మూలాల ముంగిలికి లాక్కెళ్లే పండుగ.. సంక్రాంతి..!

  పండుగ అంటే అదొక  ఆనందం.  చదువులు, వృత్తి, ఉద్యోగం, సౌకర్యాలు.. ఇలా కారణాలు ఏవైనా సరే..  పట్టణంలో ఉన్నవారు పండుగ వచ్చిందంటే చాలు పల్లె బాట పడతారు. తెలుగు వారు ఎంతో సంబరంగా చేసుకునే పండుగలలో సంక్రాంతికి ఓ రేంజ్ ఉంది.  భోగి, సంక్రాంతి, కనుమ.. పేరిట ముచ్చటగా మూడురోజులు జరిగే ఈ పండుగ వైభోగం గ్రామాలలో మాత్రమే కనిపిస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు..  పొంగళ్లు, పిండి వంటలు.. పశువుల అలంకరణ,  కోడి పందేలు.. కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలు.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత.. ఒక్కటనేమిటి? సంక్రాంతి పండుగలో లేనిదంటూ ఏదీ లేదు.. భోగి మంటలు, భోగి పళ్లు.. జనవరి 13వ తేదీన భోగి పండుగ.  ఈరోజు ఉదయాన్నే చలికి సవాల్ విసురుతూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాను నుండి పిడకల హారం వరకు భోగి మంటలలో వేస్తారు.   ఇక ఇదే రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఈ భోగి పళ్లలో చెరకు ముక్కలు,  రేగు పళ్లు,  చిల్లర పైసలు, పువ్వులు ఉంటాయి.  ఇలా భోగి పళ్లు పోయడం వెనుక పురాణ కథనం ఉంది.  భోగి పండుగ రోజే బదరీ వనంలో  శ్రీహరిని పసిబిడ్డగా మార్చి దేవతలందరూ రేగుపళ్లు పోశారట.  బదరీ పళ్లనే రేగు పళ్లు అంటారు.  అందుకే కాల క్రమేణా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఆచారం అయ్యింది.  పిల్లలకు భోగి పళ్లు పోస్తే ఆ శ్రీహరి ఆశీస్సులు ఉంటాయని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. పొంగల్.. సంక్రాంతి.. మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ అయిన సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పొంగళ్ల పండుగ అంటారు. ఈ రోజు సూర్యుడి గమనం మారుతుంది.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మకర రాశిలోకి ప్రవేశిచడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి రోజు పొంగళ్లు వండి నైవేద్యం పెడతారు. చాలా చోట్ల రథం ముగ్గులు వేసి సూర్యుడికి స్వాగతం చెబుతారు.  ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.  కొత్తగా పెళ్లైన వారు ఈ పండుగను అత్తారింట్లో చేసుకోవడం, సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. కనువిందు చేసే కనుమ.. సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజు  రైతులు తమకు పంటలు పండించడంలో సహాయపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పశువులను చాలా మంది తమ కుటుంబంలో భాగంగా చూస్తారు.  పశువులకు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. పశువులకు విశ్రాంతిని ఇస్తారు.  కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో  సంబరాలు చేసుకుంటారు.  కోనసీమ ప్రాంతాలలో కోడి పందెల సందడి సాగుతుంది.  కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారతాయి. కోడి పుంజుల పౌరుషాలు, వాటిలో పోరాట పటిమ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.  సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. పండుగ ఆస్వాదించాలంటే పల్లెకు పోవాల్సిందే..!                           *రూపశ్రీ.

స్టీఫెన్ హకింగ్.. ఒక్క కదలికతో విశ్వాన్ని శోధించిన వీరుడు..!

  వైకల్యం.. మనిషి కొనితెచ్చుకునే సమస్య కాదు. కొందరు పుట్టుకతో వైకల్యంతో పుడతారు.  మరికొందరు ప్రమాదవశాత్తు వైకల్యానికి లోనవుతారు.  అయితే వైకల్యం ఉంది కదా మన వల్ల ఏం అవుతుందిలే అని కొందరు జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు.  ఏదో ఒక విధంగా జీవితాన్ని అలా కానిచ్చేస్తూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం తమ వైకల్యం తమ లక్ష్యాలకు అడ్డు కాదని భావిస్తారు.  జీవితంలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఫలితంగా ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.  అలాంటి వారిలో స్టీఫెన్ హాకింగ్ ఒకరు.  కేవలం ఒకే ఒక కదలికతో ఏకంగా విశ్వాన్ని శోధించిన ఘనుడు ఆయన.  జనవరి 8వ తేదీ స్టీఫెన్ హాకింగ్ జననం.  ఈ సందర్భంగా ఆయన కృషిని గుర్తు చేసుకుంటే జీవితానికి కావలసినంత చైతన్యం లభిస్తుంది. స్టీఫన్ విలియం హాకింగ్..  1942, జనవరి 8వ తేదీన జన్మించారు.  ఈయన ప్రసిద్ధ బ్రిటీష్ సైద్దాంతిక శాస్త్రవేత్త. ముఖ్యంగా విశ్వనిర్మాణ శాస్త్రవేత్త.  ఈయన మరణించే సమయానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నాడు. వైకల్యం.. విధి మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది.  ఆడుతూ పాడుతూ సాగుతున్న సాఫీ జీవితంలో పెద్ద సునామీలా సమస్యలు విరుచుకుపడేలా చేస్తుంది.  స్టీఫెన్ హాకింగ్ జీవితంలో కూడా అంతే.. ఆయనకు 21ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వచ్చింది.  ఇది కాలంతో పాటు పెరుగుతూ పోయింది. క్రమంగా స్టీఫెన్ హాకింగ్ శరీరంలో ప్రతి అవయవాన్ని కబళించింది.  ఆయన శరీరం చచ్చుబడిపోయేలా చేసింది. స్టీఫెన్ హాకింగ్ తన 20 ఏళ్ల వయసులో కాస్మాలజీ, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కు వెళ్ళాడు. అక్కడి వెళ్ళిన తరువాతే ఆయన జీవితం మలుపు  తిరిగింది.  భోజనం చెయ్యాలన్నా, బూట్లు లేసులు వేసుకోవాలన్నా, ఇతర పనులు చెయ్యాలన్నా కూడా శరీరం సహకరించేది కాదు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పరిస్థితి ఆయన కుటుంబం ఆందోళన చెందింది.  వైద్య పరీక్షలు నిర్వహించగా మోటార్ న్యూరాన్ వ్యాధి అనే భయంకరమైన జబ్బు ఉన్నట్టు తేలింది. నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. దీని కారణంగానే తొందరలోనే ఆయన శరీరం చచ్చుబడిపోయింది. అయితే ఆయన మెదడు మాత్రం అద్భుతంగా పనిచేసేది. అంతేకాదు ఆయన ముఖంలో ఒక దవడ ఎముక మాత్రం కదిలేది. ఆ ఒక్క దవడ ఎముక కదలికలే.. స్టీఫెన్ హాకింగ్ ప్రయోగానికి  మూలాధారం.  ఆ దవడ ఎముకకు ఒక పరికరాన్ని అమర్చారు. స్టీఫెన్ హాకింగ్  ఆలోచనలు అన్నింటిని ఆ పరికరం సంభాషణ రూపంలో వ్యక్తం చేసేది.  ఇలా ఆయన శరీరం కదలని స్థితిలో కూడా విశ్వాన్నిశోధిస్తూ తన పరిశోధనలు సాగించాడు. అలాంటి స్థితిలోనే కృష్ణబిలాలకు సంబంధించిన అనేక విషయాలు కనుగొన్నాడు.  1985లో ఆయనకు నిమోనియా వచ్చింది.అప్పటి నుంచీ ఒక చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు.  తన చేతి చిటికెన వేలి కదలికల సాయంతో  ‘వాయిస్‌ సింథసైజర్‌’తో తన ఆలోచనలను శాస్త్ర లోకానికి అందించేవాడు. చిటికెన వేలు కదలికల్ని ఒక హ్యాండ్‌ కంట్రోలర్‌ యంత్రానికి అమర్చిన తెరపై అక్షరాలను స్కాన్‌ చేసే కర్సర్‌ నియంత్రిస్తుంది. ఆయన ఎంచుకున్న అక్షరాల్ని, యంత్రంలోని వ్యవస్థ తనంతట తానే పని చేసే ‘అల్గారిదమ్‌’ సాయంతో మాటలు వాక్యాల రూపంలో తెరపై ప్రదర్శిస్తుంది. ఆయన కృషికి కొందరు మిత్రుల సహకారం కూడా తోడైంది.  కంప్యూటర్‌ ఇంజనీర్‌ డేవిడ్‌ ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్‌ హాకింగ్‌ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్‌ ఆయన ఆలోచనను మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది.  స్టీఫెన్ హకింగ్ ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన గొంతునే  సింథసైజర్ కు అమర్చారు. దాని వల్ల స్టీఫెన్‌ హాకింగ్‌ నేరుగా మాట్లాడినట్టే ఉండేది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా.. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది.                                           *రూపశ్రీ. 

 వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకోవాలి..!

  వివాహం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా కీలకమైన దశ.  ఈ దశలో చాలామంది జీవితాలు మారిపోతుంటాయి. ఈ కాలంలో వివాహం తర్వాత జీవితం ప్రశాంతంగా లేదని చెప్పేవారే ఎక్కువ.  కొందరైతే ఏకంగా విడాకుల వరకు గొడవలను తీసుకువెళుతుంటారు.  మరికొందరు కేసులు, కోర్టులు అంటూ సమస్యలు పెద్దవి చేసుకుంటారు. ఇలాంటి వాటికి ఆచార్య చాణక్యుడు సరైన సలహాలు, సూచనలు ఇచ్చారు. చాణక్యుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని వాటిని పాటిస్తుంటే వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుందట. ఇంతకీ ఇందుకోసం ఏం చేయాలంటే.. ప్రేమ, నిజాయితీ.. ఒక బంధం విజయవంతంగా ఉండాలన్నా,  ఆ బంధం బలంగా మారాలన్నా ఆ బంధంలో ఉన్న వ్యక్తుల మధ్య ప్రేమ, నిజాయితీ ఉండాలి. నిజమైన ప్రేమ, నిజాయితీతో కూడిన ప్రవర్తన బంధాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.  వివాహ బంధంలో ఉన్ వ్యక్తి తన జీవిత భాగస్వామితో ప్రేమగా, నిజాయితీగా ఉంటూ.. జరిగే తప్పొప్పులు,  వచ్చే సమస్యలను అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉంటే జీవితంలో ఒకరిమీద ఒకరికి నమ్మకం బలపడుతుంది.   అహం.. మనిషి జీవితంలో ఏ బంధంలో అయినా అహం అనేది పెద్ద శత్రువుగా మారుతుంది.  ఇది భార్యాభర్తల మధ్య సంబంధం అయితే ఈ అహం అనేది చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది.  బంధంలో చీలికలు సృష్టించడానికి కారణం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం అనేవి లేకుండా చేయడంలో అహం ప్రధాన శత్రువు అవుతుంది. వైవాహిక బంధంలో అహంను పక్కన పెట్టి ఒకరి పట్ల మరొకరు ప్రేమతో, గౌరవంతో ఉండాలి.  ఇలా ఉంటే ఇద్దరు దూరమయ్యే పరిస్థితులే రావు. నిజం.. వైవాహిక బంధంలో నిజం మాట్లాడటం, నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తలు నిజంగా, నిజాయితీగా మాట్లాడితే వారిద్దరూ ఒకరి మీద మరొకరు  గౌరవం కలిగి ఉంటారు. వారి అపార్థాలు కూడా తలెత్తవు. ఎప్పుడూ నిజం మాట్లాడే వ్యక్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.  ఎలాంటి పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కుంటారు. గౌరవం.. నేటి కాలంలో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకోవడం, పురుషహంకారం చూపించడం వంటివి చేయడం వల్ల బంధం చెడిపోతుంది.  భార్యాభర్తలు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవాలి.  భర్త భార్యను బానిసలాను, పని మనిషిలాను ట్రీట్ చేయడం,  తన అధికారాన్ని భార్య మీద చూపడం వంటివి చేయకూడదు. భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ పదిమంది ముందు దోషిగా నిలబెట్టి అవమానించడం మానుకోవాలి.  ఇలా అవమానిస్తే అది సంబంధంలో చీలిక ఏర్పడటానికి దారితీస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇద్దరూ ఎదురుగా  ఉన్నప్పుడు కూర్చుని సామరస్యంగా మాట్లాడుకోవాలి.  భార్యాభర్తలు ఇద్దరూ తమ  సమస్యలను,  తమ ఆలోచనలను, భావాలను, తాము చేయాలనుకున్న పనులను  స్నేహపూరితంగా వివరించి చెప్పాలి.  మాటల్లో ఎలాంటి అపార్థాలు లేకుండా వివరించాలి.  అదే విధంగా భాగస్వామి ప్రతిస్పందనను కూడా అంతే స్నేహపూరితంగా తీసుకోవాలి.  ఇలా ఉంటే భార్యాభర్తలు మాట్లాడుకునే సందర్భాలలో ఎప్పుడూ గొడవలు రావు.                                             *రూపశ్రీ.

యుద్ధం మార్చిన జీవిత కథలు... ప్రపంచ యుద్ధ అనాథల  దినోత్సవం2025..!

  ఈ ప్రపంచం ఇప్పటివరకూ రెండు ప్రపంచ యుద్ధాలని చూసింది. అధికారం కోసమో, అస్థిత్వం కోసమో లేక నాయకుల అహంకారపు విధానాల వల్లనో రోజూ ఏదో మూలన చిన్నదో, పెద్దదో యుద్ధం జరుగుతూనే ఉంటుంది.. మనం వింటూనే ఉంటాము. కానీ  మనలో చాలామంది ఆలోచనలు యుద్ధంలో  ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఏ సైనికులు, ప్రజలు ఎంతెంతమంది  చనిపోయారు? అనే ప్రశ్నల దగ్గరే ఆగిపోతాయి.. కానీ, ఆ యుద్ధాలవల్ల కొందరి బ్రతుకులు ఒక్క రోజులోనే చీకట్లోకి నెట్టివేయబడుతున్నాయన్న విషయం  మనమంతా మర్చిపోతుంటాము. ఎవరివి ఆ జీవితాలు అనుకుంటున్నారా... ఇంకెవరివి!! దేశ రక్షణ కోసం ప్రాణాలు ధారబోయటంతో  అనాథలైన   సైనికుల పిల్లలవి..  అలాగే జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ బాంబో వచ్చిపడి అందరూ చనిపోయి అనాథలుగా మిగిలిపోయిన సామాన్య ప్రజల పిల్లలవి.... ఇటువంటి వారి పరిస్థితి ఏమిటా అని ఎప్పుడైనా ఆలోచించారా?.. ఆలోచిస్తేనే భయంగా ఉంది కదా..!  మరి వారి భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తారు?. ఇలా ప్రపంచ యుద్దం కారణంగా అనాథలైన పిల్లల గురించి అనాథల గురించి ఆలోచించే దిశగా ప్రజలను చైతన్యం చేసేదే ప్రపంచ యుద్ద అనాథల దినోత్సవం.  దీని గురించి తెలుసుకుంటే.. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం ఎప్పుడు మొదలైంది.... యుద్ధం వల్ల అనాథలైన  సైనికుల పిల్లల గురించి ఆలోచించి వారి కోసం మొదటగా అనాథాశ్రమాలు ఏర్పాటు చేసిన  ఘనత రోమన్లకి దక్కుతుందని చరిత్ర చెబుతుంది. అయితే   ఆధునిక ప్రపంచంలో  ప్రస్తుత   యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం,  అనాథలైన  పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఎదుర్కొనే మానసిక, సామాజిక,  శారీరక ఆటంకాలను గుర్తు చేయడం కోసం   ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డిట్రెసెస్’ అనే ఫ్రెంచ్ సంస్థ ఈ ప్రపంచ యుద్ధ అనాథల  దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి6 న జరపడం మొదలుపెట్టింది.  ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు వేదికను అందించడం, వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ, ప్రభుత్వాల దాకా అందరినీ  ఇందులో భాగం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథల హక్కులు, సమస్యలు గురించి పోరాడేలా చేయటం, వారి భవిష్యత్తుకి మంచి పునాది వేయటమే దీని ఉద్దేశ్యం.    ఎందుకు జరుపుకోవాలి.... యూనిసెఫ్ ప్రకారం, 1990 నుంచి 2001సంవత్సరాల మధ్య జరిగిన యుద్ధాల కారణంగా  అనాథల సంఖ్య విపరీతంగా పెరిగింది.  ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్లకుపైగా అనాథలు ఉన్నారు.  2001 నుంచి ప్రతి సంవత్సరం 0.7 శాతం అనాథల సంఖ్య తగ్గుతున్నప్పటికీ అది చెప్పుకోతగ్గ  మార్పెమీ  కాదు. పైగా  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,  ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం,  కొత్తగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రగులుతున్న చిచ్చు వంటి   ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు చూస్తే  అనేక మంది పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం పడుతుందని అనిపిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంత మంది అనాథ పిల్లలు  నిర్లక్ష్యం చేయబడకుండా ఉండటం కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జరుపుకోవాలి. అటువంటి అనాథ  పిల్లలు జీవితంలో ఎదుర్కునే అన్ని సమస్యలను  గుర్తు చేసుకోవడం కోసం, అలాగే ఈ ప్రపంచంలో ఎవరూ ఇలా అనాథలుగా మిగలకుండా, యుద్ధం లేని ప్రపంచ స్థాపన కోసం కృషి చేయటంలో అందరి బాధ్యతని  గుర్తు చేయటం కోసం  ఈ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుద్ధాలవల్ల పిల్లలకి జరుగుతున్న అన్యాయం.. యుద్ధ కాలంలో పిల్లలపై జరుగుతున్న అన్యాయాలని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గుర్తించి, వాటిని నివారించాలని ప్రపంచ దేశాలకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. పిల్లలకు మానవతా సహాయం అందకుండా చేయటం  పిల్లలను కిడ్నాప్ చేయటం,  చంపేయడం,  బలాత్కారం లేదా ఇతర తీవ్రమైన లైంగిక హింసకి పాల్పడటం.  స్కూల్ల్స్, హాస్పిటల్ల మీద దాడులు చేయడం వంటి ఎన్నో  అన్యాయాలు జరుగుతున్నాయి. ఇంకా దారుణంగా పిల్లలని సాయుధ దళాల్లో  లేదా రెబల్ గ్యాంగుల్లో చేర్పించి వాళ్ళని  అక్రమ కార్యాలకి ఉపయోగించుకోవటం కూడా చేస్తున్నారు.  ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే  ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవ వేదికగా ప్రజలందరూ ప్రశ్నించి, నిలదీయాలి. ఒకవేళ వ్యవస్థలు, ప్రభుత్వాలు ఇటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తే, వారు మన సమాజంలో ఉన్న అసాంఘిక, ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి చిక్కి, తప్పుడు దారిలో నడుస్తారు. అది మన సమాజానికి, ప్రపంచానికి మంచిది కాదు. మన సమాజంలో ఏ ఒక్క వ్యక్తీ నిర్లక్ష్యం చేయబడకూడదు, పైగా సర్వస్వం కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు అస్సలు నిర్లక్ష్యం చేయబడకూడదు.                                             *రూపశ్రీ.

జీవితం సంతోషంగా సాగాలంటే ఇవి ముఖ్యం..!

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు.  సంతోషంగా ఉంటే జీవితంలో చాలా సమస్యలు జయించవచ్చు. కానీ సంతోషంగా ఉండనీయకుండా చేసే సందర్బాలు,  సమస్యలు చాలా ఉంటాయి. మరీ  ముఖ్యంగా సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని ఆలోచనతో, తెలివిగా ఎదుర్కోవాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు గందరగోళంలో, ఒత్తిడిలో ఉంటే సంతోషం అనే మాట దూరంలోనే ఉండిపోతుంది.  జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనసును, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే.. శ్వాస.. శ్వాస అనేది ప్రతి క్షణం, ప్రతి మనిషిలో జరిగే అసంకల్పిత చర్య.  అయితే శ్వాస వ్యాయామాలు మనిషిని సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు చేస్తుంటే.. ముఖ్యంగా లోతైన శ్వాస వ్యాయామాలు చేస్తే ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి నియంత్రణలోకి వస్తుంది.  మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆహారం.. ఆహారం శరీరానికి శక్తి వనరు. అయితే ఆహారం తినే విధానం మనసును ప్రభావితం చేస్తుంది. మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతోంది. అంటే మనసు పెట్టి ఆహారాన్ని శ్రద్దగా తినడం.  తినేటప్పుడు ఆహారాన్ని ఆస్వాదించడం.  ఆహారం వాసన,  ఆహారం ఎలా ఉంది అని దాన్ని మనసుతో పరిశీలించి తినడం.  ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా తృప్తిని ఇస్తుంది. నడక.. నడక చాలామంది చేసే వ్యాయామంలో భాగం. అయితే నడిచేటప్పుడు నడకను కూడా పరిశీలించాలి. నడిచేటప్పుడు పాదాల కదలిక, అడుగులలో లయ మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు వాకింగ్ చేయడంలో లవ్ లో పడతారు. ఇది మనసుకు చాలా తృప్తిని ఇస్తుంది. శ్రద్ద.. శ్రద్దగా ఏ పనిని అయినా చేస్తే ఎంత పరిపూర్ణ ఫలితాలు వస్తాయో.. ఇతరులు ఏదైనా చెప్పేటప్పుడు అంతే శ్రద్దగా వెంటే వ్యక్తులతో బంధాలు బాగుంటాయి.  శత్రుత్వం లేకుండా స్నేహభావంతో కూడిన బంధాలు ఉంటే మనసుకు ప్రశాంతత, జీవితంలో సంతోషం లభిస్తాయి. పని.. నేటి కాలంలో చాలామంది మల్టీ టాస్కర్లే.. ఇది మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది.  జీవితంలో సంతోషం కావాలంటే మల్టీ టాస్కింగ్ ను పక్కన పెట్టి సింగిల్ టాస్క్ లను చేస్తూ ఉండాలి. పైగా మల్టీ టాస్క్ చేసేటప్పటితో పోలిస్తే.. సింగిల్ టాస్క్ చేసేటప్పుడు పని మీద ఎక్కువ శ్రద్ద పెట్టడం, పనిని చాలా బాధ్యతగా ఆసక్తిగా పూర్తీ చేయడం దాని ఫలితాలు కూడా మెరుగ్గా ఉండటం గమనించవచ్చు.  ఇవి జీవితంలో సంతోషాన్ని మెరుగు పరుస్తాయి. కమ్యూనికేషన్.. ఇతరులతో కమ్యూనికేషన్ బాగుంటే  చాలా వరకు ప్రశాంతంగా ఉండవచ్చు.  వ్యక్తిగతంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా కమ్యునికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తులతో బంధాలు మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది. అలసట.. అలసట మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది. అందుకే ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని ఒకే పని చేయకూడదు.  పని నుండి అప్పుడప్పుడు కాస్త దృష్టి మరల్చడం,  రిలాక్స్ అవ్వడం మనిషిని అలసటకు లోను కానీయవు.                                                *రూపశ్రీ.  

