ఏసీ, కూలర్ల వాడకంపై కేంద్రం మార్గదర్శకాలు!

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం మరింత పెరగనుంది. అయితే కరోనా వైరస్ ఏసీలు, కూలర్ల కారణంగా మరింత వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతుండడంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజినీర్స్ రూపొందించిన ఈ మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది.  దీని ప్రకారం, ఇళ్లలో ఏసీల వాడకంలో గది ఉష్ణోగ్రతను 24 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలని, సంబంధిత తేమ శాతం 40 నుంచి 70 మధ్య ఉంటే మేలని సూచించింది. వ్యాధికారక క్రిముల వ్యాప్తి నివారణకు ఇవి సరైన ఉష్ణోగ్రతలని వివరించింది. తేమ వాతావరణంలో ఏసీని 24 డిగ్రీల సెంటిగ్రేడ్ కు దగ్గరగా సెట్ చేయాలి. పొడి వాతావరణంలో 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేలా జాగ్రత్త పడాలి. గది నలుమూలలకు గాలి ప్రసరించేందుకు ఫ్యాన్లు వాడొచ్చు. పొడి వాతావరణం నెలకొని ఉంటే సంబంధిత తేమ శాతాన్ని 40 శాతం కంటే తక్కువ ఉంచరాదు. ఏసీలు ఆన్ లో ఉన్నప్పుడు రూమ్ కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి. ఏసీ గాలి అక్కడే పరిభ్రమించకుండా, సహజసిద్ధమైన రీతిలో శుభ్రపడుతుంది.  ఏసీలు వాడుతున్నప్పుడు బయటి నుంచి వచ్చేగాలి ఫ్రెష్ గా ఉండాలంటే కిచెన్, టాయిలెట్లలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. తద్వారా బయటి నుంచి దుమ్ము, ధూళితో కూడిన గాలిని నిరోధించవచ్చు. పరిశుభ్రమైన గాలి ప్రసరించాలంటే ఎవాపరేటివ్ కూలర్లు గాలిని బయటి నుంచి స్వీకరించేలా ఉండాలి. ఎవాపరేటివ్ కూలర్లలో నీటి ట్యాంకులను శుభ్రపరచాలి. క్రిమినాశని రసాయనాలతో శుద్ధి చేయాలి. ఒకసారి వాడిన నీటిని తొలగించేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి. కూలర్ల నుంచి వచ్చే తేమతో కూడిన గాలిని బయటికి పంపేందుకు కిటికీలు తెరిచే ఉంచాలి. పోర్టబుల్ ఎవాపరేటివ్ కూలర్లు బయటి నుంచి గాలిని స్వీకరించే ఏర్పాట్లు కలిగి వుండవు కనుక, ఆ తరహా కూలర్ల వాడకం నిలిపివేయాలి. ఫ్యాన్లు తిరిగే సమయంలో గది కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి. సాధారణ ఫ్యాన్లు తిరిగే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆన్ లో ఉండే మరీ మంచిది. మెరుగైన రీతిలో గదిలోని గాలి ఎప్పటికప్పుడు శుభ్రపడే అవకాశం ఉంటుంది.

151 మంది ఎమ్మెల్యేలుంటే చట్టాన్ని పాటించరా? చట్టానికి అతీతులా?

