తెలుగు దేశంకు మద్దతుగా రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్!

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశంలో నయా జోష్ కనిపిస్తోంది. అన్నీ మాంచి శకునములే అన్నట్లుగా ఆ పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అశేష ప్రజాదరణతో 50 రోజులుగా సాగుతోంది. అడుగడుగునా జననీరాజనంతో ఆయన పాదయాత్ర సాగుతున్న తరుణంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంపూర్ణ విజయం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే స్ధాయిలో దక్కిన విజయం పార్టీలో సహజంగానే ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసింది. నారా లోకేష్ పాదయాత్రలో శనివారం (మార్చి 25) నారా వారి కుటుంబానికి చెందిన హీరో నారా రోహిత్ పాల్గొన్నారు. సోదరుడితో అడుగు కలిపి నడిచారు. ఆ సందర్భంగా రోహిత్ మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలూ తెలుగుదేశంకే మద్దతు పలుకుతున్నారని స్పష్టం చేశారు. వైసీపీ వరుస పరాజయాలతో డిఫెన్స్ లో పడిన తరుణంలో రోహిత్ మరో బాంబు పేల్చారు. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగనున్నారని వెల్లడించారు.  వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పట్లో ఆయన ప్రచారానికి బ్రహ్మాండమైన ప్రజా మద్దతు లభించింది. పాతికేళ్ల వయస్సులోనే ఆయన ప్రచారం ఎంతో పరిణితితో ఉందని పరిశీలకులు సైతం ప్రశంసలు కురిపించారు. 2009 తరువాత జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా రాజకీయాలలో క్రియాశీలంగా  లేరు. పూర్తిగా సినీ కెరీర్ మీదే దృష్టి పెట్టారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పీక్స్ లో ఉంది. పాన్ ఇండియా స్టార్ గా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన హీరోగా నటించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా పాల్గొంటారా అన్న అనుమానాలు వ్యక్తం ఔతున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో ఆయన తెలుగుదేశంకు మద్దతుగా వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున   జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంకు మద్దతుగా రంగంలోకి దిగుతారని నటుడు తారకరత్న చెప్పిన సంగతిని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అలాగే పాదయాత్రలో భాగంగా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగుతారనీ, సమయం వచ్చినప్పుడు ఆయన తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. ఇప్పుడు తాజాగా నారా రోహిత్ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి చెప్పడంతో ఆయన పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగే సమయం దగ్గరకు వచ్చేసిందనే తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. 

అనర్హత వేటు.. రాహుల్ స్వయం కృతమేనా?

ఏ ముహూర్తాన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించారో ఏమో కానీ, అప్పటి నుంచి ఆయన వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్నారు. కానీ, అదే సమయంలో ఆయనను ఒకదాని వెంట ఒకటిగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా  ఎప్పుడో 2019 ‘దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎలా వచ్చింది’ అని చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మార్చేసింది.   ‘మోడీలంతా దొంగలే’ అనే అర్ధం వచ్చేలా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై. అప్పట్లోనే బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. కేసు విచారణ జరిపిన  సూరత్ కోర్టు  గత గురువారం (మార్చి 23) రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది. రెండేళ్ళు జైలు శిక్ష విధించింది.  దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది.   పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటం, ఆ వెంటనే లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడు కావడం చకచకా జరిగి పోయాయి. ప్రస్తుతానికి అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ... అంతే కాదు, 'మోడీ ఇంటిపేరు' వ్యాఖ్యపై క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి, రెండేళ్ళు జైలు  శిక్ష విధించిన నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్‌  గాంధీ ఎనిమిదేళ్ళ పాటు  ఎన్నికలలో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోయారు. అయితే, సూరత్ కోర్టు తీర్పుపై పై కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు న్యాయస్థానం రాహుల్  గాంధీకి  30 రోజులు గడువు ఇచ్చింది. ఆ ప్రకారంగా రాహుల్ గాంధీకి  పై కోర్టులలో ఉపశమనం లభిస్తే లభించవచ్చును. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్న రాజకీయ చర్చను పక్కన పెడితే రాహుల్ గాంధీ చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోవడం మాత్రం ఆయన స్వయం కృతమే అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ అధికారంలో ఉన్న రోజుల్లో అప్పటి  ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక  ‘మంచి’ ఆర్డినెన్స్‌ తెచ్చింది. అయితే, కాబినెట్ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన సదరు ఆర్డినెన్స్‌  కాపీని, రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పరపరా చించి పారేశారు.  నేరస్తులను రక్షించేందుకు, ఆర్డినెన్స్‌ తీసుకురావడం సిగ్గుచేటని సొంత కూటమి సర్కార్ నే ఎడాపెడా కడిగి పారేశారు. తమకున్న వీటో పవర్ తో ఆర్డినెన్స్‌ రద్దు చేయించారు.  నిజానికి. జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించకూడదని, అప్పీల్ కు సమయం ఇవ్వాలని, పై కోర్టు స్టే విధిస్తే  అనర్హత అంశం పై నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంటూ  మన్మోహన్ సింగ్ సర్కార్ ముందుచూపుతో తెచ్చిన ఆర్డినెన్స్‌ అది. అది అలాగే ఉంది ఉంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడేది కాదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ 8(4) ను  పునరుద్ధరిస్తూ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రూపొందించింది.  రాహుల్‌ సొంత పార్టీకి చెందిన ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను అవమానించే ఉద్దేశంతో అప్పట్లో దానిని   ఆర్థం లేని ఆర్డినెన్స్‌, దోషులను కాపాడేలా ఉందంటూ అంటూ  చించేశారు. ఆ ఆర్డినెన్స్ పత్రాలను చించేసిన దాదాపు దశాబ్దం తరువాత రాహుల్ గాంధీ  స్వయంగా అనర్హతకు గురి కావడాన్ని పొయిటిక్ జస్టిస్ అనాలో మరేమనాలో కానీ   అయన స్వయంకృతం అనడంలో మాత్రం సందేహం అక్కరలేదు. అందుకే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దుకు కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా  బీజేపీ, మోడీ కారణం అయితే కావచ్చును కానీ    రాహుల్ గాంధీ స్వయం కృతం కూడా కచ్చితంగా ఒక కారణం.  అలాగే, ఈ కేసును విచారించిన సూరత్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హెచ్‌.హెచ్‌.వర్మ తీర్పు ఇచ్చే సందర్భంగా, నిందితుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ప్రజల్లో ఆయన చేసే ప్రసంగాలకు ప్రభావం ఎక్కువ. నిందితుడికి స్వల్పశిక్ష విధిస్తే అది ప్రజలకు తప్పుడు సందేశం పంపిస్తుంది. ఎవరు ఎవరిపైనైనా సులువుగా అపనింద వేస్తారు. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని గతంలో నిందితుడు వ్యాఖ్యానించి క్షమాపణలు చెప్పిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ఇకపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అయినా ఆయన ప్రవర్తనలో మార్పేమీ ఉన్నట్లు కనిపించడం లేదు అని వ్యాఖ్యానించారు.  ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్య ద్వారా పరువునష్టం కలిగించారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఈకేసులో చివరకు ఏమి జరుగుతుంది? అనేది పక్కన పెడితే  ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే కాదు నోరుంది కదా అని, నోరు పారేసుకునే నాయకులు అందరికీ ఇది ఒక హెచ్చరికే అని భావించాల్సి ఉంటుంది.

