మాయాబజార్ ఎస్వీఆర్ స్టైల్ లో విజయసాయి 'పవర్ పంచ్'
*కమలానికి అసమదీయులెవరో, తసమదీయులెవరో తెలుసుకోవాలంటూ ఆ పార్టీ కి ఝలక్
*ఏపీ బీజెపీ ఇంకా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలు
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచ పాత్రధారి చేత కథారచయిత ఒక అద్భుతమైన ప్రయోగం చేయిస్తాడు... "ఎవరు పుట్టించకపోతే, కొత్త పదాలెలా పుట్టుకొస్తాయి," అంటూ ఘటోత్కచ పాత్రధారి ఎస్ వీ రంగారావు చేత ఒక సందర్భోచిత వ్యాఖ్యానం చేయిస్తాడు.. రాక్షస భృత్యులు అసస్మదీయులు అనటానికి బదులుగా అసమదీయులు అనటం, దానికి విరుద్ధ పదం గా 'తసమదీయులు' అనే కొత్త పదం సృష్టించటాన్ని అప్పటి ప్రేక్షకులు, ఇప్పటి ఆడియెన్స్ కూడా పరిపూర్ణంగా ఆస్వాదించారు, ఆస్వాదిస్తున్నారు. అంతటి మహత్తరమైన లెగసీ ని క్యారీ ఫార్వార్డ్ చేయటానికి, ఎస్ వీ రంగారావు స్ఫూర్తిగా, వైఎస్ ఆర్ సి పీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి నడుం బిగించారు. తెలుగు ప్రజానీకానికి కావాల్సినంత స్టఫ్ అందించే క్రమంలో, ఆయన కూడా ఎస్ వీ రంగారావు మాదిరి కొత్త పదాలు పుట్టిస్తున్నారు, పొలిటికల్ పార్టీలను కన్ఫ్యూజ్ చేయటానికి....
తాజాగా ఆయన కనిపెట్టిన పదం..తెలుగు జాకాల్స్ పార్టీ ( టీ జె పీ)...అంటే, దాని భాష్యం ఏమిటంటే..తెలుగుదేశం లో నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు పంపగా వచ్చి చేరిన వారి తో కలిసి (సుజనా చౌదరి, టీ జె వెంకటేష్, సి ఎం రమేష్ బోటివారన్న మాట) , బీ జె పి కాస్తా టీ జె పీ అయిందన్న మాట. ఇలాంటి ఒక కొత్త పదం పుట్టించిన విజయసాయి రెడ్డి, అభియోగమల్ల ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ ( ఈయన కూడా కాంగ్రెస్ నుంచి బీ జె పీ లోకి ఇంపోర్ట్ అయిన వారే) కు సుజనా ముడుపులిచ్చారనీ, ఆయన ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కోసం పని చేస్తూ పసలేని ఆరోపణలు చేస్తున్నారనీ... ఇంతకీ, దీనికి నేపధ్యమల్లా, సుజనా చౌదరికి, విజయసాయి రెడ్డి కి మధ్య నడుస్తున్న పవర్ వార్.. ఢిల్లీ లాబీల్లో గడిచిన ఐదేళ్లుగా విజయసాయిరెడ్డి నిర్మించుకున్న 'పవర్ లాబీ' సామ్రాజ్యానికి, అలాగే బీ జె పీ హెడ్ క్వార్ట్రర్స్ తో ఆయనకున్న అవినాభావ సంబంధానికి , సుజనా చౌదరి పని కట్టుకుని గండి కొడుతున్నారని విజయ్ సాయి రెడ్డి అనుమానం, నమ్మకం కూడా. అందుకనే, ఆయన సుజనా చౌదరి ఆర్ధిక అవకతవకలపైన రాష్ట్రపతికి, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కూ లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయటం మొదలెట్టి, సుజనా చౌదరి ని ఉక్కిరి బిక్కిరి చేయటం మొదలెట్టారు.
ఇది తట్టుకోలేని సుజనా చౌదరి, సహజంగానే, ప్రతి వ్యూహం సిద్ధం చేసి, కన్నా లక్ష్మీ నారాయణ ను తన క్యాంప్ వైపు లాక్కోవటం మొదలెట్టారు. కన్నా కూడా విధి లేని పరిస్థితుల్లో సుజనా కు దగ్గరవడం, ఎలాగూ పోయే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ని నిలుపుకోవటం కోసం సుజనా ద్వారా లాబీ చేయించుకోవాలని చూడడటం వంటి కారణాలు, విజయసాయి రెడ్డి -సుజనా క్యాంప్ ని టార్గెట్ చేయటానికి కారణమయ్యాయి.
ఇప్పుడు విజయసాయి వ్యూహమల్లా ఒకటే... అసలు సిసలు బీ జె పీ వారు ఎవరైనా ఆరోపణలు చేస్తే, సమాధానం ఇవ్వటానికి తాను సిద్ధమేనని, టీ డీ పీ నుంచి దిగుమతి అయిన సుజనా లాంటి ఆర్ధిక నేరగాళ్లు చేసే ఆరోపణలకు, అలాగే కన్నా లక్ష్మీనారాయణ లాంటి అవినీతిపరులు చేసే ఆరోపణలకు తానూ జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ- బీ జె పి హెడ్ క్వార్ట్రర్స్ నే ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఏతా వాతా, ఏపీ బీ జె పీ ఇంకా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే నడుస్తోందనే మెసేజ్ ను ఆయన నేరుగా ఢిల్లీ అశోకా రోడ్ లోని కమలదళాధినేతలకు పంపేశారు. విభజించి పాలించే సిద్ధాంతాన్ని అప్లై చేయటం ద్వారా , ఆయన ఢిల్లీ కమలదళానికి, రాష్ట్ర బీ జె పీ కి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నాన్ని సక్సెస్ ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర బీ జె పీ లో అసమదీయులెవరో, తసమదీయులెవరో తేల్చుకోవాలంటూ , మాయాబజార్ లో ఎస్ వీ ఆర్ స్టైల్ లో విజయసాయి విసిరిన పవర్ పంచ్ పై ఇప్పుడు -బీ జె పీ లో సుదీర్ఘ చర్చ నడుస్తోంది.