వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించడం వరుసగా ఇది రెండవ సారి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం (ఏప్రిల్ 9) ఉదయం ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో ఇప్పుడున్న  6.25 నుంచి 6 శాతానికి రెపో తగ్గింది. ఈ తగ్గింపుతో హోమ్‌, వెహిక‌ల్‌, ప‌ర్స‌న‌ల్ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌నున్నాయి. గత ఫిబ్రవరిలోనూ ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.  దేశీయంగా ద్ర‌వ్యోల్బ‌ణం నియంత్ర‌ణలోనే  ఉండటం, ముఖ్యంగా  ఆహార ప‌దార్థాల ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో   ఆర్థిక వృద్ధికి దోహదపడేలా వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు.  ఇక అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన  సుంకాల ప్ర‌భావం నేపథ్యంలో   దేశీయంగా వినియోగం, పెట్టుబ‌డుల సామర్థ్యం మందగించకుండా ఉండేందుకు కూడా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.  

కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్.. రెండ్రోజులపాటు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం  క్రమంగా బలహీనపడుతోందని విపత్తు నిర్వహణా సంస్థ  తెలిపింది.  నైరుతి పశ్చిమ బంగాళా ఖాతంలో బలపడిన అల్పపీడనం అదే దిశగా కొనసాగుతూ క్రమంగా బలహీనడనుంది.   దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో  ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి.  బుధ, గురువారాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన  వర్షం కురుస్తుందని విపత్తు నిర్వహణా సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు చెట్ల క్రింద ఉండరాదని ఆయన హెచ్చరించారు. కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారి అయ్యింది శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణలో క్రమంగా ఊష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నాలుగు డిగ్రీల ఊష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. 

ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో ఉండే  బీజేపీ నాయకుడు, గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​పై  వరుస కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళ్ హట్​ పోలీస్ స్టేషన్​లో  రాజాసింగ్  తాజాగా మంగళవారం (ఏప్రిల్ 8) మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఇదే మంగళ్ హాట్ పీఎస్ లో  ఆదివానం ( ఏప్రిల్ 6)న కేసు నమోదైన సంగతి తెలిసిందే. ముందుగా ఆదివారం నాడు రాజాసింగ్ పై శోభాయాత్ర సందర్భంగా పోలీసు ఆదేశాలను ధిక్కరించి డీజే ఏర్పాటు చేయడంతో రాజాసింగ్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రాజాసింగ్ తో పాటుగా  శ్రీరామనవమి పల్లకి సేవా శోభాయాత్ర నిర్వాహకుడు ఆనంద్​సింగ్ లోథ్,  భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు భవంత్​రావులపై  బీఎన్ఎస్ సెక్షన్లు 223, 292 కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా మంగళవారం (ఏప్రిల్ 8) అదే శోభాయాత్రలో అనుచిత భాష ప్రయోగించారంటూ మరో కేసు నమోదైంది. శోభాయాత్ర సందర్భంగా ధూల్ పేట జాలి హనుమాన్ దేవాలయం వద్ద పోలీసులు, శోభాయాత్రలో పాల్గొన్న వారి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఆ సందర్భంగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు  చేశారంటూ రాజాసింగ్ పై పోలీసలుు  కేసు నమోదు చేశారు.   

విడదల రజినికి జెయిలా? బెయిలా?

కోర్టు నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ సైబరాబాద్ మొక్క, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజిని  అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.   అక్రమ వసూళ్ల కోసం,తన పై  బెదిరింపులకు పాల్పడ్డారని  స్టోన్ క్రషర్  యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో, విడుదల రజిని ని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ప్రచారమే కాదు స్వయంగా రజనీ కూడా తనను అరెస్టు చేస్తారన్న ఆందోళనలో ఉన్నారు. దీంతో ఆమె  హైకోర్టులో  ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ విచారించిన హైకోర్టు  తీర్పు  రిజర్వ్  చేసింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విడదల రజినికి ముందస్తు బెయిలు లభిస్తుందా? లేదా అన్న ఆసక్తి నెలకొంది.   క్రషర్ వ్యాపారిని బెదిరించిన కేసులో విడుదల రజిని భవితవ్యం ఏంటి ? ఈ కేసులో కోర్టు మాజీ మంత్రి విడదల రజనీకి  ముందస్తు బెయిల్ ఇస్తుందా, తిరస్కరిస్తుందా? అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో  యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన రజిని  ఈ వివాదంతో తనకే మాత్రం సంబంధం లేదనీ,   రాజకీయ కుట్ర తొనే తనపై ఆరోపణలు చేశారనీ, ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.  అయితే 2019 - 24 మధ్య కాలంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజని అనుచరులపై ,ఆమె వ్యక్తిగత సిబ్బంది పై , అనేక ఆరోపణలు  వచ్చాయి. వాటిపై అప్పట్లోనే కొన్ని కేసులు నమోదవగా మరికొన్ని ఫిర్యాదుల వరకూ వెళ్లాయి. ప్రస్తుతం ఆ ఫిర్యాదులన్నీ కేసులుగా మారతాయన్న  ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం  స్టోన్ క్రషర్ యజమాని వద్ద రెండు కోట్లు లంచం తీసుకున్నారనీ, దీనికి ఐపీఎస్ అధికారి జాషువా ,  విడదల రజిని వ్యక్తిగత సిబ్బంది  స్టోన్ క్రషర్ యజమానిని బెదిచారనీ ఆరోపణలు ఉన్నాయి.  ఆ ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది.   ఈ కేసులో  మాజీ మంత్రి విడదల రజినికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ ఏసీబీ తరఫున న్యాయవాదులు హైకోర్టు ముందు గట్టిగా   వాదనలు వినిపించారు.   ఈ నేపథ్యంలో విడుదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత  ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొన్నది.   కేసు ఒక్క ముడుపుల విషయంలోనే అయితే ముందస్తు బెయిలు రావడం కష్టమేమీ కాదనీ, అయితే.. స్టోన్ క్రషర్ యజమానికి చంపేస్తామని బెదరించారని కూడా కేసు ఉండటంతో ముందస్తు బెయిలు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. అంతే కాకుండా కేసు రుజువైతే మాజీ మంత్రి విడదల రజినికి పదేళ్ల జైలు విక్ష పడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.   ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో రజినికి బెయిలా? అరెస్టా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

