జాగ్రత్తలు పాటించే సాక్షాత్తు ఉన్నతాధికారులను చుట్టుముడుతున్న కరోనా
posted on Jun 12, 2020 @ 12:05PM
కరోనా సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా సాక్షాత్తు అధికారులను కూడా వదలడం లేదు ఈ మహమ్మారి. తాజాగా తెలంగాణాలో పలువురు అధికారులు, నాయకులూ ఈ వైరస్ బారిన పడ్డారు. గురువారం యాదాద్రి సిఇవో దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా జ్వరం తో బాధ పడుతున్న సిఇవో లీవ్ పెట్టి హైద్రాబాద్ లోని నివాసం లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐతే అయన భార్యకు కూడా జ్వరం రావడం తో పరీక్షలు జరపగా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో యాదాద్రి జిల్లా కలెక్టర్ కూడా వారం పాటు ఇంటి నుండి పని చేస్తానని తెలిపారు.
ఇక సికిందరాబాద్ లోని రైల్వే డివిజన్ కార్యాలయంలో ఒక సీనియర్ అధికారికి కరోనా సోకింది. దీంతో ఆ భవనంలోని ఉద్యోగులను 11 గంటల కు ఇంటికి పంపించి వేశారు. కొద్దీ రోజుల క్రితం ఒక గూడ్స్ ట్రైన్ గార్డ్ కు కూడా కరోనా సోకింది. కొద్దీ రోజుల క్రితం కొండపోచమ్మ సాగర్ ముంపు ప్రాంత వాసులు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ను కలవడం జరిగింది తాజాగా అలా కలిసిన ఒక వ్యక్తికీ పాజిటివ్ రావడం తో సిద్ధిపేట కలెక్టర్ స్వయంగా గృహ నిర్బంధం లోకి వెళ్లారు.
మరో పక్క హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు పాజిటివ్ తేలడం తో అయన కుటుంబం కూడా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కొద్దీ రోజుల క్రితం ఒక మాజీ శాసనసభ్యుడు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తరువాత కోలుకుని ఇంటికి చేరిన విషయం తెలిసిందే.
అందరికీ జాగ్రత్తలు చెప్పే అధికారులు కూడా కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. కాబట్టి సామాన్యులు మరింత జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళ్ళకూడదు. బంధువుల పెళ్లి అనో, తెలిసిన వాళ్ళ విందు అనో మునుపటిలా జాగ్రత్తలు పాటించకుండా అసలు వెళ్ళకూడదు. ఈ సమయంలో మనం బాగుంటేనే మనవాళ్ళు బాగుంటారన్న విషయం గుర్తుంచుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది.