అచ్చెన్నాయుడి కిడ్నాప్‌కు సీఎం జగన్ కుట్ర!!
posted on Jun 12, 2020 @ 10:19AM
టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఆయనని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అచ్చెన్నాయుడి అరెస్ట్ ని టీడీపీ నేతలు ఖండించారు. జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విరుచుకుపడ్డారు.
అచ్చెన్నాయుడి అరెస్ట్ పై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు 4 రోజుల ముందు అచ్చెన్నాయుడి కిడ్నాప్‌కు సీఎం జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. దీనికి సీఎం బాధ్యత వహించాలని, అలాగే హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బడుగు బహీన వర్గాలకు చేస్తున్న మోసం, అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతూ, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారు. ఇది సహించలేని జగన్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడి, రాత్రి 100 మంది పోలీసులతో ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్ చేశారని మండిపడ్డారు. ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు, ముందస్తు నోటీసు ఇవ్వలేదు.. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అచ్చెన్నాయుడి ఆచూకీని డీజీపీ వెల్లడించాలని చంద్రబాబు కోరారు.
అచ్చెన్నాయుడి ఎదుగుదలను చూసి ఓర్వలేకే సీఎం జగన్ కక్షగట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఏసీబీ పూర్తిగా జగన్ డైరెక్షన్‌లోనే పని చేస్తోందని విమర్శించారు. అచ్చెన్నాయుడి కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, ఆయనై ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు లేవని, ఆయనను అరెస్టు చేసినప్పుడు కనీసం ఆయన కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకపోవడమేంటని యనమల ప్రశ్నించారు.
అచ్చెన్నాయుడి అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. బలమైన నాయకులని ఇబ్బందులు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయాలనే కుట్ర తప్ప ఇందులో మరే ఉద్దేశమూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల ప్రజల్లోంచి వచ్చిన రాజకీయ నాయకుడిని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని నరేంద్ర మండిపడ్డారు.