ముందస్తుకే జగన్ మొగ్గు.. తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకీ?!

ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి .. ఎటూ పోలేని పరిస్థితిలో  జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్నకు ప్రజల నుంచీ, రాజకీయ పరిశీలకుల నుంచీ కూడా ఔననే సమాధానమే వస్తోంది.   మహా కవి, శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు కవితను గుర్తుకు తెచ్చేదిగా జగన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి ఉందని అంటున్నారు.  గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి ఇక్కటే కాదు.. భవిష్యత్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఓటమి తప్పదన్న భయంతో జగన్ రెడ్డి వణికి పోతున్నట్లు కరిపిస్తోందని క్రాస్ ఓటింగ్ నెపంతో నలుగురిపై వేసిన సస్పెన్షన్ వేటును అభివర్ణిస్తున్నారు. నిజానికి, ఓటమి భయం తోనే వైసీపీ అధినేత  నేతలు ఏమి  చేయడమో ... ఎటు పోవడమో అర్థం కాని అయోమయ పరిస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు పోదామంటే, ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే  సెటైర్లు వేస్తున్నారు. ఐదేళ్ల సమయం పూర్తయ్యే దాకా ఆగుదామా అంటే.. అయ్యో అలా ఎలా మొదటికే మోసం వస్తుందని మళ్లీ వాళ్లే అంటున్నారు. టుబీ ఆర్ నాట్ టుబి అన్నట్లుగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో జగన్ కొట్టుమిట్టాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.  అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల అట్టును అటూ ఇటూ తిరగేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ముందస్తు ముచ్చటను తెరపైకి తీసుకువచ్చినదే వైసీపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి కంటే చాలా చాలా ముందుగానే.. ఒకటికి పది సార్లు వైసీసీలో, జగన్ రెడ్డి ప్రభుత్వంలో  సకల శాఖల మంత్రిగా చెలామణి అవుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డి ఏడాది ఏణ్ణర్థం ముందు నుంచే ముందస్తు ఉందనీ లేదనీ చెబుతూ చర్చను ఎప్పటికప్పుడు సజీవంగా ఉంచుతూ వస్తున్నారు.  నిజానికి  ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వ్యూహాత్మక తప్పటడుగులను, తప్పుటడుగులను పెద్దగా పట్టించుకోవడం లేదు.  అలాగే  ప్రజలు కూడా ముందస్తు ఉంటుందా, ఉండదా అన్న విషయంపై ఇసుమంతైనా ఆసక్తి చూపడంలేదు.  ఎన్నికలు ఎప్పడు వచ్చినా ‘ఒక్క ఛాన్స్’ మోసానికి గట్టిగానే బదులు తీర్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు.   ఇక ప్రజల నిర్ణయం, విపక్షాల వ్యూహాలు, ఉద్దేశాలతో పని లేకుండా జగన్ ముందస్తే మార్గమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఏపీలో ముందస్తు ముహూర్తంపై చర్చోపచర్చలు జోరందుకున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో కూడా అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న  అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్త మౌతోంది. జగన్ కూడా అదే సమయానికి ఎన్నికలకు వెళితే బెటర్ అని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎంత ఆలస్యం చేస్తే అంతగా వైసీపీ నష్టపోతుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగకుండా, వీలైతే అంత కంటే ముందుగా ఎన్నికలు జరిపిస్తే వైనాట్ 175 కాకపోయినా.. కొద్దో గోప్పో స్థానాలను గెలుచుకుని పరువు కాపాడుకునే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒక సారి ప్రజలలో వ్యతిరేకత ఉందన్న విషయం బయటపడిన తరువాత ఎన్నికలు ఎంత ఆలస్యమైతే విపక్షం అంత బలపడుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇక చేతులు పూర్తిగా కాలిపోయాయి. ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు అన్న భావన పార్టీ నాయకులలోనే వ్యక్తమౌతోంది. అందుకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్భయంగా నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. సాంకేతికంగా అసెంబ్లీలో తెలుగుదేశంకు ఉన్న బలం మేరకే ఓట్లు పడినప్పటికీ.. వాస్తవ బలం కంటే నాలుగు ఓట్లు ఆ పార్టీకి ఎక్కువ పడిన సంగతి సుస్పష్టమే. సొంత పార్టీ ఎమ్మెల్యేలే, ఇంకా ఏడాదికి పైగా ప్రభుత్వానికి గడువు ఉందని తెలిసీ క్రాస్ ఓటింగ్ చేశారంటే.. వారిలో జగన్ సర్కార్ పట్ల ఎంత అసంతృప్తి గూడు కట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి జగన్ సర్కార్ పై, జగన్ తీరుపై అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 16 అని అధికార పార్టీ అగ్రనాయకత్వమే నిర్థారణకు వచ్చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ విషయాన్ని నిఘా పెట్టడం ద్వారా వైసీపీయే తేటతెల్లం చేసింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురిపై సస్పెన్షన్ వేటు కూడా వేసేసింది. ఈ చర్యతో మిగిలిన అంసతృప్తులకు హెచ్చరిక పంపామని వైసీపీ భావిస్తున్నా.. అనర్హత వేటు పడిన తరువాత మేకపాటి మీడియాతో మాట్లాడిన మాటలు ‘ఎంతో రిలీఫ్’ ఫీలవుతున్నానంటూ చేసిన వ్యాఖ్యలూ ధిక్కారం ప్రదర్శించే విషయంలో ఆయనే కాదు, అసంతృప్తులెవరూ తగ్గేదే లే అన్న మూడ్ లోనే ఉన్నారని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే.. పరిస్థితి ప్రభుత్వానికి అగమ్య గోచరంగా ఉంది. ముందు ముందు తన ఫ్లాగ్ మార్క్ గా చెప్పుకుంటున్న బటన్ నొక్కుడు సంక్షేమం పందేరం చేయడం అసాధ్యంగా మారిపోతుంది. అందుకే పథకాల అమలు ఆగిపోకముందే ముందస్తుకు వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని అంటున్నారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీలు కూడా జరిగే విధంగా జగన్ వ్యూహరచనలో ఉన్నారని అంటున్నారు.  

