అచ్చెన్నాయుడు కేసు.. అసలు గుట్టు వేరే ఉంది!!

ఈఎస్‌ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని, 150 కోట్ల స్కాం లో ఆయన పాత్ర ఉందని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కానీ, లోతుగా పరిశీలిస్తే ఏదైతే స్కాం జరిగిందని ఆరోపిస్తున్నారో దానిలో అచ్చెన్నాయుడి పాత్ర లేదని తెలుస్తోంది. మొత్తం 150 కోట్ల స్కాం అంటున్నారు. నిజానికి ఇది మొత్తం 9 పార్టులు. 8 పార్టులకి సంభందించిన విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడా అచ్చెన్నాయుడు పేరు రాలేదు. అందులో ఒక్క టెలీహెల్త్ సర్వీస్ లో మాత్రమే అచ్చెన్నాయుడు లేఖ ఇచ్చాడని బయటకి చూపుతున్న ఆధారం. ఆ ఒక్క పార్ట్ కి సంబందించి.. రూ. 4-5 కోట్లైతే రూ.7.96 కోట్లు చెల్లించారనేది ఆరోపణ. అంటే అచ్చెన్నాయుడుకి సంబంధం ఉంది అంటున్న స్కాం విలువ 150 కోట్లు కాదు, 3 కోట్లు మాత్రమే. ఇక ఈ 3 కోట్ల కి సంభందించి.. అచ్చెన్నాయుడు నవంబర్ 25 2016 న ఇచ్చిన లేఖని గమనిస్తే.. అందులో తెలంగాణ లో అమలు పరచిన విధంగా ఏపీలో అమలు పరచండి అని రాశారు. ఎందుకంటే ఇది ఏపీలో కొత్త సర్వీస్.. 2016 లో మోదీ మీటింగ్ పెట్టాక ఇంప్లిమెంట్ చేశారు. అలాగే, 2016 నవంబర్ 25 న లేఖ ఇచ్చిన అచ్చెన్నాయుడు.. ఆ తర్వాత కార్మిక శాఖా మంత్రిగా ఉంది కేవలం 5 నెలలు మాత్రమే. 2017 ఏప్రిల్/ మే నుండి కార్మిక శాఖా మంత్రిగా పితాని వచ్చారు. అలాగే, ఆ 3 కోట్లకి సంభందించి ఆ టెలీసర్వీసెస్ సంస్థకి లబ్దిచేకూరిస్తే.. అచ్చెన్నాయుడు లబ్దిపొందినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయటకైతే చూపలేదు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 3 కోట్ల అవకతవకలకి సంభందించి.. అది కూడా పక్క రాష్ట్రాల లాగా అమలు చెయ్యండని లేఖ మాత్రమే ఇచ్చి.. అందునా ఆ తర్వాత 5 నెలల్లో పదవి నుండి దిగిపోయి.. అందునా ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానన్న ప్రజాప్రతినిది.. అందులోనూ ఒక్కరోజు ముందే సర్జరీ అయిన అచ్చెన్నాయుడుని.. ఇలా గోడలు దూకి అరెస్ట్ చేయడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

రూ.1,500 కోట్లు ఆదా చేశామంటున్నారు.. మరి ఈ రహస్య జీవోలేంటి?

