నిమ్మగడ్డ‌కు రాష్ట్ర ప్రభుత్వం నరకం చూపిస్తోంది

నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం నరకం చూపిస్తోందన్నారు. రమేష్ కుమార్ తన కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా నిలువరించేందుకు పోలీసు బలగాలను మోహరించారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని  పరిరక్షించడంలో రాష్ట్ర అధిపతిగా మీరు జోక్యం చేసుకుని విషయాలను సరిదిద్దాలని కోరుతున్నామన్నారు. రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేలా ‌చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కన్నా కోరారు. స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్న తీరు సరి కాదని కన్నా లేఖలో పేర్కొన్నారు. అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తూ స్థానిక ఎన్నికలలో అక్రమాలకు తెగబడిందన్నారు. పలువురు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేస్తే.. ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా పోస్టింగుల్లో ‌ఉంచిందన్నారు.

ఏకంగా సభలోనే తొడ గొట్టిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

టీడీపీ నేతల పై మాటల తూటాలతో దాడి చేసే ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా శాసన మండలిలో టీడీపీ నేతల పై మరోసారి విరుచుకు పడ్డారు. ఈ రోజు మంత్రి అనిల్, టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర్ రావు ల మధ్య శాసనమండలిలో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన మంత్రి అనిల్ ఏకంగా సభలోనే తొడగొట్టారు. ఈ రోజు చర్చలో భాగంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు విషయాన్ని టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వర్ రావు సభలో లేవనెత్తారు. బీసీ నాయకులను ప్రభుత్వం అణగదొక్కుతోందని ఆయన ఆరోపించారు. అదే సమయం లో ఆయన వ్యాఖ్యలను మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్పుబట్టారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.  ఈ చర్చలో జోక్యం కల్పించుకున్న మంత్రి అనిల్ ముద్రగడ పద్మనాభం అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించారు. కాపు ఉద్యమ సమయంలో మూడువేల మంది పోలీసులతో టీడీపీ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని ఎలా భావించాలని అయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా సభలోనే తొడగొట్టారు. నెల్లూరు లో తనను ఓడించడానికి ఎన్నికల్లో టీడీపీ నాయకులు కోట్లు ఖర్చు చేసారని.. అయినా తాను గెలిచి శాసన సభకు వచ్చానని అనిల్ అన్నారు. ఐతే అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మండలి చైర్మన్ షరీఫ్ సభను కొద్దీ సేపు వాయిదా వేశారు.

ఏపీలో బీజేపీ ఆట మొదలైంది.. వైసీపీకి అధికారం దూరం కానుందా?

