ట్విట్టర్లో టిడిపిని, క‌న్నాను టార్గెట్ చేసిన వైసీపీ!

క‌రోనాను సైతం లెక్క చేయ‌కుండా ఏపీలో రాజకీయాలు కేక పుట్టిస్తున్నాయి. మే నెల‌లో వేడివేడి పెనం మీద నీళ్ళు చల్లినట్టుగా సలసల కాగుతున్నాయి. వైసీపీ నేతలు చంద్రబాబుని టార్గెట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా చంద్ర‌బాబుకు ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వు. ఏ స్థానంలో ఉన్నా చేసేవి నీచరాజకీయాలే. వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్స్‌ల పేరిట హడావుడి, ఆర్భాటాలు తప్ప ఒక్క నిర్మాణాత్మక ఆలోచన లేదంటూ ట్విట్టర్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రచారలబ్ధి పొందాలనే కుటిల రాజకీయ సూత్రం నుంచి చంద్రబాబు ఇంకా బయటపడలేదు. దీని ద్వారా ఆయన దారుణ వ్యక్తిత్వాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి విష ప్రచారం చేసే దుర్భుద్ధి చంద్రబాబుకు పోలేదని స‌జ్జ‌లీ ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మ‌రో ట్వీట్ చేశారు. చంద్రబాబుకు అమ్ముడపోలేదని ప్రమాణం చేసేందుకు కాణిపాకానికి ఎప్పుడు వస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో రూ.30 కోట్లు నొక్కేశాడని ఎలక్షన్ల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికలు రాశాయి. స్థానికంగా సమీకరించిన విరాళాలూ దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కన్నా తో కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు పెద్దలకు తెలుసు అంటూ అప్పట్లో ఆంధ్రప్రభ పత్రిక ప్రచురించిన వార్తను జత చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. మొత్తం మీద వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు టీడీపీ, బీజేపీ నేతల్ని చెడుగుడు ఆడుకుంటున్నారు.

డాక్ట‌ర్‌ను క‌బ‌ళించిన క‌రోనా!

కరోనా వైరస్ పంజా విసురుతున్న తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే వైరస్ బారినపడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. నిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటికే ఐదుగురు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా వైరస్ సోకింది. కరోనా సోకిన ఓ మహిళకు చికిత్స అందించడం కారణంగా వీరంతా వైరస్ బారినపడ్డారు. అనంతరం ఆ మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరణించిన తర్వాత కరోనాగా నిర్ధారణ అయ్యింది. గత నెలలో దోమల్‌గూడలో ఇద్దరు వైద్యులు కరోనా వైరస్ బారినపడ్డారు. హైదరాబాద్‌లోని ఆగపురాలో కరోనా వైరస్‌తో ఓ వైద్యుడు మరణించాడు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరి ద్వారా కుటుంబంలో అందరికీ కరోనా సోకింది. వైద్యుడు కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందడం ఆందోళన కల్గిస్తోంది. నగరంలోని ఆగపురా ప్రాంతంలో ఓ యునానీ వైద్యుడు (52) కరోనాతో గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. వైద్యుడి భార్య కూడా యునానీ వైద్యురాలే. ఇద్దరూ ఒకే చోట వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమెకు కూడా వైరస్ సోకింది. వీరి ద్వారా కుటుంబంలోని వారందరూ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఏప్రిల్‌ 5న వైద్యుడు అనారోగ్యానికి గురయ్యాడు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యుడి ద్వారా అతడి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలకు కూడా కరోనా సోకింది. వారందరినీ గాంధీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుడి మృతితో తెలంగాణాలో కరోనా మరణాల సంఖ్య 24కు చేరుకుంది.

పాఠ‌శాల‌కు రంగులేసిన క్వారంటైన్‌ వ‌ల‌స‌కూలీలు!

క్వారంటైన్‌లో ఉంటూ పాఠ‌శాల‌‌ను శుభ్రం చేయ‌డ‌మే కాదు చిన్న చిన్న రిపేర్లు చేసి సున్నంతో పాటు రంగులు వేసి త‌మ పెద్ద మ‌న‌సు చాటుకున్నారు ఆ వ‌ల‌స కూలీలు. లాక్‌డౌన్‌లో త‌మ‌కు త‌ల‌దాచుకోవ‌డానికి నీడ‌నిచ్చి ఆశ్రయమిచ్చిన పాఠ‌శాల‌లను వారు గుడిలా చూసుకున్నారు. అన్నం పెట్టిన గ్రామస్థులను ఆప్తులనుకున్నారు. ఆగ్రామ‌స్థుల్లో దేవుడిని చూశారు. మనసులోని కృతజ్ఞతాభావం వారిని ఊరకే కూర్చోనీయలేదు. ''సార్‌! పాఠ‌శాల‌ గోడలకు సున్నం రాలి, పెచ్చులూడి కనిపిస్తున్నాయి. మాకు పెయింట్‌ ఇప్పించండి చాలు. రంగులేస్తాం'' అన్నారు పెద్దలతో. ప్రతిఫలంగా వారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. గ‌త తొమ్మిదేళ్లుగా ఆ పాఠ‌శాల‌ల‌కు ఎలాంటి సున్నం వేయ‌లేద‌ట‌. ఇప్పుడు కొత్త భ‌వ‌నాల్లా తళతళలాడుతున్నాయి. హరియానా, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి వచ్చిన 54 మంది కూలీలకు... రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లా, పల్సానా పరిధిలోని షాహిద్‌ సీతారాం కుమ్వాత్‌, సేథ్‌ కె.ఎల్‌.తంబి ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు బస ఏర్పాటు చేశారు. పల్సానా సర్పంచి రూప్‌సింగ్‌ షెకావత్‌ వారికి ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. క్వారంటైన్‌ మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. అయితే ఆ కార్మికుల మనసులు ఆగలేదు. తాము ఉంటున్న పాఠ‌శాల‌ల‌ను శుభ్రం చేశారు. చిన్న చిన్న రేపేర్లు చేయ‌డ‌మే కాదు రంగులేస్తామని సర్పంచి దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయులు కూడా ముందుకొచ్చి తలో కొంత వేసుకుని... కావలసిన రంగులు, సరంజామా సమకూర్చారు. అంతే. వ‌ల‌స కార్మికులంతా కలిసి పాఠశాలల ఆవరణలను శుభ్రం చేసి, గోడలకు రంగులు వేసి వాటిని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఇప్పుడు వారి క్వారంటైన్‌ కూడా పూర్తయింది. కష్టానికి ప్రతిఫలంగా డబ్బులిచ్చినా... కార్మికులు తీసుకోలేదని, వారి మంచి హృదయానికి తమ ప్రజలు ఎంతో సంబర పడుతున్నారని షెకావత్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ విశేషంగా ప్రచారంలోకి వచ్చాయి. చిన్న బతుకులు పెద్ద మనసుతో వ్య‌వ‌హ‌రించార‌ని నెట్‌జ‌నులు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

ఇండియాలో కరోనా వైర‌స్ విజృంభిస్తోంది!

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరో వైపు మరణాల సంఖ్య కూడా ఆందోళ‌న‌క‌రంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 2న 211 జిల్లాకే పరిమితమైన కరోనావైరస్ ఇప్పుడు 430 జిల్లాలకు వ్యాపించంది. దేశంలోని కేసుల్లో 45 శాతం కేలుసు ఆరు ప‌ట్ట‌ణాల్లోనే ఉన్న‌ట్లు గుర్తించారు. మూడువేలకు పైగా కేసులతో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ 2081, అహ్మదాబాద్ 1298, ఇండోర్ 915, పుణె 660, జైపూర్ 537 కేసులతో ఉన్నాయి. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 21,370 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 681 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 16,319 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, 4370 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఒక్క రోజే 49 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో 60 కన్నా ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 5649 కరోనా కేసులు నమోదు కాగా, 269 మరణాలు సంభవించాయి. గుజరాత్ రాష్ట్రంలో 2407 కేసులు నమోదు కాగా, 103 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 2248 కేసులు నమోదు కాగా, 148 మరణాలు సంభవించాయి. రాజస్థాన్ రాష్ట్రంలో 1888 కరోనా కేసులు, 127 మరణాలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1587 కేసులు, 80 మరణాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1449 కేసులు, 21 మరణాలు సంభవించాయి. తెలంగాణలో 943 కరోనా కేసులు, 24 మరణాలు, ఏపీలో 813 కరోనా కేసులు, 24 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు క‌రోనా మహమ్మారి వల్ల వరల్డ్‌వైడ్‌గా 180,289 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 25,96,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికా పరిస్థితి మరి దారుణంగా ఉంది. యూఎస్‌లో ఇప్పటివరకు 45,153 మంది మృత్యువాత పడగా, 8.29 లక్షల మంది కరోనా బాధితులు ఉన్నారు. అమెరికా తర్వాత ఇటలీలో 25,085, స్పెయిన్‌లో 21,717, ఫ్రాన్స్‌లో 21,340, బ్రిటన్‌లో 18,100 మంది ఈ మహమ్మారి వల్ల మరణించారు. ఇక భారత్‌లో కూడా 'కొవిడ్‌-19' శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 20,471 మంది కరోనా బారిన పడ్డారు. 652 మంది మరణించారు. తెలంగాణలో 943 కరోనా కేసులు, 24 మరణాలు, ఏపీలో 813 కరోనా కేసులు, 24 మరణాలు సంభవించాయి.

లేడీ డాక్టర్ కు కరోనా

గుంటూరు జిల్లాలో కొత్తగా 19 కేసులు ఒక్క గుంటూరులోనే 106 కేసులు గుంటూరు, నరసరావుపేటల నుంచి రాకపోకలు బంద్ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికంగా నివసిస్తూ నరసరావుపేటలో పనిచేస్తున్న వైద్యురాలికి పాజిటివ్ అని తేలడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అయితే, ఆమె కుటుంబ సభ్యులకు మాత్రం నెగటివ్ రిపోర్టులు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు, జిల్లాలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నేడు కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 177కు పెరిగినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. నేడు గుంటూరులో 5, నరసరావుపేటలో 5, దాచేపల్లిలో 4, చిలకలూరిపేటలో ఒక కేసు నమోదైంది. తాజా కేసులతో కలుపుకుని ఒక్క గుంటూరు నగరంలోనే నమోదైన కేసుల సంఖ్య 106కు పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు, నరసరావుపేటలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలను నిషేధించారు.

జగన్ వద్దన్న జాస్తి కృష్ణకిషోర్ కు కేంద్రం బంపరాఫర్...

జాస్తి కృష్ణ కిషోర్‌కు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి(ఈడీబీ) సీఈవోగా పనిచేసిన కృష్ణకిషోర్. ఈడీబీ సీఈవోగా కృష్ణకిషోర్ వ్యవహరించిన సమయంలో అవకతవకలు జరిగాయని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ తర్వాత కేంద్ర సర్వీసుల్లో తన సొంత శాఖ ఆదాయపు పన్ను విభాగానికి వెళ్లిపోయిన కృష్ణ కిషోర్ కు ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను శాఖ ఛీఫ్ కమిషనర్ పదవి నుంచి ప్రిన్సిపల్ ఛీఫ్ కమిషనర్ గా నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన్ను ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. రేపు ఆయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ ఎకనామిక్ డెపలప్ మెంట్ బోర్డు సీఈవోగా వ్యవహరించిన జాస్తి కృష్ణ కిషోర్ అప్పట్లో పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో కృష్ణ కిషోర్ కృషి కారణంగా ఏపీ సర్కారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా మొదటి స్ధానంలో నిలిచింది. కానీ ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన్ను టార్గెట్ చేసింది. వ్యక్తిగత కక్షతో ఈడీబీలో స్టేషనరీ నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ సస్పెన్షన్ విధించింది. దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించగా.. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కేంద్రంలోని తన సొంత శాఖకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా కేంద్రం ఆయన్ను ఐటీ ప్రిన్సిపల్ ఛీఫ్ కమిషనర్ గా నియమించడం విశేషం.

