కరోనా రోగులను జంతువుల కన్నా దారుణంగా చూస్తున్నారు!!

కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఢిల్లీ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా రోగులకు చికిత్స, వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై మీడియాలో వస్తున్న ఉదంతాలను సుమోటాగా స్వీకరించిన న్యాయస్థానం.. విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా.. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆస్పత్రుల నిర్వహణ ఏమాత్రం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మృతదేహాలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. వారి వారి కుటుంబీకులకు కూడా కనీసం సమాచారం ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వకపోవడం వల్ల తమవారి చివరి చూపునకు కూడా బంధువులు నోచుకోలేని పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాలను భద్రపరచడంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కూడా సుప్రీం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య 7,000 నుంచి 5,000 కు అమాంతం ఎందుకు తగ్గిపోయింది? అని ప్రశ్నించింది. మే నెలతో పోల్చుకుంటే జూన్ లో కరోనా పరీక్షల సంఖ్య తగ్గింది. పరీక్షల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పండి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీం సూటిగా ప్రశ్నించింది. కరోనా విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఢిల్లీ ఆస్పత్రులు ఏమాత్రం పాటించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని.. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్రంతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్‌ 17కి వాయిదా వేసింది.

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ... అన్ని సవాళ్లను అధిగమించి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఫలితాలను మనం విడుదల చేశామన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ఫలితాలను అనుకున్న సమయానికి విడుదల చేయడమనేది ఓ చరిత్రాత్మకం అని తెలిపారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,07,230 మంది హాజరయ్యారని, వారిలో 3,00,560 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. సెకండియర్ పరీక్షలకు 4,35,655 మంది హాజరయ్యారని, వారిలో 2,76,389 పాస్ అయ్యారని తెలిపారు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలురు కన్నా బాలికలే పైచేయిగా సాధించారు. ఇక, జిల్లాలువారీగా చూస్తే ఫలితాల్లో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

అచ్చెన్నాయుడు అరెస్ట్ తరువాత ఇక చంద్రబాబే టార్గెట్..

ఇఎస్ఐ లో జరిగినదిగా చెప్పబడుతున్న అవినీతి కేసులో ఈ రోజు ఉదయం మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీని పై టీడీపీ నేతలు వైసిపి ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఐతే దీని పై వైసిపి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్మన్ రోజా స్పందిస్తూ.. తప్పు చేశారు కాబట్టే అచ్చెన్నను ఎసిబి అరెస్ట్ చేసిందని అన్నారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత ఎం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని రోజా విమర్శించారు. తప్పు చేసిన వ్యక్తి కులం బిసి అయినా ఓసి అయినా చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. ఇక ప్రజల్లో గెలవలేని లోకేష్ లాంటి వారి మాటలకూ అసలు విలువ లేదని ఎవరు పట్టించుకోరని ఆమె అన్నారు. తాము కనుక తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోవచ్చని తొడ కొట్టిన లోకేష్ ఇపుడు ఎందుకు మండిపడుతున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. ఇపుడు ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల వ్యవహారం లో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని ఆమె అన్నారు.

ఆ భయంతోనే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారా?

ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, కనీసం నోటీసులు ఇవ్వకుండా, అర్థరాత్రి సమయంలో వంద మంది పోలీసులతో ఇంటికెళ్లి అలా అరెస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు నోటీసులు ఇచ్చి, ఆయన విచారణకు సహకరించనంటే.. అప్పుడిలా భారీగా పోలీసులను మోహరించి ఆయనను అదుపులోకి తీసుకోవచ్చు. నోటీసు లేదు, సమాచారం లేదు.. ఏదో కిడ్నాప్ చేసినట్టుగా అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాగా, అచ్చెన్నాయుడిని ఉన్నపళంగా అరెస్ట్ చేయడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఈ నెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జగన్ సర్కార్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది. అందుకే బలమైన గొంతుకులను అసెంబ్లీలో వినిపించకుండా చేయాలన్న ఉద్దేశంతోనే.. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు మరియు మరికొంత మంది ఎమ్మెల్యేల మద్దతున్నా కూడా.. అచ్చెన్నాయుడు ఏ మాత్రం బెరుకు లేకుండా ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తుంటారు. అచ్చెన్నాయుడుని అసెంబ్లీలో ఎదుర్కోలేక సీఎం నుండి పలువురు సీనియర్ నేతలవరకు.. ఆయనపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా, అచ్చెన్నాయుడు ఏ మాత్రం సహనం కోల్పోకుండా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజాగళాన్ని బలంగా వినిపించారు. అచ్చెన్నాయుడు ఒక్కరే ఎందరికో సమాధానం చెప్పేవారు. అందుకే ఇప్పుడు ఆయనను అసెంబ్లీ సమావేశాలకు రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అధికార పార్టీకి ఈ సమావేశాలు చాలా కీలకం, అచ్చెన్నాయుడు వంటి వారు అసెంబ్లీలో ఉంటే.. తమ గళంలో ప్రభుత్వానికి నీళ్లు తాగిస్తున్నారు. అందుకే, అరెస్ట్ లు విచారణ అంటూ ఆయనను అసెంబ్లీ సమావేశాలకు దూరం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జాగ్రత్తలు పాటించే సాక్షాత్తు ఉన్నతాధికారులను చుట్టుముడుతున్న కరోనా 

కరోనా సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా సాక్షాత్తు అధికారులను కూడా వదలడం లేదు ఈ మహమ్మారి. తాజాగా తెలంగాణాలో పలువురు అధికారులు, నాయకులూ ఈ వైరస్ బారిన పడ్డారు. గురువారం యాదాద్రి సిఇవో దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా జ్వరం తో బాధ పడుతున్న సిఇవో లీవ్ పెట్టి హైద్రాబాద్ లోని నివాసం లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐతే అయన భార్యకు కూడా జ్వరం రావడం తో పరీక్షలు జరపగా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో యాదాద్రి జిల్లా కలెక్టర్ కూడా వారం పాటు ఇంటి నుండి పని చేస్తానని తెలిపారు.  ఇక సికిందరాబాద్ లోని రైల్వే డివిజన్ కార్యాలయంలో ఒక సీనియర్ అధికారికి కరోనా సోకింది. దీంతో ఆ భవనంలోని ఉద్యోగులను 11 గంటల కు ఇంటికి పంపించి వేశారు. కొద్దీ రోజుల క్రితం ఒక గూడ్స్ ట్రైన్ గార్డ్ కు కూడా కరోనా సోకింది. కొద్దీ రోజుల క్రితం కొండపోచమ్మ సాగర్ ముంపు ప్రాంత వాసులు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ను కలవడం జరిగింది తాజాగా అలా కలిసిన ఒక వ్యక్తికీ పాజిటివ్ రావడం తో సిద్ధిపేట కలెక్టర్ స్వయంగా గృహ నిర్బంధం లోకి వెళ్లారు.  మరో పక్క హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు పాజిటివ్ తేలడం తో అయన కుటుంబం కూడా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కొద్దీ రోజుల క్రితం ఒక మాజీ శాసనసభ్యుడు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తరువాత కోలుకుని ఇంటికి చేరిన విషయం తెలిసిందే. అందరికీ జాగ్రత్తలు చెప్పే అధికారులు కూడా కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కాబట్టి సామాన్యులు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళ్ళకూడదు. బంధువుల పెళ్లి అనో, తెలిసిన వాళ్ళ విందు అనో మునుపటిలా జాగ్రత్తలు పాటించకుండా అసలు వెళ్ళకూడదు. ఈ సమయంలో మనం బాగుంటేనే మనవాళ్ళు బాగుంటారన్న విషయం గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే!

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ పై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారంటూ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ జగన్ బీసీ నేత అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయించారు. ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారు." అంటూ లోకేష్ ధ్వజమెత్తారు. "బీసీ లకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు ఆయన పై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షస ఆనందం పొందారు. లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే." అంటూ విమర్శించారు. "రాజారెడ్డి రెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తానని జగన్ గారు అనుకుంటున్నారు. బడుగు,బలహీన వర్గాలకి రక్షణగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందనే విషయం జగన్ గారు గుర్తెరిగితే మంచిది." అని లోకేష్ హితవు పలికారు.

అచ్చెన్నాయుడి కిడ్నాప్‌కు సీఎం జగన్‌ కుట్ర!!

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఆయనని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అచ్చెన్నాయుడి అరెస్ట్ ని టీడీపీ నేతలు ఖండించారు. జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ పై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు 4 రోజుల ముందు అచ్చెన్నాయుడి కిడ్నాప్‌కు సీఎం జగన్‌ కుట్ర పన్నారని మండిపడ్డారు. దీనికి సీఎం‌ బాధ్యత వహించాలని, అలాగే హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బడుగు బహీన వర్గాలకు చేస్తున్న మోసం, అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతూ, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారు. ఇది సహించలేని జగన్‌ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడి, రాత్రి 100 మంది పోలీసులతో ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్‌ చేశారని మండిపడ్డారు. ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు, ముందస్తు నోటీసు ఇవ్వలేదు.. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అచ్చెన్నాయుడి ఆచూకీని డీజీపీ వెల్లడించాలని చంద్రబాబు కోరారు. అచ్చెన్నాయుడి ఎదుగుదలను చూసి ఓర్వలేకే సీఎం జగన్‌ కక్షగట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఏసీబీ పూర్తిగా జగన్‌ డైరెక్షన్‌లోనే పని చేస్తోందని విమర్శించారు. అచ్చెన్నాయుడి కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, ఆయనై ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు లేవని, ఆయనను అరెస్టు చేసినప్పుడు కనీసం ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకపోవడమేంటని యనమల ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. బలమైన నాయకులని ఇబ్బందులు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయాలనే కుట్ర తప్ప ఇందులో మరే ఉద్దేశమూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల ప్రజల్లోంచి వచ్చిన రాజకీయ నాయకుడిని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని నరేంద్ర మండిపడ్డారు.

ఇఎస్ఐ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో అచ్చం నాయుడు అరెస్ట్

టీడీపీ అధికారం లో ఉన్నపుడు జరిగినట్లుగా చెప్పబడుతున్న ఇఎస్ఐ స్కామ్ పై జగన్ ప్రభుత్వం ఎసిబి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. గతం లో కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్ల వ్యవహారం లో అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం భావించింది. ఈ స్కామ్ జరిగిన సమయం లో అచ్చం నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయం లో గత అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లో ఉన్న టీడీపీ నేత మాజీ మంత్రి అచ్చం నాయుడు ను ఎసిబి అదుపులోకి తీసుకుని విజయవాడ కు తరలిస్తున్నట్లుగా సమాచారం. దీని కోసం దాదాపుగా 100 మంది పొలిసు బలగం తో అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో శాసనసభ సమావేశాలు జరగనున్న నేపధ్యం లో ఈ అరెస్ట్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

తెలంగాణ లో ఒక్క రోజే డబుల్ సెంచరి దాటిన కరోనా కేసులు 

కరోనా కట్టడికి మాస్కులు ధరించండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి. సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయండి అంటూ ప్రభుత్వాలు నెత్తి నోరు కొట్టుకుని చెపుతున్నాయి. అయినా ప్రజలు మాస్కులు లేకుండా యధేచ్చగా తిరిగేస్తున్నారు. తాజాగా తెలంగాణ లో నిన్న కొత్తగా 209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా 9 మంది మృతి చెందారు. నిన్న నమోదైన కేసులలో 175 ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రం మొత్తంలో 4,320 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 1993 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,162 పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

యామినీ శర్మ.. పాపం బీజేపీకి ఏంటమ్మా ఈ కర్మ!!

