దేవుడున్నాడని చిన్నతనంలోనే తర్కంతో వాదించిన శాస్త్రవేత్త!

ఒక ప్రొఫెసర్ తన విద్యార్థులతో, "భగవంతుడు అన్నింటినీ సృష్టించాడా? అని అడిగారు. "అవును ఆయనే సృష్టించాడు” అని ఒక విద్యార్థి సమాధానమిచ్చాడు. "భగవంతుడు అన్నింటినీ సృష్టించాడు. అలాగే చెడును కూడా సృష్టించాడు. కాబట్టి భగవంతుడు చెడ్డవాడు" అని అన్నాడు ప్రొఫెసర్ తీర్మానిస్తూ. “భగవంతునిపై నమ్మకం" అనేది భ్రమ అని వాదించాడు. "సార్! నేనో ప్రశ్న అడగవచ్చా?”. అంటూ ఓ విద్యార్థి లేచాడు. అడగమన్నాడు ప్రొఫెసర్. "సార్! చల్లదనం ఉందాండీ" అని అడిగాడు. విద్యార్థి. “అదేం ప్రశ్న! చల్లదనం ఉంటుంది కదా! నీకెప్పుడూ అది అనుభవంలోకి రాలేదా?" అన్నాడు ప్రొఫెసర్. అప్పుడు ఆ విద్యార్థి "భౌతికశాస్త్రం ప్రకారం చల్లదనం అనేది ప్రత్యేకంగా లేదు కదా సార్. ఉష్ణోగ్రత లేకపోవడాన్నే చల్లదనమని అనుకుంటున్నాం. వస్తువులో ఉష్ణోగ్రత  లేదు గనుక, వేడిగా లేదని చెప్పడానికే మనం అనే చల్లదనం అనే పదాన్ని ఉపయోగిస్తాం” అన్నాడు. అవును నువ్వు చెప్పింది నిజమే అన్నాడు ప్రొఫెసర్. అయితే మరొక ప్రశ్న సార్.. “చీకటి ఉందా?” అని మళ్ళీ ప్రశ్న వేశాడు విద్యార్థి.   "అవును, ఉంది కదా” అన్నాడు ప్రొఫెసర్. "మళ్లీ మీరు పొరబడ్డారు!" అంటూ ఆ విద్యార్థి ఇలా చెప్పాడు.  “సార్, చీకటి అనేదే లేదు. వెలుతురు లేకపోవడాన్నే మనం చీకటి అంటున్నాం. వెలుతురును అధ్యయనం చేయగలం గానీ, చీకటిని అధ్యయనం చేయలేము. అని అన్నాడు. ఆ మాట విని ప్రొఫెసర్ చాలా నిశ్శబ్దం అయిపోయాడు.  సార్ ఇంకొక ప్రశ్న.. చివరి ప్రశ్న ఇదే..  "మరి చెడు ఉందాండీ?" అని చివరి ప్రశ్న సంధించాడా విద్యార్థి.  "అవును ఉంది. నేను మొదటే చెప్పానుగా, ఈ లోకంలో ఘోరాలు, హత్యలు. అన్నీ చెడే కదా" అన్నాడు ఆవేశంగా ప్రొఫెసర్. దానికి ఆ విద్యార్థి "సార్.. మనిషి హృదయంలో చెడు అనేదే లేదు, మంచి లేకపోవడమే చెడు అంటున్నాం.  అంటే భగవంతుడు లేకపోవడాన్నే పాపం అనే పదంతో నిర్వచిస్తున్నాం"  అని జవాబిచ్చాడు. ఆ తర్కానికి కంగుతిన్నాడు ప్రొఫెసర్. తాను ఓడి పోయానని అంగీకరిస్తూ ఏమీ వాదించలేక తల దించుకున్నాడు. అంతటి ప్రొఫెసర్ని కూడా తర్కంతో భగవంతుడు ఉన్నాడని ఒప్పించిన ఆ విద్యార్థి ఎవరో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్.                                  ◆నిశ్శబ్ద.

జీవితానికి పట్టుదల ఎందుకు అవసరమో తెలిపే విషయాలు...

మనిషికి జీవితంలో పట్టుదల అనేది ఎంతో ముఖ్యం. ఈ పట్టుదల అనేది కేవలం మనిషికే కాదు సకల పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది. దానికి ఒక మంచి ఉదాహరణ… టిట్టభ అనే పక్షి కథ..  టిట్టభ అనే పక్షి జంట ఒకటి సముద్రతీరంలో గూడు కట్టుకుని ఉండేది. ఆడపక్షి గుడ్లు పెట్టినప్పుడల్లా, సముద్రరాజు అలలతో వాటిని ముంచెత్తి, మింగేసేవాడు. సముద్రుని దురాగతాన్ని గమనించిన మగపక్షి, 'సముద్రాన్నే ఎండగట్టి, నా గుడ్లను స్వాధీనపరచుకొంటాను' అంది. ఆ పిట్ట తన ముక్కుతో, రెక్కలతో నిరంతరాయంగా సముద్ర జలాలను భూమిపైకి వేయసాగింది. ఇతర పక్షులు, ఆ మగ టిట్టిభ పక్షి విషయం తెలుసుకొని, తాము కూడా ఈ మహత్తర కృషిలో పాలుపంచుకున్నాయి. పక్షిజాతులన్నీ సమైక్యంగా చేస్తున్న పనిని గమనించి, గద్దలు, రాబందులు మొదలైన పక్షిజాతులన్నీ క్రమంగా ఆ పనికి పూనుకున్నాయి. ఈ సంగతి విన్న పక్షిరాజు గరుత్మంతుడు కూడా వైకుంఠం వదలి వచ్చి, పక్షి సమూహాలతో చేయి కలిపాడు. వాహనం లేక కష్టపడుతున్న విష్ణువు స్వయంగా సముద్ర తీరం చేరాడు. గరుత్మంతుడు పక్షిజాతుల దైన్యాన్ని తన స్వామికి నివేదించాడు. కరుణామయుడైన శ్రీమహావిష్ణువు సముద్రరాజుకు నచ్చజెప్పి, ఆ తీతువు పక్షి జంటకు గుడ్లను తిరిగి అప్పగించేటట్లు చేశాడు. 'హితోపదేశం'లోని ఈ కథ పట్టుదల ఫలితాన్ని చెబుతుంది. శ్రమశీలికి అపజయం ఉండదు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇది ఒక పక్షి కథనం మాత్రమే.. మన చరిత్రలో దీనికి మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా విశేష ఖ్యాతిని ఆర్జించిన అబ్రహామ్ లింకన్ 1816 నుంచి 1860 వరకు అనుభవించిన కష్టనష్టాలు, జయాప జయాలు అంతులేనివి. ఆయన ఎనిమిదిసార్లు దేశాధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు. మూడుమార్లు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. రెండుసార్లు  వ్యాపారంలో దివాలా తీశాడు. ఆరు నెలల పాటు తీవ్ర మనస్తాపంతో కుమిలిపోయాడు. పదిహేడేళ్ళ పాటు ఋణగ్రస్తుడిగా గడిపాడు. చివరకు  1860 ఎన్నికలలో గెలిచి, అమెరికా అధ్యక్షుడయ్యాడు. బానిస వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడి చరిత్రకెక్కాడు. ఆయన అంత సాధించడానికి ప్రధాన కారణం పట్టుదల, అచంచల దీక్ష. దృఢ సంకల్పం ఉంటే తప్పకుండా సంకల్ప సిద్ధి కలుగుతుంది. నెపోలియన్ చక్రవర్తి ఆకారంలో చాలా పొట్టి. అలాంటి వాడు ప్రపంచాన్నే జయించాడు. అందుకు కారణం - ఉక్కు లాంటి చెక్కు చెదరని అతని మనసే!  గొప్ప వక్తగా పేరు తెచ్చుకున్న డెమస్తనీస్ కు నిజానికి మహా నత్తి. ఆయన నాలుక కింద గులకరాళ్ళు ఉంచుకొని, సాగర తీరంలో కేకలు వేసి, తనకున్న నత్తిని పోగొట్టుకొన్నాడు. మహావక్తగా నివాళులందుకొన్నాడు. సహనం, పట్టుదల వల్లనే ఆయన ఆ స్థాయికి ఎదగగలిగాడు.  ప్రజల ఎగతాళినీ, నిందలనూ లెక్కచేయకుండా బీదవాడైన బెంజిమిన్ డిజ్రేలీ ఇంగ్లండు ప్రధాని కావడానికి కారణం అతని పట్టుదలే. రోమన్  సామ్రాజ్య ఉత్థాన పతనాలు రాయడానికి గిబ్బన్ 20 ఏళ్ళు కష్టపడ్డాడు. వంద కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణమైనా సరే ఒక్క అడుగు వేయడంతోనే ప్రారంభమవుతుంది. 'ఉద్యమేన హి సిద్ధ్యంతి' అనడంలోని పరమార్థం అదే. అసాధ్యం సాధ్యం కాగలదు. కాబట్టి మనిషి తనలో ఉన్న పట్టుదలను పెంపొందించుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎవరికో సాధ్యం కాలేదు మనకేం సాధ్యమవుతుందిలే.. వంటి నిరాశా వాదాలు వదిలిపెట్టాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.                                ◆నిశ్శబ్ద.  

కాస్త ఆలోచించుకోండి!

సాధారణంగా చాలామంది ఈకాలంలో ఆన్లైన్ షాపింగ్ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఆన్లైన్ షాపింగ్ డెలివరీ సేవలు పల్లెపల్లెకు విస్తరించడంతో పట్టణాల నుండి మాత్రమే కాకుండా పల్లెల నుండి షాపింగ్ చేసేవారే ఎక్కువయ్యరు. ఈ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ లు ఇచ్చే ఆఫర్ లు, కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇచ్చే డిస్కౌంట్ లు, ఓ నిర్ణీత ధరకు షాపింగ్ చేయడం వల్ల ఫ్రీ డెలివరీ ఇవ్వడం వంటి కారణాల వల్ల వీటిలో సందడి బాగానే ఉంటుంది.  టౌన్స్ లో సూపర్ మార్కెట్లు, డీ మార్ట్ లు, రిలయన్స్ మార్ట్ మొదలైనవి ఉండటం వల్ల కొన్ని అవసరమైనవి బయటకెళ్లి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ పల్లెల్లో నివసించేవాళ్లకు సీన్ రివర్స్ లో ఉంటుంది. లోకల్ వస్తువుల లిస్ట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పటి ఇంటి అవసరాలకు ఉపయోగపడే వస్తువుల నుండి, ఫుడ్ ఐటమ్స్ వరకు లోకల్ లో దొరకడం కష్టమే. ఇలాంటి వాటిని పాయింట్ చేసుకుని ఆన్లైన్ అమ్మకాల జోరు పెరిగింది. దుస్తులు, కిచెన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, చెప్పులు లాంటివి అన్ని ఆన్లైన్ లో దొరికేస్తున్నాయి. అయితే ఈ ఆన్లైన్ షాపింగ్ మాయలో పడి సాధారణం కంటే ఎక్కువ ఖర్చులు చేసేస్తున్నారు అందరూ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటి?? ఆన్లైన్ షాపింగ్ ను  ఎలా చేయడం వల్ల మంచిది? ఆఫర్స్ చూసి ఎగబడద్దు! చాలామంది ఆఫర్స్ చూశారంటే చాలా తొందరపడతారు. స్టాక్ అయిపోతే కొంప కొల్లేరు అయిపోతుందేమో అన్నంత ఫీలవుతారు. అందుకే తొందరగా కార్ట్ లో వేయడం, వెంటనే ఆర్డర్ పెట్టేయడం చేస్తారు. పూర్తి డెలివరీ అయిన తరువాత వచ్చిన ఐటమ్స్ చూసి ఏడుపెత్తుకుంటారు. కొంతమంది ఏమవుతుందిలే రిటర్న్ చేసేయచ్చు అనే తెలివి ఉపయోగిస్తారు అయితే అక్కడే పప్పులో కాలువేస్తున్నారు. కొన్ని ఐటమ్స్ కు రిటర్న్ పాలసీ ఉండదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. టచ్ చేయద్దు! చాలామంది డిస్కౌంట్ చూశారంటే డమాల్ అయిపోతారు. అబ్బాబ్బా ఎంత ఖరీదైన వస్తువు ఎంత తక్కువ ధరకు వస్తుంది అని తెగ ఖుషీ అయిపోతారు. ఆ వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా తక్కువ ధరకు ఇస్తున్నాడంటే అందులో ఉన్న ఇన్నర్ పార్ట్శ్ నకిలివి కావచ్చు. ఇలాంటి ఫ్రాడ్ లకు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాధ్యత వహించదు. కాబట్టి అవగాహన రిటర్నబుల్  పాలసీ ఉంటే తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలు కొనద్దు. అనవసరంగా కొనద్దు! కొందరికి ఆఫర్లు, డిస్కౌంట్ చూసి అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనాలనిపిస్తుంది. అలా కొనడం వల్ల ఆ వస్తువును ఎప్పుడు వాడతారో ఆ దేవుడికే తెలియాలి. చాలామంది ఇళ్లలో ఇలాంటి స్టఫ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటి కోసం పెట్టె ఖర్చుతో కొన్ని ఇంటి అవసరాలు తీరవచ్చు. కాబట్టి మధ్యతరగతి, దిగువ తరగతి వారు ఇలాంటి ఆఫర్ల మాయలో పడి డబ్బు వేస్ట్ చేసుకోకండి. స్పెషల్ డేస్! పండుగలకు ముందు, ఆయా షాపింగ్ వారి యనివర్సరీ రోజుల్లో మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్లు పడుతుంటాయి. అలాంటి సమయాల్లో కావలసిన వస్తువులను రిటర్న్ పాలసీ చూసి కొనుగోలు చేయవచ్చు. వస్తువు బాగుంటే ఉంచుకుంటాం. లేకపోతే రిటర్న్ పెట్టేయచ్చు.  కొందరు అనుకుంటారు. ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు అని. ఎక్కువగా అమ్ముడుపోతుంటే వాటిని తయారుచేసే వారికి తయారీ సరుకు కొనుగోలుకు కూడా ధర తక్కువగా పడుతుంది. కిలో మామిడిపళ్ళు కొనేవాడు ఏకంగా బుట్ట పళ్ళు కొంటె వాడికి ఒక్కొక్క పండు తక్కువ ధరకు వస్తుంది. అదే విధంగా ఈ ఆన్లైన్ మార్కెట్లలో కూడా వస్తువుల ఉత్పత్తుల విషయంలో జరుగుతుంది. కాబట్టే తక్కువ ధరకు అమ్మకానికి పెడతారు. ఇలాటి ఆఫర్ల సమయంలో మరీ అంత నాణ్యమైనవి కాకపోయినా పెడుతున్న ఖర్చుకు సాటిసిఫై అయ్యేలా ఉండే వస్తువులను పొందడం మాత్రం తప్పనిసరి. ఏది ఏమైనా ఆన్లైన్ షాపింగ్ విషయంలో మరీ అంత దూకుడుగా ఉండొద్దు.                                 ◆ వెంకటేష్ పువ్వాడ.

