కుంభమేళాలో కరోనా కల్లోలం.. రంగంలోకి ప్రధాని మోదీ..
posted on Apr 17, 2021 @ 12:06PM
కుంభమేళా కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. ఇప్పటికే వందలాది మంది సాధువులు, వేలాది మంది భక్తులకు కొవిడ్ సోకింది. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో కుంభమేళాను నామమాత్రంగానే జరపాలంటూ సాధువులను కోరారు మోదీ.
జునా అఖాడాహెడ్ స్వామి అవధేశానంద్ గిరితో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సాధువుల ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని.. వారికి ప్రభుత్వం అన్ని విధాలా వైద్యసాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కుంభమేళాను కుదించేలా చూడాలని జునా అఖాడాహెడ్‌ను కోరారు మోదీ.
‘‘రెండు షాహీ స్నాన్ (రాజ స్నానాలు) పూర్తయ్యాయి కనుక ఇప్పుడున్న కరోనా సంకట పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగా(భక్తులెవరూ లేకుండా కేవలం లాంఛనప్రాయంగా కొనసాగించడం) జరపాలని స్వామి అవధేశానంద్ గిరిని ప్రార్థించాను. ఈ నిర్ణయం మహమ్మారిపై పోరాటానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది’’అని మోదీ ట్వీటర్‌లో తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో నిత్యం లక్షల మంది భక్తులు పాల్గొంటున్నారు. ఇటీవల ఏప్రిల్ 12, 14 రోజుల్లో జరిగిన షాహీ స్నాన్‌లలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కుంభమేళాలో పాల్గొన్న అనేక మంది భక్తులు, పలు అఖాడాలకు చెందిన సాధువులు కరోనా బారినపడ్డారు.
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో కుంభమేళాను ముగిస్తున్నట్లు నిరంజని అఖాడా ప్రకటించింది. అయితే దీనిపై మిగతా అఖాడాలకు చెందిన సాధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణంగా మూడు, నాలుగు నెలల పాటు కుంభమేళా జరగాల్సి ఉండగా.. కొవిడ్ కారణంగా ఈ ఏడాది కుదించి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అయినా, కరోనా కమ్మేయడంతో ప్రధాని జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.