నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు.. చంద్రబాబు
posted on Dec 24, 2025 @ 11:05AM
రైతులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా, నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ, పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతులకు లబ్ధి చేకూరేలా రబీ, ఖరీఫ్ పంటలకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందించాలన్నారు. పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ ప్రక్రియలు సక్రమంగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. రబీ- ఖరీఫ్- రబీ సీజన్లలో ఏయే పంటలు వేయాలి, రైతులకు ఏది ప్రయోజనం అన్న విషయాలపై వారిలో అవగాహన కల్పించాలన్నారు. పంట ఉత్పత్తుల నాణ్యతనుపెంపుతో పాటు, కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సంద ర్భంగా అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్ప త్తులను తరలించేందుకు వాటి ప్రాసెసింగ్‌పై దృష్టి సారించడంతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేందుకు వీలుగా రైల్ కార్గో వంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురవుతున్న బ్యాంకు గ్యారెంటీ సమస్యలను పరిష్కరించి, రైతులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని అక్కడికక్కడే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కన్వీనర్‌తో మాట్లాడి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.