enforcement directorate to investigate andhra pradesh madyam scam

ఏపీ మద్యం కుంభకోణం.. రంగంలోకి ఈడీ?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తునకు కేంద్రం పచ్చ జెండా ఊపేసిందా?  ఏపీ మద్యం కుంభకోణంపై లోక్ సభలో ప్రస్తావించిన నరసరావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు ఇదే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) ప్రత్యేకంగా భేటీ అయ్యి తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అంద చేశారు.  అయితే విశ్వసనీయ సమాచారం మేరకు లావు అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనతో భేటీ కాలేదనీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే స్వయంగా లావును పిలిపించుకుని మద్యం కుంభకోణంపై ఆరా తీశారు. ఆ సందర్భంగా ఎంపీ ఇచ్చిన పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఇది జరిగిన తరువాత ఎంపీ లావు బుధవారం (మార్చి 26) అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వరుసగా జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంభకోణంపై తెలుగుదేశం ఎంపీ డిమాండ్ కు కేంద్ర హోంమంత్రి  సానుకూలంగా స్పందించారనీ, ఈడీని రంగంలోకి దించేందుకు అంగీకరించారనీ పరిశీలకులు భావిస్తున్నారు.   వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో  అమలు చేసిన మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. జగన్ మద్యం పాలసీ దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణంగా తెలుగుదేశం మొదటి నుంచీ చెబుతూ వస్తున్నది. ఏపీ మద్యం కుంభకోణంతో పోలిస్తే.. ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదని తెలుగుదేశం వాదిస్తోంది. ఏపీ మధ్యం కుంభకోణం వేల కోట్లేనని అంటోంది. ఏపీలో మూడు మద్యం విషయంలో మూడు స్థాయిలలో అవినీతి జరిగిందని లోక్ సభ వేదికగా లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆరోపించారు.   ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్.. మూడింటినీ వైసీపీ నేతలు తమ అధీనంలో ఉంచుకుని అక్రమాలకు పాల్పడ్డారని లావు లోక్ సభలో సోదాహరణంగా చెప్పారు. అంతే కాకుండా ఈ మద్యం కుంభకోణం సొమ్ము దాదాపు 4 వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించేశారని లావు ఆరోపించారు.  మొత్తం మీద లావు పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించిన తరువాత కేంద్రం కూడా ఏపీ మద్యం కుంభకోణం నిగ్గు తేల్చాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. దీనిపై   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారనీ, ప్రస్తుతం ఏపీ మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణలో విదేశాలకు మద్యం సొమ్ము తరలినట్లు నిర్ధారణ కావడంతో ఇక ఈడీని కూడా రంగంలోకి దింపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. ఆ కారణంగానే కేంద్ర హోంమంత్రితో భేటీ అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారని చెబుతున్నారు.  

Chandrababu words in Kunamnen mouth

సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని నోట చంద్రబాబు మాట 

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు టూరిజంను బాగా ప్రమోట్ చేశారని  తెలంగాణలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘‘ గతంలో  ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజం ప్రధానం  అనేవారు. ఏ ఇజం లేదన్నప్పుడు మాకు కోపం వచ్చేది. నిజంగా ఖర్చులేనిది ఏదైనా ఉందంటే అది టూరిజం’ అని  కూనంనేని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ మీద ప్రసంగిస్తున్న సమయంలో కూనంనేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. వామ పక్ష పార్టీలకు బిజెపి బద్ద శత్రువు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి టిడిపి మిత్రపక్ష పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి  సిపిఐ మిత్ర పక్షంగా ఉంది. కాంగ్రస్కు బద్ద శత్రువు బిజెపి.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో సిపిఐ పోటీ చేసింది. ఉమ్మడి పది జిల్లాల్లో 30 సీట్లలో సిపిఐకి 10 వేల ఓట్ బ్యాంక్ ఉందని కూనం నేని పలు సందర్బాల్లో చెబుతుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు  బిఆర్ఎస్ కు మిత్ర పక్షంగా ఉన్న సిపిఐకి  మిత్ర ధర్మంగా ఒక్క స్థానం ఇస్తామని కెసీఆర్ ఖరాఖండిగా  చెప్పడంతో బిఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ఆ పార్టీ అధికారంలో రావడానికి సిపిఐ ముఖ్య భూమిక వహించింది. పార్టీలకు, పొత్తులకతీతంగా కూనంనేని కుండబద్దలు కొట్టి మాట్లాడటం చర్చనీయాంశమైంది

tdp mp lavu sri krishna devarayulu meet union home minister

అమిత్ షాతో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు భేటీ.. కారణమేంటో తెలుసా?