ఆందోళనను గుర్తించాల్సిన సమయమిదే!

మనిషికి శారీరక రుగ్మతలు ఎన్ని ఉన్నా.. వాటిని ఔషధాలతో తగ్గించుకోవచ్చు. కానీ శరీరానికి నొప్పి లేకుండా మనిషిని వేధించే సమస్యలు మానసిక సమస్యలు. మానసిక సమస్యలలో ఆందోళన ఒకటి. ప్రతి నిమిషం మనిషిని భయానికి, సంఘర్షణకు లోను చేసి జీవితంలో అల్లకల్లోలం పుట్టించే ఈ ఆందోళన మనిషి పాలిట పెద్ద శాపమే అని చెప్పవచ్చు. కానీ దురదృష్ట వశాత్తు తాము అనుభవిస్తున్నది మానసిక సమస్య అని, దాని పేరు ఆందోళన అని చాలామందికి తెలియదు. తెలుసుకోకుండానే ఎంతోమంది జీవితంలో నలిగిపోతూ కాలాన్ని వెళ్లబుచ్చుతుంటారు.  చాలామంది మానసిక సమస్య అంటే పిచ్చి అనే ఒకానొక భావనతో ఉంటారు. అందుకే తమకు మానసిక సమస్య ఉందని బయటకు చెప్పడానికి కూడా ధైర్యం చేయరు. కానీ ఈ సమస్యను గుర్తించడం చాలా అవసరం, దీనికి సరైన పరిష్కారాలు వెతకడం, దీని ప్రభావాన్ని తగ్గించడం, నిర్మూలించడానికి ప్రయత్నాలు చేయడం ఎంతో అవసరం.  చరిత్రలోకి చూస్తే.. 19వ శతాబ్దం చివరలో ఆందోళన అనేది ఒక ప్రత్యేక అనారోగ్యంగా వర్గీకరించబడలేదు. కానీ ప్రజలు మాత్రం దీన్ని వేర్వేరు పేర్లతో పిలిచారు. మానసిక రుగ్మతల గురించి సగటు మనిషికి అవగాహన లేని కాలంలో దీని దీని ప్రభావం ఇప్పుడున్న ప్రభావవంతంగా లేదు.  18వ శతాబ్దంలో, బోయిసియర్ డి సావేజెస్ పానిక్ అటాక్స్, సాధారణీకరించిన యాంగ్జయిటీ డిజార్డర్‌ని 'పనోఫోబియాస్'గా గుర్తించిన నోసోలజీని ప్రచురించారు. తర్వాత 19వ శతాబ్దంలో, అలసట, తలనొప్పి, చిరాకుతో కూడిన వైద్య పరిస్థితిని లక్షణాలుగా వర్ణించి 'న్యూరాస్తెనియా' అనే పదాన్ని రూపొందించారు. ఈ ఆందోళన లక్షణాలు కొత్త వ్యాధి నిర్మాణాలలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి.  ఇక భారతదేశంలో ప్రజలు ఆందోళన అనేది పూర్తిగా మనసుకు సంబంధించిన రుగ్మతగా భావించారు. మనస్సును శాంతపరచడానికి మానసిక స్థితిని సానుకూలంగా మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా అనేక ఆయుర్వేద మూలికలను ఉపయోగించారు. వీటిలో అత్యంత సాధారణమైనవి బ్రాహ్మి, అశ్వగంధ. వైద్యశాస్త్రంలో పురోగతికి సాధించడానికి ముందు, పురాతన చికిత్సలలో వైద్యం అందించేవారు. వీటిలో  మూలికలు, ఔషధతైలం మధ్యయుగ కాలంలో సాగింది. హైడ్రోపతి విధానంలో చికిత్స అందించడం కూడా ప్రసిద్ధిగాంచింది. ఇందులో  శరీరాన్ని విపరీతమైన ఉష్ణోగ్రతలకు గురిచేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా..  అత్యంత చల్లని ప్రవాహాలు, నదులలో స్నానం చేయడం, హెల్త్ స్పాలు, జలగలను ఉపయోగించి రక్తాన్ని తీయడం వంటివి ఉన్నాయి. అయితే మనోవిశ్లేషణలో క్రమంగా  ఫ్రాయిడ్ పరిశోధనల ఆధారంగా చికిత్స చేయడం మొదలుపెట్టారు.  అన్నిటిలోకీ.. ఈమధ్య కాలంలోనే మానసిక సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిమీద దృష్టి పెట్టడం, వాటిని నియంత్రించడానికి ప్రయత్నం చేయడం సగటు వ్యక్తులలో కూడా కనబడుతోంది.  మానసిక సమస్యలు కూడా ఈమధ్య కాలంలో చాలా దారుణంగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా కాలం మనుషుల్లో ఆందోళనను పెంచిందని చెప్పాలి. మానసిక సమస్యలున్నవారితో సామరస్యంగా మాట్లాడటం, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా ఇప్పించడం, వారి ఆందోళనను పోగొట్టడానికి చేయూత ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఆందోళన అనే సమస్య దూదిపింజలా ఎగిరిపోతుంది.                                       ◆నిశ్శబ్ద.

చాక్లెట్స్ తో మొటిమలకి చెక్!

  చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఇష్టమే. తీయ్యటి చాక్లెట్స్ తినటానికి ఓ కారణం దొరకాలే కాని తినకుండా ఉండగలమా ? ఏ పుట్టినరోజుకో, పండగకో, కాదు ఇప్పడిక రోజు చాక్లెట్స్ తినడానికి ఓ తియ్యటి కారణం దొరికింది. అదే మొటిమ అవునండీ! అందమైన ముఖానికి ఓ చిన్ని మొటిమైన పెద్ద మచ్చ కిందే లెక్క అందులోనూ టీనేజ్ అమ్మాయికి మొటిమలతో పెద్ద పేచినే. ఇలా మొటిమలతో వేగలేని వారికీ ఓ తియ్యటి మందు కనిపెట్టిందో అమెరికా కంపెనీ విటమిన్లు, మినరల్స్తో నింపే ఓ చాక్లెట్ను తయారుచేశారు. వాటిని రోజుకు 2 నుంచి 5 దాకా తింటే చలట. రెండు మూడు వారాల్లోనే మొటిమలు తగ్గిపోవటం గ్యారెంటి అంటున్నారు. ఈ చాక్లెట్ లో వాడే విటమిన్లు, మినరల్స్ వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనా తగ్గుతాయట. అలాగే చర్మం లోపలకి చేరే జిడ్డుని కూడా తొలగిస్తాయట. దాంతో క్రమంగా మొటిమలు కూడా తగ్గుతాయట కాబట్టి మొటిమల కోసం క్రీములు, పైపూతలు వేసుకునే కష్టం లేదిక అందుకోసం గంటలు, గంటలు సమయం వృదా చేయక్కర్లేదు. హాయిగా ఓ తియ్యటి చాక్లెట్ నోట్లో వేసుకోవటమే. ఇంతకి ఆ చాక్లెట్ పేరు చెప్పలేదు కదు ' ఫ్రూటెల్స్' పేరుతో దొరికే ఈ చాక్లెట్ కీ ఇప్పుడు విదేశాలలో బోల్డంత డిమాండ్. కాదా మరి టీనేజ్ అమ్మాయిల్నే కాదు అబ్బాయిల్ని దడదడల లాడించే మొటిమలా మజాకానా! ....రమ

మనిషి జీవితం ఈ రెండు విషయాల మీదే ఆధారపడి ఉంటుంది!

అతి సర్వత్రా వర్జయేత్.. అని పెద్దలు అన్నారు. ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు అని దీని అర్ధం. అతి భాష మతి హాని, మిత భాష ఎంతో హాయి.. అని కూడా అంటారు. అతిగా మాట్లాడితే బుర్ర పాడవుతుంది, అదే తక్కువగా మాట్లాడితే అన్నిటికి మంచిది అని అర్థం. అన్ని వేళలా 'అతి'ని విసర్జించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, మాట్లాడడం ఇలా అవసరాన్ని మించి చేసే ఏ పనైనాసరే ప్రమాదకరం అని గ్రహించాలి. మహాత్ములంతా మౌనంతోనే మహత్కార్యా లను సాధించారు. మనం ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే 'నోటిని' అదుపులో పెట్టడం నేర్చుకోవాలి. అనవసరంగా మాట్లాడడం కట్టిపెట్టాలి. నోటిని అదుపులో ఉంచుకొంటే మనసును స్వాధీనంలో ఉంచుకున్నట్లే! అతిగా మాట్లాడడం వలన మనలో ఉన్న శక్తి వృథా అవుతుంది. కాబట్టి శక్తిని సమకూర్చుకోవాలి  అంటే ఎక్కువ మాట్లాడటం తగ్గించాలి.   అతిగా మాట్లాడడం చాలామంది బలహీనత ఖ్నే విషయం తెలిస్తే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. కానీ దానివల్ల కలిగే అనర్థాన్ని గ్రహించినా మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిలో కొందరుంటారు. అతిగా మాట్లాడటం వల్ల కలిగే  నష్టాన్ని గ్రహించి దాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన చేస్తే అప్పుడు కొన్ని విషయాలు అందరికీ సహాయపడతాయి.  బలహీనులు 'అదృష్టాన్ని' నమ్ముకుంటారు. బలవంతులు 'ప్రయత్నాన్ని' నమ్ముకుంటారు. మరి మీరు ఈ రెండింటిలో దేన్ని నమ్ముకుంటారో మీరే నిర్ణయించుకోండి. అతిగా మాట్లాడటమే మీ బలహీనత అయితే అప్పుడు మీరు ఏ విషయంలోనూ సరైన ప్రయత్నం చేయలేరు.  నోటిని, మాటను అదుపులోపెట్టుకుంటే మనసును కూడా అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు..  అయితే.. మనసును నియంత్రించడం మానవులకే కాదు. దేవతలకు కూడా ఒక పెద్ద సమస్యే! శ్రీరాముడు కూడా మనసుని నియంత్రించడం ఎలాగో తెలుపమని వశిష్ఠులవారిని ప్రార్ధించాడు. 'నీరు' పల్లానికి పారడం ఎంత సహజమో, 'మనసు' విషయ వస్తువుల వైపు పరుగులు తీయడం అంతే సహజం. నీటిలో తడవకుండా ఈత నేర్చుకోలేం. చెడు ఆలోచనలు రాకుండా మనోనిగ్రహాన్ని సాధించలేం. కాబట్టి మనసులో చెడు ఆలోచనలు వస్తున్నాయని ఆందోళన పడకుండా ఈ క్రింది సూచనలు పాటించాలి.  మనసు తలుపును తలపులు తట్టినప్పుడు ఒక్కసారి ఆలోచించి తలుపు తెరవడం నేర్చుకోండి. అంటే ఏదైనా అనిపించగానే దాన్ని వెంటనే ఆ పని చేయడం, ఆ మాటను విశ్వసించడం చేయకూడదు. ముందు వెనుకా ఆలోచన చేయాలి.  చెడు తలపులు తెచ్చే తంటాలను ఒక్కసారి ఇమేజిన్ చేసుకోవాలి. దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో.. ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో ఊహించుకోవాలి. మంచి ఆలోచన ఎప్పుడూ ఆరోగ్యకరమైన మనసుకు దోహదం చేస్తుంది. కాబట్టి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి.    మనసుని ప్రలోభపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. చెడు సావాసం, చెడు మాట, చెడు దారి జీవితంలో వైఫల్యానికి కారణాలు.                                  ◆నిశ్శబ్ద.

కార్మికుల గొంతుకు ఫలితం వచ్చిన రోజిది!

'నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం..' అంటాడు శ్రీశ్రీ. మనుష్య జాతి చరిత్ర మొత్తం పక్కవాడిని పీడించుకుని, దోచుకుని తినడంతోనే నిండిపోయిందని అంటాడు. సమాజంలో ఉన్న మనుషులు వర్గాలుగా చీల్చబడి, అది కూడా ఆర్థిక అసమానతలతో వేరు చేయబడి, దోపిడీ సమాజం దర్జాగా బతుకుతున్న కాలమిది. కష్టానికి తగిన ఫలితం లేక శ్రమను పరిధికి మించి ధారపోస్తున్న దీనమైన శ్రామికుల ప్రపంచమిది. ఎటు చూసినా బలహీనుడు దారుణంగా దగాకు గురవుతున్న ప్రపంచమిది. ఈ దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా.. తమకూ హక్కులున్నాయని.. వాటిని  సాధించుకోవడం తమ లక్ష్యమని భావించి, పోరాడిన ఫలితంగా మే డే అవిర్భవించించి.  శ్రామికుల దినోత్సవమన్నా.. కార్మికుల దినోత్సవమన్నా.. లేబర్ డే అన్నా.. అదంతా బలహీనుల పక్షాన నిలబడేదే..  ప్రతి సంవత్సరం మే 1 తేదీని కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారని అందరికీ తెలుసు. కార్మికులు సాధించిన విజయాలను గౌరవించడం, వారి హక్కులను వారిని గుర్తుచేయడం, ఆ దిశగా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.  ఈ కార్మిక దినోత్సవమే ప్రపంచ వ్యాప్తంగా 'మే డే'గా ప్రసిద్ధి చెందింది, ఇది 19వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్‌లో కార్మిక సంఘాల ఉద్యమంతో ఆవిర్భవించింది. వారి డిమాండ్స్ లో  ఎనిమిది గంటల పని ఓ ఉద్యమంగా సాగింది. అప్పటి వరకు కార్మికుల చేత 14 నుండి 15 గంటల పని చేయించేవారు.  కార్మికుల పోరాట ఫలితంగా కార్మిక దినోత్సవ బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం న్యూయార్క్ అయితే, ఫిబ్రవరి 21, 1887న ఒరెగాన్ దానిపై ఒక చట్టాన్ని ఆమోదించింది. తరువాత 1889లో, మార్క్సిస్ట్ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ గొప్ప అంతర్జాతీయ ప్రదర్శన కోసం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రోజుకు 8 గంటలకు మించి పని చేయకూడదని కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా నిర్ణయించారు.  భారతదేశంలో కార్మిక దినోత్సవం మే 1, 1923న చెన్నైలో జరుపుకోవడం ప్రారంభించారు. దీనిని 'కమ్‌గర్ దివాస్', 'కామ్‌గర్ దిన్', 'అంత్రరాష్ట్రీయ శ్రామిక్ దివస్' అని కూడా పిలుస్తారు. ఈ రోజును లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ మొదటిసారిగా పాటించింది. కార్మికుల దినోత్సవాన్ని ఎన్నో దేశాలలో జాతీయ సెలవుదినంగా పాటిస్తారు. అమెరికా యూరప్ లలో కార్మిక దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు.                                     ◆నిశ్శబ్ద.  

ఈ ఐదు అలవాట్లకి దూరంగా ఉండండి

మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే మీ అనారోగ్యానికి ఈ అలవాట్లు కారణం అయి ఉండొచ్చు. సాధారణంగా, టాయిలెట్ బౌల్ మరియు మన ఇంటి ఫ్లోర్ అత్యంత మురికైన ప్రదేశాలుగా భావిస్తుంటారు. కానీ, అంత కన్నా అపరిశుభ్రమైన విషయాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ ఐదు అలవాట్లకు దూరంగా ఉండండి.   1 . బాత్రూం లో ఫోన్ వాడడం కొందరికి బాత్రూం లో ఫోన్ వాడడం అలవాటు ఉంటుంది. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందనే విషయం మీకు తెలుసా?  టాయిలెట్ సీట్లు, హ్యాండిల్స్, సింక్ మరియు కుళాయిలపై హానికరమయిన జెర్మ్స్ ఉంటాయి. వీటివల్ల మూత్రసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున, టాయిలెట్ లో మధ్య మధ్యలో ఫోన్ వాడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.   2 . హ్యాండ్ బ్యాగ్ తొలగించకపోవడం హ్యాండ్ బ్యాగ్ లు మరియు పర్సులు నిరంతరం మన చేతుల్లోనే ఉంటాయి. సాధారణ సమయంలో వాటిని ఉపయోగించడం వల్ల పెద్ద నష్టం ఏం ఉండదు. కానీ, బాత్ రూమ్ కి వాటిని మనకి తోడుగా తీసుకెళితే మాత్రం ఇబ్బందే. టాయిలెట్ కి వెళ్ళినపుడు ముందుగా హ్యాండ్ బ్యాగ్ ని అక్కడ ఉండే హుక్ కి తగిలించి వెళ్లడం బెటర్. తర్వాత బ్యాగ్ ని పై నుండి మరియు లోపల యాంటీ బాక్టీరియా క్లాత్‌తో తుడిచివేయడం మంచిది. తద్వారా హాని కలిగించే క్రిముల బారిన పడకుండా ఉండవచ్చు.   3 . షూస్ ఎక్కువ సేపు ధరించడం ఒక రీసెర్చ్ ప్రకారం దాదాపు 40 % షూస్ డయేరియా కలిగించే బ్యాక్టీరియా కలిగి ఉంటాయి. కాబట్టి ఆఫీస్ కి గానీ ఎక్కడికయినా వెళ్ళినపుడు మీ బూట్లు బయటే వదిలేసి వెళ్లడం మంచిది. అదే ప్రయాణంలో అయితే, ఒక శుభ్రమయిన సంచిలో తీసుకెళ్లడం బెటర్.   4 . రిమోట్ ని శుభ్రపరచకపోవడం మనం టీవీ రిమోట్ ని ఎక్కడ పడితే అక్కడ పడవేస్తాం. అయితే, రిమోట్ ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం వల్ల హానికారక బ్యాక్టీరియా నుండి ఉపశమనం పొందవచ్చు.   5 . స్పాంజిని సరిగ్గా పిండకపోవడం స్పాంజీలని వాస్తవానికి మనం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటాం. అయితే అదే స్పాంజీలు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. కాబట్టి, స్పాంజీలని నెలకి ఒకసారి మార్చడమో లేదా వేడి నీటిలో ఉంచి పిండటమో చేస్తే క్రిముల బారి నుండి మనల్ని మనం రక్షించుకున్నవాళ్లమవుతాం.

బాధ్యతగా ఉంటున్నారా??

ప్రపంచంలో మనిషి ఏదైనా గొప్పగా చేయగలిగింది ఉందంటే అది బాధ్యతగా ఉండటమే అనిపిస్తుంది. వృత్తిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇతర పనులలో కావచ్చు పూర్తిస్థాయి బాధ్యతగా ఉండటం అనేది చాలామంది విషయంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఇదే విషయం మీద ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు.  ఎందుకీ ఫిర్యాదులు?? అని ఆలోచిస్తే ఎందుకంటే ఇంకేముంటుంది బాధ్యతగా లేకపోవడం వల్ల అని అందరికీ అర్థమైపోతుంది.  అయితే…. సమాజంలో దృష్టిలో బాధ్యత!! చాలామంది చాలా కోణాల్లో ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనలు అన్నీ అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు ట్రైన్ తన మెయిన్ స్టాప్ కు వచ్చి చేరినట్టు, మనిషి ఆలోచనలు కూడా అన్ని విధాలుగా ఆలోచించి చివరకు తమ దగ్గరే ఆగుతారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే బాధ్యత అనే విషయాన్ని  ప్రతి మనిషి తను ఆశిస్తున్న ప్రయోజనాలకు దగ్గరే నాటుకుంటాడు.  ఉదాహరణకు ఒక కాలేజీ కుర్రాడు తనకు కావలసిన అవసరాలను, వస్తువుల్ని తీర్చడం తన తండ్రి బాధ్యత అనుకుంటాడు. ఒకవేళ ఆ కుర్రాడు అడిగింది ఏదైనా అతని తండ్రి నిరాకరిస్తే బాద్యతలేని తండ్రి అనేస్తాడు. స్నేహితుల దగ్గర అదే మాట చెప్పేస్తాడు. ఇలాంటి వాళ్ళు ప్రస్తుత సమాజంలో బేషుగ్గానే ఉన్నారు.  నిజానికి బాధ్యతంటే ఏంటి?? బాధ్యత అనేది డిమండింగ్, కమండింగ్ ల మధ్య సాగేది కానే కాదు. అది మనిషిలో ఉండాల్సిన లక్షణాలలో ఒకటి. ఈ విషయం అర్ధం చేసుకుంటే ప్రతి ఇల్లు కూడా ఫిర్యాదులు లేకుండా హాయిగా ఉంటుంది. ఒక తండ్రి తన ఆర్థిక కారణాల వల్ల ఉన్నదాంట్లో తన పిల్లలని సంతోషపెట్టాలని చూస్తే పిల్లలు కూడా తండ్రి పరిస్థితిని అర్థం చేసుకుని, ఆ పరిస్థితికి తగ్గట్టు సర్దుకుపోవాలి. వృత్తిలో సమర్థవంతమైన పనిని అందివ్వాలి. స్నేహితులు చుట్టాల దగ్గర  అనవసర డాబు పోకుండా మోహమాటాల కోసం సామర్త్యానికి మించిన పనులు ఒప్పుకోకుండా ఉండాలి. మరీ ముఖ్యంగా ఏదైనా నిజాయితీగా చెప్పేయడం, చేయడం వంటివి చేస్తే వ్యక్తిత్వాన్ని చూసి అందరూ గౌరవిస్తారు.  ఒకరి మెప్పు కోసమో, ఒకరు గొప్పగా చెప్పుకోవడం కోసమో కాకుండా తాము చేయవలసిన పనిని తమ పూర్తి సామర్త్యంతో చేస్తే అప్పుడు మనిషి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించినట్టు.  కొందరు ఏమి చేస్తారంటే!! కొందరికి సామాజిక స్పృహ చాలా ఎక్కువ(ఈ మాట కొంచం వెటకారంగా చెప్పబడింది). ఎంత ఎక్కువ అంటే, ఓ సంపాదన పరుడు ఆరంకెల జీతం తీసుకుంటూ గుడిలోనో, అనాథశ్రమంలోనో మరింకోచోటో అన్నసంతర్పణలు, వస్త్రధానాలు చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న కన్నతల్లికి ప్రేమగా ఓ ముద్ద అన్నం పెట్టరు. సమాజం ఇచ్చే అటెన్షన్ కోసం ఇలా చేసే వాళ్ళు చాలా బాద్యతకలిగిన వాళ్ళలా సమాజానికి మాత్రమే అనిపిస్తారు. కానీ ముఖ్యంగా బాధ్యత ఉండాల్సింది తమ ఇంటి విషయంలో, తరువాత కుటుంబసభ్యుల అవసరాల విషయంలో, ఆ తరువాత సమాజం విషయంలో. అంతేకానీ అన్నీ వదిలిపెట్టేసి తన వాళ్ళు దిగులుగా, లోటుతో, బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉంటే సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయడం బాధ్యత అనిపించుకోదు.  ఈ సమాజంలో ప్రస్తుతం మనుషుల తీరు గమనిస్తే చెప్పుకోవాల్సిన మాట ఒకటి ఉంది. ఎప్పుడూ అన్నిటికీ పెద్దల మీదనో, ఇంట్లో ఉన్న సంపాదనా పరుల మీదనో ఆధారపడటం మాని ఇంటికి సహాయంగా ఉండకపోయినా తమని తాము సరైన విధంగా ఉంచుకుని, మంచిగా తీర్చిదిద్దుకుంటే (దీన్నే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడం అంటారు) ఎవరి జీవితం పట్ల వాళ్ళు బాధ్యతగా ఉన్నట్టే. అదే గనుక జరిగితే అన్ని విషయాలలోనూ అన్ని కోణాలలోనూ బాధ్యతగా ఉండటం అనేది క్రమంగా అలవాటైపోతుంది. మరి ఏవి బాధ్యతలు?? ఓ తండ్రి తన పిల్లలకు మంచి దారి చెప్పడం, చూపించడం, జీవితాన్ని గురించి వివరిస్తూ ఉండటం, చదువు, సంస్కారం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించడం. ఇది తల్లికి కూడా వర్తిస్తుంది. ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు కాదు. ఇంకా చెప్పాలంటే అదీ, ఇదీ అన్నట్టు ఇంటిని చక్కబెడుతూ, ఎన్నో రంగాలలో రాణిస్తున్న మహిళా ముత్యాలు బోలెడు ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులు తమ మీద ఇష్టాలు రుద్దుతున్నారు అనుకోకుండా పెద్దల ఆలోచనలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చదువు విషయంలో తమ ఇష్టాల్ని చెప్పి అందులో ఉత్తమంగా రాణించాలి. జులయిగా తిరగడం, అల్లరిగా మారిపోవడం వదిలి కాసింత పరిపక్వతతో ఆలోచించాలి. ఉపాధ్యాయులు ఈ సమాజానికి మంచి పౌరులను అందించడానికి ప్రయత్నం చేస్తే ఆ పౌరులే సమాజాన్ని శాసించే వ్యక్తులు అవుతారు. అంతేకానీ ఎప్పుడూ ర్యాంకులు, మార్కులు అంటే విద్యార్థులకు ఆ మార్కులు, ర్యాంకులు, చదివిన చుదువు తాలూకూ విషయం తప్ప వాళ్లకు ఇంకేమీ తెలియకుండా పోతుంది. ప్రభుత్వాల గురించి రాజకీయ నాయకుల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ.  అయినా బాధ్యతగా ఉండాల్సింది మనమైతే ప్రభుత్వాల గురించి ఎందుకు చెప్పండి!!                                                                                                          ◆వెంకటేష్ పువ్వాడ.  

