ఏపీ సచివాలయంలో పది కరోనా కేసులు!!

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేపింది. తాజాగా సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సచివాలయంలో కరోనా బారిన పడ్డ ఉద్యోగుల సంఖ్య పదికి చేరింది. కరోనా కలకలంతో, అప్రమత్తమైన అధికారులు ఉద్యోగులతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు.  ఇటీవల హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌రావడంతో.. సచివాలయంలో పని చేస్తున్న వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉద్యోగితో సన్నిహితంగా ఉన్నవారంతా, బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. అయినప్పటికీ ఇప్పటివరకు పది కేసులు నమోదయ్యాయి. మరోవైపు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‌సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను ఆరోగ్యసేతు యాప్‌ ఉంటేనే ఇకపై కార్యాలయంలోకి అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. కరోనా ‌విజృంభిస్తున్న కారణంగా ఉద్యోగులు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ ‌చేసుకోవాలని, యాప్‌ ఉన్న ఉద్యోగులకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే, థర్మల్‌ స్క్రీనింగ్‌, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని ఆదేశాలు జారీ చేశారు.

జూలై 21 నుంచి అమర్‌నాథ్ యాత్ర

అమర్‌నాథ్ యాత్ర జూలై 21 నుంచి ప్రారంభం కానుందని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, 45 రోజుల యాత్రను 15 రోజులకు కుదించింది. జూన్ 21 నుంచి ఆగస్టు 3 వరకు కేవలం 15 రోజులు మాత్రమే యాత్ర కొనసాగనుంది. వాస్తవానికి ఈ యాత్ర షెడ్యూల్‌ను జూన్ 23 నుంచి ఆగస్టు 3 వరకూ కొనసాగించాలని తొలుత నిర్ణయించారు. అయితే, కరోనా వైరస్ కారణంగా తేదీలను మార్చి.. జులై 21కు వాయిదా వేశారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్ నాథ్ జీ పుణ్య క్షేత్రం బోర్డు సమావేశంలో ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించనున్నారు. భక్తులు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, సాధు సంతువులకు మాత్రం ఈ నిబంధన వర్తించదని అధికారులు తెలిపారు. తాజా మార్గదర్శకాల ప్రకారం 55 ఏళ్లు దాటినవారికి యాత్రకు అనుమతి లేదు. యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కోవిడ్ సోకలేదని, కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లను.. యాత్రకు వెళ్లడానికి ముందే అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ కి.. క్షవరం అయితే కానీ వివరం రాలేదు!!

క్షవరం అయితే కానీ వివరం రాదు.. ఈ సామెత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ గా సరిపోతుంది. అసలే కేంద్రంలో అధికారంలో లేదు. సర్లే, ఒకటి అరా రాష్ట్రాలలో అధికారంలో ఉందని అధిష్టానం సంతోషించే లోపే.. పలువురు నేతలు కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి.. ఉన్న ఆ కొన్ని రాష్ట్రాలలో కూడా అధికారం దూరం చేస్తున్నారు. ఇక, తాజాగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. పార్టీ రాష్ట్ర నాయకత్వాలు ప్రతి నాయకుడి మీద కన్నేసి ఉంచాలి. కానీ, గుజరాత్ కాంగ్రెస్ కి ఆ ఆలోచనే లేనట్టుంది. ఆదమరిచి ఉన్న సమయంలో గట్టి దెబ్బ తగిలింది. రెండు రోజుల వ్యవధిలో కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. రిసార్టు రాజకీయాలకు తెరలేపింది. 65 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌లోని రిసార్టులకు తరలించేసి.. ఎవరూ జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. రాజ్యసభ ఎన్నికల వేళ.. ఆదమరిస్తే రాజ్యసభలో సీటు మిస్సవుతుంది. దీంతో ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించేసి.. ఎవరూ హ్యాండ్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్. ముగ్గురు ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇస్తేనే కానీ, కాంగ్రెస్ కి జ్ఞానోదయం కాలేదన్నమాట.

కరోనా కేసుల విషయం లో ఇటలీని దాటి ఆరో స్థానం లోకి భారత్

భారత దేశం లో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క లాక్ డౌన్ సడలించడం తో పాటు ప్రజల రాకపోకలు పెరుగుతుండటం తో వైరస్ పల్లెలకు కూడా వ్యాప్తి చెందుతోంది. శుక్రవారం నాటికీ భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2,35,000 గా నమోదయింది. దీంతో భారత్ ఇటలీ ని దాటి ఆరో స్థానం లోకి చేరింది. మొదటి స్థానం లో అమెరికా ఉండగా తరువాతి స్థానాల్లో బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్ నిలిచాయి. ఇక భారత దేశం లో గత 24 గంటల్లో 9.851 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి ఇప్పటివరకు 6,348 మంది మరణించారు. తాజాగా ఏపీ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,250 కి చేరింది. ఇటు తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య 3,290 కి చేరింది.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!

కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్ళు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 9వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మొత్తం 60వేల మంది ఉండగా, వారిలో 30 నుండి 40శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే మిగతా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా విద్యార్థులకు 5వేల నుండి 6వేల రూపాయల విలువ గల స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించినట్టు సమాచారం.

గోదావరిపై ప్రాజెక్టులను తక్షణమే ఆపేయండి!!

గోదావరి నదిపై కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు తెలుగు రాష్ట్రాలను గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) ఆదేశించింది. అన్ని ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని స్పష్టం చేసింది.  శుక్రవారం హైదరాబాద్‌లోని జీఆర్‌ఎంబీ కార్యాలయంలో చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులు నిర్మిస్తోందని గతనెల 19న ఏపీ‌ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చ జరిగింది.   గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం డీపీఆర్‌లను పరిశీలించి సాంకేతికంగా సిఫార్సు చేయాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను రెండు రాష్ట్రాలూ తక్షణమే నిలుపుదల చేయాలని.. వాటి డీపీఆర్‌లను సమర్పించాలని జీఆర్‌ఎంబీ ఆదేశించింది. ఈ నెల పదో తేదీలోపు డీపీఆర్‌లను సమర్పించేందుకు రెండు రాష్ట్రాలూ సమ్మతించాయి. అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం చర్చించాల్సిన ఎజెండాను కూడా అదే తేదీలోగా ఇచ్చేందుకు అంగీకరించాయి.

హైదరాబాద్ ను కలవరపెడుతున్న కరోనా

లాక్ డౌన్ సడలించడంతో తెలంగాణాలో కరోనా కేసుల పెరుగుతున్నాయి. తెలంగాణ లో నమోదయ్యే కేసులలో దాదాపుగా 80 శాతం ఒక్క హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా వరుస గా వందకు పైగా కేసుల నమోదవుతున్నాయి. జూన్ నెల మొదటి ఐదు రోజుల్లో హైదరాబాద్ లో 483 పాజిటివ్ కేసుల నిర్ధారణ జరిగింది. తాజాగా లాక్ డౌన్ సడలింపుకు ముందు వ్యాపించిన ప్రాంతాలలోనే కాకుండా కొత్త ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లుగా తెలుస్తోంది. నిబంధనలు సడలింపు తర్వాత ప్రజలు తమ అవసరాలకు బయటకు వస్తున్నారు. అలా బయటకు వచ్చిన వారు రద్దీ అధికంగా ఉండే సూపర్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు, లోకల్ క్లినిక్కులలో మాస్క్ లు లేకుండా తిరగడం తో పాటు సామాజిక దూరం పాటించకపోవడం తో వైరస్ అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోందని అధికారులు తెలుపుతున్నారు.

భారత్ లో కరోనా కేసులు.. ప్రతిరోజూ రికార్డే!!

భారత్ లో రోజుకి పదివేల కరోనా కేసులు నమోదవ్వడం కామన్ అయిపోయే రోజులు వస్తున్నాయి. రెండు రోజులుగా పదివేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 9,887 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 294 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,36,657కి చేరగా, మృతుల సంఖ్య 6,642 కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,073 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,15,942 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఒక్క టీచర్.. 25 స్కూళ్ళు.. 25 జీతాలు

ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు ఓ వైపు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడుతుంటే.. మరోవైపు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా 25 జీతాలు తీసుకుంటుందన్న విషయం వెలుగులోకి రావడం సంచలనమైంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు 25 పాఠశాలల్లో పనిచేస్తున్నట్టుగా జీతాలు తీసుకుంటూ ఒక్క ఏడాదిలోనే కోటి రూపాయలకు పైగా సంపాదించింది. ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  ప్రభుత్వం రూపొందించిన ‘టీచర్స్ డిజిటల్ డేటా బేస్‌’లో ఒకే పేరు, అడ్రెస్ గల ఓ ఉపాధ్యాయురాలు ఒకటి కంటే ఎక్కువ పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కూపీ లాగితే, ఆమె 25  పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు తెలిసి షాక్ అయ్యారు. ఆ టీచర్ పేరు అనామికా శుక్లా. ఆమె పనిచేస్తున్న స్కూళ్లన్నీ ప్రభుత్వ పాఠశాలలే. అన్నీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ రెసిడెన్షియల్ స్కూళ్లే కావడం గమనార్హం. ఒకే వ్యక్తి ఏకకాలంలో ఇన్ని పాఠశాలల్లో అటెండెన్స్ ఎలా మెయింటేన్ చేయగలిగారు? అన్నది ఇప్పుడు అధికారుల ముందున్న చిక్కు ప్రశ్న. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అసలు ఆమె ఒరిజినల్ పోస్టింగ్ ఏ స్కూల్లో ఉందో కూడా తెలియని పరిస్థితి. దీనిపై అనామికను ప్రశ్నించడానికి ప్రయత్నించగా.. ఆమె తాను ఉంటున్న చిరునామా నుంచి పరారైంది. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యూపీలో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. ఒకట్రెండు స్కూళ్లలో బయోమెట్రిక్ హాజరు మేనేజ్ చేయొచ్చని, ఇన్ని స్కూళ్లలో వేలిముద్రల విషయంలో ఎవరికీ అనుమానం రాలేదంటే, దీని వెనుక అధికారుల హస్తం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై హత్యాయత్నం ఆరోపణలు!!

టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. భర్త భార్గవ రాముడితో కలిసి తనను చంపేందుకు అఖిలప్రియ కుట్ర పన్నారని, మహిళ ముసుగులో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు 50లక్షల సుఫారీ కుదుర్చుకున్నారన్నారు. కుట్రను భగ్నం చేసి తనను కాపాడిన కడప పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. భూమా అఖిలప్రియ అనుచరుడు మాదా శ్రీను డబ్బులు ఇచ్చాడని నిందితులు చెప్పారని, రాజకీయ కుట్రతోనే అఖిలప్రియ నా హత్యకు ప్రణాళిక రచించారు అంటూ ఆరోపణలు చేశారు. తక్షణమే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడిని అరెస్ట్ చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై తాజాగా అఖిల ప్రియ స్పందించారు. తనను అరెస్ట్ చేయాలని సుబ్బారెడ్డి చేసిన డిమాండ్ వెనకున్న ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వెనక ఆళ్లగడ్డ అధికార పార్టీ వైసీపీ నాయకుల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, అధిష్ఠానం ప్రమేయం ఉండకపోవచ్చని చెప్పారు. తన భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని గత అక్టోబర్ లో ఓ క్రషర్ ఇండస్ట్రీ యజమాని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారని అఖిలప్రియ గుర్తుచేశారు. దీనికి సంబంధించి బెయిల్  కోసం తాము దరఖాస్తు చేశామని, ఈ సమయంలో సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తుండటం గమనించాల్సిన విషయమని అన్నారు. పక్కదారి పట్టించేందుకు ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో తన హస్తం ఉన్నట్టు బయటకు రాలేదని, ఏ4 ముద్దాయిగా తనకు నోటీసులు కూడా అందలేదని తెలిపారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని, విచారణ కొనసాగుతున్న తరుణంలో అఖిల ప్రియను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం సుబ్బారెడ్డికి తగదని చెప్పారు. ఒకవేళ తన తండ్రి భూమా నాగిరెడ్డి బినామీ ఆస్తులు సుబ్బారెడ్డి పేరు మీద ఉంటే కనుక, అవి ఆయనకే చెందుతాయని అఖిలప్రియ అన్నారు. అసలు తమ మధ్య ఆస్తి తగాదాలు లేవని సుబ్బారెడ్డి బహిరంగంగానే చెప్పారని గుర్తుచేశారు. సుబ్బారెడ్డికి పదవులు ఇచ్చినా తాను అడ్డు చెప్పలేదని, ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డి రాజకీయాలు చేస్తానంటే స్వాగతిస్తానని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో గంగుల కుటుంబంతో కొట్లాడి కార్యకర్తలకు ఎలా పనులు చేయిస్తారో చూడాలని ఉందని అఖిలప్రియ చెప్పుకొచ్చారు.