ఆక్వా రైతులకు చంద్రబాబు అండ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బకు కుదేలైన ఆక్వా రంగానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భరోసాగా నిలిచారు. ట్రంప్ సుంకాల విధింపు  ప్రభావం ఏపీలో మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లోని అక్వా రైతులపై తీవ్రంగా పడింది. ట్రంప్ సుంకాల కారణంగా  ఏపీ నుంచి విదేశాలకు రొయ్యల ఎగురమతులు భారీగా పడిపోయాయి. ఫలితంగా   ఆక్వా రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.  అదే సమయంలో ట్రంప్ సుంకాల దెబ్బతో బెంబేలెత్తిపోయిన రొయ్యల ఎగుమతిదారులు,  రైతుల నుంచి రొయ్యలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేస్తున్నా అతి తక్కువ ధరలు మాత్రమే ఇస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది. దీనిపై సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి చచంద్రబాబు నష్టనివారణ చర్యలకు నడుంబిగించారు. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ కు లేఖ రాశారు. అంతే కాకుండా సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు, ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ఆయా శాఖల అదికారులతో నిర్వహించిన ఈ కీలక సమావేశంలో  చంద్రబాబు   దీర్ఘకాలంలో స్థానిక వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని, ఫలితంగా విదేశీ మార్కెట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని దిశానిర్దేశం చేశారు. కష్టకాలంలో ఆక్వా రైతులను ఆదుకునే దిశగా వ్యాపారులు, ఎగుమతి దారులు సహకరించాలని కోరారు. అందుకోసం 100 కౌంట్ రోయ్యలను కిలోకు రూ.220కి తగ్గకుండా కొనుగోలు చేయాలని   సూచించారు. ఈ ప్రతిపాదనకు వ్యాపారుల నుంచి సానుకూల స్పందన లభించింది.   అలాగే దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ లకు రొయ్యల ఎగుమతులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకుంటే, మంచి ఫలితాలు కూడా ఉంటాయని అన్నారు.  తాను కూడా కేంద్రంతో చర్చించి, ఆయా దేశాలలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు కుదిరే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.  ఇక ఆక్వా రంగంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆక్వా రైతులు ఆక్వా రంగ నిపుణులు, ఎగుమతిదారులు, ఎంపెడా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు తదితరులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వానికి సూచిస్తుందని ఆయన తెలిపారు.

బెంగాల్లో మళ్ళీ ఎర్రజెండా?