అంధత్వపు అడ్డుగోడలని కూల్చేసిన ఘనుడు.... ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం2025

  ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న సామెత అందరికీ తెలిసిందే. దీనర్ధం ఇంద్రియాలన్నింటిలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని. అలా ఎందుకన్నారంటే  మనిషి తన జ్ఞానంలో  80 శాతందాకా కళ్ల ద్వారా చూసి నేర్చుకోవటంవల్లనే పొందుతాడు. కంటిచూపున్నవారు కళ్ళతో చూసి, చదివి విద్యావంతులై జీవితంలో స్థిర పడతారు. మరి రోజువారీ జీవితంలోనే ఎన్నో ఇబ్బందులు పడే అంధులెలా చదువుతారు? చదవాలనే తపన వాళ్ళలో ఉన్నా కూడా వారికున్న వైకల్యమే వారిని వెక్కిరిస్తుంది. కానీ, అంధుల  భవిష్యత్తుని పూర్తిగా మార్చేసే  తన ఆవిష్కరణతో వారికి ఒక ఆశాకిరణంలా నిలిచాడు ఫ్రెంచ్ విద్యావేత్త, ఆవిష్కర్త అయిన లూయీ బ్రెయిలీ. ఆయన  చేసిన సేవలకి గుర్తింపుగా ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటారు. చీకటికి అక్షరాలతో చూపును ఇచ్చి.. ప్రపంచంలో ఉన్న అంధుల జీవితాలలో వెలుగులు నింపిన లూయీ బ్రెయలీ గురించి తెలుసుకుంటే.. లూయీ బ్రెయిలీ ఎవరు…. లూయీ బ్రెయిలీ  1809,  జనవరి 4న ఫ్రాన్స్‌లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి సైమన్-రెనె బ్రెయిల్ రాచరిక గుర్రాలకు పగ్గాలు, సాడిల్స్ తయారు చేసే పని చేస్తుండేవారు. అయితే, మూడు సంవత్సరాల వయసులో జరిగిన ప్రమాదంలో పాక్షికంగా దెబ్బతిన్న బ్రెయిలీ చూపు, తర్వాత అయిదేళ్లలోపే అతన్ని పూర్తిగా అంధుడిగా మార్చేసింది. అయినాసరే ధైర్యం కోల్పోని ఆయన పారిస్ లోని ఒక అంధుల పాఠశాలకి వెళ్ళి చదువుకుని అసాధారణ ప్రతిభావంతుడుగా గుర్తించబడ్డాడు. అప్పటివరకూ అంధులకి అందుబాటులో ఉన్న ‘’లైన్ టైప్’’ పద్ధతిలోనే కష్టపడి చదువుకుని 17ఏళ్లకే అదే స్కూల్లో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. అక్కడున్నప్పుడే అంధులకి సులువుగా ఉండే లిపి తయారుచేయాలన్న తపన  మొదలైంది.   బ్రెయిలీ లిపి ఆవిష్కరణ ఇలా జరిగింది..... అప్పటి వరకు అంధుల కోసం ఉన్న పుస్తకాల ప్రింటింగ్ విధానాలు సరైనవి కాదనిపించేవి. అందుకే  ప్రొఫెసర్గా పగలు విధ్యార్ధులకి  బోధిస్తూ, రాత్రిళ్ళు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారు చేయటానికి లూయీ బ్రెయిలీ కృషి చేశాడు.  చీకట్లో కూడా  సందేశాలను చదవడానికి అనువుగా 12 ఉబ్బెత్తు చుక్కలతో రూపొందించబడిన ప్రత్యేకమైన సైనిక గూఢచార పద్ధతి గురించి తెలుసుకున్నాడు. దీని ప్రేరణతో ఆరు ఉబ్బెత్తు చుక్కలని  అవసరమైన రీతిలో పేర్చుతూ అక్షరాలను, అంకెలని, సంగీత చిహ్నాలని సూచించే బ్రెయిలీ లిపిని తయారుచేశారు. అప్పటినుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక సాధనంగా నిలిచింది. బ్రెయిలీ లిపి అంటే..... బ్రెయిలీ లిపి  ఒక స్పర్శ ఆధారిత వ్రాతపద్ధతి. ఇందులో ఉబ్బెత్తుగా ఉండే ఆరు చుక్కల  ద్వారా అక్షరాలు, సంఖ్యలు, విరామ చిహ్నాలను సూచిస్తారు. ఉబ్బెత్తు చుక్కల  సమూహాన్ని 'సెల్' అని అంటారు. ప్రతీ సెల్లోనూ భిన్నంగా అమర్చిన  చుక్కల  ఆధారంగా  అంధులు అక్షరాలు, అంకెలని గుర్తించి చదవగలుగుతారు. ఈ విధానం దృష్టిలోపం ఉన్నవారికి వ్రాతపూర్వక సమాచారం పొందడానికి సహాయపడుతుంది. బ్రెయిలీ  వివిధ భాషలతో పాటు గణితం, సంగీతం వంటి సాంకేతిక నోటేషన్లకు అనుకూలంగా తయారు చేయబడింది. బ్రెయిలీ  వ్రాయడానికి బ్రెయిలీ  రైటర్ యంత్రం లేదా స్టైలస్, స్లేట్ వంటి సాధనాలని  ఉపయోగిస్తారు.  ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ల మంది పూర్తి అంధులుగా ఉన్నారు. 253 మిలియన్ల మంది ఏదో ఒక విధమైన దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వీరందరికీ బ్రెయిలీ లిపి ఒక చేయూతలా పనిచేస్తుంది. అలా ఇంతమంది అంధులకి  సహాయపడుతున్న  బ్రెయిలీ లిపి  ప్రాముఖ్యతను గుర్తించిన  ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ, 2018 నవంబర్ 6న  ఒక తీర్మానాన్ని ఆమోదించింది. లూయీ బ్రెయిలీ  జయంతిని పురస్కరించుకుని   ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. అంధుల కోసం ఏం చేయాలి? దృష్టి లోపం ఉన్నవారికి సాధికారత కల్పించడం, వారికి విద్యా, వృత్తి అవకాశాలు అందించడం, సమాజంలో వారి  భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం సగటు పౌరులుగా అందరి బాధ్యత.  పెరుగుతున్న టెక్నాలజీవల్ల బ్రెయిలీ  కూడా అభివృద్ధి చెందుతోంది. రిఫ్రెషబుల్ బ్రెయిలీ డిస్ప్లేలు, స్మార్ట్‌ఫోన్లు వంటి ఆధునిక పరికరాలు దృష్టి లోపం ఉన్నవారికి డిజిటల్ కంటెంట్‌ను చేరువ చేయడంలో పెద్ద మార్పును తెచ్చాయి. అయితే, బ్రెయిలీ  పుస్తకాలు, ఇతర వనరులు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేయడం, దాని ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన పెంపొందించడం అవసరం. ప్రపంచ బ్రెయిలీ  దినోత్సవం  లూయీ బ్రెయిలీ చేసిన అమూల్యమైన సేవలకు నివాళి . దృష్టి లోపం ఉన్నవారి హక్కులు, గౌరవానికి గుర్తింపు.   దృష్టి లోపం ఉన్నవారిని తక్కువ చేసి చూడకుండా, జాలి పడి వదిలేయకుండా మనలో ఒకరిగా, వారికి కాస్త  ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు కూడా అద్భుతాలు సాధిస్తారు.                               *రూపశ్రీ.

లైఫ్ పార్ట్నర్ ను ఉపయోగించుకునే వాళ్లు ఎలా ఉంటారంటే..!

ప్రతి వ్యక్తి జీవితంలో భాగస్వాముల పాత్ర చాలా ప్రత్యేకమైనది. జీవితంలో ఒక దశ వచ్చాక బయటి నుండి ఒక వ్యక్తి జీవితంలోకి వస్తారు.  వారితోనే ఇక జీవితం అనుకోవాల్సి ఉంటుంది. కష్టం, నష్టం, సుఖం,  బాధ.. ఇలా అన్నీ వారితోనే పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఎలాంటి సమస్యలు లేకుండా సాగడం చాలా అరుదు.  ఎందుకంటే ఇద్దరు వేర్వేరు వ్యక్తులు,  వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలలో పెరిగిన వ్యక్తులు ఒకచోట కలసి ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజమే.. కానీ ఇద్దరూ నిజాయితీగా ఉండే వ్యక్తులు అయితే సమస్య ఎక్కువ ఉండదు. కానీ ఒకరు కుటిల మనస్తత్వం కలిగిన వారు అయితే వారితో బంధం సాగడం కష్టమే కాదు.. అలాంటి వారు తమ భాగస్వామిని వాడుకోవాలని చూస్తారు. అలాంటి వారు ఎలా ఉంటారో.. వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుంటే.. అపరాధ భావం.. లైఫ్ పార్ట్నర్ తప్పు చేసిన భావనను వ్యక్తం చేయడం ద్వారా తన పార్ట్నర్ ను తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందులో ఎమోషనల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది.  లైఫ్ పార్ట్నర్ ఏం చేస్తారంటే.. తన అవసరాలను,  తన సంతోషానికి తగిన విధంగానూ తన పార్ట్నర్ లేరు అనే విధంగా బిహేవ్ చేస్తారు. దీనికి తగిన కారణాలను కూడా వ్యక్తం చేస్తారు. దీంతో పార్ట్నర్ కోసం మారిపోయే అమాయకులు ఉంటారు. ఇలా మారిపోగానే తమ అవసరాల కోసం వాడేసుకుంటూ ఉంటారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనేది చాలా దారుణమైన చర్య.  ఇది మనిషిని నేరుగా ఏమీ అనకుండా తమకు నచ్చినట్టు మార్చుకునే మార్గం.  తన భాగస్వామిని తన అవసరాల కోసం ఉపయోగించుకోవాలి అనుకునే లైఫ్ పార్ట్నర్ కూడా అలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. వారు చెప్పిన మాట వినకపోతే కోపంగా ఉండటం, విచారంగా ఉండటం, అదే పనిగా బాధపడటం వంటివి చేస్తారు. ఇలా చేస్తే వారికోసం మారిపోతారని వారికి తెలుసు. అబద్దాలు.. అబద్దాలు జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా ముఖ్యం. ఇవి చాలా సహాయపడతాయి.  జీవితాలను నిలబెడతాయి.  కొన్ని పనులను సులభతరం చేస్తాయి.  ఎదుటివారికి నష్టం జరగనంతవరకు  అబద్దం చెప్పడం తప్పేమీ కాదు.. కానీ భాగస్వామి అబద్దాలు చెప్పడం ద్వారా తన పార్ట్నర్ ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి విషయంలో ఎప్పుడూ అబద్దాలు చెబుతుంటారు. తప్పు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా తప్పు దారిలో పార్ట్నర్ ను తీసుకెళతారు.  దీనివల్ల వారు లాభపడి,  పార్ట్నర్ ను వాడుకుంటారు. గ్యాస్ లైటింగ్.. గ్యాస్ లైటింగ్ చాలామందికి తెలియదు కానీ.. ఇది మనిషిని మానసికంగా గందరగోళానికి గురి చేసే చర్య. ఏదైనా మర్చిపోయినట్టు,  ఏదైనా గుర్తులేనట్టు,  మతి భ్రమించిందని నమ్మించేట్టు, జ్ఞాపకశక్తి క్షీణించిందని చెప్పడం,  పిచ్చి పట్టిందని నమ్మేలా చేయడం.. అబద్దాలు చెబుతున్నారని నిందలు వేయడం, అనుమానించడం, మనుషులలో కలవనీయకుండా ఒంటరిగా ఉంచడం, కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరం చేయడం..   ఇలాంటివి చేసి మనిషిని మానసికంగా ఆలోచలు లేకుండా, వారు ఎప్పుడూ ఇతరుల ముందు మాట్లాడకుండా చేస్తారు.  ఇలాంటివి చేసే వారు తమ భాగస్వామిని చాలా దారుణంగా ఉపయోగించుకుంటూ ఉంటారు.                                           *రూపశ్రీ.

మన ఆరోగ్యమే మనకున్న  గొప్ప సంపద.... ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డే 2025..!

  మనం స్కూలులోనో, కాలేజీలోనో చదివేటప్పుడు క్లాస్ రూంలో టీచర్స్ పాఠాలు చెప్పేటప్పుడు  సరిగా వినకుంటే ఓ మాట అనేవారు.. మనిషివి ఇక్కడే ఉన్నావ్ కానీ ఎక్కడ ఆలోచిస్తున్నావ్ అని.  దీన్నే “బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్” అని అంటుంటారు.  అప్పట్లో దీని గురించి పెద్దగా అర్థమయ్యేది కాదు కానీ రాన్రానూ వయసు పెరిగేకొద్ది ఇందులో ఉన్న నిజం, దీని వల్ల మనిషికి ఏర్పడిన పరిస్థితి  స్పష్టంగా అర్థమవుతోంది అన్నది నిజం.  ఎలాంటి  పనినైనా  ఏకాగ్రతతతో చక్కగా చేయాలంటే దానికి మన శరీరం, మనస్సు రెండూ ఆ పని మీదనే ధ్యాస పెట్టాలి. ఆ రెండూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మనం చేసే పనికి సరైన ఫలితం దక్కుతుంది. రెండూ ఒక పనిమీద ఏకాగ్రత కాలేదంటే దాని అర్థం మనిషి శరీరం, మనసు రెండూ సమన్వయంలో లేవని.  మనిషి  శరీరం, మనస్సులు ఆరోగ్యంగా ఉండటం  ఎంత ముఖ్యమో అందరూ అర్ధం చేసుకోవాలన్న లక్ష్యంతో  ప్రతీ సంవత్సరం జనవరి3 వ తేదీన ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకునే మైండ్ హెల్త్,  బాడీ హెల్త్.. ఈ రెండింటిని సంపాదించుకునే మార్గం.. మొదలైన విషయాలు తెలుసుకుంటే.. మైండ్-బాడీ వెల్నెస్ అంటే.. మైండ్-బాడీ వెల్నెస్ అనేది శారీరక, మానసిక ఆరోగ్యాల మధ్య సమతుల్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం శారీరక ఆరోగ్యం ఉంటే సరిపోదు.  మానసికంగా ప్రశాంతత, సంతృప్తిగా ఉండటం   కూడా అవసరం. ఎందుకంటే మన ఆలోచనలు, భావాలు, ప్రవర్తన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ విషయాన్ని స్వయానా వైద్యులు, పరిశోధకులు వెల్లడిస్తున్నారు.  గుండె జబ్బులు,  తలనొప్పి వంటి సమస్యలకు మానసిక ఒత్తిడి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు..  సానుకూల ఆలోచనల ప్రభావంతో  రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని, దేని నుంచైనా త్వరగా కోలుకునే  శక్తి  కలుగుతుందని  తేలింది. మైండ్-బాడీ ఆరోగ్యం ఇప్పుడు చాలా అవసరం.. ప్రస్తుత పరిస్థితుల్లో  బిజీ లైఫ్, పనిలో ఒత్తిడి, అనారోగ్య అలవాట్లు తదితర కారణాల వల్ల  ఆరోగ్యంపై తక్కువ శ్రద్ధ చూపిస్తున్నారనే మాట వాస్తవం. దానివల్ల  ఇప్పటి తరం వారు శారీరకంగా, మానసికంగా చాలా బలహీనమైపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డే ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు అర్థం కావాలి.  శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడు చాలా ఆరోగ్యకరంగా ఉండటం చాలా ముఖ్యమని మైండ్-బాడీ వెల్నెస్ డే అందరికి అర్థమయ్యేలా చేస్తుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను చర్చించేందుకు, అవగాహన పెంచేందుకు వారధిగా నిలుస్తుంది.  ఈ రోజు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేలా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించవచ్చు.  మంచి  ఆహారపు అలవాట్లను, వ్యాయామ పద్ధతులని  అందరికీ తెలియజేయవచ్చు..  యోగా, మెడిటేషన్ క్యాంపులు పెట్టి,  మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్, యోగా వంటివి చేయడం ఎంత అవసరమో తెలియజేస్తారు. మానసిక ఆరోగ్యంపై సెమినార్స్ పెట్టి సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తారు. మనమేం చేయాలి.... మైండ్-బాడీ వెల్నెస్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎందుకంటే ఒకరు చెప్పడం వల్ల ఎవరి శరీరంలోనూ మార్పు రాదు. మానసిక, శారీరక ఆరగ్యం బాగుండాలంటే ప్రతి ఒకరు తమ గురించి తాము కేర్ తీసుకుని తమ ఆరోగ్యాన్ని తాము రక్షించుకోవాలి.  జీవనశైలి సరిచేసుకుని సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నీరు త్రాగటం,  నిత్యం వ్యాయామం చేయడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా చేయడం,  తగినంత నిద్రపోవటం వంటివి ప్రతీ ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనుషుల  ఆలోచనా విధానం మంచిగా ఉంటుంది.  ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి శారీరక, మానసిక శ్రేయస్సు సాధించడంలో అందరూ  కలసి పనిచేయాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని సిరి సంపదలున్నా ఈ రోజుల్లో  ఆరోగ్యమే   చేతిలో ఉండే నిజమైన సంపద.. అందుకే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.                                                                  *రూపశ్రీ.

డబ్బు సంపాదించే భలే మార్గం.. ఇంట్లోనే ఇలా కరెంట్ ఉత్పత్తి చేసి అమ్మవచ్చు..!

ప్రపంచం మొత్తం ఇప్పుడు విద్యుత్ గుప్పెట్లో చిక్కుకుంది.  ఒక్క నిమిషం విద్యుత్తు లేకపోతే చాలా సతమతం అయిపోతారు. ఇంట్లో వంట వండే రైస్ కుక్కర్ల నుండి, స్నానం చేయడానికి వాడే గీజర్.. ట్యాంక్ లో నీళ్లు నింపే మోటర్, ఇంట్లో ఫిడ్జ్, టీవీ,  ఫ్యాన్,  మొబైల్ ఫోన్.. ఇలా ప్రతి ఒక్కటి కరెంట్ ఆధారంగా పనిచేసే  వస్తువులే ఉంటున్నాయి. దీని వల్ల విద్యుత్ వినియోగం పెరిగింది. సాధారణంగా చలికాలం కంటే వేసవి కాలంలో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. వందలు, వేల కొద్ది విద్యుత్ ఛార్జీలు భరించలేక ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటారు. అయితే ఇంటి వద్దనే విద్యుత్ ఉత్పత్తి చేసి అటు కరెంట్ బిల్ తప్పించుకోవడమే కాకుండా.. ఎంచక్కా విద్యుత్ అమ్మి డబ్బు సంపాదించవచ్చు.  దీనికోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. ప్రభుత్వ మద్దతు.. ఇంటి పట్టునే విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ప్రభుత్వమే మద్దతు ఇస్తుంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024,  ఫిబ్రవరి 13వ తేదీన సూర్యఘర్ యోజన ను ప్రారంభించారు.  ఈ పథకం కింద ఇంట్లోనే విద్యుత్ వినియోగానికి ప్రభుత్వం నుండి సబ్సీడీ కూడా లభిస్తుంది. ఈ పథకం కింద రూఫ్ టాఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పటు చేసుకోవచ్చు.  ఇలా ఏర్పాటు చేసుకునేందుకు కోటి కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ.15వేలు లభిస్తుంది. సోలార్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి పథకానికి సంబంధించిన పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.  యూజర్ ఐడీ,  పేరు,  అడ్రస్,  ప్లాంట్ సామర్థ్యం వంటి వివరాలు అన్నీ అందులో పూరించాలి. దీని తర్వాత డిస్కమ్ కంపెనీలు పోర్టల్ లో పొందుపరిచిన వివరాలు అన్నీ దృవీకరించి ప్రాసెస్ ను ముందుకు తీసుకెళ్తాయి.  సౌలభ్యాన్ని బట్టి కొనుగోలు దారులను ఎంచుకోవచ్చు. ప్యానెల్ లు ఇన్ స్టాల్ చేసిన తర్వాత డిస్కామ్ నెట్ మీటరింగ్ ను ఇన్స్టాల్ ఇస్తుంది.  అప్పుడు సర్టిఫికెేట్ పోర్టల్ లో అప్ లోడ్ చేయబడుతుంది. దీని తర్వాత ప్రభుత్వం  సబ్సీడీ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఇన్వర్టర్ బ్యాటరీలలో నిల్వచేసి విద్యుత్ ను విక్రయించవచ్చు. ప్రభుత్వం సబ్సీడీ రావడమే కాకుండా విద్యుత్ ను యూనిట్ చెప్పున ధర చెల్లించి కంపెనీలు కొనుగోలు చేస్తాయి.  దీనివల్ల ఆదాయం బాగుంటుంది.                                               *రూపశ్రీ.  

తెరవని పుస్తకాల్లాంటివారు... ఈ అంతర్ముఖులు... వరల్డ్ ఇంట్రోవర్ట్ డే.. 2025..!

మన చుట్టూ మనుషులందరూ  ఒకేలా ఉండరు, ఒకేలా ఆలోచించరు  అనే విషయం మనకి తెలిసిందే. కొందరు ఎప్పుడూ సరదా సరదాగా ఉంటూ, చుట్టుపక్కల మనుషులందరితో  సులువుగా కలిసిపోతారు. ఇంకొందరు ఎక్కడున్నా నలుగురిలో అంత సులువుగా కలవలేక కొంచెం మొహమాటంగా, నెమ్మదిగా ఉండాలనుకుంటారు. ఇంకొందరు తనకి అలవాటున్న చోట  ఫ్రీగా ఉండగలుగుతారు, అలవాటు లేనిచోట మౌనంగా ఉండిపోతారు. సైకాలజిస్టులు మనుషుల స్వభావాలను బట్టి వివిధ రకాలుగా విభజించారు. వీరిలో ఒక్కొక్కళ్ల ప్రవర్తనను బట్టి ఒక్కో విధమైన రకమైన గుణాన్ని ఆపాదిస్తూ ఉంటారు.  తప్పు చేయకపోయినా సరే సమాజంలో తప్పుగా అర్ధం చేసుకోబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లలో ఇంట్రోవర్స్ ప్రథమ స్థానంలో ఉంటారు. ఒంటరితనాన్ని ఇష్టపడే ఇంట్రోవర్ట్ లు చాలా వరకు తమ చుట్టు ప్రక్కల ఉన్నవారి నుండి విమర్శలే ఎక్కువగా ఎదుర్కొంటు ఉంటారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంట్రోవర్టులని అర్థం చేసుకోవడానికి, వారిని గౌరవించడానికి, వారి ప్రత్యేకతను  వెలుగులోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేక రోజును ఏర్పాటు చేశారు.  ప్రతీ సంవత్సరం జనవరి 2ను ‘వరల్డ్ ఇంట్రోవర్ట్ డే’గా జరుపుకుంటున్నారు. కొందరు ఇంట్రోర్ట్ లు అనే విషయం వారికి కూడా తెలియదు. ఈ సందర్బంగా ఇంట్రోవర్ట్ ల గురించి కాస్త వివరంగా తెలుసుకంటే.. ఇంట్రోవర్ట్స్ అంటే .. ఇంట్రోవర్ట్స్  అంటే ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తులు.  వీరు ప్రశాంతమైన, నెమ్మదిగా ఉండే వాతావరణాన్ని ఇష్టపడతారు. సామాజిక కార్యకలాపాల్లో  ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ ఆ తర్వాత అలసిపోయిన ఫీలింగ్లో ఉంటారు.  తమను తాము తిరిగి శక్తివంతం చేసుకోవడానికి ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.  ఇంట్రోవర్ట్స్  మెదడు డోపమైన్ అనే రసాయనానికి భిన్నంగా ప్రతిస్పందిస్తుందని సైకాలజీ తెలుపుతుంది. సైకాలజీ ఏం చెప్తోందంటే.. ఇంట్రోవర్ట్స్  గురించి సైకాలజీ చాలా చెబుతుంది.  ఇంట్రోవర్ట్ గురించి మాట్లాడిన  తొలి ప్రముఖులలో స్విస్ సైకాలజిస్టు కార్ల్ గుస్తావ్ జంగ్ ఒకరు. 1921లో ఆయన రాసిన "సైకాలజికల్ టైప్స్" అనే పుస్తకంలో ప్రతి మనిషిని అంతర్ముఖులు లేదా బహిర్ముఖులుగా విభజించవచ్చని ప్రతిపాదించారు. అంతర్ముఖులను గ్రీస్ దేవుడు అపోలోతో పోల్చి వారు లోతైన ఆలోచనలతో ఉంటారని చెప్పారు. అప్పటినుంచి, మరెన్నో సైకాలజీ సిద్ధాంతాలు ఇంట్రోవర్ట్స్  గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో సహాయపడ్డాయి. ఇంట్రోవర్ట్స్ గురించి తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ఇంట్రోవర్ట్స్  కొత్త విషయాలకు  త్వరగా స్పందించగలుగుతారు.  కానీ మార్పును గమనించడంలో కొంచెం సమయం తీసుకుంటారు.  వీరు ఏదైనా సమస్య, ప్రమాదం,  ఇబ్బంది మొదలైన విషయాలకు అస్సలు భయపడరు. కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు లోతుగా ఆలోచిస్తుంటారు. సృజనాత్మకంగా కూడా ఉంటారు. వీరు బహిర్ముఖుల్లా నటించే ప్రయత్నం చేస్తే వారి పనితీరు మీద ప్రభావం పడుతుంది.  వీరికీ సంతోషం అత్యంత ప్రాధాన్యతగల విషయంగా అనిపించదు. ఇంట్రోవర్ట్స్ డే  ఇలా మొదలైంది.. "హాపిలీ ఇంట్రోవర్టెడ్ ఎవర్ ఆఫ్టర్" అనే ఉచిత ఈ-బుక్ రచించిన జర్మనీకి చెందిన ప్రసిద్ధ సైకాలజిస్టు ఫెలిసిటాస్ హైన్ ప్రపంచ అంతర్ముఖ దినోత్సవాన్ని సృష్టించినట్టు చెబుతున్నారు. 2011 సెప్టెంబర్ 20న ఆమె తన "ఐపర్సానిక్" వెబ్‌సైట్‌లో " ఇందుకే మనకు ప్రపంచ ఇంట్రోవర్ట్ డే  అవసరం" అనే శీర్షికతో బ్లాగ్‌ను ప్రచురించారు. ఈ వ్యాసం వరల్డ్ ఇంట్రోవర్ట్ డేకి ప్రేరణగా నిలిచింది. అంతర్ముఖులను అర్థం చేసుకోవాలి.. వరల్ట్ ఇంట్రోవర్ట్ డే అనేది ఇంట్రోవర్ట్ లను అర్థం చేసుకోవడం కోసం చేయూత ఇస్తుంది.  ఇంట్రోవర్ట్ డే రోజు వారి స్వభావం  వారి సామర్థ్యాన్ని  ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇంట్రోవర్ట్ లు చాలా వరకు గొప్ప వ్యక్తులుగా ఉంటారని,  గొప్ప స్థాయికి చేరతారని అంటుంటారు.  చరిత్రలో చార్లెస్ డార్విన్, ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ వంటి  చాలామంది తెలివైన మనుషులు ఇంట్రోవర్ట్స్ అనే విషయం ఇంట్రోవర్ట్ ల శక్తి,  సామర్థ్యాలను తెలుపుతుంది. సమాజంలో చాలామటుకు ఇంట్రోవర్ట్స్ గురించి చెడు అభిప్రాయం ఉంది.  నలుగురిలో కలవరని,  నలుగురితో ఫ్రీగా మాట్లాడరని,  పొగరుగా ఉంటారని,  సర్దుకుపోయే స్వభావం కలిగి ఉండరని.. ఇలా చాలా అంటుంటారు.   కానీ ఇది వారిలో ఉండే పొగరుతోనో.. వారు నలుగురిలో కలవడం ఇష్టపడకో జరిగేది కాదు. ఒంటరితనంగా ఉండటం,  గంటల కొద్ది  ఆలోచనలలో మునిగిపోయి ఉండటం అనేది ఇంట్రోవర్ట్ లకు ఇష్టమైన అంశం. నిజం చెప్పాలంటే ఒంటరిగా ఉండటం, ఆలోచించడం అనే విషయాలే ఇంట్రోవర్ట్ లు జీవితంలో ఎదగడానికి చాలా సహాయపడతాయి.  కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వెయ్యాల్సిన పని లేదు.  ఏది ఎలా ఉన్నా..  మనుషులంతా  స్వాభావికంగా వేరేగా ఉన్నప్పటికీ ఒకరికొకరం సరిగా అర్ధం చేసుకుని, సమిష్టిగా నడవటం చాలా ముఖ్యమని అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో,  సమాజంలో,   చుట్టుపక్కల ఉన్నవాళ్ళని సరిగా అర్ధం చేసుకొనే ప్రయత్నం మొదలుపెడితే  అందరూ సంతోషంగా ఉండవచ్చు.                                                       *రూపశ్రీ.                                                          