జాతీయ రాజకీయాలలో మళ్లీ కేసీఆర్ క్రీయాశీలం?

రాహుల్ గాంధీపై అనర్హత వేటును కేసీఆర్ తన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఒక అవకాశంగా భావిస్తున్నారా అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటి వరకూ కాంగ్రెస్సేతర , బీజేపీయేతర కూటమి, ఫ్రంట్ అంటూ కాలికి బలపం కట్టుకు తిరిగినా జాతీయ స్థాయిలో కేసీఆర్ మార్క్ రాజకీయాలకు పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఆయనే సొంత కుంపటి పెట్టుకుని తన వంతు ప్రయత్నాలు తాను సాగిస్తున్నా.. ఆ ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరే రాష్ట్రంలోనూ చివరాఖరికి తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటైన దాఖలాలు లేవు. ఈ లోగానే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు, విచారణలు, టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థి, నిరుద్యోగులలో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం నిరసనల రూపంలో వ్యక్తం అవుతుండటంతో ఆయన జాతీయ అడుగులకు విరామం తప్పదా అన్న అనుమానాలు రేకెత్తాయి. అందుకు తగ్గట్టుగానే కవితను ఈడీ విచారణ నేపథ్యంలో ఆయన తెలంగాణ సెంటిమెంటును మళ్లీ తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు  కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషణలు సైతం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో క్రిమినల్ డిఫమేషన్ కేసులో రాహుల్ కు గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, దాంతో పార్లమెంటు ఆయనపై అనర్హత వేటు వేయడంతో కేసీఆర్ మరోసారి జాతీయ స్థాయిలో తన గళం బలంగా వినిపించేందుకు నడుం బిగించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు మద్దతుగా నిలవడానికి రెడీ అయిపోయారు. అంతే కాదు ఆ ఆందోళనలో క్రీయాశీలంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించారు. పలు ప్రాతీయ పార్టీల నాయకులతో ఇప్పటికే మంతనాలు ప్రారంభించారని కూడా చెబుతున్నారు. రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించేందుకు ఆయన స్వయంగా ఢిల్లీ వెళ్లాలని కూడా భావిస్తున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.  రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ గెజిట్ విడుదల చేసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశారు.  రాహుల్ సభ్యత్వం రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టనున్న దేశ వ్యాప్త ఆందోళనకు కేసీఆర్ మద్దతు ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ విషయంలో ఆయన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్,  జేడీయూ అధినేత నితీష్ కుమార్, తమిళనాడు సీఎంస్టాలిన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా   చెబుతున్నాయి.  

