి పక్కనే అలా నడుము వాల్చాడు. నిమిషంలోపలే హాయిగా నిద్రపోయాడు. ఉదయాన్నే రాజుకు మెలకువ రాగానే అనుకున్నాడు. మనిషికి శారీరక కష్టమే మంచి నిద్రను ప్రసాదిస్తుంది అని.  కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే మంచి నిద్ర కావాలి అంటే కష్టపడి పనిచేయాలి. దురదృష్టం కొద్దీ ఈ కాలంలోప్రతి ఇంట్లో పని దొంగలు ఎక్కువ ఉంటున్నారు. పని మనుషులను పెట్టుకోవడం కూడా అందుకు ఓ కారణం. మనిషి శరీర ఆరోగ్యానికి, మంచి నిద్రకు ఏ వైద్యుడు ఇవ్వలేని గొప్ప ఔషధం కష్టం. అందుకే కష్టపడాలి. నష్టం ఏమి ఉండదు. ◆ వెంకటేష్ పువ్వాడ  

అనుమానం!

అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమైన, అందమైన కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత్రమైన మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్దాలగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.   శిల్పి చూపించిన అద్దాల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప్రవేశిస్తే వారిని ప్రతిబింబించేలా గదిలో అన్నివైపులా అద్దాలే! గది పైకప్పు, కింద గచ్చు కూడా అద్దాలతోనే తయారుచేశాడు. కంట్లో నలుసు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయా అద్దాలు. లోపలికి ప్రవేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్దాలు. అంతేకాదు! ఆ అద్దాల గదిలోని శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా ప్రతిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష్టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు తెగ ఎదురుచూడసాగారు. ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టగానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర్హత తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట్టడానికి ఒక్కసారిగా తన వాడి పళ్లను చూపించింది. చిత్రం! అవి కూడా అలాగే తనని భయపెట్టేందుకు కోరలు చూపించాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఒక్కసారి గట్టిగా మొరిగింది కుక్క! దానికి నాలుగువైపుల నుంచీ భీకరంగా శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇక తన చుట్టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ, లేని శత్రువులను ఉన్నారనుకుని అద్దాల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది. ఉదయాన్నే అద్దాల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్జీవంగా కనిపించింది. రాత్రంతా తన ప్రతిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడిపోయింది. మన మనసు కూడా అద్దాల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!

యోగం జీవనరాగం!

భారతీయ సనాతన వ్యవస్థ చాలా గొప్పది. ఎన్నో వేల సంవత్సరాల నుండి మహర్షులు, ఋషులు, పూర్వీకులు కొన్ని విశిష్టమైన జీవనవిధానాలను ఆచరిస్తూ తమ ముందు తరాల వారికి కూడా వాటిని అందజేశారు. అలా తరాలుగా వస్తున్న గొప్ప జీవనశైలిలో ఎంతో అద్భుతమైనమార్గం యోగ. యోగను రోజువారీ చేసేపనులలో అంటే ఉదయం లేవడం, ఇంటి  పనులు, వ్యాయామం, ఆహారం తినడం వంటి పనుల్లా యోగా కూడా ఒక గంటనో, లేక కొన్ని నిమిషాలో సాగే ప్రక్రియగా భావిస్తారు చాలామంది. యోగ అంటే ఏంటి? యోగ అంటే శరీరాన్ని వివిధ భంగిమలలోకి వంచి ఆసనాలు వేయడం అని కొందరు అనుకుంటారు. ధ్యానం చేయడం అని మరికొందరు అనుకుంటారు. రెండింటిని కలిపి చేయడం అని కొందరు అనుకుంటారు. కానీ యోగ అనేది ఒకానొక జీవనవిధానం అనే విషయం కొద్దిమందికే మాత్రమే తెలుసు.  మనుషుల జీవన విధానాలు కూడా వర్గాలుగా ఉన్నాయా?? వేరు వేరుగా ఉంటాయ అని అనుమానం వస్తుంది. మనిషి జీవనశైలిని బట్టి మనిషి జీవనవిధానం విభిన్నంగా ఉంటుంది. ఆ విభిన్నతే మనిషి శారీరకంగా మానసికంగా ఎలా ఉన్నాడు అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతూ ఈ వేగవంతమైన కాలంలో కూడా నిశ్చలమైన మనసును కలిగి ఉండటం, సహజత్వానికి, ప్రకృతికి దగ్గరగా జీవించడమే యోగమని ఆ మార్గాన్ని యోగ అని అంటారు. జీవితాన్ని రీఛార్జి చేస్తుంది! యోగ అనేది జీవితాన్ని రీఛార్జి చేసే గొప్ప మార్గం. నిజానికి ఇది ఒక మంచి మెడిసిన్ లాంటిది. జీవితం నిస్సారంగా మారిపోయి ఎలాంటి ఆశ లేదనుకునే స్తాయిలోకి జారిపోయినప్పుడు యోగ మనిషికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది.  జీవన సరళి! అప్పటివరకు గందరగోళంగా ఉన్న జీవితాన్ని ఒక గట్టుకు చేర్చేదే యోగ.  క్రమశిక్షణను, స్పష్టతను కలిగి ఉండేది.  ఉదయాన్నే లేచి ఆసనాలు చేసి, ముక్కు మూసుకుని ప్రాణాయామం, ధ్యానం చేయగానే యోగ చేసినట్టు కాదు. జీవితంలో ప్రతిరోజూ ప్రతి  క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి పనిని అనుభూతి చెందుతూ చేయడమే యోగం.  నేటి కాలంలో యోగ ప్రాముఖ్యత! ప్రస్తుత కాలంలో యోగ అంటే ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం ఇవే అనుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ చేయడం కూడా ఇప్పటి జనాలకు పెద్ద టాస్క్ లాగా తయారయ్యింది. పట్టుమని పది నిమిషాల ధ్యానం, నాలుగు రకాల ఆసనాలు వేయడం రానివాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు అందరూ చెప్పుకునే యోగ గురించి అయినా సరిపడినంత అవగాహన కలిగించడం ఎంతో ముఖ్యం. యోగా క్లాసులు, అవగాహన సదస్సులు, నాటి మన మహర్షుల జీవనవిధానం వంటివి తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పట్లో అయితే సద్గురు జగ్గీ వాసుదేవ్, బాబా రాందేవ్ వంటి గురువులు యోగా మీద అవగాహన పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. భారతీయ యోగ గొప్పతనాన్ని గుర్తించిన విదేశీయులు సైతం భారతీయ జీవనవిధానానికి తమ మద్దతు తెలుపుతూ దాన్ని పాటిస్తూ తమ తమ జీవితాలను ఎంతో అందంగా మార్చుకుంటున్నారు. పెద్ద పెద్ద వృత్తులలో ఉన్నవారు, విద్యాధికులు యోగా మార్గాన్ని అనుసరిస్తూ లక్ష్యాలు సాధిస్తూ తమ విజయాలు అందరి ముందుకు తెస్తున్నారు. కాబట్టి యోగ అనేది రోజువారీ జీవితంలో మనం అన్నం తిన్నట్టు, నిద్రపోయినట్టు అప్పుడప్పుడూ చేసే ప్రక్రియ కాదు. నిరంతరంగా శ్వాసక్రియ జరిగినట్టు నిరంతరంగా జీవితంలో అది ఒక భాగం అయిపోవాలి. అప్పుడు ఆ యోగ మనిషి శరీరానికి జీవశక్తిని పెంపొందిస్తుంది, జీవితానికి అద్భుత రాగమవుతుంది.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