న్యూ ఇయర్ రిజల్యూషన్.. కొత్త ఏడాది నిర్ణయాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన విషయమిదే..!

  కొత్త.. అనే పేరులోనే చాలా గొప్ప ఆశావాదం ఉంటుంది.  కొత్త దనం ఎప్పుడూ మంచే చేస్తుందనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది.  ఈ పాజిటివ్ ఆలోచన వల్లనే చాలామంది కొత్తదనం అంటే ఆసక్తిగా ఉంటారు. కొత్తదనం అంటే జీవితానికి బోనస్ లాంటిది.   అయితే కొత్తగా మొదలు పెట్టేది ఏదైనా సరే జీవితానికి మేలు చేసేది అయి ఉండాలి. ఏ పని చేయాలన్నా దానికి ఓ పద్దతి, పాడు ఉంటుంది.  ముఖ్యంగా ఏ పని చేయాలన్నా దానికి తగిన ఆలోచనా విధానం,  శరీర ఆరోగ్యం సహకరించాలి. ఇవి రెండూ లేకపోతే ఏ పని అయినా సమర్థవంతంగా చేయలేరు.  అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.  కొత్త ఏడాది తీసుకునే నిర్ణయాలు ఏవైనా కానివ్వండి.. అది ఎంత గొప్పది అయినా కానివ్వండి.. వాటిలో ముందు వరుసలో.. మొట్టమొదటగా ఉండాల్సినది ఆరోగ్య రక్షణ.  కొత్త ఏడాది చాలా మంది తీసుకునే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లో ఆరోగ్యం కు సంబంధించి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.  ఇంతకీ ఈ కొత్త ఏడాదిలో అయినా ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలను గూర్చి తెలుసుకుంటే..  మంచి ఆరోగ్యం సంపాదించానే నిర్ణయం తీసుకోవడం  భవిష్యత్తులో అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. మంచి ఆరోగ్యం ఉంటేనే జీవితంలో ఏదైనా చేయగలం అని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో  కనిపించే అన్ని వ్యాధులలో ఒక విషయం సర్వసాధారణంగా చెబుతున్నారు. అదే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం.  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో తీవ్రమైన జబ్బులు  వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. బరువు.. బరువు తగ్గడం  మెరుగైన ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన దశల్లో ఒకటి.  శరీర బరువులో కేవలం ఐదు నుండి పది శాతం తగ్గడం వల్ల గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం,  అధిక రక్తపోటు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు. బరువు తగ్గాలంటే రోజూ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు ఇందులో చాలా ముఖ్యమైనది.  బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా అనేక  వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే కొన్ని ప్రత్యేక ఆహారాలను కూడా అనుసరించవచ్చు. కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఆహారాన్ని మెరుగుపరచడంపై శ్రద్ధ పెట్టాలి . ఆరోగ్యకరమైన ఆహారం అంటే  ఏమి తింటారు,  ఎలా తింటారని అర్థం. ప్రతి రోజు  ఆహారంలో పండ్లు,  కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పండ్లు,  కూరగాయలలో తక్కువ కేలరీలు,  ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటాయి.  కొత్త ఏడాది సందర్భంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పకుండా ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకుంటామని ఎవరికి వారు వాగ్దానం చేసుకోవాలి.  పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు కొలెస్ట్రాల్,  షుగర్ పెరగకుండా నిరోధిస్తాయి. అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే ఆకుపచ్చ కూరగాయలతో పాటు నట్స్,  విత్తనాలను ఆహారంలో చేర్చడం ద్వారా యాంటీఆక్సిడెంట్లను పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధులకు శారీరక నిష్క్రియాత్మకత ప్రధాన కారణమని చాలా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి . రోజులో ఎక్కువ సమయం కూర్చొని లేదా విశ్రాంతి తీసుకునే వ్యక్తులు నడుస్తూ ఉండే వ్యక్తుల కంటే రక్తపోటు, కొలెస్ట్రాల్,  మధుమేహం మొదలైన అనేక ఆరోగ్య రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, 2025 సంవత్సరంలో మీ దినచర్యలో - తక్కువగా కూర్చోవడం -ఎక్కువగా నడవడం అనే విషయాన్ని చేర్చుకోవాలి. దీన్ని ఆచరణలో ఉంచాలి కూడా. రోజువారీ జీవితంలో శారీరక శ్రమను పెంచడం లక్ష్యంగా పెట్టుకోవాలి. లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించడం, దగ్గరగా ఉన్న ప్రదేశాలకు డ్రైవింగ్ చేయడానికి బదులుగా నడుచుకుంటూ వెళ్లడం. మీరు రోజంతా ఆఫీసులో ఉంటే అప్పుడప్పుడు సీట్ నుండి లేచి నడవడం వంటివి చేయాలి. ఈ అలవాటు  ఆరోగ్యంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సహాయపడుతుంది. ఆరోగ్య పరీక్షలు.. చాలా ఆరోగ్యం బానే ఉందిగా మళ్ళీ పరీక్షలకు డబ్బులు దండగ అనే ఆలోచనలో ఉంటారు. అయితే ఆరోగ్య పరీక్షలు జబ్బుల ఉనికిని ముందుగానే గుర్తిస్తాయి.  దీనివల్ల ఒకరిగేది ఏంటంటే.. శరీరం ఎక్కువ బాధపడకుండా.. ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవడం.  సమస్య పెద్దది అయ్యాక వైద్యం కోసం చేయాల్సిన ఖర్చులో కనీసం 10శాతం ఖర్చులు పెట్టి ముందుగానే పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంట్లో షుగర్,  రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవచ్చు.  దీని కోసం ఇంట్లో సదరు పరికరాలు ఇంట్లోనే ఉంచుకోవచ్చు. శరీర స్థితికి తగ్గట్టు ఏ పరీక్షలు అవసరమో   ఆరోగ్యానికి అనుగుణంగా ఏ పరీక్షలు చేయించుకోవాలో అనే విషయాన్నివైద్యుల సలహాతో తెలుసుకోవాలి.  ఆరోగ్యాన్ని సంపాదించుకునే పనిలో ఈ కొత్త ఏడాది మరింత మెరుగ్గా ఉండాలి.                                            *రూపశ్రీ.

తప్పటడుగులకి సరిహద్దు.. భవిష్యత్తుకి సరికొత్త ఆరంభం... ఈ కొత్త సంవత్సర రాత్రి వేడుక..