బాబు 5 వేలకే ఇస్తే జగన్ 20 వేలు గుంజుతున్నారు

చంద్రబాబు అంటే చాలు ఇంతెత్తున లేచే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నోటి వెంట బాబు పాలనే బెటర్ అనే మాట విపిస్తోంది. చంద్రబాబు పాలన తో పోలిస్తే సీఎం జగన్ పాలన బావుందని ఆ మధ్య ప్రకటించిన ఎమ్మెల్సీ వీర్రాజు గారు తాజాగా స్పందిస్తూ ఏపీలో ఇసుక సరఫరా మొత్తం అవినీతిమయం అయిపోయిందని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ హయం లో ఆ పార్టీ నేతలు ఎంత తిన్నా కూడా బాబు ఇసుకను 5 వేలకే లారీ ఇసుక ఇచ్చారని తెలిపారు. కానీ అదే లారీ ఇసుకకు జగన్ ప్రభుత్వం 20 వేలు వసూలు చేస్తోందని అయన విమర్శించారు. ఇసుక కోసం స్టార్ట్ చేసిన ఆన్ లైన్ విధానం అస్తవ్యస్తంగా తయారైందని.. ఇసుక యాప్ అర గంటలోనే క్లోజ్ అవుతుందని అయన అన్నారు. ఐతే బ్లాక్ లో ఇసుక పై కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందని విమర్శించారు. సీఎం జగన్ ఏడాది పాలన పై స్పందిస్తూ ప్రజలు వైసిపి రంగులు చూసి 151 సీట్లు ఇవ్వలేదన్నారు. వార్డు గ్రామా సచివాలయాలకు రంగులు వేసే జీవో వచ్చినపుడే ఇది పద్దతి కాదని తాను పంచాయతిరాజ్ మంత్రికి ఫోన్ చేసి చెప్ప్పానని ఈ సందర్బంగా అయన తెలిపారు. ఇపుడు ఇదే విషయంలో సుప్రీం కోర్ట్ మొట్టికాయలు తినే వరకు పరిస్థితి వచ్చిందని ఇది రాష్ట్ర ప్రతిష్ట కు దెబ్బని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల కోసం సేకరించే భూములలో కూడా అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. ఎకరం 10 లక్షలు చేసే రాజమండ్రి ఆవ భూమిని 45 లక్షలకు కొన్నారని.. ఐతే ఇదే భూమిని సాగునీటి శాఖ అధికారులు ముంపు ప్రాంతం గా గుర్తించారని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం లో 150 కోట్ల అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు హయం లో రాత్రి పన్నెండు గంటల వరకు మద్యం అమ్మించడం ద్వారా వచ్చిన పన్ను తో పాటు తాగి బయటకు వచ్చిన వారి వద్ద నుండి మళ్ళీ ఫైన్ వసూలు చేసావారని తెలిపారు. ప్రస్తుతం పేదలకు మద్యం అందుబాటులో ఉండకూడదని కొత్త బ్రాండ్లు తెచ్చి రేట్లు పెంచినా తాగేదంతా పేదలేనని ఆయన అన్నారు. ఈ కొత్త బ్రాండ్లు కూడా వైసిపి నాయకులకు సంబంధించినవేనని అన్నారు. టీడీపీ జన్మభూమి కమిటీలు తెస్తే ఇపుడు జగన్ ప్రభుత్వం 300 కోట్ల ఖర్చుతో వాలంటీర్ల వ్యవస్థ తెచ్చిందని ఐతే ప్రతి గ్రామంలో నాటు సారా ప్రవాహం నడుస్తున్నా.. వాలంటీర్లు ఫిర్యాదు చేయడం లేదని అయన విమర్శించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన!

ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలను ప్రారంభించబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇతర పథకాలపై ఖర్చులు తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నూతన పథకాల కోసం ఎలాంటి ప్రతిపాదనలూ పంపవద్దని అన్ని మంత్రిత్వ శాఖలకూ తెలియజేశామని వెల్లడించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీల ద్వారా మాత్రమే నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ రెండు పథకాలపైనే డబ్బులు వెచ్చించడానికి తాము అనుమతినిస్తున్నామని, ఇతర పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమతించమని ఆర్థిక శాఖ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని, అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మల తెలిపారు. ఒకవేళ నిబంధలనకు విరుద్ధంగా నిధులను కేటాయించాల్సి వస్తే, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. 

