పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపం.. మేమే పరిహారం చెల్లిస్తాం.. కేసీఆర్

ప్రకృతి వైపరీత్యాల విషయంలో కూడా కేసీఆర్ కేంద్రంతో తగవుకే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా  పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పంట నష్టం వివరాలను నివేదిక రూపంలో కేంద్రానికి పంపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రానికి తెలంగాణ నుంచి దండుకోవడమే తప్ప తెలంగాణకు ఇవ్వడం తెలియదని అన్నారు. గతంలో పంపిన నివేదికలకు సంబంధించిన పరిహారమే ఇప్పటి వరకూ కేంద్రం ఇవ్వలేదన్న కేసీఆర్.. ఈ సారి పంట నష్టం వివరాలను కేంద్రానికి పంపే ప్రశక్తే లేదనీ, రైతలను తమ ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రకటించారు.  ఇటీవలి అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.  ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న పంటలను   ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (మార్చి 23) పరిశీలించారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడిన ఆయన పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. గతంలో పంపిన వాటికే మోడీ సర్కార్ ఇంత వరకూ పరిహారం ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు.   బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న  దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేసీఆర్ బాధిత రైతులతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రైతులు ఆయనకు విజ్ణప్తి చేశారు.  రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొత్తం 2,28,255 ఎకరాల్లో పంట దెబ్బతిందని సీఎం కేసీఆర్ చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.

టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల సొంత పార్టీ.. మరి బీఆర్ఎస్?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు తొమ్మిదేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కష్ట కాలాన్ని ఎదుర్కుంటున్నారా? ఆయన ఏదో అనుకుంటే, ఇంకేదో జరుగుతోందా?  ఒకదాని వెంట ఒకటిగా సమస్యలు ఆయన్ని చుట్టుముడుతున్నాయా? అంటే అవుననే అనవలసి వస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు. నో.. నో ... మనం ఇప్పడు మాట్లాడుకుంటోంది ఉగాది పంచాంగంలో వివరించిన ముఖ్యమంత్రి జాతకచక్రం, గ్రహ స్థితులు, కష్టాలు నష్టాల  గురించి కాదు. క్షేత్ర స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీఆర్ఎస్  అనే సంకేతాలే స్పష్టంవుతున్నాయన్న దానిపైనే. నిజానికి 2014 తర్వాత చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగిలినా,  తెరాసకు (అదే పేరుతో ఉన్నంత వరకు) కేసీఆర్  నాయకత్వానికి ఎదురన్నదే లేదు.  ఆయన భయపడిన, డిఫెన్స్ లో పడిన  సందర్భం ఒక్కటి కూడా లేదు. కానీ  ఇప్పడు అంటే తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ లో బెరుకుదనం బయట పడుతోంది., ఒక విధమైన భయం తొంగిచూస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల వరకూ అవసరం లేదు.. ఆయనలో తడబాటు, బెరుకు సామాన్యులకు కూడా అర్థమయ్యేలానే ఉన్నాయి. ముఖ్యంగా, మంచైనా చెడైనా టీఆర్ఎస్) మన పార్టీ, మన తెలంగాణ పార్టీ, కేసీఆర్ మన నాయకుడు అని నమ్మి తొమ్మిదేళ్ళుగా కేసీఆర్ కు అండగా నిలిచిన తెలంగాణ వాదులు, పార్టీ క్యాడర్, అభిమానుల ఆలోచనలలో పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిన తరువాత వస్తున్న మార్పే  ముఖ్యమంత్రి కేసీఆర్ లో కలవరానికి కారణం అంటున్నారు.  ఏదిఏమైనా ఎన్నికల సంవత్సరంలో పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. వంద సీట్లకు పైగా గెలుస్తామనే ఒకప్పటి ధీమా ఇప్పుదు పార్టీ క్యాడర్ లో కానీ, నాయకత్వంలో కానీ కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ముఖ్యంగా వామపక్షాలు చెయ్యేస్తేనే గానీ, మునుగోడు గెలవలేని పరిస్థితి నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఎన్నికల భయం కనిపిస్తోంది. అలాగే, రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవన్న  వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహించారు. అందుకే, పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. ఒక విధంగా ఇది ఆయనలోని భయాన్ని బయట పెట్టే  వేడుకోలు లేఖగా ఉందని, బీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది .  అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్  పై ప్రతిపక్ష పార్టీలు, తెలంగాణ ప్రజానీకం చేస్తున్న ప్రధాన ఆరోపణ కుటుంబ పాలన. కుటుంబ అవినీతి.  నిజానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు వినిపించక ముందు నుంచే,  కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మొదలు అనేక ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఒక విధంగా చూస్తే లిక్కర్ కుంభకోణం వెలుగులోకి రాక ముందు నుంచే, సామాన్య  ప్రజానీకంలో సైతం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందనే ‘పర్సెప్షన్’ బలపడుతూ వచ్చింది.  అందుకు తగ్గట్టుగానే, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో ముఖ్యమంత్రి కాక ఇద్దరు మంత్రులు ( కేటీఆర్, హరీష్ రావు), ఒక రాజ్యసభ ఎంపీ (సంతోష్)  ఒక ఎమ్మెల్సీ ( కవిత) కాక, బంధు వర్గానికి చెందిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ వంటి వారు నామినేటెడ్ పదవులలో కొలువు తీరడంతో ప్రజలలో సహజంగానే, ఇందు కోసమేనా .. ఒక కుటుంబం కోసమేనా  తెలంగాణ తెచ్చుకుంది అనే భావన బలపడుతూ వచ్చిందని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల భూమికను పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్ వంటి ఉద్యమనేతలు గళమెత్తుతూ వచ్చారు. ప్రజలను జాగృత పరిచి మరో తెలంగాణ ఉద్యమం దిశగా అడుగులు  వేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణం స్కాం, టీఎస్పీఎస్సీ  పేపర్ లీకేజి వ్యవహరం బయటకు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా  కఠిన సవాళ్లను ఎదుర్కుంటున్నారనడంలో సందేహం లేదు. నిజానికి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చివరకు ఏమవుతుంది అనేది పక్కన పెడితే, కుటుంబ పాలన, కుటుంబ అవినీతిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మాత్రం నిస్సందేహంగా బలం చేకూరింది.  నిజానికి గతంలోనూ కాసినో అవినీతి కేసులోనూ కవిత పేరు విన్పించిన నేపధ్యంలో ఇప్పడు ఢిల్లీ  మద్యం కుంభకోణంలో కీలక భూమిక ఆరోపణకు బలం చేకురిందనే చెప్పాలి.  అదే సమయంలో వెలుగులోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకేజీ  వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా, ప్రతిష్టను మసకబార్చేదిగా  మారింది.  ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్లన్నింటిపై అనుమానాలు వచ్చేలా ఈ లీకేజీ వ్యవహారం ఉంది. దీంతో అసలే ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులు మరింతగా ప్రభుత్వంపై  ఫైర్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వారిలో విశ్వాసం నెలకొల్పాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది. నిజానికి, టీఎస్పీఎస్సీ  లీకేజి వ్యవవహారం, కొంత అలజడి తరువాత సద్దుమణుగుతుందనుకున్నారు.  కానీ, ప్రభుత్వ పక్షం నుంచి, కమిషన్ పక్షం నుంచి కూడా సమస్యను ఎదుర్కొనడంలో సమర్థత, సమయస్ఫూర్తి వ్యక్తం కాలేదు. పైగా, ప్రభుత్వం కలవరపడుతున్నదని  ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నదని ప్రస్ఫుటంగా తెలిసిపోతున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అన్నిటినీ మించి, తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ మీద ఉన్న విశ్వాసం బీఆర్ఎస్ మీద లేదన్న విషయం తేటతెల్లమైందనీ,  ఇప్పడు కేసీఆర్ ముందున్నప్రధాన సమస్య ఇదేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీఆర్ఎస్ విస్తరణకు రూట్ మ్యాప్ రెడీ!?