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్‌ ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందానికి సంబంధించి జీవో కూడా విడుదలైంది. కానీ జీవోను ఓపెన్ చేస్తే మాత్రం అందులో వివరాలు వెల్లడించకుండా కాన్ఫిడెన్షియల్ అని చూపిస్తుంది. దీంతో, ఒప్పందం జీవోను ప్రభుత్వం ఎందుకు రహస్యంగా పెట్టిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం గతంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. కానీ, అప్పుడు అందులో స్కాం జరిగిందని, ఇప్పుడు తాము వందల కోట్లు ఆదా చేశామని జగన్ సర్కార్ చెబుతోంది. సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం అయితే లెక్కలతో సహా చెబుతున్నారు. "భోగాపురం విమానాశ్రయం‌ నిర్మించేందుకు జీఎంఆర్‌ తో గతంలో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 2,700 ఎకరాల భూమిని కేటాయించింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై జీఎంఆర్‌ సంస్థతో సంప్రదింపులు జరిపింది. విమానాశ్రయం నిర్మాణాన్ని 2,200 ఎకరాలను పరిమితం చేసింది. దాంతో ప్రభుత్వానికి 500 ఎకరాల భూమి మిగిలింది. ఆ భూమి విలువ రూ.1,500 కోట్లు. తద్వారా ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఆదా  చేసింది." అని చెప్పుకొచ్చారు. మరి అంత ఆదా చేసినప్పుడు రహస్య జీవో ఎందుకిచ్చారు? అసలు ప్రజలకు తెలియకుండా దాచాల్సిన అవసరం ఏముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో భోగాపురం విమానాశ్రయంలో పెద్ద స్కామ్ ఉందని, జీఎంఆర్ కు ఇచ్చేందుకే చంద్రబాబు సర్కారు కుట్ర చేసిందని అజేయకల్లం ఆరోపించారు. టిక్కెట్ల ధరలో వాటా అనటం వల్ల సర్కారుకు నష్టం అని ఆర్ధిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ సంస్థకు అడ్డగోలుగా ఎలా రాయితీలు ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు జగన్ మొదలుకొని అనేకమంది వైసీపీ నేతలు ఈ ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. మరి అప్పుడు జీఎంఆర్ ని విమర్శించిన జగన్.. ఇప్పుడదే జీఎంఆర్ తో ఒప్పందం ఎలా చేసుకున్నారు?. అసలు రూ.1,500 కోట్లు కోట్లు చేస్తే ఇలా రహస్య జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది?. అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని చెబుతున్న జగన్ సర్కార్.. ఇలా రహస్య జీవోలు ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి.

చింతమనేని అరెస్ట్.. కరోనాని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న జగన్

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలపర్రు చెక్ పోస్ట్ వద్ద టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ధర్నా చేసేందుకు చింతమనేని ప్రభాకర్ ప్రయత్నించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలించారంటూ ఐపీసీ సెక్షన్ 353తో పాటు మొత్తం ఆరు సెక్షన్ల కింద చింతమనేనిపై కేసు నమోదు చేశారు. చింతమనేని ప్రభాకర్‌ అరెస్ట్ ను టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ఆఖరికి కరోనా ని కూడా వైఎస్ జగన్ వేధింపుల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.  "టిడిపి నాయకుడు చింతమనేని అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాను. కోవిడ్ నిబంధనలు ఒక్క టిడిపి నాయకులకేనా. చింతమనేని ఎక్కడా గుంపులుగా తిరగలేదు, వెంట అనుచరులు లేరు. ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు." అని లోకేష్ పేర్కొన్నారు. "ఆఖరికి కరోనా ని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న వైఎస్ జగన్ గారి మానసిక స్థితిని చూసి జాలేస్తుంది. వైకాపా నాయకులు కోవిడియట్స్ గా మారారు అని జాతీయ మీడియా సైతం ఉతికి ఆరేసింది. గుంపులుగా తిరిగి,ర్యాలీలు నిర్వహించి కరోనా వ్యాప్తి కి కారణమైన వైకాపా నేతల పై కేసులు ఉండవా?" అంటూ లోకేష్ జగన్ సర్కార్ ని నిలదీశారు.

అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్ విడుదల.. ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్‌ విడుదలైంది. అచ్చెన్నాయుడు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఇటీవల జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. ఆ గాయానికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ఆయనకైన గాయం తగ్గడానికి రెండుమూడు రోజులు పట్టొచ్చని చెప్పారు. బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని, అలాగే ఆయనకు షుగర్ లెవల్స్‌ సాధారణంగానే ఉన్నాయని డాక్టర్ సుధాకర్ తెలిపారు. మరోవైపు, అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. అచ్చెన్నాయుడి ఆరోగ్యం గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడి కోరుకున్న చోట ఆయనకు వైద్య సహాయం అందించాలని ఏసీబీ అధికారులకు జగన్ ఆదేశించినట్టు సమాచారం. కాగా, కోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి అచ్చెన్నాయుడుని తరలించారు.