లైఫ్ పార్టనర్ దగ్గర ఈ తప్పులు చేయొద్దు!

ప్రస్తుతకాలంలో వివహబంధాలు చాలా పేలవంగా ఉంటున్నాయి. చిన్న చిన్న వాటికి గొడవ పడటం, ఇగో లు, మిస్ అండర్స్టాండింగ్, అనుమానాలు, ఇంకా ముఖ్యంగా కమర్షియల్ విషయాల్లో ఆర్గ్యు జరగడం,  పర్సనల్ ఇంపార్టెన్స్, పబ్లిక్ సెక్యూరిటీ ఇలా చాలా విషయాలు లైఫ్ పార్టనర్స్ మధ్య గొడవలకు దారి తీసి అవి కాస్తా విడిపోయేవరకు తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా లైఫ్ పార్టనర్ దగ్గర కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ జాగ్రత్త అజాగ్రత్త అయితే తరువాత చాలా రిలేషన్ కోసం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు.  లైఫ్ పార్టనర్ దగ్గర ఎలా ఉంటే వాళ్ళు ఇంప్రెస్స్ అవుతారు అనే విషయాలు అన్ని చోట్లా ఉంటాయి. వాటిని ఫాలో అయ్యేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కానీ లైఫ్ పార్టనర్ దగ్గర చేయకూడని పనులు ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. అవేంటో తెలుసుకుంటే రిలేషన్స్ బ్రేక్ అవ్వడం అంటూ ఉండదు. ఓపిక ఉండాలి! ఓపిక ఉండాలనే విషయం అందరికీ తెలిసిందేగా అనుకోవచ్చు. కానీ లైఫ్ పార్టనర్ తను చెప్పాలనుకున్న విషయాన్ని, తన ప్రోబ్లేమ్స్ ను చెప్పేటప్పుడు ఓపికగా వినాలి. నువ్వెప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు పో….. లాంటి మాటలు మనుషుల మధ్య చాలా దూరాన్ని పెంచేస్తాయి. ప్రతి ఒక్కరికీ తాము ఫేస్ చేసే ప్రాబ్లెమ్ పెద్దగానే కనబడుతుంది కాబట్టి ప్రోబ్లేమ్స్ గురించి చెప్పేటప్పుడు వినడం, చెప్పేసిన తరువాత ఆ ప్రాబ్లెమ్ గురించి అన్ని కోణాలలో కొంచెం వివరించి దాన్ని సాల్వ్ అయ్యేలా సలహా ఇవ్వచ్చు. అలా చేస్తే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. స్పెండింగ్ టైమ్! కలసి ఉండే సమయం గురించి కొంచెం ఫోకస్ చెయ్యాలి ఇప్పటి జనరేషన్ వారు. ఎంత బిజీ ఉద్యోగం అయినా ఉద్యోగం పనుల్ని ఇంటికి తెచ్చి ఆ పని తాలూకూ ఎఫెక్ట్ ను ఇంట్లో కూడా చూపిస్తూ ఉంటే అన్నిటికంటే ఉద్యోగమే ఎక్కువైపోయింది లాంటి డైలాగ్స్ బాణాల్లా వచ్చేస్తాయి. ఉద్యోగం చేస్తున్నవాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాన్ని ఉద్యోగంలా చూస్తూ పర్సనల్ టైమ్ ను హాయిగా గడపాలి. అప్పుడే ప్రొఫెషన్ లైఫ్ ను, పర్సనల్ లైఫ్ ను రెండింటిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసె జెంటిల్ మెన్ లేదా జెంటిల్ ఉమెన్ అవుతారు. ఓపెన్ గా ఉండాలి! కొంతమంది సీక్రెక్స్ మైంటైన్ చేస్తుంటారు. అలాంటి కపుల్స్ మధ్య అపార్థాలు చాలా తొందరగా వచ్చేస్తాయి. అవి వచ్చినంత తొందరగా తగ్గిపోయేవి కావు. పైపెచ్చు ఒకదానికొకటి ఇంకా అగ్గి రాజుకున్నట్టు పెద్ద గొడవల వైపుకు మల్లుతాయి. కాబట్టి ఎలాంటి సీక్రెట్స్ లేకుండా ఉండటం బెటర్. ఏ విషయం జరిగినా ఇద్దరూ డిస్కస్ చేసుకోవడం, ఏ గొడవ జరిగినా  ఇద్దరూ కలిసి మాట్లాడుకుని దానికి సాల్వ్ చేసుకోవడం బెటర్. కాంప్రమైజ్! జీవితమంతా కాంప్రమైజ్ లతోనే గడిచిపోవాలా లాంటి ఆవేశపు క్వశ్చన్స్ వద్దు కానీ నిజానికి చాలా బంధాలు బ్రేక్ అవ్వకుండా నిలబడేట్టు చేసే శక్తి కాంప్రమైజ్ కు ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాబ్లెమ్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటే ప్రోబ్లేమ్స్ ను సులువుగానే ఒక కొలిక్కి తీసుకురావచ్చు.  లోపాలు ఎత్తిచూపద్దు! లోపమనేది చాలా సహజం. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు లోపాలు ఉన్నవాళ్లు బోలెడు. లోపం అనేది స్వీయతప్పితం కానే కాదు. అలాగని దాన్ని అదేపనిగా ఎవరూ భరించాలని అనుకోరు. కాబట్టి మానసికంగా, శారీరకంగా ఏదైనా లోపం ఉంటే  కోపంలో ఉన్నప్పుడో, వేరే పనుల అసహనంతో ఉన్నప్పుడో, వేరే వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడో లైఫ్ పార్టనర్ మీద లోపాన్ని ఎట్టి చూపుతూ మాట్లాడకూడదు. అది చాలా పెద్ద బాధాకరమైన విషయంగా మారుతుంది. ఎక్స్ప్రెస్ చేయడంలో తగ్గద్దు! ప్రేమ, ఇష్టం అనేది కామన్. నిజానికి పెళ్లికి ముందు, పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు కాలం గడిచేకొద్దీ ఉండదు. 90% జీవితాల్లో ఇలాగే ఉంటుంది. అయితే మనసులో ఇష్టం, ప్రేమ కలిగినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎలాంటి సంకోచం అక్కర్లేదు. అది కేవలం రొమాన్స్ ఫీలింగ్ వస్తేనే కాదు, ఏదైనా మంచి పని చేసినప్పుడో ప్రాబ్లెమ్ సాల్వ్ చేసే ఐడియా ఇచ్చినప్పుడో, గుర్తుపెట్టుకొని నచ్చిన పని, నచ్చిన వస్తువు, నచ్చిన ఫుడ్, నచ్చిన డ్రెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. నచ్చినవి ఏవైనా తెచ్చినప్పుడు ప్రెసెంట్ చేసినప్పుడు, ప్రేమను, అనురాగాన్ని  వ్యక్తం చేయడంతో తగ్గొద్దు. అలాగే ప్రోబ్లేమ్స్ లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు అనే ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. ఇలా ఇవన్నీ ఫాలో అయితే రిలేషన్ బ్రేకప్ అనేది ఉందనే ఉండదు.                                ◆వెంకటేష్ పువ్వాడ.

అమ్మాయిలూ… ఈతప్పు చేయొద్దు!

