SC classification

ఏపీలో ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ

  ఎస్సీ వర్గీకరణ-2025 సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ వర్గీకరణ ప్రకారం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లోని 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్-2లోని 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్-3లోని 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది ఎస్సీ వర్గీకరణ ప్రకారం కూలలు రాష్ట్రంలోని 59 షెడ్యూల్డ్ కులాలను జనాభా,వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఈ మూడు కేటగిరీలకు రిజర్వేషన్ల శాతం క్రింది విధంగా నిర్ణయించబడింది: గ్రూప్-I (12 కులాలు): 1% రిజర్వేషన్  బవురి, చచాటి, చండాల, దండాసి, డొమ్, ఘాసి, గొడగలి, మెహతర్, పాకి, పామిడి, రెల్లి, సాప్రు గ్రూప్-II (18 కులాలు): 6.5% రిజర్వేషన్  అరుంధతీయ, బిందల, చమార్, చంభార్, దక్కల్, ధోర్, గొదారి, గోసంగి, జగ్గాలి, జంబువులు, కొలుపులవండ్లు, మాదిగ, మాదిగ దాసు, మాంగ్, మాంగ్ గరోడి, మాతంగి, సమగార, సింధోలు గ్రూప్-III (29 కులాలు): 7.5% రిజర్వేషన్  ఆది ద్రావిడ, అనముక్, అరయ మాల, అర్వ మాల, బారికి, బ్యాగర, చలవాది, ఎల్లమలవార్, హోలేయ, హోలేయ దాసరి, మదాసి కురువ, మహర్, మాల, మాల దాసరి, మాల దాసు, మాల హన్నాయి, మాలజంగం, మాల మస్తి, మాల సాలె, మాల సన్యాసి, మన్నే, ముండల, సంబన్, యాతల, వల్లువన్, ఆది ఆంధ్ర, మస్తి, మిట్టా అయ్యలవార్, పంచమ

hyderabad business man match fixing in ipl

ఐపీఎల్ లో హైదరాబాద్ బడా బాబు ఫిక్సింగ్ తంత్రం

ఐపీఎల్‌ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా?  తెర వెనక ఐపీఎల్ జట్లను నయానా భయానా లొంగదీసుకోవటానికి హైదరాబాద్ కేంద్రంగా లాబీయింగ్ నడుస్తోందా?  హైదరాబాద్‎లోనే ఓ బడా వ్యాపారవేత్త ఈ ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడా?  అంటే అవుననే సమాధానం వస్తుంది.  ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్ని ఐపీఎల్ జట్ల ఆటగాళ్లకు బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చింది.  ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు..  ఏదో ఒక వివాదం లేకుండా సీజన్ పూర్తి కాదు. తాజాగా జరుగుతున్న సీజన్ అందుకు మినహాయింపు కాదు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఐపీఎల్ సీజన్‌లో వెలుగు చూస్తున్న వివాదాలు కొంత తగ్గాయన్న మాట వినిపిస్తోంది.  అందుకు చెక్ పడేలా.. తాజాగా బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగటం.. స్పష్టమైన హెచ్చరికను జారీ చేయటం సంచలనంగా మారింది. ఐపీఎల్ ఎడిషన్ 18 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు సగం మ్యాచులు ఆడేశాయి. మరో ఆఫ్ సీజన్ మిగిలి ఉంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫస్ట్ హాఫ్ సక్సెస్‎ఫుల్‎గా కంప్లీట్ అయ్యింది. ఓ వైపు పరుగుల వరద పారుతుండగా.. కొన్ని మ్యాచుల్లో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్‎లను కూడా టర్న్ చేశారు.  ఇలా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతోన్న ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్  చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి చట్టవ్యతిరేక పనులు చేసేలా వ్యక్తుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నట్లుగా బీసీసీఐ వెల్లడించింది. ఈ సందర్భంగా ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆ వ్యాపారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్రికెటర్లు.. కోచ్‌లు.. సహాయ సిబ్బంది.. వ్యాఖ్యాతలు.. ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అతనికి దూరంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు.. బీసీసీఐ హెచ్చరించడం సంచలనంగా మారింది. అయితే గతంలో క్రికెట్ బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్‎లు చేసిన అనుభవం ఆ వ్యాపారవేత్తకు ఉందని.. అతడికి పంటర్లు, బుకీలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని బీసీసీఐ పేర్కొంది. అతడు మళ్లీ యాక్టివ్ అయ్యాడని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు జట్టు యజమానులు, ఆటగాళ్లను కలిసేందుకు ట్రై చేస్తున్నాడని.. అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. డబ్బే కాకుండా విలువైన వస్తువులు, గిఫ్ట్‎లు ఎరగా వేస్తాడనీ, కుటుంబ సభ్యులకు కూడా విలువైన గిఫ్టులు పంపి  రొంపిలోకి లాగుతాడని హెచ్చరించింది. అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని సూచించింది. బుకీల వలలో చిక్కుకుని భవిష్యత్ పాడు చేసుకోవద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎవరీ హైదరాబాదీ వ్యాపారి? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. గతంలో ఎప్పుడూ ఈ విధంగా ఒక బిగ్ షాట్ ను ఉద్దేశించి ఈ తరహా వార్నింగ్ లు ఇచ్చింది లేదని చెబుతున్నారు. ఐపీఎల్ వ్యక్తులతో స్నేహం చేయటానికి.. సంబంధాలు పెంచుకోవటానికి సదరు వ్యాపారి ప్రయత్నిస్తున్నట్లుగా బీసీసీఐ పేర్కొంది. ఖరీదైన బహుమతులతో బుట్టలో వేసుకోవటం అనే వ్యూహాన్ని అమలు చేస్తున్న సదరు వ్యాపారి.. ఇప్పటికే పలువురికి ఖరీదైన బహుమతుల్ని ఇచ్చి కొందరితో పరిచయాలు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

