శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

 

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి, నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారని తెలిపారు.

సీఎం చంద్రబాబు దిశానిర్దేశం మేరకు వైకుంఠ ఏకాదశిపై ప్రత్యేక బోర్డు సమావేశం నిర్వహించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సామాన్య భక్తులకు ఈ-డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించామన్నారు. భక్తులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించామన్నారు. దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ-డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి మూడు రోజులకు 1.89 లక్షల భక్తులను ఈ-డిన్ ద్వారా ఎంపిక చేసి టోకెన్లు కేటాయించామని తెలిపారు.

టోకెన్ పొందిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శనానికి రావాలి

ఈ మూడు రోజులకు టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత తేది, సమయాన్ని కేటాయించడం జరిగిందని, ఆ సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే దర్శనభాగ్యం కలుగుతుందని అన్నారు.టోకెన్ పొందలేని భక్తులకు చివరి ఏడు రోజుల్లో సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఈ-డిప్ ద్వారా టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదటి మూడు రోజులు మాత్రమే ఈ-డిప్ విధానంలో టోకెన్లు కేటాయించామని, చివరి ఏడు రోజులు భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనార్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టడీ సర్కిల్  వద్ద బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్వయంగా  పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించిన సీపీ సజ్జనార్ సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూనే.. పలు సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారుల తో నేరుగా మాట్లాడిన ఆయన, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ప్రభావం గురించి స్పష్టంగా వివరించారు. చదువుకున్న వారు కూడా బాధ్యత లేకుండా ఇలా వ్యవహ రించడం దురదృష్టకరమన్నారు. న్యూ ఇయర్ మరియు క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేపథ్యం లో గత వారం రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా  ప్రత్యేక నిఘా, తనిఖీలు ముమ్మరం గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 31 రాత్రి వరకు హైదరాబాద్ నగరమంతటా  స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్  కొనసాగుతుందని  సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఇందు కోసం అదనంగా  ఏడు ప్లాటూన్ల బలగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పబ్‌లకు వెళ్లే వారు తప్పనిసరిగా డ్రైవర్ల ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్నారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని సిపి తెలిపారు. 

అత్యవసర పరిస్థితుల్లోనూ వేగంగా స్పందించరా?.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఫైర్

దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ లో వాయుకాలుష్యం తీవ్రత ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయే.. హస్తినలో మూడు రోజులుంటే చాలు అలర్జీలు, గొంతు నొప్పి ఖాయమని చెప్పారంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్ధమౌతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లోనూ ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఢిల్లీ ప్రభుత్వం నడుంబిగించింది. అయితే ఎయిర్ ప్యూరిఫయర్లపై 18శాతం జీఎస్టీ ఆర్థిక భారంగా పరిణమించింది. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టులో ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ సమంజసం కాదని పేర్కొంటూ, దానిని ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించాలంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కపిల్ మదన్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ ను బుధవారం (డిసెంబర్ 24)విచారించిన ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు కాలుష్యం కారణంగా జనం నానా ఇబ్బందులూ పడుతుంటే, అనారోగ్యానికి గురై మరణిస్తుంటూ.. ఎయిర్ ప్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నది. కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎటూ అందించలేరు.. కనీసం కనీసం ఎయిర్ ఫ్యూరిఫయర్లపై జీఎస్టీని కూడా తగ్గించలేరా? అంటూ నిలదీసింది. జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తోంది? వేగంగా నిర్ణయాలు తీసుకోవడం చేతకాదా అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై  స్పందించేందుకు పక్షం రోజులు గడువు అడిగిన ప్రభుత్వ న్యాయవాదిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రతను గుర్తు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.  వీలైనంత త్వరగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించాలని ఆదేశిస్తూ కేసు విచారణను శుక్రవారానికి (డిసెంబర్ 26)కు వాయిదా వేసింది.  

బాంబు బెదరింపు.. శంషాబాద్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

బాంబు బెదరింపుతో ఓ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. సౌదీ అరేబియా విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినట్టుగా శంషాబాద్ విమానాశ్రయానికి గురువారం (డిసెంబర్ 25) ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.   ఆ తరువాత విమానంలోని ప్రయాణీకులను దించివేసి బాంబ్ స్క్వాడ్ తో విమానంలో తనిఖీలు చేపట్టారు.  ఇటీవలి కాలంలో విమానాలలో బాంబులు పెట్టామంటూ బెదరింపు ఈ మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ తరహా బెదరింపులు ఇటీవలి కాలంలో దాదాపు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటుంన్నారు. తాజాగా మరోమారి బాంబు బెదరింపు మెయిల్ రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 

చంద్రబాబు, పవన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు   క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్  అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని  కోరుకుంటున్నానంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా  క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన మార్గంలో  నడవాలని పిలుపునిచ్చారు. నేటి సమాజానికి  ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు  అత్యంత అవసరమని పేర్కొన్న చంద్రబాబు.. క్రీస్తు అదే మార్గంలో నడవాలని ఉద్బోధించారని పేర్కొన్నారు.   జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ క్రైస్తవుల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ లో ప్రభువైన ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినం సందర్భంగా ఆయన చూపిన ప్రేమ‌, శాంతి, స‌హ‌నం పాటిద్దామని పేర్కొన్నారు.  అంద‌రూ ఆనంద‌మ‌యంగా క్రిస్మస్ పండుగ జ‌రుపుకోవాల‌ని  నారా లోకేశ్ పేర్కొన్నారు. 