ఒకప్పుడు ఎర్ర జెండా అంటే, ముందుగా పశ్చిమ బెంగాల్ గుర్తుకువచ్చేది. ఇంచుమించుగా పాతికేళ్లకు పైగా ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రిగా  ఓ వెలుగు వెలిగిన కామ్రేడ్ జ్యోతి బసు పలచని రూపం కళ్ళ ముందుకు వచ్చేది. నిజానికి, జ్యోతి బసు బెంగాల్ కు మాత్రమే పరిమితం అయిన నాయకుడు కాదు. జాతీయ రాజకీయాల్లోనూ జ్యోతిబసు కీలక భూమిక  పోషించారు. ఒక దశలో,యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో ప్రధాని పదవి జ్యోతి బసు తలుపు తట్టింది. అయితే, పార్టీ పెద్దల చారిత్రక తప్పిదం  కారణంగా చేజారి పోయింది. జ్యోతి బసు తర్వాత  ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన బుద్దదేవ్ భట్టాచార్య కొంత కాలం ఆ వారసత్వాన్ని  కొనసాగించారు. అయితే  ఇప్పడు అదంతా చరిత్ర.  ప్రస్తుత పరిస్థితి అది కాదు. ఇంచుమించుగా మూడు దశాబ్దాలకు పైగా  ఏకచత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన వామపక్ష కూటమికి  ఈ రోజు బెంగాల్లో ఓట్లే గానీ, సీట్లు లేవు. ఆ ఓట్ల శాతం కూడా దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతోంది. ఉదాహరణకు 2024 లోక్ సభ ఎన్నికలనే తీసుకుంటే, కూటమి పెద్దన్న సిపిఎం సహా వామపక్ష కూటమి పార్టీలలో ఏ ఒక్క పార్టీకి పట్టుమని పది శాతం ఓట్లు దక్కలేదు. సిపిఎంకు కేవలం 5.67 శాతం ఓట్లు పోలయ్యాయి. పెద్దన్న పరిస్థితే ఇలా ఉంటే ఇక తమ్ముళ్ళ సంగతి చెప్పనక్కర లేదు. చిన్నన్న సిపిఐకి ఒక శాతం కంటే తక్కువ (0.22) శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.   నిజానికి, 2024 ఎన్నికల్లో బెంగాల్ గడ్డపై పట్టు సాధించేందుకు  వామ పక్ష కూటమి  ముఖ్యంగా సిపిఎం చాలా గట్టి ప్రయత్నమే చేసింది. సిపిఎం అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సీతారామ్ ఏచూరి సారథ్యంలో,పార్టీ పునరుజ్జీవనం లక్ష్యంగా గట్టి ప్రయత్నమే జరిగింది. వామపక్ష కూటమి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది. అయితే ఆ ఎన్నికల్లో హస్తం పార్టీకి అయినా ఒక సీటు (మాల్దా దక్షిణ్) దక్కింది కానీ, సిపిఎం సహా వామపక్ష కూటమి   పార్టీలకు సింగీల్ సీటు కూడా దక్కలేదు.  నిజానికి  33సీట్లలో పోటీ చేసిన వామపక్ష కూటమికి, ఒక్క సీటు దక్కక  పోవడమే కాదు, ఒక్క సీటు  మినహా, మరెక్కడా రెండవ స్థానం కూడా దక్కలేదు. పూలమ్మిన చోట కట్టెలు అమ్మవలసిన దీన స్థితికి చేరుకుంది. అలాగే చాలా వరకు స్థానాల్లో లెఫ్ట్  డిపాజిట్లు కోల్పోయింది. నిజానికి, ఇప్పటికీ బెంగాల్  రాజకీయాల్లో  రెడ్ ఫ్లాగ్ కు సెల్యూట్ చేసే చేతులు చాలానే ఉన్నాయి. ఆ విధంగా ఎర్ర జెండాకు ఇంకా ఎంతో కొంత గౌరవం వుంది. అయితే  రాష్రంలో తిరుగు లేని శక్తిగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ ను సమర్ధవంతంగా ఎందుర్కునే జవసత్వాలను లెఫ్ట్ పార్టీలు చాల వరకు కోల్పోయాయి. అందుకే, లెఫ్ట్  కూటమిని దాటుకుని బీజేపీ ముందుకు దూసుకు వెళ్ళింది. తృణమూల్ కు ప్రధాన ప్రత్యర్ధిగా కమల దళం నిలిచింది. అంతవరకూ  ఒకటి రెండు సీట్లు, మూడు నాలుగు శాతం ఓట్లతో ఎక్కడో ఉన్న బీజేపీ 2019 లోక్ సభ ఎన్నికలలో, అనూహ్యంగా ప్రభంజనం సృష్టించింది. అంతవరకు కేవలం రెండు స్థానాలు మాత్రమే ఉన్న బీజేపే ఏకంగా 18 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఓటింగ్ శాతం  అయితే, 11 శాతం నుంచి 40 శాతానికి జంప్ చేసింది. ఆ ఎన్నికల్లోనే, వామపక్ష కూటమి  సున్నా సీట్ల, శూన్య స్థాయికి చేరింది. ఆ తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే శూన్య స్థితి కొనసాగింది. మొత్తం 294 స్థనాలలో 215 స్థానాలు గెలుచుకుని తృణమూల్ కాంగ్రెస్ మూడవ సారి అధికారం దక్కించుకుంటే.. 77 స్థానాలను గెలుచుకున్న బీజేపీ రాష్ట్రంలో  తొలిసారిగా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక అప్పటి నుంచి లెఫ్ట్ ఖాతాలో అదే సున్నా  కంటిన్యూ అవుతోంది. తృణమూల్, బీజేపే మధ్యనే ప్రధాన పోటీ నడుస్తోంది.  అయితే, రెండు రోజు క్రితం మధురైలో ముగిసిన సీపీఎం 24వ జాతీయ మహాసభల్లో బెంగాల్ పునరుజ్జీవన ప్రణాళికలపై సిపిఎం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. యువ రక్తంతో పార్టీని ఉరకలు వేయించాలనే లక్ష్యంతో, కేంద్ర కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా పార్టీ యువజన విభాగం డివైఎఫ్ఐ, బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి  మీనాక్షి ముఖర్జీని  84 మంది సభ్యుల కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. నిజానికి  యువ రక్తం నినాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఐదేళ్ళ క్రితమే సీతారాం ఏచూరి ఆ ప్రయత్నం చేశారు. అయితే  2021 ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఆ ప్రయత్నం ఫలించలేదనే విషయం స్పష్టమవుతుంది. ఆ ఎన్నికల్లో మీనాక్షి  కూడా పోటీ చేశారు. ఓడి పోయారు.  అయితే.. ఆ ఎన్నికల్లో ఆమె ఇద్దరు దిగ్గజ నేతలను ఎదుర్కుని ఓడిపోయిన ప్రముఖుల జాబితాలో ప్రముఖ స్థానం సంపాదించు కున్నారు. అవును తెలంగాణలో  కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గంలో (అప్పటి)  ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేసులో ఉన్నఅభ్యర్ధి, పీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి ని, బీజేపీ అభ్యర్ధి కేవీఆర్ రెడ్డి ఢీ  కొన్న విధంగా. మీనాక్షి, పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్  నియోజకవర్గంలో ముఖ్యమత్రి మమత బెనర్జీ, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి సువేందు అధికారిని, ఢీ  కొన్నారు.అయితే, ఇక్కడ కామారెడ్డిలో లో కేవీఆర్ దిగ్గజ నేతలు ఇద్దరినీ ఓడించి గెలిచారు. అక్కడ ఆమె ఓడిపోయారు.ఆమెకు కేవలం 2.74 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.గెలుపు ఓటములను పక్కనపెడితే, మదురై సభల్లో మార్క్సిస్టులు బెంగాల్లో మరో మారు ఎర్ర జెండాను ఎగరేయాలానే సంకల్పం అయితే గట్టిగా చెప్పుకున్నారు. అయినా మన  బాలయ్య బాబు అన్నట్లు,అన్నీ అను కున్నట్లు జరుగుతాయా ఏంటి ?

