అర్ధరాత్రి నుంచి పెరగనున్న టోల్ ఫీ!

ఈ అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ రేట్లు అమలులోకి రానున్నాయి.  లైట్ మోటార్, కమర్షియల్ వాహనాలపై రూ. 5 పెరుగుదల కాగా, బస్సు, ట్రక్కులపై రూ.10 పెంపు, 3 నుంచి 6 భారీ యాక్సిల్ వాహనాలపై రూ.15 పెరుగుదల ఉంటుంది.  7 యాక్సిల్స్ దాటిన వాహనాలపై రూ.20 పెంపు . టోల్ ఫీజు బాదుడు మళ్లీ మొదలుకానుంది. కరోనా లాక్‌డౌన్ వల్ల గత నెల 25 నుంచి టోల్ ఫీజును రద్దు చేశారు. ఈ నెల 20 నుంచి చాలా రంగాలకు లాక్ డౌన్ నుంచి సడలింపు ఇవ్వడంతో తిరిగి టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)ను కోరింది. ఏప్రిల్ 20 నుంచి టోలు వసూళ్లు ప్రారంభించాలని పేర్కొంది. దీనిపై సరుకు రవాణా వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఇప్పటికే నష్టపోయామని, టోల్ ఫీజును తాము భరించలేమంటున్నారు. ఫీజు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని, తమకు ఉపశమనం కల్పించాలని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) కోరింది. అయితే లాక్ డౌన్ వల్ల తమకూ భారీ నష్టాలు వచ్చాయంటున్న ఎన్‌హెచ్ఏఐ, రోడ్లను నిర్వహించే ప్రైవేటు కంపెనీలు వారి వినతిని పట్టించుకునే అవకాశం లేదు.

ఈ నెల కూడా ఉద్యోగుల వేత‌నాల్లో కోత‌!

ఏప్రిల్ నేల‌ వేత‌నాల్లో కూడా మార్చి నెల‌లానే జీతాల్లో కొత కొన‌సాగుతుంద‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. పెన్ష‌న‌ర్ల‌కు 75 శాతం ఇవ్వాల‌ని క్యాబినెట్‌లో నిర్ణ‌యించారు. డాక్ట‌ర్ల‌కు, పారిశుద్ధ్యకార్మికుల‌కు గ‌త నెల‌లో ఇచ్చిన‌ట్లుగానే ఈ నెల కూడా ప్రోత్స‌హాకాలు ఇవ్వ‌డంతో పాటు పోలీసుల‌కు కూడా 10 శాతం సి.ఎం. గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని క్యాబినెట్‌లో నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. అద్దెకు ఉండే వారి వ‌ద్ద నుంచి మార్చి, ఏప్రిల్‌, మే ఈ మూడు నెల‌ల అద్దెల‌ను వ‌సూలు చేయ‌వ‌ద్దు. ఆ త‌రువాత నెల‌ల్లో వాయిదా ప‌ద్ద‌తిలో వ‌సూలు చేసుకోమ‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. పెనాల్టీ లేకుండా ప్రాప‌ర్టీ ట్యాక్స్ చెల్లించ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ప్రైవేట్ విద్యాసంస్థ‌లు ఒక్క పైసా ఫీజు కూడా పెంచ‌డానికి వీలులేద‌ని, నెల వారీగా ట్యూష‌న్ ఫీజు మాత్ర‌మే వ‌సూలు చేసుకోమ‌ని ముఖ‌మంత్రి ఆదేశించారు. స్కూల్ యాజ‌మాన్యాలు అతిగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సి.ఎం. హెచ్చ‌రించారు. తెల్ల‌రేష‌న్ కార్డు హోల్డ‌ర్ల‌కు మ‌ళ్లీ మ‌రోసారి 12 కేజీల బియ్యంతో పాటు 1500 రూపాయ‌లు  ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి భ‌రోసా ఇచ్చారు.

మే 7 వ‌ర‌కు స్విగ్గీ, జొమాటోల‌పై బ్యాన్! విమాన ప్ర‌యాణీకులెవ‌రూ రావ‌ద్దు!

కంటైన్‌మెంట్‌లో వున్న ప్ర‌జ‌లు నిబంధ‌న‌లు పాటించాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. విమాన స‌ర్వీసులు వున్న 7వ తేదీ వ‌ర‌కు ఎవ‌రూ తెలంగాణాకు రాకండి. ఎందుకంటే ట్యాక్సీ వుండ‌దు. హోట‌ల్స్ కూడా వుండ‌వు. క‌నుక ఎవ‌రూ కూడా విమాన ప్ర‌యాణీకులు మే 7వ తేదీ వ‌ర‌కు తెలంగాణాకు రావ‌ద్ద‌ని సి.ఎం. విజ్ఞ‌ప్తి ఇచ్చారు. ఈ లాక్‌డౌన్‌లో ఎవ‌రూ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోకుండా స్విగ్గీ, జొమాటోల‌ను తెలంగాణాలో బ్యాన్ చేస్తున్న‌ట్లు సి.ఎం. ప్ర‌క‌టించారు. ప‌ది పదిహేను రోజులు పిజ్జా తిన‌క‌పోతే ప్రాణం పోదు. బ‌య‌టి నుంచి తినుబండారాలు తెప్పించుకోవ‌ద్ద‌ని సి.ఎం. విజ్ఞ‌ప్తి చేశారు. పండుగ‌లు, ప్రార్థ‌న‌లు ఇళ్ల‌కే ప‌రిమితం కావాలి. సామూహిక ప్రార్థ‌న‌ల‌ను అనుమ‌తించ‌మ‌ని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు. అన్నీ ఆల‌యాల‌ను మూసివేశాం. ఎవ‌రికీ మిన‌హాయింపులు లేవు. ఏ మ‌తంలోనూ సామూహిక కార్య‌క్ర‌మాల‌ను అనుమ‌తించ‌మ‌ని సి.ఎం. స్ప‌ష్టం చేశారు.

