తిరుపతిలో గోవిందరాజులకూ శఠగోపం పెట్టారా గోవిందా?
posted on Dec 23, 2025 @ 5:25PM
ఇప్పటికే లడ్డూ, ఆపై పరకామణి.. ఇప్పుడు చూస్తే తిరుపతి గోవిందరాజ స్వామి గోపురానికి బంగారు తాపడం వ్యవహారం. గత వైసీపీ జమానాలో.. తిరుమల శ్రీవారి చుట్టూ ఇలా ఎన్నో వివాదాలు అల్లుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. తిరుపతి గోవిందరాజుల వారి ఆనంద నిలయం బంగారు తాపడం చేయించడానికి 100 కిలోల బంగారం కేటాయించారు. మొత్తం 9 లేయర్లుండగా.. వీటిలో రెండు లేయర్లు మాత్రమే వాడి మిగిలిన ఏడు లేయర్ల బంగారం పక్కదారిపట్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ తాపడం సమయంలో 30 పురాతన విగ్రహాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. దీనంతటికీ కారణం అన్యమతస్తులకు ఈ పనులు అప్పగించినట్టు సమాచారం. దీంతో హిందూ సంఘాల వారు ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఇదే అంశంపై గతంలో ఏఈఓగా పని చేసిన సుబ్బరాజు చెప్పడాన్ని బట్టీ చూస్తుంటే అలాంటిదేమీ లేదని అంటున్నారాయన. అన్యమతస్తులకు పనులు అప్పగించామన్న మాట కూడా కరెక్టు కాదంటున్నారు. సంచలనం కోసమే కొన్ని హిందూ సంఘాలు ఇలాంటి ఆరోపణలు చేసినట్టు వివరించారాయన.
అయితే ఈ విషయంపై మాట్లాడిన జనసేన నేత కిరణ్ రాయల్.. ఇదంతా సంచలనం కోసమో రాజకీయాల కోసమే చేస్తున్న పోరాటం కాదు. ఇదంతా ఆ స్వామి వారే తన విషయంలో జరిగిన తప్పులను తాను సరిదిద్దుకుంటున్నారు. ఆ మాటకొస్తే ఇది ఒక రాజకీయ నాయకులు బయట పెట్టినదేం కాదు. ఒక సామాన్యుడి రూపంలో స్వామివారే ఇదంతా వెలుగులోకి తెచ్చారని చెప్పుకొచ్చారు కిరణ్ రాయల్ మేమంతా నిమిత్త మాత్రులం అని అన్నారు కిరణ్ రాయల్. ఇందులో రూ. 60 కోట్ల మేర స్కామ్ జరిగిందనడం కన్నా.. మోసం జరిగిందని చెప్పాల్సి ఉంటుందని అన్నారు కిరణ్ రాయల్. ఈ మొత్తం వ్యహారం గుర్తించిన టీటీడీ విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించింది. గోపురానికి బంగారు తాపడంలో అవినీతి అక్రమాలు జరిగినట్టు తెలిస్తే ఎంత పెద్ద వారినైనా వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.