రాజకీయ నాయకులకు పదవి అంటే పిచ్చి ప్రేమ. వారి స్థాయిని బట్టి నామినేటెడ్ పదవులో, మంత్రి పదవులో లేదా మరింకేదైనా పదవో కావాలని ఆశపడుతుంటారు. కొందరైతే మరి అత్యుత్సాహానికి పోతుంటారు. అసలు పదవి వస్తుందో రాదో, ఒకవేళ వస్తే ఎప్పుడొస్తుందో తెలియని పదవికి ముందే ప్రమాణ స్వీకారం ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ నాయకురాలు సాధినేని యామినీ శర్మ పరిస్థితి అలాగే ఉంది. కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది అధికార ప్రతినిధిగా సాధినేని యామినీ శర్మను నియమిస్తూ వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పాలకమండలి సీఈఓ విశాల్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. అబ్బో! యామినీ శర్మకి చాలా పెద్ద బాధ్యతలే అప్పగించారుగా. అంతేనా, ఎటువంటి పారితోషికం ఆశించకుండా, ఆలయం తరపున ఎటువంటి విరాళాలు స్వీకరించకుండా.. స్వచ్ఛందంగా కాశీ విశ్వనాథ దేవాలయం చేస్తున్న కార్యక్రమాలను, అందిస్తున్న సేవలను.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలోని భక్తులకు ప్రచారం చేయాల్సిందిగా యామినీ శర్మను ఆలయ సీఈఓ కోరారు. ఈ విషయాన్ని స్వయంగా యామినీ శర్మనే చెప్పారు. "కాశీ విశ్వనాథుని దేవాలయ ధార్మిక ప్రచారాన్ని దక్షిణాది ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలు నాకు అప్పగించినందుకు ఆలయ సీఈవోకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి క్షేత్రంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు యథాశక్తితో ప్రయత్నిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలికి కృతజ్ఞతలు" అంటూ యామినీ శర్మ ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ఏపీ మహిళ యామినీ శర్మ కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది అధికార ప్రతినిధిగా నియమితులవ్వడం గర్వకారణమని మనస్సులోనే ప్రశంసిస్తునారా?.. ఆగండి.. ఆగండి.. వచ్చే నెలలో వర్షం కురుస్తుంది అంటే కంగారుపడిపోయి ఇప్పుడే గొడుగు పట్టకండి. అసలు మేటర్ వేరే ఉంది. అసలు ఇదంతా ఫేక్ అంట. కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది అధికార ప్రతినిధిగా సాధినేని యామినీ శర్మను నిజంగానే నియమించారా అని ఆరా తీయగా అదంతా అబద్దమని తెలిసింది. సీఈఓ పేరుతో ఉన్న లెటర్ హెడ్ ఫేక్, సీఈఓ సంతకం ఫోర్జరీ అంట. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేత అయ్యుండి, ఇలా తప్పుడు ప్రచారం చేసుకోవడం ఏంటి? ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కాశీ విశ్వనాథ ట్రస్ట్ కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఊరు పేరు తెలియని నాయకులు ఎందరో తమకి ఆ పదవి ఉంది, ఈ పదవి ఉంది అంటూ.. ఐడీ కార్డులు వేసుకొని హడావుడి చేసేవారు. యామినీ శర్మ పుణ్యమా అని ఇప్పుడా సంప్రదాయం బీజేపీలో కూడా మొదలైంది. సోషల్ మీడియాలో నాలుగు మాటలు, నలభై ట్రోల్ల్స్ తప్ప వేరే ఏ క్వాలిఫికేషన్ లేని యామినీ శర్మ అదృష్టం కొద్దీ అప్పట్లో టీడీపీ అధికార ప్రతినిధి అయ్యారు. ఆమె వల్ల పార్టీకి రూపాయి ఉపయోగం లేకపోగా, వందరూపాయల నష్టం జరిగింది. మైక్ ముందు నోటికొచ్చింది వాగి, ఆమె ట్రోల్ అయింది, పార్టీ పరువు తీసింది. తీరా ఎన్నికల్లో ఓడిపోయాక.. తనని అధికార ప్రతినిధిని చేసి నెత్తిన పెట్టుకున్న టీడీపీని నోటికొచ్చిన మాటలు అని బీజేపీలో చేరింది. కొన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న యామినీ శర్మ.. ఇప్పుడు బీజేపీలో ఆమె మార్క్ నష్టం చేయడం మొదలుపెట్టారు.  బీజేపీ రాజకీయాలు కాస్త పద్దతిగా ఉంటాయి. నాయకులు ఎవరికివారు ఒంటెద్దు పోకడలకు పోరు. పార్టీ పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటారు. అలాంటి బీజేపీలో యామినీ శర్మ తింగరి పనులు చేస్తున్నారు. ఓ వైపు కాశీ విశ్వనాథ ట్రస్ట్ వాళ్ళు ఆ యామినీ శర్మ ఎవరో మాకు తెలీదు, ఆమెకి మేం ఏ బాధ్యతలు అప్పగించలేదని నెత్తినోరు కొట్టుకుంటుంటే.. యామినీ శర్మ ఏమో నాకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు, నా పనితనం ఏంటో చూపిస్తా అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. పాపం ఈ ఫేక్ ప్రచారంతో బీజేపీ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. అందుకే అంటారు.. ఎక్కడ ఉంచేవాళ్ళని అక్కడ ఉంచాలని. సోషల్ మీడియాలో నాలుగు అందమైన ఫోటోలు పెట్టి, నలభై డైలాగులు కొట్టినంత మాత్రాన నాయకులు అయిపోరు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉండాలి, దాన్ని ఆచరణలో చూపించాలి. అలాంటోళ్లని పార్టీలో చేర్చుకోవాలి, అంతేకాని ఇలా కాంట్రవర్సీలతో పేరు తెచుకునేవాళ్ళని కాదు. ఇప్పటికే ఆమెని నెత్తిన పెట్టుకొని ఓ పార్టీ పప్పులో కాలేసింది. ఇప్పుడు ఆమెకి బీజేపీ లేనిపోని ఫ్రీడమ్, పెత్తనం ఇచ్చి.. పార్టీకి నష్టం కలిగించొద్దు అంటూ.. సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. మరోవైపు, కాశీ విశ్వనాథ దేవాలయం పాలకమండలి సీఈఓ ఇప్పటికే యామినీ శర్మపై ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదన్నమాట మేటర్. వారణాసి క్షేత్రంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు యథాశక్తితో ప్రయత్నిస్తాను అని చెప్పిన యామినీ శర్మ.. అసలు ఆమే తనకేదో పదవి వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆమెని ఆ దేవుడు కాపాడుతాడో లేడో. యామినీ శర్మ.. ఎందుకమ్మా లేనిపోని పిచ్చి ప్రచారాలు చేసుకొని నీకు ఈ కర్మ.

కరోనా కేసుల విషయం లో కేసీఆర్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి

దేశంలో కరోనా కేసులు బయట పడుతున్న తొలి రోజుల్లో వైరస్ వ్యాప్తి కట్టడి కోసం తీవ్రంగా శ్రమించిన కేసీఆర్ సర్కార్ కాలం గడుస్తున్న కొద్ది పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో తాజాగా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ఒక పక్క ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాల ను పట్టించుకోకుండా టెస్టులను తగ్గిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో కేంద్రం నుండి వచ్చిన కేంద్ర బృందం రాష్ట్రం లో పెరుగుతున్న కేసుల విషయం లో ఆందోళన వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ పై దాడి తీవ్రమైంది. కరోనా కేసుల విషయం పై ఇటు హైకోర్టు అటు కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నల వర్షం తో ముంచెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు గాంధీ ఆపత్రి కి చెందిన జూడాలు ఆందోళన ఇబ్బందికరంగా తయారైంది. దీనికి తోడుగా అనేక మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతుండటం తో తెలంగాణ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యుద్ధం డైరెక్ట్ గా చేసే దమ్ములేని దద్దమ్మ జగన్!!

ఇటీవల సోషల్ మీడియాలో జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టారంటూ పశ్చిమ గోదావరి జిల్లాకి అనూష ఉండవల్లి అనే మహిళకి సీఐడీ నోటీసులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెకి టీడీపీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పించారంటూ నారా లోకేష్ పేరుతో లెటర్ హెడ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చాలామంది నిజం అనుకుంటున్నారు. అయితే ఇది ఫేక్ అని తెలిసింది. తాజాగా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన నారా లోకేష్.. వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఫేక్ బతుకులు మారవు. వైఎస్ జగన్ వేసే 5 రూపాయిల చిల్లర కోసం సొంత తల్లి పై తప్పుడు పోస్ట్ పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయింది వైకాపా పేటిఎం బ్యాచ్. యుద్ధం డైరెక్ట్ గా చేసే దమ్ములేని దద్దమ్మ జగన్ ఇలాంటి చెత్త పనులు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. జగన్ గారు  నన్ను బదనాం చెయ్యడానికి పడుతున్న కష్టంలో ఒక్క శాతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టినా, ప్రజలు హర్షిస్తారు. లేదు, నన్ను టార్గెట్ చెయ్యడమే మీ లక్ష్యం అయితే ఆల్ ది బెస్ట్." అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పై జగన్ సీబీఐ అస్త్రం

ఏపీలో చంద్రబాబు అధికారం లో ఉన్నపుడు ప్రభుత్వ పథకాలలోను, అమరావతి భూముల విషయంలోనూ భారీగా అవినీతి జరిగిందని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఏడాది క్రితం వైసిపి అధికారం లోకి వచ్చిన తరువాత ఈ అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చి చర్యలు తీసుకుంటారని అందరూ ఆశించారు. ఐతే వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని.. అవే ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇలా ఉంటే గత టీడీపీ ప్రభుత్వ హయాం లో జరిగిన అవినీతి అంతు తేల్చడం కోసం అంటూ కొద్ది నెలల క్రితం జగన్ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం లో ఆ సబ్ కమిటీ తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ లో ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో 700 కోట్లు, పండుగల సందర్బం గా ఇచ్చిన చంద్రన్న కానుక లో 158 కోట్లు మరియు హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల కొనుగోళ్లలో కూడా అవకతవకలు జరిగాయని పేర్కొంది. దీని పై చర్చించిన మంత్రివర్గం ఈ అవినీతి ఆరోపణల పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని నిర్ణయించింది.