జీవితంలో తప్పులు జరగడం అనేది సహజం. ఆ తప్పులలో కొన్నింటిని సరిదిద్దుకోవద్దు, అయితే కొన్ని తప్పులు సరిదిద్దుకోలేరు. అలా సరిదిద్దుకోలేమని చాలామందికి తెలియకుండా తప్పులు చేస్తారు. అమ్మాయిలు తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారని, తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారని కొన్ని సర్వేలలో స్పష్టమయింది. అమ్మాయిల ఆలోచనా విధానమే దానికి కారణమని కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు. అమ్మాయిలు చేసే తప్పులు, తీసుకునే తప్పు నిర్ణయాల గురించి అమ్మాయిలు తప్పక తెలుసుకోవాలి మరి. స్వేచ్ఛను కోల్పోవద్దు!! స్వేచ్ఛ అంటే చాలామంది వేరే అర్థం తీసుకుంటారు. పొట్టి పొట్టి బట్టలేసుకుని ఇష్టమొచ్చినట్టు తిరుగుతూ నా ఇష్టం నా స్వేచ్ఛ అనే వాళ్లకు నిజమైన స్వేచ్ఛ అంటే అర్థం తెలియకపోవచ్చు.  కానీ స్వేచ్ఛ అంటే ఒకరి చెప్పుచేతల్లో లేకుండా ఇష్టమైనదాన్ని పొందడం.  నచ్చినది తినడం, నచ్చినది చదవడం, నచ్చినది భయం లేకుండా అడగడం. ఇవన్నీ అమ్మాయిలలో ఆత్మవిశ్వాసపు స్థాయిలను చాలా గొప్పగా తీర్చిదిద్దుతాయి. ఏదైనా అడిగితే ఇంట్లో ఏమంటారో అనే భయాన్ని వదిలిపెట్టాలి. అవసరమైన వస్తువు ఎందుకు అవసరం అనే విషయాన్ని వివరించాలి. భారంగా ఆలోచించొద్దు!! చాలామంది ఇళ్లలో అడపిల్లల్ని భారంగా చూస్తారు. ఇది చిన్నతనంలో ఎక్కువగా కనిపించకపోయినా పెద్దయ్యే కొద్దీ ఈ భావాన్ని తల్లిదండ్రులు ఆడపిల్లల దగ్గర మాటల్లో వ్యక్తం చేస్తుంటారు.  ఆడపిల్లలు ఏదైనా ఖరీదైన వస్తువులు అడిగినప్పుడు "నీకోసం ఇంత దాచిపెట్టాలి. ఇప్పుడే ఇంతింత ఖర్చులు భరించాలంటే ఎలా??"  "నువ్వు ఇలా అడిగితే ఎలా రేపు నీ పెళ్లికి చాలా డబ్బు కావొద్దు" అని అంటుంటారు. అవన్నీ విని విని ఆడపిల్లలు కుటుంబానికి భారం అవుతారేమో అని చదువు విషయంలో పెద్దపెద్ద కలలవైపు వెళ్లకుండా ఆగిపోతారు. నిజానికి భారం అవుతున్నామేమో అనే ఆలోచనతోనే ఆడపిల్లలు ఇంటి భారాన్ని మోస్తున్నవాళ్ళున్నారు. ఇంటి భారం మోయడం తప్పుకాదు కానీ తామే ఇంటికి భారం అనుకోవడం తప్పు. కాంప్రమైజ్ అవ్వద్దు!! ఆడపిల్ల అంటేనే కాంప్రమైజ్ కి మారుపేరు అన్నట్టు పెంచుతారు కొందరు. తినే విషయం దగ్గర నుండి అవసరమైన వస్తువుల వరకు ప్రతిదాంట్లో కాంప్రమైజ్ అవడం నేర్పిస్తారు. ఇలా  కాంప్రమైజ్ ల మధ్య బతికి ఆడపిల్లలు వేసే ఒక పెద్ద రాంగ్ స్టెప్ ఏమిటంటే జీవితకాల నిర్ణయం అయిన పెళ్లి విషయంలో కూడా కాంప్రమైజ్ అయిపోవడం. ఇంట్లో వాళ్లకు భారం తగ్గిపోతుంది, ఏదో ఒక సంబంధం అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది. ఇంట్లో ఇబ్బందులు అవుతున్నాయి నా పెళ్లైపోతే అంత సెట్ అయిపోతుంది అని ఆలోచించే అమ్మాయిలు ఈకాలంలో కూడా ఉన్నారంటే ఆశ్చర్యమే వేస్తుంది. ఇష్టాలు వదిలిపెట్టద్దు!! అందరికీ ఇష్టాలుంటాయి. అలాగే ఆడపిల్లలకు కూడా. కానీ ఇంట్లో తల్లిదండ్రుల కష్టాలను చూసే ఆడపిల్లలు తమ ఇష్టాలను బయటపెట్టరు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇష్టాలను బయటపెట్టని వాళ్ళున్నారు. అలాగని అందరూ ఇలా త్యాగం చేసేస్తారని అనడం లేదు. కానీ ఆడపిల్లలు తమకున్న చిన్న చిన్న ఇష్టాలను వధులుకోకూడదు. ఆ అసంతృప్తి చాలా మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఆర్థిక సంపాదన మానుకోవద్దు!! కొంతమంది మగవాళ్లకు సంపాదన బాగుంది కదా అనే ఆలోచనతో ఆడపిల్లలను సంపాదించడానికి ప్రోత్సహించరు. తల్లిదండ్రులేమో ఆడపిల్లను బయటకు పంపించాలంటే భయమనే సాకుతో ఉద్యోగానికి పంపరు, పెళ్లయ్యాక భర్త, అత్తమామలు ఏమో మా సంపాదన ఉందిగా ఇంట్లో హాయిగా ఉంటే చాలు అంటారు. ఇలా రెండు వైపులా ఆడపిల్లలను ఆర్థికంగా ముందడుగు వేయకుండా చేసేవాళ్ళు ఉన్నారు. తమకంటూ ఆర్థిక సంపాదన లేకపోతే పెళ్లి కాని వాళ్ళు అయినా, పెళ్లి అయిన వాళ్ళు అయినా తమ అవసరాల కోసం భర్త దగ్గర, అత్తమామల దగ్గర చెయ్యి చాపుతూనే ఉండాలి. అందుకే తమ చేతిలో ఏ విద్య ఉన్నా, దాని సహాయంతో తమకంటూ కొంత సంపాదించుకోవాలి. ఏమో ఎవరు చెప్పొచ్చారు ఇలా సంపాదించే ఆడపిల్లలు ఆర్థిక వేత్తలు కూడా కాగలరు. ◆ వెంకటేష్ పువ్వాడ.

పవిత్ర మాసం రంజాన్!!

పండుగ అంటే ఒక పెద్ద సంబరం. పండుగలో కళ ఉంటుంది, సంతోషం ఉంటుంది, వీటితో పాటూ ఒక గొప్ప సందేశం ఉంటుంది. అది హిందువులు అయినా, ముస్లింలు అయినా, క్రైస్తవులు అయినా పండుగ జరుపుకోవడం అంటే తాము నమ్మిన సిద్దాంతంలో ఉన్న సందేశాన్ని అందరికీ తెలియజేయడమే. ముస్లిం మతస్థులకు పండుగలు చాలా కొద్దిగా ఉంటాయి. వాటిలో ఎంతో ప్రాముఖ్యమైంది రంజాన్. ముస్లిం మతస్తులు అనుసరించే చంద్రమాస క్యాలెండర్ ప్రకారం వారి సంవత్సరంలో తొమ్మిదవ నెలే ఈ రంజాన్. ఇది ఎంతో పవిత్రమైనదిగా వాళ్ళు భావిస్తారు. ఎందుకూ అంటే వారి పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ ఈ రంజాన్ నెలలోనే ఆవిర్భవించింది. పరమార్థం!! ఒక వేడుకలో ఉండే అర్థాన్ని పరమార్థం అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పుకుంటున్న రంజాన్ కూడా అలాంటి పరమార్థాన్ని దాచుకున్నదే. ముఖ్యంగా రంజాన్ ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అందులో ఉన్న విశిష్టతను చెబుతుంది. ఇక ఇందులో ముస్లిం మతం యావత్ ప్రాశస్త్యం ఇమిడిపోయి ఉంటుంది.  ఉపవాసం ప్రాధాన్యత!! హిందువులకు ఉపవాసం, మాఘమాసం, కార్తీకం, ఇంకా మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఎంతటి భక్తి ఉంటుందో, రంజాన్ మాసంలో ముస్లిం మతస్థులకు అంతే భక్తి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది.  ప్రతిరోజు సూర్యోదయంకు ముందే నిద్రలేచి వంట చేసుకుని భోజనం చేసి సూర్యుడు ఉదయించి తరువాత ఇక పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కఠోర ఉపవాసదీక్ష చేపట్టడం వీళ్ళ భక్తికి, క్రమశిక్షణకు తార్కాణం. ఈ ఉపవాసాన్ని రోజా అని పిలుస్తారు. నెల మొత్తం నిష్ఠగా రోజా ఉండే వాళ్ళు చాలామందే ఉంటారు. వీళ్ళలో రోజూ ఖురాన్ గ్రంధాన్ని పఠించడం, విధిగా నమాజ్ చేయడం తప్పనిసరిగా చేస్తారు.  ఇఫ్తార్!! ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ గా పిలుస్తారు. ప్రస్తుత కాలంలో ఇఫ్తార్ విందులు చాలా ఫెమస్ అయిపోయాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఓ రేంజ్ లో ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా ఖర్జూరానికి స్థానమిచ్చారు. ఉపవాసం ముగియగానే మొదటగా ఖర్జూరం తిన్న తరువాత మిగిలిన ఆహారం తీసుకుంటారు. అయితే సాధారణ రోజా ఉండేవాళ్ళు ఉపవాస దీక్ష ముగియగానే తాము తెచ్చిన ఆహారాన్ని అందరికీ పంచుతారు. ఇలా ఒకరికి ఇవ్వడంలో గొప్పదనాన్ని తమ మతంతో చాటి చెబుతారు. జకాత్!! ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంతమొత్తాన్ని దానధర్మాల కోసం ఉపయోగించాలి. జాకాత్ అందుకే ఉద్దేశించబడింది. ఇవ్వడం అంటే ఇవ్వాలి కాబట్టి తమవారికి ఇచ్చుకోవడం కాదు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యడం. ముఖ్యంగా పండుగ జరుపుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు అవసరమైనవి సమకూర్చడం. ఇలా పండుగలో ఇవ్వడమనే గొప్ప విషయాన్ని మేళవించారు. పవిత్ర ఖురాన్!! హిందువులకు భగవద్గీత ఎలాంటిదో ముస్లిం మతస్తులకు ఖురాన్ అలాంటిది. నిజానికి ఖురాన్ లో ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే ప్రతి మాత గ్రంధం కాలానుగుణంగా మారే మతపెద్దలు ఆలోచనలను నింపుకుంటూ మెల్లిగా స్వరూపాన్ని మార్చుకుంటూ వస్తోంది. అలా అవి మారుతూ ఉండటం వల్లనే ప్రస్తుతం అన్నిరకాల మత గ్రంధాలు విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాయి. అందుకే ఎందులో అయినా మంచిని తీసుకోవడంకు మించిన గొప్ప పని మరొకటి ఉండదు. నెలవంక నియమం. ప్రతిరోజూ ఆకాశంలో నెలవంకను చూసి దాని ప్రకారం ఉపవాస దీక్షను అంచనా వేసుకోవడం వీరి ప్రత్యేకత. హిందువులు ఎలాగైతే సూర్యుడి ఉషోదయ, అస్తమయాలను లెక్కలోకి తీసుకుంటారో, వీళ్ళు అలాగే చంద్రుడిని తీసుకుంటారు.  ఇలా నియమాలు, దానధర్మాలు, సహాయాలు కలగలిసి ఎంతో ఉదార హృదయాలను, ఉపవాస దీక్షలతో సహనాన్ని, నమాజ్ లతో క్రమశిక్షణను పెంచే రంజాన్ అందరికీ సందేశాన్ని ఇచ్చే పండుగ.                                   ◆ వెంకటేష్ పువ్వాడ.  

రంజాన్ మాసం-చివరి శుక్రవారం!!

మహమ్మదీయ మిత్రులు ఎంతో ముఖ్యమైనదిగా భావించే రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని జుమాతుల్ విదా అని అంటారు. సాధారణంగా శుక్రవారాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావించే ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని  అని శుక్రవారాల కంటే ప్రత్యేకంగా చూస్తారు. అరబ్బీ భాషలో జుమా అంటే శుక్రవారం. అల్ విదా అంటే వీడ్కోలు. జుమాతుల్ విదా అంటే చివరి శుక్రవారానికి వీడ్కోలు పలకడం అని అర్థం. అంటే రంజాన్ మాసం ముగింపు దశకు వచ్చిందని, ముస్లిం మిత్రులు ఎంతో భక్తిగా ఆచరిస్తున్న ఉపవాసాలకు కూడ వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేస్తోందని అర్థం. రంజాన్ మాసం మొదలును ఈద్-అల్-ఫితర్ గా చెప్పుకుంటామని అందరికీ తెలిసినదే.  నెలవంక దర్శనంతో ఇది ప్రారంభమవుతుంది, ఇది ఇస్లామిక్ ప్రపంచానికి చాలా పవిత్రమైన రోజు.  వ్యక్తులు పవిత్ర ఖురాన్‌ను పఠించాలని, ఒకరికొకరు తమ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని నియంగా ఉంటుంది. కావాలంటే ప్రతిచోటా ఇద్దరు ముస్లిం సోదరులు ఎదురుపడితే ఆలింగనంతో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం చూడవచ్చు.  ఈ మాసంలో  పేదలకు దానాలు చేయడం ద్వారా ఇవ్వడంలో ఉన్న గొప్పదనాన్ని తెలుపుతారు    జుమాతుల్ విదా చరిత్ర  వారంలో ప్రతి శుక్రవారం ఇస్లామిక్ సంప్రదాయాలు మరియు సంస్కృతి ప్రకారం ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రార్థనలు చేయడం వల్ల ముస్లిం సోదరులు  తమకు ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంకా రంజాన్ మాసంలోనే ఖురాన్ ఆవిర్భవించింది కాబట్టి ఖురాన్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు.  ఈ సందర్భంగా  ఖురాన్‌ను తప్పనిసరిగా పఠిస్తారు, దేవుని ఆశీర్వాదాలను పొందడం కోసం నిరాశ్రయులకు మరియు నిస్సహాయంగా ఉన్నవారికి ఆహారం అందించడం, సహాయాలు చేయడం వంటి ఇతర ధార్మిక చర్యలను పాటిస్తారు.   ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, దేవుని దూత ఈ నిర్దిష్ట రోజున (శుక్రవారం ప్రార్థన) మసీదును సందర్శించి, ఇమామ్‌ను వింటాడు.  ఆ సమయంలో అక్కడ ఉండటం వల్ల దేవుడి కృపకు పాత్రులు అవ్వగలమనే నమ్మకంతో ఉదయాన్నే ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం  ఏమిటంటే రంజాన్ మాసంలో వచ్చే ఈ చివరి శుక్రవారం రోజున నమాజ్ చేయడం వల్ల, తాము ఏదైనా తప్పులు చేసి ఉంటే అల్లాహ్ వారిని క్షమిస్తాడని  ప్రవక్త మహమ్మద్ తన బోధనలలో తెలిపారు.  చివరి శుక్రవారం రోజున అన్ని ప్రాంతాలలో  మసీదు వెలుపల షామియానాలు ఏర్పాటు చేస్తారు. ప్రార్థనలు కోసం వచ్చే భక్తుల రద్దీ కారణంగా, అందరూ ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు. ఎక్కువ భగణ ఖురాన్ పఠించడానికి కేటాయిస్తారు.  స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడం లేదా పేదలకు ఆహారం ఇవ్వడం భవిష్యత్తులో పుణ్యాన్ని పొందుతుందని నమ్ముతారు అదే విషయాన్ని తమ పిల్లలకు కూడా చెబుతారు. సమాజ్ సందడి!! ముస్లిం సోదరులు తమ జీవితంలో నమాజ్ ను కూడా భాగంగా చేసుకుని ఉంటారు. అయితే రంజాన్ మాసంలో మాత్రం నమాజ్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. సాధారణంగా కొందరు రోజులో రెండు లేదా మూడు సార్లు నమాజ్ చేసుకుంటారు కానీ రంజాన్ మాసంలో మాత్రం అయిదు సార్లకు తగ్గకుండా నమాజ్ చేయడం తప్పనిసరి. నమాజ్ కు ముందు వజూ చేయడం పరిపాటి. వజూ అంటే ముఖం, కాళ్ళు, చేతులు మూడుసార్లు నీటితో శుద్దిచేసుకోవడం.  ఇందుకోసం మసీదు లలో ప్రత్యేకంగా చిన్న చిన్న నీటి సరస్సులు, ఏర్పాటు చేయబడి ఉంటాయి కూడా. సుర్మా….. సొగసు!! నిజానికి సుర్మా అనేది ముస్లిం సోదరులు జీవితంలో ఒక అలంకరణ అంశంగా మాత్రమే కాకుండా అదొక భక్తి భావనగా కూడా చూస్తారు. నమాజ్ చేసుకోవడానికి ముందు వజూ చేసి, కళ్ళకు  సుర్మా పెట్టుకోవడం తప్పనిసరిగా రంజాన్ మాసంలో చేస్తారు. కళ్ళకు కాటుక లాగా పౌడర్ రూపంలో ఉండే నల్లని సుర్మా ఎంతో అందంగా ఉంటుంది. ఇంకా దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముస్లిం సోదరులు అవధూతగా భావించే మహమ్మద్ ప్రవక్త సుర్మాను ఎప్పుడూ పెట్టుకునేవారని, అందుకే రంజాన్ మాసంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెబుతారు. ఇంటికి వచ్చిన అతిథులకు అందమైన భరణి లలో సుర్మాను, అత్తరును బహుమతిగా ఇవ్వడం ముస్లిం సోదరులు ఆచారం కూడా. చివరి శుక్రవారం మీతోటి ముస్లిం సోదరులకు సహకరించండి మరి. పండుగ, సంబరం, సందేశం అందరివీ మరి.                             ◆వెంకటేష్ పువ్వాడ.

