తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్‌ను నిలిపివేస్తున్నాం! ట్రంప్
posted on Apr 22, 2020 @ 1:25PM
ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కరోనాతో చనిపోతుంటే కరోనా కట్టడి మీద కాకుండా అమెరికా ఎన్నికలపై దృష్టి పెట్టారు ట్రంప్. మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు ట్రంప్ రాజకీయ ఎత్తుగడలు వేసే పనిలో బిజీ అవుతున్నారు. అందులో భాగంగానే ఇమ్మిగ్రేషన్ రూల్స్ కఠినతరం చేస్తానని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచదేశాలు తీవ్రంగా తప్పుపట్టాయి.
అమెరికాకు ఇతర దేశాల నుంచి ప్రజలు వలస రాకుండా రూల్స్ మార్చేస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 24 గంటలు తిరగక ముందే మాటమార్చారు. వలసలపై నిషేధాన్ని 60 రోజులకు మాత్రమే పరిమితం చేస్తానని ప్రకటించారు.
కరోనా దెబ్బతో ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఉన్న ఉద్యోగాల్ని విదేశీ వలసదారులు లాగేసుకోకుండా... స్థానికులకే దక్కేందుకు ఈ 60 రోజుల వలసవాదుల నిషేధాన్ని అమలుచేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ ప్రకటన వల్ల అమెరికాలో శాశ్వతంగా ఉండాలనుకునే వారు (గ్రీన్ కార్డు దారులు) ఇబ్బందుల్లో పడినట్లే... ట్రంప్ రూల్ అమల్లోకి రాగానే... వారు 60 రోజులపాటూ శాశ్వతంగా ఉండేందుకు అప్లై చేసుకోవడానికి వీలవ్వదు. 60 రోజుల తర్వాత ట్రంప్... ఆ నిషేధం కొనసాగిస్తారో లేక ఎత్తేస్తారో తెలియదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో... స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి కొత్త రూల్స్.
ఈ సస్పెన్షన్ "నిరుద్యోగ అమెరికన్లను ఉద్యోగాల కోసం మొదటి స్థానంలో ఉంచుతుంది" అని ఆయన తన రోజువారీ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ విలేకరుల సమావేశంలో అన్నారు. అమెరికాలోకి "తాత్కాలికంగా ఇమ్మిగ్రేషన్‌ను నిలిపివేస్తాను" అని పేర్కొన్నారు. అయితే, తాత్కాలిక వీసాలపై ఉద్యోగాలు చేసుకునే విదేశీయులకు ఈ నిషేధం వర్తించదని ట్రంప్ స్పష్టత ఇచ్చారు.