లాక్ డౌన్ ఉల్లంఘించిన నేతలపై కేసులెందుకు పెట్టడం లేదో డీజీపీ సమాధానం చెప్పాలి. సభలు నిర్వహించిన వైసీపీ నాయకులపై 307 సెక్షన్ కింద కేసు పెట్టాలని టిడిపి నేత‌ భత్యాన చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లింఘించిన వారిపై మార్చి 25 నుండి 31 వరకు 75 వేల కేసులు, మొత్తంగా లక్షకు పైగా కేసులు రిజిస్టర్ చేశామని డీజీపీ గౌతం సవాంగ్ గారు చెబుతున్నారు.  లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నందుకు చెంగల్రాయుడు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాళహస్తి, కర్నూలు నగరం ఆంధ్రప్రదేశ్ కు వుహాన్ నగరంలా తయారయ్యాయి. శ్రీకాళహస్తిలో ట్రాక్టర్లతో ర్యాలీ చేయించిన వైసీపీ ఎమ్మెల్యే బియ్యం మధుసూధన రెడ్డి దీనంతటికీ బాద్యుడు. అతను నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వాహనాల్లో ఎన్నింటిపై కేసులు పెట్టారు. వాటిలో ఎన్ని సీజ్ చేశారు.? సూళ్లూరుపేటలో దాతలు ఇచ్చిన సరుకులను పంపిణీ చేసే నెపంతో మరో ర్యాలీ నిర్వహించారు. వాటిలో ఎన్ని వాహనాలపై కేసులు పెట్టి సీజ్ చేశారు.? ఏ 2 విజయసాయి రెడ్డి శ్రీకాకుళం నుండి అమరావతి, హైదరాబాద్ నిరంతరంగా తిరుగుతున్నారు. అతనిపై ఎలాంటి కేసులు పెట్టారు.?  తెనాలి, కొండెపి, పలమనూరు, నగరిలో శాసన సభ్యులు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో మీకు తెలియదా.? వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారు.? పలమనేరులో బ్రిడ్జి ప్రారంభించడం కోసం దండోరాగా వెళ్లారు. పుత్తూరు సుందరయ్య కాలనీలో లక్ష పెట్టి బోరు వేసినందుకు.. వెయ్యి మందిదతో పూలు జల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారో డీజీపీగారు బహిర్గతం చేయాలి. శ్రీకాళహస్తిలో వచ్చిన 60 కేసులకు ఎమ్మెల్యే నిర్వహించిన ర్యాలీ ఫలితమే. వెంటనే ఐపీసీ 307 సెక్షన్ కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు జగ్జీవన్ రావ్ జయంతి, పూలే జయంతి, అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఇంట్లోనే నిర్వహించమని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం నేతలంతా అదే పాటించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వందలు, వేల మందిని పోగేసి కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు నిర్వహించిన వారిలో ఎంత మందిపై కేసులు నమోదయ్యాయో డీజీపీగారు ప్రకటించాలి. గోవా, మణిపూర్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో కనిపించడం లేదా.? దేశ విదేశాల నుండి లక్షలాది మంది వచ్చే గోవా ఇప్పటికీ గ్రీన్ జోన్ గా ఉందంటే.. అక్కడి ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో చూడండి. మణిపూర్ పర్వతాలతో నిండిన ప్రాంతం. అక్షరాస్యత అత్యల్పం. అయినా అక్కడ కరోనా కేసులు లేవు. కారణం ప్రబుత్వం తీసుకుంటున్న చర్యలు కాదా.?  కరోనా వైరస్ ఎంతో ఆత్మాభిమానం కలిగినది. మనంగా వెళ్లి పిలిస్తేనే రాదు. వచ్చాక మనల్ని వదలదని వైసీపీ నేతలు గుర్తించాలి. కిలో బియ్యం, అరకిలో టమాటా, పావుకిలో నూనె 10 మందికి ఇస్తే వెయ్యి మందిని గుమిగూడుస్తున్నారు. కోట్ల వేతనాలు చెల్లిస్తూ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ఏం చేస్తోంది.? మణిపూర్ లో వాలంటీర్లు లేరు కానీ.. సరుకులు ఎంత క్రమశిక్షణతో పంచుతున్నారో ప్రబుత్వానికి కనిపిస్తోందా.? దేశంలోని రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు అధికారులు, నాయకులు పాటుపడాలని ప్రధాని మోడీగారు పిలుపునిస్తే..  మన రాష్ట్రంలో గ్రీన్ జోన్ గా ఉన్న వాటిని రెడ్ జోన్లుగా మారుస్తున్నారు. శ్రీకాకుళంకు చెందిన ఎమ్మెల్యే అప్పలరాజు, మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఏడు జిల్లాలు దాటుకుని అమరావతికి వచ్చారు. స్పీకర్ అయితే ఏకంగా బహిరంగ సభ పెట్టారు. ఫలితం ఇప్పటి వరకు గ్రీన్ జోన్ గా ఉన్న శ్రీకాకుళంలో ఒక్కసారిగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో సారాయి ఏరులై పారుతోందని, ఎక్సైజ్ శాఖ నిద్రపోతోందని స్పీకరే స్వయంగా చెప్పారంటే ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. మార్చి 25 నుండి లాక్ డౌన్ అమలులో ఉంది. ఎక్కడా ఎలాంటి రవాణా జరగకూడదు. కానీ.. కోడూరులో జిని పెక్ సంస్థ 5 ర్యాకుల బైరైటీస్ మద్రాసుకు పంపించింది. దానికి అక్కడి సీఐ నో అబ్జక్షన్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక, మట్టి లారీలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే.. ప్రజలే అడ్డుకోవాల్సి వచ్చింది. ఆ వాహనాలు ఎందుకు సీజ్ చేయలేదో డీజీపీ గారు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అంత్యక్రియలకు మాత్రమే 20 మందిని అనుమతిస్తారు.  కానీ అధికార పార్టీ నేతలు ఇంత మందిని వెంటేసుకుని తిరుగుతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది.? ర్యాలీలకు పోలీసులే ఎస్కార్ట్ కల్పించడం దుర్మార్గం కాదా.? పోలీస్ స్టేషన్ల ముందే సభలు జరుగుతుంటే పట్టించుకోరా.? కర్నూలులో ఐసోలేషన్ లో ఉన్న తమ బంధువులను ఎమ్మెల్యే పరామర్శించి వచ్చాడంటే దుర్మార్గం కాదా.? రాష్ట్ర వ్యాప్తంగా 500 వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి.  మీకు సమాచారం లేదా.? మీ ఇంటిలిజెన్స్ పనిచేయడం లేదని చెప్పడం వివరాలన్నీ మీకు అందిస్తాం. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నవారిపై కేసులు నమోదు చేయడానికి డీజీపీ ఎందుకు ఆలోచిస్తున్నారు.? యూపీ ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ గారి తండ్రి చనిపోతేనే వెళ్లలేకపోయారంటే... అతని చిత్తశుద్ధి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతుంటే ప్రభుత్వ వైఫల్యం కాదా..? సామాన్యులు ఏదో అవసరంపై రోడ్డుపైకి వస్తే కేసులు పెడుతున్నారు. చితక్కొడుతున్నారు. కనగరాజ్ గారు చెన్నై నుండి అమరావతి వరకు ఎలా వచ్చారు.? అతనిపై ఎందుకు కేసు పెట్టలేదు.? చట్టం, న్యాయం అందరికీ సమానమని పోలీసు బాస్ గా మీరెందుకు గుర్తించడం లేదు.? 151 మంది ఎమ్మెల్యేలుంటే చట్టం పాటించరా.? మీరేమన్నా చట్టానికి అతీతులా.? చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని గౌరవించి ఇంట్లో ఉన్నారు. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. చట్టాన్ని పాటిస్తున్నవారిని అవహేళన చేస్తారా.?

అన్ని షాపులు తెరచుకోవచ్చు! హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు

లాక్‌డౌన్ వేళ వినియోగదారులకు ఊరటనిస్తూ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అన్ని షాపులు తెరచుకోవచ్చ‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ★ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.  ★ దేశవ్యాప్తంగా అన్ని షాపులు ఇకమీదట తెరచుకోవచ్చని తెలిపింది.  ★ ఐతే... కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని కేంద్రం తెలిపింది.  ★ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి మార్గదర్శనం చేసింది. ★ ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి... తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు. ★ అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే... కేంద్ర చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు.  ★ దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు. ★ మరో ముఖ్య విషయమేంటంటే, హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు.  ★ ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది.  ★ ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది. ★ ప్రజలు సామాజిక దూరంపాటిస్తూ,మాస్క్, శానిటేజర్లు వాడుతూ, కేంద్రం, వివిధప్రభుత్వాలు ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకోవాలి. ★ లేకపోతే కరోనావైరస్ సామాజిక వ్యాప్తికి దోహదం అవుతుందని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కో‌రుతున్నారు. ★ అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు. ★ ఐతే... రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే... ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ షాపుల్లో ఉండకూడదు.  ★ సగం(50%) మంది ఉద్యోగులతోనే నడపాలి. ★ అలాగే సోషల్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యాలి.  ★ అలాగే అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

స్వైన్ ఫ్లూ కంటే వేగంగా విస్తరిస్తున్న‌ కరోనా!

వైరస్ నివారణకు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే ఈవైరస్ ను నిర్మూలించగలమని నిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు డాక్టర్ స్వరూప రెడ్డి తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కరొనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు డాక్టర్ స్వరూప రెడ్డి, అపోలో ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ నాగరాజులు మాట్లాడారు.  ఈ సందర్భంగా. డాక్టర్ స్వరూప రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రబలుతుందని అన్నారు. ఈవైరస్ బీటా కరొనా కుటుంబానికి చెందింది అని, మిగతా వైరస్ కంటే ఈ వైరస్ బరువు ఎక్కువ అని అన్నారు. స్వైన్ ఫ్లూ కంటే వేగంగా విస్తరిస్తోందని అన్నారు. కరోనా వైరస్‌ నివారణకు మందు లేదని, సామాజిక దూరం పాటించడం ద్వారానే దీనిని అరికట్టవచ్చని అన్నారు. వైద్య, పోలీస్‌, అగ్నిమాపక, ఇతర శాఖలు ఈ కరోనా వైరస్‌ నిరోధానికి అహర్నిశలూ కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను గౌరవించి అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెప్పారు. తలనొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటె కరోనా వైరస్ సోకినట్టుగా గుర్తించవచ్చని తెలిపారు.  కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత దగ్గు వస్తుందని, ఈ దగ్గు ఒక్కోసారి గంట వరకు ఉంటుందని తెలిపారు.  అలానే జ్వరం తలనొప్పి కూడా వస్తాయని,అదే విధంగా శ్వాస  తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయని అన్నారు. ఈ లక్షణాలు ఉంటె కరోనా వైరస్ వచ్చినట్టే అని చెప్పొచ్చని అన్నారు.   ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు . సెంట్రల్ ఏసీలకు దూరంగా ఉండాలని తెలిపారు. డిస్చార్జ్ అయిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలని ,ఇంట్లో నే ఉండాలని అన్నారు. న్యూస్ పేపర్, పాల పాకెట్ల వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్లాస్టిక్, స్టీల్, వంటి వస్తువులు పై వైరస్ ఎక్కువ కాలం ఉంటుందని, ఎక్కువ సార్లు చేతులను శుభ్రంగా కడగాలని తెలిపారు.ఈ వైరస్ కు వాక్సిన్ ప్రయోగ దశలో ఉన్నాయని, ప్రస్తుతం ఐసీయంఆర్ సూచనల ప్రకారం భాదితులకు వైద్యం అందిస్తున్నామని అన్నారు. క్వారంటైన్ కాలం పొడగించటం వల్ల బాధితులకు మరింత మేలు చేకూరుతుందని అన్నారు. అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నాగరాజు గొర్ల మాట్లాడుతూ విధిగా చేతులు కడుకోవడం తో చాలా వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అన్నారు.చేతులను కనీసం 30 సెకన్ల పాటు సానిటైజర్ తో కానీ 60 సెకన్ల పాటు కడుకోవాలన్నారు.కరోనా వ్యాధి వచ్చి తగ్గిన వారు డిశ్చార్జ్ ఆయిన తర్వాత కూడా 14 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో డాలన్నారు.చంటిబిడ్డలకు తల్లి పాలు ఇస్తే వైరస్ సోకే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాధి వలన చనిపోయే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందన్నారు. వైద్యుల సలహా మేరకే క్లోరోక్విన్ వాడలే తప్ప ఇష్టం వచ్చి నట్లు వాడితే వేరే ఆరోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉందన్నారు.  ముఖ్యంగా వయస్సు లో పెద్ద వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్లడ్ షుగర్స్ ను అదుపులో ఉంచుకోవలన్నారు.వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తప్పనిసరిగా భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలన్నారు.ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను పాటిస్తునే మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచించారు.రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు సమతుల్య ఆహారం తో పాటు వ్యాయామం , యోగ, ధ్యానము లాంటి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, ఇంచార్జి సి.ఐ.ఇ. విజయభాస్కర్ రెడ్డి, డిడి శ్రీనివాస్, ఆర్.ఐ.ఇ. రాధా కిషన్ , ఏడి యామిని,తదితరులు పాల్గొన్నారు.

కోతులపై విష ప్ర‌యోగం! తిరువణ్ణామలైలో కలకలం!

కరోనా నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలలో కోతుల బాధలు వర్ణణాతీతం.. ఇదిలా ఉండగా మానవత్వం పూర్తిగా మరచిన కొందరు నికృష్టులు ఆకలితో అలమటిస్తున్న కోతులకు విషంపెట్టి హతమార్చడం తిరువణ్ణామలైలో కలకలం రేపింది. తిరువణ్ణామలై అటవీ ప్రాంతంలో ఓ చోట పది కోతులు మరణించి ఉండటాన్ని గిరిజనులు గుర్తించి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.  వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులకు చాలా కోతులు మరణించి కనిపించాయి.. ఈ కోతులు మరణించిన ప్రాంతానికి కూత వేటు దూరంలో అరటి పండ్లు పడి ఉండటంతో వాటిని పరిశీలించగా విషం ఉన్నట్టు గుర్తించారు. ఇకపోతే ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన వారి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. ఎంత దారుణం ఆకలితో అలమటిస్తున్న కోతులకు అరటి పండులో విషం పెట్టి చంపడం.. మనుషులు రోజు రోజుకు ఎంత కౄరంగా ఆలోచిస్తున్నారు.  మ‌రో ప్ర‌క్క‌ ఈ కరోనా వల్ల ఆకలితో అలమటిస్తున్న వారెందరో ఉన్నారు.. కేవలం ఈ ఆకలి మనుషులకే కాదు.. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణి సొంతం.. అందుకే ఇప్పుడు ఈ ఆకలి సెగ జంతువులకు, పక్షులకు కూడా తగిలింది.. మనుషులంటే అన్నమో రామచంద్ర.. అని అడుక్కుంటారు.. ఎదోలా కడుపు నింపుకుంటారు.. కానీ మూగజీవాలు మనుషుల్లా ఆలోచించలేవు.. మోసాలు చేసి పొట్టనింపుకోవు.. పరిస్దితులు మామూలుగా ఉంటే వాటికి కూడా కాస్త ఆహారం దొరికేది. కానీ లాక్‌ డౌన్‌ వల్ల మూగ జీవాల పరిస్దితి చాలా దారుణంగా మారింది.. ప్రస్తుత పరిస్దితుల్లో ఆకలితో అన్ని జంతువులు అలమటిస్తున్నాయి.

కిమ్ ఎందుకు కనిపించట్లేదు!

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అనారోగ్యం నేపథ్యంలో చైనా  ఓ వైద్య బందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన లైనిస్‌ డిపార్టమెంట్‌ నేతృత్వంలో ముగ్గురు వైద్యుల బృందాన్ని ఆ దేశానికి పంపినట్ల ఓ ప్రముఖ పత్రిక పేర్కొంది. అయితే కిమ్‌ ఆరోగ్యంపై మాత్రం చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు.  అయితే  అధినేత ఆరోగ్యంపై దక్షిణ కొరియా స్పందించింది. కిమ్‌కు ఎలాంటి సమస్య లేకపోవచ్చిని ఆయనపై వస్తున్న వదంతులను కొట్టిపారేసింది.   రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కిమ్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేకపోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో చైనా వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  కరోనా లాంటి విపత్తులో కూడా చైనా దేశం ఉత్తర కొరియాకు వైద్యులను పంపడంతో నిజంగానే కిమ్‌ ఆరోగ్యం క్షిణించి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్ ఎందుకు కనిపించట్లేదన్నది తెలియాల్సి ఉంది.

శ్రీకాళహస్తి లో వైర‌స్ ఇలా పాకింది!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి వాసుల్నిక‌రోనా చెమ‌ట‌లుప‌ట్టిస్తోంది. ప్రముఖ శైవక్షేత్రంగా విరసిల్లే ఈ ఊరు ఇప్పుడు కరోనా భయంతో చిగురుటాకులా వణికిపోతోంది. మరింత దారుణమైన విషయం ఏమంటే.. కరోనా బాధితుల్లో ఏకంగా పదిహేడు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం. చిత్తూరు జిల్లాలో 73 పాజిటివ్ కేసుల్లో యాభైకు పైనే ఒక్క శ్రీకాళహస్తి పట్టణంలో నమోదు కావటం ఇప్పుడు సంచలనంగా మారింది.  మార్చి 18న లండన్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చాడో యువకుడు. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లగా.. అతనికి వైరస్ సోకిన వైనాన్ని మార్చి 25న గుర్తించారు. అప్పటికే అతను కుటుంబ సభ్యులు.. బంధువులతో గడిపాడు. ఊరి చివర ఉన్న దాబాలకు వెళ్లాడు. సదరు యువకుడికి పాజిటివ్ అని తేలిన వెంటనే.. అతడి కుటుంబ సభ్యుల్ని మాత్రమే క్వారంటైన్ కు తరలించారు. అంతే తప్పించి.. అతడు ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడకు వెళ్లాడన్న విషయాన్ని ఆరా తీసి.. వారందరిని క్వారంటైన్ కు తరలించి ఉంటే.. మూలంలోనే ముగిసి పోయేది. కానీ.. అధికారులు ఇక్కడో పెద్ద తప్పు చేశారు. పాజిటివ్ గా తేలిన వ్యక్తి కాంటాక్టు అయిన వారందరిని వదిలేశారు. దీనికి ఫలితంగా అతడు కాంటాక్టు అయిన వారిలో నలుగురికి.. అతని స్నేహితుడికి పాజిటివ్ గా తేలింది. ఈ సందర్భం లో అయినా.. ఈ ఐదు కేసులతో సంబంధం ఉన్న వారిని.. వారు కాంటాక్టు అయిన వారిని గుర్తించి ఉంటే బాగుండేది. కానీ.. ఆ సందర్భంలోనూ అధికారులు స్పందించింది లేదు. ఇది రెండో తప్పు. ఇలాంటి వేళలోనే మర్కజ్ లింకు ఊరికి వచ్చింది. శ్రీకాళహస్తి నుంచి ఢిల్లీ సమావేశాలకు వెళ్లిన 13 మంది ఊరికి తిరిగి వచ్చారు. కేంద్ర నిఘా విభాగం హెచ్చరించే వరకూ వారిని గుర్తించే విషయంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. దీంతో వారిని గుర్తించే విషయంలో ఆలస్యం చోటు చేసుకోవటంతో పాటు.. రిజర్వేషన్ లేకుండా వచ్చిన కొందరిని గుర్తించే విషయంలోనూ అధికారులు ఫెయిల్ అయ్యారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించటంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. అతడితో పాటు అతడి భార్యను కూడా పంపారే కానీ పిల్లల్ని వదిలేశారు. బ్యాడ్ లక్ ఏమంటే.. అధికారులు విస్మరించిన పిల్లల్లో ఒకరికి పాజిటివ్ రావటం.. అతడి కారణంగా పలువురికి పాజిటివ్ గా తేలింది. ప్రైమరీ నుంచి కాంటాక్టులకు అంటుకోవటం.. సెకండరీ కాంటాక్టును గుర్తించే విషయంలో జరిగిన పొరపాట్లు ఈ రోజున శ్రీకాళహస్తి పట్టణం ప్రమాదపు అంచుల వరకూ చేరే పరిస్థితికి కారణమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. తప్పులే ప్రజలకు శాపంగా మారింది.