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది సజీవదహనం

కర్నాటక రాష్ట్రంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది సజీవదహనమయ్యారు. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి గోకర్ణకు వెడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం బెంగళూరులోని గాంధీనగర్ నుంచి 30 మంది ప్రయాణీకులతో గోకర్ణకు బయలు దేరిన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో  48వ నంబర్ జాతీయ రహదారిపై హిరియూర్ సమీపంలో అదుపుతప్పి కంటైనర్ ను ఢీ కొంది.  వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి.  ఈ ఘటనలో 18 మంది  సజీవదహనం అయ్యారు. మిగిలిన వారు  తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అందరూ గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఓ 12 మంది మాత్రం కిటీకీ అద్దాలు పగుల గొట్టుకుని బయటపడగలిగారు. అయితే వారికి  సైతం తీవ్రమైన కాలిన గాయాలయ్యాయని చెబుతున్నారు. బయటపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తం అవుతున్నది.  ప్రమాద సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గ జిల్లా పోలీసులు, అగ్నిమాపక దళం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించారు.  

నకిలీ ఈచలాన్ లింకులతో సైబర్ మోసాలు!

నకిలీ ఈ-చలాన్  చెల్లింపు లింకుల ద్వారా జరుగు తున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి అంటూ  సైబర్ నేరగాళ్లు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ సందేశాల ద్వారా నకిలీ లింకులు పంపిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని హెచ్చరించారు. ఈ నకిలీ లింకులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉండే విధంగా  ఉండటంతో.. చాలామంది అవి నిజమైనవని నమ్మి క్లిక్  చేసి మోసపోతున్నారని పేర్కొన్నారు. ఆ  నకిలీ లింక్ పై  క్లిక్ చేసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలని, ఆ తరువాత  చెల్లించాల్సిన మొత్తం చూపించి వెంటనే చెల్లింపు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. చెల్లింపు చేసిన వెంటనే బాధితుల మొబైల్ ఫోన్లలో మాల్వేర్ ఇన్‌స్టాల్ కావడం, బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ కావడం జరుగుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. తెలిపారు. దీని వల్ల బాధితుల ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు జరిగి భారీగా డబ్బు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.  ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చేయాలని, ఎస్ఎమ్ఎస్ లు, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై ఎట్టి పరిస్థితు ల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింకులు పంపవని స్పష్టం చేశారు. ఇలాంటి సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే తమ మొబైల్ డేటా లేదా వై-ఫైని నిలిపివేయాలని, బ్యాంకును సంప్రదించి కార్డులు లేదా లావాదేవీలను బ్లాక్ చేయించుకోవాలని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడంతో పాటు, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.  

మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్

పేరు మోసిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో పోలీస్ కస్టడీ నుండి తప్పిం చుకొని పరారైన ఈ నింది తుడు ప్రస్తుతం తమిళ నాడులో వరస నేరాలకు పాల్పడుతున్నట్లు గా తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. గతంలో హైదరాబాదులోని ప్రిజం పబ్ లో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించిన బత్తుల ప్రభాకర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పిటి వారెంట్ మీద అతన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించి కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ నెలలో విజయ వాడ కోర్టులో హాజరు పరిచిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మార్గమ ధ్యంలో ఉన్న ఒక హోటల్ వద్ద ఆగారు.అదే సమయంలో బత్తుల ప్రభాకర్ మూత్ర విసర్జనకు అంటూ  పోలీసుల కస్టడీ నుండి తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుండి అతడి కోసం గాలింపు సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో  ఇటీవల బయటకు వచ్చిన ఒక వీడియో పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం తమిళనాడులో ఉంటూ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ లను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ట్లుగా ఆ వీడియో ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బత్తుల ప్రభాకర్ చోరీ కి పాల్పడినట్లు  పోలీసులు గుర్తించారు. ఆ కాలేజీ లాకర్ నుండి 60 లక్షల వరకు నగదు కొట్టేసినట్లుగా పోలీసులు గుర్తించారు.     ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి హైదరాబాదులోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనానికి వచ్చిన ప్రభాకర్ అక్కడ పోలీసుల నుండి తప్పించుకొని ప్రిజం పబ్బులోకి వెళ్లి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని తీసుకొని కోర్టులో హాజరు పరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో విజయ వాడ నుండి తప్పించుకొని పారిపోయాడు. అలా తప్పించుకొని పారిపోయిన బత్తుల ప్రభాకర్ చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఆ విధంగా చోరీల ద్వారా సంపా దించిన డబ్బుతో బత్తుల ప్రభాకర్ జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై కాలేజీ చోరీకి సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల చేతికి చిక్కడంతో బత్తుల ప్రభాకర్ జాడ కనుక్కున్నారు. ప్రస్తుతం అతడిపై మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పరారీలో ఉన్న బత్తుల ప్రభాకర్ తమిళనాడులో ప్రత్యక్షమై చోరీలకు పాల్పడుతూ ఉండడంతో అతన్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పరారీలో ఉన్న నేరస్తుల్ని అదుపులోకి తీసుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. నేర చరిత్ర కలిగిన బత్తుల ప్రభాకర్ పట్టుకోవడం పోలీసులకు ఒక సవాలుగా మారింది.

రికార్డుల మోత.. క్రికెట్ చరిత్ర తిరగరాస్తున్న వైభవ్ సూర్యవంశీ

చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశి రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో ప్రొఫెషనల్ క్రికెట్ లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా, బ్యాటుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ.  క్రీజులోకి దిగాడంటే సెంచరీ బాదాల్సిందే అన్నట్లు విరుచుకుపడుతున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ కేవలం  84 బంతుల్లో190 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో రెండు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్‌ చరిత్ర సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే తొలి లిస్ట్-ఏ సెంచరీ పూర్తి చేశాడు. ప్రొఫెషనల్ వన్డే టోర్నీలోనూ 14 ఏళ్ల వయసులో శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భారతీయులలో వేగవంతమైన లిస్ట్-ఏ శతకాల జాబితాలో వైభవ్ సూర్యవంశీ  రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది అన్మోల్‌ప్రీత్ సింగ్ 35 బంతుల్లో సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. శతకం తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చిన వైభవ్‌ కేవలం 54 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను దాటాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏబీ డివిలియర్స్‌ (64 బంతులు) పేరిట ఉండేది. డబుల్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా సాగిన వైభవ్‌.. 190 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయినా అతడి ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. 16 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో  226.19 స్ట్రైక్‌రేట్‌తో ఆడి అరుణాచల్ బౌలర్లను వణికించాడు. వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పటికే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా, రాజస్థాన్ రాయల్స్ తరఫున సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్  ఏ  జట్టు తరఫున 32 బంతుల్లోనే శతకం బాదాడు. విజయ్ హజారే ట్రోఫీ కొనసాగుతున్న కొద్దీ, ఇప్పుడు అందరి చూపు  వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. 14 ఏళ్ల వయసులోనే రికార్డులు బద్దలు కొడుతూ, యువ క్రికెటర్  నిర్వచనాన్నే మార్చేస్తున్నాడు. అతడి ప్రయాణం ఇప్పుడే మొదలైంది… మున్నందు ఆ యువకెరటం దాటాల్సిన  మైలురాళ్లు ఇంకా ఎన్ని ఎదురుచూస్తున్నాయో?

ఫ్రం 24 టు నంబర్ వన్.. ఏపీ పంచాయతీరాజ్ పై పవన్ ముద్ర

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ శాఖపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన ముద్ర వేయడంతో అనతి కాలంలోనే ఏపీ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా  తనదైన ముద్ర వేయడం వల్లనే ఇది సాధ్యమైందని పరిశీలకులు అంటున్నారు.   ఆంధ్రప్రదేశ్  ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తు న్నారు. ముఖ్యంగా  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన కృషి ఫలితంగా ఆ శాఖలు జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించాయి. గతంలో ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాభివృద్ధి విషయంలో దేశంలో  24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, పవన్ కల్యాణ్ ఆ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. జాతీయ పంచాయతీ అవార్డులలో ఏపీకి నాలుగు అవార్డులు లభించాయి. మొత్తంగా పంచాయతీరాజ్ శాఖ పనితీరు విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ గా నిలిచింది.  

నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు.. చంద్రబాబు

రైతులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా, నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ, పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై సీఎం చంద్రబాబు సచివాలయంలో   సమీక్ష నిర్వహించారు.  రైతులకు లబ్ధి చేకూరేలా  రబీ, ఖరీఫ్ పంటలకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందించాలన్నారు. పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ ప్రక్రియలు సక్రమంగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.   రబీ- ఖరీఫ్- రబీ సీజన్లలో ఏయే పంటలు వేయాలి, రైతులకు ఏది ప్రయోజనం అన్న విషయాలపై వారిలో అవగాహన కల్పించాలన్నారు. పంట ఉత్పత్తుల నాణ్యతనుపెంపుతో పాటు, కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సంద ర్భంగా అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్ప త్తులను తరలించేందుకు వాటి ప్రాసెసింగ్‌పై దృష్టి సారించడంతో పాటు,  దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేందుకు వీలుగా రైల్ కార్గో వంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురవుతున్న బ్యాంకు గ్యారెంటీ సమస్యలను పరిష్కరించి, రైతులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని అక్కడికక్కడే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కన్వీనర్‌తో  మాట్లాడి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.   స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.