మక్కా మసీదు మూసివేత

*కఠిన నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా  * రంజాన్ మాసంలో అల్ హరం, అల్ నబవీ మసీదులు కూడా మూసివేత  రంజాన్ మాసం లో మక్కా మసీదు తో సహా, మరే ఇతర ప్రధాన మసీదుల్లోనూ ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని సౌదీ అరేబియా ప్రకటించింది. ముస్లింలంతా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సలహా ఇచ్చింది.  రంజాన్ మాసంలో పవిత్ర మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయాలని నిర్ణయించింది. మసీదులను తెరచివుంచితే, కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుందన్న కారణంతోనే మసీదులను మూసి వేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి రంజాన్ మాసంలో ఉపవాసాల సందర్భంగా ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది మక్కాకు, హజ్ యాత్రకూ వచ్చి, ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తరావీ నమాజ్ లను, రంజాన్ ఈద్ నమాజ్ ను ముస్లింలంతా ఇళ్లలోనే చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కాగా, ఇప్పటివరకూ సుమారు 10 వేల మందికి పైగా సౌదీ అరేబియాలో కరోనా బారిన పడగా, వారిలో 100 మందికి పైగా మరణించారు.

పోలీసులు సంయమనం పాటించండి! చంద్ర‌బాబునాయ‌డు

అత్యవసర మందుల కోసం వెళ్తున్న గౌస్‌పై పోలీసులు లాఠీఛార్జి చేయడం గర్హనీయమని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించాలే తప్ప, దురుసుగా ప్రవర్తించడం సరికాదని సూచించారు. గుండెజబ్బుతో బాధపడుతున్న ఒక యువకుడు అత్యవసరమైన మందుల కోసం రోడ్డు మీదకు వస్తే పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. లాఠీ దెబ్బలకు అతని ప్రాణాలు పోయాయి. దీంతో ఆగ్రహించిన స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున నిరసన కు దిగారు. పోలీస్‌స్టేషన్‌ ఎదుట భైఠాయించారు. దీంతో ఈ సంఘటనకు కారణమైన ఎస్‌ఐని సస్పెండ్‌ చేస్తున్నట్లు గుంటూరు రేంజి ఐజి జె ప్రభాకరరావు ప్రకటించారు. వెంకటపతి కాలనీలో నివసించే 30 సంవత్సరాల షేక్‌ మహ్మద్‌ గౌస్‌ బిల్డింగ్‌ సెంట్రింగ్‌ వర్కర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు సంవత్సరాల కిందట గుండెకు సంబంధించిన సమస్య రావడంతో ఆపరేషన్‌ చేసి స్టంట్‌ వేశారు. ఈ క్రమంలో అత్యవసరమైన మందుల కోసం సోమవారం ఉదయం 7.30 గంటలకు మెడికల్‌ షాపును వెళ్లి వస్తున్న ఆయనపై నరసరావుపేట రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు విరుచుకు పడ్డారు. అతను చెబుతున్నది వినకుండా లాఠీలతో కొట్టడంతో గౌస్‌ కుప్పకూలిపోయాడు. పోలీసుల సమాచారంతో అక్కడకు వచ్చిన గౌస్‌ తండ్రి ఆదాం తన కుమారుడిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. గౌస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయం పట్టణంలో తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు కదిలారు. మృతదేహాన్ని పోలీస్‌ స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లి బైఠాయించారు. గంటల తరబడి ఈ ఆందోళనసాగింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సంఘటనకు కారణమైన ఎస్‌ఐ డి. రమేష్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

కప్పలను తిని ఆక‌లి తీర్చుకుంటున్నారు!

లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు. ఈ హృదయ విదారక ఘటన బీహార్ లో వెలుగులోకి వ‌చ్చింది. ఐదురోజులుగా తిండి లేకపోవడంతో జెహనాబాద్ కు చెందిన కొందరు చిన్నారులు ఆకలితో అలమటిస్తూ వీరే దారి లేక దొరికిన‌ కప్పలను తింటూ కడుపు నింపుకుంటున్నారు. అందుకోసం గుంతల్లో, మురికి కాలువలో ఉన్న కప్పలను వేటాడి చంపి, వాటిని ఆహారంగా తింటున్నారు. ఇంట్లో వండుకోని తిన‌డానికి ఏమీ లేదు. గ‌త్యంత‌రం లేక‌నే ఇలా చేస్తున్నామ‌ని ఆ చిన్నారులు చెబుతూ కంట‌త‌డి పెట్టారు. ఈ సంఘ‌ట‌న‌పై జిల్లా మెజిస్ట్రేట్ నవీన్ కుమార్ ఘటనపై విచారణకు ఆదేశించారు. పాల‌కుల దివాళాకోరు త‌నానికి పేద‌లు ఎలా బ్ర‌తుకుతున్నారో ఈ సంఘ‌ట‌న అద్దం ప‌డుతోంది. కేవ‌లం మాట‌ల‌గార‌డీతో జ‌నాల మ‌ధ్య చిచ్చు పెడుతూ త‌మ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునే నేత‌లున్నంత కాలం ఇలాంటి మ‌రెన్నో దౌర్భ‌గ్య ప‌రిస్థితుల‌ను ఎదురుకోవ‌డానికి సిద్ధంగా వుండాలి మరి.