భారత్ రాష్ట్ర సమితి.. తెలంగాణకే పరిమితమైన జాతీయ పార్టీ. ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని సాకారం చేసిన ఉద్యమ నేత. ఎనిమిదేళ్ల పాటు కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన తన పార్టీ పేరును మార్చి ఆ పేరులోని తెలంగాణను తొలగించి భారత్ ను చేర్చి ఇక నుంచి తమది జాతీయ పార్టీ అని ప్రకటించేశారు. అంతే కాదు.. జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడమే తమ పార్టీ ధ్యేయమని  ఉద్ఘాటించారు. అయితే ఇంత వరకూ సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో వినా మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీ కాలూనలేదు.  తెరాస జాతీయ పార్టీగా మారి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తరువాత కేసీఆర్ కు వరుస చిక్కులే ఎదురయ్యాయి. జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలేవీ కనిపించకపోవడం,  జాతీయ పార్టీ ప్రకటనకు ముందు కూడా ఉన్న ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఆ తరువాత దూరం జరగడంతో అసలు బీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాలలో అడుగుపెట్టి కీలకంగా ఎదగగలుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతూ వస్తున్నాయి. అటువంటి తరుణంలో ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణకు ప్రణాళిక రెడీ చేశార్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో ఆ పార్టీ అడుగుపెట్టడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహా రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికలలోనూ, అలాగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలోనూ బీఆర్ఎస్ పోటీకి దిగి ఉనికి చాటాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నాయి.   ఆయా రాష్ట్రాలలో పార్టీ ఇన్ చార్జిల నియామకంపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని బీఆర్ఎస్ కీలక నేతలే చెబుతున్నారు. ఇప్పటికే ఇన్ చార్జిల నియామకంపై కేసీఆర్ పార్టీ నాయకులతో విస్తృతంగా చర్చించారంటున్నారు.  మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో బీఆర్ఎస్ కాలూనేందుకు ఇదే మంచి తరుణం అని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.  మహా లోకల్ బాడీ ఎన్నికలలోనూ, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయాలతో బీఆర్ఎస్ సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్  మహారాష్ట్రలోని కాందార్‌లోహ సభలో ఈ మేరకు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.   తెలంగాణ ఎమ్మెల్సీ, తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ సందర్భంగా జరిగిన పరిణామాలను పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించేందుకు ఒక అవకాశంగా మార్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు.  త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని స్థానాలలో (తెలుగువారు అధికంగా ఉన్న స్థానాలను ఎంచుకొని) పోటీ చేసి విజయంతో సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి కలిసి వచ్చినా రాకున్నా ముందుకు సాగాలన్న నిర్ణయంతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. కర్నాటకలో బీఆర్ఎస్ ఎన్ని స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతుందన్నది మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.   

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు.. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై సూరత్ కోర్టు తీర్పు

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కీలక నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది.  దోంగలందరి ఇంటి పేరు మోడీ యే  ఎలా అవుతోందంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును విచారించిన కోర్టు ఆయనకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.   నిరవ్ మోడీ, లలిత్ మోడీలతో పాటు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ 2019లో , మోదీ ఇంటిపేరు ఉన్న వారంతా దొంగలేనని అర్ధం వచ్చేలా విమర్శించిన సంగతి విదితమే. దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ రాహుల్ గాందీపై కేసు పెట్టారు.     దీనిపై సూరత్ కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ గతంలో పలు మార్లు హాజరయ్యారు కూడా.  కాగా మోడీ ఇంటిపేరు ఉన్న వారందర్నీ రాహుల్ గాంధీ కించపర్చలేదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. మోడీ  ఇంటి పేర్లు ఉండి పరారీలో ఉన్న నిరవ్ మోదీ, లలిత్ మోదీల గురించే ప్రస్తావించారని, ఇది మోడీపై రాజకీయ విమర్శకిందకే వస్తుందని పేర్కొంది. అయితే అయితే కోర్టు మాత్రం రాహుల్ వ్యాఖ్యలు డిఫమేషన్ కిందకే వస్తాయని పేర్కొంటూ  రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

వైసీపీ లో టెన్షన్ టెన్షన్!

అందరి చూపులు  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఉన్నాయి. అధికార వైసీపీ ఏడుగురు అభ్యర్థులను రంగంలోకి దింపితే.. ప్రతిపక్ష టీడీపీ   ఒక అభ్యర్థిని బరిలో నిలిపింది. మరో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడంతో.. అధికార పార్టీ  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొందని..  ఆ క్రమంలో తాము బరిలో నిలిపిన మొత్తం అభ్యర్థులంతా గెలిచి తీరాలనే   లక్ష్యంతో    ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది. మరో వైపు తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థి   పంచుమర్తి అనురాధ విజయంపై గట్టి నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలలో    ఎమ్మెల్సీ విజయానికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో నలుగురు... వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేశ్‌కుమార్, కరణం బలరాం.. ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టారు. కానీ వీరు జగన్ పార్టీ ఎమ్మెల్యేలుగా స్పీకర్ పరిగణించకపోవడంతో.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతూ జీత భత్యాలు అందుకొంటున్నారు.   ఇంకోవైపు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాలంటూ..  తెలుగుదేశం వీప్   జారీ చేసింది. మరి ఈ నలుగురు ఎమ్మెల్యేలు.. పంచుమర్తి అనురాధకు ఓటు వేస్తారా? అంటే సందేహమే అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. మరి  ఈ నలుగురు ఎమ్మెల్యేలు.. పంచుమర్తి అనురాధకు ఓటు వేయకుంటే.. కేవలం 19 ఓట్లే వస్తాయి.  మరో మూడు ఓట్లు పడితేనే కానీ ఆమె ఎమ్మెల్సీగా విజయం సాధిస్తారు. అదలా ఉంటే జగన్ పార్టీలో అస్మమతి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు...  ఈ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని ఇప్పటికే క్లియర్ కట్‌గా ప్రకటించేశారు.  అదీకాక  వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారంలో ఉంది. దీంతో వీరిరువురూ  తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకే ఓటే వేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆసంతృప్తితో ఉన్నారని.. వారు కనీసం ఆరుగురు ఉంటారని చెబుతున్నారు. ఈ ఆరుగురూ కూడా తెలుగుదేశం అభ్యర్థికి   ఓటు వేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  అదే జరిగితే.. వైసీపీకి శృంగభంగం తప్పదని పరిశీలకులు అంటున్నారు.   ఏదీ ఏమైనా మార్చి 23వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే.. టీడీపీ తరపున బరిలో దిగిన ఒకే ఒక్క అభ్యర్థి పంచుమర్తి అనురాధ కనుక విజయం సాధిస్తే.. గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలకు కొనసాగింపుగా ఈ ఫలితం వచ్చిందని.. భావించవచ్చు అనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీలో వణుకు దేనికి?

వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యేలను కలవడానికి కాదు, కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడని ఆయన ఇప్పుడు పనిగట్టుకుని ఫోన్ చేసి మరీ క్షేమ సమాచారాలు కనుక్కుంటున్నారు. ఖరీదైన స్టార్ హోటళ్లలో క్యాంపు చేయిస్తున్నారు. నియోజకవర్గానికి ఏం కావాలని ఆరా తీస్తున్నారు. తక్షణమే నిధుల విడుదలకూ ఓకే అంటున్నారు. అయినా భయపడుతున్నారు. నిఘా పెడుతున్నారు. ఎక్కడ కట్టు తప్పుతారో అని క్షణం క్షణం ఉలిక్కి పడుతున్నారు. ఇదంతా ఎందుకా అంటే.. ఎమ్మెల్మే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి భయం ఆయననువెన్నాడుతుండటమే కారణమని అంటున్నారు.  అందుకే ఇంత కాలం పార్టీ ఎమ్మెల్యేలకు పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వకుండా, నియోజకవర్గ పనులన్నీ వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకే అప్పగించిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎక్కడ లేని విలువా ఇస్తున్నారు. సకల మర్యాదలూ చేస్తున్నారు. స్టార్ హోటల్ లో క్యాంపు ఏర్పాటు చేసి వారేం అడిగితే అది చేయడానికి రెడీ అయ్యారు. సాధారణంగా విపక్షంలో ఉన్న పార్టీ తన సభ్యులను కాపాడుకోవడానికీ, పార్టీ కట్టు తప్పి వారు పక్క చూపులు చూడకుండా ఉండటానికీ క్యాంపులు ఏర్పాటు చేయడం ఇప్పటి వరకూ చూశాం. కానీ వైసీపీ అధినేత జగన్ దీ, ఆయన ప్రభుత్వానిదీ వివర్స్ వ్యవహారం కనుక ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలే క్యాంపుల్లో బందీలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధినేత తమ అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా అనిపించినా.. అసలు విషయం లెలిసిన ఎమ్మెల్యేలు మాత్రం అధినేత తీరు అందితే జుట్టు, లేకపోతే కాళ్లు అన్నట్లుగా ఉందని అంటున్నారు.  ప్రస్తుతం   వైసీపీకి 149 మంది సభ్యులు ఉన్నారు. వీరికి తెలుగుదేశం నుంచి ఫిరాయించిన నలుగురు, జనసేన నుంచి దూరం జరిగిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు.  ఇక విపక్ష తెలుగుదేశం పార్టీకి  అధికారికంగా 23 మంది ఉన్నా, నలుగురు ఆ పార్టీకి దూరం జరిగారు. అంటే వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం 19. ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించాలంటే.. కనీసం 22 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇక వైసీపీకి దూరంగా ఉన్న కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు ఇప్పటికే ఆత్మ ప్రభోదానుసారం అని ప్రకటించడంతో వారిద్దరూ తెలుగుదేశం అభ్యర్థికే ఓటు వేస్తారనుకున్నా.. ఆ పార్టికి మరో ఓటు దక్కితే కానీ విజయం లభించదు.  లెక్కలు ఇంత క్లియర్ గా ఉన్నా వైసీపీ ఓటమి భయంతో వణికి పోతోంది. తమ పార్టీకే చెందిన కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడు కట్టుకుని ఉందని అనుమానిస్తోంది. తెలుగుదేశం అభ్యర్థికి పాతిక వరకూ ఓట్లు వస్తాయోమోనని ఖంగారు పడుతోంది.   