తెలంగాణలో తెలుగుదేశం సైలెంట్ వేవ్!

తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్  ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు వేటికవి వాటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. తెరాస పేరు మార్చి బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీగా మారిన తరువాత.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు.  ముఖ్యంగా గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే అధికార పార్టీగా యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటున్నది. రెండు ఉప ఎన్నికలలో విజయం సాధించి బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా దూకుడుగా సాగుతోంది. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అధికారమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలూ దూకుడుగా సాగుతుంటే..  చాపకింద నీరులా తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నామమాత్రంగా మారిపోయింది.    2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ తర్వాత   టీఆర్ఎస్( ఇప్పుడు బీఆర్ఎస్) పంచన చేరిపోయారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో  తెలుగుదేశం కు  ప్రాతినిథ్యం లేకుండా పోయింది.    అలాంటి వేళ.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.  తెరాస బీఆర్ఎస్ గా మారిన తరువాత ఆ పార్టీ బలహీనపడుతోందన్న అంచనాలున్నారు. ఈ నేపథ్యంలోనే  తెలుగుదేశం తెలంగాణలో తన సత్తా చాటేందుకు పావులు కదపుతోంది.  ఈ నేపథ్యంలోనే ఈ నెల  29న తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని హైదరాబాద్ లోని  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. 1982, మార్చి 29న హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీని విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. పార్టీని స్థాపించిన జస్ట్ 9 నెలలకే ఆయన అధికారం చేపట్టి తెలుగువాడిలోని వాడి వేడిని రుచి చూపించిన విషయం విదితమే.  అలా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా.. తనదైన శైలిలో పాలన సాగించడమే కాకుండా.. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను సైతం తీసుకు వచ్చారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలు.. చంద్రబాబు చేతిలోకి వెళ్లడం.. ఆ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు దీటుగా సైబరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సరే రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం తెలంగాణలో ప్రాభవం కోల్పోయింది. నాయకులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది తప్ప కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని పరిశీలకలు చెబుతూ వస్తున్నారు. ఇది వాస్తవమేనని   గతేడాది డిసెంబర్ మొదటి వారంలో ఖమ్మం వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో నిర్వహించిన శంఖారావ సభ.. సూపర్ డూపర్ సక్సెస్ నిరూపించింది. దీంతో తెలంగాణ ప్రజల గుండెల్లో తెలుగు దేశం పార్టీ చిరస్థాయిగా భద్రంగా ఉందని స్పష్టం కావడం అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడ ఉందంటూ ప్రశ్నించిన వారి నోళ్లు మూయించినట్లు అయింది.   మరోవైపు ఈ ఏడాది జరగనున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరగనుందంటూ .. ఓ చర్చ అయితే గట్టిగానే ఊపందుకొంది. కానీ చివరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రానున్నాయని సమాచారం.  ఇక టీఆర్ఎస్ పార్టీ కాస్తా ఇటీవల బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందింది. అలాగే కేంద్రంలోని బీజేపీ పాలనపై కూడా రాష్ట్రంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సరిగ్గా ఈ సమయంలో  ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ తీసుకు వచ్చిన పలు సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధి, శాంతి భద్రతలు, రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటు చేసుకోన్న అభివృద్ధి పరిణామాలను ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి టీడీపీ శ్రేణులు చాలా బలంగా తీసుకు వెళ్తున్నాయి. అలాగే   పార్టీ ఆవిర్భావ సభ ద్వారా.. ప్రజలను మరింత చైతన్యం చేయగలిగితే.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని ఘనంగా చాటడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏది ఏమైనా తెలంగాణలో తెలుగుదేశం సైలెంట్ వేవ్ ఉందన్న అభిప్రాయమే పొలిటికల్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోంది. 

