కరోనా కట్టడికి ఆర్మీ కావాలంటున్న సీఎం
posted on Apr 19, 2021 @ 11:41AM
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనా రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. చికిత్స అందక బాధితులు నరకయాతన పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా ఉన్నా... జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మాస్కులు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. భౌతికదూరం మాటే మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ప్రాణాంతక వైరస్ కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ ప్రజల్లో భయం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, దీనిని అదుపు చేసేందుకు మిలటరీ బలగాలు అవసరమని ఝార్కండ్ ముఖ్యమంత్రి అన్నారు. మిలటరీని పంపాలని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ప్రజలను చూసి తాను షాకయ్యానని సోరెన్ తెలిపారు. మాస్కులు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండానే ప్రజలు తిరుగుతున్నారని, వాళ్లకు కరోనా అంటే అస్సలు భయం లేదని అన్నారు. ఇలాంటి వారందరికీ సమాధానం ఇచ్చేందుకు కేంద్రానికి లేఖ రాయబోతున్నట్టు చెప్పారు.