న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనల ఉల్లంఘనను ఉపేక్షించం.. సజ్జనార్ హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడడానికి హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు, ప్రజలు హద్దులు దాటినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. “నిబంధనలు ఉల్లంఘిస్తే న్యూఇయర్ జోష్ లేకుండా పోతుందని హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్.. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో నిర్వహించే పార్టీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన భద్రతా ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఈవెంట్ జరిగే ప్రాంతంలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అలాగే పార్టీల నిర్వహణకు ఆన్ లైన్ లో పోలీస్ అనుమతిని తప్పనిసరి అని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకల్లో సౌండ్ సిస్టమ్‌లు, లౌడ్ స్పీకర్లు రాత్రి 10 గంటలకే పూర్తిగా నిలిపివేయాలన్నారు. బ్ద కాలుష్యంపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం 15 షీ టీమ్స్ బృందాలను మఫ్టీలో రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు.
ఈ నెల 31 అర్ధరాత్రి నగరమంతటా డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లుతెలిపిన సజ్జనార్ రాత్రి 9 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. డిసెంబర్ 31 వ తేదీ రాత్రి సమయంలో నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామనీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం ప్రత్యేకంగా ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పట్టుబ డితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు పదివేల రూపాయలు జరిమానా విధిస్తామన్నారు. అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్సుల శాశ్వతం గా రద్దు చేయాలని సంబం ధిత అధికారులకు సిఫారసు చేస్తామని పేర్కొన్నారు.
ఇక హోటళ్లలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు దొరికితే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామనీ, అలాగే అశ్లీల నృత్యాలకు అనుమతి ఇచ్చే పబ్బులు, హోటల్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామనీ, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన పబ్బులు, హోటళ్ల లైసెన్సులను రద్దు చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు.