తెలంగాణా జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్...

* గాంధీ ఆస్పత్రి లో ఎడ్మిట్ అయిన జోగులాంబ గద్వాల జిల్లా జర్నలిస్టు  * ఆయనతో సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్ కు తరలింపు  కరోనా జర్నలిస్టులను వణికిస్తుంది...మహరాష్ట్ర, చెన్నైలలో జర్నలిస్టులు కరోనా బారిన పడటం సంచలనం కలిగిస్తుంటే తాజాగా తెలంగాణాలోని ఓజర్నలిస్టు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ న్యూస్ చానల్ విలేఖరికి గురువారం నాడు కరోనా పాజిటివ్ గా తేలడంతో అతన్ని హుటాహుటిన గాంధీకి తరలించారు. అంతకు ముందే ఆయన కుటుంబంలో ఒకరికి పాజిటివ్ రాగ...తాజాగ సదరు విలేఖరికి పాజీటీవ్ రావడంతో జిల్లాలో కలకలం రేగింది. అతనితో సన్నిహితంగ ఉన్నవారిని క్వారంటైన్ చేశారు. గద్వాల జిల్లాలో కరోనా విజృభిస్తుండటంతో వైరస్ బారిన పడకుండ జర్నలిస్టులకు ఆయా పత్రికల యాజమాన్యాలు రక్షణ సౌ కర్యాలు  కల్పించాల్సిన బాధ్యత ఎంతైన ఉంది. తమిళనాడులో సన్ నెట్ వర్క్ తమ జర్నలిస్టులకు పీపీఈ కిట్లు అందించింది. ఇదే తరహలో తెలంగాణా మీడీయా సంస్థలు కూడ జర్నలిస్టులను కాపాడుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైన ఉంది. జర్నలిస్టులకు  కరోనా సోకిందనే వార్తల నేపథ్యంలో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

హోమ్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరు నెలల శిశువు!

బ్రహ్మం గారు బహుశా ఈ విషయం కూడా చెప్పే ఉంటారు, లేకపోతె, ఉత్తరాఖండ్ పోలీసులు ఎందుకలా చేస్తారు? ఆ రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘలనకు పాల్పడితే కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, పాలుతాగే పసికందులపైనా లాక్ డౌన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఉత్తరకాశీ జిల్లాలో 51 మందిపై హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేయగా, వారిలో 6 నెలల శిశువు, మూడేళ్ల వయసున్న చిన్నారులు కూడా ఉన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర అధికారులపై విమర్శలు వస్తున్నాయి. బాలనేరస్తుల చట్టం ప్రకారం 8 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలిచ్చామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లా కొవిడ్-19 అధికారిని తప్పించడంతో సహా ఇతర క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు.

మీడియాపై దాడులపై ట్విట్టర్ లో మండిపడ్డ లోకేష్

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలను, ఆరోపణలను ట్విట్టర్ వేదికగా సంధిస్తూనే ఉన్నారు.  సమస్యలు చెబుతున్న ప్రతిపక్షంపై, అలాగే, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న మీడియాపై ఎదురుదాడికి పాల్పడుతున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు. వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని అన్నారు. కాగా, పుచ్చకాయలు సాగు చేసే రైతుల కష్టాలకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. దీనిపై లోకేశ్ విమర్శలు చేస్తూ ఓ వీడియోను జతపరిచారు. దాని లింక్ ఈ దిగువన ఇస్తున్నాం:  https://twitter.com/naralokesh/status/1253653463566712834  

నిమ్మగడ్డ తొలగింపు‌పై ప్రభుత్వ అఫిడవిట్ లో కీలక అంశాలు ఇవే

* 2014లో 221 హింసాత్మక ఘటనలు జరిగితే 2020లో 88 ఘటనలు : ఎఫిడవిట్  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగించిన వ్యవహారం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.  ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లింది. తొలగింపు కారణాలపై తుది అఫిడవిట్‌ను ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.  కాగా.. ఇప్పటికే ప్రిలిమినరీ కౌంటర్‌ను ప్రభుత్వం దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో కీలకాంశాలివే.. రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించామని ప్రభుత్వం తెలిపింది. రిటైడ్ జడ్జీలను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా కోర్టుకు నిశితంగా వివరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా రూపొందిందించదని కోర్టు దృష్టికి సర్కార్ తీసుకెళ్లింది. అంతేకాదు.. మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఈసీల కాల పరిమితి వివరాలు కూడా ప్రభుత్వం వెల్లడించింది. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో 13 జిల్లాల్లో జరిగిన ఎన్నికల హింసకు సంబంధించిన వివరాలను సైతం కోర్టుకు వివరించింది.  2014లో 221 హింసాత్మక ఘటనలు జరిగితే 2020లో 88 ఘటనలు జరిగినట్టు వెల్లడించింది.  ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని అఫిడవిట్‌లో పేర్కొంది. పోలీసులు, పరిపాలన యంత్రాంగంపై నిమ్మగడ్డ చేసిన ఆరోపణలు కూడా తెలిపింది. క్షేత్ర స్థాయిలో అవాస్తవాలు తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారనే నిమ్మగడ్డ వేసిన పిటిషన్ అవాస్తవమని ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది.

తెలంగాణను ఒణికిస్తున్న ఆ మూడు జిల్లాలు: ఈటెల

తెలంగాణలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 983కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గడచిన ఇరవై నాలుగు గంటల్లో 13 కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసుల సంఖ్య 663కు చేరిందని చెప్పారు. ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 291 అని వివరించారు. ఈరోజు ‘కరోనా’ మరణాలు లేవని తెలిపారు. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల నుంచి ఎక్కు వ కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 44 కుటుంబాలు,  268 పాజిటివ్ కేసులు ఉన్నాయని తెలిపారు.గాంధీ ఆస్పత్రికి మరమ్మతులు నిర్వహించి కొవిడ్ ఆసుపత్రికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామని, సంపూర్ణ కొవిడ్ ఆస్పత్రిగా మార్చామని అన్నారు. ‘కరోనా’ పాజిటివ్ ఉన్నవారికి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు.

మీరు చేయలేదు కాబట్టి మేమూ చేయం: సజ్జల 

కరోనావైరస్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, ఎన్టీఆర్ ఎందుకు పెట్టారో తెలియదు కాని నిజంగా చంద్రబాబు వెన్నుపోటు దారుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై విష ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని,  తన ప్రచారం ద్వారా ప్రజలను చంద్రబాబు గందరగోళం పరుస్తున్నాడని, కరోనా కట్టడికి సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, వలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సర్వే చేయిస్తున్నారని, వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారని, చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చోని లేఖలు రాస్తున్నారని, కరోనా టెస్టులు చేయడంలో దేశం ప్రధమలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, ప్రభుత్వ కార్యక్రమాలపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డికి చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవడం తెలియదని ఆయన వివరించారు.  పుష్కరాల సమయంలో చంద్రబాబు వందల కోట్లు కాజేశారని, కరోనా కట్టడిలో అధికారులకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, గుజరాత్ నుంచి మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని, చంద్రబాబు తానే ఇంకా ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని, చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని, చంద్రబాబు సలహాలు ప్రభుత్వంకు అవసరం లేదని సజ్జల అన్నారు. " అఖిలపక్షం సమావేశం అడిగే అర్హత చంద్రబాబు కు లేదు. కరోనా పది రాజకీయ పార్టీలు సమావేశం పెట్టి చర్చించే అంశం కాదు..చంద్రబాబు ఎప్పుడైనా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారా..ప్రత్యేక హోదా మీద  అఖిలపక్షం ఏర్పాటు చేయమంటే చంద్రబాబు చేశారా," అంటూ సజ్జల నిలదీశారు. " జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళలేదు  అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆగుతారా," అంటూ సజ్జల ప్రశ్నించారు.

కరోనా నేపధ్యంలో ఏపీలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన రవాణాశాఖ

కేవలం నిత్యావసర, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తూ ఏపీ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక టీం లు ఏర్పాటు చేయటంతో పాటు, అతిక్రమించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయటానికి నిర్ణయం తీసుకుంది. అనుమతి తీసుకున్న అత్యవసరం కారుకు సైతం డ్రైవర్ కాకుండా ఒకరు మాత్రమే వెళ్ళే అవకాశం, ఆ ఒక్కరు కూడా వెనుక సీటులో నే ప్రయాణం చేయాలి అనే నిబంధన విధించింది. బైక్ పై ఒకరికి మాత్రమే అనుమతి, అలాగే అన్ని గూడ్స్ వాహనాలకు అనుమతి ఇవ్వాలని, ఖాళీ గూడ్స్ వాహనాలకు  ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.  గూడ్స్ వాహనాల  ఇబ్బంది ఉంటే రాష్ట్ర కంట్రోల్ రూం ని సంప్రదించాలని, లారీ ఓనర్స్ తో సమావేశం అయ్యి వారికి అవగాహన కల్పించాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.  హైవే పై ట్రక్ రిపేర్ షాపులు, డాబాలు, లేబర్ ట్రాన్స్పోర్ట్ లాంటి అంశాలు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని 1 శాతం హైపో క్లోరైట్ సొల్యూషన్ తో సాటిటైజ్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. ప్రతి వాహనానికి డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ అందిస్తామని కూడా వారు చెప్పారు.

2 లక్షల మందికి రెండుపూట్ల‌ భోజనం!

తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతి రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేష్ కుమార్ తో కలసి టోలిచౌకి లోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ జి.హెచ్.యం.సి, 9 మున్సిపల్ కార్పొరేషన్లలలో 300 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనాన్ని అందిస్తున్నమని మరో 50 కేంద్రాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉదయం 10.30 నుండి గంటన్నర పాటు , సాయంత్రం 5 గంటలకు మరోకసారి భోజనాన్ని అందించేలా వేళలు మార్చామని అన్నారు. ప్రతి రోజు దాదాపు 2 లక్షల మందికి భోజనం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువ సెంటర్లు పెంచటానికి సిద్దంగా ఉన్నామన్నారు. ప్రతి సర్కిల్ లో ఒక ప్రత్యేక వాహాన్నాన్ని సిద్ధంగా రేడిమేడ్ కుకుడ్ పుడ్ ను అవసరం ఉన్న చోటకు వెంటనే అందిచేలా చర్యలు తీసకున్నమ్నారు. ఎక్కడైన భోజనం అవసరం ఉంటే జి.హెచ్.యం.సి కాల్ సెంటర్ నెం.21111111 కాల్ చేయాలని కోరారు. జి.హెచ్.యం.సి ఆప్ ద్వారా కూడా ఆహారాన్ని కోరవచ్చు అన్నారు.  అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం అందించే విషయమై మున్సిపల్ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్ లతో ప్రతి రోజు సమీక్షిస్తున్నామని తెలిపారు.  భోజనం విషయమై ప్రభుత్వానికి తగు సహకారం అందించాలని అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సి.యస్ కోరారు. ఎక్కడైన సమస్య ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అన్నపూర్ణ క్యాంటిన్ ద్వారా భోజనం అందిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్వక్తం చేశారు.

హెలికాప్టర్ మనీ సాధ్యం కాదు! కిషన్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ కోరినట్టు హెలికాప్టర్ మనీ అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో ఓ రాష్ట్రం కోరితే ఇచ్చేది కాదని... అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు కలిసితీసుకోవలసిన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వుంది హెల్త్ ఎమర్జెన్సీ మాత్రమే. ఆర్థిక ఎమర్జెన్సీ కాదు. ఆ విష‌యం సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాల‌ని కిషన్ రెడ్డి అన్నారు.  జన సాంద్రత ఎక్కువ ఉన్న దేశాల్లోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయి. మనదేశంలో జనసాంద్రత ఎక్కువ కనుక మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ రాష్ట్రాల వారు తమ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలను రాష్ట్రాల్లోకి అనుమతించే పరిస్థితుల్లో లేరు. కాబ‌ట్టి ఏయే రాష్ట్రంలో ఉన్న ప్రజలు అక్కడే ఉండి సామాజిక దూరం పాటించాల‌ని కిష‌న్‌రెడ్డి  సూచించారు. మర్కజ్ సంఘటన వల్లే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని అన్నారు. ముంబైలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. మూడవ విడత లాక్ డౌన్ పొడిగింపు మే 3న ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.

ముస్లిం మ‌హిళాగా ఎమ్మెల్యే ర‌జ‌నీ! రంజాన్ సందేశం కోసం కొత్త గెట‌ప్‌!

చిల‌క‌లూరి పేట వైసీపీ ఎమ్మెల్యే ర‌జ‌నీ ప్ర‌చారం విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌ర‌ట‌! సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల రూపాయ‌లు ఇట్టే ఖ‌ర్చు పెట్టేస్తున్నారు మేడం. వీడియో సందేశాలు ఇవ్వ‌డం, ఫొటో స్టిల్స్ విష‌యంలో సినిమా వారికి ఏమాత్రం త‌గ్గ‌కుండా యాక్ట‌ర్‌ల‌తో పోటీ ప‌డుతూ ఎమ్మెల్యే ర‌జ‌నీ షూటింగ్‌ల‌లో బిజీగా వుంటున్నార‌ట‌.  చిల‌క‌లూరి పేట వైసీపీ ఎమ్మెల్యే ర‌జ‌నీ నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉంటారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల విషయంలో స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అప్ర‌మ‌త్త పెంచ‌డానికి త‌న దైన స్టైల్‌లో ఆమె వీడియో తీసి ప్ర‌చారం విస్తృతంగా చేస్తున్నారు.  శ‌నివారం నుండి రంజాన్ నెల ప్రారంభం అవుతుంది. రంజాన్‌ను దృష్టిలో పెట్టుకొని ముస్లింల‌ను ఉద్దేశించి ఆమె ప్ర‌త్యేక సందేశం ఇచ్చారు. క‌రోనా నేప‌థ్యంలో ఇంటి నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. అంతే కాదు మ‌సీదుల‌కు వెళ్ళ‌వ‌ద్ద‌ని, ఇఫ్తార్ స‌మ‌యంలో గుంపులుగా కూర్చొని తిన‌వ‌ద్దంటూ ముస్లింల‌ను ఎమ్మెల్యే ర‌జ‌నీ కోరారు.  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌రోనా నియంత్ర‌ణ‌కు విశేష‌కృషి చేస్తున్నార‌ని ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే త‌న నియోజ‌క‌వ‌ర్గ ముస్లింల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే రంజాన్ శుభాకాంక్ష‌లు తెల‌ప‌డానికి ఆమె ప్ర‌త్యేక వీడియో, ఫొటో షూట్ చేశారు. సినిమా న‌టుల్ని త‌ల‌పించేలా షూటింగ్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టి వీడియోలో క‌నిపించారు. సందేశం ఇచ్చేట‌ప్పుడు టీవీ యాంక‌ర్‌లా న‌టించారు. టీవీలో వార్త‌లు చ‌దివిన‌ట్లు క‌రోనా సందేశం, రంజాన్ సందేశాన్ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు వినిపించారు.  ఆ త‌రువాత ఫొటో షూట్‌లో ముస్లిం మ‌హిళ‌లా గెట‌ప్‌లో  క‌నిపించారు. చేతిలో ఓ పుస్త‌‌కం ప‌ట్టుకొని ఫొటో స్టిల్ ఇచ్చారు. ఈ వీడియో, ఫొటోల‌ను త‌న అనుచ‌రుల‌తో సోష‌ల్ మీడియాలో విసృత ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే మేడం ప్ర‌చారం విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌ర‌ని స్థానికంగా జ‌నం అనుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఇప్ప‌ట్టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కోసం 10 ల‌క్ష‌ల రూపాయ‌ల కంటే ఎక్కువే ఖ‌ర్చు పెట్టారు ర‌జ‌నీ మేడం.

చర్మంపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకినట్లే!

ఇప్ప‌ట్టి వ‌ర‌కు కరోనా లక్షణాల్లో జ్వరం, పొడి దగ్గు, అలసట, శ్లేష్మ దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, వికారం, ముక్కులో ఇబ్బంది, ముక్కు నుంచి నీరు కారడం, విరేచనాలు వంటివి ఉండగా.. తాజాగా మరో లక్షణాన్ని గుర్తించారు డాక్టర్లు. చర్మంపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకినట్లేనని చెబుతున్నారు.   ఇటాలియన్‌ స్టడీ ప్రకారం.. కరోనా వైరస్ సోకిన ప్రతి ఐదు మందిలో ఒకరికి చర్మ సంబంధ వ్యాధులు ఉన్నట్లు తేలింది. కరోనా బాధితులకు చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయని ఆ స్టడీ తెలిపింది. దీనికి సంబంధించి ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని డాక్టర్లు అంటున్నారు. ఒకవేళ దద్దుర్లు ఉండి జ్వరం, దగ్గు, నొప్పులు లేకుంటే వారు వైరల్ టెస్ట్‌ చేయించుకుంటే సరిపోతుందని డాక్టర్ మాయా వేదమూర్తి అన్నారు. ఈ వైరస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని అపోలో ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ చెప్పారు.  'ఇటలీలోని కరోనా బాధితుల్లో 20శాతం మందికి దద్దుర్లు ఉన్నాయి. అలాగే ఫిన్‌లాండ్‌, స్పెయిన్‌, అమెరికా, కెనడాలోని డాక్టర్లు సైతం కరోనా బాధితుల్లో ఎర్రటి పాచెస్‌, దురదలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఇక్కడి కరోనా బాధితుల్లో  పరిశోధనలు జరుగుతున్నాయి.  భారత్‌లో ఇలాంటి కేసులు ఇప్పటివరకు పెద్దగా నమోదుకాలేదు. ఇలాంటి దద్దుర్లు ఎక్కువగా కాలిపైనా, బ్రొటనవేలిపైనా.. ఒక్కొక్కసారి చేతులపైనా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

సర్పంచ్‌లతో ప్రధాని మోదీ ముచ్చ‌ట!

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా గ్రామస్వరాజ్ పోర్టల్ మొబైల్ ఆప్‌ను ప్రధాని అవిష్కరించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో అవగాహన బాధ్యత గ్రామ పంచాయితీలదేని ఆయనీ సందర్భంగా చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని కోరారు.  కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, మనం వెళ్లే దారిలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. ఈ సంక్షోభ సమయంలోనే ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని పిలుపునిచ్చారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే ముఖ్యమని అన్నారు. ప్రజలు బయటికి రాకుండా కరోనాను కట్టడి చేయాలని చెప్పారు.  మెరుగైన పనితీరు కలిగిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రధాని చెప్పారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. రహదారులు, విద్యుత్ సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.  లక్షకు పైగా పంచాయతీలు బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం అయ్యాయని గుర్తు చేశారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరుచుకోవాలని తెలిపారు. అటు ప్రధానితో పలువురు సర్పంచ్‌లు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నారు.

కరోనా వ్యాక్సిన్ తయారీ రేసులో హైద‌రాబాద్‌!

ప్రపంచ దేశాలను కకావికలం చేస్తున్న కరోనా వైరస్‌కు కట్టడి చేసే వ్యాక్సిన్ రూపకల్పనకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.  చైనా, అమెరికా, ఇజ్రాయెల్, క్యూబా, భార‌‌త‌ శాస్త్రవేత్తలు అహర్నిశలు వ్యాక్సిన్ త‌యారీకి శ్ర‌మిస్తున్నారు. క‌రోనా కట్టడికి వ్యాక్సిన్ కనుగొనే రేసులో భారత్ నుంచి ఆరు ఔషధ సంస్థలు బరిలో ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ నుంచే మూడు ఉండటం విశేషం. భారత్ నుంచి కరోనా టీకాల (వ్యాక్సిన్‌) తయారీకి ప్రయత్నిస్తున్న ఆరు ఔషధ సంస్థల్లో మూడు తెలంగాణవే కావడం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోని ఔషధ సంస్థలే ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా తయారీలో.. భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యూలాజికల్స్‌, బయోలాజికల్‌ ఇ, జిడస్ కాడిలా, మైన్‌వాక్స్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఆరు భారతీయ సంస్థలు బరిలో ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్ చేశారు.  అమితాబ్‌ కాంత్‌ ప్రస్తావించిన ఈ 6 సంస్థల్లో భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఇ, ఇండియన్‌ ఇమ్యూలాజికల్స్.. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్నాయంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘భారత్ ఇప్పటికే టీకాల తయారీలో ప్రపంచ స్థాయి కేంద్రంగా (గ్లోబల్ వ్యాక్సిన్ హబ్) ఉంది. భారత్ అతి తక్కువ ధరలకే టీకాను అందుబాటులోకి తీసుకురావాలి, ప్రపంచం నుంచి కరోనాను తరిమికొట్టాలి’ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆకాంక్షించారు.

చిరంజీవిగారు... మా సంసారంలో నిప్పులు పోయవద్దు! పీవీపీ ట్వీట్

ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ వంగా మ‌గ‌వారికి ‘బీ ద రియ‌ల్ మేన్‌’ అనే ఛాలెంజ్‌కు స్పంద‌న బాగా వ‌స్తుంది.  ఈ ఛాలెంజ్ ను సెలబ్రిటీలందరూ స్వీకరిస్తూ.. ఇంటిపనులు చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి వావ్.. అనే రేంజ్‌లో చేసి చూపించారు. ఈ వీడియోలో చిరు దోశ వేసిన తీరు ఔరా అనిపించేలా ఉంది. ఇప్పుడిదే వీడియోపై నిర్మాత పీవీపీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇలా చేసి మా సంసారంలో నిప్పులు పోయవద్దు అంటూ పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.  ‘‘చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు.. అంటూ పీవీపీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంట్లోని పనులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి ఈ ఛాలెంజ్‌కు కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు.  'బీ ద రియ‌ల్ మేన్‌' కు టాలీవుడ్ నటుల స్పందన ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ మొదలైన ఈ ఆన్ లైన్ చాలెంజ్ లో రాజమౌళి, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేశ్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. మరికొందరు సినీ స్టార్స్, రాజకీయ నాయకులకు దాన్ని పాస్ చేశారు.

అమెరికాలో పెరిగిపోతున్న‌ నిరుద్యోగం! 3.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు?

ప్ర‌స్తుతం అమెరికాలో వేలాదిగా కంపెనీలు మూతపడుతుండడంతో.. లక్షలాది మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా నిరుద్యోగుల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోగా.. తాజాగా మరో 44 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం పేరు నమోదు చేసుకున్నారు. కరోనా విలయం మొదలైన తర్వాత ఇప్పటివరకు సుమారు 2.60 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో అన్ని సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో అక్కడ 3.5కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రధానంగా హెచ్‌1బీ వీసాపై తాత్కాలికంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంపెనీలు ఆర్థికంగా కుంగిపోతుండటంతో తమ ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్న సందేహం భారతీయుల్లో నెలకొంది.

విశాఖ స్థలాలకు ఆ దేవుడే దిక్కు! 100 కోట్లు స్వాహా!

విశాఖపట్నంలో ‘పులివెందుల బృందం’ రెచ్చిపోతోంది. మర్రిపాలెంలో ఓ భూమిపై క‌న్ను ప‌డింది. అంతే యాజ‌మానిని క‌లిసి బేరం పెట్టారు. ఈ భూమి విషయంలో లొసుగులు ఉన్నాయి. వివాదం లేకుండా చేయాలంటే 10 కోట్లు ఇవ్వాలంటూ బేరం పెట్టారు. రూపాయి కూడా ఇవ్వబోమని, అంతా పక్కాగా ఉందని య‌జ‌మాని చెప్పాడు. వంద కోట్ల భూమి ఇది. ఈ ప్రభుత్వం మాది. మీ భూమి కేటాయింపును రద్దు చేయిస్తాం’ అని హెచ్చరించార‌ట‌. అంతే అనుకున్నంత ప‌ని చేశారు. భూ కేటాయింపును రద్దు చేసి, వెంట‌నే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ రెవెన్యూ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలోని మర్రిపాలెంలో జాతీయ రహదారిని ఆనుకొని సర్వే నంబరు 81/3 కొంత స్థలం ఉంది. అందులో కొంత భూమిని ప్రభుత్వం అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ కింద స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి భూ యజమానులకు ఒక వెసులుబాటు ఇచ్చింది. కావాలనుకుంటే మార్కెట్‌ ధర చెల్లించి భూమి తీసుకోవచ్చునని తెలిపింది. దీంతో ఆ భూమి యజమానులు జోస్యుల సత్యనారాయణదాసు, మరో 14 మంది వారసులు కలిసి భూమిని వెనక్కి ఇస్తే సొమ్ము చెల్లిస్తామని దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నడపడానికి ఓ వ్యక్తికి వారు జీపీఏ ఇచ్చారు. అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తరువాత 2009లో ఈ కుటుంబానికి 17,135 చదరపు మీటర్ల స్థలాన్ని వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ భూమిని వారి నుంచి కాట్రగడ్డ లలితేశ్‌ అనేవ్యక్తి కొనుగోలు చేశారు. లలితేశ్‌. సామాన్యుడేం కాదు. లలితేశ్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అమెరికాలో గూగుల్‌ కంపెనీలో కీలకంగా పనిచేసేవారు. ఆయన ప్రధానికి సాంకేతిక సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్‌ సోకిన వారిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్రం రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌ రూపకల్పనలోనూ లలితేశ్‌ కీలక పాత్ర పోషించారు. క‌డ‌ప బ్యాచ్ డిమాండ్‌ చేసిన మొత్తం ఇవ్వనందుకే రూ.100 కోట్ల విలువైన భూమిని వెనక్కిలాక్కున్నారు. పారిశ్రామికవేత్తలను డబ్బుల కోసం బ్లాక్‌ మెయిల్‌ చేస్తే.. విశాఖపట్నానికి పెట్టుబడిదారులు ఎలా వస్తారు. ప్రధాని సలహదారుడి కె దిక్కు లేదు ఈ రాష్ట్రంలో. పులివెందుల ముఠా విశాఖలో ఆడిన ఆటకు 100 కోట్లు స్వాహా అయ్యాయి. విశాఖ వాసుల్లారా ఇక మీ స్థలాలకు ఆ దేవుడే దిక్కు. ఇక నుంచి లెజెండ్ సినిమా మాదిరే మీ బతుకు.

ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం ఏపీ కి ఇంకా అనుమతి రాలేదు

ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం ఇంకా అనుమతులు రాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం లోని 181 క్లస్టర్లు 103 మండలాల్లో ఉన్నాయనీ, అందులో 56 రెడ్, 47 ఆరెంజ్, 573 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని చెప్పారు. అత్యధిక కేసులు నాలుగు జిల్లాలో ఉన్నాయని, టెస్టింగ్ కెపాసిటీ గణనీయంగా పెంచామని, ఈరోజు వరకు 48 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం 9 ల్యాబ్స్ పని చేస్తున్నాయని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 225 ట్రూ నాట్ మిషన్ లు 49 ల్యాబ్స్ ఉన్నాయని, మొత్తం రోజుకు 6980 యాంటీ జెన్ టెస్ట్ లు చేసే సామర్ధ్యం ఉందని పేర్కొన్నారు.  ప్రతి పది లక్షల మందికి 961 పరీక్షలు చేస్తున్నామన్నారు.కర్నూల్ ఆసుపత్రిని కూడా కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నారు.  " పేషంట్ మేనేజ్మెంట్ కు ప్రత్యేక అప్లికేషన్ పెట్టాం. ప్రతి హాస్పిటల్ నుండి కంట్రోల్ రూం కి వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం. టెలి మేడిసిన్ లో ఇప్పటికి 306 మంది డాక్టర్ లు వాలెంట్రీగా సేవ చేస్తున్నారు . 4,000 పైగా కన్సల్టేషన్ లు జరిపాం. కొత్తగా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాం. పిపిఈ లు 3 లక్షల పైగా ఉన్నాయి. 1.4 లక్షల N95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల పంపిణీ చేస్తున్నాం. ఆక్సిజన్ సప్లై పైన దృష్టి పెట్టాం .... ఆక్సిజన్ సప్లై లైన్ లు కొత్తగా వేస్తున్నాం," అని ఆయన వివరించారు. ర్యాపిడ్ కిట్స్ పై నిన్న సాయంత్రం ఐ సి ఎం ఆర్ నుండి పెర్మిషన్ వచ్చిందని, ర్యాపిడ్ టెస్ట్ లో.పాజిటివ్ వస్తే ఆర్సీపీటీఆర్ ద్వారా ఫైనల్ నిర్ధారణ చేస్తున్నామని చెప్పారు. " ర్యాపిడ్ టెస్ట్ కేవలం కమ్యూనిటీ టెస్టింగ్ కోసమే..పూర్తిగా ర్యాపిడ్ కిట్స్ పైనే డిపెండ్ అయ్యి లేము..కరోనా 14 లేదా.. 28 రోజులా అనేది ఇంకా స్పష్టత రాలేదు..కొన్ని కేసులు 14 నుండి 28 రోజుల మధ్యలో కూడా బయటపడుతున్నాయి," అని కూడా జవహర్ రెడ్డి చెప్పారు.

ఫేస్ బుక్ ను జయించిన మోడీ 'ఆరోగ్యసేతు' యాప్

ఏ యాప్ అయినా పాప్యులర్ కావాలంటే ఇండియాలో గుర్తింపు పొందాలి. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో పాప్యులర్ అయితేనే ఏ యాప్ అయినా టాప్ లెవెల్ కు వెళ్తుంది. ఫేస్ బుక్, వాట్సాప్ తదితర యాప్ లన్నీ ఇండియాలో పాప్యులర్ అయినవే. అయితే, ఈ యాప్ లు అన్నింటినీ భారతీయ యాప్ 'ఆరోగ్యసేతు' అధిగమించింది. ఫేస్ బుక్ యాప్ కు 5 కోట్ల మంది యూజర్లు యాడ్ కావడానికి 19 రోజుల సమయం పట్టింది. అలాంటిది కేవలం 13 రోజుల్లోనే ఆరోగ్యసేతు యాప్ 5 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. తద్వారా అతి తక్కువ రోజుల్లో 5 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకున్న యాప్ గా ప్రపంచ రికార్డును సృష్టించింది. ఈ నెల 14వ తేదీన ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రస్తంగిస్తూ... ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో యాప్ లో ఇచ్చే సూచనల మేరకు అందరూ నడుచుకోవాలని చెప్పారు. దీంతో, అతి తక్కువ సమయంలోనే 5 కోట్ల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.