జగన్ దేవుడు.. అలాంటి నాయకుడ్ని తిడతానా?.. డా.సుధాకర్ స్వరం మారిందేంటబ్బా!!

మాస్కులు అడిగిన పాపానికి.. డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి, పిచ్చోడు అనే ముద్ర వేశారన్న అంశం ఏపీలో ఎంత వివాదాస్పదమైనదో తెలిసిందే. అయితే, ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. డాక్టర్ సుధాకర్ స్వరం కాస్త మారింది. అప్పుడు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన ఆయన.. ఇప్పుడు సీఎం జగన్ ని దేవుడు అంటున్నారు. అంతేకాదు, తనని క్షమించి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు. కారు తీసుకెళ్లేందుకు విశాఖ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్‌కు డాక్టర్ సుధాకర్ వచ్చారు. ఈ సందర్భంగా సస్పెండ్ దగ్గర నుంచి మానసిక వైద్యశాల ఘటన వరకూ ఏం జరిగిందో వివరించారు. ‘‘సస్పెండ్ అయిన దగ్గర నుంచి బ్యాడ్‌ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. టార్చర్ భరించలేక బయటకు వెళ్లడానికి కూడా భయపడ్డా. బ్యాంక్ పనిమీద నక్కపల్లి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్తుండగా ఎవరో ఫాలో అవుతున్నారని కారు ఆపా. అప్పటికే కారులో కొంత డబ్బు ఉంది.. వెంబడిస్తున్నారని కారు దిగితే అల్లరిమూకలు తనపై దాడి చేశారు. పోలీసులకు కూడా తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తున్నట్లుగా పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయినా ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది... సీఎం జగన్ గారు నాకు దేవుడు. మోదీ గారిని కూడా నేను తిట్టలేదు. వాళ్లను తిట్టే ధైర్యం ఉందా?, శత్రువులను కూడా నేను తిట్టను. ప్రధాని మోదీ అంటే ఎంతో ఇష్టం. అలాంటి నాయకుడ్ని తిడతానా?, ఇక జగన్ గారైతే పేదల పాలిట మంచి పనులే చేస్తున్నారు. నాకు ఆ పార్టీ.. ఈ పార్టీ అంటూ ఏమీ ఉండదు" అంటూ చెప్పుకొచ్చారు.  "చంద్రబాబు పార్టీ అంటూ ముద్ర వేస్తున్నారు. ఆయన హయాంలో కూడా పని చేశాను. కానీ, చంద్రబాబు కార్యకర్తనైతే కాదు. అందరూ బాగానే పాలించారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పు. ఎవరికో చెడ్డ పేరు తెచ్చేందుకే నాపై దాడి చేశారు. పిచ్చోడి ముద్ర వేసి జాబ్ తీసేయాలని కుట్ర పన్నారు. నాకు గుండు గీసిందెవరో వారి పేరు చెప్పను. చెప్పానంటే మళ్లీ గొడవ మొదలవుతుంది. నేనైతే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. పేదలకు సేవ చేయాలనే ఉద్యోగం చేస్తున్నా. జీతం రాక ఇంట్లో ఇబ్బంది పడుతున్నా. ముఖ్యమంత్రి జగన్ గారు క్షమించి నా ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నా. తనను ఎవరూ ఉపయోగించుకోలేదు. అలా చేసుంటే వారిపై యాక్షన్ తీసుకోండి. ఆస్పత్రిలో చంపేస్తామని బెదిరిస్తే.. ఇంట్లో వాళ్లు కూడా భయపడ్డారు. మాకు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి. అవి చూసుకోవడానికి సమయం సరిపోవడం లేదు. అలాంటిది రాజకీయాలతో నాకు పనేంటి?, రాజకీయమంటేనే అసహ్యం. ఉద్యోగమే నాకు ముఖ్యం’’ అని డాక్టర్ సుధాకర్ స్పష్టం చేశారు.