ప్రస్తుత సమాజాన్ని తప్పుదోవలో నడుపుతున్నది ఎవరు?

ప్రస్తుతసమాజాన్ని వ్యాపారసంస్కృతి నిర్దేశిస్తున్నది. వ్యాపారంలో ప్రచారం అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందంటే ప్రస్తుతం వ్యాపార ప్రచారం ఇరవై నాలుగు గంటలూ ప్రతి నట్టింటా వికృతరూపంలో నర్తనమాడుతోంది. పుట్టినప్పటి నుంచీ జీవితంలో అనుభవించగల సౌఖ్యాలు ప్రతివాడికీ ప్రతి వయసు నుంచీ తెలుస్తున్నాయి. ఆ సౌఖ్యాల సాధనకు ఏకైక మార్గం డబ్బు సంపాదన. దాంతో వ్యక్తి అభివృద్ధిని డబ్బు సంపాదనతో కొలవటం తప్పనిసరి అయింది. తమ పిల్లవాడు డబ్బు సంపాదించకపోతే పనికి రానివాడన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. దాంతో ప్రతివాడి జీవితలక్ష్యం ఎలాగోలాగ, వీలైన రీతిలో డబ్బు సంపాదించటమే అన్నది స్థిరమైపోయింది. సమాజం అవినీతిమయమై విలువలు తరగటంలో ప్రధానంగా తోడ్పడిన అంశం ఇది. డబ్బు మీద ఆశను కల్పించి, పెంచటంలో పాశ్చాత్య ప్రచారసంస్థలు గణనీయమైన విజయాన్ని సాధించాయని చెప్పవచ్చు. ప్రేమప్రచారం సమర్థంగా జరిగింది. యువతీ యువకులు కలిస్తే ప్రేమించి తీరాలన్న అభిప్రాయం ఏర్పడింది. కాలేజీలకు వెళ్ళేది ప్రేమించటం కోసమేనన్న అభిప్రాయం విస్తృతంగా ప్రచారమైంది. టూత్ పేస్టుతో పళ్ళు తోముకుంటే అమ్మాయి వచ్చి ఒళ్ళో వాలుతుంది. ఓ మోటర్ సైకిల్ కొంటే, ఇతరుడితో ఉన్న అమ్మాయి, వాడిని వదిలి వీడి దగ్గరకు వచ్చేస్తుంది. ఓ షేవింగ్ లోషన్ వాడగానే అమ్మాయి ప్రత్యక్షమైపోతుంది. ఇంకో మౌత్ ఫ్రెష్నర్ ఉపయోగిస్తే అమ్మాయిలు ఎగురుకుంటూ వచ్చి పడిపోతారు. ఇంకేదో సువాసన ద్రవ్యం వాడితే అమ్మాయిలు వెర్రెక్కి వెంటపడతారు. మరింకేదో కంపెనీ కళ్ళద్దాలు పెట్టుకుంటే, అమ్మాయిలు నిజంగానే పడిపోతుంటారు. ఈ ప్రచారం వల్ల, అబ్బాయిలకు అమ్మాయిలంటే ఎంతగా చులకన అభిప్రాయం కలుగుతుందో ఆలోచిస్తే, ఈ తరానికి మనం చేస్తున్న అన్యాయం అర్థమౌతుంది. అలాగే, ఓ అమ్మాయి "మిస్ యూనివర్స్" గా ఎన్నికై, సినిమాల్లోకి వెళ్ళి డబ్బు సంపాదించింది. ఆమె మిగతావారందరికీ ఆదర్శమైంది. ప్రతి వారూ అందంగా ఉండాలని పోటీలు మొదలుపెట్టారు. విదేశీ కాస్మెటిక్ కంపెనీలకు లాభం. విదేశీ ఎక్సర్ సైజ్ పరికరాల తయారీదారులకు లాభాలు. ఇక అమ్మాయిలు ఉన్నది అబ్బాయిలను ఆకర్షించేందుకే అన్న ప్రచారం పుట్టినప్పటి నుంచీ ఉగ్గు పాలతో అబ్బాయిలు నేర్చుకుంటున్నారు. ఓ అమ్మాయి ఓ క్రీమ్ వాడగానే అబ్బాయిలు వెంటపడతారు. ఓ హెయిర్ షాంపూ వాడితే ముగ్ధులైపోతారు. కంపెనీ ఐస్ క్రీమ్ అసభ్యంగా తింటూంటే కుర్రాళ్ళు సర్వం మరచిపోతారు.  ముఖం మీద మొటిమలు ఉంటే అబ్బాయిలు మెచ్చరు. కాబట్టి ఓ కంపెనీ మొటిమల మందు వాడితే ఇక అబ్బాయిలు క్యూలు కడతారు. ఇంకేదో పౌడరు, మరింకేదో అందాన్ని పెంచే వస్తువు.... కానీ అన్నీ అబ్బాయిలను ఆకర్షించేందుకే. ఐతే వీటన్నిటికీ డబ్బు కావాలి. డబ్బు కావాలంటే పరీక్షల్లో పాసవాలి. మార్కులు రావాలి. అప్పుడు కార్లు కొనవచ్చు, అమ్మాయిల్ని వెంట తిప్పుకోవచ్చు. ఇదీ ప్రస్తుతసమాజం ఆలోచిస్తున్న దిశ.  పైన చెప్పుకున్నవి అన్ని గమనిస్తే వ్యాపార సామ్రాజ్యాలు చాలావరకు ప్రస్తుత సమాజానికి నష్టం చేకూరుస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.                                     ◆నిశ్శబ్ద.