తెలుగుదేశం ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం (మార్చి 25) భేటీ అయ్యారు. సాధారణంగా అయితే ఇటువంటి భేటీలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ లావు శ్రీకృష్ణ దేవరాయులు అమిత్ షాతో భేటీ అయిన సమయం, అంతకు ముందు రోజు అంటే సోమవారం (ఫిబ్రవరి 24) లోక్ సభలో లావు ప్రసంగం తరువాత అమిత్ షాతో ఆయన భేటీ కావడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా ఆయన పలు పత్రాలను అమిత్ షాకు అందజేయడమే కాకుండా వాటికి సంబంధించిన విషయాలను వివరించారు. లావు ఇచ్చిన పత్రాలను అమిత్ షా కూడా ఆసక్తిగా చూశారనీ, ఆయన వివరణలను శ్రద్ధగా విన్నారనీ తెలుస్తోంది. అయితే ఈ పత్రాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలకు సంబంధించినవి కావని పరిశీలకులు అంటున్నారు.   సోమవారం (మార్చి 24) లోక్ సభలో లావు శ్రీకృష్ణ దేవరాయులు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీ మద్యం కుంభకోణం ఎన్నో రెట్టు పెద్దదని పేర్కొన్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయలను అక్రమంగా ఢిల్లీకి తరలించారనీ, దీని వెనుక వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఉన్నారనీ లావు ఆరోపించారు. అంతే కాకుండా ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే అంటే మంగళవారం (మార్చి 25)న లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడమే ఈ ప్రాధాన్యతకు కారణం. ఈ భేటీలో లావు శ్రీకృష్ణ దేవరాయులు.. లోక్ సభలో తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అమిత్ షాకు అందజేయడమే కాకుండా మరో సారి ఈడీ దర్యాప్తు డిమాండ్ ను గట్టిగా చేశారనీ ఏపీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  

CBI RAIDS ON CHATTISGHAR FORMER CM

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం నివాసంలో సీబీఐ సోదాలు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్ గఢ్  మాజీ ముఖ్యమంత్రి  భూపేశ్ బఘేల్  నివాసంలో సీబీఐ అధికారలు సోదాలు నిర్వహిస్తున్నారు,  భూపేశ్ బఘేల్ నివాసంతో పాటు  రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలు,   సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  అదే విధంగా బఘేల్  సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసాలలో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  వాస్తవానికి భూపేశ్ ప్రభుత్వ హయాంలో మద్యం, బొగ్గు, మహాదేవ్ సత్తా యాప్ వంటి అనేక కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు ఇటీవల  బాఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించారు.  ఈ సోదాలు ఈ నెల  10న జరిగాయి. ఛత్తీస్ గఢ్ లిక్కర్ కుంభకోణంలో భూపేశ్ బాఘేల్ కుమారుడిపై మనీలాండరింగ్  కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే  భిలాయ్ లోని ఆయన నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. ఇప్పుడు తాజాగా బహేల్ నివాసాలపై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నది. 

pawan kalyan tour mogalthuru and penugonda

మొగల్తూరు, పెనుగొండలలో పవన్ పర్యటన 28న

శ్రీమంతుడు సినిమాలో ఊరు చాలా ఇచ్చింది.. తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతాను అనే డైలాగ్ ఒకటి ఉంది.   పుట్టి పెరిగిన ఊరు అభివృద్ధి కోసం ఏదో ఒకటి చేయాలన్న సందేశం ఆ డైలాగ్ లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను పుట్టి పెరిగిన గ్రామాల కోసం ఏదైనా చేయాలని తపన పడుతున్నారు. వాటి రుణం తీర్చుకోవాలని ఆరాట పడుతున్నారు.  అందుకే తాను పుట్టి పెరిగిన మొగల్తూరు అభివృద్ధిపై దృష్టి సారించారు.  ఈ నేపథ్యంలోనే  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, పెనుగొండలలో పర్యటించనున్నారు. మొగల్తూరుతో పాటు పెనుగొండతో కూడా పవన్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ప్రత్యేకంగా ఆ రెండు గ్రామాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆయా గ్రామాలలో ప్రజల సమస్యలన తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కూడా చేయనున్నారు.   ఈ నెల 28 ఉదయం మొగల్తూరు. సాయంత్రం పెనుగొండ గ్రామాలలో పర్యటించనున్న పవన్ కల్యాణ్ రెండు గ్రామాలలోనే గ్రామ సభలు నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా ప్రజల నుంచి గ్రామాభివృద్ధి కి సంబంధించిన ప్రతిపాదనలు స్వీకరిస్తారు. రెండు గ్రామాలలో  మౌలిక వసతుల కల్పన, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

news paper print edition with ai technology

ఏఐ టెక్నాలజీతో న్యూస్ పేపర్ ప్రింట్ ఎడిషన్!