ఏపీ లో ఎక్కడి ప్రభుత్వ ఉద్యోగులు అక్కడే!

విజయవాడలో నివసిస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు పనిచేస్తున్న చోటే ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శాఖాపరమైన ఉత్తర్వులు జరీ చేసింది. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. బయటి ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉద్యోగులకు ఆంక్షలు విధించింది. పనిచేసే ప్రాంతాల్లోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాలని, సోమవారం నుండి నగరంలోకి అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.  మే 3వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.

తెలంగాణాలో మే 7వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు!

తెలంగాణాలో సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లు అవుతుంది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్రం ప్ర‌క‌టించిన‌ స‌డ‌లింపులు తెలంగాణాలో అనుమ‌తించమ‌ని ముఖ్య‌మంత్రి కేసిఆర్ స్ప‌ష్టం చేశారు. ఏప్రిల్ 30 వ‌ర‌కు తెలంగాణా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ కొన‌సాగాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌రువాత కేంద్రం మే 3వ తేదీ వ‌ర‌కు వుండాల‌ని చెప్పింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని స‌ర్వేలు చేయించాం. 92 శాతం లాక్‌డౌన్ పొడిగించాల‌ని వ‌చ్చింది. ఈ అభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణాలో లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వ‌ర‌కు పెంచాల‌ని ఈ రోజు స‌మావేశ‌మైన తెలంగాణా క్యాబినెట్ నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. గ‌తంలో వున్న నిబంధ‌న‌లే వుంటాయ‌ని సిఎం తెలిపారు.

ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో అక్రమాలు జరగలేదు: కాటంనేని భాస్కర్ 

ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటం నేని భాస్కర్ ఖండించారు. దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ నుంచి కరోనా ర్యాపిడ్ కిట్లను ఏపీ దిగిమతి చేసుకుందని, దక్షిణ కొరియా కంపెనీకి చెందిన మ్యానుఫాక్చర్ యూనిట్ మన దేశంలో ఉందని ఆయన చెప్పారు. మనం ఆర్డర్ ఇచ్చే నాటికి దేశంలోని ఆ కంపనీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్టుకు అనుమతి రాలేదన్నారు. ఇండియాలోని ఆ కంపెనీ యూనిట్ నుంచి చత్తీస్ ఘడ్ కొనుగోలు చేసిందని, ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకు ఇస్తే అదే ధర ఇస్తామని తమ ఒప్పందంలో ఉందని కాటంనేని భాస్కర్ చెప్పుకొచ్చారు. కాబట్టి చత్తీస్ ఘడ్ రాష్ట్రం చెల్లిస్తున్న ధరనే చెల్లిస్తామని, భవిష్యత్తులో ర్యాపిడ్ కిట్ ధర రూ. 50కే పడిపోతుందని కూడా ఆయన అన్నారు.  కరోనా బాధితుడికి.. ఆ వైరస్ ఎక్కడ నుంచి సోకిందో తెలియకుంటే కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ఉన్నట్టే అని ఆయన స్పష్టం చేశారు. సుమారు 40 కేసుల్లో వైరస్ ఎక్కడి నుంచి సోకిందో ట్రేస్ కావడం లేదని, మెడికల్ షాపుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరానికి ఎవరికైనా  మందులిస్తే వారి వివరాలు చెప్పాలని మెడికల్ షాప్ కీపర్లను కోరామన్నారు. కొన్ని నెలల్లో వాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, కరోనాకు మందులు.. వాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిందేనని కాటంనేని భాస్కర్ సూచించారు. ప్రస్తుతం టెస్టుల సంఖ్య 5 వేలుగా ఉందని, ఎనిమిది ల్యాబులు ఉన్నాయి.. ట్రూనాట్ పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని, చైనా నుంచి వచ్చే కిట్ల విషయంలో ఆ దేెశం విధించిన కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, త్వరలో 10-12 వేల మేర టెస్టుల సామర్ద్యం పెంచుకుంటామని చెప్పారు.

కేంద్రం ప్ర‌క‌టించిన‌ స‌డ‌లింపులు తెలంగాణాలో అనుమ‌తించం!

ఈ రోజు కూడా 18 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దీంతో పాజిటివ్ వ‌చ్చిన వారి సంఖ్య‌ 858 మంది. ఇప్ప‌ట్టి వ‌ర‌కు 21 మంది మృతి చెందారు. 186 మంది పూర్తిగా కోలుకున్నారు. 651 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణాలో నాలుగు జిల్లాల్లో అస‌లు కేసులే న‌మోదు కాలేదు. దేశంలో డ‌బుల్ కావ‌డానికి 8 రోజులైతే. తెలంగాణాలో 10 రోజుల‌కు పేషంట్ల సంఖ్య డ‌బుల్ అయింది. మిలియ‌న్ మందిలో దేశంలో 254 మందికి టెస్ట్ చేస్తుంటే తెలంగాణాలో 375 మందికి టెస్ట్ చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసిఆర్ చెప్పారు. ప్రారంభంలో మెడిక‌ల్ స‌దుపాయాలు త‌క్కువ‌గా ఉండేవి. ఇప్పుడా ప‌రిస్థితి లేదు. పూర్తి స్థాయిలో అవ‌స‌ర‌మైన మెడిక‌ల్ స‌దుపాయ‌లు, కిట్స్‌, మాస్క‌లు, ఎక్విప్‌మెంట్ పూర్తి స్థాయిలో వుంది. అవ‌స‌ర‌మైన మందులన్నీ అందుబాటులో వున్నాయి. ముఖ్యంగా గ‌ర్భిణీల‌కోసం అమ్మ ఒడి వాహ‌నాల్ని సిద్ధంగా వుంచాం. త‌ల‌సేమియా పేషంట్ల‌కు ర‌క్త కొర‌త లేకుండా చూసుకుంటున్నాం. ప్ర‌స్తుతం 42 దేశాలు సంపూర్ణ లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. చైనా 77 రోజులు లాక్ డౌన్ పాటించిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. తెలంగాణాలోనూ లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. మే 3వ వ‌ర‌కు కేంద్రం ప్ర‌క‌టించింది. అయితే కేంద్రం కొన్ని విష‌యాల్లో స‌డ‌లింపులిచ్చింది. అయితే తెలంగాణాలో వున్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి స‌డ‌లింపుల‌కు తెలంగాణాలో అనుమ‌తించ‌రాద‌ని క్యాబినెట్ లో నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.

