ఇండియా కరోనా యమ డేంజర్!
posted on Apr 17, 2021 @ 10:09AM
దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మరణ మృదంగం మోగిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే ఇండియాలో 2 లక్షల 34 వేల కేసులు నమోదయ్యాయి. రికార్డ్ స్థాయిలో 13వందల మరణాలు సంభంవించాయి. తాజాగా ఇండియాలో విస్తరిస్తున్న కరోనా గురించి మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఇండియాలో కరోనా వైరస్ డబుల్ మ్యూటెంట్ చెంది మరింత ప్రమాదకరంగా మారిందని బ్రిటన్ వెల్లడించింది. ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆయనకు సూచించడం కలకలం రేపింది.
ఇండియాలో పుట్టిన కొత్త వేరియంట్ బ్రిటన్ కు కూడా వ్యాపించిందని అక్కడి ఉన్నతాధికారులు తెలిపారు. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ ను తొలిసారిగా ఇండియాలోనే కనుక్కున్నారని పేర్కొన్న అధికారులు, దీనికి బీ1617 అని నామకరణం చేశారు. ఈ డబుల్ మ్యూటెంట్ కొత్త వైరస్ విషయంలో ఎపిడెమాలజిక్, ఇమ్యునోలాజికల్, పాథోజెనిక్ విభాగాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఏప్రిల్ 14 నుంచి ఇంగ్లండ్ లో 77 భారత్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయని, స్కాట్లాండ్ లో సైతం కనిపించిందని అధికారులు వెల్లడించారు."ఈ వేరియంట్ తొలిసారిగా ఇండియాలోనే కనిపించింది. 484క్యూ, ఎల్452ఆర్, పీ681ఆర్ తదితర వేరియంట్ల కలయికగా ఇది ఏర్పడింది. ఈ వైరస్ నియంత్రణకై కాంటాక్ట్ ట్రేసింగ్ అత్యంత ముఖ్యం. ఈ విషయంలో అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో పరిస్థితిని సమీక్షిస్తున్నాం" అని పీహెచ్ఈ పేర్కొంది.
ఇందులో ఓ వేరియంట్ గత సంవత్సరం కాలిఫోర్నియాలో వెలుగులోకి రాగా, మరో వేరియంట్ సౌతాఫ్రికా, బ్రెజిల్ లో కనిపించింది. ఇప్పుడు ఈ రెండూ కలిసి ఇండియాలో సమ్మిళితమై ప్రపంచానికి వ్యాపిస్తున్నాయని అన్నారు. ఇండియాలో ఇప్పుడు రోజుకు మిగతా దేశాల కన్నా అత్యధికంగా 2 లక్షలకు పైగా కేసులు ప్రతి రోజూ నమోదవుతున్నాయని గుర్తు చేసిన పీహెచ్ఈ, ఈ వైరస్ వ్యాప్తిని తక్షణం అరికట్టాల్సి వుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు చండీగఢ్‌లో యూకే రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ నమోదైన కేసుల్లో 60 శాతం నమూనాలను ఢిల్లీలోని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రానికి పంపించి పరీక్షించగా వాటిలో 70 శాతం శాంపిళ్లలో యూకే స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.మరో 20 శాతం నమూనాల్లో 681 హెచ్ మ్యూటెంట్ ఉన్నట్టు గుర్తించారు. ఒక్క నమూనాలో మాత్రం డబుల్ మ్యూటెంట్‌ను గుర్తించారు. యూకే స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.