రిపోర్టర్లు లేరు… సబ్ ఎడిటర్లు లేరు… ప్రూఫ్ రీడర్లు లేరు… పేజీ మేకప్ ఆర్టిస్టుల్లేరు… ఫోటోగ్రాఫర్లు లేరు… ఐనా సరే, డెయిలీ పేపర్ పబ్లిషైంది… ప్రింట్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చేశాయి. నిజం..  ఇల్ ఫోగ్లియోఅనే ఇటాలియన్ పత్రిక తొలిసారిగా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్   సాయంతో ఒక ఎడిషన్‌ను ప్రచురించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం 2025 మార్చి 18 నుంచి ప్రారంభమైంది, ఒక నెలపాటు కొనసాగుతుంది. జర్నలిజంలో ఏఐ ప్రభావాన్ని పరీక్షించడానికి,  దాని ఉపయోగాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడాని ఈ పత్రికను తీసుకువచ్చినట్లు ఇల్ ఫోగ్లియో సంపాదకుడు క్లాడియో సెరాసా  తెలిపారు. జర్నలిజాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఇదొక సదవ కాశంగా అభివర్ణించారు.  

ec shock to politicians

రంజాన్ వేళ పొలిటీషియన్లకు ఈసీ షాక్

రంజాన్ పండగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో  ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొనడానికి అనుమతి లేదని ఈసీ పేర్కొంది.   ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో ఈసీ ఈ ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో కోడ్ కారణంగా రంజాన్ వేడుకలలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిథులు పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఏటా రంజాన్ మాసంలో ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీ. అలాగే  రాజకీయ పార్టీలు,   నేతలూ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుంటారు. ఎన్నికల కోడ్ పుణ్యమా అని ఈ సారి ఇక నుంచి అందుకు అవకాశం లేకుండా పోయింది. 

railway over bridge in pithapuram

రూ. 59.70 కోట్లతో పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం

పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేందర రోడ్డు, మౌలిక సదుపాయాల నిధి (ఆఆర్ఐఎఫ్) పథకం కింద సామర్లకోట- ఉప్పాడ రోడ్డులో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించింది. ఇందు కోసం 59 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.  గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చనున్నారు. ఇందు కోసం మంగళవారం (మార్చి 25) పరిపాలనా అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ తరువాత ఈ వ్యయాన్ని సీఆర్ఐఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం రియింబర్స్ చేస్తుంది.   రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు కావడం పట్ల పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని పవన్ కల్యాణ్ నెరవేర్చుకుంటున్నారని ప్రశంసలు గుప్పిస్తున్నారు. 

lady aghori a;ope with engineering student. mangalagiri

మంగళగిరి అమ్మాయితో ఉడాయించిన లేడీ అఘోరీ

అఘోరినంటూ గత కొంత కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేస్తున్న వ్యక్తి ఓ అమ్మాయితో పరారవ్వడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.  మాయమాటలు చెప్పి  తమ కుమార్తెను అఘోరి వశపరుచుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో అఘోరీ మంగళగిరి వచ్చిన సమయంలో పరిచయమైన బిటెక్ విద్యార్థినిని అఘోరీ వశపరుచుకుంది.  తనకు పరిచయం అయిన విద్యార్థిని కోసం అఘోరీ పలుమార్లు మంగళగిరికి వచ్చిందని చెబుతున్నారు.   ఈ మేరకు ఆ విద్యార్థిని తండ్రి తురిమెల కోటయ్య సోమవారం మంగళగిరి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోటయ్య నెలల కిందట రోడ్డు మీద నగ్నంగా హల్ చల్ చేస్తున్న అఘోరీకి పోలీసుల విజ్ణప్తి మేరకు బట్టలు కప్పిందన్నాడు. అప్పటి నుంచీ అఘోరీ తన కుమార్తె ఫోన్ నంబర్ తీసుకుని మాట్లాడేదనీ, ఒకటి రెండు సార్లు తమ ఇంటికి కూడా వచ్చిందనీ వివరించారు. అఘోరీ తన కుమార్తెను  కూతుర్ని మాయ మాటలతో మోసం చేసి ఆకుపసరు తో  లేపనాలు పూసి, వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణి ని చేస్తారని చెప్పి  తనవైపు తిప్పుకుందని భోరుమన్నాడు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థిని సోదరుడు కూడా ఆఘోరీ తీరుపై ఆరోపణలు చేశాడు. అఘోరీ తనను లైంగికంగా వేధించిందన్నాడు. దీంతో అఘోరీ వ్యవహారం మరో సారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