మీరు తిండికి తిమ్మరాజు.. మీరు అవినీతికి తిమ్మరాజు

ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా శ్రమించినా గత ఏడాది జరిగిన ఎన్నికలలో అనూహ్యమైన ఓటమి తరువాత టీడీపీ కేడర్ లో కొంత నైరాశ్యం నెలకొంది. దీంతో టీడీపీకి యువ రక్తాన్ని ఎక్కించి మళ్ళీ పార్టీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఎపి టీడీపీ అధ్యక్షుడిగా యువకుడైన రామ్మోహన్ నాయుడికి బాధ్యతలు అప్పగించవచ్చని కూడా టాక్ నడుస్తోంది. తాజాగా ఇదే విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో లోకేష్ ను టార్గెట్ చేస్తూ "కొడుకేమో తిండికి తిమ్మరాజు.. పనికి పోతురాజు". పార్టీ సీనియర్లంతా చేతులెత్తేశారు. ఇపుడు ఎవరైతే ఏంటని రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబుగారు. విశాఖను రాజధాని కాకుండా అడ్డుకో చూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలిపీఠం ఎక్కిస్తున్నాడు. అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై తాజాగా స్పందించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు "అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు, పనికి పోతురాజు.. సీనియర్లు అందరు చేతగానోడి పాలనా చూసి "ఛీ" కొడుతున్నారు. కారు దించేశారనే కక్షతో మామ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ దించేయాలని కుట్ర మొదలెట్టాడు. ప్రత్యేక హోదా పై చేతులెత్తేశారు.. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు.. మూడు ముక్కలాట మొదలెట్టి మూతి ముడుచుకొని కూర్చోవడం తప్ప మామ అల్లుడి వల్ల ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లేదు. ఢిల్లీలో కాళ్ళు మొక్కడం ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు.. అంటూ అటు సీఎం జగన్ ను ఇటు విజయ్ సాయి రెడ్డిని టార్గెట్ చేశారు.

ఒక పక్క జూడాల నిరసన.. మరో పక్క చలో గాంధీ హాస్పిటల్ ఆందోళన.. అసలేం జరుగుతోంది

తెలంగాణాలోని కరోనా పాజిటివ్ పేషంట్లకు ప్రభుత్వపరంగా ట్రీట్మెంట్ ఇస్తున్న ఒకే ఒక్క కోవిడ్ హాస్పిటల్ గాంధీ ఆసుపత్రి. రాష్ట్రం మొత్తం లో ఎక్కడ కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా వారిని గాంధీ ఆసుపత్రి కి తరలించి వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇంత ముఖ్యమైన గాంధీ ఆసుపత్రి లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లు నిన్నటి నుండి ఆందోళన చేస్తున్నారు. మొన్న రాత్రి ట్రీట్మెంట్ పొందుతున్న ఒక కరోనా పేషంట్ మృతి చెందడం తో అతని బంధువులు అక్కడే ఉన్న జూనియర్ డాక్టర్ల పై దాడి చేయడంతో జూడాలు నిరసన తెలుపుతున్నారు. దాడుల నుండి తమకు రక్షణ కావాలని, తమకు రక్షణ పరికరాలు అందచేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. దీని పై ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేంద్ర జుడాలతో చర్చలు జరిపినా సమస్య ఒక కొలిక్కి రాలేదు. దీంతో జూడాల ఆందోళన రెండో రోజుకు చేరింది. ముఖ్యమంత్రి కానీ ఆరోగ్యశాఖా మంత్రి అని తమ డిమాండ్లను పరిష్కరించేవరకు విధులకు హాజరు అయ్యేది లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. మరో పక్క కరోనా తో పోరాడుతున్న గాంధీ వైద్య సిబ్బందికి ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని పేర్కొంటూ టిజెఎస్, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు చలో గాంధీ హాస్పిటల్ కు పిలుపు ఇచ్చారు. ఈ ఆందోళనల నేపధ్యం లో గాంధీ హాస్పిటల్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

చెక్ బౌన్స్‌ ఇక క్రిమినల్ కేసు కాదు!!

చెక్ బౌన్స్ మరియు రుణాలు తిరిగి చెల్లించడంలో ఆలస్యం వంటి చిన్న ఆర్థిక ఉల్లంఘనలను క్రిమినల్ కేసులుగా పరిగణించరాదని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు, చిన్న చిన్న ఆర్థిక ఉల్లంఘనలను డీ క్రిమినలైజేషన్ చేయాలన్న ఉద్దేశంలో భాగంగా.. మొత్తం 19 చట్టాల్లో సవరణలు ప్రతిపాదించిన కేంద్రం, జూన్ 23 వరకూ అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. సాంకేతిక కారణాలతో చేసే చిన్న చిన్న తప్పులను తీవ్ర నేరాల జాబితా నుంచి తప్పించాలన్నది ప్రభుత్వం ఆలోచన. దీని ద్వారా సులభతర వ్యాపార పరిస్థితులను కల్పించ వచ్చన్నది కేంద్రం అభిమతం. దీనిపై జూన్ 23 లోగా తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పౌర సంఘాలు, విద్యావేత్తలు, తదితరులను కోరింది. కాగా, ప్రస్తుతం చెక్ బౌన్స్ కేసులో రెండేళ్ల వరకూ జైలుశిక్ష లేదా చెక్ మొత్తానికి రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. చెక్ బౌన్స్ చట్టాలతో పాటు బ్యాంకు రుణాల చెల్లింపు ఉల్లంఘనలు, ఎల్ఐసీ, పీఎఫ్ఆర్డీఏ, చిట్ ఫండ్స్, జనరల్ ఇన్స్యూరెన్స్ బిజినెస్, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం, ఫ్యాక్టరింగ్ నియంత్రణ, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నియంత్రణ, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ తదితర చట్టాలను సవరించాలని కేంద్రం ప్రతిపాదించింది.

ఎంపీ కోమటిరెడ్డి హౌస్ అరెస్ట్.. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులా?

తెలంగాణలో అధికంగా వస్తున్న కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. ఈ క్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉదయం 6 గంటలకే హౌస్ అరెస్ట్ చేశారు.  ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించి ఇళ్ల అద్దెలు చెల్లించవద్దని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు శ్లాబుల పేరుతో ప్రజల నెత్తిన వేలాది రూపాయల బిల్లులు రుద్దుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంలో ప్రజలపై ఇంత కక్ష్య సాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నించారు. మూడు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇంతింత కరెంటు బిల్లులు ఎలా కడతారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్టులు చేయడం ఎక్కడి న్యాయమని కోమటిరెడ్డి ప్రశ్నించారు.