'పెరుగుట విరుగుట కొరకే' అనే సామెత ప్రస్తుతం ఏపీ అధికార పార్టీకి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీలో ఒక్క ఏడాదిలోనే అలజడి మొదలైంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రూపంలో ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే జగన్ సర్కార్ తీరుని పలుసార్లు తప్పుబట్టిన ఆయన.. తాజాగా ఆయన స్వరాన్ని మరింత పెంచారు. నరసాపురంలో జగన్ బొమ్మ చెల్లకే తనని పార్టీలోకి రమ్మన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా అదే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పై అయితే.. ఓ టీవీ డిబేట్ లో బూతులతోనే విరుచుకుపడ్డారు. ఏకంగా పార్టీ అధినేత, సీఎం పైనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. రాష్ట్రంలో బలమైన పార్టీని ఢీ కొట్టడానికి సిద్దమవ్వడం.. అసలు ఓ ఎంపీకి ధైర్యం ఇంత ఎక్కడిది?. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలతోనే, ఎంపీ రఘురామకృష్ణంరాజు రెచ్చిపోతున్నారని, బలమైన వైసీపీని ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దక్షిణ భారత దేశంలో మాత్రం ఆశించిన స్థాయిలో బలపడలేదనే చెప్పాలి. ప్రస్తుతం బీజేపీ కన్ను దక్షిణ భారతదేశంపై ఉంది. ప్రాంతీయ పార్టీలను ఢీకొట్టి దక్షిణంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తోంది. అందులో భాగంగానే ముందుగా ఏపీలో పావులు కదపడం మొదలు పెట్టింది అంటున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ద్వారా వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టించి ఏపీ రాజకీయాల్లో ఊహించని మలుపు తీసుకురాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఎంపీ రఘురామకృష్ణంరాజుకి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎం జగన్ కే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం కష్టమవుతుంటే.. ఎంపీ రఘురామకృష్ణంరాజుకి తేలికగా అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆయనికి బీజేపీతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో. ఆ బంధమే ఇప్పుడు వైసీపీ పాలిట గుదిబండలా మారిందని అంటున్నారు. టీడీపీ నేతలు పది పదిహేను మంది తమ పార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటారు. నిజానికి అసలు వైసీపీ నేతలే పదుల సంఖ్యలో బీజేపీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఏ క్షణంలోనైనా ఇది జరగొచ్చని తెలుస్తోంది. పైకి జగన్ సర్కార్ పై వ్యతిరేక స్వరం వినిపిస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు కనిపిస్తున్నా.. ఆయన వెనక మాత్రం ప్రస్తుత రాజకీయ పార్టీలలో బాహుబలి అయిన బీజేపీ ఉందని తెలుస్తోంది. ఇదంతా తెర ముందు ఎంపీ రఘురామకృష్ణంరాజుని పెట్టి తెర వెనుక బీజేపీ ఆడిస్తోన్న ఆటట. బీజేపీ ఒక్క చిటిక వేస్తే చాలు.. ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే ఏలూరు, నర్సరావుపేట, ఒంగోలు, నెల్లూరు నేతలు వైసీపీకి అందుబాటులో లేకుండా పోయారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. ఓ సందర్భంలో సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్న వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. 50 శాతానికి పైగా ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పారు. ఎక్కువ సీట్లు గెలిచి సీఎం అయిన నాయకులు.. సొంత పార్టీ నుంచే తిరుగుబాటు ఎదుర్కొన్నట్టు చరిత్ర చెబుతుందని ఉండవల్లి అన్నారు. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఉండవల్లి మాటలు నిజమవుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి, ఎంపీ రఘురామకృష్ణంరాజు తిరుగుబాటుతో మొదలైన ఈ అలజడి ఏ స్థాయికి చేరుతుందో ఏంటో?. ఏపీలో జెండా పాతాలని చూస్తోన్న బీజేపీ.. వైసీపీకి ఊహించని షాకిచ్చి జెండా పాతుతుందేమో చూడాలి.

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై నిర్భయ కేసు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి పై నిర్భయ కేసు ఫైల్ ఐంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారని అభియోగం. దీని పై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం తో నిర్భయ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా ఒక మాజీ మంత్రి పై నిర్భయ కేసు పెట్టడం ఇదే మొదటి సారి. ఇప్పటికే మరో మాజీ మంత్రి అచ్చెన్నను ఎసిబి, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, అయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపధ్యం లో టీడీపీ కి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి.

క‌రోనా మెడిసిన్ వ‌చ్చేసింది!!

కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్న వేళ కాస్త ఉపశమనం కలిగించే వార్త ఒకటి తెలిసింది. కరోనా నుంచి ప్రాణాపాయం తగ్గించే మెడిసిన్ ను యూకే పరిశోధకులు క‌నుగొన్నారు. స్టెరాయిడ్ మెడిసిన్‌గా చెప్పే డెక్సామిథసోన్ ను స్వల్ప పరిమాణంలో.. పది రోజుల పాటు కరోనా బాధితులకు వాడి చూడగా సత్ఫలితాలు వచ్చాయి. డెక్సామిథసోన్ వాడిన వారిలో మరణాల రేటు తగ్గింది. వెంటిలేటర్ పై ఉన్నవారిలో 33 శాతం, ఆక్సిజన్ అవసరమైన కరోనా బాధితుల్లో 20 శాతం మరణాల రేటు తగ్గిందని యూకే పరిశోధకులు తెలిపారు. క‌రోనా బారిన‌ప‌డి రోజుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న త‌రుణంలో.. ఈ మెడిసిన్ మంచి ఉప‌శ‌మ‌నంగా చెప్పుకోవాలి. 

భారత్- చైనా సరిహద్దు ఘర్షణలో భారీ ప్రాణ నష్టం

భారత్- చైనా సరిహద్దులో ఘర్షణ ఆందోళన కలిగిస్తోంది. గాల్వన్‌ లోయలో చైనా సైనికులు, భారత్ సైనికులపై రాళ్లు విసిరి దాడికి దిగారు. దీంతో, మన సైనికులు వారికి దీటుగా బదులిచ్చారు. అయితే, ఈ హింసాత్మక ఘర్షణలో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘర్షణలో 20 మంది భారత్ జవాన్లు మరణించారని సమాచారం. చైనా సైనికులు కూడా భారీ సంఖ్యలో మరణించినట్లు తెలుస్తోంది. 43 మంది చైనా సైనికులు మరణించారని సమాచారం. సరిహద్దులో చైనాతో తలెత్తిన ఘర్షణపై భారత ప్రభుత్వం స్పందించింది. తామెప్పుడూ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ని అతిక్రమించలేదని, తమ కార్యకలాపాలు ఎప్పుడూ దాని పరిధిలోనే జరిగాయని స్పష్టం చేసింది. ఎల్‌ఏసీ ని గౌరవిస్తూ చైనా బలగాలు సాఫీగా వెనక్కు వెళ్తాయని భావించినట్లు తెలిపింది. మరోవైపు ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. తదుపరి కార్యాచరణ పై సమాలోచనలు జరుపుతున్నారు. 

జగన్ సర్కార్ కి కోర్టులో మరో మొట్టికాయ పడనుందా?.. పాపం సీఎస్!!

జగన్ సర్కార్ కు కోర్టులలో వరుసగా అక్షింతలు పడుతున్నా కానీ ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం తో రాష్ట్ర ఉన్నతాధికారులు కోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమకు నచ్చిన సలహాదారులు, అధికారుల నియామకం విషయంలో చూపించిన వేగం కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేసే విషయంలో చూపడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఎబి వెంకటేశ్వరరావు ను జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనికి వ్యతిరేకంగా అయన హైకోర్టు ను ఆశ్రయించగా విచారణ జరిపి సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఎబి కి రావాల్సిన శాలరీని చెల్లించాలని, అలాగే ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఐతే ఎప్పటిలోగా పోస్టింగ్ ఇవ్వాలనే విషయం మాత్రం స్పష్టం చేయలేదు. ఐతే కోర్టు తీర్పు వచ్చిన తరువాత తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఎబి హైకోర్టు తీర్పు ను కూడా జత చేస్తూ సీఎస్ కు వినతి పత్రం అందచేశారు.  ఐతే కోర్టు తీర్పు వచ్చి 20 రోజుల పైగా గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. దీంతో ఎబి వెంకటేశ్వరరావు అనేక పర్యాయాలు తన పోస్టింగ్ గురించి గుర్తు చేస్తూ సీఎస్ కు లేఖ రాసినా ఇప్పటివరకు అటు నుండి ఎటువంటి రిప్లై లేదని సమాచారం. దీని పై ఎబి మళ్ళీ కోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే ఇప్పటికే ఒకసారి కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు కు హాజరైన సీఎస్ మరో సారి అదే పని చేయవల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.  ఇప్పటికే హైకోర్టు సుప్రీం కోర్టుల్లో మొట్టికాయలు తిన్న ఎపి సర్కార్ కు మరోసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు. మరో వైపు రాజకీయ నాయకుల తొందరపాటు నిర్ణయాలతో ఉన్నతాధికారులుగా తాము కోర్టు మెట్లెక్కవలసి రావడం తో అధికారులలో కొంత అసంతృప్తి నెలకొంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఎబి విషయం లో నిర్ణయం తీసుకుంటుందా లేక కథ మళ్ళీ మొదటికి వస్తుందా వేచి చూడాలి.