ఒక్క ఫలితం.. అనేక పరాభవాలు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని ఖతం చేయాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. తీవ్ర పరాభవాన్ని మిగిల్చాయి. తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఆ పార్టీకే దక్కాని. కానీ టీడీపీకి దూరం జరిగి వైసీపీతో జట్టుకట్టిన నలుగురు ఎమ్మెల్యేల బలం చూసుకుని వైసీపీ తెలుగుదేశం పార్టీకి ఆ స్థానం దక్కకుండా చేయాలని చేసిన ప్రయత్నం వికటించింది. సొంత పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కనీసం ఊహామాత్రంగానైనా అనుకోలేదు. చివరికి వచ్చే సరికి సొంత పార్టీ వారే ఎదురు తిరుగుతారన్న అనుమానం ఆ పార్టీని వణికించింది. దీంతో క్యాంపు ఏర్పాటు చేసింది. అనుమానం ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించింది. బతిమలాడుకుంది. నిఘా పెట్టింది. ఎన్ని చేసినా చివరకు తమ పార్టీ ఎమ్మెల్యేల మీద తనకు ఏ మాత్రం నియంత్రణ లేదన్న విషయాన్ని జగన్ కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. అలా కాకుండా వైసీపీ టీడీపీకి ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఒక స్థానం ఆ పార్టీ గెలుచుకుంటుందని వదిలేసి ఉంటే కొద్దో గొప్పో గౌరవం అయినా నిలబడి ఉండేది.  అలా కాకుండా అహంకారానికి పోయి అప్రతిష్ఠ మూటగట్టుకోవడమే కాదు.. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడానికి భయపడే పరిస్థితుల్లో లేరని తనకు తాను చాటుకున్నట్లైంది. కుప్పం స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం తరువాత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ముఖం చూడాలని ఉందంటూ సీఎం జగన్ అహంకారంతో చేసిన వ్యాఖ్యల తరువాత తెలుగుదేశం నుంచి అటువంటి వ్యాఖ్యలే వస్తాయనడంలో సందేహం లేదు. ఇక విషయానికి వస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనూరాథ ఏ విధంగా చూసినా విజయం సాధించే అవకాశాలు లేవమాత్రంగా కూడా లేవన్నది అంకెలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు వైసీపీ శిబిరంలో ఉన్నారు. దీంతో తెలుగుదేశం బలం 19కి పడిపోయింది. ఎమ్మెల్సీ గెలవాలంటే కనీసం 22 మంది మద్దతు ఉండాలి. పోనీ వైసీపీలో ఇద్దరు పార్టీతో విభేదించి ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని ప్రకటించారు కనుక వారిరువురూ తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేసిన తెలుగుదేశంకు వచ్చే ఓట్లు 21 మాత్రమే. అంటే ఎలా చూసినా పంచుమర్తి అనూరాథ పరాజయం పాలవ్వక తప్పదు. ఇదీ వైసీపీ లెక్క. మరి తెలుగుదేశం ఎందుకు గెలచింది. పంచుమర్తి అనూరాధకు 23 ఓట్లు ఎలా వచ్చాయి? అధికార పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వైసీపీకి పరాభవమే ఎదురైంది. ఎన్నికలు జరిగిన మూడు స్థానాలలోనూ తెలుగుదేశం విజయఢంకా మోగించింది.  అందులోనూ వైసీపీకి పెట్టని కోటగా భావించే రాయలసీమలోనూ పరాజయ పరాభవమే జగన్ కు ఎదురైంది.   ఇక పులివెందుల విషయానికి వస్తే అక్కడ వైఎస్ ఫ్యామిలీ తప్ప,  ఎవరూ సాధించని అమోఘ ఫలితాన్ని టీడీపీ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి సాధించారు. ఆ దెబ్బకు వైసీపీ అధినేత దిమ్మతిరిగి ఉంటుంది. ఆ పరాభవం నుంచి తేరుకోకముందే..   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగిలింది. ఈ వరుస ఎదురుదెబ్బల వెనుక ఉన్న అసలు కారణమేమిటన్నది అందరికీ ఇప్పటికే అర్ధమైంది. ఇక అర్ధం కావాల్సిందల్లా అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే.  ఔను  గ్రాడ్యుయేట్ ఎన్నికలు గానీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు గానీ అన్నిటిలోనూ జయాపజయాలకు బాధ్యుడు ఒకే ఒక్కడు . ఆ ఒక్కడూ జగన్ రెడ్డే. ఆయన ఎవరి సలహాలు కానీ, సూచనలు కానీ పట్టించుకునే వ్యక్తి కాదు. ఆయన నిర్ణయమే ఫైనల్. ఆయన వద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా ఎవరికీ కనీస గౌరవం దక్కదు. మర్యాద ఉండదు. ఈ విషయాన్ని తనపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత ఎమ్మెల్యే మేకపాటి స్వయంగా చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా చిన్న విషయమనీ, తనకు అందిన సమాచారం మేరకు కనీసం 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారనీ, ఏ క్షణంలోనైనా వారు బయటపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.  ఇందుకు కారణం జగన్ ఎమ్మెల్యేలు, నాయకులతో పనిలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరే కారణమని వివరించారు. పీకే సర్వేలు, వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది,  తాను బటన్ నొక్కడంతో ఖాతాలలో సొమ్ములు పడుతున్న లబ్ధిదారులు చాలన్నది జగన్ భావనగా మేకపాటి అభివర్ణించారు.   జగన్ తీరు కారణంగానే తమతమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు పూచికపుల్ల గౌరవం కూడా దక్కడం లేదు. అధికారులు మాట వినడం లేదు.  ఈ కారణంగానే ఆత్మాభిమానం ఉన్న ఎమ్మెల్యేలెవరూ మరో సారి జగన్ వెంట నడవడానికి ఇష్టపడరన్నది మేకపాటి మాటల సారాంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు సైతం, సీఎంఓలో అధికారుల అపాయింట్‌మెంట్ల కోసం గంటలు ఎదురుచూడాల్సిందే. ఈ విషయాన్ని మేకపాటి తనకు ఎదురైన అనుభవాలను చెప్పడం ద్వారా తేటతెల్లం చేశారు. సీఎంను కలవడం కోసం తనలాంటి సీనియర్లు వెళ్లినా పలకరించే నాథుడు ఉండడని మేకపాటి చెప్పారు.  ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి వంటి సీనియర్లు దూరం కావడానికీ అదే కారణం.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం కంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవ భారం ప్రభావం పార్టీ భవిష్యత్ లోనూ వెంటాడుతూనే ఉంటుంది. ఇకపై జగన్ నిర్ణయాలను పార్టీ గతంలోలా తలూపేసి ఓకే చెప్పేసే పరిస్థితి ఉండదన్నది పరిశీలకుల విశ్లేషణ.     