  కొత్త సంవత్సరం రాబోతుందన్నప్పుడు ముందు రోజు నుంచే చాలామందిలో ఎంతో ఉత్సాహం వచ్చేస్తుంది. ఫ్రెండ్సుతో పార్టీలు, ఫ్యామిలీతో  షోలు  ఇలా ఏవేవో చేసుకోవాలనే ప్లాన్స్ వేసేసుకుంటారు. ఈ రాత్రిని ఒక ఎంజాయ్ మెంట్ టైముగా చూసే వారు కొందరుంటే, తమ జీవితాల్లో నుంచి ఇంకో సంవత్సరం జారిపోతుంది, ఇకనైనా భవిష్యత్తు బాగుపడే రోజులు వస్తాయా అనే ఆలోచనలో మరికొందరు ఉంటారు. ఈ రోజులో ఏముంది ప్రత్యేకం? సంవత్సరంలో మిగతా రోజుల్లానే ఇది కూడా ఒకటే కదా..  ఆలోచించి చూస్తే దేనికయినా ఒక ఆరంభం,  ఒక హద్దు, ఒక ముగింపు ఉంటాయి. చాలామంది ఒక పనిని ఆరంబించటానికో,  ఆ హద్దు వరకు చేయటానికో.. ఆ హద్దు దాటి  ముందుకు వెళ్లడానికో చూస్తుంటారు కదా... అలాంటప్పుడు రెండు సంవత్సరాల మద్య సరిహద్దుగా ఉన్న ఈ రోజు కొందరికి ఒక హద్దుగా, ఇంకొందరికి ఒక కొత్త ఆరంభంగా కనిపించి ఒక నూతన ఉత్తేజం కలిగిస్తుంది. చెడ్డ అలవాట్లు, తప్పుడు నిర్ణయాలు, చేసిన  పొరపాట్లు ఇలా మనల్ని జీవితంలో వెనక్కి లాగే విషయాలని దూరం చేసుకోవాలనే  సంకల్పం చేసుకోనే దిశగా.. భవిష్యత్తుని బాగు చేసే కొత్త ఐడియాలు, మంచి అలవాట్లు వంటి వాటికి ఆరంభంగా ఉన్న ఈ రోజు ఎందరో జీవితాలకి మలుపు అవుతుంది. పాత సంవత్సరం చివరి రోజున, మనం గత సంవత్సరంలో జరిగిన సంఘటనలను అన్నీ గుర్తు చేసుకుంటూ, వాటి నుండి నేర్చుకున్న పాఠాలను గుర్తించి, కొత్త  ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాము. ఈ రాత్రి మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది - "ఎప్పుడూ ముందుకు పోతూ ఉండు, పాత బాధలను మర్చిపోయి, అవి నేర్పిన పాఠాలు మాత్రం గుర్తుంచుకుని విజయం వైపు కొత్త అడుగులు వేయి, లేదంటే కాలం కథలో వెనకబడిపోతావు” అని. ఎందుకంటే కాలం ఎవరికోసమూ  ఆగదు. కొత్త సంవత్సరం పలకరించబోతున్న ఈ సమయంలో    పాత బాధలను, త్యాగాలను, తప్పులను వదిలిపెట్టి ఒక సరికొత్త ఆరంభంలా  భావించి ప్రతి ఒక్కరూ  ఒక కొత్త దిశగా అడుగులు వెయ్యాలనుకుంటారు.  తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త లక్ష్యాలను పెట్టుకొంటారు. ఇప్పటి యువత ‘న్యూ ఇయర్ రిజల్యూషన్స్’ అని  తమ జీవితాన్ని ప్రభావితం చేసే ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు ఈ రోజే చేస్తారు.  ఒక కొత్త అవకాశంగా మారే ప్రతీ రోజుని  అందుకోవటానికి సిద్ధమవుతారు. గ్రెగోరియన్  క్యాలెండర్‌ ప్రకారం  ప్రపంచమంతటా డిసెంబర్ 31వ తేదీన వివిధ సంప్రదాయాల్లో  నూతన సంవత్సర ఉత్సవం జరుపుకుంటారు. మన దేశంలో కూడా ఈ రోజున జరుపుకుంటారు. కానీ  భారత దేశం చుట్టు ఉన్న దేశాల భోగోళిక స్థితి, సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు మార్చ్ చివరి రెండువారాల్లోనో లేదా ఏప్రిల్ మొదటి రెండు వారాల్లోనో జరుపుకుంటుంటారు. ప్రతి ప్రాంతం వారి సంస్కృతి, నమ్మకాలు, ఆచారాల ప్రకారం ఈ సంప్రదాయాలు విభిన్నం గా ఉంటాయి. అయితే ఏ ప్రాంతమైనా, ఏ సమయమైనా,   ఏ సాంప్రదాయం ప్రకారం చూసినా అన్నింటిలోనూ ప్రజలకి ఉండే కోరిక, ఉద్దేశ్యం ఒక్కటే.. “తమ జీవితాల్లో అంతవరకు ఉన్న పాత సమస్యలు, బాధలు తొలగిపోయి కొత్త అవకాశాలు, ఆనంద క్షణాలు రావాలని. ఈ కొత్త సంవత్సర రాత్రిన  చాలామంది  పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకుంటారు. అందరూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొత్తగా   పరిచయమైనవాళ్లతో కలిసి పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఎంజాయ్మెంట్లో తమ పాత భాధలు మర్చిపోయి, కొత్త ఆశలు, కోరికలు, కొత్త ప్రయత్నాలు అనుకుంటూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం చెప్తారు.  దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి, విందు  వినోదాలలో మునిగి, ప్రేమాభిమానాలు, సుఖసంతోషాలు  పంచుకుంటారు. ప్రతి ఏడాది వస్తుంది.. తనతో బోలెడు కాలాన్ని ప్రతి వ్యక్తి చేతిలో పెడుతుంది.  ఏడాది పొడుగునా బోలెడు అనుభవాలు, బోలెడు పాఠాలు అందరికీ చెబుతుంది.  ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మూలమవుతుంది. ఈ కొత్త ఏడాది కూడా అందరికీ మంచి చేకూర్చాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం.  ప్రపంచ దేశాలన్నీ ఒక కుటుంబంలా భావిస్తే, కుటుంబ కలహాలు తొలగిపోయి, మన భూమాత ఇంట అంతా ఆనందమే తాండవమాడుతుంది.  పాత ఏడాదికి వీడ్కోలు చెప్తూ.. కొత్త ఏడాదిని ఆశతో ఆహ్వానిద్దాం.                                           *రూపశ్రీ.  

డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!

    డ్రైవింగ్ నేర్చుకున్న వారికి చాలా సింపుల్ విషయం. కానీ  డ్రైవింగ్ రాని వారికి అది పెద్ద టాస్క్.  ఈ కాలంలో డ్రైవింగ్ ను చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ నేర్చేసుకుంటున్నారు. కార్, బైక్, స్కూటీ ఇతర వాహనాలు ఏవైనా వాటిని ఎలా మెయింటైన్ చేయాలి? అందులో బటన్స్ కానీ,  బ్రేకులు కానీ ఎలాంటి సమయంలో ఎలా ఉపయోగించాలి? ఇవి తెలియడం,  వాహానాల రద్దీలో చాకచక్యంగా వాటిని వినియోగిస్తూ వెహికల్ ను ముందుకు నడపడం  తెలియాలి.  వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా   యాక్సిడెంట్లు జరగడం,  ప్రాణాల మీదకు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.. ఫోన్.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదం.  ఈ విషయంలో ప్రభుత్వం నిషేధం విధించినా సరే.. చాలామంది ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు. ఈ అలవాటు కేవలం డ్రైవింగ్ చేసే వారినే కాకుండా ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. వేగం.. వేగంగా ప్రయాణించడం సురక్షితం కాదు.. ఈ హెచ్చరిక బోర్డ్ చాలా చోట్ల రాసి ఉంటుంది. కానీ చాలామంది రాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలా వేగంగా నడపడం వల్ల చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.  ముఖ్యంగా డ్రైవింగ్ చేయడం అనేది తనకే కాదు.. ఎదుటి ప్రాణాలను ప్రమాదంలో నెట్టకుండా ఉండే చర్య అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సీటు బెల్టు.. ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవడం, బైక్ లో ప్రయాణిస్తున్నట్టైతే హెల్మెట్ వాడకం తప్పనిసరి.  ఇవి చేయనివారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాగి డ్రైవ్ చేయవద్దు.. మద్యం సేవించి వాహనాలు నడపరాదు అనే హెచ్చరిక అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా దీన్ని ప్రభుత్వాలే నిషేధించాయి కూడా.  అయినా సరే చాలామంది  అలాగే డ్రైవ్ చేస్తుంటారు. దీని వల్ల కొన్ని పరిస్థితుతులలో ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. అలసట.. అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు.  అలసిపోయినప్పుడు చాలామంది నిద్ర ఫీల్ అవుతారు.  డ్రైవ్ చేస్తుండగా నిద్రలోకి జారుకునే వారు కూడా ఉంటారు. ఇది చాలాపెద్ద ప్రమాదాలకు కారణం అవుతుంది. ట్రాఫిక్.. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను అనుసరించి డ్రైవ్ చేయాలి.  ఈ నియమాలు ఉల్లంఘిస్తే  చట్టపరంగా డ్రైవింగ్ చేసే వారు సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా ఇతరులు కూడా ప్రమాదంలో పడే అవకాశం, ఇతర వాహన చోదకులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెడ్ లైట్.. హెడ్ లైట్లు ప్రతి వాహనాలకు ఉంటాయి. అయితే వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేవారు చాలా తక్కువ.  హెడ్ లైట్ లు కేవలం వాహనానికి దారి చూపడానికే కాదు.. ముందు వెళుతున్న వాహనాలకు,  వెనుక వస్తున్న వాహనాలకు సరైన దిశానిర్దేశం చెయ్యడంలో కూడా సహాయపడతాయి.                                             *రూపశ్రీ.

రతన్ టాటా జన్మదినం...భారతమాత కీర్తి కిరీటంలో ఒదిగిపోయిన రత్నం.. మన రతన్ టాటా..!

  దేశం నాకేమిచ్చిందని కాదు.. దేశానికి నేనేమిచ్చానని ఆలోచించాలనేది పెద్దలు చెప్పిన మాట.   మన భారతదేశంలో  పుట్టిన మహా పురుషుడు  శ్రీ రతన్ టాటా..  ఈ మాటను నిజం చేశారని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక బిజినెస్ మెన్ ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించినా సరే జనం అతన్ని ఒక బిజినెస్ మేన్ లాగానే గుర్తించుకుంటారు. కానీ టాటా గారిని అందరూ ఒక గొప్ప బిజినెస్ మెన్లా  కాకుండా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగానే ఎక్కువగా  గుర్తుపెట్టుకుంటారు. టాటా అనేది ఇంటి పేరు అయినప్పటికీ ఆ పేరు కుటుంబంలో అందరికీ ఉన్నప్పటికీ,  టాటా అనగానే ఈ తరానికి గుర్తొచ్చేది  రతన్ టాటా గారి  నవ్వు మొహమే. ఆయన ఆధ్వర్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ గా  ఒక శక్తివంతమైన సంస్థగా మారింది. ఆయన  భారత వ్యాపార రంగాన్ని పునః రూపొందించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే నైతికత, దానగుణం కలిగిన వ్యక్తిగా  అందరి మనసులూ గెలుచుకున్నారాయన. డిసెంబర్ 28 ఆయన జన్మదిన సందర్భంగా ఆయన్ను స్మరించుకుంట..  రతన్ టాటా 1937 డిసెంబర్ 28న బాంబేలో(నేటి ముంబై) జన్మించారు. ఆయనకి 10 సంవత్సరాల వయసున్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవటంతో  వాళ్ళ బామ్మ, తాతయ్యలు దత్తత తీసుకుని పెంచారు. ఆయన కార్నెల్ యూనివర్సిటీ నుంచి  ఆర్కిటెక్చర్ అండ్ కనస్ట్రక్షన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందారు. ఆపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో హయ్యర్ లెవెల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. టాటా సంస్థకు వారసుడు అయినా  1962లో టాటా గ్రూపులో ఒక సాధారణ ఉద్యోగిగా  ప్రయాణాన్ని  ప్రారంభించారు. తన ప్రతిభతోనే 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్గా నియమించబడ్డారు. టాటా సంస్థకు చైర్మన్ అయ్యాక భారత వ్యాపార వాతావరణం వేగంగా మారిపోంది. టాటా గ్రూపుని  తనదైన ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కించారు. సంస్థ కార్యకలాపాలను విభజించడంలోనూ,  గ్లోబల్ స్థాయిలో  బిజినెస్ను  విస్తరించడంలో, సాహసోపేతమైన  నిర్ణయాలు తీసుకోవడంలోనూ వెనకడుగు వేయక విదేశాలలో వ్యాపారం చేయగల సత్తా భారత్ కు ఉందని నిరూపించారు. టాటా నానో.. టాటాకు మిగిల్చిన నిరాశ.. భారతదేశంలో  అత్యంత చౌకైన కారుగా టాటా నానో సెన్సేషన్ సృష్టించింది.  మధ్యతరగతి  వారు కారులో తిగాలనే కలను చవకగా అందించాలనేది టాటా సంకల్పం.  కానీ డబ్బు ఎక్కువ పెట్టి బ్రతకడమే గొప్ప అనే మెంటాలిటీతో ఉన్న భారతీయులు టాటా సంకల్పం పై నీళ్లు చల్లారు. టాటా నానో కారును నిరుత్సాహపరిచారు.  ఫలితంగా ఆ కారు కనుమరుగైంది.  ఆర్థిక సమస్యలు పెరిగిన నేటి కాలంలో చాలామందికి ఇప్పుడు ఆ కారు విలువ అర్థం అవుతోంది. కానీ ప్రజల చేయి దాటిపోయింది.   రతన్ టాటాగారి  21 సంవత్సరాల నాయకత్వంలో టాటా గ్రూప్ ఆదాయం 40 రెట్లు, లాభం 50 రెట్లు పెరిగింది. టాటా టీ ద్వారా టెట్‌లేను, టాటా మోటార్స్ ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను, టాటా స్టీల్ ద్వారా కోరస్‌ వంటి ఎన్నో పెద్ద కంపెనీలను  సొంతం చేసుకున్నారు. వంటగదిలో ఉండే ఉప్పు నుంచి ప్రతిష్టాత్మక వాహనాల దాకా అన్ని రంగాల్లోనూ తమ వ్యాపారాన్ని విస్తరింపజేసి  ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేశారు.   రతన్ టాటా యొక్క నాయకత్వంలో ఉన్న కీలక అంశాలలో ఒకటి... ఆయన వ్యాపారంలో నైతికతపై దృష్టి పెడతారు. వ్యాపారంలో న్యాయం, పారదర్శకత ఉండాలని నమ్ముతారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ యొక్క ప్రాముఖ్యతను ఆయన గట్టిగా నమ్మేవారు.  తాత్కాలిక లాభాల కంటే తన ఉద్యోగుల సంక్షేమాన్ని, సమాజ పటిష్టతలకి ప్రాధాన్యత ఇచ్చేవారు.  2008 లో ముంబయిలోని తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రవాద దాడుల సమయంలో ఆయన టాటా గ్రూపుని సమర్థవంతంగా నడిపించారు. రతన్ టాటా ఇంత పెద్ద వ్యాపార వేత్త అయినా ఆయన ధనవంతుల జాబితాలో పైకి కనిపించరు. దీనికి కారణం  ఆయన చేసే సేవా  కార్యక్రమాలు.  ఆయన నేటికాలపు దానకర్ణుడు అని చెప్పవచ్చు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి వివిధ  కార్యకలాపాల కోసం తన వ్యాపార లాభాల రాబడి నుండి సుమారు 60 నుండి 65శాతం విరాళాలకు కేటాయించారు. ప్రపంచానికి గడ్డు కాలం అయిన కరోనా సమయంలో భారతదేశంకోసం 500కోట్లను విరాళంగా ఇచ్చిన మహనీయుడు ఆయన.  కావాలంటే దేశం కోసం నా ఆస్తులు అన్నీ ఇచ్చేస్తానని చెప్పిన దయా హృదయుడు. దేశం కష్టాలలో ఉన్న ప్రతిసారి దేశాన్ని ఆదుకున్న భరతమాత ముద్దు బిడ్డ. రతన్ టాటా ఈ దేశం కోసం మళ్లీ పుట్టాలని కోరుకుందాం.                               *రూపశ్రీ.  