కింద పడినా.. పై చేయే.. బీజేపీ తీరు మారేదేలే!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక పరాన్న జీవి. రాష్ట్రంలో ఆ పార్టీకి  సొంత బలం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు రుజువైన ఈ వాస్తవం, ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మరోసారి నిర్ద్వంద్వంగా తేలిపోయింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవ్ ఓటమి ఏపీలో కమలం ఒక చెల్లని నాణెం అని మరోసారి రుజువు చేసింది.  రాష్ట్రంలో బీజేపీ అధ్వాన స్థితిని మరో సారి తేటతెల్లం చేసింది.    2019 ఎన్నికల్లో ఒంటిగా పోటీ  చేసిన కమల దళం నిండా ఒక శాతం ఓటు కూడా తెచ్చుకోలేక పోయింది. బీజేపీ కంటే ‘నోటా’ కే ఆ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి.  అయినా, బీజేపీ రాష్ట్ర నాయకులు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు వచ్చినా అధికారం తమదే అంటుంటారు.  అదేమంటే, ఈశాన్య రాష్ట్రాలను ఉదాహరణగా చూపుతుంటారు. సాధారణ ఎన్నికలను పక్కన పెడితే ఒకప్పుడు మండలి ఎన్నికల్లో, ముఖ్యంగా పట్ట భద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో బీజేపీకి కొంత బలం ఉందన్నది వాస్తవం.  వి.రామా రావు,  పీవీ చలపతి రావు,  జూపూడి యజ్ఞ నారాయణ, మన్నవ గిరిధర రావు,  డీఎస్పీ రెడ్డి  ఇలా బీజేపీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో పెద్దల సభకు ఎన్నికైన చరిత్ర ఉంది. అలాగే టీడీపీతో పొత్తులో ప్రస్త్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,  పీవీ మాధవ్  ఎమ్మెల్సీ అనిపించుకున్నారు.  పొత్తు వద్దనుకుని ఇప్పుడు మాజీలుగా మిగిలారు.  అవును తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాంధ్ర సిట్టింగ్ సీటు సహా పోటీ చేసిన అన్ని స్థానాల్లో  చెల్లని ఓట్లతో పోటీ పడి మరీ చిత్తుగా ఓడి పోయింది.  ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గానికి ఆరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో, బీజేపీ, టీడీపీ, ఉమ్మడి అభ్యర్ధిగా తాజా మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ గెలిచారు. నిజానికి  ఆయన గెలవలేదు.  మిత్ర ధర్మానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీయే ఆయన్ని గెలిపించింది. ఈ సారి తెలుగుదేశంతో పొత్తు లేకపోవడం వలన  ఆయన ఓడి పోయారు. ఓడిపోవడం అంటే అలా ఇలా కాదు.. చెల్లని ఓట్ల  పాటి  ఓట్లు కూడా తెచ్చుకోలేనంత ఘోరంగా పరాజయం పాలయ్యారు. పోలైన ఓట్లలో పన్నెండు వేలకుపైగా చెల్లని ఓట్లు ఉంటే.. మాధవ్ కు పదకొండు వేల ఓట్లు కూడా రాలేదు.  అంటే  ఒకప్పుడు  ఉత్తరాంధ్ర పట్ట భద్రులలో ఉన్న కొద్దిపాటి పట్టు కూడా కమల దళం కోల్పోయిందని మండలి తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి  ఇదే నియోజక్ వర్గం నుంచి గతంలో, పార్టీ సీనియర్ నాయకుడు, ఇటీవల కన్ను మూసిన పీవీ చలపతి రావు ( తాజా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తండ్రి)మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. మాధవ్  ఆ వారసత్వాన్ని నిలుపుకోలేక పోయారు. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాతనే మాధవ్ కు జనసేన మిత్ర ధర్మాన్ని పాటించలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది. అలాగే వైసీపీతో రాష్ట్ర బీజేపీ అంటకాగుతోందన్న ప్రచారం జనంలోకి బలంగా వెళ్లిపోయిందనీ తెలిసొచ్చింది. చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం సమెతకు మాధవ్ వివరణ అతికినట్లు సరిపోతుంది. అయితే సామెత కోసమే కానీ.. నిజంగా జనసేనతో పొత్తును కొనసాగించాలని కానీ, మాటలలోనే కాకుండా చేతల్లో కూడా అధికార పార్టీకి దూరంగా ఉండాలన్న ఉద్దేశం కానీ రాష్ట్ర బీజేపీలో ఇసుమంతైనా కనిపించడం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. మాధవ్ ఇప్పుడైతే తాము కోరినా జనసేనాని స్పందించలేదంటున్నారు కానీ, మిత్ర ధర్మాన్ని పాటించి పవన్ కల్యాణ్ వద్దకు వోళ్లి మద్దతు కోరిన దాఖలాలు కూడా కనిపించడం లేదు.   కేంద్రంలో మోడీ అధికారంలో ఉంటే.. ఇక్కడ పెత్తనం చెలాయించినా అడిగే వారు కానీ, అడ్డుకునే వారు కానీ ఉండరన్న భావనతో  రాష్ట్ర బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే తమ  వైఫల్యాలను జనసేనాని మీదకు నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీతో తాము కలిసే ఉన్నామన్నది ప్రచారమేనని నమ్మింప చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తరువాత మాధవ్ మాటల సారాంశమిదేనంటున్నారు. జనం నమ్మే స్థాయిలో ప్రచారం జరుగుతున్నప్పుడు ఖండించడానికి కానీ, అధికార పార్టీపై విమర్శలు చేయడానికి కానీ, కనీసం ఆ పార్టీకి దూరం జరిగే ప్రయత్నం కానీ ఎందుకు చేయలేదన్న ప్రశ్నలకు మాత్రం రాష్ట్ర బీజేపీ నేతల వద్ద సమాధానం కరవైంది. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ నాయకత్వం జగన్ పార్టీతో అంటకాగుతోందని ఆ పార్టీ నేతలే హస్తిన వెళ్లి మరీ ఫిర్యాదు చేసిన విషయాన్ని మాధవ్, సోము వంటి వారు తమ వివరణలో కన్వీనియెంట్ గా మర్చిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి ఆ పార్టీ గుణపాఠంగా తీసుకోలేదనీ, ఇది కూడా జనసేనతో కటీఫ్ కు ఒక అవకాశంగానే భావిస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు. అంతే తప్ప రాష్ట్రంలో అధికార పార్టీతో అంట కాగడం వల్ల నామమాత్రంగా బీజేపీకి రాష్ట్రంలో ఉన్న ఓటు కూడా దూరమౌతోందన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు మాత్రం సిద్ధంగా లేరని అంటున్నారు. 

మోడీని మళ్ళీ గెలిపించడమే విపక్షాల లక్ష్యమా?!

