డాక్టర్‌ను కబళించిన కరోనా!
posted on Apr 23, 2020 @ 11:37AM
కరోనా వైరస్ పంజా విసురుతున్న తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే వైరస్ బారినపడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. నిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటికే ఐదుగురు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా వైరస్ సోకింది. కరోనా సోకిన ఓ మహిళకు చికిత్స అందించడం కారణంగా వీరంతా వైరస్ బారినపడ్డారు. అనంతరం ఆ మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరణించిన తర్వాత కరోనాగా నిర్ధారణ అయ్యింది. గత నెలలో దోమల్‌గూడలో ఇద్దరు వైద్యులు కరోనా వైరస్ బారినపడ్డారు.
హైదరాబాద్‌లోని ఆగపురాలో కరోనా వైరస్‌తో ఓ వైద్యుడు మరణించాడు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరి ద్వారా కుటుంబంలో అందరికీ కరోనా సోకింది. వైద్యుడు కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందడం ఆందోళన కల్గిస్తోంది. నగరంలోని ఆగపురా ప్రాంతంలో ఓ యునానీ వైద్యుడు (52) కరోనాతో గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. వైద్యుడి భార్య కూడా యునానీ వైద్యురాలే. ఇద్దరూ ఒకే చోట వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమెకు కూడా వైరస్ సోకింది. వీరి ద్వారా కుటుంబంలోని వారందరూ కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
ఏప్రిల్ 5న వైద్యుడు అనారోగ్యానికి గురయ్యాడు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యుడి ద్వారా అతడి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలకు కూడా కరోనా సోకింది. వారందరినీ గాంధీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుడి మృతితో తెలంగాణాలో కరోనా మరణాల సంఖ్య 24కు చేరుకుంది.