మైసూరు వైద్యురాలికి అమెరికాలో అపూర్వ గౌరవం

* కరోనా ట్రీట్మెంట్ లో ఆమె చేసిన సేవలకు గాను శాల్యూట్ చేసిన సౌత్ విండ్సర్ పౌర సమాజం  * పాశ్చాత్యులు త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరిస్తున్న 'వైద్యో నారాయణో హరి' సూత్రం  ఇది ఒక అపురూప ఘట్టం. ఒక అనిర్వచనీయమైన అనుభూతి .... భారత సంతతికి చెందిన డాక్టర్ ఉమా మధుసూదన , యు ఎస్ ఏ లోని సౌత్ విండ్సర్ హాస్పిటల్ లో కరోనా పేషంట్స్ ను ట్రీట్ చేసినందుకు గాను, అక్కడి పోలీసు యంత్రాంగం, పౌర సమాజం ఆమెకు ఇచ్చిన అద్భుతమైన గౌరవం. మైసూర్ కు చెందిన డాక్టర్ ఉమా మధుసూదన వెలకట్టలేని సేవలు అందించారని, అందుకు కృతజ్ఞతా పూర్వకంగా ఆమె ఇంటి ముందుకు సైరన్ వాహనాలతో వచ్చి మరీ వారి ధన్యవాదాలను ఆమెకు తెలియచేశారు. డాక్టర్ ఉమా మధుసూదన కూడా వారు ఇచ్చిన ప్రేమపూర్వక గౌరవవందనాన్ని సంతోషంగా స్వీకరించారు. వైద్యో నారాయణో హరి అన్న మన సూత్రాన్ని, పాశ్చాత్యులు త్రికరణ శుద్ధిగా ఆచరించి చూపించారు. మరి, మన పౌర సమాజాలు హైదరాబాద్ లోనూ, దేశం లోని ఇతర ప్రాంతాల్లోనూ కరోనా మీద డాక్టర్ల మీద జరుపుతున్న దాడులు చూస్తుంటే, మనం ఎక్కడున్నామో, మనం ఏమి చేస్తున్నామో , మనలో ఏమి ఎలిమెంట్ మిస్ అయిందో తెలుస్తుంది. కనీసం ఈ అపురూప దృశ్యం చూసైనా మనలోని అనాగరికులకు బుద్ధి వస్తుందని ఆశిద్దాం.

రాష్ట్రపతి భవన్ సిబ్బందికి కరోనా పాజిటివ్!

రాష్ట్రపతి భవన్‌లో కరోనా వైరస్ క‌ల్లోలం సృష్టించింది. రాష్ట్రపతి భవన్ లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్థార‌ణ అయింది. క్వాటర్స్ లో నివసిస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది బంధువు ద్వారా కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. హౌస్ కీపింగ్ స్టాఫ్ కు కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో 125 కుటంటంబాలను రాష్ట్రపతి భవన్ అధికారులు సెల్ఫ్ ఐసోలేషన్ కు పంపించారు. వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. హౌస్ క్లీనింగ్ స్టాఫ్ ను క్వార్టర్స్ కే పరిమితం చేశామని అధికారులు తెలిపారు. భారత రాష్ట్రపతి కొలువుంటే రాష్ట్రపతి భవన్ కు కరోనా వైరస్ పాక‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  దీంతో రాష్ట్రపతికి ఏమైంది అని అందరూ ఆరాతీయడం మొదలు పెట్టారు. ఈ హఠాత్ పరిణామానికి రాష్ట్రపతి భవన సముదాయంలో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ లోని మొత్తం కుటుంబాలను తదుపరి నోటీసులు వచ్చే వరకు ఐసోలేషన్ లో ఉంచారు. రాష్ట్రపతికి ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమీ లేదని.. కరోనా పాజిటివ్ వ్యక్తులు రాష్ట్రపతికి సన్నిహితంగా లేరని తెలిసింది.

అమెరికాలో ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయ‌డానికి అనుమ‌తి!

అమెరికాలో ఎప్పుడూ లేనంతగా ఆహార కొరతను ఆ దేశ ప్రజలు పలువురు ఎదుర్కొంటున్నారు. రోజువారీ జీవితంలో ఫుడ్ బ్యాంకుల వైపు కన్నెత్తి చూడని వారు సైతం.. ఇప్పుడు కిలోమీటర్ల కొద్దీ క్యూ బారుల్లో నిలుచుంటే.. తమకు అవకాశం వచ్చే వరకూ గంటల కొద్దీ వెయిట్ చేస్తున్నారు. కరోనాతో భారీగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా తొలి స్థానంలో నిలుస్తుందని చెప్పాలి. అగ్రరాజ్యంలోని అమెరికన్లకే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నవేళ.. ఆ దేశంలో ఉండే భారత విద్యార్థుల పరిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా వుంది. కరోనా నేప‌థ్యంలో  అమెరికాలో వున్న భారత విద్యార్థులు తీవ్ర‌మైన ఒత్తిడికి గురి అవుతున్నారు.  పాత నిబంధనల్ని సడలిస్తూ అమెరికా సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పలు కొత్త సూచనలతో తాజాగా ప్రకటన విడుద‌ల చేసింది. ఆన్ క్యాంపస్ ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిప్పుడు ఆఫ్ క్యాంపస్ లో ఉద్యోగం చేసుకునేందుకు అప్లై చేసుకోవచ్చన్న వెసులుబాటు ఇచ్చారు. అయితే.. ఇందుకు కొన్నినిబంధనల్ని పాటించాలని పేర్కొన్నారు. ఆఫ్ క్యాంపస్ లో ఉద్యోగం చేయటం కోసం.. వర్సిటీ నుంచి అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది.   తాజా వెసులుబాటు తీసుకునే వారు కోర్సు పూర్తయ్యే కాలంలో ఏడాది పాటు ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయొచ్చని పేర్కొంది. ఈ నిర్ణయంతో అమెరికాలో చిక్కుకున్న విదేశీ విద్యార్థులకు పెద్ద ఎత్తున మేలు చేస్తుందని చెబుతున్నారు.

కేబీఆర్ పార్క్ దగ్గర చిరుతపులి సంచారం!

ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన ట్విట్టర్ ద్వారా కేబీఆర్ పరిసరాలలో సంచరిస్తున్న చిరుతని తన కెమెరాలో బంధించాడు. మెల్లగా రోడ్డు పైకి వచ్చిన చిరుత పులి అటు ఇటు గమనిస్తూ డివైడర్ దాటింది. ఏప్రిల్ 18 తెల్లవారుఝామున తీసిన వీడియో ఇది అని అభిషేక్ తన ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ వలన ప్రజలందరు ఇళ్లకి పరిమితమయ్యారు.  ఈ నేపథ్యంలో వన్య ప్రాణులు రోడ్లపైకి వచ్చి యదేచ్ఛగా తిరుగుతున్నాయి. అయితే వాకర్స్‌తో నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ కూడా ఇప్పుడు మూతపడడంతో ఆ పరిసర ప్రాంతంలో చిరుతపులి ఒకటి సంచరించడం చుట్టు పక్కల ప్రజలని భయబ్రాంతులకి గురి చేస్తుంది. హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు హిల్స్ కు సమీపంలో ఉండటంతో ఆయా ప్రాంతాల్లోకి చిరుతలు తరచూ వస్తున్నాయి.  గ‌తంలోనూ కూకట్ పల్లి ప్రగతినగర్ లో చిరుత కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కూకట్ పల్లిలో ప్రగతినగర్ గాజుల రామారం మధ్య చిరుత కనిపించింది. దీంతో సమీపంలోని పలు ప్రాంతాల ప్రజలు అప్ప‌ట్లో హడలిపోయారు. చిరుత తిరుగుతున్న దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.

గుంటూరు కలెక్టర్‍, ఎస్పీపై ఇంటిలిజెన్స్ నివేదిక‌!

గుంటూరు జిల్లా కలెక్టరు, ఇంఛార్జి ఎస్పీ, మునిసిపల్‍ కమీషన్‍, డిహెచ్‍ఎంవో ప్రచార అర్భాటానికే ప్రాదాన్యత ఇస్తున్నారు త‌ప్ప గ్రౌండ్ లెవెల్‌లో కరోనా బారిన పడ్డ వారిని గుర్తించటంలో ఘోరంగా విఫలమయ్యారు. గుంటూరు నగర పోలీసు విభాగంలో అడిషనల్‍ ఎస్పీ స్థాయి నుండి క్రింది స్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు సక్రమంగా పని చేస్తున్నప్పటికీ.. కరోనా బాధితుల వివరాలను సేకరించటంలో హోం శాఖేతర అధికారులు సకాలంలో స్పందించలేకపోవటంతో.. తాజా పరిస్థితికి కారణమయ్యారని ఇంటిలిజెన్స్ ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చింద‌ట‌. గుంటూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. జిల్లా కలెక్టర్‍ శామ్యూల్‍ ఆనంద్‍ కుమార్‍, గుంటూరు అర్బన్‍ ఎస్పీ రామకృష్ణలు నిర్లక్ష్య వైఖరి వల్లే జిల్లాలో ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఇంటిలిజెన్స్ ప్ర‌భుత్వానికి తెలిపింద‌ట‌. వారిద్దరూ సకాలంలో స్పందించకపోవటమే తాజా పరిస్థితికి కారణమని.. ఇంటిలిజెన్స్ విభాగం నివేదిక ద్వారా సిఎంకు తెలియజేయటంతో.. వారిద్దరినీ బాధ్యతల నుండి తప్పిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజకీయ అధికార వర్గాల సిఫార్సులకు తలొగ్గే మనస్తత్వం ఉన్న శామ్యూల్‍ ఎప్పుడో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పటికీ తీసుకోవటం లేదని.. గుంటూరులో కరోనా బాధితుల వివరాలు సేకరించటంలో.. పోలీసు వ్యవస్థను పని చేయించటంలో.. అర్బన్‍ విభాగం ఇంఛార్జి ఎస్పీ రామకృష్ణ, మెతకవైఖరి అవలంబించారని.. ఆయనను కూడా బాధ్యతల నుండి తప్పించే అవకాశాలున్నాయట‌. గుంటూరు మునిసిపల్‍ కమీషనర్‍ అనురాధతో పాటు జిల్లా మెడికల్‍ అధికారి కూడా కరోనా వ్యాథి బాధితులను గుర్తించటంలో.. నిర్లక్ష్య వైఖరి అవలంబించారని, వారిద్దరిని కూడా తప్పించాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో వారిని బదిలీచేస్తే. కొత్త సమస్యలు ఎదురు కావచ్చునని వారి స్థానంలో నియమితులైన వారికి పరిస్థితులు అవగాహన చేసుకోవాలంటే.. 10 రోజులు సమయం పడుతుందని.. తాజా పరిస్థితులు చల్లబడ్డాక తప్పిస్తే.. మంచిదని సిఎంవో అధికారులు కూడా భావిస్తున్నట్లు తెలిసింది.

క్వారంటైన్ ఫుడ్ టెండ‌ర్‌ల‌లో గోల్‌మాల్‌?