వ్యక్తిత్వం గొప్పగా ఉండాలంటే ఈ రెండూ దూరం పెట్టాలి!

మనిషిని గొప్పగా నిలబెట్టేది వారి వ్యక్తిత్వమే.. కానీ ఈ కాలంలో మనుషుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారి వ్యక్తిత్వపు విలువను తగ్గించేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ కింది రెండు మనిషిని ఎంత నీచంగా తయారు చేయాలో.. అంత నీచంగా చేస్తాయి. వీటిని దూరంగా  ఉంచడం మంచి వ్యక్తిత్వానికి అవసరం..  ఓర్వలేనితనం.. ఒకరిని చూసి మనం ఓర్వలేకపోతున్నామంటే, మనల్ని మనం హీనపరచు కుంటున్నామని అర్థం. అది పూర్తిగా మన ఆత్మన్యూనతా భావానికి (Inferiority complex) చిహ్నం. ఈ అసూయ పొడ చూపిన క్షణం నుంచి మనలో మానసిక అలజడి మొదలవు తుంది. అది క్రమంగా మన ప్రశాంతతను హరించి వేసి మన శక్తులన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మన విచక్షణను కూడా కోల్పోయేలా చేస్తుంది. ఎదుటి వ్యక్తి మనకు శత్రువన్న భ్రమను కల్పించి, ప్రతీకార జ్వాలల్ని రగిలిస్తుంది. నలుగురితో కలసి ఆహ్లాదంగా ఉండలేని పరిస్థితిని సృష్టిస్తుంది. అందుకే స్వామి వివేకానంద అంటారు 'Jealousy is the bane of our national character, natural to slaves. Three men can not act in concert together in India for five minutes!' నిజమే, అసూయ బానిసల స్వభావం. అది జాతి స్వభావాన్నే విషపూరితం చేసి, నిర్వీర్యపరుస్తూ ఉంది. భారత దేశంలో ముగ్గురు వ్యక్తులు కలసికట్టుగా అయిదు నిమిషాలైనా పనిచేయలేరు. ఒక కళాకారుడు, మరో కళాకారుడిని మన స్ఫూర్తిగా అభినందించలేడు. ఒక రచయిత మరో రచయిత పుస్తకాన్ని ఆసక్తిగా చదవలేడు. ఒక సంగీత విద్వాంసుడు మరో సంగీతజ్ఞుడి గానాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేడు! ఇలా, ఇక ఎంత విద్వత్తు ఉంటే ఏం లాభం?. చాలా సభాకార్యక్రమాలకు చాలా మంది కళాకారులు ఒకరిని పిలిస్తే, మరొకరు మేము రామని నిరాకరిస్తున్న సందర్భాలు కోకొల్లలు. కుళ్ళుకుంటే కుమిలిపోతాం..  అసూయ యుక్తాయుక్త విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. నిజానికి ఎవరి ప్రతిభ వారిదే! ఎవరి ప్రాధాన్యం వారిదే! మనం కుళ్ళుకొని కుమిలిపోయినంత మాత్రాన ఒకరిది మన సొంతం కాదు. పైగా మానసిక అనారోగ్యానికి గురిచేస్తుంది. ఎదుటివారిని చూసి ఉడుక్కునే కన్నా, వారు ఆ స్థాయికి చేరుకోవటానికి పడిన శ్రమను గుర్తించి, అనుసరించాలి. తన వైభవాన్ని చూసి ఓర్వలేక, తరచూ అవమానపరిచే మామ దక్షుడి మానసిక స్థితిని విశ్లేషిస్తూ, తన సతీదేవి పార్వతితో శ్రీమద్భాగవత సప్తమస్కంధంలో పరమశివుడు అంటాడు 'అహంకారమూ, దోషములు లేనివారు కావడం చేత సజ్జనులకు ఘనకీర్తి లభిస్తుంది. అలాంటి కీర్తి, తమకూ దక్కాలని కొందరు కోరుకుంటారు. కానీ వారు అసమర్థులు కావడం వల్ల వారికి కీర్తి రాదు. అందుచేత మనస్సులో కుతకుత ఉడికిపోతారు'.  ఈ రెండింటిని మనిషి తనకు ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మంచిది. అదే మనిషి వ్యక్తిత్వాన్ని గొప్పగా మారుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.

తృప్తికరమైన రోజు ఎలా సాధ్యమో తెలుసా?

సృష్టిలోని ప్రాణుల్లోకెల్లా మానవ జన్మ అత్యంత మహిమన్వితమైనది. మానవ జన్మ అనేది ప్రతి మనిషికీ ఒకే ఒక్క సారి వచ్చే పరమాద్భుత అవకాశం. ఈ విషయం అంద రికీ తెలిసికూడా ఎందుకు తమ జీవితాలను సార్థకత వైపుకు మళ్ళించలేకపోతున్నారు? ప్రపంచంలో ఉన్న 64 కళలను నేర్పడానికి మనకు రకరకాల విద్యాలయాలు, శిక్షణా శిబిరాలూ ఉన్నాయి. కానీ! జీవితమును జీవించడమనే మహాత్భుతమైన కళను నేర్పించడానికి ఎటువంటి శిక్షణాలయాలూ లేవు. ఎందుకంటే జీవితం ఎవరో ఉదాహరణలతో నేర్పించే పాఠం కాదు. నేర్చుకోవడానికి. ఒకమనిషి జీవితంలో ప్రతి ఒక్క రోజూ ఒక సరికొత్త నూతన అధ్యాయమే. ప్రతి ఒక్కరి జీవితమూఓ సరిక్రొత్త పుస్తకమే. ఎవరి జీవితమూ మరొకరి జీవితంలా ఉండబోదు. ప్రతి పుస్తకమూ మరొక పుస్తకంలా ఉండదు. సరిగ్గా, ఈ విషయాన్నే మనం అవగాహన చేసుకోవాలి. మనం ప్రతి రోజునూ, ప్రతి నిముషాన్నీ అరుదైన అనుభవాలనూ, అనుభూతులనూ ఆస్వాదించడానికే వచ్చాం. మనం జీవించాలే గానీ ప్రతి నిముషం ఓ సరిక్రొత్త అనుభవాన్ని చవిచూడవచ్చు. మీ ఒక్క రోజు జీవితాన్ని ఓ నాటకం లేదా ఒక సినిమా అని భావించుకుంటే, ఈ చ లన చిత్రంలోని ప్రతి సన్నివేశమూ ఎన్నో మలుపులతోనూ, ఎన్నో గెలుపు ఓటములతోనూ నిండి ఉంటుంది. ఒక చలన చిత్రాన్ని జనరంజకంగానూ. అబ్బురపరిచే కథనంతోనూ తెరకెక్కించడానికి దర్శకుడు ఎంతగానో కృషి చేస్తాడు. ప్రతీ సన్నివేశాన్నీ, కలకలిసిన అనుభవాలతో, ఉత్సాహాలతో, ఉల్లాసాలతో మేళవించి ఓ గొప దృశ్యకావ్యంలా మలుస్తాడు. ఇకపై మీరు మీ జీవితమనే చలన చిత్రానికి దర్శకులు, కథానాయకులుగా ఉండండి. ప్రతి రోజూ మీ చలన చిత్రంలోకి గమ్మతైన దృశ్యాలను తెరకెక్కించండి. ఒక క్షణం కూడా విసుగూ, చిరాకు లేని కథనాన్ని ఆవిష్కరించండి. ప్రతి సన్నివేశాన్నీ అత్యద్భుతంగా తీర్చిదిద్దండి. ప్రతి రోజునూ ఓ అద్భుతమైన చలన చిత్రంలా, ఓ అపురూప దృశ్య కావ్యంలా నిర్మించండి. కానీ! ఈ రోజు మీ చలన చిత్రం ఉన్నట్లు, రేపటి చలన చిత్రం ఉండకూడదు. రోజుకో క్రొత్తకథ, రోజుకో క్రొత్త అనుభూతి, రోజుకో క్రొత్త సంచలనాలతో మీ జీవితాన్ని విలువైన దృశ్య కావ్యాల్లా మార్చుకోండి. ఒక మనిషి రోజులోని 24 గంటల సమయాన్ని సంతృప్తిగా, లాభదాయకంగా జీవించడం నేర్చుకోవడమే జీవించే కళ అంటే.  మీ ప్రతి రోజునీ మీరు క్రొత్త జన్మలా భావించగలిగితే మీరు ఈ పనిని సులభంగా చేయగలుగుతారు. రోజులో ఉదయం పుట్టినట్టు, రాత్రికి మరణించినట్టు భావించాలి. ఇలా చేస్తే   సరిక్రొత్త  చావుపుట్టుకల మధ్యన ఉన్న విలువైన సమయాన్ని సంపూర్ణంగా జీవించగలుగుతారు. ఇంతటి గొప్ప కాలాన్ని వ్యర్థంగా ఆవిరి చేసుకోకూడదని గ్రహిస్తారు. మనం ప్రతి నిముషాన్నీ  సంపూర్తిగా జీవించడానికే వచ్చామన్న సృహ కల్గి ఉండాలి.  పుట్టిన బిడ్డను పొత్తిళ్ళలోకెత్తుకొని తండ్రి ఆ బిడ్డను చూసి ఎంత మధురానుభూతిని పొందుతూ తన్మయత్వం చెందుతాడో, అలాగే మీ కోసం జన్మించిన మరో రోజును చూసి మీరు అలాంటి తథాత్మ్యాన్నే పొందడి. ప్రతి రోజునూ మీ చంటి బిడ్డగా భావించి, జాగ్రత్తగానూ, ప్రేమతోనూ పెంచిపోషించండి. మనకు ప్రతి దినం ఓ క్రొత్త జన్మ. ఈ 24 గంటల జన్మ కాలంలో మనం గ్రహించగల్గినంత సంవృద్ధిని ఈ ప్రకృతి నుండి గ్రహిద్దాం.. అనుభవించగల్గినంతటి క్రొత్త అనుభవాలను అనుభూతి చెందుదాం. లెక్కలేనన్ని అవకాశాలను సృష్టించి మరింత జీవితపు ఉత్పాదకతను పెంచుకుందాం. ప్రతి రోజూ సాయంత్రానికల్లా ఓ గొప్ప జీవితాన్ని జీవించామనే మహా తృప్తిని మనం పొందగల్గుదాం.                                                    ◆నిశ్శబ్ద.

మీకూ ప్రపంచంలో చెడు కనబడుతోందా?? కారణమిదే..

మన మనోస్థితే మన చుట్టూ ఉన్న ప్రపంచ స్థితిని నిర్ణయిస్తుంది. మనోస్థితి మారితే, ప్రపంచ స్థితి కూడా విధిగా మారితీరుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ చేయాల్సిందేమిటంటే… మిమ్మల్ని మీరు పవిత్రీకరించుకోవాలి. అలా చేస్తే గనుక  ప్రపంచం కూడా తప్పక పరిశుద్ధమౌతుంది. ఈ విషయాన్నిపూర్వం నుండి భోధిస్తూనే ఉన్నారు. అయితే దాన్ని పూర్వంకంటే ఇప్పుడు ఎక్కువగా బోధించాల్సి ఉంది. సందుకంటే.. ఇరుగుపొరుగు వారి విషయాలలో మన ఆసక్తి పెరిగిపోతోంది. సొంత విషయాలలో ఆసక్తి తగ్గిపోతోంది. మనం మార్పు చెందితే ప్రపంచం కూడా మార్పు చెందుతుంది. మనం పరిశుద్ధులమైతే, లోకం కూడా పరిశుద్ధమౌతుంది.  ప్రతి ఒక్కరూ ఒక ప్రహన వేసుకోవాలి.  ఇతరులలోని చెడును నేనెందుకు చూడాలనేదే ఆ ప్రశ్న. నేను చెడిపోయి ఉంటేనే గాని ఇతరులలోని చెడును చూడలేను. నాలో బలహీనత లేకపోతే నాకు దుఃఖం కలుగదు. నేను పసివాడిగా ఉన్నప్పుడు నాకు దుఃఖాన్ని కలుగించినవి. నన్నిప్పుడు దుఃఖపెట్టలేవు. మనస్సు మారింది కాబట్టి, ప్రపంచం కూడ తప్పక మారుతుందని వేదాంతం వక్కాణిస్తుంది. ఇలా మనోనిగ్రహాన్ని సాధించిన వ్యక్తిపై బాహ్యమైనది ఏదీ ప్రభావం చూపలేదు. అతడికి ఇకపై కూడా ఎలాంటి బంధం ఉండదు. అతడు స్వాతంత్ర్య మనస్కుడు అవుతాడు. అలాంటివాడే ప్రపంచంలో చక్కగా జీవించగలిగిన సమర్థుడు అవుతాడు.  లోకాన్ని గురించి రెండు విధాలైన అభిప్రాయాలు గల వ్యక్తులు సాధారణంగా కనిపిస్తారు. కొంతమంది నిరాశావాదులై ప్రపంచం ఎంత ఘోరం! ఎంత దుష్ట అని అంటుంటారు. మరికొంతమంది ఆశావాదులై ప్రపంచం ఎంత చక్కనిది! అద్భుతమైనది! అని అంటుంటారు. మనోనిగ్రహాన్ని సాధించని వారికి ప్రపంచం చెడ్డదిగా తోస్తుంది లేదా మంచిచెడుల  మేళవింపు గానైనా అనిపిస్తుంది. మనోనిగ్రహ సంపన్నులమైతే మనకు ఈ ప్రపంచమే ఆశాజనకమై కనబడుతుంది. అప్పుడు మనకు ప్రపంచంలో ఏదీ మంచిగాగాని చెడుగా గాని అనిపించదు. అన్నీ సర్వం సరైన స్థానంలో ఉన్నట్లు అదంతా సమంజసమే అన్నట్టు అగపడుతుంది. ప్రేమా, సౌజన్యమూ, పావనత్వమూ మనలో ఎంత పెంపొందితే బయట వున్న ప్రేమాసౌజన్య పాపనత్వాలను మనం అంతగా చూడగలం. పరదూషణ నిజానికి ఆత్మదూషణే. పిండాండాన్ని నువ్వు చక్కబరుచుకొన్నావా (ఇది నువ్వు చేయగల పనే), బ్రహ్మాండం తనంతట తానే నీకు అనువుగా మారుతుంది. ఆదర్శ ద్రవాన్ని అది ఎంత కొద్ది పరిమాణంలో ఉన్నా దానికంటే ఎక్కువ పరిమాణంగల ద్రవంతో సరితూగేటట్లు చేయవచ్చుననే సూత్రంలా ఒక నీటిబిందువు విశ్వంతో సరితూగగలదు. మనలో ఏది లేదో అది మనకు వెలుపల కూడా కనబడదు. చిన్న ఇంజనుకు పెద్ద ఇంజను ఎలాంటిదో విశ్వం మనకు అలాంటిది. చిన్నదాన్లో కనిపించే దోషం పెద్దదాన్లో ఏర్పడే చిక్కును ఊహింపజేస్తుంది. లోకంలో సాధింపబడ్డ ప్రతియత్నమూ నిజానికి ప్రేమచేత సాధింపబడిందే. తప్పులు ఎన్నటం వల్ల ఎన్నడూ ఏ మేలూ ఒనగూరదు. వేలకొద్ది సంవత్సరాలుగా విమర్శనా మార్గాన్ని అనుసరించి చూడటమైంది. నిందల వలన దేనినీ సాధించలేము.  అంటే మనిషి తనలో చెడును, చెడు భావనలను పెంచుకుంటే…  ఈ ప్రపంచంలో కూడా చెడు ఉన్నట్టు, తన చుట్టూ చెడు భావనలు ఉన్నట్టూ అతనికి అనిపిస్తుంది  ఇందులో వింత ఏమి లేదు. చూసే చూపును బట్టి విషయం అర్థమవ్వడం మాములే కదా…                                 ◆ నిశ్శబ్ద.

ఇలా ఆలోచిస్తే… జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకోవచ్చు!

మనకు ప్రతి రోజూ ప్రతి సందర్భంలో ఏదో ఒకటి అవసరం అవుతూ ఉంటుంది. నిజానికి అవసరం అవుతూ ఉంటుంది అనడం కంటే మనకు అది కావాలి, ఇది కావాలి అని అనిపిస్తూ ఉంటుంది అనడం సమంజసం ఏమో… అందరూ తమకు లేనిదాని గురించి, కావలసిన దాని గురించి, సాధించుకోవలసిన దాని గురించి ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ వుంటారు. వాటికోసం ప్రణాళికలు కావచ్చు, వాటిని నెరవేర్చుకునే మార్గాలు కావచ్చు, వాటి గురించి సమాచారం కావచ్చు. ఖచ్చితంగా వాటిని జీవితంలో అవసరం కింద లెక్కవేసుకుని  ఇక వాటిని మనం కచ్చితంగా నెరవేర్చుకోవాలి అన్నంత బలంగా వాటి కోసం ఆలోచిస్తారు.  అయితే మన దైనందిన జీవితంలో మనలో ఎవరికైనా ఏమీ లేని దాని గురించి ఆలోచించడానికి సమయం ఉందా? ఏమీ లేకపోవడం అంటే ఏంటి అని సందేహం అందరికీ వస్తుంది. ఏమి లేకపోవడం అంటే మనకు అవసరం లేని,  మనకు సంబంధంలేని విషయం గురించి ఆలోచించడం అని అర్థం. అలా ఆలోచించే తీరిక ఎవరికైనా ఉందా అని అడిగితే… చాలామంది "దాని గురించి ఆలోచించే తీరిక నాకు ఒక్కక్షణం కూడా లేదు" అని చెబుతారు.  సమయం, పని, మరి ఇతర కారణాల వల్ల ఇప్పటి కాలంలో వారు  జీవితంలో చాలా ఒత్తిళ్లకు గురి అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆధునిక జీవితం ఒకప్పటి జీవితం కన్నా చాలా ఒత్తిడితో కూడుకుని ఉంది.  ప్రతి ఒక్కరూ ప్రతిరోజు, ఆరోజంతా చేయాల్సిన పని గురించి ఆలోచించడం, వాటికి తగిన సన్నాహాలు చేసుకోవడం, వాటి కోసం పరుగులు పెట్టడం ఆ పనిని పూర్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేయడం చేస్తారు. అందువల్ల అందరూ ఆనందాన్ని కోల్పోతున్నారు.  ఏమిటిది?? ఇలా పనులు చేయడం వల్ల ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుందా?? అనే ప్రశ్న వేసుకుంటే…. ఇలా ఒక ఆశింపు భావనతో చేసే పనులలో ఆర్థిక పరమైన అవసరాల కోసం చేయడమే ఉంటుంది కానీ మానసిక ప్రశాంతత, మనసుకు తృప్తి లభించే కోణంలో చేసే పనులు ఉండవు.  ఎప్పుడైనా సరే  కేవలం పది నిమిషాలు మీకు కావాల్సి వస్తుంది. దేని గురించి ఆలోచించకుండా అంటే కావలసిన వాటి గురించి, అవసరమైన వాటి గురించి ఆలోచించకుండా కేవలం శూన్యత కోసం సమయం కేటాయించడానికి. అప్పుడు రకరకాల ఆలోచనలు  బుర్రలో తిరుగుతుంటాయి. అలా బుర్రను అవరించుకునే ఆలోచనలను  ఒకటొకటిగా బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో  అలా చేస్తున్నప్పుడు అప్పటి  ప్రస్తుత స్థితిని గమనించడం ప్రారంభిస్తారు. చుట్టూ ఉన్న వాతావరణం ప్రకృతిలోని సూక్ష్మమైన మార్పులు నిశితంగా గమనిస్తే గనుక అవి మిమ్మల్ని సజీవంగా ఉంచుతాయి.చాలామంది ఏదో విషయాలను ఆలోచిస్తూ పర్సధ్యానంగా ఉంటారు. అయితే అలా ఇతర విషయాల వల్ల  పరధ్యానంలో లేనప్పుడు నిజాయితీతో కూడిన స్వచ్ఛమైన  వ్యక్తిత్వం బయటకు వస్తుంది. అప్పుడు ఇతరత్రా వాటి గురించి ఆలోచించడానికి సమయం కూడా ఉండదు.   నిజమైన వ్యక్తిత్వాన్ని  చూసుకున్నప్పుడు అది మనిషికి ఎంతో తృప్తిని, తనలో తాను చేసుకోవలసిన మార్పులను స్పష్టం చేస్తుంది. ఇలా వేరే ఆలోచనలు చేయడానికి సమయం వెచ్చించకపొవడం అనేది సాధారణ జీవితాన్ని అద్భుతంగా  సృష్టించుకునే దిశగా వేసే మొదటి అడుగు అవుతుంది.                                        ◆నిశ్శబ్ద.

మరణాన్ని తెలుసుకోవడం సాధ్యమేనా?