మనిషిలో మరొక అంతర కోణం!

హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.

నాన్నంటే నీలాకాశం..

ప్రతి వైకాఠి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయమైనది. తాము తినకపోయినా పిల్లల కడుపు నింపడానికి ఎన్నో ఇబ్బందులు పడే తల్లిందండ్రులు ఎందరో ఉన్నారు. తల్లి నవమాసాలు మోసి కంటే, తండ్రి జీవితాన్ని ఇస్తాడు. తన జీవితం ముగిసేవరకు నేలమీద తిరగాడుతున్న బిడ్డకు ఆకాశమంత గొడుగై ధైర్యాన్ని, భరోసాను ఇస్తూ కాపాడుకుంటాడు. కానీ గుర్తింపు విషయంలో  నాన్నలు ఎందుకో వెనకబడుతారు.. భార్య కడుపులో నలుసు పడింది మొదలు బిడ్డకోసం ఆరాటపడే మగాళ్లు తండ్రులయ్యాక తమను తాము కోల్పోతారు.  భర్తగా, తండ్రిగా ఆ రెండు పాత్రల్లోనే జీవితాన్ని లాగిస్తారు. భార్య, పిల్లల కోరికల్ని నెరవేర్చడానికి ఎంత కష్టాన్ని అయినా సంతోషంగా అనుభవిస్తారు.  పిల్లల ప్రపంచం.. ప్రతి తండ్రికి తన పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. భార్య కంటే కూడా పిల్లల మీద తండ్రికి ప్రేమ ఉంటుంది. ప్రతి తండ్రి మనసులో తన కొడుకు ఓ రాజకుమారుడు, కూతురు ఓ రాజకుమారిలా మెదులుతారు.  చిట్టి చిట్టి పాదాలతో తండ్రి గుండెల మీద పిల్లలు తంతున్నా వారికేమీ బాధ ఉండదు. కానీ పిల్లలే పెద్దయ్యాక తండ్రుల నమ్మకం మీద, తండ్రి గుండెల మీదా తన్నేసి పోతుంటారు. పాపం మగాళ్లకు ఏడవడం కూడా ఇబ్బందే.. కానీ తండ్రులు అయితే బిడ్డల్ని తలచుకుని మనసులోనే ఏడుస్తారు.  నాన్నంటే భరోసా.. చిన్నప్పుడు ఎవరైనా కొడితే మా నాన్నకు చెబుతా అని ధైర్యంగా చెప్పుకోవడం నుండి.. పిల్లలు పెరిగి పెద్దయ్యాక నాన్నకు చెప్పి తీరాలా?? అని ఎన్నో వెర్రి పనులు చేసి తీరా సమస్యల్ని నెత్తికి తెచ్చుకున్నాకా అదే నాన్న పంచన చేరి తన బాధను చెప్పుకునే కుర్రాళ్ళలు లెక్కే లేదు ఈకాలంలో.  చందమామ కావాలని మారం చేసిన బాలరాముడికి నీళ్లలో చందమామను చూపించి ఏమార్చిన  దశరథుడి లాంటి మనసు ప్రతి తండ్రిలోనూ ఉంటుంది. దశరథుడి వల్ల రాముడికి కీర్తి దక్కిందా?? రాముడి వల్ల దశరథుడి పేరు కీర్తికెక్కిందా అని తరచి చూస్తే.. పితృవాక్య పాలకుడైన రాముడి వలన దశరథుడికి దక్కిన కీర్తి, గౌరవం గొప్పదని చెప్పవచ్చు.  ఓడి గెలిచే నాన్న.. పిల్లల దగ్గర ఓడిపోవడానికి తండ్రి ఏమాత్రం బాధపడడు. తనకు తలకు మించిన పనులలో అయినా ప్రత్యక్షంగా పిల్లల్ని వారించినా, వ్యతిరేకత వెలిబుచ్చినా, చివరికి పిల్లల కోరికను తీర్చడంలో నాన్న ఎప్పుడూ ముందుంటాడు. అందుకే తను ఓడిపోయినా గెలుస్తాడు నాన్న. ప్రతి తండ్రి ఓ నీలాకాశం లాంటి వాడు. ఉరుముతాడు, మెరుస్తాడు, మండుతాడు, రాత్రివేళ నిశ్శబ్దంలో ఒంటరిగా జీవితాన్ని నెమరు వేసుకుంటాడు. ఆ ఆకాశానికి చల్లని వెన్నెల జత చేయాల్సింది పిల్లలే..                                        ◆నిశ్శబ్ద.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?