భారత్- చైనా సరిహద్దులో ఘర్షణ.. అమరుడైన తెలుగుబిడ్డ

భారత్, చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన ఓ సైనికాధికారి, ఇద్దరు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికాధికారి కల్నల్ సంతోష్ బాబు తెలుగువాడే. సంతోష్ తెలంగాణలోని సూర్యాపేట వాసి. సంతోష్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  బీహార్ 16వ బెటాలియన్ కు చెందిన సంతోష్.. ఏడాదిగా చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. సంతోష్ కు ఇటీవలే హైదరాబాద్ రెజిమెంట్ కు బదిలీ అయింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చే లోపే ఆయన అమరుడు కావడం విషాదకరం. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఎంపీ రఘురామ కృష్ణమరాజు కి అమిత్ షా అపాయింట్మెంట్.. త్వరలో వైసీపీలో చీలిక?

వైసీపీ రెబల్ ఎంపీగా మారిన ఎంపీ రఘురామ కృష్ణమరాజు అటు మాటలతోనూ, ఇటు చేతలతోనూ వైసీపీని తెగ ఇబ్బందిపెడుతున్నారు. తాజాగా, ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది అనే అంశం వైసీపీ నేతలను షాక్ కి గురిచేసింది. సీఎం జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడని అమిత్ షా ఒక వైసీపీ ఎంపీకి అవకాశం ఇవ్వడం ఆ పార్టీ నాయకులకు మింగుడుపడటం లేదు. మొదటి నుంచి బీజేపీ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణమరాజు మరో సారి తన సత్తా ఏంటో వైసీపీ కి తెలియజేయాలి అనుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా జగన్ ఏడాది పాలనలో స్యాండ్, ల్యాండ్, వైన్ మాఫియా తో సహా కుల రాజకీయాలను ఎండగట్టిన ఆయన ఈ సారి పార్టీకి భారీ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనికి ప్రధాన కారణం సొంత కులానికి చెందిన నేతతో వైసీపీ పొమ్మన లేక పొగబెడుతుంది అనే ఆలోచనకు రఘురామ కృష్ణమరాజు వచ్చారని ఆయన సన్నిహితులు అంటున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయానికి ధీటైన జవాబు ఇవ్వాలని రఘురామ కృష్ణమరాజు భావిస్తున్నారట.  రఘురామ కృష్ణమరాజు దెబ్బకి త్వరలో ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరగబోతున్నాయని, ఆయన వైసీపీకి గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. వైసీపీ పేరుకుపోయిన ఒకే సామాజిక వర్గ కోటరీ దెబ్బకి పదుల సంఖ్యలో నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి రఘురామ కృష్ణమరాజు తిరుగుబాటు చేస్తారని, అందుకు ఆయన కార్యాచరణ కూడా మొదలుపెట్టారని అంటున్నారు. సౌత్ ఇండియా లో అందులోనూ ముఖ్యంగా ఏపీలో బలపడాలనేది బీజేపీ ఆశ. అందుకే, ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకొని, త్వరలోనే ఏపీ లో బీజీపీ జెండా ఎగిరేలా చెయ్యాలనే ఆలోచన తో ఎంపీ రఘురామ కృష్ణమరాజు కి ఆగమేఘాల పై అపాయింట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది.

వూహాన్ వదిలి బీజింగ్ పై పడ్డ కరోనా

కరోనా పుట్టిన చైనాలోని వూహాన్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా చైనా రాజధాని బీజింగ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. నగరంలోని అతిపెద్ద హోల్ సెల్ మార్కెట్ ప్లేస్ ఐన షిన్ పడి కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా మారిందని అధికారులు గుర్తించారు. ప్రతి రోజు వేలాది మంది సందర్శించే ఈ మార్కెట్ నుండి ప్రతి రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో బీజింగ్ నగర అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో సిటీలోని 30 ప్రాంతాలలో లాక్ డౌన్ ప్రకిటించి లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటం తో బీజింగ్ నుండి ఇతర నగరాలకు రాకపోకలను నిషేధించారు.