KTR

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఖర్మ మాకు లేదు : కేటీఆర్‌

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూలగొట్టే కర్మ మాకు లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కంచ గచ్చిబౌలిభూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల కింద చెప్పాని మాజీ మంత్రి స్పష్టం చేశారు. హెచ్‌సీయూ భూముల్లో చేరువును కూడా సీఎం రేవంత్‌రెడ్డి తాకట్టు పెట్టాడు.. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప చెరువును ఎవడు తాకట్టు పెట్టడని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న ఆ కొంత మంది పోలీసులను ఎవరిని వదిలి ప్రసక్తే లేదు.. మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతామని ఆయన తెలిపారు.  రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న ఆ కొంత మంది పోలీసులను ఎవరిని వదిలి ప్రసక్తే లేదన్నారు. హెచ్‌సీయూ భూముల కోసం పోరాడిన విద్యార్థులు, సామాజికవేత్తలకు అభినందనలు. సెంట్రల్‌ ఎంపవర్డ్ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. కంచగచ్చిబౌలి భూమి వర్సిటీ ఆధీనంలో ఉన్నదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ చెప్పింది. ఆ భూములపై సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సూచించింది.వన్యప్రాణులు చనిపోయాయంటే ఏఐ వీడియోలంటూ కేసులు పెట్టారు. రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు, పోలీసుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ఆర్థిక దోపిడీ, పర్యావరణపై దాడి విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. చిత్తశుద్ధి ఉంటే రేవంత్‌ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలని కేటీఆర్ తెలిపారు.

andhrapradesh madyam scam scse sit notices mithunreddy

ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణం దర్యాప్తులో  స్పీడ్ పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తాజాగా ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.  సిట్ నోటీసుల మేరకు మిథున్ రెడ్డి  శుక్రవారం (ఏప్రిల్ 18) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సిట్ నోటీసులపై మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా ఇదే మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొంటూ మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు అప్పట్లో ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డిని ఆదేశించిన సుప్రీం కోర్టు ఆయనను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి సిట్ శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన గురువారం (ఏప్రిల్ 17) హైకోర్టును ఆశ్రయించారు.  సిట్ విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో కోరారు. అలాగే సిట్ విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆయన కోరారు. కాగా మిథున్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు ఈా రోజు విచారించనుంది.   ఇలా ఉండగా ఇదే కేసులో సిట్ నోటీసుల మేరకు ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. సిట్ నోటీసులపై స్పందించిన విజయసాయిరెడ్డి తాను రెండు రోజులు ముందుగానే విచారణకు హాజరౌతానని కోరడంతో సిట్ అనుమతించి గురువారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సిట్ విచారణకు విజయసాయి గైర్హాజరయ్యారు. అదే విధంగా ఇదే కేసులో ఇప్పటికే మూడు సార్లు నోటీసులు అందుకుని కూడా విచారణకు డుమ్మా కొట్టిన కసిరెడ్డి రాజశేఖరరెడ్డికి సిట్ నాలుగో సారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

modi ap tour confirmed

అమరావతికి మోడీ.. భారీ ప్యాకేజీపై రాష్ట్ర ప్రజల ఆశలు!