పిల్లలకు ఈమధ్య కాలంలో మెదడు చురుగ్గా అవ్వడం కోసం ఫోనెటిక్ నెంబర్స్ గురించి చెబుతున్నారు. అయితే ఈ నంబర్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇది ప్రాచీన కాలంలో గ్రీకు దేశంలోవారు తమ జ్ఞాపకశక్తితో రాజుల మెప్పు పొందేందుకు అక్కడి  ఆస్థాన పండితులు కనుగొన్నారు. అచ్చుల హల్లుల ఉచ్ఛారణకు ఒక్కొక్క అంకెను కేటాయించి వాటితో పెద్ద పెద్ద అంకెలను పదాలుగా గుర్తుంచుకొని ఆ అంకెలను వెంటనే ఏ క్రమంలో అడిగితే ఆ క్రమంలో చెప్పగలగడం ఈ పద్ధతి యొక్క విశేషం. ఈ విధానాలతో అనేక మంది జ్ఞాపక శక్తి ప్రదర్శనలు ఇస్తూ మానవ మెదడు యొక్క అద్భుత శక్తిని తెలియచేయడం అందరికీ తెలిసినదే. ఈ ప్రదర్శనల వల్ల ఏమిటి లాభం అనే సందేహం కొంతమంది మేధావులకు ఉన్నప్పటికీ తమకు తెలివితేటలు లేవు తాము సరిగా చదవలేమని ఆత్మన్యూనత భావంతో బాధపడే విద్యార్థులలో ఇటువంటి ప్రదర్శనలు మంచి ఆత్మవిశ్వాసం కలిగిస్తాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అన్నింటికన్నా జ్ఞాపకశక్తికి అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఆ విషయం పట్ల ఒక వ్యక్తికున్న ఆసక్తి మరియు ప్రాధాన్యత. చాలా మంది డబ్బు విషయంలో గాని, ఇష్టమైన వారి పుట్టినరోజు విషయంలో గాని, తమ అభిమాన హీరో సినిమా వివరాల గురించి గాని, అభిమాన క్రికెటెర్ల రికార్డుల గురించి గాని ఏ మాత్రం మరచిపోవడం ఉండదు. ఎందుకంటే వాటికి వారు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి. అలాగే చదువు కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడిన విషయం అనే అవగాహన మరియు శ్రద్ధ వారికి కల్పిస్తే వాటికి సంబంధించిన విషయాలను వారు మరచిపోయే పరిస్థితి తలెత్తదు.  బాల్యం యొక్క అమాయకత్వం వలన తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన వారు చదువు పట్ల ఆసక్తి కనబరచకపోవచ్చును. పై విషయాలన్నింటినీ చదివాక ఏమి అర్థం అవుతుందంటే... శారీరకంగా, పుట్టుకతో ప్రతీ విద్యార్థికి ఒకే రకమైన మేథస్సు, సామర్ధ్యం ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలియచేసారు. పైన పేర్కొన్న అంశాలు చదివితే అందరికీ అదే అనిపిస్తుంది. ఈ మెదడు దాని సామర్ధ్యం అందరికీ ఒకేలా ఉన్నప్పుడు మరి అందరి యొక్క పనితీరు, ఫలితాలు మరియు పెరఫార్మెన్స్ ఒకేలా ఎందుకు ఉండటం లేదు. ఈ విషయం గురించి ప్రశ్న వేసుకుంటే… చాలామంది తెల్ల ముఖాలు వేస్తారు.  దీనికి సరైన విధంగా అర్థమయ్యేట్టుగా కంప్యూటర్ పరిభాషలో చెప్పుకుంటే హార్డ్వేర్ అందరికీ ఒకేలా ఉంది కాని సాఫ్ట్వేర్ సరిగా తయారుచేయాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులది మరియు ఇటు ఉపాధ్యాయులదే. అన్నింటికన్నా ఒక విషయం బాగా గుర్తుండాలంటే ఆ విషయం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని ఆ విద్యార్థి గ్రహించాలి. అందుకే శ్రద్ధ అంటే తెలుసుకోవాలనే ఉత్సుకత, తెలుసుకోడానికి సంసిద్ధత మరియు నేర్పుతున్నవారిపట్ల గౌరవభావం. అందువలనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది మరియు ఆసక్తి కరంగా బోధించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే.. మరి వారి సహజ సామర్థ్యాలు మరుగునపడకుండా వారికి వారు సంపూర్ణంగా ఉపయోగపడే విధంగా తయారుచేయవలసిన గురుతర బాధ్యత అటు తల్లిదండ్రుల చేతిలో ఇటు ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందనడం నిర్వివాదాంశం కదా!! ఇదే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. వాటిని పాటించాలి.                                   ◆నిశ్శబ్ద.

మీ బడ్జెట్ మీ చేతుల్లో ఉందా?

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మొదటి తేదీ వచ్చిందంటే దేశం మొత్తం అసక్తిగానూ అంతకు మించి ఆందోళన, అసంతృప్తులతోనూ మూల్గుతుంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టడమే.. ఈ బడ్జెట్ పుణ్యమా అని కొన్ని వస్తువుల ధరలు తగ్గితే.. మరికొన్ని వస్తువుల ధరలు రయ్యిమని పైకి ఎగిసిపడతాయి. ఇదంతా దేశానికి, ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినది అయితే ఈ సమాజంలో ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు ప్రతి నెలా బడ్జెట్ బేజార్… బాబోయ్.. అనిపించేలా ఉంటుంది. కారణం ఏమిటంటే మార్కెట్ లో పద్దులు మారిపోవడం. అనుకోకుండా పెరిగే ధరలు సగటు మధ్యతరగతి జీవికి కొరివితో వా తలు పెట్టిన చందంగా ఉంటుంది. అయితే కాస్త అవగాహన ఉండాలి ఎలాంటి పరిస్థితిలో అయినా మీకున్న సంపాదనతోనే మంచి ప్రణాళిక వేసుకుని హాయిగా కాలం వెళ్లదీయచ్చు. ఇంతకూ ఎలాంటి పద్దులు వేస్తే లెక్కల చిట్టా సద్దుమనుగుతుందంటే… అవసరానికి అలవాటుకు తేడా తెలుసుకోవాలి!! చాలా మందికి కొన్ని ఖర్చులు ఓ అలవాటుగా మారిపోయి ఉంటాయి. సాయంత్రం అలా బయటకు వెళ్లి టీ తాగడం, ఆదివారం అవ్వగానే స్నేహితులతో మందు కొట్టడం, వీధి అమ్మలక్కలు అందరూ కలసి కిట్టీ పార్టీ చేసుకోడం. మొహమాటం కొద్దీ లేని బరువులు నెత్తిన వేసుకోవడం వంటివి చేస్తుంటారు. అవన్నీ అవసరాలు కాదు కేవలం అలవాట్లు అనే విషయం గుర్తించాలి. ఇది లేకపోతే పని జరగదు, ఇది చేయకపోతే సమస్య పరిష్కారం కాదు అనేలా ఉండేవి అవసరాలు. అలాంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని సమయాన్ని, డబ్బును వృధా చేసే అలవాట్లను మానుకోవాలి. తృప్తితోనే సంతోషం!! తృప్తి పడటం నేర్చుకుంటే ఏమి లేకపోయినా సంతోషంగా ఉండవచ్చు. చాలామంది ఏదో లేదు అనుకుంటూ ఉన్న దాన్ని పట్టించుకోకుండా ఉన్న సుఖాన్ని అనుభవించి అనుభూతి చెందకుండా ఉంటారు. అలాంటి వాళ్లకు తృప్తి విలువ తెలియాలి. ఒక మనిషి వేల రూపాయలు పెట్టి బయట ఎంత ఎంజాయ్ చేసినా ఇంట్లో వారితో 100 రూపాయలతో సరదాగా గడిపే వ్యక్తి తృప్తి ముందు దిగదుడుపే.. కాబట్టి తృప్తి అనేది పెట్టె ఖర్చులో కాదు కలసి పంచుకోవడంలో ఉంటుంది. పొదుపే.. రేపటి బంగారు భవిత!! పొదుపు చేయడం కూడా ఒక విద్య అని చెప్పవచ్చు. ఈ విషయంలో చాలామంది ఆడవాళ్ళను ఉదాహరిస్తారు. కానీ పొదుపుకు జెండర్ తో సంబంధం లేదు. చక్కగా ప్రణాళికలు వేసి డబ్బు ఆదా చేసే మగవారు ఉన్నారు, పోపుల డబ్బా నుండి పాలసీలు వరకు ఎన్నో రూపాల్లో పొదుపు మార్గంలోకి పైసాలను మళ్లించే ఆడవారు ఉన్నారు. కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. పైన చెప్పుకున్నట్టు అవసరమైనవి ఏవి అలవాట్లు ఏవి అనేది గుర్తిస్తే ఎంత డబ్బు ఆదా చేయవచ్చు. ఆ తరువాత దుబారా ఖర్చులు వదిలి తృప్తిగా బ్రతకడం తెలుసుకుంటే డబ్బు పోగేయడం ఇంత ఈసీ నా అని కూడా అనిపిస్తుంది.  కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే.. మీ నెలసరి సంపాదన ఎంతైనా కావచ్చు. దానికి తగినట్టు మీ ఖర్చులు, పొదుపు, మదుపు ఉండేలా మీరే చక్కగా ప్రణాళికలు వేసుకోవచ్చు. అలా చేస్తే మీ బడ్జెట్ భలేగా హిట్టయ్యి టెన్షన్ లేని జీవితాన్ని మీకు అందిస్తుంది. మరి నిర్మలా సీతారామన్ కంటే మేటిగా, దేశ బడ్జెట్ కు ధీటుగా మీరూ వేయండి మీ ఇంటి కోసం బడ్జెట్ ప్లాన్..                                     ◆నిశ్శబ్ద.  

డబ్బే ప్రామాణికం అంటున్నారా?

డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. అదే నిత్యసత్యం కూడా. మనిషి ఆలోచనలు ఎప్పుడూ డబ్బు వెంట తిరుగుతూ ఉంటాయి. ఈకాలంలో పెద్దల తీరు ఎలా ఉంటోంది అంటే పిల్లలకు ఇంకా మాటలు కూడా రాకముందే డబ్బు గురించి ఎన్నో విషయాలు ప్రవర్తనల ద్వారా నేర్పిస్తున్నారు. పిల్లలు కూడా డబ్బును బట్టి స్పందిస్తారు. నిజానికి ఎంతటి సంపదనైనా మనిషి పరిమితంగానే అనుభవించగలడు. ఆ విషయం తెలియకుండా మనం ప్రతి నిమిషాన్నీ పైకంతోనే ముడేస్తున్నాం. ముఖ్యంగా మారుతున్న సమాజంలో వ్యక్తి విలువను బేరీజు వేసేందుకు అతని సిరిసంపదలనే ప్రామాణికంగా తీసుకోవడం అలవాటుగా మారింది అందరికీ. అందుకే ప్రతి ఒక్కరూ ఆస్తిపాస్తుల పెంపకంలో పోటీ పడుతున్నారు.ఇది సహజమే అన్నట్టుగా ఉంటారు అందరూ… కానీ ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి! ప్రాణం లేని నోట్ల కట్టలు, నిలువెత్తు సజీవమూర్తి అయిన మనిషి విలువను వెలకడుతున్నాయంటే ఎంత ఆశ్చర్యకరమో అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి! ఈ ప్రపంచంలో మనిషిని ఎప్పుడైనా ఎక్కడైనా పరిగాణలోకి తీసుకుని గౌరవించాలి అంటే ముఖ్యంగా చూడాల్సింది ఆ వ్యక్తిలో ప్రవర్తన, నైతిక విలువలు, మంచితనం, హుందాతనం ఇతరులకు మేలు చేసే గుణం మొదలైనవి.  కానీ ప్రస్తుతం అందరూ వాటన్నిటినీ పక్కనపెట్టి కేవలం మనిషి దగ్గర డబ్బు ఉంటే చాలు అతడే గొప్ప వ్యక్తి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. డబ్బుతో మనిషి తెచ్చిపెట్టుకున్న స్థాయిని విలువగా భావించి అతనే గొప్పవాడనే కితాబు ఇస్తున్నారు. ఇదంతా కూడా ఆ మనిషి దగ్గర డబ్బు ఉన్నంత వరకే.. అనే విషయం వారికి తెలియకపోయినా వారిని గౌరవిస్తున్నవారికి మాత్రం కచ్చితంగా తెలుసు. అంటే డబ్బున్నవాడు గొప్ప, అదే వ్యక్తి దగ్గర డబ్బు లేకపోతే అతని గొప్పతనం కనుమరుగైపోతుంది.  డబ్బెంత అశాశ్వతమో, ఆ డబ్బు ద్వారా వచ్చే పేరు, పొగడ్తలు, ఇతర పలుకుబడి కూడా  అంతే అశాశ్వతం. పైగా ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. అనుకోకుండా వచ్చిపడే డబ్బును నడమంత్రపు సిరి అని అంటారు. ఈ  నడమంత్రపు సిరి మనషులను నేలపై నిలబడనివ్వని అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. కన్నూ మిన్నూ కనబడకుండా ప్రవర్తించేలా చేస్తుంది. అలాంటి డబ్బు మనుషులకు  భవిష్యత్తులో దారిద్ర్యమే గుణపాఠం నేర్పుతుంది.  ఆదిశంకరాచార్యులు డబ్బు గురించి చెబుతూ పంచితేనే పరమసంతోషం అని అంటారు.. అంటే డబ్బును పంచేయమని ఈయన ఉద్దేశ్యం కాదు. గృహస్థుగా ధనార్జనను విస్మరించమని కూడా శంకరాచార్యులు చెప్పలేదు. కానీ ఆ వైభోగాల పట్ల వ్యామోహాన్ని వదులుకోమని అంటున్నారు.  యవ్వనం దాటగానే మనిషికి డబ్బు వేట మొదలవుతుంది. మధ్యవయసు దాటి వార్ధక్యం లోకి అడుగుపెడుతున్న క్షణం నుంచి ఆ సంపదలపై వ్యామోహాన్ని తగ్గించుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. ఆ వయసులో వీలున్ కలిగినప్పుడల్లా మనస్ఫూర్తిగా నలుగురికీ దానధర్మాలు చేయాలి. మనిషిని అతలాకుతలం చేసే ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి.  భగవాన్ శ్రీరామకృష్ణులు “ధనవంతుడు దానం చేయాలి. పిసినారుల డబ్బు హరించుకుపోతుంది. దానం చేసేవాడి ధనం సంరక్షింపబడుతుంది. సత్కార్యాలకు వినియోగింపబడుతుంది. దానధర్మాలు చేసేవాడు ఎంతో ఫలాన్ని ప్రాప్తించుకుంటాడు. నాలుగు పురుషార్థాలనూ సాధించుకుంటాడు" అని అంటారు. వీటిని బట్టి చూస్తే డబ్బు అనేది మనిషికి ఎంత అవసరమో.. మనిషి తనదగ్గర అదనంగా ఉన్న డబ్బుకు దూరంగా ఉండటం అనేది కూడా అంతే అవసరం.                                ◆నిశ్శబ్ద.

ఇలాంటి విద్య ప్రతి ఒక్కరికీ అవసరం!

విద్యార్థులు ఆటలు, పాటలు, విహారయాత్రలకు స్వస్తి చెప్పి చదువుల తల్లి చెంతకు చేరే సమయం ఆసన్నమైంది. పాఠశాల చదువులు ముగించి కళాశాలకు పోయే విద్యార్థులు కొందరైతే, కళాశాల చదువులు పూర్తిచేసి విశ్వవిద్యాలయాలకు వెళ్ళేవారు మరికొందరు. అలాగే విశ్వవిద్యాలయాలకు వీడ్కోలు చెప్పి విదేశాలకెగసే విద్యార్థులు మరెందరో! గదులు మారి తరగతులు పెరిగినా,  గతులు వేరై ఘనకార్యాలు  సాధించినా… మేధావులు సృష్టించిన నేటి మన విద్యావిధానం మహాత్ముల్ని సృజించడంలో  విఫలమవుతుంది. వైజ్ఞానికంగా ఎంత ఎదిగినా వివేకపథంలో వెనుకంజ వేస్తుంది. నేటి సమాజంలో సత్యధర్మాలు, సేవా త్యాగాల్లాంటి... విలువలు మానవతా గగనకుసుమా లయ్యాయి. సంఖ్యలకే ప్రాధాన్యతనిచ్చే విద్యతోపాటు నడవడికలో నాణ్యతను పెంచే విద్య చాలా అవసరం. అక్షరజ్ఞానంతో పాటు విజ్ఞానం తోడైనప్పుడే మానవతా విలువలు భాసిల్లుతాయి. చదువుతో పాటు సంస్కారాన్ని పెంచే విద్యే నిజమైన విద్య. బుద్ధిని వృద్ధిచేసే విద్యే నేటి సమాజంలోని అన్ని రుగ్మతలకు సరైన ఔషధం. విద్యకు భూషణం వినయం... విద్యార్థి గురువు వద్ద ఎలా అణకువతో ప్రవర్తించాలో శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో బోధించాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా । ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః ॥  శిష్యుడు గురువు సన్నిధిలో ఉంటూ భక్తిశ్రద్ధలతో గురువుకు సపర్యలు చేస్తూ తన సందేహ నివృత్తి చేసుకోవాలి. శిష్యుని వినయ విధేయతలకు గురువు ప్రీతి చెంది శిష్యునికి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. పెద్దలయందు, గురువులయందు గౌరవమర్యాదలు లేనివాడు ఎన్నటికీ జీవితంలో ఉన్నతి పొందలేడు. అహంకారి అయిన దుర్యోధనునితో 'నువ్వు గురువులకు, పెద్దలకు వినయంతో సేవ చేయడం నేర్చుకో దాని వల్ల నీలో సత్ప్రవర్తన వృద్ధి చెందుతుంది' అని శ్రీకృష్ణుడు అంటాడు. విద్యార్థి గ్రంథాల ద్వారా నేర్చుకొనే దాని కన్నా గురువు సాంగత్యంలో నేర్చుకొనే విద్య ఎక్కువ ప్రయోజనాన్నిస్తుంది. ఆచరించేవాడే ఆచార్యుడు...  ఆచార్య అంటే సంగ్రహించే వాడు. శాస్త్ర సారాన్ని సంగ్రహించి, విద్యార్థులకు బోధించేవాడు ఆచార్యుడు అని అర్థం. తాను సంగ్రహించిన వేదసారాన్ని శిష్యులకు ఆచరణలో చూపించిన వాడే ‘ఆచార్యుడు' అని మరో అర్థం. ఆచరణాత్మక బోధ నలతో ఆదర్శజీవితాన్ని గడిపి, శిష్యుల్లో మానవతా విలువల్ని పెంపొందించే వాడే నిజమైన ఆచార్యుడు. విలువల్ని పెంచే విద్య...  నేడు మనకు కావలసిన విద్య ఎలా ఉండాలో స్వామి వివేకానంద మాటల్లో…  We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded... శీలనిర్మాణం, మనోబలం, విశాలబుద్ధి ఈ మూడు సుగుణాల్ని పెంపొందించే విద్య నేడు మనకు అవసరం. స్వామి వివేకానంద నిర్వచించిన విద్యలో ఉన్న మూడు లక్షణాలను విద్యార్థి అలవరచుకోవాలంటే తైత్తిరీయో పనిషత్తులో గురువు శిష్యులకిచ్చిన సూచనల్ని ఆచరణాత్మకం చెయ్యాలి.                                          ◆నిశ్శబ్ద.

మీ మనసును మర్చివేసే కథ

కొన్ని కథలు మనుషుల జీవితాలను, ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి. ప్రాంతాలు ఏవైనా సరే మనుషుల ప్రవర్తనలో అసూయ, ద్వేషం, కోపం వీటితోపాటు.. ప్రేమ, ఆప్యాయత కూడా ఉంటాయి. మనం ఏ కోణాన్ని చూస్తామో అదే మనలో నుండి వ్యక్తమవుతుంది కూడా..  మనిషి మనసుకు సంబంధించి ఓ కథ ఉంది.. ఇది ఒక చైనా దేశం కథ. వివాహానంతరం ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. మొదటి ఆరు నెలలు అత్తాకోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. గోరంతలు కొండంతలై చివరకు కోడలు పుట్టింటికి పరుగెడుతుంది. అక్కడ ఆమె తండ్రిగారి స్నేహితుడైన ఒక డాక్టర్తో తన బాధల్ని వెళ్ళబోసుకుంటూ 'ఎలాగైనా మా అత్త మరణిస్తే గాని నాకు సుఖశాంతులుండవు అని చెప్పింది. ఒకప్పుడు తన దగ్గర కూర్చొని ముద్దుమాటలతో చిలిపి చేష్టలతో ఆనందింపజేసిన ఆ చిన్నారిలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ రాక్షసత్వాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ డాక్టర్. తర్వాత ఇలా అన్నాడు. ' అమ్మా! నీ మీద ప్రేమతో ఈ పనిచేస్తున్నాను. ఒక మందు నీకిస్తాను. దానిని మీ అత్తగారికివ్వాలి. అది తీసుకున్న సంవత్సరం తరువాత ఆమె మరణిస్తుంది. వెంటనే చనిపోతే, అందరికీ అనుమానం రావొచ్చు. అప్పుడు మన పన్నాగం బయట పడుతుంది.  అందుకే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా చంపే మందు ఇస్తున్నాను. ఒక సంవత్సరం నీవు ఓపిక పట్టాలి. అత్త ఎలాగూ చనిపోతుంది. కాబట్టి నీవు ఆమెను ఈ సంవత్సర కాలం పాటు ప్రేమగా చూసుకుంటూ సేవ చేస్తానని నాకు హామీ ఇవ్వు. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు” అన్నాడు.  అమ్మాయి సరేనని అంగీకరించింది. మందు తీసుకుని అత్తగారింటికి వెళ్లింది.  అత్తకు తినిపించి ప్రేమతో సపర్యలు చేయడం ప్రారంభించింది. అత్తకు అమితానందం. తన కోడలు చేసే సేవకు స్పందించింది. ఆమె చూపిన ప్రేమకు దాసోహం అయ్యింది. తనకు ఓపికలేక పోయినప్పటికీ కోడలికి చిన్నచిన్న పనుల్లో సహాయం చేయడం మొదలు పెట్టింది. కోడలిని తన సొంత కూతురిలా భావించింది. అప్పుడు కుటుంబంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ఆరు నెలలు గడిచాయి. కోడలు పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఆ డాక్టర్ని కలిసింది. ఆమె ముఖంలో విషాదం. గద్గద స్వరంతో ఇలా అంది. 'డాక్టర్! నేను ఓ పెద్ద తప్పు చేశాను. దేవతలాంటి మా అత్తను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాను. నా చేతులతో ఆమెకు విషం తినిపించాను. ఆరు నెలల్లో నన్ను ప్రేమించే నాదేవత నాకుండదు. ఆమెను ఎలాగైనా నేను రక్షించుకోవాలి'. ఈ మాటలు విన్న డాక్టర్ నవ్వి 'అమ్మా నేనిచ్చిన మందు, విషం కాదు. మీ అత్తగారికి ఏ అపాయంలేదు. అప్పుడు నీ మనసులో ఉన్నది విషం. ఇప్పుడది లేదు. మీ అత్తాకోడళ్ళ మధ్య ఈ ఆరు నెలల్లో నెలకొన్న ప్రేమానురాగాల ప్రవాహంలో ఆ ''విషం' కొట్టుకు పోయింది. మనసులో ఏ కల్మషం లేకుండా జీవించు' అన్నాడు. ఇది మనసు కథ, ప్రతి మనిషి కథ.                                       ◆నిశ్శబ్ద.

సెక్స్ గురించి మీకు తెలిసిందేంటి.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసింది ఇదే!

భారతదేశంలో సెక్స్ అనే పదం ఎక్కడైనా పబ్లిక్ గా వినిపిస్తే చాలా పెద్ద చర్చలు, మరెంతో పెద్ద వార్తలుగా మారతాయి. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ఈ శారీరక సంబంధం గురించి అందరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పబ్లిగ్గా చర్చలు పెట్టడం వల్ల మార్పులు సాధ్యమవుతాయంటే ఇప్పటికి భారతదేశంలో ఎన్నో విషయాలు మార్పు చెంది ఉండాలి. వీటిలో లింగ సమానత్వం, అక్షరాస్యత, కనీస మానవహక్కులు మొదలైనవి తప్పనిసరిగా ఉండాల్సినవే. కాబట్టి మార్పు అనేది ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడటం వల్లే రాదు.. చరిత్ర ఏమి చెప్పింది?? వాస్తవంలో ఏమి జరుగుతోంది?? వీటిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే కాలానికి తగ్గట్టుగా జరగాల్సిన మార్పులు ఏమిటి అనేది తెలుస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 9 వ తేదీని జాతీయ సెక్స్ డే లేదా లైంగిక సంబంధాల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి మనిషికి జీవితంలో తిండి, నిద్ర, నీరు వంటి కనీస అవసరాలు ఎలాగో అలాగే.. సెక్స్ కూడా ఒక కనీస అవసరం. వయసు వల్ల ఏర్పడే శారీరక స్పందనల నుండి శరీరాన్ని సహజస్థితిలోకి తీసుకురావడానికి సెక్స్ ఉపయోగపడుతుంది.  నిజానికి సెక్స్ అనే పదం విదేశీయులది అయినా దీన్ని కూడా కళాత్మకంగా చూపెట్టిన ఘనత భారతీయులకే దక్కింది. శృంగారం, సంభోగం పేర్లతో ఈ శారీరక అవసరం ఎన్నో వేల ఏళ్ల నుండి వ్యక్తుల మధ్య ఒక జీవనదిలా సాగుతోంది. పండితులు తృతీయ పురుషార్థంగా కామంను వర్ణించారు. ముఖ్యంగా వాత్సాయనుడు రచించిన కామసూత్రం, కొక్కోకుడు రచించిన కొక్కోక శాస్త్రం  మొదలైనవి వేల ఏళ్ల క్రితం నుండే ఉన్నాయి. కామసూత్రలో 64 విధాలుగా శృంగారాన్ని ఆ కాలానికే వర్ణించారంటే ఈ విషయం గురించి దేశ దేశాలు భారతదేశం నుండే ఎన్నో నేర్చుకున్నాయని చెప్పవచ్చు.  ఇవి అప్పట్లో రాజకుటుంబీకులు, పండితులకు మాత్రమే లభ్యమైనా క్రమంగా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి.  ఇకపోతే సెక్స్ అనేది ఆరోగ్యకరమైన సంబంధంగా కొనసాగితే అది ఎంతో గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ఒత్తిడి, శరీరం ఫిట్ గా ఉండటం దీని ద్వారా సాధ్యమవుతుంది. కేవలం పునరుత్పత్తికి ఇదొక మార్గమనే కోణంలో దీన్ని ఎప్పుడూ భావించకూడదు. ఇవి అర్థం చేసుకుంటే సెక్స్ అనేది ఎప్పుడూ బూతుగా కనిపించదు, అనిపించదు.                                      ◆నిశ్శబ్ద  

ఓటమి ఓ గుణపాఠమే!