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యింది. త్వరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఈ సారి కర్నాటకలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అందుకు అన్ని విధాలుగా సమాయత్తమౌతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రం అవ్వడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం (మార్చి 25) ప్రకటించింది. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ద్వారా తొలి జాబితాను విడుదల చేసింది.  మొత్తం 124 మందికి తొలి జాబితాలో టికెట్ కేటాయించింది.  ఆ జాబితా ప్రకారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు టికెట్ దక్కింది.  మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ మంత్రి మునియప్ప,  పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే తదితరులు తొలి జాబితాలో టికెట్ దక్కించుకున్నవారిలో ఉన్నారు.

అదానీ అంశం లేవనెత్తినందుకే.. ప్రియాంక

గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడమే బీజేపీ నేతల పనిగా కనిపిస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా వధేరా గాంధీ అన్నారు. రాహుల్ గాంధీపై పార్లమెంటు అనర్హత వేటు వేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అదాని అంశాన్ని లేవనెత్తినందుకే రాహుల్ గాంధీపై పరువునష్టం దావా కేసు తెరపైకి వచ్చిందని అన్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీపై పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టులో స్టే ఉందని ప్రియాంక అన్నారు. అదానీ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తినందుకే పరువునష్టం దావా తెరపైకి వచ్చి వేగంగా విచారణ పూర్తై తీర్పు కూడా వచ్చేసిందని ప్రియాంక ఆరోపించారు.  అధికార పార్టీ ఎన్ని వేధింపులకు గురిచేసినా తన సోదరుడు రాహుల్ అన్యాయానికి తలవంచడని ప్రియాంక తేల్చిచెప్పారు. అయనా గాంధీ కుటుంబాన్ని  విమర్శించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని,   అయినా కూడా ఏ జడ్జి కూడా వారికి రెండేళ్ల శిక్ష విధించరని, వారిపై అనర్హత వేటు పడదని ప్రియాంక అన్నారు.

జగన్ వైనాట్ 175 అని ఎలా అనగలుగుతున్నారు.. మేకపాటి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జగన్ పై నేరుగా విమర్శలు గుప్పించారు. అలాగే జగన్ కు ఉన్న అసంఖ్యాక సలహాదారులు చేస్తున్న పనేంటని నిలదీశారు. అసలు జగన్  వై నాట్ 175 అని  ఏ ధైర్యంతో అనగలుగుతున్నారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తనపై  సస్పెన్షన్ వేటు పడిన తరువాత ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. పార్టీ అధినాయకత్వం వద్దకు తన వంటి సీనియర్లు వెళితే కూడా పలకరించే దిక్కు లేదన్నారు.  ఎమ్మెల్యేలకు సీఎం   గౌరవం ఇవ్వడంలేదన్నారు. సీఎంకు పెద్ద సంఖ్యలో ఉన్న సలహాదారులు చేసే పనేంటో కూడా ఎవరికీ తెలియదని మేకపాటి అన్నారు.   నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు అది వద్దని జగన్ తో చెప్పాను" అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. దాదాపు 50 మంది వరకూ ఎమ్మెల్యేలు పార్టీపైనా, పార్టీ అధినేతపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. 

ఆ నలుగురూ సస్పెండ్.. క్రాస్ ఓటింగ్ కు కోట్లు తీసుకున్నారు.. సజ్జల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ విషయంలో వైసీపీ అధినేత జగన్ సీరియస్ అయ్యారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని పేర్కొంటూ నలుగురు ఎమ్మెల్యేలను జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తొలి నుంచీ పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డిలతో పాటు.. ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని భావిస్తున్న ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం (మార్చి 24) ప్రకటించారు. అసెంబ్లీ మీడియా పాయంట్ వద్ద విలేకరులతో మాట్లాడిన సజ్జల పార్టీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేలూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని, ఇందుకు వీరు విపక్ష నేత చంద్రబాబు నుంచి కోట్లాది రూపాయలు అందుకున్నారని పేర్కొన్నారు.  

ప్రధానిగా రాహుల్ లోక్ సభలో అడుగుపెడతారు.. రేవంత్

 అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న విపక్షాల డిమాండ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రాహుల్ పై అనర్హత వేటు వేశారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో రాజ్యసభ వేదికగా ప్రధాని మోడీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని ఉద్దేశించి శూర్పణఖ అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. వారు గాంధీ కుటుంబాన్ని బెదరించాలని చూస్తున్నారనీ, ప్రజాస్వామ్య వాదులంతా రాహుల్ గాంధీతోనే ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు.  గతంలో జనతా పార్టీ ప్రభుత్వం  ఇందిరాగాంధీపై జనతా పార్టీ ప్రభుత్వం ఇందిరా గాంధీ పై ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చి లోక్ సభలో అడుగుపెట్టకుండా బహిష్కరించిందనీ, అయితే ఆమె 1980లో భారత ప్రధానిగా పార్లమెంటులో అడుగుపెట్టారనీ రేవంత్ గుర్తు చేశారు. రాహుల్ కూడా 2024లో భారత ప్రధానిగా సభలో అడుగుపెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.  

