కారు స్టీరింగ్ చేతులు మారుతుందా?
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరో మూడు రోజుల్లో ( ఏప్రిల్ 27) ఇరవై నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది. ఒక విధంగా ఇదొక అపూర్వ సందర్భం. అవును పాతికేళ్ళ క్రితం, 2001 ఏప్రిల్ 2న జలదృశ్యం (కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం) లో పురుడు పోసుకున్నటీఆర్ఎస్ ఇంత కాలం బతికి బట్టకడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ముఖ్యంగా అప్పటికే ప్రత్యేక తెలంగాణ నినాదంతో పుట్టి గిట్టిన పార్టీలు అనేకం ఉన్న నేపధ్యంలో టీఆర్ఎస్ కూడా అంతే అనుకున్నవారు, అన్నవారు కూడా ఉన్నారు. అయితే, తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన టీఆర్ఎస్ విజయవంతంగా, రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా.. పాతికేళ్ళ ప్రస్థానం పూర్తి చేసుకుంది. రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించింది. ప్రతిపక్ష అనుభవాన్నీ రుచి చూసింది.
నిజానికి, తెలుగు నాట అనేక పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో పోయాయి. అప్పుడే కాదు.. ఇప్పటికి కూడా, పాతికేళ్ళు బతికి బట్ట కట్టిన పార్టీలు రెండే రెండున్నాయి. 1982 లో నందమూరి తారక రామ రావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ తర్వాత రజతోత్సవం జరుపుకుంటున్న పార్టీ, టీఆర్ఎస్ మాత్రమే బతికి బట్ట కట్టిన పార్టీగా చరిత్ర పుటల్లో నిలిచింది.
ఈ పాతికేళ్ళలో పార్టీలో చాలా మార్పులు జరిగాయి. 2001లో ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్, 2014లో ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 2022లో భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) గా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టింది. అయితే ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా, ప్రాతీయ పార్టీ, జాతీయ పార్టీగా రూపాంతరం చెందినా, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్నా పార్టీ పగ్గాలు మాత్రం చేతులు మారలేదు. వ్యవస్థాపక అధ్యక్షుడు, కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) సారథ్యకలోనే ఇప్పటికీ పార్టీ నడుస్తోంది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. రెండు పదవుల్లో కొనసాగుతున్నారు. నిజానికి,ముందు ముందు కూడా ఆయనే కొనసాగుతారు. అందులో అనుమానం లేదు.
అయితే పదవి ఆయనదే అయినా.. పెత్తనం అయన చేతుల్లో ఎంతవరకూ ఉంటుంది అనేది అనుమానమే అంటున్నారు. ఇప్పటికే చాలావరకు ఫార్మ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ తిరిగి క్రియాశీల నేతగా జనంలోకి వస్తారా? ముందుండి పార్టీని నడిపిస్తారా? తెర వెనక నుంచి మార్గ ‘దర్శకత్వం’ మాత్రమే చేస్తారా? అంటే.. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అన్న సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివిధ టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలను జాగ్రత్తగా గమినిస్తే.. ఏదో ఇలాంటి, ఉత్సవాల్లో దర్శనం ఇవ్వడం వరకే కేసీఆర్ పాత్ర పరిమితం కాబోతోందననే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
నిజానికి.. కారాణాలు ఏమైనా ఇప్పటికే పార్టీలో కేసీఆర్ పాత్ర చాలా వరకూ కుదించుకు పోయింది. ఇందులో దాపరికం లేదని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. మరోవంక కేటీఆర్ అప్రకటిత ఉత్తరాధికారిగా సర్వం తానై చక్రం తిప్పుతున్నారనేది కళ్ళ ముందున్న సత్యం. అదలా ఉంటే గడచిన రెండుమూడు రోజుల్లో కేటీఆర్ వేర్వేరు టీవీ చాన్నాళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కేసీఆర్ ఫ్యూచర్ రోల్ పై మరింత క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. కానీ, పార్టీ రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో కనిపించరు. వినిపించరు. పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు. తెర వెనక నుంచి మార్గ దర్శకత్వం మాత్రమే చేస్తారు. తెరపై కనిపించే రోజువారీ రాజకీయ కార్యకలాపాలన్నీ కేటీఆర్ చూసుకుంటారు.
అలాగే, ప్రతిపక్ష నేతగానూ కేసీఆర్ కొనసాగుతారు, కానీ, అసెంబ్లీకి మాత్రం రారని, కేటీఆర్ ఒకటి రెండు ఇంటర్వ్యూలలో స్పష్టంగానే చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రస్ మంత్రులు చేసే అవమానాలను భరించవసిన అవసరం కేసీఆర్ కు లేదని, అందుకే ఆయన, అసెంబ్లీకి రారని స్పష్టం చేశారు. అంతేకాదు.. గతంలో తమిళనాడులో జయలలిత, ఏపీలో చంద్రబాబు నాయుడు, అధికార పక్షం అవమానాలను భరించలేక సంవత్సరాల తరబడి అసెంబ్లీకి రాలేదని, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కూడా అసెంబ్లీ ముఖం చూడరని కేటీఆర్ స్పష్టం చేశారు. సో.. ఇక గులాబే బాస్ ఎవరంటే.. తెర వెంక కేసీఆర్, తెరపై కేటీఆర్ ఆర్ అంటున్నారు.