కిట్ ఒకటే.. రేటు తేడా అంటే ఏమిటి?

* రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి  * విజయసాయి రెడ్డి సోషల్ మీడియా టీమ్ ఫేక్ ట్వీట్లు చేస్తోందంటూ టీ డీ పీ మండిపాటు  తెలుగు దేశం సీనియర్ నాయకుడు, ఎం ఎల్ ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ర్యాపిడ్ కిట్ల విషయం లో పాలక వై ఎస్ ఆర్ సి పి ని కడిగిపారేశారు.  మొన్న పారాసిటమాల్ వేసుకుంటే చాలన్నారని, ఇప్పుడు రూ.337+ జీఎస్టీతో పక్క రాష్ట్రం కొంటే.. మనం మాత్రం రూ.730+ జీఎస్టీతో కొన్నామని, ఇంతకంటే బాధ్యతాహీనమైన నాయకత్వం ఉంటుందా అని బుచ్చయ్య ప్రశ్నించారు. అలాగే, జే ట్యాక్స్ ఎంతో,  కమిషన్ ఎంతో, . థర్డ్ పార్టీ ట్యాక్స్ ఎంతో కొంచం వివరిస్తారా, అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.  క‌రోనా కిట్ల‌లో 8 కోట్లు గోల్ మాల్ జరిగిన విషయమై ఇప్పటికే విపక్షాలు తీవ్ర స్వరం తో ప్రశ్నించటం తో పాటు, చ‌త్తీస్‌గ‌ఢ్ మంత్రి ట్వీటుతో బ‌య‌ట‌ప‌డిన జ‌గ‌న్ స్కామ్‌ గురించి, సౌత్‌కొరియా నుంచి ఏపీకొచ్చిన ల‌క్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల లో జరిగిన అవినీతి గురించి ప్రస్తావించాయి కూడా.  చ‌త్తీస్‌గ‌ఢ్ ఒక్కో కిట్ 337కి కొంటే..ఏపీ ఒక్కో కిట్ 1,200 కు కొనుగోలు చేయటం, రెండు రాష్ట్రాలూ సౌత్‌కొరియా నుంచే కిట్లు తెప్పించుకున్నాయనీ, ఒక కిట్‌కి జ‌గ‌న్ అండ్ టీమ్‌ 800 క‌మీష‌న్ కొట్టేసిందనీ విపక్షాలు ఆరోపించాయి.   క‌రోనా ఉందో లేదో తెలుసుకునేందుకు ల‌క్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించామ‌ని సీఎమ్ ప్ర‌క‌టించారు. అందులో ఒక కిట్‌తో తాను టెస్టింగ్ చేయించుకుని మీడియాకి రిలీజ్ చేశారు. ఇలా ప‌రీక్ష చేయించుకోకూడ‌ద‌ని కేంద్రం త‌లంట‌డంతోపాటు ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన ప‌నికిమాలిన ప‌ని ఇంకెవ‌రూ చేయొద్దంటూ కేంద్ర వైద్యారోగ్య శాఖ అన్ని రాష్ట్రాల‌కూ నోట్ పంపింది. ఈ సంద‌ట్లోనే తెల్లారేస‌రికి ఒక ఫేక్ ట్వీటు రెడీ చేసి నారా లోకేశ్ చేసిన‌ట్టు ఒక ట్వీట్ వైరల్ అయిందని తెలుగుదేశం గమనించింది.  స‌డెన్‌గా లోకేశ్‌పై ఫేక్ ట్వీటేయ‌డానికి కార‌ణం అంతుబ‌ట్ట‌క టీడీపీ సోష‌ల్ మీడియా త‌ల‌లు ప‌ట్టుకుంది. ఇంత‌లోనే చ‌త్తీస్ గ‌డ్ మంత్రి టీఎస్ సింగ్ డియో ఒక ట్వీట్ వేశారు. అదేంటంటే సౌత్ కొరియా నుంచి తాము ఒక్కో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ రూ.337కే లెక్క 75,000 కిట్లు తెప్పించామ‌ని ట్వీట్ పెట్టారు. దేశంలోనే ఇంత త‌క్కువ‌కు ఈ కిట్లు తెప్పించింది మేమేనంటూ గ‌ర్వంగా ప్ర‌క‌టించారు. ఇక్క‌డే ఏపీలో జ‌గ‌న్ అండ్ గ్యాంగ్ చేసిన స్కామ్ బ‌య‌ట‌ప‌డింది. ఏపీ ఒక్కో కిట్ రూ.1200 లెక్క‌న 1 లక్ష కిట్లు తెప్పించింది. చ‌త్తీస్‌గ‌ఢ్‌కి ఏపీకి ఒక్కో కిట్‌కి మ‌ధ్య రేటు తేడా 863 రూపాయ‌లు. జీఎస్టీ క‌లుపుకుంటే చ‌త్తీస్‌గ‌ఢ్ 400కి ఒక కిట్ ప‌డుతుంది. అంటే ఏపీ తెప్పించిన కిట్ ఒక్కో దానిపై 800 కొట్టేశార‌న్న‌మాట‌. ఇవి ఎవ‌రికి చేరుంటాయో పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు క‌దా! కిట్‌కి 800 క‌మీష‌న్ లెక్క‌న 1 ల‌క్ష కిట్లు అంటే 8 కోట్ల‌కు పైగానే ఒక్క కిట్ల‌లోనే కమీషన్ నడిచిందని టీ డీ పీ ఆరోపించింది.  ఒక ప‌క్క క‌రోనా లేదంటూనే రాష్ట్రాన్ని శ్మ‌శానం చేస్తున్నారు. త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తూ, క‌రోనా నిబంధ‌న‌లంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌వారిపైనా, సోష‌ల్ మీడియాపైనా కేసులు బుక్ చేస్తూ...మ‌రో వైపు ఇలా కోట్లు కొల్ల‌గొట్టేస్తున్నారు. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు నారా లోకేశ్ పేరుతో విజ‌య‌సాయిరెడ్డి టీమ్ ఫేక్ ట్వీట్లు రెడీ చేసి సోష‌ల్ మీడియాలో వ‌దులుతోందని టీ డీ పీ ఆరోపిస్తోంది.