కొండపల్లి లో ఆవులకు వింత జబ్బు

కృష్ణాజిల్లా కొండపల్లి ప్రజలు భయంతో వణుకుతున్నారు. గ్రామానికి చెందిన ఆవులు వింత వ్యాధితో విలవిల్లాడుతుండడమే ఇందుకు కారణం. శరీరంపై ఎర్రటి మచ్చలతోపాటు కళ్ల నుంచి రక్తం వస్తుండడంతో జనం భయభ్రాంతులకు గురువుతున్నారు. సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యులు వెంటనే గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైన 70 గోవులను పరీక్షించారు. వాటికి పొంగు జబ్బు వచ్చిందని నిర్ధారించారు. ఇది అంటువ్యాధి అని, ఒకదాన్నుంచి మరోదానికి ఇది సంక్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ జబ్బు శరీరం నుంచి కడుపులోకి పాకితే ప్రమాదమని చెప్పారు. వీటికి వారం రోజులపాటు చికిత్స అందించాల్సి ఉంటుందని వివరించారు. కాగా, కరోనా నేపథ్యంలో వాటికి అది సోకిందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అలాంటిదేమీ ఉండదని, కరోనా వైరస్ జంతువులకు సోకదని అధికారులు వివరించి చెప్పడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

27 న మరో సారి మోడీ- సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ 

కరోనా కట్టడి కోసం మే 3 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన ప్రధాని మోదీ ప్రస్తుతం కరోనా పరిస్థితులపై మరోసారి రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 27 న సమావేశం కానున్నారుఉంది.  అలాగే ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశం . సోమవారం ఉదయం ముఖ్యమంత్రులతో మోదీ భేటీ నిర్వహిస్తారు. ఏప్రిల్ 20 తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపునిచ్చిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 11న కూడా ప్రధాని మోదీ 13 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధాని మోదీని అభ్యర్థించారు. దీంతో ఏప్రిల్ 30 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగిస్తారని భావించారు. కానీ అనూహ్యంగా మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు మోదీ ప్రకటించారు.దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించే ముందు కూడా ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు. ఏప్రిల్ 2న కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

'ఫైవ్ స్టార్ ప్రచారక్' రామ్ మాధవ్ చుట్టూ తిరుగుతున్న ఏపీ బీజేపీ రాజకీయం

* జమ్మూ కాశ్మీర్ అసైన్మెంట్ తర్వాత, ఏపీ మీద దృష్టి పెట్టిన అమలాపురం బుల్లోడు  * 2024 ఎన్నికలకు ఏపీ బీ జె పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ కావాలని లక్ష్యం  * కన్నా, సుజనా లను విజయసాయి చేత టార్గెట్ చేయిస్తోంది కూడా రామ్ మాధవే నని గుసగుసలు  * నిజంగా ఆర్ ఎస్ ఎస్ నాగపూర్ హెడ్ క్వార్ట్రర్స్ ఇన్వాల్వ్ అయితే, సుజనా, పురంధేశ్వరి ల పాత్ర పరిమితమయ్యే అవకాశం  ఆంధ్ర ప్రదేశ్ లో పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీరుస్తోంది. ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు పిట్టలయితే, వారి పోరు తీర్చే పిల్లి విజయసాయి రెడ్డి అన్న మాట. వారం రోజులుగా ఏపీ లో ఉద్ధృతమైన రాజకీయ పార్టీల మాటల తూటాలకు కేంద్ర బిందువు సోము వీర్రాజేనని కమలదళాలు గుసగుస లాడుకుంటున్నాయి. ఇప్పుడు కంక్లూషన్ ఏమిటంటే, బీ జె పీ లో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలన్నీ, సోము వీర్రాజే , విజయసాయి రెడ్డి కి చేరవేస్తున్నారనీ, ఆ తర్వాతనే, విజయసాయి రెడ్డి- కన్నా, సుజనాల మీద మాటల దాడి మొదలెట్టారనిన్నీ! అసలు ఇదంతా ఎవరి డైరెక్షన్ లో జరుగుతోంది, ఏమి ఆశించి వారు ఇదంతా చేస్తున్నారని ఆరా తీస్తే, చాలా ఆసక్తికర విషయాలే వెలుగులోకి వస్తున్నాయి.  ఆంధ్ర ప్రదేశ్ బీ జె పీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నేతృత్వం లో, పార్టీ రాజ్య సభ సభ్యుడు జీ వీ ఎల్ నరసింహా రావు మార్గదర్శనంలోనే ఈ డ్రామా అంతా జరుగుతోందని, ఆ నిమిత్తమే, కన్నాకు సుజనాకు దగ్గుబాటి పురంధేశ్వరికి ఎసరు పెట్టడానికి, విశాఖ మాధవ్ ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ నూతన అధ్యక్షుడుగా చెయ్యడానికే బీజేపీ తన హిజ్ మాస్టర్ వాయిస్ అయిన  వై ఎస్ ఆర్ సి పీ ద్వారా లీకులు ఇప్పిస్తోందని ఢిల్లీ వర్గాల భోగట్టా. వాస్తవానికి మోడీ అవకాశమిస్తే, ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీని పునరుజ్జీవంపచేయటానికి సుజనా చౌదరి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. అప్పుడు, రామ్ మాధవ్ , జీ వీ ఎల్ నరసింహారావు ఆయన్ను సాదరంగా ఆహ్వానించి, ముందుకు తీసుకెళ్లారు కూడా. కానీ, బీ జె పీ హెడ్ క్వార్ట్రర్స్ కు సుజనా చౌదరి దగ్గర కావటం ఇష్టం లేని, విజయసాయి రెడ్డి, తమకు అనుకూలంగా ఉండే వీర్రాజు -బీ జె పీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే బావుంటుందనే ఉద్దేశంతో- కథను బైపాస్ రోడ్డెక్కేంచారనీ, అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు లోకి మళ్లించి, కన్నా లక్ష్మీనారాయణ సీటుకు ఎసరు తీసుకొచ్చారనీ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వీర్రాజు, లేకపోతె మాధవ్ ---వీరిద్దరిలో ఎవరో ఒకరు బీ జె పీ ఏపీ శాఖ అధ్యక్షులైతే, వై ఎస్ ఆర్ సి పీ కి పెద్దగా రాష్ట్రం లో ఇబ్బంది ఉండదనే భావనలో జగన్ టీమ్ ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర బీ జె పీ అధ్యక్షునిగా సుజనా చౌదరి అయినా, పురంధేశ్వరి అయినా--వారు ఎక్కడ బీ జె పీ కేంద్ర నాయకత్వానికి దగ్గర అయిపోతారనే ఉద్దేశంతోనే, విజయసాయి రెడ్డి -సుజనా మీదా, కన్నా మీదా ఆరోపణల దాడిని ఉద్ధృతం చేశారనీ బీ జె పీ హెడ్ క్వార్ట్రర్స్ లో ఒక విశ్లేషణ నడుస్తోంది.  పలికెడివాడు విజయసాయిరెడ్డి అట ! పలికించెడివాళ్ళు రాంమాధవ్, జీవీఎల్ అట !! అంటూ ఒక పొలిటికల్ సెటైర్ కూడా పార్టీ ఏపీ అఫైర్స్ మీద, జాతీయ స్థాయి లో హల్ చల్ చేస్తోంది. ఏతా, వాతా రామ్ మాధవ్ స్కెచ్ లో భాగంగానే, ఆయన ట్యూన్స్ కు అనుగుణంగానే -విజయసాయి రెడ్డి ఈ రచ్చకు తెర తీశారని, అన్నీ అనుకూలిస్తే-రామ్ మాధవ్ 2024 లో రాష్ట్రం నుంచి బీ జె పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోవటానికి కావలసిన వాతావరణాన్ని ఇప్పటి నుంచే తయారు చేసుకుంటున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ గేమ్ లో వీర్రాజు కానీ, మాధవ్ కానీ ఆటలో అరటిపండ్లేనని, పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని తన గుప్పిటలోకి తెచ్చుకున్న తర్వాత రామ్ మాధవ్ డిఫరెంట్ గేమ్ తో ముందుకెళ్తారని పార్టీ వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. ఫైవ్ స్టార్ ప్రచారక్ గా ఆర్ ఎస్ ఎస్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రామ్ మాధవ్, తోలి నుంచీ సంఘ్ తో తనకున్న విస్తృతమైన అనుబంధం దృష్ట్యా సంఘ్ పెద్దలను ఒప్పించే క్రమంలో రామ్ మాధవ్ పావులు కదపటం మొదలెట్టారని నాగపూర్ సమాచారం. ఆ లెక్కన చూస్తే, సుజనాచౌదరికి గానీ, పురంధేశ్వరి కి గానీ ఆర్ ఎస్ ఎస్ తో అనుబంధం లేకపోవటం ఒక విధంగా డ్రా బ్యాక్ కిందకే వస్తుంది. రామ్ మాధవ్ మొదలెట్టిన క్రీడలో ఇప్పుడు తోలి అంకమే పూర్తి అయ్యింది, క్లైమాక్స్ లో కానీ-అంటే, 2023 చివరకు గానీ ఆయన అసలు రాజకీయం రాష్ట్ర బీ జె పీ లో మొదలు కాదనేది మరొక వర్గం విశ్లేషణ.

జగన్ కు కరెంట్ షాక్!!

పీపీఏలకు కట్టుబడి ఉండాల్సిందే! జగన్ కు కేంద్రం షాక్! ప్ర‌ధాని మోడీ... జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు. 2003 నాటి విద్యుత్ చట్టాన్ని మార్చడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. పాత చట్టానికి దుమ్ము దులిపి..: మార్చి18, 1910న ఏర్పాటు చేసిన భారతీయ విద్యుత్ ఆక్ట్ -1910 (ఆక్ట్ నెం.9)ని వ్యూహాత్మకంగా కేంద్రం అటకపై నుంచి దింపి, దుమ్ము దులిపి బయటకు తీసింది. ఈ చట్టంతో రూపాంతరం చెందిన 2003 విద్యుత్తు చట్టంలో నిబంధనలు మార్చాలని భావించింది.  21 రోజుల్లో ఇందుకోసం ఏకంగా ఓ కొత్త చట్టాన్ని కొంచెం గట్టిగా తీసుకు రాబోతున్నారు. ’21 రోజుల్లో అంటే మే8 వరకు అభ్యంతరాలు, సలహాలు చెప్పండంటూ ఓ నోటిఫికేషన్ కూడా ఈమేరకు జారీ అయింది.  ఈ సవరణ చట్టం మేరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే, పీపీఏలకు కట్టుబడి ఉండాల్సిందే… పీపీఏల అమలును పర్యవేక్షించేందుకు ఎలక్ట్రిసిటీ కంట్రాక్ట్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది అమల్లోకి వస్తే జగన్ ఆలోచనలకు బ్రేక్‌యే. అస‌లు జ‌గ‌న్ ఏం చేయాల‌నుకున్నారు?  జగన్ సి.ఎం.కాగానే చేసిన తొలి అధికార ప్రకటన ‘రాష్ట్రంలో చంద్రబాబు అడ్డగోలు కమీషన్ల కక్కుర్తితో పవన విద్యుత్తు, సౌరవిద్యుత్తు కొనుగోళ్లకు అసాధరణ రేట్లను ఫిక్స్ చేశాడు, దానివల్ల ఖజానా గుల్లయిపోతున్నది, మేం ఆ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) మొత్తం సమీక్షించి, రేట్లు తగ్గిస్తాం’ అనేది జగన్ ప్రకటన సారాంశం. పవన విద్యుత్తు, సౌరవిద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించిన డబ్బు చెల్లింపులు ఆపేశారు. సుమారు 40 ప్లాంట్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.    అయితే  కేంద్రం కొత్తగా చేయబోతున్న చట్టంలో మార్పులు ఏమిటంటే?  పవన, సౌర (పునరుత్పాదక) విద్యుత్తును ఒప్పందాల్లో ఉన్నట్టుగా కొనాల్సిందే.! అలా కొనకపోతే యూనిట్‌కు ఏకంగా 50 పైసల చొప్పున కరెంటు పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  ప్రతి డిస్కం ఏ సంవత్సరం లెక్కల్ని ఆ సంవత్సరమే తేల్చేయాలి. భారాన్ని వచ్చే సంవత్సరంలో వినియోగదారులకు వడ్డించటానికి వీల్లేదు.  ఇప్పుడు క్రాస్ సబ్సిడీ, సర్కారు సబ్సిడీ కలిసి గృహ వినియోగదారులకు కొంత రిలీఫ్ ఇస్తున్నాయి. ప్రభుత్వమే డిస్కమ్స్‌ కు సబ్సిడీ చెల్లిస్తుంది.  అయితే ఇకపై వంట గ్యాస్‌లో ఇస్తున్నట్టే… వాస్తవ కరెంటు ధరను మన దగ్గర వసూలు చేస్తారు. తరువాత కొంత సబ్సిడీని నేరుగా (బిల్లు మొత్తం, స్లాబు, కేటగిరీలను బట్టి) మన బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తారు.  వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తును భారీగా దుర్వినియోగం, సబ్సిడీ లెక్కల్లో ‘గోల్‌ మాల్’ జరుగుతుండటంతో మొత్తం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడతారు. ఆ లెక్కల్ని పక్కాగా రికార్డ్ చేస్తారు. పెద్ద పెద్ద ట్రాన్స్‌ మిషన్ లైన్స్, సబ్‌ స్టేషన్ల మెయింటెనెన్స్‌ ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేస్తారు.   ప్రాంతాల వారీగా కరెంటును పంపిణీ చేసే కంట్రాక్టులను ప్రైవేటు సంస్థలకు ఇస్తారు. ఇది కరెంటు రంగం రూపురేఖల్నే మార్చేయబోతున్నది.  విద్యుత్ కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ  రెగ్యులేటరీ కమిషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తున్నాయి.   ఇకపై కేంద్రంలోని ‘విద్యుత్ కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ కమిటీ’ ఈ నియామకాల్ని చేస్తుంది.  ఈ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. పీపీఏలపై సమీక్ష కోసం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ (హెచ్‌ఎల్‌ఎన్‌సీ)ని నియమిస్తూ ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 63ను రద్దు చేయాలని 40కి పైగా విద్యుదుత్పత్తి సంస్థలు కోరుతున్నాయి.

మా తప్పుంటే కర్నూలు రాజధాని సెంటర్ లో ఉరి తీయండి!

* వైరస్ ఉద్ధృతికి ముస్లిం సమాజం కారణమంటూ నిందించటంపై హఫీజ్ ఖాన్ ఆక్షేపణ  * కర్నూలు నుంచి వంద మంది మర్కజ్ కు వెళ్లిరావడాన్ని యాక్సిడెంట్ గా చూడాలని హితవు  * మీ నాయన,మీ అమ్మ ముస్లిం సమాజం ఓట్లతోనే గెలిచారంటూ భూమా అఖిలప్రియకు చురక  * పుష్కర ఘాట్లకు కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పుడు అక్కడ మెట్లయినా ఉన్నయా అంటూ ప్రశ్న  పాలక వై ఎస్ ఆర్ సి పి ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్ డిఫెన్స్ లో పడ్డారు. కర్నూలు లో పేట్రేగిపోతున్న కరోనా వైరస్ కు ఆయన వైఖరే కారణమంటూ ప్రధాన మీడియా వేలెత్తి చూపటంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. తన వల్లనో,కర్నూలు ఎంపి వల్లనో కరోనా వ్యాప్తి జరిగిందని చెబుతున్నారని, దాన్ని నిరూపించాలని, తనపైన గాని, అధికారుల పై గాని ఎంక్వైరీ వేయాలని కర్నూల్   ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్ సవాల్ చేశారు. " నాపైనగాని...అధికారులపైనగాని ఎంక్వయిరీ వేస్తారా వేయండి....మేం తప్పు చేసిఉంటే మా కర్నూలులో రాజధాని సెంటర్ అని ఉంది...మా తప్పుఉంటే అక్కడ  ఉరితీయండి...మేం రెడీ," అంటూ విపక్ష తెలుగు దేశం పై హఫీజ్ ఖాన్ విరుచుకు పడ్డారు. " కరోనాను నియంత్రించేందుకు అందరికంటే ముందున్నాను....మసీదులను బంద్ చేయించాను...తబ్లీక్ జమాత్ వారు ఎవరైతే వెళ్లి  వచ్చారో..... వారి ఇంటింటికి వెళ్లి...మసీదు పెద్దలకు చెప్పి 24 గంటల్లోపల వారందర్ని క్వారంటైన్ సెంటర్ కు పంపించింది నేను....ప్రజలలో అవగాహన పెంచింది నేను. ఈరోజు కర్నూలు కష్టసమయంలో ఉంది....ఎందుకంటే మా కర్నూలు నియోజకవర్గం నుంచి(జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతం) వందమందికి పైగా  ఢిల్లీ వెళ్లి వచ్చారు.దానిని ఒక యాక్సిడెంట్ గా చూడాలి.ఈ విపత్తునుంచి ఎలా బయటపడాలా అని సలహాలు,సూచనలు ఇవ్వాలి.ఆత్మస్ధైర్యం ఇవ్వాలి.మంచి మాట చెప్పాలి.వాళ్లు ఎంతో మనస్ధాపం చెంది మానసికంగా బాధపడుతుంటే ముస్లిం సమాజాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయడం చాలా బాధాకరం, " అంటూ అయన టీ డీ పీ ని విమర్శించారు.  "భూమా అఖిలప్రియగారు....మీనాయన,మీ అమ్మ ముస్లిం సమాజం ఓట్లతోనే గెలిచారనేది గుర్తుపెట్టుకోవాలి.ఇది మా సమాజానికి అంటగట్టద్దు.చేతులు మొక్కి చెబుతున్నాను.రాజకీయాలు,కులాలు,మతాలకు ముడిపెట్టద్దు. భారతదేశం బాగుండాలంటే కులాలు,మతాల గురించి మాట్లాడకూడదు.నీవు వందకోట్లు కాదు,వేయికోట్లు సంపాదించుకున్నా కూడా కరోనా వైరస్ ను మాత్రం నీవు తప్పించుకోలేని పరిస్ధితి.ఇలాంటి కష్టసమయంలో మానవత్వంతో ఆలోచించాలి.భగవద్గీత,ఖురాన్,బైబిల్ ఏం చెబుతున్నాయి అంటే మానవసేవే మాధవసేవ అని చెబుతున్నాయి.ఏమైనా చేస్తే మేలు చేయి కాని కీడు చేయవద్దని చెబుతున్నాయి. కన్నాలక్ష్మీనారాయణగారిని సూటిగా అడుగుతున్నాను...మీ కేంద్రప్రభుత్వం కన్నా 65 రూపాయలతక్కువకు  మేం కిట్లు కొన్నాం.మరి మీకు దమ్ము,ధైర్యం ఉంటే కేంద్రంలోని మీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి.ఎందుకు 65 రూపాయలు ఎక్కువపెట్టి కొన్నారు అని.మేం 65 రూపాయల తక్కువకు కొనడమే కాదు.అగ్రిమెంట్ లో కూడా రాశాం....అది ఏమంటే మాకంటే తక్కువ ధరకు వేరే రాష్ట్రాల వారికి ఇస్తే ఆ డిఫరెన్స్ ఎమౌంట్ మీ దగ్గర నుంచి  వసూలు చేస్తామని సరఫరా చేసిన సంస్ధకు స్పష్టంగా చెప్పాం.ప్రజాధనాన్ని కాపాడాలనే అంత చిత్తశుధ్దితో మా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు పనిచేస్తున్నారు. చంద్రబాబు హయం లో  రెండు పుష్కరాలలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో లెక్కేలేదు....ఇప్పుడు అక్కడ ఘాట్లు ఉన్నాయా...ఆ ఘాట్లకు మెట్లు ఉన్నాయా," అంటూ హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. " పుష్కరాలు చేశారు...అక్కడ మీరు వీడియో షూటింగ్ చేశారు.ఆ వీడియో షూటింగ్ వల్ల ఎంతో మంది చనిపోయారు.దాని గురించి మీకు మనస్సాక్షి లేదా.దానిని కూడా మేం యాక్సిడెంట్ గానే చూశాం.మానవత్వ కోణంలో చూశాం.ఎక్కడైతే తప్పు జరిగిందో దానిని సరిదిద్దండి అని చెప్పాం. కాని మీరు ఈరోజు ఏం చేస్తున్నారు...కరోనా వైరస్ ముస్లిం సమాజం తీసుకుని వచ్చింది...ముస్లిం సమాజం మొత్తం ఒక సూసైడ్ బాంబర్స్ లెక్క.వైరస్ అంటించుకుని, పూసుకుని వారికి ప్రాణాలపైన ఏమీ ప్రేమలేదు....వారి కుటుంబసభ్యులపైన ఏమీ ప్రేమలేదు....వారు చావడానికి,కొంతమందిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చిత్రీకరించడం చాలా బాధాకరం. ఈరోజు మీ లోకేష్ బాబు, కొడుకుతో సైకిల్ తొక్కుకుంటూ, ఏసి ఇళ్లలో ఉంటూ ట్వీట్లతో పనిచేస్తున్నారు.మీ ఎంఎల్ ఏలు ఇళ్లకు పరిమితమయ్యారు.ప్రజలకు సేవచేయడం గాని,ప్రజలపైన దృష్టిగాని పెట్టలేదు. కాని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం,అధికారులు,ఎంఎల్ ఏలు రోడ్లపైకి వచ్చి ప్రజలను ఆ దుకుంటూ వారికి ధైర్యం ఇస్తూ మేం పనిచేస్తున్నాం.భూమాఅఖిలప్రియగారు...మీ ఆళ్లగడ్డనుంచి కొందరు  మా రాయలసీమ యూనివర్శిటికి వచ్చి భయాంధోళనలో ఉండి వారు బాధపడుతుంటే...నా ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వారికి కరోనా లక్షణాలు ఉండచ్చు అని తెలిసి కూడా వారికి ధైర్యం ఇచ్చాను. భరోసా ఇచ్చాను.ప్రపంచం అంతా కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతుంటే చంద్రబాబు వారికి కావాల్సిన ఎల్లోమీడియా...వారి సోషల్ మీడియా,టిడిపి రాజకీయనిరుద్యోగులు  ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారుని హఫీజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిల్లర రాజకీయాలు ఆపకపోతే, ప్రజలు తిరగబడతారు: పవన్ కళ్యాణ్ 

ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని పాలక వై ఎస్ ఆర్ సి పి కి, జన సేన చీఫ్ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనా కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెడుతున్నారని, ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ ను సైతం విడిచిపెట్టలేదని, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్  కేసులు చూసి బెంబేలెత్తిపోతున్నారని, ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.  " బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారిపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి. ఆయనపై జరుగుతున్న  వ్యక్తిత్వహనన దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో ఉంది...కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదాం చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం," అని పాలక వై ఎస్ ఆర్ సి పి కి పవన్ కళ్యాణ్ హితవు చెప్పారు. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై  మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామనీ, ఇప్పటివరకు అయినది చాలు. ఈ సమయంలోనైనా  రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందనీ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

సి.ఎం కు వర్మ విస్కీ ఛాలెంజ్..!

లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్ లు లేక ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. వీరు కాలక్షేపం కోసం ఒకరికి మరొకరు వింత వింత ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. ఇప్పుడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వింత ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ గారు ఒక గ్లాస్ విస్కీని టీవీ లో అందరికి కనిపించేలా తాగాలన్నారు. మద్యం దొరకక మందు బాబులు అల్లాడుతున్నారని వారి ముందు విస్కీ తాగి వాళ్లకు షాక్ ఇవ్వాలన్నారు. ఆ వీడియో చూసి కరోనా వైరస్ గురించి ప్రజలు కొద్దిసేపు మర్చిపోయి హ్యాపీగా ఉంటారన్నారు.

తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్‌ను నిలిపివేస్తున్నాం! ట్రంప్‌

ట్రంప్ మ‌రో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కరోనాతో చనిపోతుంటే క‌రోనా క‌ట్ట‌డి మీద కాకుండా అమెరికా ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు ట్రంప్. మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు ట్రంప్ రాజకీయ ఎత్తుగడలు వేసే పనిలో బిజీ అవుతున్నారు. అందులో భాగంగానే ఇమ్మిగ్రేషన్ రూల్స్ కఠినతరం చేస్తానని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచదేశాలు తీవ్రంగా తప్పుపట్టాయి. అమెరికాకు ఇతర దేశాల నుంచి ప్రజలు వలస రాకుండా రూల్స్ మార్చేస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 24 గంటలు తిరగక ముందే మాటమార్చారు. వలసలపై నిషేధాన్ని 60 రోజులకు మాత్రమే పరిమితం చేస్తానని ప్రకటించారు. కరోనా దెబ్బ‌తో ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఉన్న ఉద్యోగాల్ని విదేశీ వలసదారులు లాగేసుకోకుండా... స్థానికులకే దక్కేందుకు ఈ 60 రోజుల వల‌స‌వాదుల నిషేధాన్ని అమలుచేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటన వల్ల అమెరికాలో శాశ్వతంగా ఉండాలనుకునే వారు (గ్రీన్ కార్డు దారులు) ఇబ్బందుల్లో పడినట్లే... ట్రంప్ రూల్ అమల్లోకి రాగానే... వారు 60 రోజులపాటూ శాశ్వతంగా ఉండేందుకు అప్లై చేసుకోవడానికి వీలవ్వదు. 60 రోజుల తర్వాత ట్రంప్... ఆ నిషేధం కొనసాగిస్తారో లేక ఎత్తేస్తారో తెలియదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో... స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి కొత్త రూల్స్‌. ఈ సస్పెన్షన్ "నిరుద్యోగ అమెరికన్లను ఉద్యోగాల కోసం మొదటి స్థానంలో ఉంచుతుంది" అని ఆయన తన రోజువారీ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ విలేకరుల సమావేశంలో అన్నారు. అమెరికాలోకి "తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్‌ను నిలిపివేస్తాను" అని పేర్కొన్నారు. అయితే, తాత్కాలిక వీసాలపై ఉద్యోగాలు చేసుకునే విదేశీయులకు ఈ నిషేధం వర్తించదని ట్రంప్ స్పష్టత ఇచ్చారు.

ప్రభుత్వ భవనాలపై రంగుప‌డుతూనే వుంది!

ప్రపంచం మొత్తం కరోనాతో భయం భయం అంటుంటే ఏపిలో మాత్రం ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు రంగులు ఎలా వేయాల‌ని జ‌పం చేస్తున్నారు. కోర్టు చివాట్లు పెట్టిన లెక్క చేయ‌కుండా త‌మ ప‌ని తాము కానిస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయవద్దని హైకోర్టు ఆదేశించిన అప్పటికీ దానిని బేఖాతరు చేస్తూ కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఎస్.కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ భవనానికి వైసిపి నాయకులు, అధికారులు పూర్తిగా వైసిపి రంగులు అద్దారు. దీనిని స్థానికంగా ఉన్న గిరిజునులైన గ్రామస్తులు అడ్డుకోవడంతో రంగులు వేస్తున్న సిబ్బంది వెయ్యకుండానే వెనుతిరిగారు. గిరిజన గ్రామమైన  మూలబొడ్డవరలో గత ప్రభుత్వ హయాంలో 15 లక్షల రూపాయలతో పంచాయతీ భవనం నిర్మాణం జరిగింది. ఆ భవనాన్ని  ఆనుకొని సుజల స్రవంతి పథకం ద్వారా 40 లక్షల రూపాయలు ఖ‌ర్చు చేశారు. ఓ వైపు కరోనా తో ప్రపంచం మొత్తం అల్లాడుతుంటే వైసిపి ప్ర‌భుత్వం మాత్రం ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చడం పైనే దృష్టి పెట్ట‌డం స్థానికంగా కలకలం రేపుతుంది.

జియోలో ఫేస్‌బుక్ పెట్టుబ‌డి! 43 వేల కోట్ల రూపాయ‌ల డీల్‌!

ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ అయిన ఫేస్ బుక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్‌ఫామ్‌ల మధ్య పెద్ద ఒప్పందం కుదిరింది. జియో ప్లాట్‌ఫామ్‌లో 9.99 శాతం వాటా కోసం ఫేస్‌బుక్ రూ. 43,574 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ఒప్పందం కుదిరిన తరువాత ఫేస్ బుక్... జియోలో అతిపెద్ద వాటాదారుగా మారింది. ఫేస్‌బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్‌ఫామ్‌ల సంస్థ విలువ 4.62 లక్షల కోట్లకు పెరిగింది. భారతదేశంలో సాంకేతిక రంగంలో ఎఫ్‌డిఐ కింద ఇది అతిపెద్ద పెట్టుబడిగా నమోదయ్యింది.  కలిసి పని చేయాలనే జియో ప్లాట్‌ఫాంలో ఫేస్‌బుక్ పెట్టుబడి కోసం బైండింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.  ఈ డీల్ పైన ముఖేష్ అంబానీ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరి జీవితంలో నాణ్యత పెంచేలా, భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సమాజంగా నిలిపేలా జియోను తీసుకు వచ్చామని, ఇప్పుడు ఫేస్‌బుక్‌ను ఆహ్వానించామని చెప్పారు.  వ్యాపారం కోసం ఫేస్‌బుక్, జియో జత కట్టాయని, డిజిటల్ ఎకానమీకి తమ బంధం దోహదం చేస్తుందని మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.

ఏపీలో డోర్‌ డెలివరీ తూచ్‌..!

ప్ర‌జ‌లు రోజు ఆర్డర్లు పెడుతున్నారు. కానీ సరుకులు రావడం లేదు. ఫోన్‌ చేస్తే సమాధానం చెప్పేవారు లేరు. వాట్సాప్‌లో ప్రశ్నిస్తే ఉలుకూ పలుకూ లేదు. దీంతో బయటకు వెళ్లి తెచ్చుకోవాలన్నప్పటికి కిరాణం దుకాణాలు తెరవడం లేదు.  నిత్యావసర సరుకులు ప్రజలకు అందక ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. కనీసం గ్యాస్‌ సరాఫరా చేసే వాహానాలకు సైతం పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వడం లేదు. అనంత‌పురం పట్టణంలో సప్తగిరి కళాశాల వద్ద క్వారెంటైన్‌ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడికి సమీపంలోనే గ్యాస్‌ గోదాము ఉంది. పోలీసులు అక్కడా ప్రత్యేక చెక్‌ పోస్టును ఏర్పాటు కంచెను వేయడంతో గ్యాస్‌ వాహానాలు సైతం తిరగడానికి వీలు లేకుండా పోయింది. నిత్యావసర సరుకులు లేక పోయినా... కనీసం గంజి నీళ్లు చేసుకోవడానికి అవసరమైన గ్యాస్‌ సరాఫరాను సైతం పోలీసు అధికారులు అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తామని, ప్రజలు ఎవరూ ఇల్లు వదిలి బయటకు రావద్దని అధికారులు ప్రకటించారు. అవసరమయితే నిత్యావసర సరుకులు ఇంటికే అందిస్తామని చెప్పారు. కానీ దుకాణదారులు ఇంటికి వెళ్లి సరుకులు అందజేసేందుకు నిరాకరించారు. దీంతో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్నారు.  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాని ప్రాంతాల్లో ఉదయాన్నే స్థానిక దుకాణాల్లో సరుకులు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లితే పోలీసులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు కొడుతున్నారు. కనీసం ప్రధాన రహదారుల్లో ఉన్న నిత్యావసర సరుకుల దుకాణదారులు తమ షాపులను ఓపన్‌ చేస్తే అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో వారు సైతం తెరవడం లేదు.  లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చాక నిత్యావసరాల కొనుగోలు కోసం రోజూ ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ అనుమతి ఇచ్చారు. ఇంటికి ఒకరు మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధించారు.  అనంత‌పురం కలెక్టర్‌, జేసీ ప్రత్యేక కార్యచరణ చేపట్టారు. సూపర్‌ మార్కెట్‌, కిరాణ దుకాణదారుల యజమానులతో మాట్లాడి డోర్‌ డెలివరీకి ఒప్పించారు. పట్టణంలో 6 సుపర్‌ మార్కెట్‌, 45 హోల్‌సేల్‌ దుకాణదారులకు కలిపి 229 మందికి నిత్యావసర సరుకులు అందించాలని గుర్తింపు కార్డులు మున్సిపల్‌ శాఖ తరుపున సమావేశాన్ని ఏర్పాటు చేసుకోని అందించారు. వాట్సాప్‌లో ఆర్డర్‌ పంపిన 24 గంటల్లో సరుకులు ఇంటికి తెచ్చించేందుకు వారు ఒప్పుకున్నారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాలతో వాట్సాప్‌లో ఆర్డర్‌ తీసుకునేందుకు ముందుకు వచ్చిన దుకాణదారులు అమ‌లు చేయ‌డంలో చేతులెత్తేశారు. అధికారులు విడుదల చేసిన ఫోన్‌ నెంబర్లకు ఆర్డర్‌ పెట్టినా స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు.

ప్లాస్మా దానం చేయండి! తబ్లిగి జమాత్‌ చీఫ్ పిలుపు!

ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ బారినపడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తబ్లిగి జమాత్‌ చీఫ్ మౌలానా సాద్‌ కందల్వీ తన అనుచరులను కోరారు. కరోనాతో పోరాటం చేసేవారికి రక్తంలోని ప్లాస్మా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. తనతోపాటు మర్కజ్ ఇస్త‌మాకు హాజరైన కొంతమంది స్వీయ నిర్భందంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.   కరోనా నుంచి కోలుకున్నతబ్లిగి జమాత్ స‌భ్యులు తమవంతు సాయంగా ప్రస్తుతం వైరస్‌ బారినపడి పోరాడుతున్న వారికి.. రక్తంలోని ప్లాస్మాను దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఇంటి వద్దనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేయాలని ఆయ‌న కోరారు.  ఢిల్లీలోని నిజాముద్దీన్‌ తబ్లిగి జమాత్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మౌలానా సాద్ ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు.