ఆ భయంతోనే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారా?
posted on Jun 12, 2020 @ 12:05PM
ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, కనీసం నోటీసులు ఇవ్వకుండా, అర్థరాత్రి సమయంలో వంద మంది పోలీసులతో ఇంటికెళ్లి అలా అరెస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు నోటీసులు ఇచ్చి, ఆయన విచారణకు సహకరించనంటే.. అప్పుడిలా భారీగా పోలీసులను మోహరించి ఆయనను అదుపులోకి తీసుకోవచ్చు. నోటీసు లేదు, సమాచారం లేదు.. ఏదో కిడ్నాప్ చేసినట్టుగా అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
కాగా, అచ్చెన్నాయుడిని ఉన్నపళంగా అరెస్ట్ చేయడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఈ నెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జగన్ సర్కార్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది. అందుకే బలమైన గొంతుకులను అసెంబ్లీలో వినిపించకుండా చేయాలన్న ఉద్దేశంతోనే.. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు మరియు మరికొంత మంది ఎమ్మెల్యేల మద్దతున్నా కూడా.. అచ్చెన్నాయుడు ఏ మాత్రం బెరుకు లేకుండా ప్రభుత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తుంటారు. అచ్చెన్నాయుడుని అసెంబ్లీలో ఎదుర్కోలేక సీఎం నుండి పలువురు సీనియర్ నేతలవరకు.. ఆయనపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా, అచ్చెన్నాయుడు ఏ మాత్రం సహనం కోల్పోకుండా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజాగళాన్ని బలంగా వినిపించారు. అచ్చెన్నాయుడు ఒక్కరే ఎందరికో సమాధానం చెప్పేవారు. అందుకే ఇప్పుడు ఆయనను అసెంబ్లీ సమావేశాలకు రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అధికార పార్టీకి ఈ సమావేశాలు చాలా కీలకం, అచ్చెన్నాయుడు వంటి వారు అసెంబ్లీలో ఉంటే.. తమ గళంలో ప్రభుత్వానికి నీళ్లు తాగిస్తున్నారు. అందుకే, అరెస్ట్ లు విచారణ అంటూ ఆయనను అసెంబ్లీ సమావేశాలకు దూరం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.