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా చివరాఖరికి ప్రతి రాజకీయ పార్టీ లక్ష్యం, అధికారమే. అందులో సందేహం లేదు. అందుకు బీజేపీ,కాంగ్రెస్ సహా ఏ పార్టీ మినహాయింపు కాదు. అయితే ఇప్పడు 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కేంద్రంలో వరసగా రెండు సార్లు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఎ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ముఖ్యంగా బీజేపీ ఇప్పుడున్న సొంత బలం ( 303) నిలుపుకుంటుందా? ఇంకా పెంచుకుంటుందా? ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా సోనియాగాంధీ సార్యథ్యంలో ఒక సారి, రాహుల్ గాంధీ సారధ్యంలో మరో మారు చారిత్రక ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటీ? ఖర్గే సారథ్యంలో కొత్త రికార్డ్ సృష్టిస్తుందా? రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనే కొందరి కల నిజమవుతుందా? కేంద్రంలో చక్రం తిప్పేందుకు తహతహలాడుతున్న ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్) అరవింద్ కేజ్రివాల్ (ఢిల్లీ) నితీష్ కుమార్ (బీహార్), కేసీఆర్ (తెలంగాణ) పరిస్థితి ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నల చుట్టూ రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.  నిజానికి 2014కు ముందు ఇంచు మించుగా ఓ 30 ఏళ్లకు పైగా సాగిన సంకీర్ణ రాజకీయ శకంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఎ, బీజేపే సారథ్యంలోని ఎన్డీఎలలో ఏ కూటమి అధికారంలో ఉన్నా, ప్రాంతీయ పార్టీల ఇష్టాయిష్టాలపైనే ప్రభుత్వాలు మనుగడ సాగించాయి. అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అనుహ్యంగా 30 ఏళ్లలో మొదటి సారిగా, సింగిల్ పార్టీ (బీజేపీ) కి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు.  ఇక అక్కడి నుంచి దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది, బీజేపీ హవా అనే కంటే, మోడీ హవా  అంటే ఇంకా సమంజసంగా ఉంటుంది. 2014 తర్వాత మోడీనే బీజేపీ నినాదంగా మారిపోయారు. దేశంలోనే కాదు, విదేశాలలో ఆయన ఎక్కడికి వెళ్ళినా  మోడీ ..మోడీ అనేది నినాదంగా వినిపిస్తోంది. ఇక ఎన్నికల ప్రచార సభల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. అంతా మోడీ మయం. మోడీనే బీజేపీ ఎన్నికల మంత్రం అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకే కాదు, ప్రతిపక్షాలకు కూడా మోడీనే మూల మంత్రమయ్యారు. ఎన్నికల రాజకీయానికి మోడీ కేంద్ర బిందువయ్యారు. నరేద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా  మోడీ వర్సెస్ గానే ..ఎన్నికల ప్రచారం సాగింది. ఇప్పటికీ అలాగే సాగుతోంది. నిన్నమొన్న జరిగిన ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే అయినా, రేపటి కర్ణాటక ఆ తరువాత జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే అయినా .. మోడీ వర్సెస్ ..అన్నట్లుగానే ఎన్నికల ప్రచారం సాగుతుంది.     ఈ నేపధ్యంలోనే,2024 ఎన్నికలకు సంబంధించి పైన పేర్కొన్న విధంగా అనేక కోణాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అలాగే అనేక దేశ, విదేశీ సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇంతవరకు  జరిగిన చర్చలు, రాజకీయ విశ్లేషణలు, సర్వేల సారాన్ని బట్టి చూస్తే, కాంగ్రెస్ సహా, ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీని ఒంటరిగా ఎదుర్కునే స్థితిలో లేదు. అలాగని ఎక్కడిక్కడ ద్విముఖ పోటీకి అవకాశం కల్పించే విధంగా విపక్షల ఐక్యత కోసం సాగుతున్న ప్రయత్నాలూ ముందుకు సాగండం లేదు.  ప్రతిపక్ష పార్టీలలో తటస్థంగా ఉన్న టీడీపీ, వైసీపీ, బిజు జనతాదళ్ వంటి పార్టీలను పక్కన పెడితే బీజేపీ, మోడీని గద్దె దించే విషయంలో  ఏకాభిప్రాయంతో ఉన్న పార్టీలు కాంగ్రస్ అనుకూల, వ్యతిరేక పార్టీలుగా చీలిపోయాయి. మమత బెనర్జీ ( తృణమూల్ కాంగ్రెస్), అరవింద్ కేజ్రివాల్ (ఆప్), కేసేఆర్ (బీఆర్ఎస్) కాంగ్రెస్ రహిత కూటమి వైపు మొగ్గుచూపుతుంటే, శరద్ పవార్ (ఎన్సీపీ),ఉద్ధవ్ ఠాక్రే (శివసేన), ఎంకే స్టాలిన్ (డిఎంకే),నితీష్ కుమార్ (జేడీయు), తేజస్వి యాదవ్ ( ఆర్జేడీ) వంటి కొందరు నేతలు, కొన్ని పార్టీలు కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమి బీజేపీని ఎదుర్కోలేదని అంటున్నారు. అయితే అదే సమయంలో నితీష్, తేజస్వీ యాదవ్ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పోకడలు తగ్గించుకుని అందరినీ కలుపకు పోవాలనే షరతు విధిస్తున్నారు. అలాగే, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. మరో వంక కాంగ్రస్ పార్టీ రాహుల్ గాంధీని, దేశ్ కీ నేత గా నిలబెట్టేందుకు మోకులు బిగిస్తోంది. ఈ నేపధ్యంలో విపక్షాల ఐక్యత ఎన్నికల తర్వాత ఏమో కానీ, ఎన్నికలకు ముందు మాత్రం అయ్యే పని కాదని ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న విరుద్ధ ప్రకటనలే స్పష్టం చేస్తున్నాయి. ఒక అందుకే రాజకీయ విశ్లేషకులు  ప్రతిపక్షల ‘ఐక్యత’ ఎండమావిగా మిగిలి పోతుందని అంటున్నారు. మోదీని మళ్ళీ గెలిపించడమే విపక్షాల లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు.

ఉన్నట్టా.. లేనట్టా?.. బీజేపీ, జనసేన పొత్తు

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఒక చిత్ర మైన పరిస్థితి ఎదుర్కుంటోంది. బీజేపీ, జనసేన పార్టీల మధ్య మూడేళ్ళ క్రితం  ఎప్పుడో పొత్తు కుదిరింది. అప్పటి నుంచి రెండు పార్టీలు మిత్ర పక్షాలుగా చెలామణి అవుతున్నాయి. అయిత, 2024 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? అంటే, ఇరు పార్టీల నాయకులూ అనుమానమే అంటున్నారు. నిజానికి  మూడేళ్ళకు పైగా రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా, ఉభయ పార్టీలు ఉమ్మడిగా చేపట్టిన కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. ఎవరి దారిన వారు, ఎవరి పంథాలోవారు రాజకీయం చేస్తున్నారు. ఈ మూడేళ్ళలో రెండు పార్టీలు ఏడడుగులు కలిసి నడిచిన సందర్భం ఒక్కటి కూడా లేదు. కేవలం టీవీ చర్చల్లో మాత్రమే ఇరు పార్టీల ప్రతినిధులు ‘మిత్ర’ ధర్మాన్ని  పాటిస్తారు తప్ప క్షేత్ర స్థాయిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పొత్తు రాజకీయం నడుస్తోంది. ఈమధ్య కాలంలో అయితే టీవీ చర్చల్లోనూ దూరం పెరిగింది. పరస్పర దూషణలు మొదలయ్యాయి.  ఈ నేపధ్యంలోనే ఇటీవల మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ వార్షికోత్సవ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  పొత్తుల విషయంలో, స్పష్టత ఇస్తారని అనుకున్నా, పూర్తి స్పష్టత అయితే రాలేదు.  ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉంటుందా, ఉండదా అనే విషయంలో అస్సలు క్లారిటీ రాలేదు. మరో వంక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్  టోన్ అండ్ టెనోర్  కొంత మారింది.  యాంటి హిందూ స్టాండ్ తీసుకున్నారని అనలేం కానీ, ముస్లిం మైనారిటీ అనుకూల బుజ్జగింపు ధోరణి అయితే స్పష్టంగానే బయట పడిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ముస్లిం మైనారిటీ అనుకూల స్టాండ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే  బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకే పవన్ కళ్యాణ్ ప్రో ముస్లిం మైనారిటీ స్టాండ్ తీసుకున్నారని, బీజేపీ నాయకులు అనుమానిస్తునారు.   అదలా ఉంటే ఏపిలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ,ఎన్నికల్లో జనసేన బీజేపీకి చేయ్యిచ్చిందని, మాజీ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీఅభ్యర్ధి, బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధ‌వ్ ఆరోపించారు.  జ‌న‌సేన  బిజెపి మ‌ధ్య పొత్తు ఉన్నా లేన‌ట్లుగానే కొన‌సాగుతున్న‌ద‌ని మాధ‌వ్ సంచలన వాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా క్షేత్ర స్థాయిలో పని చేయడం లేదని స్పష్టం చేశారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తాను స్వ‌యంగా క‌లిసి మ‌ద్ద‌తు కోరినా ఆయ‌న నుంచి స్పంద‌న క‌నిపించ‌లేద‌ని మాధవ్ అన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని ప్రచారం జరిగిందని, దీన్ని ఖండించాలని తాము జనసేన నాయకత్వాన్ని కోరామని, కానీ వారు ఖండించలేదని మాధవ్ వెల్లడించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ త‌మ‌తో కలిసి రావడం లేద‌ని పేర్కొంటూ జనసేన, బీజేపీ కలసికట్టుగా ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని నమ్ముతారని స్పష్టం చేశారు.  అలాగే,మాధవ్ అధికార వైసీపీ  బీజేపీల మధ్య కొనసాగుతున్న రహస్య బంధం గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో సన్నిహితంగా ఉన్నామన్న సంకేతాలను వైసీపీ ప్రజల్లోకి బలంగా పంపిందని, దాంతో ఏపీ బీజేపీ, వైసీపీ ఒకటేనని ప్రజలు నమ్మారని మాధవ్ వివరించారు. దీనివ‌ల్ల తాను ఓట‌మిపాల‌య్యాని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ఆకర్షించడంలో టిడిపి విజ‌యం సాధించింద‌ని మాధ‌వ్ అభిప్రాయ‌ప‌డ్డారు.  అదలా ఉంటే,ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కు మంచి ప్రజాదరణ వుంది. ఆయన సభలకు వచ్చిన జనాన్ని అందరూ చూశారు. అయితే  కేవలం ప్రజాదరణ ఉన్నంత మాత్రాన ఎన్నికలలో విజయం సాధించడం అయ్యేపని కాదు. తెలుగుదేశం వంటి సంస్థాగత నిర్మాణం తోడైనప్పుడే, ఎన్నికలలో గెలుపు సాధ్యమవుతుందని  రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాగే, తెలుగు దేశం, జనసేన జంటకు బీజేపీకి జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజ్ తోడైతే  ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభంజనం సృష్టించొచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇదే విషయం స్పష్టం చేశాయని అంటున్నారు.  బీజేపీ కలిసి రాకున్నా టీడీపీ అభ్యర్ధులు వంద శాతం విజయం సాధించిన విషయాన్ని బీజేపీ నాయకత్వం గుర్తించాలని, అంటున్నారు.

ఇక తెలుగుదేశం గెలుపు ‘గంట’ల మోతేనా?

గంటా ఎక్కడుంటే గెలుపు అక్కడ ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే.. గెలుపు ఉన్న దగ్గరకే గంటా వెళ్తారు. గెలుపుకి, గంటాకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. గెలుపు గంటల మోత వినకపోతే గంటా శ్రీనివాసరావుకు నిద్రపట్టదు అనుకుంటా. అదేంటో విజయం కూడా ఆయన దగ్గరకు గెంతుకుంటూ వస్తుంది. 2004 లో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలోకి జంప్ చేశారు. ప్రజారాజ్యం ఘోర పరాజయంపాలైనా గంటా మాత్రం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవ్వడంతో మంత్రి కూడా అయ్యారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం విజయాన్ని ముందుగానే ఊహించిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు మళ్ళీ పసుపు కండువా కప్పుకున్నారు. ఆయన ఊహించినట్లుగానే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది. ఆయన కూడా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. 2019 లో ఫ్యాన్ గాలి జోరులోనూ గంటా విజయ ఢంకా మోగించారు. అయితే   తెలుగుదేశం అధికారంలో లేకపోవడంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు ఆమధ్య బలంగా  వినిపించాయి. గంటా సైతం కొంతకాలం తెలుగుదేశంతో అంటీముట్టనట్టుగా ఉన్నారు. అయితే ఇప్పుడు లెక్క మారింది. 2014 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని ఆయన ముందుగానే ఊహించినట్టు ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం గంటా నమ్మకాన్ని బలపరిచింది. అందుకే ఆయన సైకిల్ మీదే నా ప్రయాణం అంటున్నారు. తాజాగా ఆయన తెలుగుదేశం యువనేత నారా లోకేష్ తో కలిసి యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు సంబరపడుతున్నారు. "గంటా ఉన్న దగ్గర గెలుపు ఉంటుంది, గెలుపు ఉన్న దగ్గర గంటా ఉంటాడు" అనే మాట 2024 లో మరోసారి రుజువు అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక గంటా ముందుగానే ప్రజా నాడి ఏమిటన్నది తెలుసుకున్నారనడానికి లోకేష్  పాదయాత్ర ప్రారంభించడానికి ముందు హైదరాబాద్‌లో ఆయనను ఓ సారి కలిసి పాదయాత్ర విజయవంతం అవుతుందని ప్రకటించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదట చిన్న లక్ష్మి కుమారి అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించినప్పటికీ అనుకున్నప్పటికీ, గంటా సూచనతోనే చివరి క్షణంలో చిరంజీవి రావును అభ్యర్థిగా పార్టీ అధినేత ప్రకటించారని కూడా చెబుతారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గంటా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.  ఇప్పుడు గంటా శ్రీనివాస్ పాదయాత్రలో ఉన్న లోకేష్ వద్దకు వెళ్లారు. కలిశారు.  

దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా  లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు మార్చి 21వ తేదీ మంగళవారం. ఈ సందర్భంగా ఒక రోజు అన్నప్రసాద  వితరణకు 33 లక్షల రూపాయిల విరాళాన్ని నారా లోకేశ్ దంపతుల తరఫున వారి కుటుంబ సభ్యులు తిరుమలలోని టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు.  తిరుమలలోని తరగొండ వెంగమాంబ నిత్యన్నప్రసాద కేంద్రంలో జరిగే అన్న ప్రసాద వితరణ కోసం ఈ విరాళాన్ని వినియోగించాలని కోరారు. అయితే ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు.. అన్నప్రసాదం కోసం విరాళం ఇవ్వడం నారా ఫ్యామిలీకి  ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా  ఈ రోజు నిత్యన్నదానం కోసం విరాళం ఇవ్వడంతో.. మంగళవారం  తిరుమలలోని  శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు తరిగొండ వెంగమాంబ నిత్యన్న దానం కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డుల్లో నారా దేవాన్ష్ పేరు ప్రదర్శిస్తున్నారు.   టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, బ్రహ్మణి దంపతులకు 2015లో దేవాన్ష్ జన్మించారు. దేవాన్ష్ జన్మించిన ఏడాది నుంచి ప్రతి ఏటా అతడి పుట్టిన రోజు నాడు ఇలా తిరుమలలో అన్నదానానికి విరాళం అందజేస్తోందీ నారా కుటుంబం.  మరోవైపు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.  సమాజమే దేవాలయం  అని భావించే సంస్కృతిని, దానగుణాన్ని .. చిన్ననాటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం తల్లిదండ్రుల ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. టీడీపీ అధినేత, చంద్రబాబు గారి మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు.. ఈ రోజు. ఈ సందర్బంగా తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కోసం ఒక రోజుకు సరిపడా ఖర్చను.. అంటే 33 లక్షల భారీ విరాళాన్ని అందించారు నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు, అంతేకాకుండా దేవాన్ష్ పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రమంతటా అన్నదానం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ  ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

కవిత అరెస్టేనా?.. తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల అలర్ట్!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ తెలంగాణ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయనుందా?   మంగళవారం ఉదయం కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ కొనసాగుతోంది. అయితే విచారణ అనంతరం ఆమెను ఈడీ అరెస్టు చేస్తుందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందు కంటే తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరించాయి. ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో పోలీసులు, పారమిలిటరీ బలగాలే కనిపిస్తున్నాయి. గతంలో ఈడీ కవితను విచారించిన సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద మాత్రమే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ పరిసరాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధించారు. అయితే ఇప్పుడు మాత్రం ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్దే కాదు, తెలంగాణ వ్యాప్తంగా భద్రత పెంచారు. మరీ ముఖ్యంగా   హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇక నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద అయితే పోలీసు, పారామిలిటరీ బలగాలకు తోడుగా బీజేపీయే ప్రైవేటు సెక్యూరిటీని అదనంగా నియమించుకున్న పరిస్థితి కనిపిస్తోంది.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ భద్రత పెంచాల్సిందిగా కేంద్ర నిఘావర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు భోగట్టా. అలాగే రాష్ట్రంలోని కీలక బీజేపీ నేతల నివాసాలు, కార్యాలయాల వద్ద కూడా అధనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  దీంతో ఈడీ కవితను అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.  

జగన్ రెడ్డి గుండెల్లో ఆత్మ ప్రబోధం గుబులు!