సముద్రంలోకి 19 వేల తాబేలు పిల్లలు!

సముద్రపు తాబేళ్లు డిసెంబరు నుంచి ఏప్రిల్‌ వరకు తీరానికి వచ్చి ఇసుకలో గుంత తవ్వి గుడ్లు పెట్టి కప్పి వెళతాయి. ఒక తాబేలు 140 నుంచి 170 వరకు గుడ్లు పెడుతుంది. కుక్కలు, పక్షుల నుంచి గుడ్లను రక్షించే పనులను అటవీ శాఖ చేపట్టి, ఆ గుడ్లను సేకరించి కేంద్రంలో ఉంచి, అవి పొదిగిన అనంతరం పిల్లలను సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. బీసెంట్‌ నగర్‌, పళవేర్కాడు, కోవలం సముద్రతీరాల్లో ఉన్న తాబేలు గుడ్ల పొదిగింపు కేంద్రాల నుంచి పొదిగిన 19 వేల తాబేలు పిల్లలను సముద్రంలో వదలిపెట్టారు.  బీసెంట్‌నగర్‌, పళవేర్కాడు, కోవలం సముద్రతీరాల్లో ఏర్పాటుచేసిన గుడ్ల భద్రతా కేంద్రాల్లో 30 వేల గుడ్లను సేకరించగా, 19 వేల పిల్లలు బయటకు వచ్చాయి. వారిని గురువారం అటవీ శాఖ సిబ్బంది సముద్రంలో వదలిపెట్టారు. మిగిలిన గుడ్ల నుంచి వచ్చే పిల్లలను అంచెలంచెలుగా సముద్రంలోకి వదలిపెడతామని అధికారులు తెలిపారు. గత ఏడాది 50 వేల గుడ్లును సేకరించగా 40 వేల పిల్లలు బయటకు వచ్చాయని వారు తెలిపారు.

రంజాన్ నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ 

రంజాన్ మాసం లో ప్రత్యేక సడలింపు లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మసీదు లో ప్రార్థనల అంశం లో ఇప్పటికే 5 మందికి మినహాయింపు. ఇమామ్, మౌజం కాకుండా మరో ముగ్గురికి ప్రార్థనలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం . రంజాన్ పండుగకు ఆటంకం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు . 24 గంటల విద్యుత్ సరఫరా,  అవసరానికి సరిపడా మంచి నీటి సరఫరా . నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు షాపు లకు ఉదయం 10 గంటల వరకు అనుమతి . ఇఫ్తార్ కు అనుగుణంగా సాయంత్రం డ్రై ఫ్రూట్ షాపులకు అనుమతి . ఆహారం అందించే డోనర్స్ కు ఉదయం 3 నుండి 4.30 వరకు, సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు అనుమతి . ఈ అనుమతులు కేవలం మూడు నుండి నాలుగు పాయింట్ లు గుర్తించి ఇవ్వాలని ఆదేశం . హోటల్స్ ను గుర్తించి సెహ్రి, ఇఫ్తార్ సమయాల్లో టేక్ అవే లకు అనుమతి . క్వరంటెన్ లో ఉన్న ముస్లిం లకు పండ్లు, డ్రై ఫ్రూట్ తో ఉదయం, సాయంత్రం పౌష్టికాహారం అందించాలని ఆదేశం . ఇమామ్ లకు, మైజిం లకు పాసులు. అన్ని మసీదుల వద్ద కోవిడ్ 19 నియంత్రణలు తెలుపుతూ బ్యానర్ ఏర్పాటు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం .బౌతిక దూరం వర్తింపచేస్తూ అన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు.

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

గాంధీ ఆసుపత్రి కంటే జైలే బెటరని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ 19కు సరైన వసతులు లేవంటూ అనేక ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. గాంధీలో పేషంట్లు ఏవిధంగా ఇబ్బందులు పడుతున్నారో తనకు వివరించారని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని. ఆహారం బాగా లేదని, మందులు సక్రమంగా ఇవ్వడం లేదనే విషయాలు తమ దృష్టికి వచ్చాయని వాపోయారు. కొంత మంది సిబ్బంది రోగుల ప‌ట్ల వివ‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు త‌న‌కు ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని ఓవైసీ చెప్పారు. కేవలం సామాజిక దూరం పాటించ‌డం మాత్రాన వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేమని.. పరిసరాలు కూడా పరిశుభ్రతగా ఉండాలని ఆయన అన్నారు. గచ్చిబౌలి స్టేడియాన్ని కోవిడ్ 19 ఆసుపత్రిగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా సెక్రటేరియట్‌లో కూడా కరోనా అనుమానితుల క్వారంటైన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. టెస్టులు సంఖ్య కూడా పెంచాలని తెలిపారు. హైద‌రాబాద్‌లోని స్థానిక‌ ఆసుపత్రిలలో ఓపి సేవలను పునరుద్ధరించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అక్బరుద్దీన్ కోరారు. అవ‌స‌ర‌మైతే ఓవైసీ గ్రూప్స్ ఆసుపత్రిలు, డాక్టర్లు, నర్సులు కోవిడ్ 19తో పోరాడటానికి సిద్డంగా ఉన్నారని అక్బరుద్దీన్ అన్నారు.

