ట్విట్టర్లో టిడిపిని, కన్నాను టార్గెట్ చేసిన వైసీపీ!
posted on Apr 23, 2020 @ 12:03PM
కరోనాను సైతం లెక్క చేయకుండా ఏపీలో రాజకీయాలు కేక పుట్టిస్తున్నాయి. మే నెలలో వేడివేడి పెనం మీద నీళ్ళు చల్లినట్టుగా సలసల కాగుతున్నాయి. వైసీపీ నేతలు చంద్రబాబుని టార్గెట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టవు. ఏ స్థానంలో ఉన్నా చేసేవి నీచరాజకీయాలే. వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్స్‌ల పేరిట హడావుడి, ఆర్భాటాలు తప్ప ఒక్క నిర్మాణాత్మక ఆలోచన లేదంటూ ట్విట్టర్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రచారలబ్ధి పొందాలనే కుటిల రాజకీయ సూత్రం నుంచి చంద్రబాబు ఇంకా బయటపడలేదు. దీని ద్వారా ఆయన దారుణ వ్యక్తిత్వాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి విష ప్రచారం చేసే దుర్భుద్ధి చంద్రబాబుకు పోలేదని సజ్జలీ ఘాటుగా విమర్శలు చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మరో ట్వీట్ చేశారు. చంద్రబాబుకు అమ్ముడపోలేదని ప్రమాణం చేసేందుకు కాణిపాకానికి ఎప్పుడు వస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో రూ.30 కోట్లు నొక్కేశాడని ఎలక్షన్ల తర్వాత కన్నాపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికలు రాశాయి. స్థానికంగా సమీకరించిన విరాళాలూ దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కన్నా తో కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు పెద్దలకు తెలుసు అంటూ అప్పట్లో ఆంధ్రప్రభ పత్రిక ప్రచురించిన వార్తను జత చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మొత్తం మీద వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు టీడీపీ, బీజేపీ నేతల్ని చెడుగుడు ఆడుకుంటున్నారు.