ప్రతిపక్ష నేతల పై కక్ష తీర్చుకోవడానికే జగన్ సీఎం అయినట్టు ఉంది

టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిల అరెస్ట్‌ను నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్.. ప్రతిపక్ష నేతల పై కక్ష తీర్చుకోవడానికే జగన్ సీఎం అయినట్టు ఉందని మండిపడ్డారు. "బీసీ నేత అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్ట్ ని పక్కదారి పట్టించేందుకే ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి లను అరెస్ట్ చేసారు. 16 నెలల జైలు పక్షి, లక్ష కోట్ల దోపిడీదారు, 11 కేసుల్లో ఏ1 జగన్ రెడ్డి, టిడిపి నాయకుల్ని జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నాడు." అంటూ లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఏడాది పాలనలో వైఎస్ జగన్ ఒక చేతగాని ముఖ్యమంత్రి అనే విషయం ప్రజలకు అర్థమైంది. ఆయనను అభద్రతా భావం వెంటాడుతోంది. అందుకే రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వానికి తెరలేపారు. ప్రలోభాలకు లొంగితే వైకాపా కండువా. లొంగకపోతే జైలు." అంటూ విమర్శించారు. "ప్రతిపక్ష నేతల పై వేధింపులు, కక్ష తీర్చుకోవడానికే జగన్ ముఖ్యమంత్రి అయినట్టు ఉంది. సమర్థవంతంగా జగన్ గవర్నమెంట్  'టెర్రరిజాన్ని' ఎదుర్కొంటాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు,అస్మిత్ రెడ్డి ల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను." అని లోకేష్ ట్వీట్ చేశారు.

జగన్ ప్రభుత్వం అసలు టార్గెట్ అచ్చెన్న కాదా.. మరి ఇంకెవరు..