రిపేర్ల‌కు నోచుకోక మూల ‌ప‌డ‌నున్న 4 కోట్ల మొబైల్ ఫోన్లు!

హ్యాడ్‌సెట్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో 4 కోట్ల మంది వినియోగ‌దారులు ఫోన్ల‌కు దూరం కాబోతున్నారా? దేశంలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్‌ ఫోన్లు ఉప‌యోగిస్తున్నారు. సరాసరిన నెలకు 2.5 కోట్ల కొత్త మొబైల్‌ ఫోన్ల విక్రయాలు జ‌రుగుతాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఇలాగే కొనసాగితే దేశంలో మొబైల్‌ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో సుమారు 4 కోట్ల మంది చేతుల్లో వచ్చే నెలాఖరు నాటికి అవి కనిపించకపోవచ్చని పరిశ్రమ సమాఖ్య ఐసియా (ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌) అంచనా వేస్తోంది. పోన్‌ల‌లో వ‌చ్చే చిన్న చిన్నే రిపేర్ల కార‌ణంగా దాదాపు 4కోట్ల మొబైల్ ఫోన్‌లు మే నెలాఖ‌రుకు ప‌నిచేయ‌వ‌ని మార్కెట్ అంచ‌నాలు తెలుపుతున్నాయి. మొబైల్‌ ఫోన్లు, విడి భాగాల విక్రయాలపై లాక్‌డౌన్‌ ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఆ పరిస్థితి తలెత్తే అవకాశం వుంద‌ట‌. అత్యవసర వస్తువుల జాబితాలో మొబైల్‌ ఫోన్లను కూడా చేర్చాలంటూ ఇప్పటికే పలుమార్లు ప్రధానితో సహా ప్రభుత్వాన్ని కోరామని ఐసియా ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ వెల్లడించారు. మొబైల్‌ పరికరాలతో పాటు ల్యాప్‌టాప్‌లను కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చండంటూ హోం శాఖకు ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. అయితే ఇంకా ఆ శాఖ నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సరఫరా చెయిన్‌లో మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు లేకపోవడం, కొత్త హ్యాండ్‌సెట్ల విక్రయాలపై ఆంక్షలుండటంతో ప్రస్తుతం 2.5 కోట్ల మందికి పైగా వినియోగదారుల ఫోన్లు నిరుపయోగంగా ఉన్నాయని ఐసియా పేర్కొంది.

పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించండి : కేంద్రానికి చంద్రబాబు లేఖ

లాక్ డౌన్ కారణంగా తీవ్ర కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటున్న పోగాకు రైతులపై దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు పొగాకు బోర్డు చైర్మన్ కు రాసిన లేఖలో రాష్ట్రంలో 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి జరిగిందనీ, అయితే దీనిని అమ్ముకునే వెసులుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ పేర్కొన్నారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి పొగాకు ఉత్పత్తి చేశారు. కానీ కరోనా సమస్యతో కొనుగోళ్లు నిలిచిపోవటంతో ఆ రైతులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతం. అలాగే ఇతర పంటలు సాగుచేసిన రైతు కూడా తమ కష్టార్జితాన్ని కొనుగోలు చేసే నాథుడు లేక లబోదిబోమంటున్నారు.

రాజధాని తరలింపు పై నీలి నీడలు! సి.ఎం.‌ వ్యూహం ఏంటి?

కరోనా సమయంలోనూ రాజ‌ధాని త‌ర‌లింపుపై ముందుకు వెళ్లడం అనేది అహంకారమా...ధిక్కారమా?...అలాగే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వ వ్యూహం ఏంటి? మూడు రాజధానుల పేరుతో జగన్ పరి పాలన వికేంద్రీకరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖ ను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేసేందుకు జగన్ సిద్ధపడ్డారు. దీనిపై అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రజలు రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. మే నెలలోనే విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు జగన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రతరం అవడంతో రాజధాని తరలింపు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించేందుకు జగన్ సర్కార్ ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే ఈ రాజధాని మార్పుపై కోర్టులో బ్రేక్ పడింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొందేందుకు తరలింపు ప్రక్రియ చేపట్టబోమని అడ్వకేట్ జనరల్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎదురుదెబ్బల కాలంలో జగన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది. రాజధాని తరలింపు అంశంపై వెనక్కి తగ్గేది లేదంటూ మొండిగా ముందుకు వెళ్తున్న జగన్ సర్కార్‌కు ఎక్కిడక్కడ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓ వైపు కరోనా కాలంలోనూ రాజధాని తరలింపుపై ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఎంపీ విజయసాయిరెడ్డి అయితే రాజధాని తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ వైపు రాజధాని తరలింపును ఆపాలంటూ అమరావతి రైతుల జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జరిగిన విచారణలో అడ్వకేట్ జనరల్ కీలక విషయాన్ని కోర్టుకు విన్నవించారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో రాజధాని తరలింపు ప్రక్రియ మరింత కాలం వాయిదా పడనుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజధాని అంశంలో ఏం చేస్తున్నా కూడా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కోర్టులు కూడా అనేక అంశాలపై మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి విమర్శలకు దారి తీశాయి. అలాగే అమరావతి రైతుల జేఏసీ కూడా ఈ విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే కోర్టు అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించగా చట్టం చేసే వరకు కూడా అలాంటి తరలింపు ఏదీ లేదని చెప్పినప్పటికీ కూడా ఈ అంశంపై స్పష్టతనిస్తూ పది రోజుల్లోగా అవిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్‌ను, ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం రాజధాని అంశంలో ఎందుకింత మొండివైఖరి అవలంభిస్తోంది.

ఏపీలో అధికారుల తీరుపై వైద్య సిబ్బంది ఆగ్రహం!

అనంత‌పూర్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బంది పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించారు. కరోనా పాజిటివ్‌ కేసుతో 26 మంది వైద్య సిబ్బంది కాంటాక్ట్‌ అయ్యారు. వైద్య సిబ్బంది క్వారంటైన్ కేంద్రంలో ఉండాలంటూ అధికారుల ఆదేశించారు. ఎలాంటి సౌకర్యాలు లేని క్వారంటైన్‌కు వారిని అధికారులు అర్థరాత్రి తరలించారు. అయితే అక్కడ ఉండలేమని ఉన్నతాధికారులకు వైద్య మహిళా సిబ్బంది మొరపెట్టుకున్నారు. రాత్రంతా క్వారంటైన్ కేంద్రాల చుట్టూ వైద్య సిబ్బందిని తిప్పారు. ఎట్టకేలకు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ క్వారంటైన్‌కు వారిని తరలించారు. జేఎన్టీయూ నుంచి సీనియర్ డాక్టర్లను ఓ లాడ్జికి తరలించారు. హోం క్వారంటైన్‌కు అనుమతించాలంటూ వైద్య సిబ్బంది వేడుకుంటున్నారు. దీంతో అధికారుల తీరుపై వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఏపీలో నాటుసారా ఏరులై పారుతోంది! స్పీకర్ తమ్మినేని

నాటు సారాపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని, ఎక్సైజ్ శాఖ నిద్రపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సారాతో పాటు గంజాయి, నిషేధిత గుట్కా విచ్చలవిడిగా దొరుకుతోందని విమర్శించారు. నాటుసారా మాఫియాతో కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్నారన్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారిపై దృష్టి పెట్టి నాటు సారా కట్టడికి చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోరారు. గతంలో సారా తాగి ప్రజలు రోగాల పాలయ్యేవారు. కుటుంబాలు వీధిన పడేవి. సారా కట్టడికి ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పల్లెల్లో గుడుంబా మళ్లీ గుప్పుమంటోంది!! రాష్ట్రంలోని పల్లెల్లో సారా మళ్లీ ఏరులై పారుతోంది. నల్లబెల్లం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సారాకు బానిసై జనం అటు జేబులను ఇటు ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. అధికారుల అమ్యామ్యాలతో సారా తయారీ మళ్లీ ఊపందుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నల్లబెల్లం దొరక్కపోవడంతో చక్కెర వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల మొలాసిస్‌తో నాటు సారా కాస్తున్నారు. కల్తీ సారాతో కొందరు ఆస్పత్రుల పాలవుతుంటే ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు సైతం మామాళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. సారా తయారీదారుల నుంచి ముట్టాల్సినవన్నీ ముట్టుతున్నాయని, అందుకే చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.

బీజేపీ విద్వేష వైరస్‌! మత సామరస్యానికి తీరని నష్టం

రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకున్న వలస కార్మికులను కరోనా పరీక్షలు నిర్వహించి, సొంత రాష్ట్రాలకు అనుమతించాలని రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ డిమాండ్‌ చేశారు. వారిని ఇళ్లకు చేర్చే బాధ్యతను సొంత రాష్ట్రాలు తీసుకోవాలని కోరారు. కరోనాపై పోరాటంలో కేంద్రం రాష్ట్రాలకు అండగా నిలబడాలని, ఆర్థికంగా అండదండలు కల్పించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే కేంద్రంలోని మోదీ సర్కారు పిసినారిలా వ్యవహరిస్తూ అరకొర చర్యలు మాత్రమే తీసుకుంటోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ప్రజల కష్టాల పట్ల సానుభూతి, విశాల హృదయం, వేగంగా స్పందించే తత్వం కేంద్ర ప్రభుత్వంలో లేదని దుయ్యబట్టారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బీజేపీ మత విద్వేషాలవైర‌స్‌ను వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. ‘‘కరోనా వైర‌స్‌పై దేశమంతా ఒక్కటిగా పోరాటం చేస్తుంటే బీజేపీ మత విద్వేషమనే వైరస్‌ వ్యాప్తిని కొనసాగిస్తోంది. మహారాష్ట్రలోని పాల్గార్‌లో లాక్‌డౌన్‌ సమయంలో వాహనంలో వెళుతున్న హిందూ సాధువుల్ని పిల్లలను ఎత్తుకెళ్లే వారిగా అనుమానించి, కొట్టి చంపిన ఉదంతాన్ని బీజేపీ వివాదాస్పదం చేయడాన్ని సోనియా పరోక్షంగా ప్రస్తావించారు. వైద్యులకు, వైద్య సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్ల సంఖ్య, నాణ్యత బాగా తక్కువగా ఉందని అన్నారు. సరైన రక్షణ పరికరాలు లేకపోయినా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందికి భారత ప్రజలు వందనం చేయాలన్నారు. వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పాల్గొన్నారు. సోనియాగాంధీ అధ్యక్షోపన్యాసం చేశారు.