తెలంగాణలో ఉన్నంత కఠినంగా, ఆంధ్ర లో ఎందుకు ఉండలేకపోతున్నారు?

* కర్నూలు లో వర్గ సంతుష్టీకరణ రాజకీయాలు  * ఎం ఎల్ ఏ ఒత్తిడికి తలొగ్గిన కలెక్టర్, ఎస్ పి  * ఇంతియాజ్ మామ గారిని వెనకేసుకు రావడానికి కారణమేమిటి  ఆంధ్ర ప్రదేశ్ లో వర్గ సంతుస్టికరణ రాజకీయాలు జరుగుతున్నాయా? కళ్లెదుట కనపడుతున్న సంఘటనలు చూస్తుంటే, ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. కర్నూల్ వైసీపీ ఎం ఎల్ ఏ హఫీజ్ ఖాన్ అధికార దుర్వినియోగం, రాజకీయ ఒత్తిడి లకి తలొగ్గిన కలెక్టర్ వీర పాండ్యన్, జిల్లా  ఎస్ పి ఫకీరప్ప ల వైఖరి, తన మామ గారు కరోనా కారణంగా మరణించినా, ఆ విషయాన్ని దాచిపెట్టారని అభియోగాలు ఎదుర్కుంటున్న కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ధోరణి రాష్ట్ర ప్రభుత్వ 'మత' సంతుష్ట రాజకీయాలకు అడ్డం పడుతోందనే భావన బలీయంగా వ్యక్తమవుతోంది.  కర్నూల్ లోకల్ ఎం ఎల్ ఏ  హఫీజ్ ఖాన్ మర్కజ్ నుండి వచ్చిన వాళ్ళని గుర్తించకుండా, మర్కజ్ నుండి వచ్చిన వాళ్ళని కలిసిన వాళ్ళని గుర్తించనివ్వకుండా తన అధికారాన్ని అడ్డుపెట్టి 15 రోజుల క్రితం చేసిన తప్పులు నెమ్మదిగా ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. ప్రవేట్ డాక్టర్ లు ఓ పి లు చూడకూడదు అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా,  ఎం ఎల్ ఏ  హఫీజ్ ఖాన్ తెలిసిన వ్యక్తి కావడం తో కర్నూల్ లో ప్రముఖ గుండె జబ్బుల వైద్యుడు ఇస్మాయిల్ హుస్సేన్ , కె ఎం ప్రయివేట్ హాస్పిటల్ అధినేత ఈ నెల 10 వరకు ఓ పి చూశారు, 14 న కరోనా తో మరణించారు. సుమారు ఆయన 15 రోజుల పాటు 4 వేల మందికి పైగా వైద్యం చేశారు .  స్థానికుల అనుమానం ప్రకారం మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని రహస్యంగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా నే ఈయన కి కరోనా వచ్చినదని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. అంటే మర్కజ్ వెళ్లి వచ్చిన వారిని దాచడం, వాళ్ళు అక్కడి మసీదులో ఉన్నారని పోస్ట్ పెట్టిన వాళ్లపై తప్పుడు కేసు పెట్టడం, మర్కజ్ వెళ్లిన వాళ్ళ వివరాలు బయటకు రాకుండా వాళ్ళకి రహస్యంగా హఫీజ్ ఖాన్ నే తనకు తెలిసిన ఇస్మాయిల్ అనే డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయించాడేమో అనే అనుమానాలు స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అంతే కాదు ఆ ప్రముఖ డాక్టర్ విజయవాడ కలెక్టర్ ఇంతియాజ్ కి స్వయానా మామ గారు. కర్నూల్ లో కోవిడ్ టెస్ట్ ల్యాబ్ పెట్టినా ఇప్పటివరకు దానిలో ఒక్క టెస్ట్ కూడా జరగలేదు , టెక్నీషియన్ రాలేదు.కానీ ఇస్మాయిల్ హుస్సేన్ అనే డాక్టర్ కి మాత్రం 11 వ తారీఖు న కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. అదే శాంపిల్ ని మళ్ళీ హైదరాబాద్ పంపిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. కర్నూల్ కలెక్టర్, ఎస్ పి , ఎం ఎల్ ఏ లు తమకు తాముగా  తీసుకున్న నిర్ణయం వల్లనా, లేక, ప్రభుత్వం లోని కొందరి పెద్దల ఒత్తిడి కారణంగా  ఆ నిర్ణయాలు తీసుకున్నారా, అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఈ-కామర్స్ సైట్ల విక్రయాలకు మోకాలడ్డిన భారత ట్రేడర్ల సమాఖ్య 

కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి లాక్ డౌన్ నిబంధనలను కాస్త సడలించే ప్రయత్నాలు చేస్తోంది. అనేక కార్యకలాపాలకు ఆమోదం తెలిపింది. అయితే ఈ-కామర్స్ సైట్లలో ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువుల అమ్మకాలు కుదరదని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. గత ప్రకటనలో, ఈ-కామర్స్ పోర్టళ్లు ఎలక్ట్రానిక్స్ వస్తువుల విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇచ్చింది. తాజా మార్గదర్శకాల్లో మాత్రం వాటికి అనుమతి లేదంటూ స్పష్టం చేసింది. దీనికి కారణం అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) అని తెలుస్తోంది. ఈ-కామర్స్ సైట్ల ద్వారా ఇతర వస్తువుల అమ్మడంపై జోక్యం చేసుకోవాలంటూ సీఏఐటీ ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ పరిణామం తర్వాతే కేంద్రం తాజా ప్రకటన చేస్తూ ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువుల అమ్మకాలపై యూటర్న్ తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సీఏఐటీ జాతీయ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ స్పందిస్తూ, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఇతర వస్తువులను కూడా విక్రయించాలన్న ఈ-కామర్స్ వెబ్ సైట్ల దురుద్దేశపూర్వక ప్రణాళికలను సీఏఐటీ ఖండిస్తోందని అన్నారు.  ఈ విషయంలో తాము హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు. అంతకుముందు, ఇదే అంశంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా హోంమంత్రిత్వశాఖకు లేఖ రాశారు. లేఖలు, విజ్ఞాపనలు అన్నింటినీ పరిగణలోని తీసుకున్న కేంద్రం ఈ-కామర్స్ పోర్టళ్ల విక్రయాలకు తాత్కాలికంగా కళ్లెం వేసింది.

ఐఏఎస్ లంటే, 'అయ్యా' ఎస్ లు కాదన్న నీలం సాహ్నీ!

* నిమ్మగడ్డ రమేష్ కేసులో కౌంటర్ దాఖలు విషయం లో చీఫ్ సెక్రెటరీ రోల్ ను విస్మరించడం పై విస్మయం  * తన జోక్యం లేని విషయాలపై తనను బాధ్యురాలిని చేస్తానంటే, ఒప్పుకునేది లేదన్న నీలం సాహ్నీ  ఎన్నికల కమిషనర్ పదవి కాలం కుదించడంతో బాటు మాజీ న్యాయమూర్తిని నియమించటానికి చేసిన చట్ట సవరణ ఇప్పుడు ఐ ఏ ఎస్ సర్కిల్స్ మధ్య పెద్ద అంతరానికి దారి తీసింది.  రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ జారీ చేసిన 617, 618 జీవోలే చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీకి, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేదీకి మధ్య గ్యాప్ పెరగటానికి కారణంగా తెలుస్తోంది.  కొత్తగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్డినెన్సు చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారు. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసుకు వెళ్ల కుండా నేరుగా పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ నే జీవోలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు అందగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో కౌంటర్ రూపొందించారని తెలిసింది. అయితే ఈ కౌంటర్ పై సంతకం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరాకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అన్ని కార్యక్రమాలు తన ప్రమేయంతో జరగనందున కౌంటర్ దాఖలు చేసే పని కూడా తాను చేయలేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారని అంటున్నారు. దాంతో పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తన జోక్యం లేని విషయాలపై తనను బాధ్యురాలిని చేస్తానంటే తాను అలాంటి బాధ్యతను తీసుకునేది లేదని నీలం సహానీ కరాఖండిగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి, చీఫ్ సెక్రెటరీ విధుల్లో నేరుగా వేలు పెట్టడం ద్వారా, సి ఎం ఓ ముఖ్య కార్యదర్శి హోదాలో ప్రవీణ్ ప్రకాష్ ఒక్క సారిగా వార్తల్లోకి వచ్చారు. ఆ క్రమంలో జరిగిన డెవలప్మెంట్స్ దరిమిలా, ఎల్ వీ సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రెటరీ పదవి కి దూరం కావటం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత, ప్రవీణ్ ప్రకాష్, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తుండటం వల్ల, ఆయన ప్రాధాన్యం అమాంతం పెరిగిపోవడం, సహజంగానే, చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీ ని కొంత అసంతృప్తికి లోను చేసింది. ఒక దశలో ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతారని కూడా ప్రచారం జరిగింది. అయినప్పటికీ, కరోనా కారణంగా ఆ ఇష్యూ మరుగున పడిపోయింది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో, ప్రవీణ్ ప్రకాష్ మాదిరే, గోపాల కృష్ణ ద్వివేది కూడా వ్యవహరించారనే భావన ఆమెకు కలగడం ఇప్పుడు వివాదానికి అసలు కేంద్ర బిందువుగా మారింది. చీఫ్ సెక్రెటరీ ఉన్నది కేవలం సంతకాలు పెట్టడానికేనా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్న ఈ తరుణంలో, ఐ ఏ ఎస్ ల మధ్య గ్యాప్ పెరగడం కార్యనిర్వాహక వ్యవస్థ కు అంతగా మంచిది కాదనే అభిప్రాయమే సచివాలయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

6 రోజుల్లోనే కరోనా నయం చేస్తాడ‌ట‌!

గోవాకు చెందిన మహేష్ దెగ్వేకర్ వృత్తి రీత్యా టీచ‌ర్‌.  రెండ్రోజుల క్రితం ఓ స్వప్న చూశాడ‌ట‌. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని షేగావ్‌కు చెందిన 19వ శతాబ్దపు హిందూ గురువు గజానన్ మహరాజ్ ఆ స్వప్నంలో దర్శనమిచ్చారు. కోవిడ్-19ని నయం చేయడానికి గజానన్ మహరాజ్ ఓ ఆయుర్వేద ఫార్ములా చెప్పార‌ట‌.  అంతే ఈ విష‌యాన్ని ఆ టీచ‌ర్ త‌న స‌న్నిహిత‌ల‌తో షేర్ చేసుకున్నాడు. ఈ విష‌యం కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ దృష్టికి వెళ్ళింద‌ట‌. అంతే మంత్రి గారు వెంట‌నే స్పందించారు.  స్వయంగా దెగ్వేకర్‌ను కలుసుకున్నారు. దెగ్వేకర్ ఫార్ములా శాస్త్రీయతను తెలుసుకునేందుకు మంత్రిత్వ శాఖకు పంపుతున్నట్టు కూడా కేంద్ర మం త్రి ప్రకటించారు. 'గత ఎనిమిదేళ్లుగా ధ్యానంలో నాకు గజానన్ మహరాజ్ దర్శనమిస్తున్నారు. ఛాతీ నొప్పు, ప్రొస్టేట్లు సక్రమంగా పనిచేయకపోవడం, అధిక రక్తపోటు వంటి అస్వస్థతలకు ఆయుర్వేదంతో ఎలా నయం చేయవచ్చో ఆయన సూచిస్తుండే వారని దెగ్వేకర్ చెబుతున్నారు.   గత వారం ఒక విద్యార్థి తన వద్దకు వచ్చి కరోనా వైరస్‌ నుంచి విముక్తి కోసం గజానన్ మహరాజ్‌ను అడగాలని కోరాడు. ఆ తర్వాత 10 సెకండ్లలోనే స్వామి దర్శనమిచ్చి కరోనా నివారణ గురించి చెప్పారు' అని దెగ్వేకర్ తెలిపారు. ఇంత‌కు క‌ల‌లో స్వామి వారు చెప్పిందేమిటంటే... నిమ్మరసం, అల్లం రసం, జీలకర్ర పౌడరు, వెల్లుల్లి రేకులు, స్థానికంగా లభించే గుమ్మడి లేదా పుచ్చకాయ కలగలిపిన మిశ్రమం కోవిడ్-19 విరుగుడుకు మహత్మర ఔషధమని దెగ్వేకర్ తెలిపారు.  కోవిడ్-19 పేషెంట్ ఎవరైనా ఈ మిశ్రమాన్ని పుచ్చుకున్న మూడు రోజుల్లోనే ఫలితం కనపించడం మొదలవుతుందని, ఆరు రోజుల్లో పూర్తిగా నయమై, ఏడో రోజు ఇంటికి వెళ్లిపోవచ్చనని ఆయన వివరించారు.

గోవా కరోనా నుంచి బయటపడింది! 

ఇండియాలో కరోనా పాజిటివ్ లు నమోదై, ఆపై రోగులందరూ కోలుకున్న తొలి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే, ఈ ఘనత డాక్టర్ల శ్రమ, కృషితోనే సంభవించిందని ఆయన అన్నారు.  ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "సున్నాకు ఎంతో విలువ ఉంది. గోవాలోని కొవిడ్-19 పాజిటివ్ కేసులన్నీ ఇప్పుడు నెగటివ్ అయ్యాయని వెల్లడించేందుకు చాలా సంతోషంగా ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి, రోగులకు చికిత్సలు అందించి, వారి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు, వారితో కలిసి నడిచిన హెల్త్ వర్కర్లకు చాలా రుణపడివుంటాం" అని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ ఎంత ముఖ్యమో గుర్తుంచుకుని, అందుకు తగ్గట్టుగా నిబంధనలు పాటిస్తూ, ప్రజా జీవితాన్ని ముందుకు తీసుకువెళతామని అన్నారు. సామాజిక దూరాన్ని ప్రజలు పాటించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన గైడ్ లైన్స్ ను పాటించాలని పిలుపునిచ్చారు.  గోవాను కరోనా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ం చీఫ్ సెక్రటరీ పరిమల్ రాయ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి నీలా మోహనన్ తదితరులు చేస్తున్న కృషి ఫలించిందని అన్నారు.

పరిశోధనల దిశగా టీటీడీ ఆయుర్వేదం

* ఆ 5 మందులకు డిసెంబరు లోగా లైసెన్స్. *  టీటీడీకి ఆయుష్ ప్రశంస  వైద్యం, మందుల తయారీ వరకే సేవలు అందిస్తున్న టీటీడీ ఆయుర్వేద విభాగం మందుల తయారీలో పరిశోధనల దిశగా ఆలోచన చేస్తోంది. కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు యుద్ధ ప్రాతిపదికన 5 రకాల మందులు తయారుచేసి వాటిని పంపిణీ చేసిన విధానాన్ని ఆయుష్ శాఖ ప్రశంసించింది. దీంతో    సరికొత్త ఫార్ములాలతో మరింత శక్తివంతమైన మందులు తయారు చేసి ప్రజల్లోకి పంపే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.   సరికొత్త ఫార్ములాతో       కరోనా (  కోవిడ్ 19 ) నుంచి తమ ఉద్యోగులకు రక్షణ కల్పించే ప్రయత్నాల్లో భాగంగా టీటీడీ యాజమాన్యం ఎస్ వీ ఆయుర్వేద కళాశాల, వైద్యశాల, ఫార్మశీ ల నేతృత్వం లో క్రిమిసంహారక ధూపం, ముక్కులో వేసుకునే చుక్కల మందు, నోరుపుక్కిలించే ద్రావకం, చేతులు శుభ్రం చేసుకునే ద్రావకం, రోగనిరోధక శక్తి పెంచే  5 రకాల మందులను తయారు చేయించి పంపిణీ చేసిన విషయం తెలిసిందే.  ఈ మందులను వాడిన వారి నుంచి ఫార్మశీ అధికారులు అభిప్రాయాలు సేకరించారు. వీటి వాడకం ద్వారా తమలో మంచి ఫలితాలు కనిపించాయని వారు వివరించారు. మందులను మరింత సులువుగా వాడుకునే విధంగా తయారు చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని సలహాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం తయారు చేస్తున్న మందులకు మరిన్ని ఆయుర్వేద మూలికలు జోడించి కొత్త ఫార్ములాలతో మందులు తయారు చేయాలని  యోచిస్తున్నారు. క్రిమిసంహారక  ధూపం చూర్ణాన్ని క్యాండిల్ గాను, స్వేదన ప్రక్రియ ద్వారా ఆల్కాహాల్ రహిత సానిటైజర్ ను తయారు చేసే ప్రయత్నం ప్రారంభించారు. ముక్కులో వేసుకునే చుక్కల మందుకు యాంటీ వైరల్ గుణాలున్న మరిన్ని మూలికల రసం, అనుతైలం లోని కొన్ని మూలిక రసాలను ఇందులో చేర్చే అవకాశాలు పరిశీలిస్తున్నారు. గుండూష చూర్ణం నేరుగా వాడుకునేందుకు వీలుగా  ద్రవరూపం లోనికి మార్చబోతున్నారు.వ్యాధి నిరోధక శక్తి ని పెంచే అమృత బిళ్లలకు మరిన్ని శక్తివంతమైన మూలిక లు జత చేసి  కొత్త ఫార్ములా ను రూపొందించి ఆయుష్ శాఖనుంచి లైసెన్స్ పొంది ఈ 5 ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేయడానికి పూనుకునే యోచన చేస్తున్నారు.    డిసెంబర్ లోగా లైసెన్స్     కోవిడ్ నివారణకు సరికొత్త ఫార్ములా తో తయారు చేయబోతున్న 5 రకాల మందులకు డిసెంబర్ లోగా ఆయుష్ శాఖ నుంచి లైసెన్స్   పొందాలని టీటీడీ ఆయుర్వేద విభాగం నిర్ణయించింది. ఈ మందులు వాడే విధానం, లాభాల వివరాలతో చిన్న కరపత్రం తయారు చేసి ఆనంద నిలయం బొమ్మతో తయారుచేసిన  ప్రత్యేక మైన ప్యాకింగ్ తో వీటిని ప్రజలకు అందించనున్నారు.    పరిశోధన దిశగా.    ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి, ఫార్మశీ విభాగాల ఆధ్వర్యంలో ఆయుర్వేద మందుల తయారీ లో పరిశోధనలు చేయించాలని టీటీ డీ యోచిస్తోంది.  జే ఈ ఓ బసంత్ కుమార్  ఫార్మశీ ఆర్ ఎమ్ ఓ డాక్టర్ పద్మావతి,  డాక్టర్ రాజేంద్రప్రసాద్, కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర రావు, డాక్టర్ నారపరెడ్డి తో ఇటీవల ప్రాథమికంగా చర్చించారు.పరిశోధనల పై దృష్టి సారిస్తే యాజమాన్యం పూర్తిగా సహకరిస్తుందని వారిని ప్రోత్సహించారు.             కొత్త ఫార్ములాలతో మందులు :  డాక్టర్ నారపరెడ్డి ఫార్మశీ టెక్నికల్ ఇంచార్జ్                          ఇటీవల తయారు చేసిన 5 రకాల మందులను ఆయుష్ అదనపు డైరెక్టర్ డాక్టర్ శాస్త్రి అభినందించారు. కొత్త ఫార్ములాలతో మందులు తయారు చేసి డిసెంబర్ లోగా లైసెన్స్ పొందే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఆమ్నెస్టీ తోనైనా త‌మ‌వారిని క‌లుసుకుంటామా? ఆశ‌గా చూస్తున్న వేలాది తెలుగువాళ్ళు!

కువైట్ గవర్నమెంట్ ఆమ్నెస్టీ ని ప్రకటించిన తర్వాత ఇండియా వెళ్లడానికి కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్ ల వ‌ద్దకు వేలాదిగా తెలుగువారు చేరుకున్నారు. పాస్ పోర్టు తీసుకొని వేల సంఖ్యలో తెలుగు ప్రజలు వ‌చ్చి లైన్ల‌లో నిలుచుంటున్నారు. పాస్‌పోర్ట్ లేని వారు కూడా ఈ ప్ర‌త్యేక సెంట‌ర్‌ల‌కు వ‌స్తున్నారు.  16 తారీకు నుంచి ఈ ప్ర‌క్రియ ప్రారంభం అయింది. 20వ తారీకు వరకు మన ఇండియన్స్ కి ఇండియా కి వెళ్ళే ప్రక్రియ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారు  ఎప్పుడు ఎప్పుడెప్పుడు దేశం వెళ్ళిపోవాలంటూ మన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. తిండి లేక  తలదాచుకునే దానికి వసతి లేక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు రెండు తెలుగురాష్ట్రాల ప్ర‌భుత్వాలు జోక్యం చేసుకోవాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. కేంద్ర‌ ప్ర‌భుత్వం ఆదుకోని తొందరగా ఇండియాకు రప్పించే ప్రయత్నం చేయాలని వారు కోరుతున్నారు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కువైట్ లో ఉంటున్నారో, వారిపై ఎలాంటి జరిమానాలు విధించకుండా, మళ్లి కొత్త వీసా తో కువైట్ రావచ్చు అనే వెసులుబాటుతో కువైట్ ప్రభుత్వం ఇటీవ‌ల‌ ఆమ్నెస్టీ ప్రకటించింది.    రెసిడెన్సీ(ఆకామా) లేకుండా ఒరిజినల్ మరియు వాలిడిటీ పాస్ పోర్ట్ ఉన్న వారిని, మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఇమ్మిగ్రేషన్ పనులు పూర్తయిన తర్వాత వారిని కువైట్ ప్రభుత్వం భారతదేశం పంపేవరకూ తమ ఆధీనంలోనే పెట్టుకొని, అన్ని వసతులు కల్పిస్తుంది. కువైట్‌లో వేల సంఖ్యలో మన తెలుగు ప్రజలు స్వంత ఊర్ల‌కు వచ్చే దానికి సిద్ధంగా ఉన్నారు మన ఇండియన్ ఎంబసీ వాళ్లు  కావాల్సిన ఏర్పాట్లు కువైట్లో సిద్ధం చేశారు.