markaapuram mla over action

మార్కాపురం ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్

ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి .ఈయన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, మార్కాపురం నియోజకవర్గంలోని సమస్యలపై   ఈ నెల 22న ప్రజా దర్బార్ నిర్వహించారు.  ఆ ప్రజా దర్బార్‌ నిర్వహించిన నారాయణరెడ్డి ప్రజల ముందు సెలైన్ పెట్టించుకుని ఓవర్ యాక్షన్ చేయడం నవ్వులపాలవుతోంది.  మహిళా దినోత్సవం పురస్కరించుకుని  సిఎం చంద్రబాబు ఇటీవల మార్కాపురం వచ్చారు.  తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తల మీటింగ్ లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చురకలు అంటించారు. తీరు మార్చుకోకపోతే పోతే చర్యలు ఉంటాయని తీవ్రంగానే హెచ్చరించారు.  సిఎం చంద్రబాబు ఎమ్మెల్యే కందులపై అలా కార్యకర్తల ముందు మండిపడటంతో  ఆయన  పరువు పొయినట్లైంది. సొంత క్యాడర్ ముందు డ్యామేజ్ అయ్యానని ఆయన తెగ ఫీల్ అవుతున్నారంట. ఆ క్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రజలలో సానుభూతి పొందటానికి  ఓవర్ యాక్షన్ చేస్తున్నారని  నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రజా దర్భర్ లో సెలైన్ పెట్టించుకోవడం అందులో భాగమే అంటున్నారు.

jail fear to former minister kakani

కాకాణికి జైలు గండం?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీలో అంతో ఇంతో యాక్టివ్‌గా ఉన్న కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. తాజాగా క్వార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. మరో వైపు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణిని నిందితుడిగా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్‌ కుంభకోణం వెనుక కూడా కాకాణి హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో కాకాణికి కష్ట కాలం తప్పదంటున్నారు.  తాజా కేసుతో మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్దమైనట్లు జరుగుతున్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది . ఓ మైన్ ని కొల్లగొట్టి అక్రమంగా 250 కోట్ల రూపాయలకు పైగా దోచేసినట్లు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు మేరకు మైనింగ్, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ అభియోగంపై కేసులు కూడా నమోదు చేశారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఈ కేసులో నాలుగో నిందితుడిగా చేర్చారు.  కాకాణి అక్రమాలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర మైనింగ్ శాఖతో పాటు కేంద్ర మైనింగ్ శాఖలకు కూడా ఫిర్యాదు చేశారు. 250 కోట్ల విలువైన ఖనిజ సంపాదన దోచుకున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. అప్పట్లో  వైసీపీ ప్రభుత్వం ఉండడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైసిపి ప్రభుత్వంలో అదే మైన్స్‌ వద్ద సోమిరెడ్డి మూడు రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష కూడా చేశారు. మైనింగ్‌ లోడ్లతో రవాణాకు సిద్ధంగా ఉన్న 40 లారీలను తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. అప్పట్లో అది పెద్ద కలకలమే రేపింది.  వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరగదని భావించిన సోమిరెడ్డి కేంద్ర మైనింగ్‌ శాఖకు ఫిర్యాదు చేశారు. కేంద్రం ఆదేశాలకు తోడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ కేసుకు ప్రాణం వచ్చింది. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కాకాణి స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే  గత ప్రభుత్వంలో మంత్రిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన కాకాణికి జైలు గండం పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది

lokesh shock to ycp social media activist ippala ravindra reddy

మందలో వచ్చి.. ముందు నిలబడిన ‘ఇప్పాల’