సింగపూర్ బయలు దేరిన పవన్, చిరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.   చిన్న కొడుకు మార్క్ శంకర్ తాను చదువుతున్నపాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. పవన్ కల్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లే ముందు ఈ విషయంపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజునాడే చిన్న కుమారుడు ప్రమాదానికి గురయ్యాడని గద్దద స్వరంతో చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.  ప్రస్తుతం తన చిన్న కుమారుడు క్షేమంగానే ఉన్నాడనీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ పవన్ కల్యాణ్ చెప్పారు.  ఈ ప్రమాదంలో చాలా మంది పిల్లలు గాయపడ్డారన్న పవన్ వారిలో తన కుమారుడు కూడా ఒకరని చెప్పారు.    తన కుమారుడు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తనకు ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, మంత్రి నారా లోకేష్ తదితరులందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు.   ఇలా ఉండగా సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు గాయపడ్డాడన్న విషయం తెలిసిన వెంటనే పవన్ సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు.  

వలంటీర్లను వంచించింది జగనే.. తేల్చి చెప్పిన పవన్

ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవస్థ జగన్ కోసం జగన్ చేత జగనే సృష్టించుకున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థను జగన్ గాలి కొదిలేశారు. తన కోసం పని చేయడం తప్ప వలంటీర్లకు ఉద్యోగ భద్రత అన్నది లేకుండా చేశారు.   వైసీపీ హయాంలో అమలులోకి వచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థ గ్రామాలు, పట్టణాల్లో సంక్షేమ పథకాల అమలులో జగన్ హయాంలో కీలక భూమిక పోషించింది. చెప్పాలి.  ఈ కారణంగా తాము అధికారంలోకి వచ్చినా కూడా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని   ఎన్నికలకు ముందు  తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అంతే కాకుండా   వలంటీర్లకు అప్పటి వరకూ ఇస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని పది వేలు చేస్తానని కూడా వాగ్దానం చేశారు. ఇదీ వాస్తవమే. ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఉద్దేశంతో చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేశారు. అధాకారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి క్యాబినెట్ లోనే వలంటీర్ల వ్యవస్థపై చర్చించారు. ఇదే విషయాన్ని అడవి తల్లి బాటలో భాగంగా సోమ, మంగళవారాల్లో (ఏప్రిల్ 7, 8) తేదీల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే ఏ కరంగానూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేని పరిస్థితిని జగన్ సృష్టించారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.  వలంటీర్లను వంచించింది, ఆ వ్యవస్థ మనుగడ లేకుండా చేసిందీ జగన్ సర్కారేనని కుండబద్దలు కొట్టారు.   వలంటీర్లను నియమించుకున్న వైసీపీ ప్రభుత్వం వారితో పనిచేయించుకుందే గానీ, వారి భవిష్యత్తు గురించి, ఉద్యోగ భద్రత గురించి పట్టించుకోలేదన్నారు. వలంటీర్ వ్యవస్థకు జగన్ సర్కార్ అధికారిక ముద్ర వేయలేదన్నారు.   ప్రస్తుతం ప్రభుత్వంలోని ఏ ఒక్క శాఖ వద్ద కూడా వలంటీర్ వ్యవస్థ గురించి ఒక్కటంటే ఒక్క పత్రం కూడా లేదన్నారు. అసలు వలంటీర్లకు వేతనాలను కూడా వైసీపీ సర్కారు ప్రభుత్వం ద్వారా ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. వలంటీర్లకు ఏ విధంగానూ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ సర్కార్ చేసిందన్నారు.అసలు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా జగన్ సర్కార్ జీవో కూడా జారీ చేయలేదనీ, అయినా కూడా వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులేనన్న భ్రమల్లో వారిని ఉంచిందని పవన్ కల్యాణ్ చెప్పారు. వలంటీర్లను ప్రభుత్వం వంచించిందనీ, ఇప్పుడు తమ కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను కొనసాగిద్దామన్నా కొనసాగించలేని పరిస్థతి ఉందనీ చెప్పారు.  

