అచ్చెన్నాయుడు అరెస్ట్ తరువాత ఇక చంద్రబాబే టార్గెట్..
posted on Jun 12, 2020 @ 3:28PM
ఇఎస్ఐ లో జరిగినదిగా చెప్పబడుతున్న అవినీతి కేసులో ఈ రోజు ఉదయం మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీని పై టీడీపీ నేతలు వైసిపి ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఐతే దీని పై వైసిపి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్మన్ రోజా స్పందిస్తూ.. తప్పు చేశారు కాబట్టే అచ్చెన్నను ఎసిబి అరెస్ట్ చేసిందని అన్నారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత ఎం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని రోజా విమర్శించారు. తప్పు చేసిన వ్యక్తి కులం బిసి అయినా ఓసి అయినా చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. ఇక ప్రజల్లో గెలవలేని లోకేష్ లాంటి వారి మాటలకూ అసలు విలువ లేదని ఎవరు పట్టించుకోరని ఆమె అన్నారు. తాము కనుక తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోవచ్చని తొడ కొట్టిన లోకేష్ ఇపుడు ఎందుకు మండిపడుతున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. ఇపుడు ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల వ్యవహారం లో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని ఆమె అన్నారు.