సంద‌ట్లో స‌డేమియాలు త‌మ నైజం బ‌య‌ట‌పెడుతున్నారు. శ‌వాల మీద చిల్ల‌ర ఎరుకుంటున్నారు. క్వారంటైన్‍ కేంద్రాలలో ఉన్న వారికి భోజన, ఫలహారాలు అందజేసే విషయంలో కాంట్రాక్టర్లతో లాలూచి పడి అందినంత దండుకుంటున్నార‌ని ఉన్నతాధికారులకు ఆదారాలతో ఫిర్యాదులు అందుతున్నాయి. కొంతమంది ఉద్యోగులు, అధికారులు బాగానే క్వారంటైన్‌ భోజ‌నాల్లో బాగానే వెనకేసుకుంటున్నార‌ట‌. చచ్చినాడి పెళ్లికి వచ్చినంత కట్నం అనుకూంటూ వెనుకేసుకుంటున్నార‌ట‌. క్వారంటైన్‍లో ఉంటున్న కరోనా వ్యాధి అనుమానితులకు ప్ర‌భుత్వం త‌ర‌ఫునే ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఉదయం నుండి రాత్రి వరకు అన్ని వసతులు క‌ల్పిస్తున్నారు. కొంతమందికి సరఫరా చేస్తున్న భోజనాలు, ఫలహారాల విషయంలో నాణ్యత ఉండటం లేదని.. వాటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని వివిధ జిల్లాల కలెక్టర్ల దృష్టికి ఫిర్యాదులు అందుతున్నాయి. క్వారంటైన్‍ కేంద్రాలలో ఉన్నవారికి మెనూ ప్రకారం ఉదయం 6.30గం.లకు రాగిజావ, 7.00గం.లకు టీ లేదా కాఫీ 7.30గం.ల నుండి 8.00గం.ల వరకు రెండు రకాల టిఫిన్లు, 11.00గం.లకు ఫ్రూట్‍ సలాడ్‍ ఇవ్వాలి. మధ్యాహ్నం 12.00 గంటలకు రెండు శాఖాహార కూరలతో భోజనం పెట్టాలి. సాయంత్రం 4 గంటలకు టీతో పాటు స్నాక్స్ ఇవ్వాలి. రాత్రి 7 గంటలకు రెండు రకాల కూరలతో భోజనం పెట్టాలి. అలాగే గదులలో 20 లీటర్ల నీళ్ల బాటిళ్లు ఇతరత్రా సమకూర్చాలి. వీటన్నింటిని సమకూర్చేందుకు కాంట్రాక్టర్లను పిలవాల్సిన అదికారులు, స్థానిక వ్యాపారులతో కుమ్మక్కై జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో ఉన్న అన్ని క్వారంటైన్‍ కేంద్రాలలో.. పైన పేర్కొన్న మెనూ ప్రకారం కరోనా అనుమానితులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. పారిశుద్య నిర్వహణ, విపత్తుల విషయంలో ప్రభుత్వ పరంగా సహకారం కోసం జిల్లా ముఖ్య అధికారులు ఎప్పటి కప్పుడు హోటళ్ల యజమానులను పిలిచి సమావేశం నిర్వహించి వారి సహకారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్వారంటైన్లలో ఉంటున్న వారికి పెద్ద మొత్తంలో ఆహారం సరఫరా చేసేందుకు అన్ని జిల్లాలలో హోటళ్ల అసోసియేషన్‍ ఉన్నప్పటికీ.. వారితో సంప్రదించకుండా.. ఇతర వ్యాపారులతో ఈ ఆహార పదార్ధాలను అధికారులు సరఫరా చేయించ‌డం వివాదాస్ప‌దం అయింది. ఈ వ్య‌వ‌హారంపై హోటళ్ల యజమానులు ఆధారాలతో జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఫిర్యాదు చేశారు. ఓపెన్ టెండ‌ర్ల ద్వారానే క్వారంటైన్ ఫుడ్ ఆర్డ‌ర్స్‌ ఫైన‌ల్ చేశారు. టెండర్లలో ఎక్కడా అక్రమాలు జరగలేదని కలెక్టర్లు, జాయింట్‍ కలెక్టర్లు ఈ పక్రియను దగ్గరుండి పరీక్షించారని, ఇందుకు సంబందించిన వివరాలున్న ఫైళ్లు కలెక్టర్‍ దగ్గరే ఉన్నాయని ఎవరికైనా అనుమానాలు ఉంటే… తెలుసుకోవచ్చని… కార్వంటైన్లు నిర్వహిస్తున్న అధికారులు చెబుతున్నారు.

వంశీ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నారా?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‍ మ‌ళ్ళీ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయ‌న రాజకీయాలకు గుడ్‍బై చెప్పబోతున్నారంటూ అనుచ‌రులు చెబుతున్నారు. ఎందుకంటే వంశీ ఆశించిన‌ట్లు జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. అంతే కాదు అస‌లు ప్రాధాన్య‌తే ఇవ్వ‌డం లేద‌ని అనుచ‌రులు చెప్పుకుంటున్నారు. నిజంగానే ముఖ్య‌మంత్రి జగన్‍ వంశీని ప‌ట్టించుకోవ‌డం లేదా? వంశీ ఎందుకు అసంతృప్తితో వున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఇంఛార్జి తానే అని.. వంశీకి ముఖ్యమంత్రి ఎలాంటి ప్రాదాన్యత ఇవ్వరని వంశీ కి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయినా యార్లగడ్డ వెంకటరావు పదే పదే ప్రకటించినా.. ముఖ్యమంత్రి జగన్‍ వారించకపోవటంతో… ఆవేదన చెందిన వంశీ క్రీయాశీలక రాజకీయాలకు గుడ్‍బై చెబుతున్నార‌నే ప్ర‌చారం కృష్ణాజిల్లాలో జోరందుకుంది. అయితే ఈ ప్రచారం వెనుక ఏదో మతలబు ఉంటుందని.. ఈ వయసులోనే ఆయన ఎందుకు గుడ్‍బై చెబుతారని టిడిపి నేతలు అంటున్నారు. అసలు వంశీ రాజకీయాలకు నిజంగా గుడ్‍బై చెబుతారా..? పథకం ప్రకారం ఆ విషయాలను లీకులు చేసి ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అని చూస్తున్నారా.. ఈ విషయంలో మీడియా వల్లభనేనిని సంప్ర‌దిస్తే అలాంటిది ఏమీలేదు అని చెప్పార‌ట‌. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించిన వల్లభనేని ఆ తరువాత చంద్రబాబుతో తెగ‌తెంపులు చేసుకుని ముఖ్య‌మంత్రి జగన్‍ను పలు దఫాలు కలిసి ఆయన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఫిరాయింపు చట్టం భయంతో.. టిడిపి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. జగన్‍ను పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు, లోకేష్‍లపై విమర్శలు చేసి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.ఆయన పలు మీడియా వారికి ఇచ్చిన ఇంటర్యూలలో తెలుగుదేశం నాయకులతో పాటు చంద్రబాబు, లోకేష్‍లపై చేసిన ఆరోపణలు, విమర్శలు సంచలనం సృష్టించాయి. మీడియా ఇంట‌ర్వ్యూలో హాట్ కామెంట్స్ చేస్తూ వంశీ త‌న వ్యక్తిగత ప్రతిష్టను మంటగలుపుకున్నారు. కొంత కాలం టీవీ ఇంట‌ర్వ్యూలో ఓ వెలుగు వెలిగినా ప్ర‌స్తుతం చ‌ప్ప‌బ‌డ్డారు. అయితే వంశీ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నారంటూ జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ‘కమ్మ వాళ్లు ఏం చేస్తారని జ‌గ‌న్ అనుకుంటాడు. కమ్మోళ్లు ఇట్టా తిప్పితే చాలు అయిపోతాడు’ అంటూ ఇటీవ‌ల రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్య‌లకు తాజాగా ఎమ్మెల్యే వంశీ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌నుకోవ‌డానికి ఏమైనా లింక్ వుందా అంటూ ఆంధ్ర‌రాజ‌కీయాల్లో చ‌ర్చ మొద‌లైంది.