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. మోడీ పర్యటనకు, పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి  ఏర్పాట్లు శరవేగంగా జరుగు తున్నాయి. మే2వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పీఎం పర్యటనపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లపై అధికారలతో సమీక్ష నిర్వహించారు. మోడీ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో అన్నట్లుగా నిర్వహిం చాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మోడీ సభకు దాదాపు 5లక్షల మంది ప్రజల పాల్గొంటారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం వెనక 250 ఎకరాల విస్తీర్ణంలో మోడీ సభ జరగనుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం పడినా ఎటువంటి ఇబ్బందీ లేకుండా సభా స్థలంలో వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా ఓకే కానీ గతంలో అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేయడానికి వచ్చిన సందర్భంగా మోడీ పవిత్ర జలాలు, పుణ్య క్షేత్రాల నుంచి మట్టి తీసుకువచ్చారు. ఈ సారి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి రానున్న మోడీ ఏం తీసుకువస్తారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ప్రధాని హోదాలో అమరావతి నిర్మాణానికి నరేంద్రమోడీ 2017లో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి మోడీ ఆ సందర్బంగా భారీ వరాలను ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే పుణ్య స్థలాల నుంచి మట్టి, పుణ్య నదుల నుంచి జలం తీసుకువచ్చిన మోడీ ఏపీకి కానీ, ప్రపంచ స్థాయి రాజధాని కావాలని ఆయన నోటీతోనే చెప్పిన అమరావతికి కానీ ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదు. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.   దీంతో ఈ సారి మోడీ అమరావతికి ఏం చేస్తారు? ఏం ఇస్తారు? అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. అప్పట్లో అంటే 2017లో తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ మాత్రమే. అయితే తెలుగుదేశం మద్దతు లేకంటే కేంద్ర సర్కార్ కు అప్పట్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి అది కాదు. 2024 ఎన్నికల తరువాత కేంద్రంలో మోడీ సర్కార్ కు తెలుగుదేశం మద్దతు అత్యవసరంగా మారింది. తెలుగుదేవం మద్దతుతోనే మోడీ సర్కార్ మనుగడ సాగుతుందన్న పరిస్థితి ఉంది. దీంతో  కేంద్ర ప్రభుత్వం ఏపీకీ, అలాగే తెలుగుదేశం పార్టీకీ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు కూడా కేంద్ర కేబినెట్ బెర్తులు వంటి విషయాలలో పట్టుబట్టకుండా, ఏపీకి ఇతోధిక ఆర్థిక తోడ్పాటుపైనే పట్టుబడుతున్నారు. ఆ కారణంగానే  అమరావతికి కేంద్రం నుంచి అనూహ్య మద్దతు లభించింది. వరల్డ్ బ్యాంకు రుణంతో పాటుగా హడ్కో రుణాలకు కేంద్రం గ్యారెంటీ ఇచ్చి మరీ అమరావతికి అండగా నిలిచింది. అంతే కాకుం డా అడగకుండానే  అమరావతికి రైల్వే లైను, అవుటర్ రింగు రోడ్డు, ప్రధాన జాతీయ రహదారులను కలిపేలా కొత్త రహదారులు, ఇలా వరాలు ఇచ్చేసింది,  ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీ కచ్చితంగా రాజధాని అమరావతికి ఓ భారీ ప్యాకేజీ ప్రకటిస్తారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  సామాన్య జనం నుంచీ రాజకీయ పరిశీలకులు కూడా  అమరావతి పనులకు నిధుల కొరత మాట లేకుండా మోడీ భారీ వరాలను ఇచ్చే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు.  

police condemn bhumana house arrest propaganda

భూమన హౌస్ అరెస్ట్?.. ఖండించిన పోలీసులు

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలను ఖండించింది. అసత్య ప్రచారమని స్పష్టం చేస్తూనే, వాస్తవానికి కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు జరిగాయని ప్రత్యారోపణ చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం గోశాలను సందర్శించిన సీపీఐ జాతీయ కార్యదర్శి గోశాలలో గోవుల మృతి అన్నది నిరాధార ఆరోపణ అని చెప్పడమే కాకుండా, గోశాల నిర్వహణ భేషుగ్గా ఉందని కితాబు నిచ్చారు. ఇలా ఉండగా  తిరుమల తిరుపతి దేవస్థానం  గోశాలలో గోవుల మృతిపై చర్చకు గోశాలకు రావాలని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ సవాల్‌ విసిరింది. గోశాలకు వచ్చి గోమాతలను చూడాలని పేర్కొంది. కాగా  తెలుగుదేశం సవాల్ ను స్వీకరించిన భూమన గురువారం (ఏప్రిల్ 17) ఉదయం గోశాలకు వస్తానని ప్రకటించారు. భూమన గోశాల సందర్శనకు పోలీసులు కూడా అనుమతించారు. అంత వరకూ బానే ఉంది.. కానీ ఉదయం నుంచీ వైసీపీ భూమనను హౌస్ అరెస్టు చేశారంటూ గగ్గోలు పెట్టడం ప్రారంభించింది. భూమన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఒక్క భూమననే కాకుండా వైసీపీ నేతలు పలువురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారంటూ వైసీపీ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. భూమన  కరుణాకరరెడ్డి గోశాల సందర్శనకు ఎటువంటి అభ్యంతరం లేదనీ, ఆయనకు అనుమతి ఇచ్చామనీ స్పష్టం చేశారు. అయితే  వైసీపీ నేతలు, తెలుగుదేశం నేతలు ఒకే సారి గోశాల వద్దకు వెళ్లడానికి అనుమతించబోమన్నారు. అలాగే భూమన కూడా వ్యక్తిగత భద్రతా సిబ్బంతితో మాత్రమే గోశాలకు వెళ్లాలనీ వెంట పెద్ద సంఖ్యలో అనుచరులను అనుమతించబోమనీ పోలీసులు స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరిమిత సంఖ్యలో మాత్రమే గోశాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు.  