చెప్పకుండా వచ్చినందుకు షాక్ ఇచ్చిన లోకేష్ అత్యంత హేయంగా, నీచంగా, ద్వేష భావంతో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల రవీంద్రరెడ్డి నేడు నారా లోకేష్ ముందు ప్రత్యక్షమై ఒక బిజినెస్ మీటింగ్ చేశారు.  అయితే రవీంద్రారెడ్డి అని లోకేష్ కి తెలియకపోవచ్చు. కానీ ఆలస్యంగా విషయం తెలుసుకున్న లోకేష్ మందలో వచ్చి తనకు ఝలక్ ఇచ్చిన రవీంద్రకు అంతే వేగంగా షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు.  వ్యాపార సమావేశం నిమిత్తం మంగళవారం (మార్చి 25) సిస్కో కంపెనీ ప్రతినిథులు కొందరు మంత్రి నారా లోకేష్ ని కలిశారు. అదే కంపెనీలో సౌత్ ఇండియా టెరిటరీ ఎక్కౌంట్స్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల కూడా ఆ బృందంలో ఒక సభ్యుడిగా హాజరయ్యారు. ఈ విషయం గమనించని లోకేష్ అతడిని కంపెనీ సభ్యుడిగానే భావించారు. మాట్లాడి పంపించారు. ఇది గమనించి సోషల్ మీడియా హైలైట్ చేయడంతో షాక్ అయిన లోకేష్ వెంటనే  ‘సిస్కో’ కపెనీకి ఆప్పాలను ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ విధమైన ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీభాగస్వామిని చేయవద్దని లేఖ రాశారు. ఆ విధంగా లోకేష్ ప్రతి స్పందించారు. లోకేష్ సిబ్బందికి, అధికారులకు అతను ఎవరో తెలియక పోవచ్చు కానీ, మంత్రి లోకేష్ వద్దకు ఏదైనా క ంపెనీ ప్రతినిథుల బృందాన్ని పంపేటప్పుడు వారెవరో తెలుసోవడంలో సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విఫలమైందని తెలుగుదేశం అభిమానులు విమర్శిస్తున్నారు. 

trunamool congress supreme mamata benerjee

ఏ దేశమేగినా దీదీ .. దీదీనే !

ఏ దేశ  మేగినా, ఎందు కాలిడినా .. మమతా బెనర్జీ.. మమతా బెనర్జీనే. ఆమె మారరు.ఆమె వేషం అసలే మారదు. అదే ముతక చీర, అవే స్లిప్పర్స్. అదే నడక, అదే పరుగు. సహజంగా రాజకీయ నాయకులనే కాదు, మాములు మనమే అయినా విదేశాలకు వెళ్ళినప్పుడు, వేషం మార్చేస్తాం. సూటూబూటులోకి మారిపోతాం.నిజానికి విదేశాలకే వెళ్ళ నక్కర లేదు,  పెళ్ళికో పేరంటానికో వెళ్ళినా అంతే. సందర్భాన్ని బట్టి డ్రెస్ కోడ్ మారి పోతుంది. ఇక ఆడ వారి విషయం అయితే చెప్పనే అక్కర లేదు. కానీ, మమతా దీదీ  అలాక్కాదు. ఇక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళినా అంతే. ఆమె వేషం మారదు.   అవును. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు,  మమతా దీదీ ప్రస్తుతం లండన్‌  పర్యటనలో ఉన్నారు. పెట్టుబడుల కోసమే వెళ్ళారో, ఇంకెందు కోసం వెళ్ళారో ఏమో కానీ, పొద్దున్నే లేచి, ఆమె బస చేసిన హోటల్  కు దగ్గరలో ఉన్న హైడ్ పార్క్ లో వాకింగ్ కు వెళ్ళారు. అయినా.. ఆమె వేషం మారలేదు. అదే చీర, అవే చెప్పులు. ఆమె వెంట సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు కూడా ఉన్నారు. అయితే  ఆ  బృందంలోని  ఆడ, మగ సెక్యూరిటీ అధికారులు అందరూ అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా.. కోట్లు .. బూట్లు వేసుకుని నడిస్తే.. మమతా దీదీ మాత్రం మాములుగా చీరకట్టులో, స్వెటర్ మాత్రం వేసుకుని, కాళ్ళకు ఎప్పటిలానే స్లిప్పర్స్  మాత్రమే వేసుకుని కోల్ కతా వీధుల్లో నడిచిననట్లే చక చకా నడుస్తూ వాకింగ్ తో పాటు జాగింగ్ చేశారు. ఆమె వెంట ఇంగ్లాండ్ వెళ్ళిన  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కూనాల్ ఘోష్ మమతా దీదీ నడక వీడియోను తన అధికారిక ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పుడే కాదుట, గతంలోనూ ఆమె విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా  వేషం ఎప్పుడు మార్చ లేదుట.  అయితే  ఇలా ఏ దేశం వెళ్ళినా, మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు సహా ఏ దేశాధినేత వచ్చినా, ఎక్కడ ఎవరితో ఉన్నా మున్నూట అరవై రోజులు వేషం మార్చని మరో ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరో తెలుసు కదా, ఎస్, మన ఆంధ్ర ప్రదేశ్ సిఎం  నారా చంద్రబాబు నాయుడు. ఆయన కూడా  అంతే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అనేక దేశాల్లో పర్యటించారు.  బిల్ క్లింటన్ వంటి అనేక మంది దేశాధి నేతలతో దెశ విదేశాల్లో వేదికలు పంచుకున్నారు. అయినా, ఎప్పుడూ ఆయన వేషం మార లేదు. నిజానికి, చంద్ర బాబును మరో రూపంలో మరో వేషంలో ఉహించుకుందామన్నా నో ఛాన్స్. అవును, చంద్రబాబు మాములుగా అందరిలానే  ప్యాంటు,షర్టు ధరిస్తారు. షూస్ వేసుకుంటారు. కానీ, ప్యాంటు, షర్టు కలర్ మారదు. చిత్రం ఏమంటే కొలతలు కూడా  మారవు. అవును, 70 ప్లస్ లోనూ ఆయన శరీర కొలతల్లో పెద్దగా మార్పు కనిపించదు. బహుశా ఆయన పాటించే ఆహార నియమాలు, వ్యాయామం, జీవన శైలి, ఇందుకు కారణం కావచ్చును. ఇదే కోవకు చెందిన మరో ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. అయితే ఈయన కట్టేది కాషాయం. అవును, ఒకప్పుడు రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రస్ నాయకులు ఖద్దరు ఒక్కటే కట్టే వారు. ఇప్పడు టీ షర్టులు, జీన్స్ పాంట్స్ తో పార్లమెంట్’కు వస్తున్నారు. సరే అది వేరే విషయం అనుకోండి.  చివరగా, మనకు స్వాతంత్ర్యం తెచ్చిన  జాతి పిత మహాత్మా గాంధీ చివరి వరకు  కొల్లాయి మాత్రమే కట్టారు. అవును కొల్లాయి కడితేనేమి మా గాంధీ’ అనిపించుకున్నారు. ప్రాతః స్మరణీయులయ్యారు.

