ఐసీయూలో మోత్కుపల్లి!
posted on Apr 18, 2021 @ 11:28AM
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మృత్యువుతో పోరాడుతున్నారు. కరోనాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మోత్కుపల్లి నరసింహులుకు కరోనా సోకడంతో మూడు రోజుల క్రితం ఆయనను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. అయితే శనివారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
దివంగత ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన మోత్కుపల్లి.. టీడీపీలో కీలక పదవులు నిర్వహించారు. మంత్రిగా కూడా పని చేశారు. ఎన్టీఆర్ , చంద్రబాబు వివాదంలో ఎన్టీఆర్ సైడ్ ఉన్నారు మోత్కుపల్లి. ఎన్టీఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి టీడీపీకి వచ్చారు నర్సింహులు. అయితే చంద్రబాబుతో విభేదాలు రావడంతో మళ్లీ బయటికి వచ్చారు. ఆలేరు నుంచి ఐదు సార్లు, తుంగతుర్తి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి.. గత ఏడాది బీజేపీలో చేరారు. మోత్కుపల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.