hyderabad metro rail charges hike

హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!?.. ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు బిగ్ షాక్. మెట్రో రైలు చార్జీలు దగ్గరదగ్గర 50 శాతం పెరగనున్నాయి. అతి త్వరలోనే మోట్రో రైలు చార్జీల పెంపు ఉంటుందని మెట్రో వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పెంపు పది రూపాయల నుంచి 60 రూపాయల వరకూ ఉంటుంని చెబుతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. భారీ నష్టాలలలో ఉన్న మెట్రో రైల్ ఆ నష్టాల నుంచి బయటపడేందుకు చార్జీల పెంపు ఒక్కటే మార్గమని భావిస్తోంది. ఇప్పటికే మెట్రో హాలీడే సేవర్ కార్డును మెట్రో రద్దు చేసింది. అలాగే ప్రయాణీకులకు పది శాతం రాయితీని కూడా రద్దీ సమయాల్లో ఎత్తివేసింది. వాస్తవానికి మెట్రో  ధరల సవరణకు ఎల్ అండ్ టీ సంస్థ 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది . అయితే అప్పటి కేసీఆర్ సర్కార్ అందుకు అంగీకరించలేదు.  అయితే ఏటా మెట్రో ఛార్జీల నష్టాలు పెరగడం,  బెంగళూరు మెట్రో ఛార్జీలు   44 శాతం పెంచిన నేపథ్యంలో  హైదరాబాద్ మెట్రో సైతం చార్జీలకు పెంపునకు సిద్ధమైంది.

bjp national president announcement in two

ఈ 20లోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోనున్నది. అదే విధంగా ఆరు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం కూడా నేడో రేపో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో బుధవారం (ఏప్రిల్ 16)న కీలక సమావేశం జరిగింది. సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుడి ఎంపిక, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ప్రకటనపై చర్చించారు. ఈ నెల 20వ తేదీలోగా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే ఆ లోపే ఆరు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుడిని కూడా ఎంపిక చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెబుతున్నారు.   వాస్తవానికి ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. నింబంధనలకు వ్యతిరేకంగా  ప్రస్తుతం   జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జోడు పదవులలో కొనసాగుతున్నారు. ఇది పార్టీ నిబంధనలకు వ్యతిరేకం. అయినా కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయం తేల్చలేక పార్టీ హైకమాండ్ ఆయననే కొనసాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం (ఏప్రిల్ 18) నుంచి మూడు రోజుల పాటు బెంగళూరులో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక, ప్రకటన ఉంటుందని అంటున్నారు. అందు కోసమే బుధవారం (ఏప్రిల్ 16)న అత్యవసరంగా ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి రేసులో నిర్మలా సీతారామన్ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సారి దక్షిణాది నుంచే పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.   

vijayasai tenssion in tdp

తెలుగుదేశంకి విజయసాయిరెడ్డి టెన్షన్.. బీజేపీ కోటాలో రాజ్యసభకు సాయిరెడ్డి?

వైసీపీకి రిజైన్ చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆ విరామానికి బ్రేక్ వేసి పొలిటికల్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారంట. విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకుని, ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ పదవిని ఆయనకే తిరిగి కట్టబెట్టాలని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయ్యారంటున్నారు.  ఆయన్ని తిరిగి రాజ్యసభకు పంపి వైసీపీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తెచ్చుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అందుకు టీడీపీ, జనసేనల నుంచి అభ్యంతరాలు వస్తుండటంతో వారిని ఒప్పించాలని కమలం పెద్దలు ఆలోచిస్తున్నారట.   వైసిపి ప్రారంభం నుండి పార్టీలో నెంబర్ టూ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా సీఎం తర్వాత సీఎం లాగా వ్యవహరించారు.  విశాఖ సహా ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలు మూట గట్టుకున్నారు.   ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ  విజయసాయిరెడ్డి గీసిన గీత దాటడానికి వీలు లేదని అప్పట్లో ఆర్డర్ కూడా పాస్ చేశారంట. ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఏ పని కావాలన్నా, సీఎం జగన్ ను ఎమ్మెల్యేలు కలవాలన్నా, నియోజవర్గ సమస్యలను జగన్ తో చెప్పాలన్నా కూడా  విజయసాయిరెడ్డి అనుమతి ఉండాల్సిందే అన్నట్లు నడిచింది వ్యవహారం.  ఓటమి తర్వాత సాయిరెడ్డికి జగన్ మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. విజయసాయి భూకబ్జాలు, అవినీతి ఆరోపణల మీద, ఆయన కుమార్తెకు సంబంధించి  భీమిలి సమీపంలోని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి  చేపట్టిన నిర్మాణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే విజయసాయిరెడ్డి మళ్లీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో  కీలకమైన నాయకుడిగా వైసీపీ నుండి రాజకీయాలు చేయడానికి సిద్ధపడితే కూటమి ప్రభుత్వం ఎంతవరకు విజయ్ సాయి రెడ్డి ఆటలు సాగనిస్తుందా అన్న చర్చ జరిగింది. అదీ కాక అప్పట్లో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడే ఎండోమెంట్ ఉద్యోగిని శాంతితో విజయసాయిరెడ్డికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.  అది తెలిసి కూడా జగన్ ఆయన్ని తిరిగి అక్కడకే పంపడంపై పెద్ద చర్చే జరిగింది.  వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు విజయసాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఆయన్ని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సాయిరెడ్డి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2గా ఫోకస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఓటమి తర్వాత ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడని విజయసాయి అటు రాజ్యసభ సభ్యత్వానికి, ఇటు వైసీపీకి రాజీనామా చేసి పొలిటికల్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ బయటకు వచ్చిన ఆయన జగన్ కోటరీని, సజ్జలను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. పాత కేసులు తవ్వితీస్తారన్న భయంతోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారంటారు.  ఇప్పుడు ఏపీలో విజయసాయి రిజైన్  చేసిన రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.  ఈ నెల 22న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మే 9న ఆ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఆ స్థానం ఎలాగూ కూటమి పార్టీలకే దక్కనుండటంతో. రాజ్యసభలో ఏ పార్టీ నుంచి ఎవరు అడుగుపెడతారో అన్న చర్చ మొదలైంది. ఆ రాజ్యసభ సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకే దక్కుతుందన్న ప్రచారంతో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ ఉప ఎన్నిక టెన్షన్‌ పట్టుకుందంట.  విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని, మళ్లీ రాజ్యసభకు ఎన్నికవుతారని ప్రచారం సాగుతోంది. అయితే విజయసాయి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు వెళ్లాలంటే టీడీపీ, జనసేన ఆమోదం తప్పనిసరి.  రాష్ట్రంలో బీజేపీకి కేవలం ఎనిమిది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లతోనే ఆయన రాజ్యసభకు వెళ్లగలరు.  సాయిరెడ్డి విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పవన్‌కళ్యాణ్‌తో సంప్రదించకుండా తీసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. గతంలో విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్‌లపై తీవ్ర విమర్శల గుప్పించారు.  టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు భువనేశ్వరి, జనసేనాని ఇలా అందరిపై సాయిరెడ్డి నోరుపారేసుకున్నారు. అయితే రిటైర్‌మెంట్ ప్రకటన సమయంలో జగన్ ఆదేశాలతో సజ్జల రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదివానని వెళ్లడించి కలకలం రేపారు. ఏదేమైనా టిడిపి వర్గాలు ఆయనను వర్గ శత్రువుగా చూస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపఎన్నిక జరగనున్న ఒక్క రాజ్యసభ సీటు పొత్తుల్లో బీజేపీకి దక్కి..  ఢిల్లీ పెద్దలు విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటిస్తే.. టీడీపీ ఎలా స్పందిస్తుంది? అధినేత చంద్రబాబు ఏం చేస్తారు? తమ బద్ద శత్రువుని తమ ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభకు పంపాలా? ఇదెక్కడి ఖర్మరా బాబూ.. అని పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.  ఒక వేళ నిజంగా విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించాల్సి వస్తే మాత్రం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవ్వడం ఖాయం. కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఆ భేటీలో విజయసాయిరెడ్డి వ్యవహారం తేలుతుందంటున్నారు. వాస్తవానికి మూడు నెలల క్రితమే విజయసాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో చంద్రబాబు అంగీకరించకపోవడంతో అది వాయిదా ప‌డిందంట. అయితే ఈ సారి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఒక వేళ కాషాయ పెద్దలు విజయసాయిరెడ్డిని చేర్చుకోవాలని, రాజ్యసభకు పంపాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తే మాత్రం ఆయన ఒప్పుకోక తప్పదంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయకు అది తప్ప వేరే మార్గమేమీ లేదంటున్నారు. అయితే సాయిరెడ్డిని టీడీపీ కోటాలో రాజ్యసభకు పంపితే పార్టీ శ్రేణులకు అధిష్టానం వివరణ ఇచ్చుకుని సముదాయించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఈ సారికి చక్రం తిప్పి విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంట్రీకి బ్రేకులు వేసినా.. బీజేపీ పెద్దలు ఆయన్ని తర్వాతైనా రాజ్యసభకు పంపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చూడాలి సాయిరెడ్డి భవితవ్యం ఎలా ఉండబోతుందో?

rahul versus revanth

రాహుల్ వర్సెస్ రేవంత్!

ఇద్దరి మధ్య ;పెరిగింది దూరమా.. వైరమా?  తెలంగాణలో ఏమి జరుగుతోంది? రాష్ట్ర రాజకీయాల్లో ఇంత గందరగోళం ఏమిటి? ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి సంకేతం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలను ,గీత దాటితే వేటు తప్పదని  హెచ్చరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం కూలిపోతుందని, కూల్చేందుకు సుపారీ ఆఫర్లు వస్తున్నాయని జరుగతున్న ప్రచారం వెనక ఉన్న రాజకీయం ఏమిటి? మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల ధిక్కార స్వరం  దేనికి సంకేతం? ఈ అన్నిటినీ మించి, నడుస్తున్న చరిత్రను నడిపిస్తున్నది ఎవరు? రిమోట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? ఇలా సమాధానం లేని  ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈ చిక్కు ప్రశ్నలే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని, ప్రశ్నార్ధకం చేస్తున్నాయని అంటున్నారు.  నిజమే, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు సహాజమే అయితే కావచ్చు కానీ, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ఇవేవీ కూడా సహజ పరిణామాలు అనిపించడం లేదని అంటున్నారు. నిజానికి  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా దీపా దాస్ మున్షీ ఉన్నత వరకు,కాంగ్రెస్ పార్టీలో‘అంతా బాగుంది’ అన్నట్లుగానే కథ నడిచింది. ఢిల్లీ, హైదరాబాద్ సంబంధాలు అన్నీ సజావుగానే సాగిపోయాయి. కానీ,దీపాదాస్ మున్షీ  స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే పరిస్థితి మారిపోయింది. అంతే  కాదు.. అసలు ఈ  మార్పు  కోసమే  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ఏరి కోరి మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  అయితే  అది కొంత వరకు  నిజమే అయినా మీనాక్షి ఎంట్రీకి ముందు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి  మరీ ముఖ్యంగా  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, మధ్య దూరం పెరిగిందని అంటారు. అందుకు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా.. లేకున్నా  రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి రావడం,  కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీ లోపలా బయటా మాట్లాడడం కూడా  ఇద్దరిమధ్య దూరం పెరడానికి ఒక కారణం అంటారు. నిజానికి  రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల అంతర్యం ఏమిటో ఆయన ఎందుకు అంత తరచుగా  ఢిల్లీ యాత్రలు చేశారో ఏమో గానీ, రాహుల్, రేవంత్  మధ్య దూరం పెంచేందుకు ఆయన ప్రత్యర్ధులకు మాత్రం అదొక అస్త్రంగా పనిచేసిందని అంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీ అభీష్టానికి భిన్నంగా అదానీతో ఒప్పందం కుడుర్చుకోవడం కూడా ఆ ఇద్దరి మధ్య దూరం పెంచిందని అంటారు. సరే  తెర వెనక ఏమి జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరిగింది అనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. నిజానికి ఎవరూ కాదని అనడం లేదు కూడా. అది ఒక విధంగా ప్రత్యక్షంగా కనిపిస్తూనే వుంది. అహ్మదాబాద్ ఎఐసీసీ సదస్సు లో రాహుల్ గాంధీ, తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చు కున్నారు. ఒక విధంగా సుమారు పది నిముషాలకు పైగా మెచ్చుకున్నారు. కానీ.. ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఇది ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనేందుకు మరో నిదర్శనంగా పేర్కొంటున్నారు. అలాగే.. ఇద్దరి మధ్య పెరిగిన దూరం పర్యవసానంగానే  కాంగ్రెస్  పార్టీ పరిస్థితి హస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు. నిజానికి మంత్రి వర్గ విస్తరణ అనే తేనె తుట్టెను కదిలిస్తే.. ఏ మవుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియంది కాదు. అయినా.. ఓ వంక రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగతున్న సమయంలో  మార్చి 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లను ఉన్నపళంగా ఢిల్లీకి వచ్చేయమని అధిష్టానం ఆదేశించింది. ఆ రాత్రి ఏమి జరిగిందో కానీ.. మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్  సిగ్నల్  అనే వార్త వచ్చింది. అంతే కాదు.. కొత్తగా కొలువు తీరే మంత్రుల పేర్లు, ముహూర్తాలు కూడా ఖరారైనట్లు వార్తలొచ్చాయి. అయితే ముహూర్తాలు వచ్చి పోయాయి కానీ.. మంత్రి వర్గ విస్తరణ అయితే జరగలేదు. కానీ విస్తరణ చుట్టూ కావలసినంత రాజకీయం అయితే  జరిగింది. అసలు అంతలా ఉరుకులు పరుగులు పెడుతూ హడావిడిగా రాత్రికి రాత్రి, అది కూడా బడ్జెట్ సమావేశాలు జరుగతున్న సమయలో మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? నిజంగా అలాంటి అవసరం వచ్చి ఉంటే.. ఆ తర్వాత అధిష్టానం ఎందుకు ఉలుకూ పలుకూ లేకుండా ఎందుకు మౌనంగా ఉంది పోయింది?  తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి  అన్నట్లుగా ఎందుకు తమాషా చూస్తోంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   అలాగే, కంచ గచ్చిబౌలి భూముల వివాదం విషయంలోనూ  మీనాక్షి నటరాజన్  గీత దాటి చూపించిన చొరవ తదితర పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం పైనుంచి జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు.  నిజానికి రాహుల్ గాంధీ, రేవంత్  రెడ్డి మధ్య  దూరం పెరగడం కాదు, వైరం పెరిగిందనీ ఆ   వైరం పర్యవసానంగానే కాంగ్రెస్ పరిస్థతి  హస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు.

Deputy CM Mallu Bhatti Vikramarka

రాజీవ్ యువ వికాసం..నిరుద్యోగులకు గేమ్ ఛేంజర్ : భట్టి

రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ఈ పథకం ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుందని తెలిపారు. జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  బ్యాంకుర్లు ముందుకు వస్తే యువత ఆర్దికంగా ఎదుగుతారని రూ.61 వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. . రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు  గడువును మరోసారి పెంచుతూ కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. దరఖాస్తు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం  అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది   .సాంకేతిక సమస్యల కారణంగా పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గడువు పెంపుపై వినతిపత్రం సమర్పించారు. పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఏప్రిల్ 24వ తేదీ వరకు పొడిగించింది. ప్రభుత్వం మండల, మున్సిపల్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. వీరి ఆధ్వర్యంలోనే అర్హుల ఎంపిక జరుగుతుంది. అర్హుల జాబితా రూపొందించిన తర్వాత కమిటీ నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. అన్నింటిని పరిశీలించిన తర్వాత కలెక్టర్‌ తుది జాబితాను రీలీజ్ చేస్తారు. పథకానికి ఎంపికైన వారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న రుణ పత్రాలు అందజేయనున్నారు

Rains with three gales in Telangana.. Yellow alert for several districts Heavy rains

మూడు రోజులు ఈదురుగాలులతో వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

  తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నాది.  కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని తెలిపింది.  జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు  హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. అయితే ఈ వర్షం ఆగగానే.. మళ్లీ భనుడు భగ భమన్నాడు. నేడు సైతం హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచి ఎండలు మండిపోయాయి. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. సాయంత్రం వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. 