బోరుగడ్డ సమాజానికి ప్రమాదం!

బోరుగడ్డ అనీల్ కుమార్ సమాజానికి ప్రమాదకరం అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన సామాజిక మాధ్యమం వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలు, బూతులు తెలిసిందే. వారిరువురినే కాకుండా వారి ఇళ్లలోని మహిళలను కూడా కించపరిచేలా బోరుగడ్డ అనీల్ కుమార్ వ్యఖ్యలు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్లారు. అక్కడ తన తల్లి ఆరోగ్యం బాలేదనీ డాక్టర్ సర్టిఫికేట్ చూపుతూ బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇక్కడ వరకూ అంతా ఓకే కానీ, తల్లికి ఆరోగ్యం బాలేదంటూ అందుకు రుజువుగా బోరుగడ్డ అనిల్ కుమార్ కోర్టుకు సమర్పించిన డాక్టర్ సర్టిఫికేట్ నకిలీదని తేలడంతో వారు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ విచార‌ణ‌లో ఉండ‌గానే.. బెయిల్ గ‌డువు ముగిసిపోయింది. అదే సమయంలో తనకు  త‌న‌కు బెయిల్ పొడిగించాల‌ని మ‌రోసారి బోరుగ‌డ్డ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ రెండు పిటిషన్లనూ విచారించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం.. బెయిలు పొడగింపును నిరాకరించడమే కాకుండా, ఎక్కడున్నా సరే వెంటనే వచ్చి జైలు అధికారులకు లొగిపోవాలని ఆదేశించింది. ఆయన కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు కూడా. అయితే బోరుగడ్డపై  పోలీసులు న‌మోదు చేసిన న‌కిలీ డాక్ట‌ర్ స‌ర్టిఫెకెట్ కేసు, హైకోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించార‌న్న కేసులు   విచార‌ణ‌లో ఉన్నాయి. తాజాగా వీటిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. బోరుగ‌డ్డ వంటి వ్య‌క్తులు స‌మాజానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని.. ఇటువంటి వారిని ప్రత్యేకంగా చూడాలని వ్యాఖ్యానించింది. 

రాములమ్మకు బెర్త్ లేనట్లేనా ?

