జనవరి నుంచి జూన్ వరకూ డీ.ఏ. బకాయిల చెల్లింపు ఉండదు

కరోనా పై పోరుకు కేంద్రం నిధులు సమకూర్చుకుంటోంది. ఏ అవకాశాన్ని వదులుకోకుండా నిధులను ఆదా చేస్తున్న కేంద్రం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపును నిలుపుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 2021 వరకు పెంచిన డీఏ పెంపు నిలుపుదల, అలాగే 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిల చెల్లింపు కూడా ఉండదు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డీఏ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.  గత నెల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ను 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతూ తీసుకున్ననిర్ణయాన్ని కూడా కేంద్రం పునస్సమీక్షించింది. గత నెల పెంచిన 4 శాతం డీఏ పెంపును కూడా కేంద్రం నిలుపుదల చేసింది. ఇది 54 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు,65 లక్షల పెన్షనర్ల పై ప్రభావం చూపుతుంది. కేంద్రం నిర్ణయం ద్వారా 14595 కోట్లు ఆదా అవుతుంది. దేశంలో కరోనా పై పోరు కోసం ఖర్చులు,అదనపు నిధుల కేటాయింపులను కేంద్రం తగ్గిస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని,కేంద్రమంత్రులు, ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఓపక్క నిధులు సమకూర్చుకుంటు మరో పక్క ప్రజా సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తున్న కేంద్రం, లాక్‌డౌన్ ప్యాకేజి నిధులను విడతల వారిగా విడుదల చేస్తోంది. 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందుతోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద రూ. 31,235 కోట్లు, 20 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లు నిధులు , 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు, పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లు రూపాయలు, 68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ. 162 కోట్లు నిధులు ఉంది.

పుస్తకాలు, స్టేషనరీ షాపులు, ఎలక్ట్రికల్‌ దుకాణాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ కాలంలో దేశ ప్రజలకు స్వల్ప ఊరటనిచ్చింది. లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్‌ ప్రాంతాల్లోని నాన్‌ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో పలు మినహాయింపులు ఇచ్చింది. మొబైల్‌ రిచార్జ్‌, సిమెంట్‌, పుస్తకాల షాపులు వంటి వాటికి కేంద్రం లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు కల్పించింది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేవుని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు. గ్రామీణ ఆర్ఠిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశంలో వైద్య సిబ్బందికి పూర్తి భద్రతను కల్పిస్తామన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా నోడల్‌ అధికారులను నియమిస్తామని తెలిపారు. వీటికే మినహాయింపులు..పుస్తకాలు, స్టేషనరీ షాపులు, నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్‌ షాపులు, మొబైల్‌ రిచార్జ్‌ షాపులు, ఆటా కంపెనీలు, రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత, ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్‌ దుకాణాలు, సిమెంట్‌ విక్రయాలకు అనుమతి, పిండి మిల్లులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించింది.

త్రైమాసిక ఫీజు మాత్రమే వసూలు చేయాలి

స్కూళ్లకి, కాలేజీలకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్ అడ్మిషన్స్ సమయంలో కేవలం ఒక త్రైమాసిక ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది ఫిక్స్ చేసిన ఫీజుల ఆధారంగానే మొదటి త్రైమాసిక ఫీజుల వసూలు చేయాలని తెలిపింది. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు స్కూళ్లు, కాలేజీల ఫీజులను చెల్లించేందుకు ఇన్‌స్టాల్మెంట్స్ సదుపాయం కల్పించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. మొదటి త్రైమాసిక ఫీజు రెండు విడతలగా కట్టించుకోవలని సూచన చేసింది. అలాగే రెండు విడతలకు కనీసం 45 రోజుల వ్యవధి ఇవ్వాలని ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేశాయి.

మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ను ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్ 

దేశంలోనే మొట్టమొదటి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను హైదరాబాద్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, సంతోష్‌ గంగ్వార్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ డీఆర్‌డీవో అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా పరీక్షలతో పాటు వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీకోసం ఈ ల్యాబ్‌ను ఉపయోగించనున్నారు. ఐ క్లీన్‌, ఐ సేఫ్‌ సంస్థల సహకారంతో బయో సేఫ్టీ లెవెల్‌-3 ల్యాబ్‌ను డీఆర్‌డీవో తయారు చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు భారీ కంటైనర్లలో 15 రోజుల్లోనే దీన్ని రూపొందించారు. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో ఇలాంటి ల్యాబ్‌ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్‌-19 చికిత్స కోసం రాష్ట్రంలో 8 ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