ఏనుగు పోస్ట్‌మార్టం రిపోర్ట్.. కన్నీళ్లు ఆగవు

ఆకతాయిల మూర్ఖపు చర్యకు కేరళలో ఓ గర్భిణి ఏనుగు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఆ ఏనుగు పోస్టుమార్టం నివేదిక తాజాగా వెల్లడైంది. ఆ ఏనుగు పేలుడు పదార్థాలున్న పైనాపిల్‌ తిన్న 14 రోజుల తర్వాత చనిపోయిందని తేలింది. పేలుడు పదార్థాల వల్ల ఏనుగు నోటి భాగం తీవ్రంగా గాయపడిందని, తీవ్ర నొప్పిని భరిస్తూ 14 రోజుల పాటు ఏమీ తినలేదని, తాగలేదని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఓ వైపు నొప్పి, మరోవైపు ఆకలి భరించలేక, నదిలో ఉండిపోయిందని.. చివరకు ఆ ఏనుగు నీరసించిపోయి నీటిలో పడిపోయిందని వివరించారు. నీళ్లలో మునగడం వల్ల, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది.  కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేరళ ప్రభుత్వం నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే, ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. 

కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఎన్జీటీ కీలక ఆదేశాలు

గ్రేటరు హైదరాబాద్ శివారులో 111 జీవోకు వ్యతిరేకంగా కేటీఆర్ ఫామ్ హౌస్ కడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జిటి) లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీని పై విచారణ జరిపిన ట్రిబ్యునల్ కేటీఆర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి, హెచ్ఎండీఏకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు నోటీసులు జారీ చేసింది.  కొన్ని నెలల క్రితం కేటీఆర్ త‌న ప‌ద‌విని అడ్డం పెట్టుకొని అక్ర‌మంగా ఫాంహౌజ్ నిర్మాణం చేస్తున్నారంటూ… డ్రోన్ విజువ‌ల్స్ తో స‌హా రేవంత్ రెడ్డి మీడియాకు స‌మాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయం పై అప్పట్లో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు వాడిన కేసులో రేవంత్ జైలులో ఉండి తరువాత బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్జీటీ తన ఆదేశాలలో కేటీఆర్ తన ఫామ్ హౌస్ ను అక్ర‌మంగా నిర్మించుకుంటున్నారా.. అసలు 2018లో 111జీవో పై ఎన్జీటీ ఇచ్చిన తీర్పు స‌రిగా అమ‌ల‌వుతుందో లేదో చూడటానికి ఒక నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీలో సభ్యులుగా జాతీయ ప‌ర్యావ‌ర‌ణ రిజిస్ట్రీ రిజ‌న‌ల్ ఆఫీసు నుండి ఒక‌రు, తెలంగాణ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు, హైదరాబాద్ వాట‌ర్ వ‌ర్క్స్, హెచ్ఎండీఏ నుండి ఒక్కొక్కరు తో పాటు రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ను క‌మిటీలో నియ‌మించింది. రెండు నెల‌ల్లోగా ఈ క‌మిటీ ఈ విషయం పై రిపోర్టు ఇవ్వాల‌ని ఆదేశించింది.

డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఏపీ హైకోర్టులో డాక్టర్ సుధాకర్ తల్లి కావేరి బాయి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఈ రోజు విచారం జరిగింది. అటు సిబిఐ కానీ ఇటు పోలీసులు కానీ డాక్టర్ ను అరెస్ట్ చేయలేదని అటువంటి పరిస్థితులలో ఆయనను హాస్పిటల్ లో ఎలా బంధిస్తారని ఆమె ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీని పై రెండు పక్షాల వాదనలు విన్న తరువాత న్యాయస్థానం హాస్పిటల్ నుండి సుధాకర్ డిశ్చార్జ్ కు అనుమతిచ్చింది. మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ అనుమతి తో ఆయన డిశ్చార్జ్ అవ్వచ్చని కోర్టు తెలిపింది. ఇదే హాస్పిటల్ లో గత నెల 16 నుండి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఐతే అయన సిబిఐ విచారణ కు మాత్రం సహకరించాలని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే ఈ కేసు విషయం లో సిబిఐ తన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది. డాక్టర్ సుధాకర్ పని చేస్తున్న నర్సీపట్నం హాస్పిటల్ లో విచారించిన అధికారులు తరువాత నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ ను అడిగి మరిన్ని వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది.