ఈ జీవితంలో మనిషిని వేధించే ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వాటిలో చాలా ప్రశ్నలకు మనిషి సమాధానాన్ని కనుక్కుంటాడు. కనుక్కోవడం అంటే కొత్తగా కనిపెట్టడం కాదు, ఎన్నో చూసి, చదివి, చర్చించి తెలుసుకుంటాడు. ఒక మనిషి పుట్టుకకు గర్భంలో నెలల కాలాన్ని నిర్ణయిస్తూ పుట్టుకను లెక్కిస్తారు. అయితే అందరికీ అంతు చిక్కని ప్రశ్నగా నిలబడేది ఒకటి ఉంటుంది. అదే మరణం. ఈ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా మరణాన్ని జయించడం కుదరదు. కనీసం మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయాలను కూడా ఎవరూ చెప్పలేరు. సైన్స్ పరంగా మనిషి జీవిత కాలాన్ని నిర్ణయిస్తున్నారు కానీ మరణాన్ని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. అయితే అదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరొకవైపు మన భారతీయ యోగుల జీవితంలోకి వెళితే, వారి జీవనవిధానం, వారి యోగా శక్తి గురించి తెలుసుకుంటే మాత్రం మరణాన్ని కూడా నిర్ణయించగల అద్భుతాలు మన భారతీయ యోగులు అని అర్థమవుతుంది.  మునులు, సన్యాసుల గురించి వదిలేస్తే మన యువతకు ఎంతో ప్రేరణ అయిన స్వామి వివేకానంద కాలినడకన మన దేశం మొత్తం ప్రయాణం చేసారు. మన దేశం మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా పర్యటించి చాలా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. హిందూ ధర్మాన్ని, భారతీయ తత్వాన్ని ప్రపంచదేశాలకు వ్యాప్తం చేసినవారు స్వామి వివేకానంద. ఈయన భారతీయ సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక, తాత్విక శాస్త్రాలను తన ఉపన్యాసాలలో ఎంతో గొప్పగా నేటి కాలానికి  చాటి చెప్పారు. విదేశాలలో మన భారతీయ ధర్మాన్ని నిస్సంకోచంగా, నిర్భీతిగా చెప్పినవారు ఈయనే. ఈయన తన  చివరి రోజుల్లో ఆశ్రమంలో గడిపేవారు.  అయితే స్వామీజీ ఒక రోజు పేపర్ మీద ఒక తేదీని రాసి తనతోపాటు ఆశ్రమంలో ఉన్న ఒక యోగికి ఇచ్చారు. ఆ యోగికి ఆ తేదీ గురించి ఏమి అర్థం కాలేదు కానీ ఆ రోజు రానే వచ్చింది, ఆ రోజున స్వామిజీ ధ్యానంలో కూర్చున్నారు. ఆయన్ను అందరూ ఎంత పిలిచినా పలకకపోవడంతో ఆశ్రమ వాసులు వచ్చి పరిశీలించారు.  అంతా పరిశీలించిన తరువాత చివరకు  స్వామీజీ పరమపదించారు అని తెలుసుకున్నారు. ఇలా స్వామి వివేకానంద తన మరణ తేదీని ముందుగానే తెలుసుకున్నారని అర్థం చేసుకోవచ్చు.  ఇక స్వామి వివేకానంద ధ్యానం చేస్తూ మరణించడం అనే విషయం వెనుక కారణం చూస్తే యోగులు ఎప్పుడూ తమ ప్రాణాన్ని ధ్యానంలో ఉండి వెన్నుపూస నిటారుగా ఉంచి, సహస్రారం ద్వారా ప్రాణాన్ని విడవాలని అనుకుంటారు.  నిజానికి ఇక్కడ ఒక విషయం అర్ధం చేసుకోవచ్చు. మనిషి ఎప్పుడూ శరీరాన్ని నాది అనే భావనతో ఉంటాడు. కానీ  ధ్యానంలో ఒక లెవెల్ దాటిన తర్వాత  ఈ శరీరం, నేను ఒకటి కాదని తెలుసుకుంటారు. అలా శరీరం ఆత్మ వేరు వేరు అనే విషయం తెలిసిన తరువాత చనిపోవడం అనే విషయం గురించి పెద్దగా బాధ ఉండదు. అలాగే గొప్ప తత్వవేత్త అయిన జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా తాను చనిపోయేమదు నేను ఇవ్వబోయే చివరి ఉపన్యాసం ఇదే అని ముందే చెప్పారు. అంటే ఆయనకు కూడా అధ్యాత్మికపరంగా తన శరీరాన్ని, తన ఆత్మను వేరు చేసి చూసే భావన స్పష్టంగా తెలిసింది కాబట్టి ముందుగా తన చివరి ప్రసంగాన్ని గురించి చెప్పారు. ఎలా తెలుస్తుంది? మరణం గురించి తెలుసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది.  అయితే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే దీన్ని తెలుసుకోగలం ఎందుకంటే ఇక్కడ ధ్యానం ద్వారా జరిగేది అంతర్గత ప్రయాణం.  బాహ్య ప్రపంచంలో మనిషి కోతిలాగా ఆలోచించినవాడు అంతర్గత ప్రపంచంలో తనని తాను స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. తనని తాను తెలుసుకున్నప్పుడు తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఎలాంటి ఆలోచన లేకుండా చెప్పగలిగే యోగ శక్తి మనిషికి లభిస్తుంది.  అపనమ్మకం కాదు! మనిషి మరణాన్ని కూడా చెప్పవలగడం సాధ్యమేనా?? ఇదంతా ఒట్టి పిచ్చితనం అని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను నేను అని మెలుకువతో ఉన్నప్పుడు మనం అనుకుంటాం కానీ మనం గాఢ నిద్రలో నేను అనేది ఉండదు. నిద్రిస్తున్నామా చనిపోయామా అసలు ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు కానీ ప్రపంచం అనేది అక్కడే ఉంటుంది. అక్కడే అంటే స్థిరంగా ఉంటడం. ఇక్కడ ప్రపంచం ఏమి మారదు కేవలం మనుషులు,మనుషులు చేస్తున్న పనుల వల్ల పరిసరాలు మార్పుకు లోనవుతాయి. ఎప్పుడైతే మెలుకువతో ఉన్నపుడు కూడా నేను అనేది ఉండదో అప్పుడు మనకు ఒక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. ఆ ప్రపంచంలో పుస్తకాలలో చదవని ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది పూర్తిగా చదివి, లేదా సినిమాల ద్వారా చూసి తెలుసుకునేది కాదు. ఇది పూర్తిగా అనుభవపూర్వక ప్రపంచం. అనుభవం ద్వారా ఎవరిది వారికి అర్థమయ్యేది.  పంచభూతాల కలయిక అయిన ఈ ప్రకృతి మనిషిని మాయలో ఉంచినప్పుడు మాత్రమే మనిషి ముందుకు వెళ్తాడు. ఈ ప్రకృతి, బాహ్య జీవితంలో జరిగే విషయలు అన్నీ ఒక నాటకం వంటిది అని తెలిసినప్పుడు మనిషి జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడడు, అందుకోసమే యోగులు విరక్తి లో ఉంటారు.  అయితే ధ్యానం ద్వారా మనిషి తన జీవిత పరమార్థం తెలుసుకున్నప్పుడు తన జీవితాన్ని తన చేతుల్లోనే ఎంతో నిరాడంబరంగా ఆధ్యాత్మిక సాధనలో గడిపేసి చివరికి తన మరణాన్ని తాను తెలుసుకుని దాన్ని ప్రశాంతంగా ఆహ్వానిస్తాడు. ఇదీ మరణాన్ని తెలుసుకునే విధానం. అయితే ఇది కేవలం ధ్యానంలో ఎంతో లోతుకు, మెరుగైన స్థాయికి చేరి, ఈ బాహ్య ప్రపంచ వ్యామోహనికి అసలు లోనుకాకుండా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.

రాజ్యాంగ శిల్పి జయంతి!!

రాజ్యాంగం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు అంబేద్కర్. అందరికీ డా. బి.ఆర్ అంబేద్కర్ గా తెలిసిన ఈయన అసలు పేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14 వ తేదీన పుట్టిన ఈయన భారతీయ చరిత్రలో ఓ సంచలనం. అంటరానితనం, అస్పృశ్యత, ఆర్థికంగా ఎదగలేకపోవడానికి నిరక్షరాస్యతే కారణమని తను ఎంతో ఉన్నత విద్యావంతుడవ్వడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలిచాడు. భారతదేశ రాజ్యాంగానికి రూపునిచ్చి బడుగు వర్గాల జీవితాలలో వెలుగులు నింపడానికి కృషిచేసిన మహనీయుడు ఈయన. అంటరాని బాల్యం!!  నిజంగా మనిషికి డబ్బున్న కూడా గౌరవం లేని కాలంలో అంబేద్కర్ పుట్టాడు. ఈయన తండ్రి బ్రిటిష్ వారి దగ్గర సుబేదారుగా పనిచేసేవాడు. ఆర్థికంగా మరీ అంత కష్టాలు ఏమీ ఉండేవి కాదు. కానీ చుట్టూ ఉన్న అగ్రవర్ణాల వారి నుండి సమస్యలు ఎదుర్కునేవాళ్ళు. ఎవరూ ముట్టుకునేవాళ్ళు కాదు, అందరూ ఉపయోగించే వస్తువులు ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు.  దానికోక చిన్న ఉదాహరణ:- బడిలో నీళ్లు తాగాలి అంటే చెత్త ఊడ్చే అతను ప్రత్యేకంగా వీళ్లకు ఇచ్చేవాడు. అందరితో కలిసి ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు.  అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే "ఈరోజు చెత్త ఊడ్చే అతను లేడు. అందుకే తాగడానికి నీళ్లు లేవు" బాల్యంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న అంబేద్కర్ మహాశక్తిగా ఎదగడం వెనుక ఉన్నది కేవలం అక్షరాస్యత అంటే ఆశ్చర్యం వేస్తుంది. విద్య మనిషిని ఎంత గొప్పగా తయారుచేస్తుందో అర్థమవుతుంది. భారతదేశంలో ఉన్న విద్యాధికుల పేర్లు రాయాల్సి వస్తే అంబేద్కర్ పేరు ఎంతో గర్వంగా రాయచ్చు.  ఎంతో గొప్ప విశ్వవిద్యాలయాలలో పట్టాలు పుచ్చుకుని గొప్ప న్యాయవాదిగా మారినవాడు అంబేద్కర్. దళిత మహాసభతో మలుపు!! 1927 సంవత్సరంలో జరిగిన దళిత మహాసభ ఓ గొప్ప మలుపు అనుకోవాలి. చెరువులో నీటిని ముట్టుకునే అనుమతి కూడా లేని సందర్భంలో ప్రజలలో చైతన్యం నింపి ఆ చెరువు నీటిని అందరూ స్వీకరించేలా చేశారు ఈయన. ఆ తరువాత బహిష్కృత భారతి అనే పత్రిక స్థాపించాడు. ఆ పత్రికలోనే ఒక వ్యాసంలో అంబేద్కర్ ఇలా పేర్కొన్నారు. "తిలక్ గనుక అంటారానివాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మహక్కు అని కాకుండా అస్పృశ్యతా నివారణ నా ద్యేయం, అదే నా జన్మహక్కు అని నినదించి ఉండేవాడేమో" అని. ఆ మాటలు చూస్తే అంబేద్కర్ తన జీవితంలో కులవివక్షత వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే బడుగు వర్గాల వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నప్పుడే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని ఈయన విశ్వసించాడు. భారతజాతీయ కాంగ్రెస్ లో దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు తీసుకురావడం కోసం ఎంతో పోరాటం చేసి చివరకు విజయం సాధించాడు. రాజ్యాంగ రూపకల్పన!! నిజానికి రాజ్యంగం రూపొందించడానికి ఏడు మంది సభ్యులను నియమిస్తే అంబేద్కర్ తప్ప మిగిలిన అందరూ వివిధ కారణాల వల్ల రాజ్యాంగ పరిషత్తుకు దూరమయ్యారు. అందువల్ల అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి నడుం బిగించాడు. ఈయన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అవ్వడం వల్ల రాజ్యాంగంలో బడుగు వర్గాల వారు బలపడేందుకు రిజర్వేషన్లను  పొందుపరిచారు.  ఎంతోమంది రిజర్వేషన్ల మూలంగా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యారు. అందుకే ఈయన బడుగు వర్గాల వారి పాలిట దేవుడయ్యాడు. మతమార్పిడి మరణం!! అంబేద్కర్ గారు దళిత వర్గం నుండి క్రిస్టియానిటిలో చేరారని ఆయన క్రైస్తవం పుచ్చుకోవడం వల్ల ఎంతోమంది దళితులు క్రైస్తవం వైపు దృష్టి పెట్టడం అందరికీ తెలిసిందే. అయితే అంబేద్కర్ గారు దళిత వర్గం నుండి క్రైస్తవం లోకి వెళ్ళలేదు అనేది నిజం. ఆయన ఎంతో ప్రాచీనమైనది, హిందూ మతానికి దగ్గరగా ఉన్నది అయిన భౌద్ధ మతంలోకి మారారు. ఈయన 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. భారతదేశానికి ఈయన అందించిన సేవలకు భారతరత్న ప్రకటించి విశ్వాసం నిలుపుకుంది భారతప్రభుత్వం. ప్రభావం!! భారత రాజకీయాలపై, విద్యార్ధులపై, దిగువ తరగతి వర్గాల వారిపై మాత్రమే కాకుండా విద్యావంతులపై కూడా అంబేద్కర్ ప్రభావం ఎంతో ఉంది. ఫలితంగా ఆయన ఎన్నో విధాలుగా అందరినీ ప్రభావం చేశారు. అది పరిస్థితులను అధిగమించి విద్యావంతుడుగా మారడం కావచ్చు, బడుగు జీవితాల కోసం శ్రమించడం కావచ్చు, రాజ్యాంగ కర్తగా కావచ్చు. ఏది ఏమైనా భారత రాజ్యాంగం నిలిచి ఉన్నంతవరకు దాన్ని లిఖించిన అంబేద్కర్ కూడా భారతావనిలో నిలిచే ఉంటాడు. ఓ ప్రభావితుడుగా…... ఓ ఆర్థిక వ్యూహకర్తగా…… ఈయన రచించిన పలు గ్రంథాలే వాటికి నిదర్శనాలు మరి.                                 ◆వెంకటేష్ పువ్వాడ.