జ‌గ‌న్ బాధితుల‌కు షా ఆశ్ర‌యం!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద చాడీలు విన‌డానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఉన్న‌తాధికారులు ఎవ‌రైనా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాధితులుంటే వారికి ఉన్న‌త ప‌ద‌వులు ద‌క్క‌డం ఖ‌యం. అయితే అమిత్ షాకు జ‌‌గ‌న్ బాధితుడ‌నే న‌మ్మ‌కం కుద‌రాలి అంతే.  ఈ లెక్క‌లోనే జాస్తి కృష్ణకిషోర్ కూడా వ‌స్తారు. జగన్ వద్దన్న జాస్తి కృష్ణకిషోర్ కు కేంద్రం ఆయ‌న్ను ఆదాయపు పన్ను శాఖ ఛీఫ్ కమిషనర్ పదవి నుంచి ప్రిన్సిపల్ ఛీఫ్ కమిషనర్ గా నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అస‌లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఎందుకు ఇరిటేష‌న్ వుంది. దానికి పెద్ద కార‌ణం వుంద‌ని గ‌తంలోనూ వార్త‌లొచ్చాయి. అమిత్‌షా ఇగోను జ‌గ‌న్ హ‌ర్ట్ చేశార‌ట‌. అది ఎలా అంటే... అప్ప‌ట్లో సీబీఐలో ఉన్న‌తాధికారులు ప‌ర‌స్ప‌రం కేసులు పెట్టుకొని బ‌జార్న ప‌డ్డారు.  ఆ పంచాయితీలో మ‌నీష్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి కేంద్ర బిందువుగా మారి కోర్టుకు ఓ కీల‌క లేఖ స‌మ‌ర్పించారు. ఆ తరువాత సుప్రీం ఉత్త‌ర్వుల‌తో అమిత్‌షా త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన ఆస్తానా ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింద‌ట‌. కార‌ణం ఏమంటే మ‌నీష్ కుమార్ సిన్హా. అందుకే ఆ అధికారి అంటే అమిత్ షాకు ఇప్ప‌ట్టికీ అయిష్టమే కాదు కోపం.   ఆ అధికారి కేంద్రం నుంచి ఏపీ స‌ర్వీసుకు తిరిగి రాగానే జ‌గ‌న్ ఏకంగా ఇంట‌లిజెన్స్ ఛీఫ్ ప‌ద‌వినిచ్చారు. అదీ అమిత్‌షాకు న‌చ్చ‌లేద‌ట‌. అధికారి మీద వున్నకోపం ఇప్ప‌డు జ‌గ‌న్ మీద  ఇలా ఎఫెక్ట్ చూపుతుంది. ఓ ద‌శ‌లో జ‌గ‌న్‌కు అమిత్‌షా ఈ కార‌ణంతోనే  అపాయింట్మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ట‌. అందుకే జ‌గ‌న్ కోరుకున్న డిప్యూటీష‌న్లేమీ ముందుకు క‌ద‌ల‌డం లేదు. పైగా జ‌గ‌న్ లూప్ లైన్‌లో పెట్టిన అధికారుల‌కు అమిత్‌షా భ‌రోసా ద‌క్కుతుంది. మంచి పోస్టులు కూడా ద‌క్కుతున్నా‌యి. జ‌గ‌న్‌కు అస‌లు అర్థం కాని కేర‌క్ట‌ర్ ఏమైనా ఉందీ అంటే అది అమిత్‌షా! అమిత్‌షా ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంటే కేర‌క్ట‌ర్ ఎవ‌రంటే జ‌గ‌న్‌. తెలంగాణ  ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మి.. వీరిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు డెప్యుటేషన్‌పై తీసుకురావాలని, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చాలాకాలం నుంచీ ప్రయత్నిస్తోంది. స్టీఫెన్ రవీంద్రను నిఘా దళపతి చేయాలన్నది జగన్మోహన్‌రెడ్డి కోరిక. గతంలో ఆయనకు రాష్ట్రంలో పనిచేసిన అనుభవం ఉండటం, ముక్కుసూటి అధికారి కావడమే దానికి కారణం.దానికోసం జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు చెవినిల్లుకట్టుకుని చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ అవి అమిత్‌షాకు వినిపించడం లేదు.     జగన్ అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయి జైలుశిక్ష కూడా అనుభవించిన శ్రీలక్ష్మి  మాత్రం పట్టువదలని విక్రమార్కిణి మాదిరిగా,  ఢిల్లీలో ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఆమె హైదరాబాద్‌లో కంటే ఢిల్లీ ఏపీభవన్, తెలంగాణభవన్‌లోనే దర్శనమిస్తుంటారు. ఆమెను ఎలాగైనా ఏపీకి తీసుకురావాలని ఎంపి విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. ఆమెను వెంటపెట్టుకుని హోంమంత్రి, పీఎంఓ కార్యాలయాలకు తీసుకువెళ్లిన ఫొటోలు మీడియాలో కూడా వచ్చాయి. కానీ డిఓపీటీ మాత్రం, వారిద్దరినీ ఏపీకి పంపించేందుకు ఇప్పటివరకూ సుముఖత చూపలేదు.  వారిని ఏపీకి పంపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధంగానే ఉన్నప్పటికీ, కేంద్రం మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదు. జగన్మోహన్‌రెడ్డితో కావలసిన కార్యాలు సాగిస్తున్నప్పటికీ, మోదీ సర్కారు ఈ విషయంలో మాత్రం ‘ఆ ఒక్కటీ తప్ప’ అని మెలికపెడుతోంది. దాదాపు ఏడాది నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడల్లా స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మితోపాటు కొత్తగా.. కర్నాటకు చెందిన మరో అధికారి శ్రీవత్సను తీసుకురావాలని కోరుతున్న జగన్మోహన్‌రెడ్డికి, ఢిల్లీలో ఎందుకో వర్కవుట్ కావడం లేదు. కాగల కార్యం నెరవేర్చే గంధర్వుడు ఉన్నా ఎందుకో జగన్మోహన్‌రెడ్డి కోరిక మాత్రం కోరికగానే ఉండిపోయింది. కర్నాటక క్యాడర్‌కు చెందిన శ్రీవత్సను తీసుకువచ్చి, ఆయనకు టీటీడీ ఈఓ పదవి ఇవ్వాలన్న జగనన్న కోరిక కూడా నరేంద్ర భయ్యా నెరవేర్చడం లేదు.

జగన్ ఏపీకా? లేక తాడేపల్లికి ముఖ్యమంత్రా?

నాలుగు పదుల వయసున్న జగన్ నాలుగు అడుగులు కూడా కదల్లేని స్థితిలో ఉన్నారా? అంటూ తెలుగుదేశం పార్టీ విమ‌ర్శ‌లు చేస్తోంది. కరోనా నివారణకు కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో 7 పదుల  వయసున్న ముఖ్యమంత్రులే  స్వయంగా రంగం లోకి దిగి కరోనా నియంత్రణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటే, నాలుగు పదుల వయసున్న జగన్ మోహన్ రెడ్డి నాలుగు అడుగులు కదల్లేని స్థితి లో ఉన్నారా?   జగన్  ఇంటి నుంచి ఎందుకు బయటకు రావటం లేదు.  ఆయన రాష్ట్ర నికి ముఖ్యమంత్రా లేక తాడేపల్లి కి ముఖ్యమంత్రా? ప్రజలకు ముఖ్యమంత్రా? ప్యాలెస్ కి ముఖ్యమంత్రా?   ఇంట్లో దొంగలు పడితే..ఇంటి ఓనర్ ఇళయరాజా సంగీతం వింటూ పడుకున్నట్లు, రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంటే జగన్ మాత్రం ఏమీ పట్ట నట్లు ఇంట్లో కూర్చున్నారు.  ముఖ్యమంత్రి కరోనాకి భయపడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి పబ్జీ గేమ్ పై ఉన్న ఆసక్తి ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరం.  కరోనా నివారణలో వైసీపీ  పని తీరును చూసి జనం తిరగబడతారేమోనని  బయటకు రాలేకపోతున్నారా?  ఇప్పటికే తుగ్లక్ చర్యలకు దాదాపు  55 సార్లు న్యాయస్థానాలు మెట్టికాయలు వేసినందుకు  ప్రజలకు ముఖాన్ని చూపించలేకపోతున్నారా? పేరాసిట్మాల్, బ్లీ చింగ్ పౌడర్ తో పోయేదానికి తనంత మహిమాన్వితుడు బయటకు రావడం దేనికి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు కరోనాపై ప్రజలను నిత్యం చైతన్యపరుస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల కోసం రాజ్యాంగ ఉల్లంఘనలకు వెనకాడం లేదు. కోర్టులు ఆక్షేపిస్తున్నా అదే తోవలో ప్రయాణించాలని చూడటం జగన్ మూర్ఖత్వానికి  నిదర్శనం. కరోనా విపత్తు సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, పశ్చిమబెంగాల్  ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి వంటి వారు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ  ప్రజలకు ధైర్యాన్ని నింపుతున్నారు. బాధితులు, వలస కార్మికులు, రైతులు ఇతర వర్గాలవారి కష్టసుఖాలను నేరుగా తెలుసుకుంటూ ప్రభుత్వ యంత్రాగాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.   ఇంతటి ఘోరకలి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చలించకపోవడం తన అసమర్ధతను బయట పెడుతుంది.  కరోనా కట్టడి చర్యలను గాలికొదిలేసి రాజకీయ, సామాజిక ప్రత్యర్థులను  హింసించడం ఘోరం.  ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నా ఒకటే... జగన్ తాడేపల్లిలో తల దాచుకున్నా ఒక్కటే. ప్రజలకు భరోసా నింపాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం అయ్యారు. కాని చంద్రబాబు ప్రతి రోజూ కరోనా నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలను మేధావులు, డాక్టర్లతో చర్చించి ప్రజలకు ధైర్యాన్ని నింపుతున్నారు. దేశ, విదేశాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేంద్రం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  చర్చిస్తున్నారు.  సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు లేఖలు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలియ జేస్తూనే ఉన్నారు. కానీ వైకాపా నాయకులు దాన్ని రాజకీయానికి వాడుకోవడం సిగ్గుచేటు.  చంద్రబాబు ప్రజల బాగోగుల కోసం పరితపిస్తుంటే జగన్ మాత్రం ఎన్నికల కోసం రాజ్యాంగ ఉల్లాంఘనలు, కోర్ట్ ధికారానికి దిగటం దౌర్భాగ్యం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు 14 రోజులు క్వారంటైంలో ఉండాలి. అలాంటి నిబంధనలు విజయసాయిరెడ్డి, మంత్రులకు పట్టవా? అంటూ కళా వెంకట్రావ్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

సూర్యాపేటలో అష్టాచెమ్మ ఆడింది! 31 మందికి అంటించింది..

లాక్‌డౌన్ ప్రభావంతో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. బోర్ కొట్టడంతో చాలా మంది సంప్రదాయ ఆటలైన అష్టాచెమ్మ, వైకుంఠపాళీ, పులి-మేక, వామనగుండ్లు(ఒనగండ్లు), చెస్‌, క్యారమ్స్‌ లాంటి ఆటలతో కాలాన్ని గడిపేస్తున్నారు. ఓ మహిళ కూడా బోర్ కొట్టడంతో అష్టాచెమ్మ ఆడదామని పక్కింటికి వెళ్లింది. అలా కొన్ని ఇళ్లు తిరిగిందామె. అయితే ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి ద్వారా అప్పటికే ఆమెకు కరోనా సోకింది. అలా.. ఆమె వల్ల పక్కింటి వాళ్లకు.. మొత్తం 31 మందికి కరోనా వ్యాప్తి చెందింది. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేటలో చోటుచేసుకుంది. దీంతో అధికారులు అందర్నీ క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధ‌వారం సూర్యాపేటలో తాజాగా మరో మూడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83కు చేరుకుంది.

భారీగా పెరిగిన రిలయన్స్ సంపద!

ఫేస్ బుక్-రిలయన్స్ జియో మధ్య భారీ డీల్ కుదిరిన నేపథ్యంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ నిన్న ఏకంగా 10 శాతం వరకు పెరిగింది. చైనా ఈకామర్స్ సంస్థ 'అలీబాబా' అధినేత జాక్ మాను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి అధిగమించారు. దీంతో, ముఖేశ్ సంపద విలువ నిన్న ఒక్కరోజే 4.7 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ క్రమంలో, ఆయన సంపద 49.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో, జాక్ మా సంపద కంటే 3.2 బిలయన్ డాలర్ల ఎక్కువ సంపదతో ముఖేశ్ మరోసారి ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా అవతరించారు. రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ రూ. 43,574 కోట్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇది దాదాపు 10 శాతం వాటాకు సమానం. మరోవైపు, ఫేస్ బుక్ తో డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేశ్ అంబానీని ప్రశంసిస్తున్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయనేదానికి ఇది నిదర్శనమని అంటున్నారు. కరోనా ఉపద్రవం ముగిసిన తర్వాత ప్రపంచ పెట్టుబడులకు భారత్ కేంద్ర స్థానం అవుతుందని ఆనంద్ మహీంద్రా అన్నారు.

సాయీ గారు... మాస్క్ ముక్కుకు పెట్టుకోవాలండీ: నాగబాబు సెటైర్

ఓ కార్యక్రమానికి మాస్క్ ధరించి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, నోటికి ధరించిన మాస్క్ ను తొలగించడంపై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "విజయ సాయి రెడ్డి మాస్క్ ముక్కు, నోటికి పెట్టుకోండి. గొంతుకి కాదు. ఒక వేళ మీరు అసిమ్టోమేటిక్ అయినా ప్రాబ్లెమ్ ఉండదు. మీ సెక్యురిటి కూడా మాస్క్ లు పెట్టుకున్నారు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త గా చూసుకోండి. ఫ్యూచర్ లో ఫైట్ చేసుకోవాలిగా మీతో. మీకు మాస్క్ వున్నా జనం గుర్తు పడతారు. నేను గారంటీ" అని అంటూ విజయసాయి మాస్క్ ను గొంతుకు వేసుకుని మాట్లాడుతున్న చిత్రాన్ని నాగబాబు జోడించారు.

వైర‌స్ ఇప్ప‌ట్లో త‌గ్గ‌దట‌! హెచ్చ‌రించిన డ‌బ్ల్యూహెచ్‌వో

క‌రోనా పెద్ద సినిమానే చూపిస్తుంద‌ట‌. ఇప్ప‌ట్లో అప్పుడే క‌రోనా వైర‌స్ క‌థ ముగిసిపోదు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ఈ క‌రోనాతో మ‌న‌తో చాలా కాలం స‌హ‌జీవనం చేయాల్సి వుంది. వైర‌స్‌తో మ‌నం ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్ తెలిపారు. చాలా వ‌ర‌కు దేశాలు ఇంకా తొలి ద‌శ‌లోనే ఉన్నాయ‌న్నారు.  వైర‌స్‌ను కంట్రోల్ చేశామ‌ని చెబుతున్న కొన్ని దేశాల్లో మ‌ళ్లీ కొత్త‌గా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆఫ్రికాలో ఇప్పుడిప్పుడే కేసులు అధిక‌మ‌వుతున్నాయ‌న్నారు. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య ల‌క్షా 80 వేలు దాటింది.  ప‌శ్చిమ యూరోప్‌లో మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు టెడ్రోస్ చెప్పారు. ప్ర‌స్తుత ద‌శ‌లో ఎవ‌రూ ఎటువంటి పొర‌పాట్లు చేయ‌కూడ‌ద‌న్నారు.  ఈ వైర‌స్ మ‌న‌తో చాలా కాలం స‌హ‌జీవనం చేయ‌నుందని ఆయ‌న హెచ్చ‌రించారు.  జ‌న‌వ‌రి 30వ తేదీన గ్లోబ‌ల్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన‌ట్లు టెడ్రోస్ గుర్తు చేశారు. డ‌బ్ల్యూహెచ్‌వోపై అమెరికా ఆరోప‌ణ‌లు చేస్తున్నా.. తాను మాత్రం రాజీనామా చేసేది లేద‌ని టెడ్రోస్‌ తెలిపారు.  డ‌బ్ల్యూహెచ్‌వోకు మ‌ళ్లీ అమెరికా నిధులు ఇస్తుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఇది ముఖ్య‌మైన పెట్టుబ‌డిగా అమెరికా భావిస్తుంద‌ని అనుకుంటాన‌న్నారు. అలా చేయ‌డం వ‌ల్ల ఇత‌రుల‌ను ఆదుకోవ‌డ‌మే కాదు, అమెరికా కూడా సుర‌క్షితంగా ఉంటుంద‌న్నారు. ఫండింగ్ విష‌యంలో అమెరికా మ‌ళ్లీ పున‌ర్ ఆలోచించాల‌ని టెడ్రోస్ కోరారు.

300 కోట్ల ఆదాయం గోవిందా... గోవిందా....!!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాల పవిత్ర స్థలాలపై తీవ్రంగా పడింది. తిరుమల, వాటికన్ సిటీ, మక్కా తదితర ప్రఖ్యాత ఆథ్యాత్మిక కేంద్రాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఏడుకొండలు బోసి పోయాయి. దీంతో టీటీడీ భారీ ఆదాయాన్ని కోల్పోయింది. టికెట్లు, హుండీ, వసతి గదులు, ప్రసాదం, తలనీలాలు, దుకాణాలు, హోటళ్లు తదితర రూపాల్లో వచ్చే ఆదాయం మొత్తం ఆగిపోయింది. మొత్తం రూ. 300 కోట్ల ఆదాయం కోల్పోయింది. కేవలం హుండీ ఆదాయమే రూ. 100 కోట్లకు పైగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో టీటీడీ 2020-21 వార్షిక బడ్జెట్ అంచనాలు మారిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మే 3 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే టీటీడీ ఆదాయం భారీగా తగ్గిపోనుంది.

బిజేపి సీనియర్ నేతలకు స్వయంగా ఫోన్ చేసిన ప్రధాని!

తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు చంపుపట్ల జంగారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి లకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. వారితో పాటు సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కేరళ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావుతో కూడా ప్రధాని మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. 70 సంవత్సరాలకు పైబడిన ఐదుగురు నేతలకు ప్రధాని స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారని ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు వెల్లడించారు. అంతకు ముందే పీఎంఓ అధికారులు కాల్ చేసి, ఫోన్ నంబర్లను అడిగారని ఆయన తెలిపారు. ఇక, మోదీ తనకు కాల్ చేయడంపై జంగారెడ్డి స్పందించారు. నరేంద్ర మోదీ నుంచి తనకు ఫోన్ కాల్ వస్తుందని ఎంతమాత్రమూ ఊహించలేదని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీకి లోక్ సభలో ఇద్దరే ఇద్దరు సభ్యులున్న వేళ, వారిలో జంగారెడ్డి కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మోదీ ప్రస్తావించారని తెలిపారు. తాను ప్రజలకు బాగా సేవ చేశానని మోదీ కితాబిచ్చారని, ఆయన ఫోన్ తో తనకెంతో సంతోషం కలిగిందని అన్నారు.

రైతన్నలు కన్నీరు పెడుతున్నారు? మొద్దు నిద్రలో ప్ర‌భుత్వం!

'ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని మార్పు, మాతృభాష మీడియం రద్దు వంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోర్డు ఆదేశాలను సైతం ధిక్కరించి, రాజ్యాంగానికి విరుద్దంగా జగన్ పాలన సాగిస్తున్నారు. పండిన పంటకు ధర లేక రైతులు పంటలను వదిలేసుకుంటున్నా.. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. కరోనా సమయంలో కూడా యధేచ్చగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. లారీల ద్వారా పంటలను పంపించే ఏర్పాట్లు చేయడంలేదు.కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది' అని జగన్ సర్కార్‌పై దేవినేని విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్ళు చేస్తామని చెప్పిన బూతుల మంత్రి.. ఎంత కొన్నారో చెప్పాలని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రజలకు కూరగాయలు, నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. రైతు కూలీలు, మహిళలకు స్వయంగా అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మాటలు కోటలు దాటుతున్నాయని.. చేతలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్నారు. మామిడి సీజన్ కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. తోటల్లోనే మామిడి కాయలను వదిలేసి రైతన్నలు కన్నీరు పెడుతున్నారన్నారు.

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో మాస్క్‌లు కుట్టిన మొద‌టి మ‌హిళ‌!

రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ భార్య స‌వితా కోవింద్ మాస్క్‌లు కుడుతున్నారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని శ‌క్తి హాత్‌లో ముఖానికి ధ‌రించే మాస్క్‌ల‌ను ఆమె కుట్టారు. ఢిల్లీలో ఉన్న షెల్ట‌ర్ హోమ్స్‌లో ఆ మాస్క్‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ఎరుపు రంగు మాస్క్‌ను ముఖానికి ధ‌రించిన ఆమె కుట్టుమిష‌న్‌పై మాస్క్‌లు కుట్టారు.  అంద‌రం కలిసిక‌ట్టుగా కోవిడ్‌19పై పోరాటం చేయాల‌న్నారామె. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటించాల‌న్నారు.  ఇళ్ల నుంచి బయటకు వచ్చే వాళ్లు త‌ప్ప‌ని స‌రిగా మాస్క్‌లు ధరించాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు.  విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా  ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ, ఇంట్లో తయారు చేసిన మాస్క్ కానీ ధరించాలని, అలాకాకుండా బయటకు వెళ్ల‌వ‌ద్ద‌ని ఆమె కోరారు.

ట్విట్టర్లో టిడిపిని, క‌న్నాను టార్గెట్ చేసిన వైసీపీ!

క‌రోనాను సైతం లెక్క చేయ‌కుండా ఏపీలో రాజకీయాలు కేక పుట్టిస్తున్నాయి. మే నెల‌లో వేడివేడి పెనం మీద నీళ్ళు చల్లినట్టుగా సలసల కాగుతున్నాయి. వైసీపీ నేతలు చంద్రబాబుని టార్గెట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా చంద్ర‌బాబుకు ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వు. ఏ స్థానంలో ఉన్నా చేసేవి నీచరాజకీయాలే. వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్స్‌ల పేరిట హడావుడి, ఆర్భాటాలు తప్ప ఒక్క నిర్మాణాత్మక ఆలోచన లేదంటూ ట్విట్టర్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రచారలబ్ధి పొందాలనే కుటిల రాజకీయ సూత్రం నుంచి చంద్రబాబు ఇంకా బయటపడలేదు. దీని ద్వారా ఆయన దారుణ వ్యక్తిత్వాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి విష ప్రచారం చేసే దుర్భుద్ధి చంద్రబాబుకు పోలేదని స‌జ్జ‌లీ ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మ‌రో ట్వీట్ చేశారు. చంద్రబాబుకు అమ్ముడపోలేదని ప్రమాణం చేసేందుకు కాణిపాకానికి ఎప్పుడు వస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో రూ.30 కోట్లు నొక్కేశాడని ఎలక్షన్ల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికలు రాశాయి. స్థానికంగా సమీకరించిన విరాళాలూ దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కన్నా తో కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు పెద్దలకు తెలుసు అంటూ అప్పట్లో ఆంధ్రప్రభ పత్రిక ప్రచురించిన వార్తను జత చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. మొత్తం మీద వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు టీడీపీ, బీజేపీ నేతల్ని చెడుగుడు ఆడుకుంటున్నారు.

డాక్ట‌ర్‌ను క‌బ‌ళించిన క‌రోనా!

కరోనా వైరస్ పంజా విసురుతున్న తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే వైరస్ బారినపడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. నిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటికే ఐదుగురు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా వైరస్ సోకింది. కరోనా సోకిన ఓ మహిళకు చికిత్స అందించడం కారణంగా వీరంతా వైరస్ బారినపడ్డారు. అనంతరం ఆ మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరణించిన తర్వాత కరోనాగా నిర్ధారణ అయ్యింది. గత నెలలో దోమల్‌గూడలో ఇద్దరు వైద్యులు కరోనా వైరస్ బారినపడ్డారు. హైదరాబాద్‌లోని ఆగపురాలో కరోనా వైరస్‌తో ఓ వైద్యుడు మరణించాడు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరి ద్వారా కుటుంబంలో అందరికీ కరోనా సోకింది. వైద్యుడు కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందడం ఆందోళన కల్గిస్తోంది. నగరంలోని ఆగపురా ప్రాంతంలో ఓ యునానీ వైద్యుడు (52) కరోనాతో గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. వైద్యుడి భార్య కూడా యునానీ వైద్యురాలే. ఇద్దరూ ఒకే చోట వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమెకు కూడా వైరస్ సోకింది. వీరి ద్వారా కుటుంబంలోని వారందరూ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఏప్రిల్‌ 5న వైద్యుడు అనారోగ్యానికి గురయ్యాడు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యుడి ద్వారా అతడి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలకు కూడా కరోనా సోకింది. వారందరినీ గాంధీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుడి మృతితో తెలంగాణాలో కరోనా మరణాల సంఖ్య 24కు చేరుకుంది.

పాఠ‌శాల‌కు రంగులేసిన క్వారంటైన్‌ వ‌ల‌స‌కూలీలు!

క్వారంటైన్‌లో ఉంటూ పాఠ‌శాల‌‌ను శుభ్రం చేయ‌డ‌మే కాదు చిన్న చిన్న రిపేర్లు చేసి సున్నంతో పాటు రంగులు వేసి త‌మ పెద్ద మ‌న‌సు చాటుకున్నారు ఆ వ‌ల‌స కూలీలు. లాక్‌డౌన్‌లో త‌మ‌కు త‌ల‌దాచుకోవ‌డానికి నీడ‌నిచ్చి ఆశ్రయమిచ్చిన పాఠ‌శాల‌లను వారు గుడిలా చూసుకున్నారు. అన్నం పెట్టిన గ్రామస్థులను ఆప్తులనుకున్నారు. ఆగ్రామ‌స్థుల్లో దేవుడిని చూశారు. మనసులోని కృతజ్ఞతాభావం వారిని ఊరకే కూర్చోనీయలేదు. ''సార్‌! పాఠ‌శాల‌ గోడలకు సున్నం రాలి, పెచ్చులూడి కనిపిస్తున్నాయి. మాకు పెయింట్‌ ఇప్పించండి చాలు. రంగులేస్తాం'' అన్నారు పెద్దలతో. ప్రతిఫలంగా వారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. గ‌త తొమ్మిదేళ్లుగా ఆ పాఠ‌శాల‌ల‌కు ఎలాంటి సున్నం వేయ‌లేద‌ట‌. ఇప్పుడు కొత్త భ‌వ‌నాల్లా తళతళలాడుతున్నాయి. హరియానా, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి వచ్చిన 54 మంది కూలీలకు... రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లా, పల్సానా పరిధిలోని షాహిద్‌ సీతారాం కుమ్వాత్‌, సేథ్‌ కె.ఎల్‌.తంబి ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు బస ఏర్పాటు చేశారు. పల్సానా సర్పంచి రూప్‌సింగ్‌ షెకావత్‌ వారికి ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. క్వారంటైన్‌ మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. అయితే ఆ కార్మికుల మనసులు ఆగలేదు. తాము ఉంటున్న పాఠ‌శాల‌ల‌ను శుభ్రం చేశారు. చిన్న చిన్న రేపేర్లు చేయ‌డ‌మే కాదు రంగులేస్తామని సర్పంచి దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయులు కూడా ముందుకొచ్చి తలో కొంత వేసుకుని... కావలసిన రంగులు, సరంజామా సమకూర్చారు. అంతే. వ‌ల‌స కార్మికులంతా కలిసి పాఠశాలల ఆవరణలను శుభ్రం చేసి, గోడలకు రంగులు వేసి వాటిని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఇప్పుడు వారి క్వారంటైన్‌ కూడా పూర్తయింది. కష్టానికి ప్రతిఫలంగా డబ్బులిచ్చినా... కార్మికులు తీసుకోలేదని, వారి మంచి హృదయానికి తమ ప్రజలు ఎంతో సంబర పడుతున్నారని షెకావత్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ విశేషంగా ప్రచారంలోకి వచ్చాయి. చిన్న బతుకులు పెద్ద మనసుతో వ్య‌వ‌హ‌రించార‌ని నెట్‌జ‌నులు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

ఇండియాలో కరోనా వైర‌స్ విజృంభిస్తోంది!

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరో వైపు మరణాల సంఖ్య కూడా ఆందోళ‌న‌క‌రంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 2న 211 జిల్లాకే పరిమితమైన కరోనావైరస్ ఇప్పుడు 430 జిల్లాలకు వ్యాపించంది. దేశంలోని కేసుల్లో 45 శాతం కేలుసు ఆరు ప‌ట్ట‌ణాల్లోనే ఉన్న‌ట్లు గుర్తించారు. మూడువేలకు పైగా కేసులతో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఢిల్లీ 2081, అహ్మదాబాద్ 1298, ఇండోర్ 915, పుణె 660, జైపూర్ 537 కేసులతో ఉన్నాయి. రోజు రోజుకు దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 21,370 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 681 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 16,319 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, 4370 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఒక్క రోజే 49 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో 60 కన్నా ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 5649 కరోనా కేసులు నమోదు కాగా, 269 మరణాలు సంభవించాయి. గుజరాత్ రాష్ట్రంలో 2407 కేసులు నమోదు కాగా, 103 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 2248 కేసులు నమోదు కాగా, 148 మరణాలు సంభవించాయి. రాజస్థాన్ రాష్ట్రంలో 1888 కరోనా కేసులు, 127 మరణాలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1587 కేసులు, 80 మరణాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1449 కేసులు, 21 మరణాలు సంభవించాయి. తెలంగాణలో 943 కరోనా కేసులు, 24 మరణాలు, ఏపీలో 813 కరోనా కేసులు, 24 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు క‌రోనా మహమ్మారి వల్ల వరల్డ్‌వైడ్‌గా 180,289 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 25,96,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికా పరిస్థితి మరి దారుణంగా ఉంది. యూఎస్‌లో ఇప్పటివరకు 45,153 మంది మృత్యువాత పడగా, 8.29 లక్షల మంది కరోనా బాధితులు ఉన్నారు. అమెరికా తర్వాత ఇటలీలో 25,085, స్పెయిన్‌లో 21,717, ఫ్రాన్స్‌లో 21,340, బ్రిటన్‌లో 18,100 మంది ఈ మహమ్మారి వల్ల మరణించారు. ఇక భారత్‌లో కూడా 'కొవిడ్‌-19' శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 20,471 మంది కరోనా బారిన పడ్డారు. 652 మంది మరణించారు. తెలంగాణలో 943 కరోనా కేసులు, 24 మరణాలు, ఏపీలో 813 కరోనా కేసులు, 24 మరణాలు సంభవించాయి.

లేడీ డాక్టర్ కు కరోనా

గుంటూరు జిల్లాలో కొత్తగా 19 కేసులు ఒక్క గుంటూరులోనే 106 కేసులు గుంటూరు, నరసరావుపేటల నుంచి రాకపోకలు బంద్ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికంగా నివసిస్తూ నరసరావుపేటలో పనిచేస్తున్న వైద్యురాలికి పాజిటివ్ అని తేలడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. అయితే, ఆమె కుటుంబ సభ్యులకు మాత్రం నెగటివ్ రిపోర్టులు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు, జిల్లాలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నేడు కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 177కు పెరిగినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. నేడు గుంటూరులో 5, నరసరావుపేటలో 5, దాచేపల్లిలో 4, చిలకలూరిపేటలో ఒక కేసు నమోదైంది. తాజా కేసులతో కలుపుకుని ఒక్క గుంటూరు నగరంలోనే నమోదైన కేసుల సంఖ్య 106కు పెరిగింది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు, నరసరావుపేటలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలను నిషేధించారు.