13 మంది న్యాయమూర్తులు.. 66 రోజులు... 

ఏప్రిల్ 24, 1973.... సరిగ్గా 47 సంవత్సరాల క్రితం ఇదేరోజు భారత దేశ చరిత్రలో చెప్పుకోదగిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడింది. సుప్రీం కోర్టులోని 13 మంది న్యాయమూర్తులు 66 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి 11 తీర్పులు 4 రోజులపాటు వెల్లడించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రి తో పాటు 13 మంది న్యాయమూర్తుల్లో మన తెలుగువారు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. కేరళ ప్రభుత్వం భూసమీకరణలో భాగంగా తీసుకున్న చర్యలను ప్రత్యేకించి తన మఠం భూములు కూడా సమీకరించడాన్ని వ్యతిరేకిస్తూ స్వామి కేశవానంద భారతి వేసిన కేసు చివరికి భారత రాజ్యాంగ ప్రతిపత్తిపై ఒక సమగ్ర వివరణ ఇచ్చిన కేసు. రాజ్యాంగం, రాజకీయం ఘర్షణ పడుతున్న తొలినాళ్ళలో 13 మంది న్యాయమూర్తులు ఇచ్చిన 11 తీర్పులు ఇప్పటికీ మన ప్రజాస్వామ్యానికి రక్షణ గోడలా నిలిచాయి. ప్రజాస్వామ్యంలోని మూడు మూల స్తంభాలు - పార్లమెంటు, పరిపాలనా రంగం మరియు న్యాయవ్యవస్థ - ఘర్షణ పడకుండా, ఒకరి విధుల్లోకి మరొకరు రాకుండా గీతలు గీసిన తీర్పు. అలాగే రాజకీయం రాజ్యాంగాన్ని ఎంతమేరకు ఉపయోగించుకోవాలో, రాజ్యాంగ సవరణలను న్యాయవ్యవస్థ ఎంతమేరకు అనుమతించాలో కూడా చెప్పిన రోజు. శ్రీమతి ఇందిరా గాంధీ అత్యధికంగా 29 సవరణలు చేశారు. పార్టీలో పెద్ద నేతలు కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటి మహామహులను ఎదుర్కొని లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత దేశ ప్రధానిగా 1966లో బాధ్యతలు చేపట్టిన శ్రీమతి గాంధీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి, కాంగ్రెస్ కురువృద్ధులను ఎదురొడ్డి నిలవడానికి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. వాటిలో కొన్ని ఈ రాజ్యాంగ సవరణలు. రాజకీయం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పడిన ఘర్షణ, శ్రీమతి గాంధీ నాయకత్వం, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి వంటి అంశాలు విశేషంగా చర్చ జరిగిన అత్యంత ప్రముఖమైన కేసు ఇది. ఈ కేసు తర్వాత రాజ్యాంగం మారుతూనే వస్తోంది. న్యాయమూర్తులు మారుతూనే ఉన్నారు. కానీ రాజ్యాంగ మౌళిక సూత్రాలు మాత్రం అభేద్యంగా నిలిచి ఉన్నాయి. అదే భారత ప్రజాస్వామ్య గొప్పతనం. ఏ వ్యవస్థలో అయినా కొన్ని చెదపురుగులు రావచ్చు, కానీ అవేవీ రాజ్యాంగ మౌళిక సూత్రాలను మార్చలేవు. అలాగే మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని మార్పులు అవసరం కావచ్చు కానీ రాజ్యాంగ మౌళిక స్వరూపం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది.

బైరెడ్డి చెప్పారు...పవన్ తెలుసుకున్నారు!

పరులు చెపితే కానీ, పవన్ కళ్యాణ్ కు వాస్తవాలు తెలిస్తున్నట్టు లేదు, ఇందుకు ఆయన తాజా ట్వీటే ఉదాహరణ. కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అయితే తాను ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం లేదని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు. "రాయలసీమ అభ్యున్నతి కోసం అహరహం శ్రమించే నిజమైన నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాకు లేఖ రాశారు. కరోనా మహమ్మారి విస్తరణపై తన ఆందోళనలను వెలిబుచ్చారు. కరోనా నివారణ చర్యల్లో రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు విఫలమవడాన్ని ఆయన ప్రస్తావించారు" అని పవన్ ట్విట్టర్ లో తెలిపారు. 

ప్లాస్మా థెరపీ ఫలితాలు బావున్నాయి: కేజ్రీవాల్ 

ఢిల్లీలో నలుగురు రోగులకు అందించిన ప్లాస్మా చికిత్స ప్రయోగం ఫలితాలు ఆసాజనకంగా ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ మంగళవారం ఈ ప్రయోగాలు ప్రారంభించింది. కరోనా వచ్చి కోలుకున్న రోగుల రక్తంలోని ప్లాస్మా సేకరించి కరోనా రోగులకు ఎక్కించడమే ప్లాస్మా చికిత్స. 'గత కొద్దిరోజులుగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్‌లో నలుగురు రోగులకు ప్లాస్మా థెరపీ మొదలుపెట్టాం. ఇప్పటివరకైతే ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి' అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మందికి ప్లాస్మా థెరపీ జరిపిస్తామని ఆయన చెప్పారు. పరిమిత స్థాయిలో పరీక్షలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని వివరించారు. తీవ్రంగా జబ్బుపడ్డ అందరికీ విస్తృతస్థాయిలో ఈ చికిత్స జరిపేందుకు వచ్చేవారం కేంద్రం అనుమతి కోరుతామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నవారు అందరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆప్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ సహకారంతో ఈ ప్రయోగాలు జరుపుతున్నారు. ఆ సంస్థ కరోనా రోగుల నుంచి సేకరించిన రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి ఇస్తుంది.