భారత్ లో కరోనా విజృంభణ.. వుహాన్ ను దాటేసిన ముంబై!
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొద్దిరోజులలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాలలో మూడో స్థానానికి చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో రోజుకి దాదాపు పది వేల కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 9,985 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 279 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,76,583కి చేరగా, మృతుల సంఖ్య 7,745కి చేరుకుంది. ప్రస్తుతం 1,33,632 యాక్టీవ్ కేసులున్నాయి.
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే మొత్తం కేసుల విషయంలో మహారాష్ట్ర, చైనాను అధిగమించగా.. తాజాగా ముంబై నగరం, కేసుల విషయంలో వూహాన్ ను దాటేసింది. కరోనాకి పుట్టినిల్లు చైనాలోని వుహాన్. అలాంటిది మహారాష్ట్ర, చైనాను దాటేస్తే.. మహారాష్ట్రలోని ముంబై నగరం, వూహాన్ ను దాటేసింది. ఇప్పటివరకు ముంబైలో 51,100 పైగా కేసులు నమోదయ్యాయి. ఇక వుహాన్ లో 50,333 కేసులు నమోదు కాగా, 3,869 మంది మరణించారు. ముంబైలో మరణాల సంఖ్య 1,760గా ఉంది. మరణాల విషయంలో మాత్రం వుహాన్ తో పోలిస్తే ముంబైలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.