జగన్ తన నీడను చూసి తానే భయపడుతున్నారు. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో భయం ఎంతగా ఉందంటే  సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మలేక పోతున్నారు. పట్టభద్రుల మొట్టికాయల తర్వాత  జగన్ రెడ్డిలో ముందున్న 175/175 ధైర్యం మటుమాయమైందని  పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు.  మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎదురైన వందకు ‘వంద’శాతం ఓటమి జగన్ రెడ్డిని కంగు తినేలా చేసిందనీ,ఈ నేపధ్యంలో  మరో రెండు రోజులలో అంటే గురువారం (మార్చి23)  జరిగే,ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఎమ్మెల్యేలు ఏమీ చేస్తారో అనే భయం జగన్ రెడ్డిని వెంటాడుతోందని అంటున్నారు. నిజానికి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న కారణంగా  వైసీపీ ఎమ్మెల్యేలలో అసమ్మతి పెద్దగా పైకి కనిపించక పోయినా  ప్రతి జిల్లాలోనూ అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గడపగడపకు రివ్యూ పేరిట నిర్వహించిన సమావేశాలలో ముఖ్యమంత్రి తమను చులకన చేసి మాట్లడిన తీరును, గడపగడపకు టెస్టులో మార్కులు తెచ్చుకోక పోతే మళ్ళీ పార్టీ టికెట్ రాదని అందరి ముందు అవమాన పరిచిన తీరును ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీలు మరిచి పోలేకుండా ఉన్నారని అంటున్నారు. అందులో ఒకరిద్దరు అటూ ఇటూ అయినా, జగన్ రెడ్డి ఇమేజ్  డ్యామేజి కావడమే కాకుండా పార్టీలో ఇంతవరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్క సారిగా భగ్గు మంటుందని  అందుకే ముఖ్య మంత్రి జగన్ రెడ్డి అనుమానిత  ఎమ్మెల్యేలు మంత్రులపై  పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.   నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ మనసులోని భయాన్ని మరో రూపంలో బయట పెట్టుకున్నారు. తెలుగు దేశం పార్టీ తమ పార్టీ  ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తోందని, తాడేపల్లి ప్యాలెస్ సన్నిహిత నేతలు ఆరోపిస్తున్నారు.  అయితే, నిజానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని  ఇప్పటికే నలుగు టీడీపీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకున్న  వైసీపీయే  అలాంటి ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీది కేవలం ఆరోపణ కాదు. అదే నిజం.  ఎమ్మెల్యేల కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తేనే విజయం వరిస్తుంది. వైసీపీ ఏడు స్థానాలకూ అభ్యర్థులను నిలిపింది. 22 మంది ఎమ్మెల్యేల చొప్పున 154 ఓట్లు పడితేనే అందరూ గెలిచే అవకాశం ఉంటుంది.  వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 151 మాత్రమే. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలూ (వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం) ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. జనసేన ఏకైక సభ్యుడు రాపాక వరప్రసాద్‌ సైతం వైసీపీతోనే ఉండడంతో తమ పార్టీ అభ్యర్థులు ఏడుగురూ గెలుస్తారని జగన్‌ రెడ్డి లెక్కలు వేశారు. సొంత బలం లేకున్నా సంతలో కొనుక్కున్న ఎమ్మెల్యేల అండ చూసుకుని ఏడవ అభ్యర్ధిని బరిలో దించారు. మరో వంక ప్రతిపక్ష టీడీపీకి సాంకేతికంగా సరిపడిన సంఖ్యా బలం ( 23 మంది) ఉన్నందున  బీసీ మహిళ పంచుమర్తి అనూరాధను పోటీకి దించింది.అసెంబ్లీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున  తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవంక వైసీపీ నుంచి  ఇప్పటికే బయట పడిన నెల్లూరు జిల్లా అసమ్మతి ఎమ్మెల్యేలు, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తారనే నమ్మకం లేదు. నిజానికి ఆ ఇద్దరు ఇప్పటికే అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని ప్రకటించారు. ఆ ఇద్దరూ టీడీపీ అభ్యర్థికి  ఓటేస్తే ప్రతిపక్షం బలం 21కి చేరుతుంది. మరొక్క ఓటు పడితే టీడీపీ గెలుస్తుంది.  పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలుపుతో ఊపుమీదున్న సైకిల్‌ వైపు వైసీపీ ఎమ్మెల్యేలెవరైనా మొగ్గితే..  వైసీపీ అభ్యర్థుల్లో ఒకరు ఓడిపోతారు. అదే జరిగితే పార్టీ మీద ముఖ్యమంత్రి పట్టు తప్పే ప్రమాదముంది. అందుకే  జగన్ రెడ్డి ఎమ్మెల్యేల పై ప్రత్యేక నిఘా పెట్టారని అంటున్నారు.  ముఖ్యంగా, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున..  గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి ఓటేస్తారో లేదోనని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. ఈ అందరిపైన పోలీసు నిఘాతో పాటుగా పార్టీ నిఘా కూడా కొనసాగుతోందని అంటున్నారు. టీడీపీలో గెలిచి వైసీపీతో సఖ్యతగా ఉన్న ఒక ఎమ్మెల్యే సైతం ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  దీంతో ఆయన్ను కూడా ఓ కంట కనిపెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గురువారం (మార్చి23)   జరిగే ఎమ్మెల్యే ఓటింగ్‌కు హాజరు కావాలని వైసీపీ నాయకత్వం పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేసింది.  అయితే, ఏమి చేసినా ఇప్పటికే మనసు విరిగిన ఎమ్మెల్యేలు, ఎటూ టికెట్ రాదని నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యేలు, టికెట్ వచ్చినా వైసీపీ తరపున పోటీ చేయరాదనే నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇలా అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు,  ఆత్మ ప్రభోధం .. ప్రకారం ఓటు వేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

లిక్కర్ స్కామ్.. కవిత చూట్టూనే ఎందుకు?

దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు సంభవించినా.. వాటి మూలాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్నట్లు.. దేశ రాజధాని హస్తిన వేదికగా జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మూలలు అదే తెలంగాణలో ఉన్నాయా? అనే సందేహం ఆ రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైందని.. ఆ క్రమంలో ఆమెకు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవంటూ సోషల్ మీడియాలో కథనాలు అయితే వెల్లువెత్తుతున్నాయి.  మరోవైపు ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. అదుపులోకి తీసుకుని.. ప్రశ్నించి.. అతడిని అరెస్ట్ తీహార్ జైలుకు తరలించారు. అయితే ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇంకోవైపు ఈ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలకు లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మెడలకు సైతం ఈ కేసు చుట్టుకొంది. దీంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ ఇన్ చార్జ్ మంత్రి మనీష్ సిసోడియాతోపాటు మరో మంత్రిని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి.. తీహార్ జైలుకు తరలించారు.    దేశవ్యాప్తంగా ఇంతలా ప్రకంపనలు సృష్టిస్తోందీ ఢిల్లీ లిక్కర్ స్కామ్... అలాంటి వేళ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమిటీ.. ఇది ఎప్పుడు జరిగింది.. ఎందుకు జరిగింది? ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఎవరికీ లాభం.. మరెవరికీ నష్టం.. ఇంతకీ ఈ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చింది? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అంటే ఒక్క సారి వెనక్కి వెళ్లాలి.     దేశ రాజధాని ఢిల్లీలో కొలువు తీరిన కేజ్రీవాల్ సర్కార్.. 2021, నవంబర్ 17న కొత్త లిక్కర్ పాలసీని అమలులోకి తీసుకు వచ్చింది. కొంత మంది నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని అమలు చేస్తున్నట్లు కేజీవ్రాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అంతేకాదు ఇది పూర్తి పారదర్శకతతో దేశంలోనే అత్యత్తమ పాలసీ అని సీఎం కేజ్రావాలే సైతం స్పష్టం చేశారు. ఈ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరుగుతోందని.. అలాగే వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతాయని.. అంతేకాకుండా లిక్కర్ మాఫియతోపాటు బ్లాక్ మార్కెట్ విధానానికి పుల్ స్టాప్ పడుతోందని ఆయన చెప్పుకొచ్చారు.  మరోవైపు.. ప్రభుత్వ మద్యం అమ్మకాల్లో బ్లాక్ మార్కెట్‌ను నిలువరించడం కోసం.. మద్యం విక్రయాల ద్వారా రెవెన్యూ పెంచుకోవడం కోసం... మద్యం విక్రయాలను ఇకపై ప్రభుత్వం నిర్వహించకుండా.. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని నిర్ణయించడం.. ఆ క్రమంలో మద్యాన్ని హోం డెలివరీ చేయడం.. అలాగే తెల్లవారుజాము 3గంటల వరకు మద్యం షాపులు బార్లా తెరిచి ఉంచడం.. మద్యం షాపులకు లైసెన్స్‌లను విచ్చల విడిగా కట్టబెట్టడం.. మద్యం విక్రయాలపై డిస్కోంట్‌ను అన్‌లిమిటెడ్‌ అంటూ ప్రకటించుకొనే అవకాశం దుకణాల యజమానులకు కల్పించడం.. వంటి అంశాలకు చోటు కల్పించారు. అలాగే ఈ నూతన మద్యం విధానం వల్ల ప్రభుత్వానికి 27 శాతం ఆదాయం పెరుగుతోంది.. అంటే అక్షరాల 8,900 కోట్ల రూపాయిల అధిక ఆదాయం ఢిల్లీ ప్రభుత్వానికి సమకూరనుంది. అయితే ఈ లిక్కర్ పాలసీపై పౌర సమాజంతోపాటు వాటి అనుబంధం సంఘాలు.. పలు ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, విద్యా సంస్థలతోపాటు వివిధ  సంఘాలు, సంస్థలు సైతం తీవ్రంగా వ్యతిరేకరించాయి.  ఇంకోవైపు ఈ ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ.. జీఎన్‌సీటీడీ యాక్ట్ 1991, టీఓబీఆర్ 1993, ఢిల్లీ ఎక్సైజ్ యాక్ట్ 2009, ఢిల్లీ ఎక్సైజ్ రూల్ 2010లకు తూట్లు పొడిచే విధంగా ఉందంటూ 2022, జులై 8వ తేదీన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సెనాకు ఢీల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించారు. అలాగే ఈ లిక్కర్ పాలసీలో డిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ ఇన్‌చార్జ్ మంత్రి మనీష్ సీసోడియా అనుసరించి విధి విధానాలతోపాటు తీసుకున్న కీలక నిర్ణయాలను సైతం ఈ నివేదికలో పొందు పరిచారు. ఈ నేపథ్యంలో అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన లిక్కర్ పాలసీ 2021 - 2022పై విచారణ జరపాలని సీబీఐకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ లేఖ రాశారు.  అయితే ఈ ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీపై విచారణ జరిపించాలంటూ సీబీఐకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాయడంతో... ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఇన్ ఛార్జ్ మంత్రి మనిష్ సిసోడియా వెంటనే స్పందించారు...  మద్యం విక్రయదారులను బెదిరించేందుకు బీజేపీ తన నియంత్రణలో ఉన్న దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఆ క్రమంలో నూతన ఢిల్లీ లిక్కర్ పాలసీని వెనక్కి తీసుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపైనే ప్రస్తుత ఎల్జీ వీకే సక్సేనా, ఆయనకు ముందు ఉన్న ఢిల్లీ ఎల్జీ అనిల్ బైజాల్‌పై ఈ సందర్భంగా మనీష్ సిసోడియా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఢీల్లీ లిక్కర్ స్కామ్‌పై సీబీఐ విచారణ చేపట్టడం.. అందులోభాగంగా మనీ ల్యాండరీంగ్ జరిగినట్లు గుర్తించడంతో... ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి.. మనిషీ సిసోడియాతోపాటు ఆయన బంధువులు, సన్నిహితల ఇళ్లు కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. అలా ఈ కేసుకు సంబంధించిన తయారు చేసిన చార్జ్ షీట్‌లో తెలుగు రాష్టాలకు చెందిన పలువురు నేతల పేర్లు వచ్చి చేరాయి.  అలా ఈడీ అధికారుల చేపట్టిన దర్యాప్తులో సౌత్ గ్రూప్ అంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలు లిక్కర్ లాబీగా ఏర్పడి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు రూపాయిల నగదును ముడుపుల కింద ఇచ్చారని.. ఆ నగదును గోవా ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించుకొందని.. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ ఎదుట ఓ వ్యాపారవేత్త పేర్కొన్నారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సైతం ఈడీ విచారించి.. మరింత సమాచారం సేకరించి.. అనంతరం అతడిని సైతం అరెస్ట్ చేసింది.  అయితే ఢిల్లీని 32 ఎక్సైజ్ జోన్లుగా విభజించి.. వాటిలో 849 షాపులు ఏర్పాటు చేసుకునేందుకు రిటైల్ లిక్కర్ లైసెన్లు ప్రైవేట్ వ్యక్తులకు అందజేయడం ద్వారా.. మద్యం విక్రయ వ్యాపారం నుంచి ఢిల్లీ ప్రభుత్వం బయటకు వచ్చేయాలని నిర్ణయించింది. ఆ క్రమంలో మద్యం విక్రయించుకునే ప్రైవేట్ మద్యం దుకాణదారులకు పలు సడలింపులు సైతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మద్యం విక్రయాల సందర్భంగా ఎమ్‌ఆర్పీ ధరను పక్కన పెట్టి.. సొంతంగా రేట్లు నిర్ణయించే అధికారాన్ని సైతం వారికి కట్టబెట్టింది. ఆ క్రమంలో మద్యంపై ప్రత్యేక ఆఫర్లు సైతం ఇవ్వోచ్చని చెప్పకనే చెప్పినట్లు అయింది.  మరోవైపు ఈ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసి.. విచారించింది. ఆ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు తాను ప్రతినిధిగా ఈ వ్యవహారంలో వ్యవహరించినట్లు ఈడీ ముందు ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. మరోవైపు కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.. తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానంటూ.. అరుణ్ రామచంద్ర పిళ్లై ప్రకటించడం ద్వారా ఆయన యూ టర్న్ తీసుకున్నట్లు అయింది.  అదీకాక.. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోని ఈ సౌత్ గ్రూప్‌ ఏర్పాటులో కల్వకుంట్ల కవిత ఉండడం వెనుక అరుణ్ రామచంద్రన్ పిళ్లై కీలక వ్యక్తిల్లో ఒకరుగా ఉన్నారని స్పష్టమవుతోంది. అలాగే ఈ స్కామ్‌లో ఒంగోలు ఎంపీ, వైయస్ఆర్ సీపీ నాయకుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు ఎం రాఘవరెడ్డితోపాటు అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిలు కూడా ఉన్నారు.  ఇక ఇండో స్పిరిట్‌లో అరుణ్ రామచంద్రన్ పిళ్లై 32.5 షేర్ హోల్డర్‌గా ఉన్నారు. దీంతో ఆయన ఎల్ 1 లైసెన్స్ కలిగి ఉన్నారు. ప్రేమ్ రాహుల్‌ 32.5 శాతం, అలాగే ఇండో స్పిరిట్ డిస్ట్రిబ్యూట్ కంపెనీ లిమిటెడ్ 35 శాతం ఇతర బాగస్వాములుగా ఉన్నారు. మరోవైపు అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్‌లు.. కల్వకుంట్ల కవితతోపాటు మాగుంట రాఘవరెడ్డికి బినామీలుగా పెట్టుబడులు పెట్టారు. ఫిళైతోపాటు అతడి అసోసియేట్స్ అభిషేక్ బోయినపల్లి, గోరంట్ల బుచ్చిబాబు తదితరులు ... సౌత్ గ్రూప్ ఏర్పాటుతోపాటు ఈ మొత్తం లిక్కర్ స్కీమ్‌లో.... తయారీదారులు, హోల్‌సేల్, రిటైలర్లు ఏర్పాటు తదితర అంశాలను పర్యవేక్షించారు. ఇంకోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్.. విలువ మొత్తం పది వేల కోట్ల ఉంటుందని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

తెరపైకి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం.. ఫలించేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత నిండా ఇరుక్కోవడంతో ఆమెను కాపాడుకోవాలన్నా, తెలంగాణ సమాజం నుంచి ఆమెకు సానుభూతి మద్దతును కూడగట్టాలన్నా సెంటిమెంట్ తప్ప మరో దారి లేదని కేసీఆర్ భావించారా? అందుకే బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి అటకెక్కించేసిన తెలంగాణ వాదాన్ని మళ్లీ కిందకు దించారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మరో సారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా.. రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలన్నా జాతీయ రాజకీయాల జపం కాదు.. తెలంగాణ సెంటిమెంట్ అస్త్రమే ‘శ్రీరామ రక్ష’ అని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ జనంలో రగిలించాలని చూస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉద్యమ నేతగా తాను పడిన కష్టాన్ని, రాష్ట్రం సాధించుకున్న తరువాత ముఖ్యమంత్రిగా తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలలో సాధించిన విజయాలను మరోసారి ప్రముఖంగా చాటుతూ జనంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఆయన జనాలకు ఓ బహిరంగ లేఖ రాశారు. పార్టీపై ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆ లేఖ ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెర లేపింది. గత కొంత కాలంగా అంటే  తాను జాతీయ రాజకీయాలలోని జంప్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తొలగించి భారత్ ను చేర్చి తెరాసను బీఆర్ఎస్ గా మార్చిన నాటి నుంచి కేసీఆర్ తెలంగాణ పదాన్ని బహిరంగంగా పలకడానికే ఇష్టపడటం లేదు. తెలంగాణ అస్త్రం నిర్వీర్యమైపోయిందని ఆయన భావించారో.. లేక నిర్వీర్యం చేయడమే తన జాతీయ రాజకీయాలలో చురుకుగా ముందుకు సాగడానికి దోహదం చేస్తుందనో కానీ ఆయన తెలంగాణ పదాన్ని తన వాడుకలో నిషేధిత పదాల్లోకి చేర్చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన సభలో ఎక్కడా తెలంగాణ సెంటిమెంట్ కనిపించకుండా, తలెత్తకుండా కేసీఆర్ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.  తెలంగాణ అస్తిత్వ రాజకీయాలకు ఆ సభ వేదికగా గుడ్ బై చెప్పేశారు. అందుకే ఆ సభలో ఎక్కడా జై తెలంగాణ నినాదమే వినిపించలేదు.  అంతకు ముందు గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎక్కడ   సభ జరిగినా, జై తెలంగాణ నినాదమే ప్రధానంగా వినిపించేది.  ఆ నినాదంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిసేది.  కానీ ఖమ్మం సభ నుంచి జై తెలంగాణ స్థానంలో  జై భారత్ నినాదం వచ్చి చేరింది. కేసీఆర్ లోని ఈ మార్పును తెలంగాణ ప్రజానీకమే కాదు, ఉద్యమ కాలం నుంచీ పార్టీలో కొనసాగుతూ వచ్చిన వారు, తెరాస అధికారం చేపట్టిన తరవాత కేసీఆర్ పోకడలు నచ్చక దూరమైన వారూ, ఉద్యమకారులూ, మేధావులూ కూడా అప్పుడే వ్యతిరేకించారు. విమర్శలు గుప్పించారు.   బీఆర్ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ అస్థిత్వాన్ని లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. అయితే ఇప్పుడు సమస్య తన కుటుంబం దగ్గరకు వచ్చే సరికి కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను ఆశ్రయించారన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ బహిరంగ లేఖల  కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడడానికి కారణం సమస్య తన కుటుంబం దగ్గరకు రావడమేనా అని ప్రజలలో చర్చ జరుగుతోంది. అంతేనా పార్టీ క్యాడర్ లో సైతం ఇప్పటి వరకూ సైడ్ చేసిన తెలంగాణ నినాదం, సెంటిమెంట్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అన్న చర్చ జరుగుతున్నది.    బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత ‘తెలంగాణ’ పదం దూరమయ్యిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతోంది. తెరాసను అక్కున చేర్చుకున్న విధంగా ప్రజలు కూడా బీఆర్ఎస్ ను తమ పార్టీగా భావించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.  ఆ విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ఇప్పుడు కష్టం తన ప్రగతి భవన్ గుమ్మంలోకి రావడంతోనే కేసీఆర్ కు తాను వదిలేసిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం గుర్తుకు వచ్చిందా అని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.  ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అక్కర తీరిపోయిందని వదిలేసిన సెంటిమెంట్ ఆస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించినా ఫలితం ఉంటుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

బీఆర్ఎస్ లో గ్రూపుల లొల్లి.. ఎన్నికల ముంగిట భగ్గుమంటున్న విభేదాలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన తరుణంలో బీఆర్ఎస్ లో విభేదాల రచ్చ మొదలైంది. దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ  బీఆర్ఎస్ పార్టీ వర్గ విభేదాలతో సతమతమౌతోంది. గ్రూపుల లొల్లి ఆ పార్టీని అతలాకుతలం చేస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలతోపరిస్థితిని చక్కదిద్దేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందన్న విషయంలో పార్టీలోనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.   ఈ పరిస్థితి రానున్న ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంతగా సమస్యల వలయంలో చిక్కుకుంది. పార్టీలో గ్రూపు తగాదాలకు తోడు.. పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆరోపణల్లో చిక్కుకుని సమస్యలను ఎదుర్కొంటుండటం పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను ఎదుర్కొటుంటడం, ఏ క్షణంలోనైనా ఆమె అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం, అలాగే టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ కేసులో కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ పై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుండటం, పేపర్ల లీకేజీ వ్యవహారం బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయడం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై కేసీఆర్ పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మరో వైపు సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో, అటు జాతీయస్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవలసిన సమయంలో కేసీఆర్ పూర్తి సమయం పార్టీ కార్యకలాపాలకు కేటాయించలేని పరిస్థితిలో ఉండటంతో బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు డేంజర్ స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు నాయకుల మధ్య కూడా సఖ్యత లేని పరిస్థితి నెలకొంది.   ఉద్యమ కాలం నుంచి పని చేస్తున్నవారు ఓ జట్టుగా ఉంటే.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన మారు మరో వర్గంగా మారిపోయారు.  కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు ఆయా గ్రూపుల సమ్మేళనాలుగా మారిపోయాయి.   దీనికి తోడు కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగులందరికీ పార్టీ టికెట్లు అని ఒక సారి, తూచ్ అందరికీ కాదు కొందరికే అని మరోసారి.. పనితీరును బట్టే పార్టీ టికెట్లు అంటూ ఇంకో సారి ప్రకటనలు చేయడంతో సిట్టింగులలోనే కాకుండా ఆశావహుల్లో కూడా అసంతృప్తి,  అభద్రత నెలకొన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తరువాత చూసుకుందాం అన్నట్లుగా ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను మమ అనిపించేస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా పాల్గొనడం లేదు.  ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది. 

ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం.. అధికారికంగా గెజిట్ విడుదల చేసిన కేంద్రం

నందమూరి తారక రామా రావు...  తెలుగు ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు.   ఒక సినిమా హీరోగా ఆయన తాను ‘జీవించిన’ పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన  మహా నటుడు ఎన్టీఆర్.   రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా  ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.  రాముడు ఎలా ఉంటాడాంటే,  ఆ నాటి  నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్  లాగానే ఉంటారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో   సజీవంగా ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం చేశారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎ న్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం  ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదలకు  ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గత ఏడాది  జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపిన సంగతి విదితమే.  ఇప్పుడు  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఆయన బొమ్మతో ఉన్న వందరూపాయల నాణెం విడుదల చేయనున్నట్లు  కేంద్రం అధికారిక గెజిట్ జారీ చేసింది.   44మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో 50శాతం వెండి, 40 శాతం రాగి, 5శాతం జింక్ లోహాలు ఉంటాయని పేర్కొంది. నాణేనికి ఒక వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం ఉంటుంది. రెండో వైపు ఎన్టీర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి అని ఇంగ్లీషు, హిందీ భాషలలో ముద్రిస్తారు. 

ఇప్పటికి వెళ్లండి.. రేపు మళ్లీ రండి! కవితకు ఈడీ ఆదేశం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు సోమవారం (మార్చి 20)సుదీర్ఘంగా విచారించి అరెస్టు చేయకుండానే  పంపించారు. అయితే విచారణ ఇంకా ముగియలేదనీ మరోసారి విచారణకు రావాలనీ చెప్పారు. సోమవారం (మార్చి 20) ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ ఆమెను సుదీర్ఘంగా విచారించారు.   సాయంత్రం సమయంలో వైద్యులను పిలిపించి పరీక్షలు కూడా నిర్వహింపచేశారు. దీంతో ఆమెను అరెస్ట్ చేస్తారని అంతా భావించారు.   చివరికి ఆలస్యంగా కవితను వదిలి పెట్టారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో 24వ తేదీన విచారణకు రానున్న నేపథ్యంలో  అప్పటి వరకూ ఆమెను అరెస్టు చేసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆమె తన పిటిషన్ లో  మహిళల్ని విచారణకు దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు పిలవకూడదనీ,  సాయంత్రం ఐదు గంటల తర్వాత విచారించకూడదనే వాదన వినిపించారు. అయితే ఈడీ మాత్రం కవితను కార్యాలయానికి పిలిపించుకుని రాత్రి పొద్దు పోయే వరకూ విచారించింది. మరోవైపు ఈ  ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే ప్రధాన నిందితులందరూ అరెస్టయ్యారు. కవితకు మాత్రమే ఎందుకు మినహాయింపు అంటూ కాంగరెస్ సహా పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.   ఇలా ఉండగా సోమవారం కవిత విచారణ సుదీర్ఘంగా అంటే దాదాపు పది గంటలకు పైగా సాగింది. కవితను ఈ కేసులో ఇప్పటికే అరెస్టై ఉన్న రామచంద్ర పిళ్లైతో,  తర్వాత అప్రూవర్‌గా మారిన అమిత్ అరోరాతో కలిసి విచారించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఆమెను బయటకు పంపిన ఈడీ అధికారులు మంగళవారం (మార్చి 21)న మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. దీంతో నిన్నటికి అరెస్టు లేదని ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలలో ఈ రోజు ఏం జరగనుందన్న టెన్షన్ మొదలైంది. 

బీఆర్ఎస్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక దాని తరువాత ఒకటిగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆయన ఏ ముహూర్తాన బీఆర్ఎస్ అంటే తెరాసను జాతీయ పార్టీగా మార్చేశారో.. ఆ ముహూర్తం నుంచే ఆయనతో సమస్యలు చెడుగుడు ఆడుకుంటున్నాయి. ఇప్పటి వరకూ కేసీఆర్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ ఒకెత్తయితే.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవితపై వచ్చిన అభియోగాలు, అలాగే.. టీపీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఆయన కుమారుడు కేటీఆర్ పై వచ్చిన, వస్తున్న ఆరోపణల తీవ్రత మాత్రం బీఆర్ఎస్ ప్రతిష్టకు, కేసీఆర్ పలుకుబడికి డ్యామేజీ జరిగేవిగానే ఉన్నాయి. ముందుగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు, ఈడీ విచారణకు సంబంధించి జరిగిన హై డ్రామానే తీసుకుంటే.. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే 12 మంది అరెస్టయ్యారు. అలా అరెస్టయిన వారిలో ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఉన్నారు. వారెవరూ కూడా విచారణను ఎదుర్కొనడానికి వెనుకాడలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సహా ఆ పార్టీ వారంతా ఎలా అయితే ఈ ఆరోపణలూ, కేసులూ, దర్యాప్తులూ అన్నీ రాజకీయ ప్రేరేపితం అని ఆరోపిస్తున్నారో అలాగే మనీష్ సిసోడియా కూడా ఆరోపించారు. అయితే విచారణను హుందాగా ఎదుర్కొన్నారు. స్టే కోసమో, అరెస్టు చేయకుండా ఆదేశాల కోసమే కోర్టులను ఆశ్రయించలేదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయానికి వచ్చే సరికి విచారణను తప్పించుకోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు గత్యంతరం లేక రెండో సారి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇదే విధంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేటీఆర్ కూడా డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లన్నీ నా అధీనంలో ఉంటాయా అంటూ బేలగా అడుగుతున్నట్లు కనిపిస్తోంది.  విపక్షాల విమర్శలకు వివరణలు ఇచ్చుకోవడానికే ఆయన సమయం అంతా కేటాయిస్తున్నారు తప్ప విమర్శలను గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నారు. దీంతోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కేటీఆర్ పీఏ తిరుపతిపై నేరుగా ఆరోపణలు గుప్పించారు. ఇక బండి సంజయ్ కూడా టీఎస్పీఎస్సీ పరీక్షల్లో అధిక మార్కులు టీఆర్ఎస్ నేతల పిల్లలకే వచ్చాయని ఆరోపించారు. అంతే కాదు.. ఆ వివరాలన్నీ బయటపెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా మూకుమ్మడిగా చేస్తున్న విమర్శల దాడిలో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పేపర్ల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా.. విపక్షాలు నెమ్మదించడం లేదు. సిట్ పై నమ్మకం లేదంటున్నాయి. ఏ విధంగా చూసుకున్నా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు, పేపర్ల లీకేజీ కేసీ బీఆర్ఎస్ అధినేతకు శిరోభారంగానే పరిణమించాయని చెప్పక తప్పదు. ఈడీ విచారణ విషయంలో బీఆర్ఎస్ హై డ్రామా అభాసుపాలైన సంగతి మరవక ముందే... పేపర్ల లీకేజీ విషయంలో ఆరోపణలు చేసిన రేవంత్ కు ఆధారాలివ్వాలంటూ సిట్ నోటీసు జారీ చేయడమూ అంతే అభాసుపాలయ్యింది.