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. నలుగురు కొత్త  మంత్రుల ప్రమాణ స్వీకారానికి, కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నలుగురు కొత్త మంత్రులతో నాలుగు బెర్తుల భర్తీకి నిర్ణయం జరిగింది. అయితే  ఈ నలుగురిలో రాములమ్మ పేరు లేదు. అనూహ్యంగా ఢిల్లీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న రాములమ్మకు మంత్రి బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ తాజా ప్రోబబుల్స్ లో ఆమె పేరు లేదు. బహుశా  ఆర్ఏసీలో ఆమెకు బెర్త్ ఇస్తారో, లేక మిగిలిన రెండు ఖాళీల భర్తీ సమయంలో అవకాశం కల్పిస్తారో తెలియదు కానీ  ఇప్పటికైతే రాములమ్మకు క్యాబినెట్ బెర్త్ లేనట్లే అంటున్నారు.   తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ మంత్రి వర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినా, ఎందుకనో అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. కానీ  ఇప్పడు అధిష్టానమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి,  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ లను ఢిల్లీకి పిలిపించి మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకులతో మంత్రివర్గ విస్త్రరణతో పాటుగా  రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఆరు గ్యారెంటీల అమలు ఇతరత్రా విషయాలను సుదీర్గంగా చర్చించిన మీదట మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం అనుమతి ఇచ్చిందని  తెలుస్తోంది.  అయితే  మొత్తం ఖళీలు ఒకేసారి కాకుండా.. ప్రస్తుతానికి ఓ నలుగురు కొత్త మంత్రులతో  ఉగాది ముహూర్తానికి ప్రమాణ స్వీకారం కానిచ్చి, మిగిలిన రెండు మంత్రి పదవులు,  మరికొన్ని నామినేటెడ్ పదవుల భర్తీని మరో ముహూర్తానికి వాయిదా  వేసినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణతో పాటుగా,  డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్  ఖాళీలను కూడా భర్తీచేసేందుకు ఢిల్లీ పెద్దలు ఓకే చెప్పినట్లు సమాచారం.  మంత్రివర్గ విస్తరణకు ఓకే చెప్పడంతో పాటుగా, ప్రమాణ స్వీకారం చేసే నలుగురు కొత్త మంత్రుల పేర్లు కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వివేక్ వెంకట స్వామి, కోమటిరెడ్డి రాజ గోపాల రెడ్డితో పాటుగా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని నిజామబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిచాలనే నిర్ణయం జరిగింది. ఇక నిర్ణయం కావలసింది,ముహూర్తం మాత్రమే అంటున్నారు. అది కూడా ఉగాదికి  ముందుగానే ఉంటుందని అంటున్నారు.  అయితే  ఇక్కడితో అయిపోయినట్లు కాదని, ఇప్పటి జాబితాలో చివరి నిముషం వరకు ఎవరు ఉంటారో, కొత్తగా ఎవరు చేరతారో చెప్పలేమని,అందుకే ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో గప్ చిప్ గా వచ్చి చేరిన రాములమ్మ విజయశాంతిలాగా, మంత్రివర్గం జాబితాలో ఇంకెవరైనా ఫైర్ బ్రాండ్ దూసుకు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అవును మళ్ళీ రాములమ్మే, బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వచ్చని అంటున్నారు. అప్పట్లో ఎమ్మెల్సీతో పాటుగా హోం మంత్రి బెర్త్ కూడా రిజర్వు అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.   అదలా ఉంటే, అడిగిన ప్రతి సారీ నో ..అంటూ మంత్రివర్గ విస్తరణను ఎప్పటికప్పడు  వాయిదా వేస్తూ వచ్చిన అధిష్టానం ఇప్పుడు పిలిచి మరీ మంత్రి వర్గ విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే  గోనె ప్రకాష్ రావు వంటి కొందరు రాజకీయ విశ్లేషకులు ఇది కాంగ్రెస్ కల్చర్ లో భాగమని అంటున్నారు. గతంలో చెన్నా రెడ్డి హాయాంలోనూ ఇలాగే అధిష్టానం అనుమతి కోసం నెలలకు నెలలు నిరీక్షించిన మీదట, హఠాత్తుగా రాత్రి పిలుపు రావడమే కాకుండా మర్నాడే కొత్త మంత్రు ప్రమాణ స్వీకారం జరిగిందని గుర్తు చేస్తున్నారు. అంతే కదా  రాజు తలచు కోవాలే కానీ, విస్తరణ ఎంత పని.