ఐసిఎంఆర్ కొనుగోళ్లపై ఏమి మాట్లాడతారు కన్నా గారూ...

* బీ జె పి రాష్ట్ర అధ్యక్షుడికి డెప్యూటీ సి ఎం సూటి ప్రశ్న  * పర్చేజ్ ఆర్డర్ నిబంధనలు ఓ సారి సరిగ్గా చదవాలని కన్నాకు చురకేసిన ఆళ్ళ నాని  రాపిడ్ టెస్ట్ ల కిట్స్ విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని,  లక్ష రాపిడ్ టెస్ట్ కిట్స్ ఒకేసారి తెప్పించుకున్న రాష్ట్రం మనదేనని, చంద్రబాబుతో కుమ్మక్కై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కన్నాలక్ష్మీనారాయణ ఆరోపణలు చేయడం దారుణమని ఉపముఖ్యమంత్రి,వైద్య,ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని విమర్శించారు. "కన్నాగారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను.....ప్రధానిగారికి సైతం కరోనా విషయంలో ఏ చర్యలు తీసుకోవాలో నేనే నేర్పుతున్నాను అని చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ...ప్రధాని గురించి అలా మాట్లాడకూడదు...ప్రధాని గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించకూడదని ఏనాడైనా చెప్పే ధైర్యం చేశారా...చంద్రబాబు కోసం బిజేపి గౌరవాన్ని కూడా పణంగా పెట్టారు.730 రూపాయలకు రాపిడ్ టెస్ట్ కిట్స్ కొన్నామని ,అందులో చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కన్నాలక్ష్మీనారాయణ వాటిని నిరూపించగలరా," అని ఆళ్ళ నాని ప్రశ్నించారు.  మేం 730 రూపాయలకు కిట్స్ కు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కేంద్రం తన ఆధ్వర్యంలో నడిచే ఐసిఎంఆర్ సంస్ధ ద్వారా ఐదు లక్షల కిట్స్ కు సంబంధించి 795 రూపాయలకు ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా కూడా తెలుసుకోవాలని సూచించారు. అందులో అవినీతి,అవకతవకలు జరిగాయని మేం మాట్లాడటం లేదు. కేంద్రప్రభుత్వమే 795 రూపాయలకు కిట్స్ కొనే ప్రయత్నం చేస్తుంటే.... చెప్పినదానికంటే కూడా మేం 65 రూపాయల తక్కువకే కిట్స్ కొనుగోలు చేశాం.మీరు మాత్రం మాది అవినీతి అంటారు.మరి కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐసిఎంఆర్ 795 రూపాయలకు కొనే ప్రయత్నాన్ని మీరు ఏమంటారో చెపుతారా అంటూ ఆళ్ళ నాని, కన్నా లక్షీనారాయణ ను నిలదీశారు.  " లక్షకిట్స్ కు సంబంధించి దక్షణకొరియానుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించినమాట వాస్తవం.730 రూపాయలకు ఆర్డర్ ఇచ్చిఉన్నామో ఆ ఆర్డర్ ఇచ్చిన అగ్రిమెంట్ లో మేం క్లియర్ గా ఏం చెప్పామంటే 730 రూపాయలకు ఆర్డర్ ఇచ్చినాసరే ఏ రాష్ర్టానికైనా ఈ ధర కంటే తక్కువధరకు సరఫరా చేస్తే ఆ రేటుకే మాకు ఇవ్వాలనే స్పష్టమైన ఒప్పందాన్ని ఆ సంస్ధతో చేసుకున్నాం. ఏ రాష్ట్రమైనా,  ఇలాంటి క్లాజ్ పెట్టిందా,"  అని ఆళ్ళ నాని ,  కన్నాలక్ష్మీనారాయణ ను ప్రశ్నించారు. చత్తీస్ ఘడ్ 337 రూపాయలకు కిట్స్ తీసుకుందని చెబుతున్నారో,ఆ ఆర్డర్ తీసుకోకముందే 337 రూపాయలకే కాదు 300 రూపాయలకు ఏ రాష్ట్రానికి ఇచ్చినా కూడా ఆ ధరకే కిట్స్ ఇవ్వాలన్న నిబంధన పర్చేజ్ ఆర్డర్ లో పెట్టామని ప్రజలకు తెలియచేస్తున్నామన్నారు.

అక్షయ తృతీయ ఆన్‌లైన్ సేల్స్!

