ఒక పక్క జూడాల నిరసన.. మరో పక్క చలో గాంధీ హాస్పిటల్ ఆందోళన.. అసలేం జరుగుతోంది
posted on Jun 11, 2020 @ 2:48PM
తెలంగాణాలోని కరోనా పాజిటివ్ పేషంట్లకు ప్రభుత్వపరంగా ట్రీట్మెంట్ ఇస్తున్న ఒకే ఒక్క కోవిడ్ హాస్పిటల్ గాంధీ ఆసుపత్రి. రాష్ట్రం మొత్తం లో ఎక్కడ కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా వారిని గాంధీ ఆసుపత్రి కి తరలించి వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇంత ముఖ్యమైన గాంధీ ఆసుపత్రి లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లు నిన్నటి నుండి ఆందోళన చేస్తున్నారు. మొన్న రాత్రి ట్రీట్మెంట్ పొందుతున్న ఒక కరోనా పేషంట్ మృతి చెందడం తో అతని బంధువులు అక్కడే ఉన్న జూనియర్ డాక్టర్ల పై దాడి చేయడంతో జూడాలు నిరసన తెలుపుతున్నారు. దాడుల నుండి తమకు రక్షణ కావాలని, తమకు రక్షణ పరికరాలు అందచేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. దీని పై ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేంద్ర జుడాలతో చర్చలు జరిపినా సమస్య ఒక కొలిక్కి రాలేదు. దీంతో జూడాల ఆందోళన రెండో రోజుకు చేరింది. ముఖ్యమంత్రి కానీ ఆరోగ్యశాఖా మంత్రి అని తమ డిమాండ్లను పరిష్కరించేవరకు విధులకు హాజరు అయ్యేది లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు.
మరో పక్క కరోనా తో పోరాడుతున్న గాంధీ వైద్య సిబ్బందికి ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని పేర్కొంటూ టిజెఎస్, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు చలో గాంధీ హాస్పిటల్ కు పిలుపు ఇచ్చారు. ఈ ఆందోళనల నేపధ్యం లో గాంధీ హాస్పిటల్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.