భద్రాద్రి రామయ్య కు చీరాల భక్తుల నీరాజనం

పది టన్నుల వడ్లు గోటితో వలిచారు  భద్రాద్రి రాముడి కల్యాణంలో అతి పవిత్రంగా భావించేవి వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియెగిస్తారు. మరి ఇలాంటి విశిష్ట కలిగిన తలంబ్రాలు, అందులో జగత్ కల్యాణంగా భావించే భద్రాచలం సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో దేవతమూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల వారి కల్యాణానికి గడచిన 11 సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామా భక్త సేవ సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు ఒలిచి కల్యాణ వేడుకులకు తరలిస్తూ స్వామివారి సేవలో భక్తులు పునీతులవుతున్నారు. శ్రీరామనామ జపం చేస్తూ 10 టన్నుల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కల్యాణ వేడుకులకు తరలించడం ఆనవాయితీగా వస్తోంది. కల్యాణం మహోత్సవానికి అన్నీ తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందంటున్నారు నిర్వాహకుడు పొత్తూరి బాలకేశవులు.

ఎంపీల వేతనాలు సరే.. రైతుల మాటేమిటి?

లోకసభ, రాజ్యసభ సభ్యుల జీతాల భృత్యాలు పెరిగాయి.  వాస్తవానికి వీరి జీతాలు రెండేళ్ల కిందటే పెరగాల్సి ఉంది.  అయితే జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు పెంరిగింది. పెరగడమే కాదు.. ఈ పెంపు  2023 నుంచి అమలులోకి వస్తుంది.  రెండేళ్ల  అరియర్స్ కూడా ఎంపీలు అందుకుంటారు. గతంలో  ఎంపీలకు లక్ష రూపాయల వేతనం అందుకునే వారు. ఇప్పుడు అదనంగా 24 వేల రూపాయలు అందుతుంది. అంతే కాకుండా వారికి డిఏ కూడా 500 రూపాయలు పెరిగాయి. ఆఫీసు నిర్వహణకు,ఇంటి అద్దెకు నెలకు గరిష్టంగా రెండు లక్షల60 వేలు వస్తుంది. విమాన ప్రయాణాలు అయితే  ఏడాదికి 34 సార్లు ఉచిత ప్రయాణం. ఉచిత విద్యుత్, నీరు తదితర అలవెన్సులు ఇస్తారు. ప్రజా ప్రతినిధులకు జీతాలు పెంచడంలో తప్పులేదు. గతంలో అన్నీ త్యాగం చేసి ఎంపీలుగా పనిచేసిన వారు పదవి పూర్తయిన తరువాత  బతకడం కష్టంగా ఉండేది.  ప్రజా ప్రతినిధులకు  జీతాల పెంపు పట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన వారి పింఛన్ల విషయాన్ని కూడా కేంద్రం పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సామాజిక  పింఛన్లే  4000 రూపాయలు ఉన్నాయి. కానీ ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారికి వచ్చే పెన్షన్ వేయి రూపాయలు మాత్రమే కావడంతో , ఇటువంటి వారి పెన్షన్ ను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.   అదే విధంగా రైతుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉంది.  సరైన మద్దతు ధర లభించడంలేదు. రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసే ధరకు, అది వినియోగదారుడు కొనుగోలు చేసే సమయంలో ఉన్న ధరకూ వ్యత్యాసం భారీగా ఉంటోంది. అంటే రైతు కష్టం దళారుల పాలౌతోంది. ఈ దళారి వ్యవస్థను తొలగించి రైతుకే నేరుగా లాభసాటిగా ఉండేలా ధ్యాన్యం విక్రయాలు నెరపుకునే అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.   దేశంలోని అన్ని వర్గాలకు కనీస అవసరాలకు సరిపడా  వేతనం లేదా పింఛన్లు వచ్చేలా  చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే వృద్ధులకు 70 ఏళ్ల తరువాత ఉచిత ఆరోగ్యం కల్పిస్తామని ప్రధాని పేరుమీద పథకం ప్రకటించారు. కాని దాన్ని 60 ఏళ్ల నుంచి అమలు చేయాల్సిఉంది. దేశాన్ని ఇన్ని  సమస్యలు  పట్టి పీడిస్తుండగా అత్యంత జరూరుపనిలోలాగా ఎంపీల జీతాల పెంపు కార్యక్రమం చేపట్టడం పట్ల ఒకింత అసంతృప్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎంపీల జీతాల పెంపుతో6పాటే.. రైతులజీవితాలు,వృద్ధుల జీవితాలు బాగుపడే నిర్ణయం కూడా తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.