మార్కెట్ ను డేటాల్ తో శుభ్రం చేయించిన మంత్రి!

ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్, ఫిష్ మార్కెట్లను మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్‌లో అమ్మకం, కొనుగోళ్ల దారులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని సమీకృత మార్కెట్ లోని వెజ్, నాన్ వెజ్, చేపల మార్కెట్ ను ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో నివారణకు పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  కూరగాయల మార్కెట్‌లో వినియోగదారులు ఎవరికీ వారే సామాజిక దూరం పాటించేలా పోలీసులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని, మీరేమైనా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా. ? అంటూ మటన్ షాపు నిర్వాహకులను ఆరా తీశారు.  మటన్ షాపుకు వచ్చే వినియోగదారులు తమవెంట స్టీల్ బాక్సు తెచ్చుకోవాలని, చేపల మార్కెట్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నదని వెంటనే శుభ్రం చేయించాలని మార్కెట్ నిర్వాహకులను మంత్రి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీట్, నాన్ మీట్, చేపల మార్కెట్ మొత్తాన్ని డేటాల్ తో శుభ్రం చేయించాలని ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాంను ఆదేశించారు.

సెప్టెంబ‌ర్ నాటికి  వాక్సిన్ సిద్ధం! ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో ట్రయల్స్!

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రపంచంలో 70కి పైగా రీసెర్చ్ సంస్థలు కరోనా వాక్సిన్ తయారీ కోసం శ్రమిస్తున్నాయి. వీటిల్లో ఆక్స్ ఫర్డ్ తో పాటు మోడెర్నా, ఇన్నోవియో, కాన్సినో సంస్థలు మాత్రమే వాక్సిన్ ను క్లినికల్ ట్రయల్స్ స్థాయికి తీసుకుని వెళ్లాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డానికి వ్యాక్సిన్ కోసం ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ దిశ‌గా ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌ల బృందం పురోగ‌తి సాధించింది. వ్యాక్సిన్ ప‌రిశోధ‌న‌ల‌ను లీడ్ చేస్తున్న ప్రొఫెస‌ర్‌ సారా గిల్బ‌ర్ట్  వ‌చ్చే సెప్టెంబ‌ర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. వ్యాక్సిన్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న అత్యున్న‌త స్థాయి శాస్త్ర‌వేత్తల బృందానికి సారా నేతృత్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం వ్యాక్సిన్ అభివృద్ధి ప‌రిచే ద‌శ‌లో తాము పురోగ‌తి సాధిస్తున్నామ‌ని తెలిపారు. మాన‌వుల‌పై ఇప్పటికే క్లినికల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభం అయ్యాయి. వైర‌స్ పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న చోట దీన్ని ప‌రీక్షించి ఫ‌లితాల‌ను బేరీజు వేస్తున్నారు. మేలో వాక్సిన్ పనితీరుపై స్పష్టమైన అవగాహన వ‌స్తుంది.   "వాక్సిన్ ట్రయల్స్ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దశ చాలా ముఖ్యం. వచ్చే నెల రెండో వారం తరువాత లేదా చివర్లో ఈ వాక్సిన్ కారణంగా మానవ శరీరంలో కరోనా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తేలితే, నా ఉద్దేశంలో మనం సక్రమంగా నడుస్తున్నట్టే. ఆపై ఆగస్టులోనే విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి" అని ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీలో మెడిసిన్ ప్రొఫెసర్ జాన్ బెల్ తెలిపారు. వాక్సిన్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధితో యూకే బిజినెస్ సెక్రటరీ అలోక్ శర్మ ప్రకటించిన టాస్క్ ఫోర్స్ లో బెల్ కూడా సభ్యుడిగా ఉన్నారు.

ఏపీ లో 603 కు చేరిన పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులను కలుపుకుని ఇప్పటి వరకు  కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 603 కు చేరింది. కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 42 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వైయస్సార్‌ కడప, విశాఖపట్నం జిల్లాలలో 13 మంది చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 6గురు, కృష్ణా జిల్లాలో 4గురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలలో ఒక్కొక్కరు.. మొత్తం 42 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో 5గురు, గుంటూరు జిల్లాలో 4గురు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున చనిపోయారు.   కోవిడ్‌ –19 నివారణ చర్యలపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి,  వినూత్న మార్కెటింగ్‌ విధానాలపై మార్కెటింగ్‌శాఖ అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. నిన్న ఒక్కరోజే ల్యాబ్‌లు, ట్రూనాట్‌ మిషన్ల ద్వారా 4వేలకు పైగా పరీక్షలు చేశామన్న అధికారులు. ర్యాపిడ్‌ పరికరాలు, స్క్రీనింగ్‌ కోసం వాడే కొత్త పరికరాల సహాయంతో గణనీయంగా పరీక్షల సామర్థ్యం పెరుగుతుందన్న అధికారులు. కోవిడ్‌ పరిస్థితులకు ముందు తిరుపతిలో ఒకటే ల్యాబ్‌.. ఆ తర్వాత వీటి సంఖ్య 7కు పెంచగలిగామన్న అధికారులు. వారం రోజుల్లో ల్యాబుల సంఖ్య 12కు పెంచుతున్నామన్న అధికారులు.