ప్రతి మనిషి తన జీవితంలో చేసే ప్రయత్నాలు అన్నీ మొదలుపెట్టే పనిలో గెలవాలనే చేస్తారు. ఆ ప్రయత్నాలలో ఎప్పుడూ విజయాలే కాదు ఓటమిలు కూడా ఎదురవుతాయి. మనం విజయాన్ని సాధించాలంటే కొన్నిసార్లు ఓటమిని తప్పనిసరిగా అంగీకరించాలి. ఓటమి విజయానికి తొలిమెట్టు అనే మాటను ఎప్పుడూ మరచిపోకూడదు.  ఓటమి అనేది మనం విజయాన్ని ఎలా సాధించాలో తెలియజేస్తుంది. అంటే ఓటమితో దాగున్న గొప్ప గుణం అనుభవం. అనుభవం ఎదురైనప్పుడు మనం చేస్తున్న తప్పేమిటో చాలా తొందరగా అర్థమైపోతుంది. చాలామంది వారు చేసే పనులలో ఓటమి ఎదురయినప్పుడు ఓటమికి భయపడి ఆ పనిని చివరివరకు పూర్తిచేయకుండా వారు అనుకున్నది సాధించలేక వారి ఆశలను నిరాశలను చేసుకుంటున్నారు. చివరివరకు పనిని పూర్తిచేయడం అంటే ఓటమి ఎదురవ్వగానే ఇక ప్రయత్నం ఆపేయడం. అది మంచి పద్ధతి కాదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి. విఫలం అయిన ప్రతిసారి చేసిన తప్పేంటో అర్థం చేసుకుని అది తిరిగి పునరావృతం కాకుండా ముందడుగు వేయాలి. ఓటమి ఎదురయితే కృంగిపోకూడదు. అలాచేస్తే అది మనల్ని డిప్రెషన్లోకి తీసుకువెళుతుంది. ఆ డిప్రెషన్ వల్ల మనుషులకు కొన్నిరకాల చెడు వ్యసనాలు అలవాటు అవుతాయి. మనుషులు డిప్రెషన్ కి లోనైనప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు నచ్చిన వ్యక్తులను కలవడానికి, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే నిరాశానిస్పృహల నుండి తొందరగా బయటపడవచ్చు.  అసలు ఓటమి అంటే ఓడిపోవడమా?? కానే కాదు!! ఓటమి అంటే ఎప్పటికీ ఓడిపోవడం కాదు. గెలుపు ఇంకా అందుకోలేదని అర్ధం, గెలుపుకు తగిన సన్నద్ధత ఇంకా రాలేదని అర్థం. ఓటమి అంటే భయంతో అసలు పనిచేయకపోవడం కాదు. ఆ పని మరొక విధంగా చేస్తే బావుంటుందేమోనని ప్రయత్నించటం. కొన్నిసార్లు చేసే పనుల వల్ల  కూడా వైఫల్యాలు ఎదురవుతాయి.   పరాజయం అనేది ఉందా?? చాలామంది పరాజయాన్ని నిర్వచిస్తారు. గెలవలేకపోతే ఇక పరాజయం పాలైనట్టు చెబుతారు. కానీ అన్నీ మనం చేసే పనులకు వచ్చే ఫలితాలు మాత్రమే. మనం నిర్వహించే పని సరైనది అయినప్పుడు వచ్చే ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మనం అనుకున్న ఫలితాలు సరిగారానప్పుడు చేసేపనిలో, పద్దతిలో మార్పు తీసుకురావడం ద్వారా కోరుకున్న ఫలితాలు వచ్చేంతవరకూ మార్పులు తీసుకువస్తూ ఉండాలి. అందువల్ల ఫలితాలే తప్ప పరాజయాలు లేవు. వచ్చే ఫలితాలు ఆశించినవి కాకపోవచ్చు కానీ అసలు పలితం అంటూ లేకుండా లేదు కదా!! సముద్రంలో ప్రయాణం చేసే ఓడ తుఫానుని ఎదుర్కొనవలసి వస్తుందని భయపడి హర్భర్ లోనే ఉంచితే అది తుప్పుపడుతుంది. అప్పుడు ఓడను నిర్మించిన లక్ష్యం నెరవేరదు. ఓడను హార్బర్ లో పెట్టడానికి ఎవరూ తయారుచేయరు కదా!! దాన్ని తయారుచేయించుకున్న వ్యక్తి సముద్రంలో తిప్పుతూ డబ్బు సంపాదించాలని మాత్రమే కాదు, అది సముద్రంలో సమస్యకు లోనయ్యి నష్టం వచ్చినా భరించడానికి సిద్ధంగానే ఉంటాడు. అలాగే గెలవడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేసేవాడు గెలుపుమీద ఆశతో ఉండాలి అలాగే ఓటమి ఎదురైతే దాన్ని స్వీకరించే మనసు కూడా ఉండాలి.   ఓడిపోయేవారు భద్రత కోసం ఆలోచిస్తారు. గెలవాలనుకొనేవారు అవకాశాలకోసం ఎదురు చూస్తారు. ఓటమి పొందటం నేరం కాదు. ఓటమికి అసలు కారణాలు తెలుసుకోలేకపోవటం అతిపెద్ద నేరం. ఓటమికి గల అసలు కారణాలు తెలుసుకోగలిగితే మనం సగం విజయాన్ని సాధించినట్లే. ఓటమి, విజయం ఈ రెండూ కూడా మన వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటాయి. వ్యక్తిత్వపరంగా వ్యక్తిలోని లోపాలే వారికి విజయాన్ని దక్కకుండా చేస్తాయి. మన ఆలోచనలు, అలవాట్లు, చర్యలు, మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి. మన లోపాలను సరిదిద్దుకుని మంచి నడవడికను మనదిగా చేసుకుంటే స్థిరమైన వ్యక్తిత్వం సొంతమవుతుంది. ఓటమి భయంతో నిర్ణయాలు తీసుకోకపోవటం తప్పు, ఓటమి రావటం తప్పుకాదు. కానీ ఆ ఓటమిని తలచుకుంటూ, కుమిలిపోతూ జీవిస్తూ, ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకపోవటం మరింత తప్పు.                                         ◆నిశ్శబ్ద.