అప్రజాస్వామికం.. రాహుల్ పై అనర్హత వేటుపై కేసీఆర్ స్పందన

రాహుల్ గాంధీపై అనర్హత వేటును విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. అదానీ అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేంద్రంలోని మోడీ సర్కార్ లోక్ సభ సెక్రటేరియెట్ పై ఒత్తిడి తెచ్చి రాహుల్ పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడని చెప్పించిందని విమర్శిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాహుల్ పై అనర్హత వేటును ఖండించారు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి తప్పుడు అన్వయమేనని అన్నారు. రాహుల్ పై అనర్హత వేటు విషయంలో మోడీ సర్కార్ చూపిన వేగం చూస్తుంటే రాహుల్ పై అప్రజాస్వామికంగా అనర్హత వేటు వేశారన్న సంగతి తేటతెల్లమౌతోందని కేసీఆర్ పేర్కొన్నారు. మోడీ సర్కార్ ఇప్పుడు క్రిమినల్ డిఫమేషన్ ను విపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి ఉపయోగించుకుంటోందని విమర్శించారు. కేంద్రం ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐలను ఎలా అయితే దుర్వినియోగం చేసిందో అలా క్రిమినల్ డిఫమేషన్ ను విపక్ష నేతలపై అనర్హత వేటు వేయడానికి ఉపయోగించుకుంటోందని, ఇది చాలా దారుణమని కేసీఆర్ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా కేసీఆర్ అభివర్ణించారు. మోడీ  దురహంకారానికి, నియంతృత్వానికీ ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయి ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం మోడీ సర్కార్ తన ప్రత్యర్థులను వేధించే హేయమైన చర్యలకు వినియోగించుకోవడం దారుణమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్య వాదులంతా కలిసి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను సమష్టిగా ప్రతిఘటించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

క్షమాపణ చెప్పడానికి సావర్కార్ ను కాదు.. రాహుల్ ని

అనర్హత వేటు అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. మోడీని విమర్శించినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తే మళ్లీ మళ్లీ విమర్శిస్తానని అన్నారు. భయపడి క్షమాపణలు చెప్పి పారిపోయేందుకు తాను సావర్కార్ ను కాదని అన్నారు. తాను రాహుల్ గాంధీనని చెప్పిన ఆయన తనలో ప్రవహించేది దేశంలోని సర్వజనుల స్వాతంత్ర్యం కోసం క్షమాపణ చెప్పకుండా జైలుకు వెళ్లిన వారి కర్తమని అన్నారు. తలవంచను, తగ్గను సకల జనుల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం తగ్గేదేలేదని రాహుల్ అన్నారు.   కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు,   వయనాడ్ లోక్‌సభ సభ్యుడు రాహుల్‌గాంధీని  లోక్‌సభ సెక్రటేరియట్ డిస్‌క్వాలిఫై చేసిన సంగతి విదితమే,    ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన నేపథ్యంలో రాహుల్ పై అనర్హత వేటు పడింది.   ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడంటూ లోక్ సభ సెక్రటేరియెట్  ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అనర్హత వేటుకు, జైలుకు వెళ్లడానికి భయపడే ప్రశక్తే లేదని పేర్కొన్నారు. 

గ్రామ, వార్డు సచివాలయాల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఏపీ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల బిల్లు–2023కు  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సభలో బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి సురేశ్‌ తెలిపారు. సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు గ్రామ, వార్డు స్థాయిల్లోనే  ప్రజలకు అందుతున్నాయన్నారు. ఇక సచివాలయాల బిల్లుతో పాటు మరో ఆరు బిల్లులను కూడా అసెంబ్లీ ఆమోదించింది.  

సిట్ విచారణకు బండి డుమ్మా!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లేకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసుకు అనుగుణంగా బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం విచారణకు డుమ్మా కొట్టారు.  పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కీలకమైన బిల్లులపై చర్చ జరుగుతున్నందున సభ్యులంతా హాజరుకావాల్సిందిగా పార్టీ అగ్రనాయకత్వం విప్ జారీ చేయడంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కార్యాలయం, పేషీపైన బండి సంజయ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘సిట్’పై నమ్మకం లేదని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గతంలో డిమాండ్ చేశారు. ఇదే వ్యవహారంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీచేయగా ఆయన  గురువారం విచారణకు హాజరయ్యారు. అయితే బండి సంజయ్  మాత్రం విచారణకు డుమ్మా కొట్టారు. . సిట్ దర్యాప్తు ఎక్కడివరకు వచ్చిందో లేటెస్ట్ స్టేటస్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా సిట్ చీఫ్‌కు గవర్నర్ లేఖ రాశారు.

పొంగులేటి వర్గానికి తెలంగాణ సర్కార్ షాక్.. ముగ్గురు నేతలకు భద్రత కుదింపు

 పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.  ఇప్పటికే మాజీ ఎంపీకి గన్ మెన్లను తగ్గించిన కేసీఆర్ సర్కార్ తజాగా ఆయన వర్గానికి చెందిన  మరో ముగ్గురు నేతలకు భద్రత కుదించింది. జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య కు గన్ మెన్ల సంఖ్యను . 2 ప్లస్ 2 నుంచి 1ప్లస్ 1కు కుదించింది. దీంతో ఆయన  తనకు గన్ మన్  అవసరం లేదని ఉన్నవారిని  వెనక్కి పంపారు. అదే విధంగా పినపాక మాజీ ఎమ్మెల్యే   పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం బీఆర్ఎస్ ఇన్ ఛార్జి వెంకట్రావుకు కూడా  గన్ మన్ లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   దీనిపై  పాయం తనకు కేటాయించిన గన్ మెన్స్ ను తొలగించడం ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. సెక్యూరిటీ తీసేసినంత మాత్రాన పోయేది ఏమీ లేదన్నారు. ఇక వెంకట్రావు స్పందిస్తూ సర్కారు నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా తన ప్రయాణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోనే అని స్పష్టం చేశారు. సెక్యూరిటీ తొలగింపు నిస్సందేహంగా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని విమర్శించారు.  

పట్టుదల, అంకిత భావం పంచుమర్తి విజయ రహస్యం

పార్టీ పట్ల అంకిత భావం, పని పట్ల శ్రద్ధ, సాధించాలన్న పట్టుదల ఇవే పంచుమర్తి అనూరాథ ప్రత్యేకతలు. కష్టంలోనూ కర్తవ్యాన్ని విస్మరించకపోవడం, పదవుల కన్నా ప్రజాసేవే మిన్న అన్న భావం ఆమెను ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయతీరాలకు చేర్చాయి. రాజకీయ ప్రవేశంతోనే ఆమె  విజయవాడ నగర మేయర్ గా ఎన్నికయ్యారు. తాజాగా ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పంచుమర్తి అనురాధ సరిగ్గా 23 ఏళ్ల కిందట రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? అతి చిన్న వయసులోనే మేయర్‌గా  ఎన్నికయారు?  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన  అనంతరం   పంచుమర్తి విజయం విజయం తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. రెట్టింపు ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రయాణమూ సంచలనమే . ఆమె కుటుంబానికి  రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు.  తండ్రి స్వర్గం పుల్లారావు ఐఆర్‌ఎస్‌. ఆదాయపన్నుశాఖలో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేశారు. తల్లి గృహిణి. అనురాధకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు.  ప్రాథమిక విద్య హైదరాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌లో చదివిన పంచుమర్తి అనూరాథ హైస్కూల్‌, ఇంటర్‌ విద్యను విజయవాడలోనూ,  పూర్తి   బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ను గుంటూరు జేకేసీ కళాశాలలో పూర్తి చేశారు.  ఆ తర్వాత  ఆమె   నాగార్జున యూనివర్సిటీ నుంచి నుంచి జర్నలిజంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌  చేశారు. అటు పుట్టింటి వారు, ఇటు అత్తింటి వారు ఎవరికీ రాజకీయాలతో సంబంధంలేకపోయినా ఆమె అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చారు.  2000 సంవత్సరంలో 26 ఏళ్ల పిన్న వయస్సులో విజయవాడ మేయర్‌ పదవిని దక్కించుకున్నారు. విజయవాడ మేయర్ పోస్టును మహిళలకు రిజర్వ్ చేసిన విషయాన్ని వార్తా పత్రికలో చదికి ఆసక్తితో  తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపారు. అప్పట్లో   మేయర్‌ పదవికి డైరెక్ట్ ఎలక్షన్ జరిగేది.   తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా మేయర్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. టెక్నాలజీ అంటే స్వతహాగా ఆసక్తి ఉన్న చంద్రబాబుకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు, పంచుకున్న అభిప్రాయాలు నచ్చాయి. అంతేకాదు, విద్యారంగపైన   అనురాధకు చక్కటి అవగాహన ఉందని గ్రహించిన చంద్రబాబు ఆమెనే ఎంపిక చేశారు. అప్పుడు జరిగిన మేయర్ ఎన్నికలలో   కాంగ్రెస్‌ నుంచి నాగరాణి, కమ్యూనిస్ట్‌ పార్టీల అభ్యర్థి తాడి శకుంతల ను ఓడించి 6800 కు పైగా ఓట్ల మెజారిటీతో  అనురాధ విజయం సాధించారు. డైరెక్ట్ ఎన్నికలలో మేయర్ గా ఎన్నికైన అనురాధ తొలి నాళ్లలో రాజకీయ అనుభవం లేక ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అనతి కాలంలోనే అన్ని విషయాలలోనూ నైపుణ్యం సంపాధించారు.  మేయర్‌ పదవీ కాలం పూర్తయిన తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని ఆమె భావించలేదు. కానీ  2007 నుంచి మళ్లీ తెలుగుదేశంలో క్రియాశీలంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఆక్రమంలో  2009లో మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా ఆ సీటు  బీజేపీకి  తెలుగుదేశం కేటాయించింది.   దీంతో పోటీ చేయడం కుదరలేదు. అయితే పార్టీలో పలు పదవులు నిర్వహించారు.  అధికార ప్రతినిధిగానూ వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి అవకాశం దక్కించుకోవడమే కాకుండా ఘన విజయం సాధించారు.

రాహుల్ పై అనర్హత వేటు పడింది!

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యుడైన రాహుల్‌గాంధీని డిస్‌క్వాలిఫై చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకున్నది. ఈ అనర్హత గురువారం  (మార్చి 23, 2023) నుంచి అమల్లోకి వస్తుందని లోక్ సభ సెక్రటరీ జనరల్   శుక్రవారం (మార్చి 24) ఒక నోటిఫికేషన్‌లో తెలిపారు.   ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన నేపథ్యంలో రాహుల్ పై అనర్హత వేటు పడింది.  ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడంటూ లోక్ సభ సెక్రటేరియెట్  ప్రకటించింది. దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని  2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై  గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే  దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో రాహుల్‌కు రెండేళ్లు జైలుశిక్షతో పాటు రూ.15 వేల అపరాధం కూడా విధించింది. అయితే, ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు.  పై కోర్టుకు వెళ్లడానికి కోర్టు 30 రోజుల బెయిలు ఇచ్చినా, ఆయన అనర్హుడే అవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.