అక్షయ తృతీయ నాడు బంగారం ఎలా కొనుగోలు చేయాలని మ‌ద‌న‌ప‌డుతున్నారా? మీకెలాంటి ఇబ్బంది లేదు. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌ముఖ జ్యువెల్ల‌ర్స్ నిర్వాహ‌కులు ఆన్‌లైన్‌లో బుకింగ్ ప్రారంభించారు. కొనుగోలుదారుల కోసం తమ సేవలను ఏప్రిల్ 21వ తేదీ నుండి ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నట్లు కళ్యాణ్ జ్యువెల్లర్స్ తెలిపింది. 2 గ్రాముల నుండి ఎంతమొత్తమైనా కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. ప్రముఖ బంగారం విక్రయదారులు తనిష్క్, కళ్యాణ్ జ్యువెల్లర్స్.. అక్షయ తృతీయ సేల్స్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్ ఏప్రిల్ 18వ తేదీ నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు కస్టమర్లకు ఆన్‌లైన్ సేల్స్ అందుబాటులో ఉంచింది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా నచ్చిన నగలను కొనుగోలు చేయవచ్చు. ఇందుకు తనిష్క్ సిబ్బంది వీడియో కాల్, ఆన్ లైన్ చాటింగ్ ద్వారా కస్టమర్లకు డిజైన్లు అందుబాటులో ఉంచుతారు. ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్నాక బంగారాన్ని ఇంటి వద్దకు డెలివరీ చేస్తారు. అలా కాదంటే కస్టమర్లు దగ్గరలోని తమ దుకాణం వద్ద తాము కొనుగోలు చేసిన వస్తువును పొందవచ్చునని కూడా ఆప్షన్ ఇచ్చింది. తమ వినియోగదారుల్లో చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని, వారి కోసం ఆన్ లైన్ సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్ బంగారం కొనుగోలు చేసిన తర్వాత గోల్డ్ ఓనర్‌షిప్ సర్టిఫికేట్ పేరుతో కొనుగోలు సర్టిఫికేట్ ఇస్తామని, దానిని కస్టమర్లు కోరుకున్న పద్ధతిలో అక్షయ తృతీయ రోజున వారికి అందిస్తార‌ట‌. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ధృవీకరణ పత్రంతో తాము కొనుగోలు చేసిన ఆభరణాన్ని పొందవచ్చు. లాక్ డౌన్ నేపథ్యంలో మొదటిసారి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని, తద్వారా అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయాలనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

తెలంగాణాలో లాక్ డౌన్ మరింత కఠినం: డీజీపీ

ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్‌డౌన్‌ అమలుపై చర్చించి.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం తీసుకున్న నిర్ణయాలను 21 నుంచి పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారుల నియంత్రణపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అత్యవసర సరుకుల సరఫరాకు కొందరికి పాసులు ఇచ్చాం. అవసరం లేకున్నా ఆ వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారు. పాసులు కలిగిన వ్యక్తి తిరగాల్సిన ప్రదేశాలను గుర్తించాం. వాహనదారులకు ఇచ్చిన పాసులపై సమీక్ష చేయాలని నిర్ణయించాం. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల పాసులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.  పాసు కలిగిన వ్యక్తి ఏ సమయానికి ఏ మార్గంలో వెళ్లాలనే విషయం గుర్తిస్తామన్నారు. కొత్త పాసులు ఇచ్చే వరకు పాత పాసులు కొనసాగుతాయి. నిత్యవసరాల కొనుగోలుకు 3 కిలోమీటర్ల లోపు మాత్రమే వెళ్లాలి. వాహనదారులు రెసిడెన్స్‌ ప్రూఫ్‌తోనే బయటకు రావాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు పాసులు ఇస్తామన్నారు. కలర్‌ కోడ్‌ ప్రకారం సంస్థలు ఉద్యోగులకు పాసులు ఇవ్వాలని పోలీసులకు సూచించారు.  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రాష్ర్ట వ్యాప్తంగా 1.21 లక్షల వాహనాలు సీజ్ చేశామన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యాక ఆ వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు. కోర్టు ద్వారానే వాహనాలు తీసుకోవాలి. సాధారణ జబ్బుల చికిత్సకు సమీప ఆస్పత్రులకు వెళ్లాలి. తీవ్ర ఆరోగ్య సమస్య ఉండి దూరం వెళ్తే రిఫరెన్స్ పత్రాలు వెంట తీసుకురావాలి. ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా రెసిడెన్స్ ప్రూఫ్స్ తీసుకురావాలని డీజీపీ సూచించారు. రేషన్ దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఆహార పంపిణీ చేసేవారు భౌతిక దూరం పాటించే బాధ్యత తీసుకోవాలని.  ఇళ్లల్లోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై చర్చించామన్నారు.

జూమ్ యాప్ పెళ్లిళ్లకు చట్టబద్ధత!

పెళ్లికాని ప్రసాద్ లకు కరోనా షాకిచ్చింది. పెళ్లిచేసుకుందామని అంతా రెడీ అయ్యాక కరోనా వైరస్ వచ్చి ఆపేసింది. ఒకటో, రెండో కాదు.. వందలాది పెళ్లిళ్లకు కరోనా దెబ్బ తగిలింది. ఏప్రిల్‌లో జరగాల్సిన వివాహాలన్నీ వాయిదాపడ్డాయి. క‌రోనా దెబ్బ‌తో ఈఏడాది చాలా పెళ్లిళ్ళు ఆగిపోయాయి. మ‌రో వైపు 'పెళ్లిళ్ల విషయంలో ఇప్పుడు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జూమ్‌ వీడియో కాల్ యాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు' అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. న్యూయార్క్‌ వాసులు వీడియో కాల్స్‌ ద్వారా పెళ్లిళ్లు చేసుకునేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ జారీ చేస్తున్నానని తెలిపారు. ఇటువంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లికాని ప్రసాద్ ల‌కు ఇది శుభ‌వార్తే మ‌రి. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలు విదేశాల్లో, మన దేశంలోనే వేర్వేరు ప్రాంతాలు, నగరాల్లో చిక్కుకుపోయారు. వారి సొంత ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో మరికొన్ని పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మే 4న విజయవాడలో వివాహం జరగాల్సిన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరూ అమెరికాలోనే చిక్కుకుపోయారు. వారు ఇప్పట్లో భారత్‌కు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పెళ్లి నిరవధికంగా వాయిదా వేశారు పెద్దలు.  అలాగే పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి విశాఖపట్నంలో, అమ్మాయి హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు. ఈ నెల 14న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ వివాహమూ వాయిదా పడింది. లాక్ డౌన్ కారణంగా ఎవరూ ఎక్కడినించి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి.  లాక్ డౌన్ ఎత్తేస్తారని భావించినా కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.  నెల రోజుల కిందటే ఏర్పాట్ల కోసం అడ్వాన్సులు ఇచ్చేశారు. కరోనా నేపథ్యంలో వివాహాన్ని వాయిదా వేశారు. కొందరు ముందుగానే శుభలేఖలు పంచేశారు. ప్రస్తుతం పెళ్లి వాయిదా పడిందని ఫోన్లలో సమాచారమిస్తున్నారు.  కల్యాణ మండపాలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్‌, డెకరేషన్‌, లైటింగ్‌, బ్యాండ్‌, మ్యారేజ్‌ ఈవెంట్‌ నిర్వాహకులకు అడ్వాన్సులు చెల్లించేశారు. మళ్లీ తాము అనుకున్న తేదీలకు అవి కుదురుతాయో లేదోనన్న ఆందోళన ఉంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ఆయా ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ఒక్క నిత్యావసర సేవలు మినహా మిగిలిన సేవలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. అదేసమయంలో ముందుగా కుదుర్చుకున్న వివాహాది శుభకార్యాలన్నీ వాయిదాపడుతున్నాయి. అయితే, కొందరు మాత్రం వీడియో కాల్స్ ద్వారా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివాహాలు వాయిదా పడకుండా ఉండేందుకు న్యూయార్క్ ప్రభుత్వం తాజాగా ఈ విషయంపై సానుకూలంగా ఆదేశాలు జారీచేసింది. వీడియో కాల్స్‌ ద్వారా పెళ్లి చేసుకుంటే సామాజికదూరం పాటిస్తూనే, వివాహం కూడా జరుపుకునే అవకాశం ఉండడంతో వాటికి అనుమతి ఇచ్చింది. దీంతో పెళ్లికి సిద్ధమైన యువత గవర్నర్‌ చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జూమ్ యాప్ ద్వారా ఒక్కటయ్యే జంటలు శోభనాలను ఏ విధంగా జరుపుకోవాలన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇదే అంశంపై నెటిజన్లు కూడా తమకు తోచిన రీతిలో సెటైర్లు వేస్తున్నారు.

పేదలు, వలస కూలీలు దుర్భ‌రంగా బ్ర‌తుకీడుస్తున్నారు!

కరోనా వైరస్ నివారణకు చేపట్టిన లాక్డౌన్ కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వలన రైతులు , పేద ప్రజలు , వలస కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యలు తీరాలంటే సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు.  గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. పిడుగుపాటుకు అనేకమంది రైతులు మృత్యువాత పడ్డారు. వారందరిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రైతుల సమస్యలు, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై చర్చించకపోవడం దురదృష్టకరం అన్నారు. దేశం మొత్తం లాక్డౌన్ తో ఇంటికే పరిమితం అయ్యారు. పేద ప్రజలు , రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఉన్నారు. వారిపై చర్చించకుండా మహిళలు డ్వాక్రా రుణాలు చెల్లించాలి, ప్రాపర్టీ టాక్స్ కట్టాలి అని ప్రభుత్వం ప్రకటించడం హేయమైన చర్య, ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  రాష్ట్ర  ప్రభుత్వం లాక్డౌన్ కాలంలో పెన్షనర్లకి కోత విధించకుడదు , ఇతరులపై ఆదరపడకుండా అత్మ గౌరవంతో బ్రతుకుతున్న వారికి కోత వింధించడం వల్ల వారికి కొత్త సమస్యలు వస్తాయన్నారు. కరోనపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న పంచాయితీ రాజ్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సహం అందించకపోవడం విచారకరం అన్నారు. పరిశ్యుద్ధ పనులు చేసి ప్రతి పల్లెను, గ్రామాన్ని శుభ్రంగా  ఉంచుతున్నారు. వారికోసం ఎంత చేసినా తక్కువే అన్నారు. కానీ అలాంటివారికి ప్రభుత్వం ఏమి చేయకపోవడం నిరుత్సాహపరిచింది అన్నారు.  రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ప్రకటించింది. దానికి అనుగుణంగా లేబర్ కమిషన్ బోర్డు ప్రతి భవన నిర్మాణ కార్మికునికి 1500 రూపాయలు అందించేలా తీర్మానం చేసి పంపిన సీఎం కేసీఆర్ ఆ తీర్మానం పై స్పందించకపోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా ఉన్నారని వారందరు లాక్డౌన్ లో ఎలాంటి పని లేకుండా ఇంటిపట్టున ఉంటున్నారని అన్నారు. బోర్డు నిర్ణయం ప్రకారం కార్మికులందరికి 1500 వందల రూపాయలు అందించేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.  గ్రామాల్లో సేవలందిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ ని విధుల్లోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోక పోవడం విడ్డురం అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.  ఈ కష్టకాలన్ని ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎంపీ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

క‌రోనాకు 45 రోజుల బాలుడు బ‌లి!

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్‌తో అత్యంత పిన్న వయస్కుడు మరణించాడు. కేవలం 45 రోజుల చిన్నారి కోవిడ్-19తో మరణించాడు. ఈ బాలుడి మృతితో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 21కి పెరిగింది. నారాయణపేట జిల్లాకు చెందిన బాలుడు మృత్యువాతపడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ బాలుడికి కరోనా సోకినట్లు నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ బాలుడు జన్మించాడు. ఇటీవల అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.  ఆ చిన్నారికి కరోనా ఎలా సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. చిన్నారికి కరోనా పాజిటివ్‌ రావడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా పాజిటివ్‌ సోకిన చిన్నారికి సంబంధించిన 18 మంది కుటుంబసభ్యులు, బంధువులు, ఓ వైద్యుడిని ఐసొలేషన్‌కు తరలించారు. వారి నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 93 మంది చిన్నారులు క‌రోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. 53 మంది చిన్నారులు గాంధీ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వైరస్ సోకిన ఈ చిన్నారులంతా 12 ఏళ్ల లోపువారే. వారిలో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 23 రోజుల పసికందుతో పాటు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. గాంధీ ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  హైదరాబాద్, మహబూబ్‌న‌గర్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన చిన్నారులకు వైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్ లోనూ 40 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. ఎక్కువ మంది దిల్లీలోని మర్కజ్ కు హాజరైనవారి కుటుంబసభ్యులేనని తేలింది.

