అమ్మ కోసం గుండె ఆగింది..
posted on Apr 17, 2021 @ 11:20AM
అమ్మంటే మెరిసే మేఘం. అమ్మంటే కురిసే వాన. అమ్మంటే నూరేళ్ళ ఆశాదీపం. అమ్మ ఆరోప్రాణం. అమ్మ తారాదీపం. అమ్మే ఒక పూజా పుష్పం. అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా... నువ్వే లేక వసివాడనమ్మ పాట వినే ఉంటారు. తన పిల్లల కోసం తల్లీ గుండె ఆగిపోవడం చాలా చూసి ఉన్నాం. కానీ అదే తల్లీ కోసం కొడుకు గుండె ఆగిపోవడం ఎక్కడైనా ఎప్పుడైనా చూసి ఉంటారా.. మథెర్స్ డే రోజు మాత్రం ప్రేమించి.. మిగితా రోజుల్లో అమ్మపై అరవడం కాదు ప్రేమంటే.. అమ్మ కోసం బతకడం నిజమైన ప్రేమంటే అని నిరూపించాడు సత్తిరెడ్డి.
అమ్మంటే ఆ బిడ్డకు ఆకాశమంత ప్రేమ. చిన్నప్పట్నుంచి అల్లారుముద్దుగా పెంచి, పెద్దచేసింది తల్లి. కన్నతల్లి అనారోగ్యం బారినపడటంతో ఆ కొడుకు కుంగిపోయాడు. రెండేళ్లుగా ఆమె సేవలో ఉన్నాడు. ఉన్నట్టుండి తల్లి తనను వదిలి వెళ్లిపోయిందని. తెలుసుకున్న కొడుకు గుండెలవిసేలా ఏడ్చాడు. బహుశా అమ్మ కోసం తాను పెట్టిన కన్నీళ్లతో తన గుండె ఆగిపోయిందో ఏమో! ఆ కొడుకు గుండె ఆగిపోయింది. తల్లితోటే ఆ కొడుకు కట్టె కాలిపోయింది.
నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లికి చెందిన యానాల సత్తిరెడ్డి, సత్యమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలిద్దరూ వివాహాలై అత్తవారింటికి వెళ్లారు. కుమారుడు నాగిరెడ్డి వ్యవసాయ పనులు చూసుకుంటూ కుటుంబానికి అండగా నిలిచాడు. సత్యమ్మ రెండేళ్ల క్రితం కేన్సర్ బారినపడ్డారు. అప్పట్నుంచి కుమారుడు తల్లిని కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ ఆసుపత్రిలో మంచి చికిత్స దొరుకుతుందంటే అక్కడికంతా తీసుకెళ్లేవాడు. ఆమె వైద్యానికి సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీర్ఘకాలంగా వ్యాధితో పోరాడుతున్న ఆమె శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగిరెడ్డి పొలం నుంచి ఇంటికొచ్చాడు. తల్లి మృతదేహం వద్ద గుండెలవిసేలా ఏడుస్తూ కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తల్లీకొడుకులు గంట వ్యవధిలో చనిపోవడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.