మానిప్యులేటివ్ గా ఉంటే నష్టాలు తప్పవు..!

  ప్రపంచంలో మనిషి ఎప్పుడూ ఎదుటివారి మీద అజమాయిషీ చెలాయించాలని చూస్తుంటాడు.  అది తన కంటే తక్కువ వర్గానికి చెందిన జాతుల మీద అయినా,  వేరే వర్గానికి చెందిన జంతువుల  మీద అయినా..  తన కింద కొందరు ఆటబొమ్మలుగా ఉంటే తృప్తి పడుతూ ఉంటారు. కొందరు వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు.  వారి మాటలతో ఇతరుల్ని చాలా ఈజీగా నమ్మిస్తారు.  సులభంగా వారి మీద  తమ మాటలతో  ఆధిపత్యం తెచ్చుకుంటారు.  ఇతరులను నియంత్రిస్తారు.  ఇలాంటి వారిని మానిప్యులేటివ్ వ్యక్తులని చెబుతారు. ఇలా మానిప్యులేటివ్ వ్యక్తులుగా ఉండటం వల్ల తాము చాలా గొప్పవారిమని, తెలివైన వారిమని అనుకుంటారు. ఇతరులు ఎప్పుడూ తమ చెప్పుచేతలలో ఉంటారనే ఆలోచనతో కూడా ఉంటారు. కానీ మానిప్యులేటివ్ వ్యక్తులుగా ఉండటం ఇతరులకే కాదు.. మానిప్యులేటివ్ వ్యక్తులకు కూడా మంచిది కాదని చెబుతున్నారు. మానిప్యులేటివ్ గా ఉండే వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ ను కూడా నాశనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.  మానిప్యులేటివ్ వ్యక్తుల ప్రవర్తన వారి వ్యక్తిగత రిలేషన్స్ విచ్చిన్నం కావడానికి దారి తీస్తుందట.  వారి ప్రవర్తన వ్యక్తిగత బంధాలలో విభేదాలు సృష్టిస్తుంది.  ఇది వ్యక్తులకు బంధం మీద,  పరిస్థితుల మీద నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మానిప్యులేటివ్ వ్యక్తులు తమ మాటలతో ఇతరులను ఎలా ఆకట్టుకుంటారో.. ఇతరులను ఎలా బోల్తా కొట్టిస్తారో..ఇతరులు తనతో అలాగే ఉంటారేమో అనే భ్రమలో ఉంటారు.  ఈ కారణంగా వ్యక్తిగత జీవితంలో భాగస్వామి, స్నేహితులు,  కుటుంబ సభ్యుల మాటలను కూడా అంత తేలికగా నమ్మరు.  వారిని విశ్వసించరు. ఈ కారణం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య అపనమ్మకం చాలా ఎక్కువగా తొంగిచూస్తుంది. మానిప్యులేటర్ వ్యక్తులు ఇతరులకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.  ఎందుకంటే ఇలాంటి వ్యక్తులతో ఉండటానికి, వారితో మాట్లాడటానికి ప్రజలు ఇష్టపడరు.  మానిప్యులేటివ్ వ్యక్తులు ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ విషయాలను వ్యాప్తి చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మానిప్యులేటివ్ వ్యక్తులు తమ సొంత ఇష్టాలను,  వారి సొంత అవసరాలను కూడా వారే అర్థం చేసుకోలేరు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో గందరగోళంగా ఉంటారు.  ఎందుకంటే వారి దృష్టి ఎప్పుడూ ఎక్కువగా ఇతరులపైనే ఉంటుంది.  సింపుల్ గా చెప్పాలంటే మానిప్యులేటర్లు ఎక్కువగా ఇతరుల జీవితాలను చూస్తూ.. ఇతరుల జీవితాలను తమ చెప్పుచేతలలో ఉంచుకోవడంలోనే కాలం గడిపేస్తుంటారు. మానిప్యులేటివ్ వ్యక్తుల ప్రవర్తన ఆఫీసులలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రవర్తన కారణంగా సహోద్యోగుల నుండి,  పై అధికారుల నుండి   చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందరి నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులను తమ చెప్పుచేతలలో పెట్టుకోవాలనే ఆలోచనల కారణంగా ఒత్తిడి, ఆందోళన ఏర్పడతాయి.  వీటి కారణంగా మానసిక,  శారీరక ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. క్రమంగా ఒకరిని నియంత్రించాలని ప్రయత్నించడమనే అలవాటు.. ఆ నియంత్రించే వ్యక్తుల మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం అవుతుంది.                                              *రూపశ్రీ.  

పిల్లలు గుణవంతులుగా ఉండాలంటే ఇలా పెంచాలి..!

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు గుణవంతులుగా,  తెలివిగా,  మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటారు.  ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించడం నుండి వారిని క్రమశిక్షణతో ఉంచడానికి ప్రయత్నించడం వరకు అన్నీ చేస్తారు.  అయితే నేటి కాలం పిల్లలు చాలా పెంకిగా ఉంటారు. అయితే అతి గారాబం,  లేదంటే అతి క్రమశిక్షణ అన్నట్టు ఉంటుంది పిల్లల పెంపకం.  కానీ పిల్లలు బుద్దిగా, గుణవంతులుగా, తెలివిగా ఉండాలన్నా..  పిల్లల ప్రవర్తన చూసి నలుగురు మెచ్చుకోవాలన్నా పిల్లలను పెంచడంలో ఆ కింది చిట్కాలు పాటించాలి. బ్రెయిన్ ఎక్సర్సైజ్.. పిల్లల మనస్సు, మెదడు అన్నింటినీ పీల్చుకునే స్పాంజ్ లాంటిది. పిల్లల వయస్సుకి అనుగుణంగా కొన్ని మెదడు వ్యాయామ ఆటలను ఆడించాలి.  వాటిని పిల్లల రోజువారీ పనులలో భాగం చేయాలి.  బోర్డ్ గేమ్‌లు, బిల్డింగ్ బ్లాక్‌లు, పజిల్స్, చెకర్స్,  చెస్ వంటివి బోలెడు ఆటలు ఆడించాలి. ఇవి పిల్లల స్మార్ట్‌నెస్‌ని పెంచుతాయి.  ఆటలు..  పిల్లలను స్మార్ట్‌గా,  తెలివైన వారిగా మార్చడానికి ఇండోర్,  అవుట్‌డోర్ గేమ్‌లు ఆడటంపై  దృష్టి పెట్టాలి. దీంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది. వారి ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం స్థాయి పెరుగుతుంది. సంగీతం..  కొన్ని అధ్యయనాలలో సంగీతాన్ని అభ్యసించిన పిల్లలు పెద్దల కంటే ఎక్కువ IQ స్థాయిని  కలిగి ఉంటారని తేలింది. పాటలు,  సంగీతం పిల్లల ఊహా శక్తిని, ఆలోచనను మెరుగుపరుస్తాయి. వీడియో గేమ్..  పిల్లల అభ్యాస నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన అనేక గేమ్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఒక పరిమితిలో మాత్రమే ఆడుకునేలా పిల్లలకు ఒక టైమింగ్ పెట్టాలి తప్ప ఎప్పుడూ వాటికి అతుక్కుపోయేలా చేయకూడదు. పోషణ..  పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు జంగ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే  జంక్ ఫుడ్ ఎక్కువగా  తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జంగ్ ఫుడ్,  ఫాస్ట్ ఫుడ్,  బయటి ఆహారాలకు బదులుగా ఇంట్లోనే వండిన తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. సమతుల ఆహారం అందించాలి.  పుస్తక పఠనం..  పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మంచి  మార్గం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం.  ఇంట్లో పిల్లలకు తగిన  పుస్తకాలు ఉంచాలి.  పిల్లలు మంచి పుస్తకాలు కొనే అలవాటును ప్రోత్సహించాలి.   తల్లిదండ్రులు కూడా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా పుస్తక పఠనం పట్ల ఆకర్షితులవుతారు.                                                    *రూపశ్రీ.

యేసుక్రీస్తు జన్మ దినం.. ప్రేమ, ఆనందం, శాంతి మార్గం.. క్రిస్మస్ వేడుక..!

  ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో మూలన  ఏదో పండగనో, ఉత్సవమో జరుగుతూనే ఉంటుంది.  భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే మన భారతదేశంలో అయితే వీటికి అస్సలు లోటు ఉండదు.  ఒక వైపు హిందూ దేవుళ్ల పూజలు,  ముస్లిం సోదరుల నమాజ్ లు,  క్రిస్టియన్ సోదరుల ప్రార్థనలతో దేశం బోలెడు సంస్కృతులు,  సంప్రదాయాలతో అలరారుతుంది. అయితే హిందువులకు ఉన్నన్ని పండుగలు ముస్లిం లకు,  క్రిస్టియన్స్ కు ఉండవనే విషయం అందరికీ తెలిసిందే.. క్రిస్టియన్స్ ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ప్రధానమైనది. ప్రతి పండుగ ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు అందించినట్టే క్రిస్మస్ కూడా ప్రపంచానికి సందేశాన్ని ఇస్తుంది. యేసు క్రీస్తు జననంమే క్రిస్మస్ పండుగకు ఆధారం. క్రీస్తు జన్మించిన తేదీని ఖచ్చితంగా గుర్తించలేకపోయినప్పటికీ డిసెంబర్ 25న క్రిస్మస్ జరపడం 4వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. రోమన్ సామ్రాజ్యంలో పాగన్ పండుగ అయిన "సోలిస్ ఇన్విక్టి" (అజేయ సూర్యుడు జన్మదినం)ని క్రైస్తవ పండుగగా మార్చినట్టు చరిత్రకారులు భావిస్తారు.  యేసు క్రీస్తు పుట్టుకను శాంతి, ప్రేమకు సంకేతంగా భావిస్తారు. ఆయన తన బోధనల ద్వారా  మానవత్వం, సద్గుణాలు, సమానత్వం బోధించారు. క్రిస్మస్ సంప్రదాయాలు.. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు ప్రత్యేకమైన  ఆచారాలు ఉన్నాయి. ఇవి ప్రాంతీయ సంస్కృతులతో ముడిపడినప్పటికీ, కొన్ని సాధారణ సంప్రదాయాలు అన్ని చోట్లా కనిపిస్తాయి. క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. ఫిర్ చెట్లు క్రిస్మస్ ట్రీగా పాపులర్ అయ్యాయి.  మొదటిసారిగా 16వ శతాబ్దంలో జర్మనీలో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. చెట్లను నక్షత్రాలు, బొమ్మలు, మిఠాయిలతో అలంకరిస్తారు.  క్రిస్మస్ పాటలు లేదా క్యారల్స్ పాడడం సంప్రదాయమైంది. “సైలెంట్ నైట్,” “ఓ హోలీ నైట్,” “జింగిల్ బెల్స్” వంటి పాటలు ప్రసిద్ధి చెందాయి. యేసు జన్మదినం సందర్భంగా మేఘదూతలు ఆయనకు ఇచ్చిన కానులని ఆధారంగా చేసుకుని ఈ రోజున గిఫ్ట్‌లు ఇచ్చే సంప్రదాయం మొదలైంది.   పిల్లలు  బాగా ఇష్టపడే శాంటాక్లాజ్  గిఫ్ట్‌లను అందజేస్తూ, పిల్లల్ని హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తాడు. క్రిస్మస్ వేడుకలో చేసే   ప్లమ్ కేక్ చాలా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి కుటుంబం తమకు తగిన వంటకాలు తయారు చేస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటుంది. కాగితం నక్షత్రాలు, క్రిస్మస్ లైట్స్, క్రిబ్ సెట్స్ తో ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. ఇండియాలోని   క్రైస్తవులు క్రిస్మస్ ట్రీకి బదులుగా మామిడి లేదా వెదురు చెట్లను ఉపయోగిస్తారు. రంగురంగుల లైట్లు, కాగితం నక్షత్రాలతో  ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు.                                     *రూపశ్రీ.

ఎదుటివారిని సంతోషపెట్టడమనే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే

సంతోషం సగం బలం అని అంటారు. మనం సంతోషంగా ఉంటే సరిపోదు, మనవాళ్లన,  ఇతరులను కూడా సంతోషపెట్టాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత అని చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది మంచి విషయమే అయినా ఇలాంటి అలవాటు క్రమంగా మనిషి దుఃఖానికి కూడా కారణం అవుతుందంటున్నారు రిలేషన్ షిప్ కౌన్సిలర్లు. దీనికి కారణం ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసం తాపత్రయపడేవాళ్ల గురించి పట్టించుకునేవారు బహుశా తక్కువే ఉంటారు. మరికొందరు ఇలాంటివారి సంతోషాన్ని కూడా అణిచివేయాలని, చిదిమేయాలని చూస్తారు. దీనికి కారణం తమను పట్టించుకోకుండా వ్యక్తిగత సంతోషం గురించి ఆలోచిస్తారేమో అనే అనుమానంతో కూడిన స్వార్థం. ఇతరుల సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడతారు. తమకంటూ ఎలాంటి వ్యక్తిగత ఆనందాలు ఏర్పరచుకోలేరు. ఇతరుల సంతోషం కోసం ఆరాటపడే అలవాటు మార్చుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే  ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సంతోషం అవసరం. ఈ అలవాటు ఎలా మార్చుకోవాలంటే.. కాదని చెప్పడం నేర్చుకోవాలి.. ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెబితే వారు బాధపడతారేమోననే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన ఇలాంటి వారు తమకు నష్టం కలిగినా, తమకు ఇబ్బంది ఉన్నా ఇతరులకు కాదని చెప్పకుండా అనవస ప్రయాసలు పడుతుంటారు. చిన్న విషయాలలో ఇలా ఉన్నా పర్లేదు.. కానీ పెద్ద పెద్ద విషయాలలో మాత్రం ఇలాంటి మొహమాటపు బరువు మీద వేసుకోకూడదు. ఏ పని అయినా చేసే ఉద్దేశ్యం లేకపోయినా, వీలు లేకపోయినా, తెలియకపోయినా నావల్ల కాదు అని స్పష్టంగా చెప్పడం మంచిది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిదని పెద్దలు చెప్పిన మాట మరవకూడదు. సరిహద్దు గీతలుండాలి.. ఇతరులు అతి చనువుగా దగ్గర చేరి స్వార్థంతో పనులు చేయించుకుంటారు. మీ సమయాన్ని చాలా ఈజీగా లాక్కుంటారు. ఆ పనులన్నీ అయ్యాక కోల్పోయిన సమయం గుర్తొచ్చినప్పుడు, వ్యక్తిగతంగా నష్టపోయనప్పుడు తప్ప  తాము చేసిన పని పర్యావసానం అర్థం కాదు చాలామందికి. కొందరైతే తమ అవసరాలు ఖచ్చితంగా తీరాల్సిందేనని బలవంతం చేస్తారు. ఎమోషన్ బ్లాక్మెయిల్ కు కూడా వెనుకాడరు. అందుకే ప్రతి ఒక్కరినీ ఒక్క సరిహద్దు గీత వద్దే ఉంచాలి. మార్పు సాధ్యమే.. ఇతరులను సంతోషపెట్టడమనే అలవాటు వల్ల నష్టాలు ఎదుర్కొన్నా సరే కొందరు అంత ఈజీగా మారలేరు. మారాలని అనుకుని  తరువాత మళ్లీ మామూలైపోయేవారు ఉంటారు. కానీ ఈ అలవాటు మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటూ వాటిలో లీనమైపోవడం మంచిది. దీనివల్ల ఇతరులు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు పనులున్నాయని చెప్పడానికి వీలవుతుంది. పైపెచ్చు మీ జీవితంలో అభివృద్ది కూడా మొదలవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరితో అయినా ఏదైనా మాట్లాడుతున్నా మరీ మెతకగా మాట్లాడకూడదు. "నో" అనే మాట చెప్పడానికి సంకోచించకూడదు. చాలా ధృడంగా ఆ మాట చెప్పాలి. లేదంటే స్వార్థపరులు ఆ మాటను కూడా చాలా సిల్లీగా కొట్టిపడేసి తమ అవసరాలు తీర్చమని ఫోర్స్ చేస్తారు. వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని గుర్తించాలి.. ఇతరుల కోసం బ్రతుకుతూ ఇతరులను సంతోషపెట్టేవారు ఎక్కువగా తమ ఇష్టాలను, వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే తమకంటూ ఇష్టాలు, వ్యక్తిగత జీవితం ఉన్నాయనే విషయాన్ని గుర్చించరు. కానీ వాటిని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీస్ లో కొలీగ్స్, బంధువులు ఇలా అన్నిచోట్లా మీకు ఇష్టాఇస్టాలను వ్యక్తపరచడం, నచ్చని వాటిని నచ్చలేదని చెప్పడం అలవాటు చేసుకోవాలి. మీకంటూ స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలు ఉన్నాయని ఇతరులు గుర్తించేలా మీరే చేయాలి.                                                      *నిశ్శబ్ద

ఓ గొప్ప నాయకుని ఆకాంక్ష.. గుడ్ గవర్నెన్స్ డే 2024..!

  స్వతంత్ర భారతదేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించటానికి ఎంతో మంది నాయకులు కృషి చేశారు. ఒక్కో నాయకునిదీ ఒక్కో ప్రత్యేకత. కానీ  ఒక కాంగ్రేసేతర  ప్రధానిగా పదవీకాలం పూర్తిచేసిన తొలి నాయకునిగా, వ్యక్తిగతంగా రాజకీయ వర్గాల్లో  చాలామంది ఇష్టపడే వ్యక్తిగా, మన దేశ భవిష్యత్తు కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న నాయకునిగా ఇప్పటికీ మంచి పేరున్న గొప్ప నాయకుడు ఒకరున్నారు. ఆయనే  అటల్ బిహారి వాజపేయి. డిసెంబర్ 25, 1924న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించిన అటల్ బిహారి వాజపేయి ఒక గొప్ప రాజకీయ నాయకుడు, కవి, వక్త కూడా.. ఆయన మూడు సార్లు భారతదేశ ప్రధానమంత్రిగా సేవలందించి, దేశ అభివృద్ధిలో  తనదైన ముద్ర వేశారు. ఆయన పాలనా  సమయంలో గోల్డెన్ క్వాడ్రిలాటరల్ వంటి ప్రాజెక్టులతో పాటు,  అనేక ఆర్థిక సంస్కరణలు, గ్లోబల్గా మన దేశ పరిస్థితి మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల వాజపేయికున్న  నిబద్ధత వల్ల ఆయన నాయకత్వం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఆయన జయంతినే  ప్రతీ సంవత్సరం గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నాం. గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు మొదలైంది.. ఈ దినోత్సవం జరుపుకోవటం మొదట 2014లో ప్రారంభమైంది. డిసెంబర్ 23, 2014న అటల్ బిహారి వాజపేయిగారికి  భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఆ సమయంలోనే కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించారు. ఈ దినోత్సవం వాజపేయి వారసత్వాన్ని స్మరించడమే కాకుండా.. పారదర్శక, బాధ్యతాయుత, సమగ్ర పాలనను ప్రోత్సహించడానికి పౌరులు, అధికారులు కట్టుబడి ఉండాలని తెలియజేస్తుంది. గుడ్ గవర్నెన్స్ వల్లనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.   2024 థీమ్.. డిసెంబర్ 25, 2024న అటల్ బిహారి వాజపేయి 100వ జయంతి కావటం వల్ల ఈ సారి జరగబోయే గుడ్ గవర్నెన్స్ డే ఎంతో ప్రత్యేకమైనది.  ఈ  సంధర్భంగా ‘పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (DARPG)’ మొదలుపెట్టారు.  డిసెంబర్ 19 నుండి 24 వరకు ‘గ్రామాల వైపు పరిపాలన’ అనే క్యాంపెయిన్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమం గ్రామీణ స్థాయి దాకా  పాలనను చేరవేయడం.  అలాగే గ్రామీణ ప్రజల అవసరాలకు,  పాలన సేవలను అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పెట్టుకుంది. గుడ్ గవర్నెన్స్ డే వల్ల ఇవన్నీ సాధ్యం అయ్యాయని తెలుసా..? డిజిటల్ ఇండియా ద్వారా  సులభంగా ప్రభుత్వ సేవలను పొందడానికి ఉపయోగపడింది. నేడు అందరూ లావాదేవీలు కూడా డిజిటల్ గానే చేయగలుగుతున్నామంటే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యనే కారణం. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా  దేశ పౌరుల్లో పరిశుభ్రత పట్ల అవగాహనని పెంపొందించడానికి  మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఎంతో మార్పు సాధ్యమైంది.   ప్రభుత్వ ప్రణాళికల్లో ప్రజల అభిప్రాయాలు సేకరించడం వల్ల కూడా ప్రజలకి సరైన పాలన అందించటం సాధ్యమౌతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) అమలు చేయటం వల్ల  డబ్బు మధ్యలో  ఉండే అవినీతిపరుల చేతికి చిక్కకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు సబ్సిడీలు చేరుతున్నాయి. పాలనా లోపం లేకుండా ప్రతీ నాయకుడు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు, మన  దేశ స్థితి గతులు ఎంతో మెరుగుపడతాయి. మన దేశ ప్రగతి కోసం పాటుపడిన గొప్ప నాయకులని తలచుకుంటూనే, తమ  బాధ్యతని సరిగా నిర్వర్తించని నాయకులని  ప్రజలు ప్రశ్నించగలగాలి. అలా ప్రశ్నించే చట్టాలు కూడా రావాలి. నాయకులుగా, అధికారులుగా, పౌరులుగా మనమంతా కలిసి పనిచేసినప్పుడు మన భారత దేశాన్ని ‘అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం’ నుంచి ‘అభివృద్ధి చెందిన దేశంగా’ మార్చవచ్చు.                      *రూపశ్రీ.