భారత్ చైనా సరిహద్దులో ఘర్షణ.. ముగ్గురు భారత్ జవాన్ల మృతి

కొంత కాలంగా చైనా భారత భూభగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతూన్న విషయం తెలిసిందే. తాజాగా సరిహద్దులోని గాల్వాన్ లోయ ప్రాంతం లో సోమవారం రాత్రి చైనా సైనికుల దాడిలో ఒక కల్నల్ తో పాటు ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. ఒక పక్క రెండు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతుండగా ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య తోపులాట జరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ గత 45 ఏళ్ల లో హింస జరగడం మాత్రం ఇదే మొదటి సారి. గల్వాన్ లోయలో ఒక ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు చైనా సైనికులు నిరాకరించడం తో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో 16 బీహార్ రెజిమెంట్ కు చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 1962 లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గుల్వాన్ లోయ కూడా ఉంది. ఐతే ఇక్కడ తాజాగా భారత్ రోడ్ నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం మన బలగాలు గాల్వన్ లోయకు చేరాలంటే 8 గంటలకు పైగా సమయం పడుతుంది ఐతే ఈ రోడ్ పూర్తయితే మన బలగాలు బోర్డర్ కు కేవలం అర గంటలోనే చేరుకుంటాయి. దీంతో ఈ రోడ్ నిర్మాణాన్నీ చైనా సైన్యం ఇండైరెక్ట్ గా అడ్డుకుంటోంది.

గోకుల్ చాట్ యజమానికి కరోనా.. క‌స్ట‌మ‌ర్ల‌లో ఆందోళన

హైదరాబాద్‌లోని కోఠిలో కరోనా కలకలం రేగింది. గోకుల్ చాట్ యజమానికి కరోనా సోకింది. ఈ వయస్సు 70 సంవత్సరాలు. ఇటీవల ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గోకుల్ చాట్ దుకాణాన్ని మూసివేశారు. అంతేకాదు, యజమాని కుటుంబ సభ్యులతో పాటు 20 మంది గోకుల్ చాట్ సిబ్బందిని క్వారంటైన్ చేశారు. గత రెండు మూడు రోజులుగా షాప్‌కు ఎవరెవరు వచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు.  కాగా, హైదరాబాద్‌లో గోకుల్ చాలా ఫేమస్. నిత్యం క‌స్ట‌మ‌ర్ల‌తో కిట‌కిట‌లాడుతుంటుంది. ఇక, సాయంత్రమైతే రద్దీ మామూలుగా ఉండదు. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్‌లో హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడంతో గోకుల్ చాట్ కూడా ఓపెన్ చేశారు. అయితే, గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో క‌స్ట‌మ‌ర్ల‌లో ఆందోళన మొదలైంది.

అచ్చెన్న గాయం తిరగబెట్టింది.. ఇప్పుడు ఏం చేయబోతున్నారో..?

ఇఎస్ఐ స్కామ్ లో ఎసిబి అరెస్టైన టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రస్తుతం జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అరెస్ట్ కు ఒక రోజు ముందు ఆయనకు పైల్స్ ఆపరేషన్ జరిగి ఉండటం తో పాటు ఎసిబి అరెస్ట్ తరువాత సుదీర్ఘ ప్రయాణం చేయడం తరువాత విచారణ పేరుతొ మరి కొన్ని గంటలు కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఆపరేషన్ గాయం తిరగ పెట్టినట్లు గా తెలుస్తోంది. ఇన్ఫెక్షన్ కూడా కావడం తో రక్తస్రావం ఆగడం లేదని తెలుస్తోంది. ఆయనకు బీపీ, షుగర్‌ ఉండటంతో గాయం మానడానికి పదిహేను రోజుల సమయం పట్టవచ్చని సమాచారం అందుతోంది. అచ్చెన్న జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో అయన ఆరోగ్యం పై జీజీహెచ్ డాక్టర్లు అధికారికంగా ఎటువంటి ప్రకటనలు చేయడం లేదు. ఐతే అయన ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియ చేస్తున్నట్లుగా సమాచారం. ఇది ఇలా ఉండగా అచ్చెన్న తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందువల్ల విడుదల చేయాలని లాయర్లు ఎసిబి కోర్టులో నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. కొద్ది రోజుల్లో ఈ పిటిషన్ సీబీఐ కోర్టులో విచారణకు రావచ్చని తెలుస్తోంది.