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నిన్న ఎసిబి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు ఎసిబి కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం కూడా తెలిసిందే. ఐతే ఈ మొత్తం వ్యవహారం పై రాజకీయ విశ్లేషకుల స్పందన మాత్రం వేరుగా ఉంది. జగన్ ప్రభుత్వం టార్గెట్ అచ్చెన్న కాదని.. అసలు టార్గెట్ మాత్రం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అని విశ్లేషణ చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడికి అన్న కుమారుడు. కేవలం అసెంబ్లీ లో అధికార పక్షాన్ని ఇబ్బంది పెడుతున్నందువల్ల.. అయన కు హెచ్చరిక గా మాత్రమే అరెస్ట్ చేసారని అంటున్నారు. ఈ రోజు రేపు కోర్టుకు సెలవలు కావడం తో సోమవారం వరకు జైలు లో ఉంచి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయం లో అంతకు ముందు రోజే పైల్స్ ఆపరేషన్ జరిగిన వ్యక్తిని దాదాపు 10 గంటల సేపు ప్రయాణం చేయించి కారులో విజయవాడ కు తీసుకురావడం ఆరోగ్యపరంగా మరింత ఇబ్బంది కలిగించే అంశం. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే గత పదిహేను రోజులుగా వైసిపి నేతలు ఎర్రం నాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు అర్ధం అవుతోంది. ఆ కుటుంబం నుండి ప్రస్తుతం ఆదిరెడ్డి భవాని తో సహా ముగ్గురు ప్రజా ప్రతినిధులుగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఈ కుటుంబం టీడీపీ తోనే ప్రయాణం సాగిస్తున్నారు. ఐతే కొద్దీ రోజుల క్రితం రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వైసిపి ఒక ప్రచారం మొదలు పెట్టింది. దాని సారాంశం ఏంటంటే చంద్రబాబు రామ్మోహన్ నాయుడుని ఎపి పార్టీ ప్రెసిడెంట్ గా నియమించే ఉద్దేశ్యంలో ఉన్నట్లు.. ఐతే దీనిని లోకేష్ తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా పేక్ న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి కూడా రామ్మోహన్ నాయుడు ని టార్గెట్ చేస్తూ " లోకేష్ రాజకీయాలకు పనికి రాడని అందుకే రామ్మోహన్ ను బలి పశువును చేస్తున్నారని " ట్వీట్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విధంగా టార్గెట్ చేసి రామ్మోహన్ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసి తద్వారా పార్టీలో ఎటువంటి ఉన్నత పదవి తీసుకోకుండా భయపెట్టేలా వైసిపి ప్రయత్నిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. తండ్రి ఎర్రం నాయుడు హఠాన్మరణం తరువాత రాజకీయాలలోకి ప్రవేశించిన కొద్దీ కాలం లోనే రాజకీయంగా రాటుదేలిన రామ్మోహన్ నాయుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎలా అడుగు ముంచుకు వేస్తారో అని అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు టీడీపీ కేడర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తెలంగాణాలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా జనగామ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శుక్రవారం అస్వస్థకు గురైన అయనను హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడ డాక్టర్లు పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్దీ రాజుల క్రితం మాజీ ఎమ్మెల్యే, అయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రాగా కార్పోరేట్ హాస్పిటల్ లో చేరి ట్రీట్ మెంట్ తీసుకున్న తరువాత కోలుకుని ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రం లో ఒక ప్రజా ప్రతినిధికి కరోనా సోకడం ఇదే ప్రధమం. సిద్దపేటకు చెందిన మంత్రి హరీష్ రావు పిఎ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మంత్రికి కూడా పరీక్ష చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. ఐతే కరోనా నెగటివ్ వచ్చినా కూడా హరీష్ రావు హైదరాబాద్ లోని తన ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. హైదరాబాద్, సిద్దిపేట లోని అయన ఆఫీసు సిబ్బంది 32 మందికి కి పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా హైదరాబాద్ నగర మేయర్ రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడం తో మేయర్ కు రెండో సారి పరీక్ష చేశారు.. ఇంకా రిజల్ట్ రావలసి ఉండటం తో నగర్ మేయర్ తో పాటు పలు పర్యటనలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసి కమిషనర్, పలువురు కార్పొరేటర్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయం లో హైదరాబాద్ నగరం లో కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. మలక్ పేట లోని ఆస్మాన్ గఢ్ ప్రాంతం లో నివసిస్తున్న ఎపి సెక్రటేరియట్ ఉద్యోగి, భార్య, పిల్లలకు కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్న తెలంగాణాలో 164 కొత్త కరోనా కేసులు నమోదు కాగా అందులో 133 కేసులు జీహెచ్ఎంసి పరిధిలోనే నమోదయ్యాయి.

ప్రత్యర్థులపై కక్ష సాధించడం ఫ్యాక్షనిస్టుల స్వభావం.. ఇప్పుడు జగన్ చేస్తున్నది ఇదే

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. "ఒక అవినీతిపరుడు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేర స్వభావి చేతికి అధికారం వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రత్యర్థులపై కక్ష సాధించడం అన్నది ఫ్యాక్షనిస్టుల స్వభావం. ఇప్పుడు ఈ వైఎస్ జగన్ చేస్తున్నది ఇదే." అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నిన్న బీసీ నేత అచ్చెన్నాయుడు ఇంటి గోడలుదూకి మరీ వెళ్ళిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసారు. ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేసారు. ప్రలోభాలకు లొంగని తెలుగుదేశం నేతలను ఇలా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులతో బెదిరిస్తున్నారు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిపాలనలో ఘోరంగా విఫలమై ప్రజల దృష్టిని మరల్చడానికి పాలకులు చేస్తున్న అరాచకాలను అందరూ అడ్డుకోవాలి. లేదంటే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం." అని చంద్రబాబు పేర్కొన్నారు.

అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్

ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అచ్చెన్నాయుడికి ఇటీవల శస్త్ర చికిత్స జరగడంతో, ఆయనకు ఆస్పత్రిలో వైద్యం అందించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు తొలుత అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అనంతరం జైలు అధికారుల అనుమతితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేష్ కుమార్‌ను రాజమండ్రి సబ్ జైలుకు తరలించారు. ఈఎస్ఐ మందులు కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అచ్చెన్నాయుడితోపాటు రమేష్  కుమార్‌ను కూడా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వాదనల అనంతరం అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్‌లకు న్యాయమూర్తి రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. అచ్చెన్నాయుడికి శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో గురువారం స్వల్ప శస్త్రచికిత్స జరిగింది. కరోనా‌ ఉధృతి కారణంగా ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకోడానికి వీలులేకపోవడంతో ఆయన నిమ్మాడ వెళ్లారు. ఇదే విషయాన్ని న్యాయమూర్తికి అచ్చన్నాయుడు తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తెలిపారు. దీంతో గుంటూరు ఆస్పత్రిలో అచ్చెన్నాయుడికి వైద్యం అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్

ఏపీలో నిన్న టీడీపీ నేత అచ్చన్నాయుడి అరెస్ట్ మరువక ముందే.. నేడు మరో ఇద్దరు టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు జేసీ అస్మిత్ ‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్‌ నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి తరలిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వారిద్దరిని కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చడం, నకిలీ ఎన్‌వోసీలు సృష్టించి ఏపీకి తరలించారన్న ఆరోపణలపై ప్రభాకర్ ‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని నకిలీ ఇన్సూరెన్స్‌ల వ్యవహారంలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వాహనాలకు ఇన్సూరెన్స్ చెల్లించకుండానే.. చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్న ఆరోపణల నేపథ్యంలో అస్మిత్‌రెడ్డి ని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

అప్పటి నుంచే అచ్చెన్నాయుడిపై జగన్ పగ పెంచుకున్నారు

టీడీపీ సీనియర్ నేత, తన బాబాయి అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. అచ్చెన్నాయుడిని 151 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కోలేక ఈ రకమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రతాపం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో భయాన్ని సృష్టించడానికి, ప్రశ్నించకూడదు అన్న ధోరణిలో వెళుతున్నారని విమర్శించారు. అచ్చెన్నాయుడు అరెస్టుకు జగన్ సూత్రధారి అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ అసెంబ్లీలో ఏ ప్రశ్న అడిగినా.. దానికి ధీటుగా సమాధానం ఇచ్చిన నేత అచ్చెన్నాయుడని, అప్పటి నుంచే జగన్ ఆయనపై పగ పెంచుకున్నారన్నారు. ఆ పగతోనే ఇవాళ ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నారని ఆరోపించారు. పోలీసులు చేసింది పద్ధతిగా లేదని, వైసీపీ నాయకులే ఖాకీ డ్రెస్ వేసుకుని అరెస్టు చేసినట్లుగా ఉందని అన్నారు. ఇదే ఇష్యూపై గతంలో మొదట ప్రెస్ మీట్ పెట్టిందే అచ్చెన్నాయుడని, ఆరోపణలపై అప్పట్లోనే సమాధనాం ఇచ్చారని, దీనిపై ఏ వ్యవస్థ అయినా విచారణకు ఎక్కడకు పిలిచినా వస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా ముందుగా అచ్చెన్నాయుడు జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని.. అది సీఎంకి నచ్చలేదని, అందుకే కడప రాజకీయం ప్రయోగించారని రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రధాన గొంతుక అచ్చెన్నాయుడని, ఈ ప్రభుత్వానికి ఫ్యాక్షన్ రాజకీయాలు, విధ్వంసం చేయడం తప్ప మరొకటి లేదని మండిపడ్డారు. ఫాల్స్ కేసు సృష్టించి అరెస్ట్ చేశారన్నారు. కేంద్రం తరఫున ఈఎస్ఐకీ నిధులు వస్తాయని, తక్కువ ధరకే మందులు కొన్న రాష్ట్రం ఏపీ అన్నారు. అందులో ఏమైనా తప్పులు జరిగితే... సెంట్రల్ అధికారులు చూసుకుంటారని, రాష్ట్రం పరిధిలోకి రాదని.. ఏవైనా జరిగితే.. కేంద్రం ఆ నివేదకలను అప్రూవ్ చేయదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం.. జగన్ సర్కార్ తో జీఎంఆర్‌ ఒప్పందం