టీడీపీకి కీలక నేత రాజీనామా.. కారణం అదేనా?

చిత్తూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ పార్టీ సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన నియోజకవర్గంలో పార్టీకి, కార్యకర్తలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత కాలం నన్ను ఆదరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్‌, జిల్లా నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తన రాజీనామా వెనుక ఎవరి ప్రమేయం లేదని, భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతాననేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఇప్పట్లో ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు. నా అనుచరులు, మద్దతుదారులెవ్వర్నీ టీడీపీ నుంచి దూరం చేసే ఆలోచన లేదు. టీడీపీ మీద నాకు ఎలాంటి అసంతృప్తి లేదు అని మనోహర్ తెలిపారు. కాగా, ఆర్థికమూలాలను దెబ్బతీసేలా అధికార పార్టీ ఎత్తుగడలు వేయడంతోనే.. తప్పని పరిస్థితుల్లో మనోహర్ టీడీపీకి రాజీనామా చేసారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు చెందిన క్వారీకి రూ.కోట్లలో జరిమానా విధించేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం అందటంతో.. ఈ పరిస్థితుల్లో టీడీపీకి దూరంగా ఉండటమే మేలని భావించిన ఆయన పార్టీకి రాజీనామా చేశారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే

లక్ష కోట్లకు పైగా విలువజేసే మాన్సాస్ ట్రస్ట్ భూములు కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించగా.. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత ఆయనపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆనంద గజపతిరాజు గారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్‌ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. మన్సాన్ ట్రస్టు చైర్మన్ గా అశోక్‌ గజపతిరాజు పదవీకాలంలో అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుని, ట్రస్టును ఆర్థికంగా నష్టపోయేలా చేశారని ఆరోపించారు. ట్రస్టు భూములు కబ్జాలకు గురవుతుంటే ఆ కేసులను వాదించడానికి కనీసం లాయర్‌ని కూడా నియమించలేదని మండిపడ్డారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి అశోక్ గజపతిరాజు చర్యలే కారణమని సంచయిత విమర్శించారు.  తాజాగా ఈ వ్యవహారంపై.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. "కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వ నాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని." అంటూ విజయసాయి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. "పేరుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. పచ్చగా ఏది కనిపించినా నక్కజిత్తులన్నీ ప్రయోగించి దోపిడీకి తెగబడతాడు. మాన్సాస్ ఛైర్ పర్సన్ సంచిత ఆనంద గజపతి లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడు. ట్రస్టును భ్రష్టు పట్టించాడు కాబట్టే సైలెంటై పోయాడు. దర్యాప్తులో తప్పించుకోలేడు." అంటూ విజయసాయి హెచ్చరించారు.

ఒంగోలులో భూ ప్రకంపనలు

దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భూమి కంపించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఒంగోలులో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. గద్దలగుంట, విజయ్‌నగర్‌ కాలనీ, మామిడిపాలెం, దేవుడిచెరువు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో జనం ఆందోళనకు గురయ్యారు.  ఇక, కర్ణాటక రాష్ట్రంలో హంపీ, జార్ఖండ్ రాష్ట్రంలో జంషెడ్‌పూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది. హంపీలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. జంషెడ్ పూర్ లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైంది. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. 

ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణం.. సమాధానం చెప్పండి జగన్ గారు!

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని, చిన్నఉద్యోగాలకు లక్షలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. "50వేలు ఇస్తేనే  పేదవాడికి ఇంటిస్థలమా? భూసేకరణ పేరిట మీవాళ్లు కోట్లరూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారు. అడిగితే బెదిరింపులు..దాడులు. వందలకోట్ల కుంభకోణం.. ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడలేదని ప్రజల తరుపున చంద్రబాబు అడుగుతున్నారు చెప్పండి వైఎస్ జగన్ గారు." అంటూ ఉమా ప్రశ్నించారు. "చిన్నఉద్యోగాలకు లక్షలువసూలు చేస్తున్నారు ఏడాదిపాలనలో అభివృద్ధి ఎక్కడ? కేకులు కట్ చేసుకోవడానికి సంబరాలా? దోసెడు ఇసుక దొరకడంలేదు నీళ్లు అమ్ముకుంటున్నారని మీ ఎంపిలు, శాసనసభ్యులు, మంత్రులు, నాయకులే అడుగుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు." అంటూ ఉమా నిలదీశారు.