Smita Sabharwal retweets HCU lands... notices

వక్ఫ్ బిల్లు చట్టబద్ధత పై స్టే విధించలేం : సుప్రీంకోర్టు

ఎన్డీయే సర్కార్ ఆమోదించిన  వక్ఫ్ బిల్లు చట్టంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు నేడు విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, టీఎంసి ఎంపీ మహువా మొయిత్ర, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్, అర్జీడి ఎంపీ మనోజ్ కుమార్ ఝ, ఆప్ ఎమ్మెల్యే అమనాతుల్లా ఖాన్, మణిపూర్ ఎమ్మెల్యే షేక్ నూరుల్ హాసన్, వైసీపీ, డిఎంకె, టీవికే అధినేత విజయ్, సిపిఐ సహా కొన్ని ముస్లిం సంఘాలు ఉన్నాయి.  ఇక, పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లుపై రేపు మధ్యాహ్నం మధ్యంతర తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అటు వక్ఫ్ సవరణ చట్టంపై కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోనే సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ముస్లిం సమాజంలో మత, ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని.. ఇది మైనార్టీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు దుర్మార్గమైందని.. రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడిగా ఈ బిల్లును ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. కొత్త చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. బినామీల ద్వారా వక్ఫ్ భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

supreme court next chief justice brgavai

తదుపరి సీజేఐ బీఆర్ గవాయ్

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్న సంగతి విదితమే.  ఆయన స్థానంలో తదుపరి చీఫ్ జస్టిస్‌ ఆఫ్ ఇండియాగా బీఆర్ గవాయ్ పేరును కొలీజియం  సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.   దీంతో వచ్చే నెల అంటే మే 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన దాదాపు ఆరు నెలల పాటు సీజేఐగా సేవలందించనున్నారు. ఈ ఏడాది నవంబర్ లో గవాయ్ పదవీ విరమణ చేస్తారు.   బీఆర్.గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1985లో న్యాయవాదిగా బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేశారు. అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. ఇక నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మే 24, 2019న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.   కేంద్ర న్యాయశాఖ సూచనల మేరకు గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. మే 14, 2025 నుంచి నవంబర్ 24, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ పని చేయనున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంతోనే ప్రభాకరరావు ఆటలు!

బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ వింగ్ చీఫ్ గా పనిచేసిన టీ.ప్రభాకరరావు  తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తే.. సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు వస్తానంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అంటే కేసు దర్యాప్తునకు తాను సహకరించాలంటే తనకు అరెస్టు నుంచి రక్షఏణ కల్పించాలని సుప్రీం కోర్టుకే కండీషన్ పెట్టారాయన అని అర్ధం చేసుకోవలసి ఉంటుంది.   తాను భారత్  వచ్చి  ఫోన్ ట్యాపింగ్  కేసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూనే.. తనను అరెస్టు చేయకుండా సీఐడీకి ఆదేశాలివ్వాలని ప్రభాకరరావు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరారు.   నిందితుడి తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో ఈ మేరకే తన వాదనలు వినిపించారు. ఇదే కేసులో నిందితుడైన శ్రవణ్ రావును అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన విధంగానే ప్రభాకరావుకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు.  ఏడాది కాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా అమెరికాలో ఉన్న ప్రభాకరరావు, ఇండియాకు రాకుండా అక్కడే స్థిరంగా ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలూ చేశారు. అమెరికా శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు. తనను శరణార్ధిగా గుర్తించి అమెరికాలోనే శాశ్వతంగా నివాసముండేలా చూడాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసుకున్నాడు.  క్యాన్సర్ రోగంతో ఇబ్బందిపడుతున్నందున చికిత్స చేయించుకునేంతవరకు తనను అమెరికా నుండి పంపవద్దనీ కోరారు. ఇలా అమెరికాలోనే ఉండిపోయేందుకు ఆయన చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాకరరావు అరెస్టుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది.  ఇండియా ఆయన పాస్ పోర్టు రద్దు చేసింది. అన్నిటికీ మించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో తీసుకుంటున్న చర్యల కారణంగా ఆయనలో ఖంగారు మొదలైంది. ఏ క్షణంలోనైనా అమెరికా నుంచి తాను బలవంతంగా పంపబడటం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన ప్రభాకరరావు,  తనను అరెస్టుచేయకుండా ఆదేశాలిస్తే ఇండియాకు వచ్చేస్తానని సుప్రింకోర్టుకే కండీషన్ పెట్టారు.  ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితులను గమనించిన ఆయన అమెరికా తనను బలవంతంగా  ఇండియాకు పంపడంకంటే ముందే తనంత తానానుగానే భారత్ కు వచ్చేయాలని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు ముందు బిల్డన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.  అంతే కాకుండా కిందపడ్డా నాదే పైచేయి అన్నట్లు విచారణకు సహకరించాలంటే అరెస్టు చేయకూడదంటూ తాను పెడుతున్న కండీషన్ ను అంగీకరించాలని ఏకంగా సుప్రీం కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు.