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్‌ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్‌ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాలవలవన్, జీఎంఆర్‌ ఛైర్మన్‌ జీబీఎస్‌. రాజు సంతకాలు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ ఆర్కే రోజా, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని జీఎంఆర్‌ ప్రతినిధులు తెలిపారు. దీనికోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నామని జీఎంఆర్‌ ప్రతినిధులు అన్నారు. ఉత్తరాంధ్రప్రాంతానికి మంచి సదుపాయం వస్తుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఎయిర్‌ పోర్టునుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా, సౌకర్యంగా చేరుకునేలా రహదారులను నిర్మిస్తామని సీఎం చెప్పారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తిచేస్తామన్నారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖ నగరంతో అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటు పైనా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం జగన్ చెప్పారు.

ఆ మాజీ మంత్రులందరిని జగన్ అరెస్ట్ చేయిస్తారా..

ఈ రోజు ఇఎస్ఐ గోల్ మాల్ వ్యవహారం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయంలో గతంలో కార్మిక శాఖా మంత్రిగా పని చేసిన పితానిని కూడా అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా పార్టీలో కీలక నేతలైన యనమల నుండి మొదలు పెట్టి లోకేష్ వరకు టీడీపీ బడా నాయకులను జగన్ ప్రభ్యత్వం టార్గెట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఏపీ ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుక, హెరిటేజ్ మజ్జిగ కొనుగోలు తదితర అంశాల పై నిన్న ఏపీ క్యాబినెట్ సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు సంబంధించిన వివరాలు నిన్న ప్రెస్ మీట్ లో తెలిపిన మంత్రి పేర్ని నాని ఒక సందర్భం లో లోకేష్ అండ్ టీం మాట్లాడితే చాలు మా అవినీతి పై ఎటువంటి ఆధారాలున్నా విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసురుతున్న నేపధ్యం లో ఇప్పటి నుండి విచారణలకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించారు. తాజాగా అచ్చెన్న అరెస్ట్ తో జగన్ ప్రభుత్వం నయానో భయానో మెల్లమెల్లగా టీడీపీ ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందా అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఇదే విషయమై టీవీ డిబేట్ల లో పాల్గొంటున్న వైసిపి మంత్రులు, కీలక నేతల కామెంట్లను పరిశీలిస్తే ఈ అనుమానం నిజమే అనిపిస్తుంది. తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక టీవీ డిబేట్ లో పాల్గొంటూ ఇది కేవలం ఆరంభము మాత్రమే అని తరువాత వరుసగా యనమల, దేవినేని ఉమా, నారా లోకేష్, ఫైనల్ గా చంద్రబాబు ల వంతు అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ విచారణలు అరెస్టుల అంశం ఎంతవరకు దారి తీస్తుందో అని పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అపర చాణక్యుడని పేరు తెచ్చుకుని గతం లో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సంకట సమయం లో పార్టీని ఎలా ఒడ్డుకు చేరుస్తారో వేచి చూడాలి.

కరోనా రోగులను జంతువుల కన్నా దారుణంగా చూస్తున్నారు!!

కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఢిల్లీ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా రోగులకు చికిత్స, వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై మీడియాలో వస్తున్న ఉదంతాలను సుమోటాగా స్వీకరించిన న్యాయస్థానం.. విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా.. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆస్పత్రుల నిర్వహణ ఏమాత్రం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మృతదేహాలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. వారి వారి కుటుంబీకులకు కూడా కనీసం సమాచారం ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వకపోవడం వల్ల తమవారి చివరి చూపునకు కూడా బంధువులు నోచుకోలేని పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాలను భద్రపరచడంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కూడా సుప్రీం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీలో కరోనా పరీక్షల సంఖ్య 7,000 నుంచి 5,000 కు అమాంతం ఎందుకు తగ్గిపోయింది? అని ప్రశ్నించింది. మే నెలతో పోల్చుకుంటే జూన్ లో కరోనా పరీక్షల సంఖ్య తగ్గింది. పరీక్షల సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పండి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీం సూటిగా ప్రశ్నించింది. కరోనా విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఢిల్లీ ఆస్పత్రులు ఏమాత్రం పాటించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని.. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్రంతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్‌ 17కి వాయిదా వేసింది.