బ్రహ్మకుమారీ చీఫ్ దాదీ రతన్ మోహిని కన్నుమూత

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీల చీఫ్​ దాది రతన్ మోహిని ఇక లేరు. ఆమె వయస్సు వంద సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఏప్రిల్ 8) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆమె పరమపదించిన విషయాన్ని బ్రహ్మకుమారీ సంస్థ పీఆర్వో ధృవీకరించారు.    గత నెల 25న వందవ పుట్టిన రోజు జరుపుకున్న రతన్ మోహిని గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాజస్థాన్లోని ట్రామా సెంటర్ కు తరలించారు. అయితే సోమవారం నాటికి ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో అహ్మదాబాద్ లోని జైడన్ ఆస్పత్రిలో చేర్చారు.అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె పార్ధివదేహాన్ని రాజస్థాన్ లోని బ్రహ్మకుమారీస్   ప్రధాన కార్యాల‌యానికి తీసుకువెళ్లారు.      సింధ్‌లోని హైద‌రాబాద్‌లో జన్మించిన  దాది ర‌త‌న్ మోహిని అసలు పేరు పేరు ల‌క్ష్మీ. హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్రహ్మకుమారిస్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌లో బ్రహ్మకుమారీల తరపున పాల్గొన్నారు.  

మావోయిస్టు పార్టీ బెదిరింపు లేఖ 

చత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లతో  మావోయిస్టులకు  కోలుకోలేని దెబ్బ తగిలింది.  నష్ట నివారణ చర్యల్లో భాగంగా తాజాగా  మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను ఇన్ ఫార్మర్లుగా చేసుకుని ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రప్రభుత్వం జల్లెడపడుతుంది. 2026 మార్చి వరకు మావోయిస్టు రహిత దేశం చేస్తామని కేంద్రం ప్రకటించింది.   మావోయిస్టులు  ఇటీవల ఎన్ కౌంటర్లతో భారీ మూల్యం చెల్లించుకోవడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కర్రెగుట్టపై రావొద్దంటూ  బాంబులు అమర్చినట్టు చెప్పారు. అమాయక ఆదివాసులు ప్రాణాలు కోల్పోకూడదని నక్సలైట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఏడాది గడుస్తున్నా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని నక్సలైట్లు ఆరోపించారు. ఆదివాసులకు మాయమాటలు చెప్పి ప్రలోభపెడుతున్న పోలీసులను నమ్మొద్దని నక్సలైట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. వెంకటాపురం వాజేడు కమిటీ  పేరిట  లేఖ విడుదలైంది. 

అమరావతిలో చంద్రబాబు ఇంటికి శంకు స్థాపన 

ఎపి రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత ఇల్లు శంఖు స్థాపన కార్యక్రమం  బుధవారం (ఏప్రిల్ 9) జరుగనుంది. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వెలగపూడి సచివాలయం సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నిర్మించుకోవడంతో  పలువురు హర్షం వెలిబుచ్చారు. అమరావతిలో చంద్రబాబు నివాసం చేసుకోవడంతో ఈ ప్రాంత అభివృద్ది పనులు వేగవంతమయ్యే అవకాశముందని వారు భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిపై దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు తన స్వంతింటిని పూర్తిగా నిర్లక్యం చేశారు. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి నుంచే పాలన సాగిస్తున్న చంద్రబాబు దేశంలోనే పేరొందిన రాజధాని నిర్మించేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. నిలిచి పోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నారు. అమరావతిని రాజధాని చేయకుండా గత ప్రభుత్వం చేసిన కుట్రలను చంద్రబాబు  ఎప్పటికప్పుడు తిప్పికొట్టారు. చంద్రబాబు నూతన ఇల్లుతో అమరావతికి కొత్త శోభ వస్తుందనడంలో సందేహం లేదు. 

కడప మహానాడులో బాంబులు పేలనున్నాయా..?

  #కొత్త రక్తం మోజులో లోకేష్.. దూరమౌతున్న సీనియర్లు  #ఏ ఎమ్మెల్యేను కదిపినా వెళ్ల గక్కుతున్న అసంతృప్తి  #సీనియర్-జూనియర్ కాంబినేషన్ లేకుంటే ఎలా అంటూ విమర్శలు త్వరలో టీడీపీ మహానాడు జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడును కడపలో జరుపుకోబోతున్నారు. జరగబోయే మహనాడులో కడప బాంబుల్లాంటి విషయాలేం పేలతాయో..? ఎవరి గుండెల్లో మంటలు రేగుతాయో..? ఆ తర్వాత పరిణామాలు ఎలా దారి తీస్తాయోననే అంశంపై టీడీపీ సానుభూతిపరుల్లో ఓ రకమైన ఆందోళనతో కూడిన చర్చ జరుగుతోంది. అదేంటంటే సీనియర్లను సైడ్ చేస్తే ఎలా? అనేదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్. పెద్దలను గౌరవించాలని చెబతారు.. కానీ ఇప్పుడు టీడీపీలో ఆ పెద్దలకు సరైన గౌరవం లభించడం లేదనే చర్చ నడుస్తోంది. పాత నీరు పోవాలి.. కొత్త నీరు రావాలి అంటారు. కానీ రాజకీయాల్లో సీనియర్-జూనియర్ కాంబినేషన్ లేనిదే పార్టీ నడవడం కష్టం. రాజకీయాలు చేయడం కష్టం. దీనికి తాజా ఉదాహరణ వైసీపీనే. రాజకీయ పార్టీని నడిపే విషయంలో అంతగా అవగాహన లేని కారణంగా విఫల నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి ముద్ర వేయించుకున్నారు. ఇప్పుడంతా పార్టీలో సీనియర్ల సంగతేంటీ అనే అంశం చుట్టే తిరుగుతోంది. పార్టీలో ఏ ఇద్దరు కలిసినా.. పార్టీలో సీనియర్ల సంగతేంటీ అనే దిశగానే చర్చ జరుగుతున్న వాతావరణమే కన్పిస్తోంది. పార్టీలో సీనియర్లుగా ఉన్న వారు నెమ్మదిగా సైడ్ కావడమో.. లేదా పార్టీ అధిష్టానమే సైడ్ చేయడమో జరుగుతోంది. పార్టీతో ప్రస్తుతం అంటీ ముట్టనట్టుగా ఉంటోన్న సీనియర్ల జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు పార్టీ అధినాయకత్వానికి కళ్లు, ముక్కు, చెవులుగా ఉన్న యనమల, అశోక్ గజపతి రాజు, కళా వెంకట్రావు వంటి వారు ఇప్పుడు పార్టీ కార్యకలాపాలతో టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు. ఈ ముగ్గురిలో కళా వెంకట్రావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా, తనకు తగ్గిన ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎంత వరకు ఉండాలో అంత వరకే పరిమితం అవుతున్నారు. వీలుంటే తన వారసుడికైనా సరైన ప్రాధాన్యత లభించే స్థానాన్ని కల్పిస్తే చాలునని భావిస్తున్నట్టు సమాచారం. ఇక అశోక్ గజపతి రాజు. ఈయన ఎన్నికలకు ముందు నుంచే నెమ్మదిగా పార్టీతో డిటాచ్ అవుతున్నట్టే కన్పించారు. ఎన్నికల తర్వాత పెద్దగా పార్టీ వ్యవహరాల్లో కన్పించడమే మానేశారు. యనమల అప్పుడప్పుడు కన్పిస్తున్నా.. పార్టీ అధిష్టానం ఆయనకు నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గిస్తోంది. దీంతో ఆయన కూడా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం అనే థియరీని పాటించడానికి అలవాటు పడుతున్నట్టు కన్పిస్తోంది. రాజ్యసభ వస్తే సరే సరి.. లేకుంటే రాజకీయాలకు సెలవని ప్రకటించేసే పరిస్థితి యనమల వైపు నుంచి ఇప్పటికే కన్పించింది. ఒకప్పుడు అసెంబ్లీలో స్పీకర్ అంటే ఇలా ఉండాలి అనేలా ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తీ,  అన్ని కీలక సమాయాల్లో పార్టీకి సరైన సలహాలు, సూచనలు ఇచ్చిన పెద్దమనిషిని దూరం చేసుకోవడంపై కూడా కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఇక సీనియర్లుగా ఉండి.. సరైన పదవులు రాకుండా ఉన్న వారి జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. వీరు గడచిన ఎన్నికల్లో గెలిచారు. అయినా వీరికి ఎలాంటి మంత్రి పదవులు దక్కలేదు. అయినా వీరిలో సోమిరెడ్డి, గోరంట్ల మినహా మిగిలిన ఇద్దరు పెద్దగా యాక్టివ్ గా కన్పించడం లేదు. సోమిరెడ్డి తన వారసుడికి సరైన దారి చూపించాల్సిన అవసరం కన్పిస్తోంది. అలాగే గోరంట్ల విషయానికొచ్చేసరికి.. ప్రస్తుతానికైతే.. ఆయనకు వారసులనే విధంగా ఎవ్వర్నీ ప్రొజెక్ట్ చేయలేదు. ఓ విధంగా చెప్పాలంటే 2029 ఎన్నికల నాటికి గోరంట్ల సైడ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడుని స్పీకర్ ఛైరులో కూర్చొబెట్టడం ద్వారా ఆయన నోటికి తాళం వేసేసిన పరిస్థితి. వచ్చే ఎన్నికల నాటికి అయ్యన్న తప్పుకుని వారి కుమారులు తెర మీదకు వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇక ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దేవినేని ఉమ పరిస్థితి అయితే కొడిగట్టిన దీపంలా మారింది. కానీ ఆయన మాత్రం పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. వీరు కాకుండా.. తెర వెనుక ఉండి.. పార్టీని ఓ దారిలో పెట్టడానికి.. పార్టీని వివిధ వేదికల మీద బాగా ఎలివేట్ చేయడానికి పని చేసిన కంభంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్ వంటి వారికి పార్టీలో అంతంత మాత్రం గౌరవమే దక్కుతోంది. టీడీ జనార్దన్ 2004-2014 అనేది టీడీపీకి చాలా టఫ్ టైం. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి టీడీ జనార్దన్ స్ట్రాంగ్ పిల్లర్ గా నిలిచారు. పార్టీ కార్యాలయ కార్యదర్శిగా అందర్నీ సమన్వయం చేసుకుంటూ.. పార్టీ కేడరుకు.. నేతలకు.. నేతలకు.. అధిష్టానానికి సంధానకర్తగా మారి.. అంతా తానై పార్టీని కాచుకుని పని చేశారు. ఇక 2019-24 మధ్య కాలంలో కూడా పార్టీ కోసం విశేషమైన సేవలే అందించారు. కానీ ఆయన్ను ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం ఆ రీతిలో గౌరవిస్తున్నదా..?  అంటే లేదనే సమాధానమే వస్తున్నది. ఇక కంభంపాటి రామ్మోహన్. ఢిల్లీ స్థాయిలో కంభంపాటికి ఉన్న పేరు.. పరపతి సామాన్యమైనది కాదు. ఇప్పటికీ ఢిల్లీ స్థాయిలో టీడీపీకి కంభంపాటి తరహాలో లాబీయింగ్ చేసేవారు లేరు. వివిధ జాతీయ పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో.. ఆ పార్టీల అధిష్టానాలతో నేరుగా మాట్లాడగల.. సంప్రదింపులు జరపగల నేర్పరితనం కంభంపాటికి ఉంది. కానీ కంభంపాటి సేవలను హైకమాండ్ సరిగా వినియోగించుకోవడం లేదనే చెప్పాలి. ఇలాంటి వారంతా సైడ్ అయిపోతే.. పరిస్థితేంటనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో పార్టీ వర్గాల్లో సీనియర్ల గురించి చర్చ జరగడానికి కారణాల్లేకపోలేదు. చాలా మంది సీనియర్ నేతలను మహానాడు తర్వాత పక్కకు పెట్టే అవకాశాలు కన్పిస్తుండడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే ప్రభుత్వంలో సీనియర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. దాదాపు జూనియర్ టీం రాజ్యమేలుతోంది. ఇదే తరహాలో పార్టీలో కూడా చిన్నోళ్లకే పెద్ద బాధ్యతలు అప్పగించే దిశగా మహానాడులో యాక్షన్ ప్లాన్ ఉండి ఉండొచ్చనేది టీడీపీలో వినిపిస్తున్న టాక్.  దీంతో సీనియర్లను ఈ స్థాయిలో సైడ్ చేయడం కరెక్టా అనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జూనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడంలో తప్పు లేదు కానీ.. సీనియర్లను గౌరవించే విషయంలో టీడీపీ హైకమాండ్ సరైన కోణంలో ఆలోచించడం లేదేమోననేది అందరి మనస్సుల్లోనూ ఉన్న భావన. సీనియర్లను ఒక్కసారిగా సైడ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో జూనియర్లనే మంత్రులుగా చేయడం వల్ల.. ఊహించిన స్థాయిలో ప్రభుత్వానికి.. పార్టీకి మైలేజ్ రావడం లేదు. ఏం మాట్లాడినా.. చంద్రబాబు, లోకేష్ మాట్లాడితేనో.. ప్రెస్ మీట్ పెడితేనో తప్ప.. పెద్దగా ప్రజల్లోకి పోవడం లేదు. పైగా పార్టీకి ఎప్పుడైనా కష్ట కాలం వచ్చినా.. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా.. వాటిని జూనియర్లుగా ఉన్న వారు ఎంత వరకు డీల్ చేస్తారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. కనీసం మహానాడు జరగకముందే ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సీనియర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి, వారికి సముచిత బాధ్యతలు అప్పగించి, వారి సేవలు వినియోగించుకుంటే మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్లు వ్యవహరించినంత సమయస్ఫూర్తితో జూనియర్లు వ్యవహరిస్తున్నారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. ముఖ్యంగా మానవ సంబంధాలను మెయిన్ టెయిన్ చేయడంలో జూనియర్లు చాలా ఘోరంగా విఫలమవుతున్నారు. మనీ రిలేషన్స్ పెరిగాయని ప్రచారం జరుగుతోంది. లోకేష్ వెంట ఉండే ఇద్దరు అనుచరులు వల్లనే ఆయనపై ఈ ముద్ర పడుతోందని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు. అలాగే తమ కోసం పని చేసిన వారెవ్వరు.. అనే విషయాన్ని ఆలోచించి.. ఆ కోణంలో నిర్ణయాలుతీసు కోవాలి కానీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓ జూనియర్ మంత్రి వద్దకు వినతిపత్రం తీసుకెళ్తే.. ఆ వినతి పత్రాన్ని ఆయన ఎదుటే చించేసి.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటివి చూస్తుంటే.. జూనియర్ల చేతుల్లో పార్టీని పెడితే అది ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదనే చర్చ జరుగుతోంది. పైగా  జూనియర్ నేతల్లో చాలా మంది కమర్షియల్ యాంగిల్లో ఆలోచన చేస్తున్న వారే కన్పిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నంత వరకూ ఫర్వాలేదు కానీ.. రాజకీయంగా.. పార్టీ పరంగా చూసుకుంటే ఈ తరహా మనస్తత్వాలు ఉన్న వాళ్లు పార్టీని రన్ చేయడంలో కీలకంగా మారితే అది పార్టీకి అత్యంత ప్రమాదకర అంశంగా మారుతుందనేది చాలా మందిలో కన్పిస్తున్న ఆందోళన. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఎలా ఉన్నా.. పార్టీలో మాత్రం సీనియర్, జూనియర్ కాంబినేషన్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు బలంగా వస్తున్నాయి. సీనియర్ల గైడెన్సుతో జూనియర్లు పని చేస్తే.. వారి అనుభవం.. వీరి ఉత్సాహం కలిసి పార్టీ అన్ని రకాలుగా నిలకడగా పరుగులు పెడుతుంది. సీనియర్ల పర్యవేక్షణలో జూనియర్లు పని చేస్తారు కాబట్టి.. కొంత కాలానికి జూనియర్లు కూడా అనుభవం గడిస్తారని అంటున్నారు. అయితే ఇవన్నీ చాలా మంది మనస్సులో ఉన్న ఆలోచనలు. వారు ఇస్తున్న ఫీడ్ బ్యాక్.. దీన్ని పార్టీ అధిష్టానం ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందో తెలియడం లేదంటున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే మహానాడులో కడప బాంబులు పేలతాయేమోననే ఆందోళన కన్పిస్తోంది

 మీరట్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ 

ప్రియుడి మోజులో పడి  మీరట్ యువతి  ముస్కాన్ తన భర్తను హత్య చేసిన కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ గర్బవతి అని నిర్దారణ అయ్యింది. జైలులో ఆమె కు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ సంగతి తెలిసింది. భర్త కొన్నేళ్ల నుంచి లండన్ లో ఉండగా ముస్కాన్ గర్బవతి కావడం చర్చనీయాంశమైంది.  29 ఏళ్ల రాజ్ పుత్  లండన్ లో   మర్చంట్ నేవీ అధికారి. చాలా సంవత్సరాలనుంచి లండన్ లోనే ఉన్న రాజ్ పుత్ ఇటీవల ఇండియాకు వచ్చి హత్యకు గురయ్యాడు. తన భర్తను హత్య చేసింది తాను తన ప్రియుడు అని ముస్కాన్ అంగీకరించింది. దేశవ్యాప్తంగా మీరట్ మర్డర్ కేసు సంచలనమైంది.

జంటపేలుళ్ల నిందితులకు ఉరి.. హైకోర్టు తీర్పును స్వాగతించిన కేంద్ర మంత్రి

దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ హైకోర్టు పేర్కనడాన్ని ఆయన హర్షించారు. ప్రజాస్వమ్యంలో హింసకు, ఉగ్రవాదానికి చోటు లేదని హైకోర్టు తీర్పుద్వారా మరో సారి స్పష్టమైందని కిషన్ రెడ్డి అన్నారు.  పుష్కర కాలంగా దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్లు ఆ పెలుళ్ల బాధితులను ఓ పీడకలగా వెంటాడుతున్నాయన్న ఆయన.. ఎట్టకేలకు బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు జీరో లోలరెన్స విధానంతో మోడీ సర్కార్ ముందుకు సాగుతోందన్నారు.  జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించింది.ఈ పేలుళ్ళ సంఘటన దర్యాప్తు చేసిన పోలీస్ సిబ్బందిని కిషన్ రెడ్డి అభినందించారు. 

హెలికాప్టర్ లో వచ్చి.. కారులో తిరిగి వెళ్లిన జగన్.. ఎందుకో తెలుసా?

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాపిరెడ్డి పల్లిలలో మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం (ఏప్రిల్ 8) జరిపిన పర్యటన పెద్ద ప్రహసనంగా మారింది. ఇటీవల హత్యకు గురైన ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్, హెలికాప్టర్ లో వచ్చి, కారులో తిరిగి బెంగళూరు వెళ్లారు.  హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో హెలిపాడ్ మీదకు చొచ్చుకుపోగా, ల్యాండింగ్ సమస్య తలెత్తింది. రెండో ప్రయత్నంలో హెలికాప్టర్ ల్యాండ్ కాగా, చుట్టుముట్టిన కార్యకర్తలు బలవంతంగా డోర్ లాగారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు కానీ పైలట్ డోర్ లాగడంతో కిందపడ్డ పైలెట్ బ్యాగ్ ను ఎవరో ఎత్తుకు పోయారంటున్నారు. జగన్ దిగిన వెంటనే హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోయింది. సాంకేతిక సమస్యల వల్ల హెలికాప్టర్ బదులు కారులోనే జనగ్ బెంగళూరుకు వెళ్లిపోయారని చెబుతున్నారు. హెలికాప్టర్ డోరుకు ఎయిర్ బ్రేక్ వచ్చిందని వైపీపీకి చెందిన వారు ఓ ఫొటో ప్రచారంలో పెట్టారు. జగన్ యథావిధిగా బాధితుల పరామర్శ కన్నా, పబ్లిక్ల లో ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించి, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. దీంతో గుంటూరు మిర్చియార్డులో రైతుల పరామర్శకు వచ్చినప్పుడు మిర్చి ఎత్తుకు పోయిన సంఘటనను జనం గుర్తు చేసుకుని వీళ్లు మారరని నిట్టూర్పు విడుస్తున్నారు.   

అలేఖ్య పికిల్స్ వివాదం పై చెల్లి  సుమ స్పందన

అలేఖ్య పికిల్స్ వివాదం గత నాలుగోజులుగా నలుగుతూనే ఉంది. అలేఖ్య బూతుపురాణం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. అదే సమయంలో ముగ్గురు అక్కా చెల్లెల్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాగా ఈ ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  అలేఖ్య ఆరోగ్యం క్షీణించి ఐసియులో చేరింది. దీని సంబంధించిన వీడియో ఒకటి అలేఖ్య సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో అలేఖ్య మీద ట్రోలింగ్ హద్దులు మీరిందని సుమ అంటున్నారు. అలేఖ్య ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి లేదని ఆమె అంటోంది. ట్రోలర్స్ తమ తండ్రి ఫోటోను కూడా వాడుకునే స్థితికి దిగజారిపోయారన్నారు. మూడు నెలల క్రితమే తమ తండ్రి చనిపోయిన దుఖంలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.  మా ఇంట్లో మరో చావు చూడకూడదని అనుకుంటున్నాము అని ఆమె అన్నారు. ఆడపిల్లను టార్గెట్ చేశారని ఆమె రోదిస్తూ చెప్పారు. మమ్మల్ని బతకనివ్వరా మా అక్కకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ట్రోలర్స్ దేనని  సుమ హైచ్చరించారు.