హెచ్‌సీయూ భూములపై  స్మితా సబర్వాల్ రీట్వీట్..నోటీసులు

. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల  భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఏఐని ఊపయోగించి జింకలు, నెమళ్లు దీనస్ధితిలో చూస్తున్నట్లు ఫోటోలు ఎడిట్ చేశారు. అందులో మార్చి31న ఓ నెటిజన్ పోస్ట్ చేసిన తప్పుడు ఫోటోను ఐఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ షేర్ చేసినందున  తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు చేశారు. అయితే ఈ నోటీసులోని విషయాలను ఇప్పుడు బయటకు చెప్పలేమని పోలీసులు తెలిపారు. హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు వీడియోలు, చిత్రాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. 

గోశాలలో కామ్రేడ్ నారాయణ

ఇటీవలి కాలంలో వార్తలలో నిలిచిన ఎస్వీ గోశాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బుధవారం (ఏప్రిల్ 16) పరిశీలించారు. తిరుమల తిరుపతి  దేవస్థానానికి చెందిన ఎస్వీ గోశాలలో నెలల వ్యవధిలో వందల గోవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలను టీటీడీ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టి పారేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు అయితే వాస్తవానికి గోవుల దాణా బొక్కేసింది కరుణాకరరెడ్డి హయాంలోనే అని ప్రత్యారోపణలు కూడా చేశారు. కరుణాకరరెడ్డి హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అవకతవకలన్నిటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. ఆలా టీటీడీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్న తరుణంలో  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించారు. గోశాలలో ఆవుల ఆరోగ్య పరిస్థితులు, వాటికి అందుతున్న దాణా తదితర అంశాలను నిశితంగా పరిశీలిం చారు. అనంతరం టీటీడీ ఎస్వీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఇసుమంతైనా లేదని చెప్పారు. గోవులకు దాణా కొరత లేదనీ, నిత్యం గోవుల ఆరోగ్యాన్ని పశువైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారని నారాయణ చెప్పారు. గోశాలలో గోవులన్నీ పుష్ఠిగా ఉన్నాయన్న ఆయన  టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయనీ, ఆయనను సస్పెండ్ చేస్తే సరిపోదు విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.  గతంలో గోవులకు పురుగుల దాణా పెట్టడం దారుణం అన్నారు.. కమిషన్ల కక్కుర్తితో హరినాథరెడ్డి గోవులను విక్రయించారని నారాయణ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పుడు గోశాల నిర్వహణ బ్రహ్మాండంగా ఉందని ప్రశంసించారు. గోశాలను తన రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకోవడం సరి కాదని నారాయణ అన్నారు. అసత్య, అవాస్తవ ఆరోపణలతో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని నారాయణ అన్నారు. ఇక తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లను అందిం చడాన్ని నారాయణ స్వాగతించారు. అలాగే శ్రీవాణి టికెట్ల సంఖ్యను పెంచినందుకు టీటీడీపై ప్రశంసల వర్షం కురిపించారు.  

తండ్రయిన జ‌హీర్ ఖాన్.. చిన్నారి  పేరేంటో తెలుసా?

  టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి సాగరిక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. చిన్నారికి ఫ‌తేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టిన‌ట్లు తెలిపారు. "ప్రేమ, కృతజ్ఞత, దైవ ఆశీర్వాదాలతో మేము మా చిన్న బాబు ఫతేసిన్హ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము" అని ఆమె రాసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఈ జంట ఓ అందమైన కుటుంబ ఫొటోను కూడా పంచుకుంది. ఫొటోలో జహీర్ ఖాన్ తన బిడ్డను తన ఒడిలో పట్టుకుని ఉండగా, సాగరిక తన చేతులను జహీర్ భుజాల చుట్టూ ఉంచ‌డం చూడొచ్చు. తొలి బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికిన జ‌హీర్ ఖాన్ దంప‌తుల‌కు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.  కాగా, 2016లో తోటి క్రికెట‌ర్‌ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సింగ్ వివాహం సందర్భంగా సాగరిక ఘట్గే, జహీర్ ఖాన్ తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత 2017లో ఈ జంట వివాహబంధంతో ఒక్క‌ట‌య్యారు. కొడుకును కూడా నీలాగే చాంపియన్‌ బౌలర్‌ను చెయ్ అంటూ జహీర్‌ను కోరుతున్నారు ఫ్యాన్స్. కాగా, ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు లెజెండరీ స్పీడ్‌స్టర్. లక్నో సూపర్ జెయింట్స్‌గా మెంటార్‌గా ఉన్న జహీర్.. యువకులతో నిండిన జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.