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ... అన్ని సవాళ్లను అధిగమించి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఫలితాలను మనం విడుదల చేశామన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ఫలితాలను అనుకున్న సమయానికి విడుదల చేయడమనేది ఓ చరిత్రాత్మకం అని తెలిపారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,07,230 మంది హాజరయ్యారని, వారిలో 3,00,560 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. సెకండియర్ పరీక్షలకు 4,35,655 మంది హాజరయ్యారని, వారిలో 2,76,389 పాస్ అయ్యారని తెలిపారు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలురు కన్నా బాలికలే పైచేయిగా సాధించారు. ఇక, జిల్లాలువారీగా చూస్తే ఫలితాల్లో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

అచ్చెన్నాయుడు అరెస్ట్ తరువాత ఇక చంద్రబాబే టార్గెట్..

ఇఎస్ఐ లో జరిగినదిగా చెప్పబడుతున్న అవినీతి కేసులో ఈ రోజు ఉదయం మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీని పై టీడీపీ నేతలు వైసిపి ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఐతే దీని పై వైసిపి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్మన్ రోజా స్పందిస్తూ.. తప్పు చేశారు కాబట్టే అచ్చెన్నను ఎసిబి అరెస్ట్ చేసిందని అన్నారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత ఎం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని రోజా విమర్శించారు. తప్పు చేసిన వ్యక్తి కులం బిసి అయినా ఓసి అయినా చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. ఇక ప్రజల్లో గెలవలేని లోకేష్ లాంటి వారి మాటలకూ అసలు విలువ లేదని ఎవరు పట్టించుకోరని ఆమె అన్నారు. తాము కనుక తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోవచ్చని తొడ కొట్టిన లోకేష్ ఇపుడు ఎందుకు మండిపడుతున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. ఇపుడు ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల వ్యవహారం లో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని ఆమె అన్నారు.

ఆ భయంతోనే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారా?

ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, కనీసం నోటీసులు ఇవ్వకుండా, అర్థరాత్రి సమయంలో వంద మంది పోలీసులతో ఇంటికెళ్లి అలా అరెస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు నోటీసులు ఇచ్చి, ఆయన విచారణకు సహకరించనంటే.. అప్పుడిలా భారీగా పోలీసులను మోహరించి ఆయనను అదుపులోకి తీసుకోవచ్చు. నోటీసు లేదు, సమాచారం లేదు.. ఏదో కిడ్నాప్ చేసినట్టుగా అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాగా, అచ్చెన్నాయుడిని ఉన్నపళంగా అరెస్ట్ చేయడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఈ నెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జగన్ సర్కార్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది. అందుకే బలమైన గొంతుకులను అసెంబ్లీలో వినిపించకుండా చేయాలన్న ఉద్దేశంతోనే.. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు మరియు మరికొంత మంది ఎమ్మెల్యేల మద్దతున్నా కూడా.. అచ్చెన్నాయుడు ఏ మాత్రం బెరుకు లేకుండా ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తుంటారు. అచ్చెన్నాయుడుని అసెంబ్లీలో ఎదుర్కోలేక సీఎం నుండి పలువురు సీనియర్ నేతలవరకు.. ఆయనపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా, అచ్చెన్నాయుడు ఏ మాత్రం సహనం కోల్పోకుండా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజాగళాన్ని బలంగా వినిపించారు. అచ్చెన్నాయుడు ఒక్కరే ఎందరికో సమాధానం చెప్పేవారు. అందుకే ఇప్పుడు ఆయనను అసెంబ్లీ సమావేశాలకు రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అధికార పార్టీకి ఈ సమావేశాలు చాలా కీలకం, అచ్చెన్నాయుడు వంటి వారు అసెంబ్లీలో ఉంటే.. తమ గళంలో ప్రభుత్వానికి నీళ్లు తాగిస్తున్నారు. అందుకే, అరెస్ట్ లు విచారణ అంటూ ఆయనను అసెంబ్లీ సమావేశాలకు దూరం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.