ఏపీ బడ్జెట్‌ ముఖ్యాంశాలు

ఏపీ అసెంబ్లీలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి ఆయన అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా మంత్రి తెలియజేశారు. పేదల కష్టాలను తీర్చేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా సంక్షేమంపై వెనకడుగు వేయలేదని మంత్రి అన్నారు.     బడ్జెట్‌లో ముఖ్యాంశాలు: వ్యవసాయ రంగానికి రూ.11,891 కోట్లు వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు విద్యశాఖకు రూ.22,604 కోట్లు వైద్య రంగానికి రూ.11,419 కోట్లు ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ.3వేల కోట్లు పీఎం ఆవాజ్‌ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు పీఎం ఆవాజ్‌ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు రేషన్‌ బియ్యానికి రూ.3వేల కోట్లు వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.16వేల కోట్లు వైఎస్‌ఆర్‌ ఆసరాకు రూ.6,300 కోట్లు అమ్మ ఒడికి రూ.6 వేల కోట్లు జగనన్న విద్యాదీవెనకు రూ.3,009 కోట్లు వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు జగనన్న వసతి దీవెనకు రూ.2 వేల కోట్లు వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి రూ.350 కోట్లు వైఎస్‌ఆర్‌ వాహన మిత్రకు రూ.275 కోట్లు జగనన్న చేదోడుకు రూ.247 కోట్లు నేతన్న నేస్తం రూ.200 కోట్లు మత్స్యకార భరోసాకు రూ.109 కోట్లు హోం శాఖకు రూ. 5,988.72 కోట్లు ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు కార్మిక సంక్షేమ రంగానికి రూ. 601.37 కోట్లు

కరోనా పై అమెరికా ఎఫ్ డీఏ అలా.. హెల్త్ సెక్రటరీ ఇలా...

కరోనా తాకిడికి ప్రపంచం మొత్తం విలవిలాడుతోంది. ఈ సమయం లో అమెరికా భారత్ నుండి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను పెద్ద మొత్తం లో ఇంపోర్ట్ చేసుకుంది. ఐతే ఈ మందుల వాడకం పై అమెరికా లోనే భిన్న వాదనలు ఉన్నాయి. తాజాగా అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్ డి ఏ) ఈ మందులను ప్రిస్క్రైబ్ చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. ఐతే ట్విస్ట్ ఏంటంటే మలేరియా మందులు కరోనా ట్రీట్ మెంట్ లో ఉపయోగించ వద్దని ఎఫ్ డి ఏ ఆదేశాలు ఇచ్చిన కొద్ది గంటల్లోనే అమెరికా హెల్త్ సెక్రెటరీ అలెక్స్ అజర్ ఆ మందులను డాక్టర్లు భేషుగ్గా కరోనా బాధితులకు సూచించవచ్చని తేల్చి చెప్పారు. ఐతే తాజా ఎఫ్ డి ఏ నిర్ణయం తో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను రోగులు వైద్యుల పర్యవేక్షణ లోనే వాడాలని భావించే అవకాశం ఉన్నందున తాను క్లారిటీ ఇస్తున్నట్లు అయన తెలిపారు. ఎఫ్ డి ఏ తాజా నిర్ణయం పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన అసంతృప్తి వ్యక్తం చేసారు. కరోనా పై పోరాటంలో హెచ్ సి క్యూ సమర్ధంగా పని చేస్తోందని ఇతర దేశాలు నివేదికలు ఇస్తుంటే ఒక్క అమెరికా ఏజన్సీలు మాత్రమే దానిని గుర్తించలేక పోతున్నాయని ఆయన అన్నారు.