ట్వీట‌ర్ వేదిక‌గా క‌న్నా, విజ‌య‌సాయిల మాట‌ల తూటాలు!

ఏపీలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు స‌మ‌స్య‌ల నుంచి నుంచి ప‌క్క‌కు త‌ప్పించేలా వైసిపి, బిజెపి బిజెపి మ‌ధ్య ట్విట్టర్ లో వార్ న‌డుస్తోందని టిడిపి ఆరోపిస్తోంది. కన్నా టీడీపీకి అమ్ముడుపోయారన్న విజయసాయి అంటున్నారు.  ఆయన పాపం పండిందన్న బీజేపీ చెబుతోంది. బీజేపీ వైసీపి మ‌ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కన్నా లక్ష్మీనారాయణ కరోనా కిట్లపై చేసిన ట్వీట్‌తో ఈ హీట్ మ‌రింత పెరిగింది. ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  కరోనా కిట్ల అంశాన్ని ప్రస్తావిస్తూ  కిట్లలో కూడా కమీషన్ కొట్టారా.. 'మన పక్కరాష్ట్రం ఛత్తీస్ గఢ్ కరోనా కిట్లను దక్షిణకొరియా నుండి కేవలం రూ. 337+GSTకి కొన్నారు. మరి మీరు అదే దక్షిణ కొరియా నుండి తెప్పించిన లక్ష కిట్లు ఎంతకు తెచ్చారంటూ క‌న్నా లక్ష్మీనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలతోనే రాజకీయంగా దుమారం రేగింది.  నా ప‌ట్ల నువ్వు చేసిన నిరాధార‌మైన ఆరోప‌ణ‌ల‌పై కాణిపాకంలో స‌త్య‌ప్ర‌మాణానికి నేను సిద్ధం, నువ్వు మాట మీద నిల‌బ‌డే మ‌నిషివి ఐతే వ‌చ్చి ప్ర‌మాణం చెయ్యి.  నీ వ్యాఖ్య‌ల‌కు ప‌రువు న‌ష్టం దావాకు సిద్ధంగా ఉండు. కిట్ల రేటుపై నేను ప్ర‌శ్నించ‌డం వ‌ల్లే వాటి రేటు బ‌య‌ట‌కు తెలిసి త‌క్కువ ధ‌ర‌కు ఇవ్వ‌డం నిజం కాదా? అంటూ క‌న్నాలక్ష్మీనారాయ‌ణ ట్వీట్ చేస్తూ విజ‌య‌సాయిరెడ్డిపై విరుచుకు ప‌డ్డారు. దేశ‌వ్యాప్తంగా మోదీ గారి ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎద‌గ‌క పోవ‌డానికి బాబుకు అమ్ముడు పోయిన క‌న్నా లాంటి వారే కార‌ణం. బాబు ప్యాకేజి ఆఫ‌ర్ ఎలాగుంటుందంటే రాజ‌కీయంగా అవ‌సాన ద‌శ‌లో ఉన్న వారినీ లేపి కూర్చోపెడుతుంది. మొద‌టి నుంచి బిజెపిలో ఉన్న వారు క‌న్నా లాంటి జంబూకాల‌ను వ‌దిలించుకోవాలంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని బీజేపీ కూడా గట్టిగా తిప్పికొట్టింది. ఈసారి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాకుండా.. పార్టీ అధికారిక ట్విట్టర్‌ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాస్త క‌ళ్ళ జోడు తుడుచుకుని పెట్టుకుని చూడండి ఇది ఏపీ బిజెపి. క‌రోనా వ‌చ్చి రాష్ట్రం ఇప్ప‌డు క్వారంటేయిన్లో ఉంటే త‌ము చేసిన ప‌నుల‌కు 2012లోనే మీరు క్వారంటేయిన్లో ఉన్నారు. ఈ కిందివి మీ డిగ్రీలు కాదు త‌మ‌రి నేర ఘ‌న‌త‌లు. పైత్యంతో ఉన్న కొద్ది ప‌రువునూ తీసుకోకండి సూట్ కేసు రెడ్డి... అంటూ ఏపి బిజెపి  నేత‌లు ట్వీట్ చేశారు.  క‌న్నా లక్ష్మీనారాయణ రూ. 20 కోట్ల రూపాయలకు చంద్రబాబుకు అమ్ముడుపోయారని.. టీడీపీ మాజీ నేత, ఎంపీ సుజనా చౌదరి ద్వారా డీల్ జరిగిందని విమర్శించారు. సుజనా చౌదరి మధ్యవర్తిత్వం నిర్వహించి చంద్రబాబు, కన్నాను కలిపారని.. అందుకే చంద్రబాబు తరహాలోనే క‌న్నా క‌న్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపణలు చేస్తున్నారని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు. మ‌ళ్లీ అడుగుతున్నా... క‌న్నా! మీరు సుజ‌నాకు అమ్ముడు పోయారా? లేదా? టీజేపి (టీడీపీ జాకాల్స్ పార్టీ) వారు కాకుండా బీజీపీ వారు నా మీద విమ‌ర్శ‌లు చేస్తే స‌మాధానం ఇస్తానంటూ ట్వ‌ట‌ర్‌లో విజ‌య‌సాయి రెడ్డి స్పందించారు.  ఈ మధ్య మాటల యుద్ధం లాక్‌డౌన్‌లో వున్న ఏపీ జ‌నాల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తోంద‌ట‌. మరికొద్ది రోజుల పాటూ ఇలాగే కొనసాగి రాజ‌కీయ నేత‌ల‌కు సంబంధించిన అస‌లు విష‌యాలు అన్నీ బ‌య‌టికి వ‌స్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.